Monday, October 31, 2005

1_3_88 చంపకమాల విజయ్ - విక్రమాదిత్య

చంపకమాల

నిరుపమధర్మమార్గపరినిష్ఠితు లై మహి యెల్లఁ గాచుచుం
బరఁగిన తొంటి పూరు కురు పాండు మహీశుల పేర్మిఁ జేసి భూ
భరవహనక్షమం బగుచుఁ బౌరవ కౌరవ పాండవాన్వయం
బురుగుణసంపదం బెరిఁగి యొప్పె సమస్త జగత్ప్రసిద్ధమై.

(పూరు, కురు, పాండురాజుల గొప్పతనం వల్ల పౌరవ, కౌరవ, పాండవ వంశాలు ప్రసిద్ధమయ్యాయి.)

-:కౌరవ వంశ వివరణము:-

1_3_87 వచనము వసు - విజయ్

వచనము

అని యడిగిన జనమేజయునకు వైశంపాయనుం డిట్లనియె.

(వైశంపాయనుడు ఇలా అన్నాడు.)

1_3_86 సీసము + ఆటవెలది వసు - విజయ్

సీసము

అభ్యస్తవేదవేదాంగులు విధిదత్త
        దక్షిణాప్రీణితధరణిదేవు
లనవరతాశ్వమేధావభృథస్నాన
        పూతమూర్తులు కృతపుణ్యు లహిత
వర్గజయుల్ ప్రాప్తవర్గచతుష్టయుల్
        సత్త్వాదిసద్గుణజన్మనిలయు
లా భరతాది మహామహీపాలకు
        లిద్ధయశోర్థు లెందేనిఁ బుట్టి

ఆటవెలది

రట్టి కౌరవాన్వయంబుఁ బాండవనృప
రత్నములకు వారిరాశియైన
దాని వినఁగ వలతుఁ దద్దయుఁ బ్రీతితో
విప్రముఖ్య నాకు విస్తరింపు.

("భరతుడివంటి గొప్పవారు పుట్టిన కౌరవవంశం పాండవులు అనే రత్నాలకు సముద్రం వంటిది. అలాంటి కౌరవవంశం గురించి వివరంగా చెప్పండి, వినాలని ఉంది")

1_3_85 వచనము వసు - విజయ్

వచనము

అనిన విని జనమేజయుండు వైశంపాయనున కిట్లనియె.

(జనమేజయుడు వైశంపాయనుడితో ఇలా అన్నాడు.)

1_3_84 సీసము + ఆటవెలది విజయ్ - విక్రమాదిత్య

సీసము

యమునంశమునఁ బుట్టె నధిపతి ధర్మజుం
        డనిలాంశమునఁ బుట్టె ననిలజుండు
శక్రాంశమున ధనంజయుఁ డుదయించె నా
        శ్వినుల యంశముల నూర్జితులు నకుల
సహదేవు లనవద్యచరితులు పుట్టిరి
        శ్రీమూర్తి యై యాజ్ఞసేని పుట్టె
నగ్నియంశమున జితారి ధృష్టద్యుమ్నుఁ
        డనఁ బుట్టె ద్రుపదరాజాన్వయమున

ఆటవెలది

ననఘ యిది సురాసురాంశావతారకీ
ర్తనము దీని వినినఁ దవిలి భక్తిఁ
జదివినను సమస్త జనులకు నఖిలదే
వాసురాదు లిత్తు రభిమతములు.

(యముడి అంశతో ధర్మజుడు, వాయుదేవుడి అంశతో భీముడు, ఇంద్రుడి అంశతో అర్జునుడు, అశ్వినుల అంశతో నకులసహదేవులు పుట్టారు. లక్ష్మి అంశతో ద్రౌపది, అగ్ని అంశతో ధృష్టద్యుమ్నుడు ద్రుపదుడికి జన్మించారు. ఓ రాజా! ఇది దేవాసురుల అంశలతో పుట్టినవారి కీర్తనం, ఇది విన్నవారికి మంచి కలుగుతుంది.)

Sunday, October 30, 2005

1_3_83 కందము విజయ్ - విక్రమాదిత్య

కందము

ప్రియ మొనరఁగ సిద్ధియు బు
ద్ధియు నను దేవతలు వసుమతిని గుంతియు మా
ద్రియు నై పుట్టిరి పాండు
ప్రియపత్నులు నిఖిలజగదభీష్టచరిత్రల్.

(సిద్ధి, బుద్ధి అనే దేవతలు కుంతిగా, మాద్రిగా పుట్టి పాండురాజుకు భార్యలయ్యారు.)

1_3_82 కందము వసు - విజయ్

కందము

మాండవ్యుం డను మునివరు
చండతరక్రోధజనితశాపంబున ధ
ర్ముం డఖిలధర్మతత్త్వ వి
దుం డగు విదురుఁ డనఁ బేర్మితో నుదయించెన్.

(మాండవ్యముని శాపం వల్ల యముడు విదురుడిగా జన్మించాడు.)

1_3_81 కందము వసు - విజయ్

కందము

మరుతులయంశంబునఁ బు
ట్టిరి మువ్వురు వివిధరణపటిష్ఠబలులు సు
స్థిరయశులు ద్రుపదసాత్యకి
విరాటభూపతులు భువనవిశ్రుతచరితుల్.

(మరుత్తుల అంశలతో ద్రుపదుడు, సాత్యకి, విరాటుడు జన్మించారు.)

1_3_80 వచనము వసు - విజయ్

వచనము

మఱియు నేకాదశరుద్రులయంశంబునఁ గృపుఁడు పుట్టె సూర్యునంశంబునఁ గర్ణుండు పుట్టె ద్వాపరాంశంబున శకుని పుట్టె నరిష్టాపుత్త్రుండయిన హంసుడను గంధర్వ విభుండు ధృతరాష్ట్రుండయి పుట్టె మతియను వేల్పు గాంధారియై పుట్టె నయ్యిద్దఱకుం గలియశంబున దుర్యోధనుండు పుట్టెఁ బౌలస్త్యభ్రాతృవర్గంబు దుశ్శాసనాది దుర్యోధనానుజశతంబై పుట్టె హిరణ్యకశిపుండు శిశుపాలుండై పుట్టె సంహ్లాదుండు శల్యుండై పుట్టె ననుహ్లాదుండు ధృష్టకేతుండై పుట్టె శిబి యనువాఁడు ద్రుమసేనుండై పుట్టె బాష్కళుండు భగదత్తుఁడై పుట్టె విప్రచిత్తి యను దానవుండు జరాసంధుండై పుట్టె నయశ్శిరుండును నశ్వశీర్షుండుసు నయశ్శంకుండును గగనమూర్ధుండును వేగవంతుండును ననువా రేవురు దానవులు గేకయరాజు లయి పుట్టిరి కేతుమంతుం డమితౌజుండై పుట్టె స్వర్భానుండుగ్రసేనుండై పుట్టె జంభుండు విశోకుండై పుట్టె నశ్వపతి కృతవర్మయై పుట్టె వృషపర్వుండు దీర్ఘప్రజ్ఞుండై పుట్టె నజరుండు మల్లుండై పుట్టె నశ్వగ్రీవుండు రోచమానుండై పుట్టె సూక్ష్ముండు బృహద్రథుండై పుట్టెఁ దుహుండుఁ డనువాఁడు సేనాబిందుండై పుట్టె నేకచక్రుండు ప్రతివింధ్యుండై పుట్టె విరూపాక్షుండు చిత్రవర్మయై పుట్టె హరుండును నహరుఁడును సుబాహుబాహ్లికులై పుట్టిరి చంద్రవ్ర్రక్తుండు ముంజకేశుండై పుట్టె నికుంభుండు దేవాపియై పుట్టె శరభుండు సోమదత్తుండై పుట్టెఁ జంద్రుండు చంద్రవర్మయై పుట్టె నర్కుండు ఋషికుండై పుట్టె మయూరుండు విశ్వుండై పుట్టె సుపర్ణుండు క్రోధకీర్తియై పుట్టె రాహువు క్రోధుండై పుట్టెఁ జంద్రహంత శునకుండై పుట్టె నశ్వుండనువాఁ డశోకుండై పుట్టె భద్రహస్తుండు నందుండై పుట్టె దీర్ఘజిహ్వుండు గాశిరాజై పుట్టెఁ జంద్రవినాశనుండు జానకియై పుట్టె బలీనండు పౌండ్రమత్స్యుండై పుట్టె వృత్రుండు మణిమంతుండై పుట్టె గాలాపుత్త్రులెనమండ్రు క్రమంబున జయత్సేనాపరాజిత నిషాదాధిపతి శ్రేణిమన్మహౌజోభీరు సముద్రసేన బృహత్తులై పుట్టిరి క్రోధవశగణంబు వలన మద్రక కర్ణవేష్ట సిద్దార్థ కీటక సువీర సుబాహు మహావీర బాహ్లిక క్రథ విచిత్రసురథశ్రీమన్నీల చీరవాసో భూమిపాల దంతవక్త్ర రుక్మి జనమేజయాషాఢ వాయువేగ భూరితేజ ఏకలవ్య సుమిత్ర వాటధాన గోముఖ కారూషక క్షేమధూర్తి శ్రుతాయు రుద్వహ బృహత్సేన క్షేమాగ్రతీర్థ కుహర మతిమదీశ్వరాదులనేకులు పుట్టిరి కాలనేమి కంసుండై పుట్టె స్త్రీపుంసరూపధరుం డైన గుహ్యకుండు శిఖండియై పుట్టె మరుద్గణాంశంబునఁ బాండురాజు పుట్టె.

(పైన చెప్పిన విధంగా చాలామంది జన్మించారు.)

1_3_79 కందము విజయ్ - విక్రమాదిత్య

కందము

అలఘుఁడు కామక్రోధా
దుల యేకత్వమునఁ బుట్టె ద్రోణునకు మహా
బలుఁ డశ్వత్థామ రిపు
ప్రళయాంతకుఁ డస్త్రశస్త్రపరిణతుఁ డగుచున్.

(ద్రోణుడికి మహాబలుడైన అశ్వత్థామ పుట్టాడు.)

1_3_78 కందము విజయ్ - విక్రమాదిత్య

కందము

అనఘుఁడు సురగురునంశం
బునను భరద్వాజుకలశమునఁ బుట్టె శరా
సనవిద్యాచార్యుఁడు భూ
వినుతుఁడు ద్రోణుండు నిఖిలవేదవిదుం డై.

(బృహస్పతి అంశతో ద్రోణుడు పుట్టాడు.)

1_3_77 కందము విజయ్ - విక్రమాదిత్య

కందము

ముదమునఁ బ్రభాసుఁ డను నెని
మిది యగు వసునంశమునను మేదిని భీష్ముం
డుదయించె సర్వవిద్యా
విదుఁ డపజిత పరశురామ వీర్యుఁడు బలిమిన్.

(ప్రభాసుడనే ఎనిమిదో వసువు అంశతో భీష్ముడు జన్మించాడు.)

1_3_76 వచనము విజయ్ - విక్రమాదిత్య

వచనము

మఱియు లక్ష్మియంశంబున రుక్మిణి యుదయించె సనత్కుమారు నంశంబునఁ బ్రద్యుమ్నుండు పుట్టె నప్సరసల యంశంబులఁ గృష్ణునిషోడశసహస్రాంతఃపురవనితలు పుట్టి రయ్యయి వేల్పుల యంశంబులు యదువృష్ణి భోజాంధక వంశంబుల వీరు లనేకులు పుట్టిరి మఱియు.

(లక్ష్మి రుక్మిణిగా, సనత్కుమారుడు ప్రద్యుమ్నుడిగా, ఇతరుల అంశలతో శ్రీకృష్ణుడి పదహారువేలమంది స్త్రీలు, యాదవవీరులు జన్మించారు.)

1_3_75 కందము విజయ్ - విక్రమాదిత్య

కందము

శ్రీవెలుఁగ రోహిణికి వసు
దేవున కుదయించె విష్ణుదేవాంశమునన్
భూవంద్యుఁ డనంతుఁడు బల
దేవుండు ప్రలంబ ముఖ్యదితిజాంతకుఁ డై.

(ఆదిశేషుడు బలదేవుడనే పేరుతో రోహిణీవసుదేవులకు జన్మించాడు.)

1_3_74 కందము విజయ్ - విక్రమాదిత్య

కందము

యాదవవంశంబున జగ
దాదిజుఁ డగు విష్ణుదేవునంశంబున ను
త్పాదిల్లెఁ గృష్ణుఁ డపగత
ఖేదుఁడు వసుదేవ దేవకీదేవులకున్.

(విష్ణువు అంశతో శ్రీకృష్ణుడు యాదవవంశంలో దేవకీవసుదేవులకు జన్మించాడు.)

1_3_73 వచనము విజయ్ - విక్రమాదిత్య

వచనము

మఱియు మర్త్యలోకంబునందు దేవదైత్యదానవుల యంశావతారంబుల వివరించెద వినుము.

(దేవదైత్యదానవుల అంశలతో పుట్టినవారి గురించి వివరిస్తాను వినండి.)

-:దేవదానవాద్యంశములచే భూమియందుఁ బుట్టిన వారి క్రమము:-

1_3_72 చంపకమాల విజయ్ - విక్రమాదిత్య

చంపకమాల

దివిజ మునీంద్ర దానవదితి ప్రభవాదిసమస్తభూతసం
భవముఁ గృతావధాను లయి భక్తిమెయిన్ వినుచున్న పుణ్యమా
నవులకు నిక్కువం బగు మనఃప్రియ నిత్యసుఖంబులుం జిరా
యువు బహుపుత్త్రలాభవిభవోన్నతియున్ దురితప్రశాంతియున్.

(దేవదానవులు, మునులు మొదలైనవారి పుట్టుకను గురించి విన్నవారికి మంచి జరుగుతుంది.)

1_3_71 వచనము విజయ్ - విక్రమాదిత్య

వచనము

మఱియు బ్రహ్మకు ధాతయు విధాతయు ననంగా నిద్దఱు మనుసహాయులై పుట్టిరి వారితోడను లక్ష్మి పుట్టె లక్ష్మికి మానసపుత్త్రు లనేకులు పుట్టిరి వరుణునకు జ్యేష్ఠకు బలుండును సురయను కూఁతురునుం బుట్టిరి సురయం దధర్ముండు పుట్టె నా యధర్మునకు నిరృతికి భయ మహాభయ మృత్యువు లనఁగా మువ్వురు పుట్టిరి మఱియుఁ దామ్రకుఁ గాకియు శ్యేనియు భాసియు ధృతరాష్ట్రియు శుకియు నన నేవురుకన్యలు పుట్టిరి యందుఁ గాకి యనుదానికి నులూకంబులు పుట్టె శ్యేని యను దానికి శ్యేనంబులు పుట్టె భాసి యనుదానికి భాసగృధ్రాదులు పుట్టె ధృతరాష్ట్రి యనుదానికి హంసచక్రవాకంబులు పుట్టె శుకియను దానికి శుకంబులు పుట్టె మఱియుం గ్రోధునకు మృగియు మృగమందయు హరియు భద్రమనసయు మాతంగియు శార్దూలియు శ్వేతయు సురభియు సురసయు ననఁ దొమ్మండ్రు పుట్టి రందు మృగి యనుదానికి మృగంబులు పుట్టె మృగమంద యనుదానికి ఋక్ష చమర సృమరాదులు పుట్టె హరి యనుదానికి వానరగణంబులు పుట్టె భద్రమనస యనుదానికి నైరావణంబు పుట్టె నైరావణంబునకు దేవనాగంబులు పుట్టె మాతంగి యనుదానికి గజంబులు పుట్టె శార్దూలి యనుదానికి సింహవ్యాఘ్రంబులు పుట్టె శ్వేత యనుదానికి దిగ్గజంబులు పుట్టె సురభి యనుదానికి రోహిణియు గంధర్వియు ననలయు ననం బుట్టి రందు రోహిణికిఁ బశుగణంబులు పుట్టె గంధర్వి యనుదానికి హయంబులు పుట్టె ననలకు గిరి వృక్షలతా గుల్మంబులు పుట్టె సురసకు సర్పంబులు పుట్టె నిది సకలభూతసంభవప్రకారంబు.

(ఇంకొందరికి జంతువులు, కొండలు, చెట్లు మొదలైనవి పుట్టాయి. సకలజీవాలూ ఇలా పుట్టాయి.)

1_3_70 సీసము + ఆటవెలది వోలం - శ్రీహర్ష

సీసము

విగతాఘుఁ డైన యాభృగునకుఁ బుత్త్రుఁ డై
        చ్యవనుండు పుట్టె భార్గవవరుండు
జనవంద్యుఁ డతనికి మనుకన్యకకుఁ బుట్టె
        నూరుల నౌర్వుండు భూరికీర్తి
యతనికి నూర్వురు సుతులు ఋచీకాదు
        లుదయించి రఖిల భూవిదిత తేజు
లందు ఋచీకున కొందంగ జమదగ్ని
        యను ముని పుట్టె నాతనికిఁ బుట్టి

ఆటవెలది

రలఘుమతులు సుతులు నలువురు వారిలోఁ
బరశురాముఁ డాదిపురుషమూర్తి
దండితాహితుండు గొండుక యయ్యును
దద్ద గుణములందుఁ బెద్ద యయ్యె.

(భృగువు వంశంలో జమదగ్ని, అతడికి పరశురాముడు జన్మించారు.)

1_3_69 వచనము వోలం - శ్రీహర్ష

వచనము

మఱియు స్థాణునకు మానసపుత్త్రులైన మృగవ్యాధ శర్వ నిరృత్యజైక పాద హిర్బుధ్న్య పినాకి దహనేశ్వర కపాలి స్థాణు భవు లనంగా నేకాదశ రుద్రులు పుట్టిరి మఱి బ్రహ్మదక్షిణ స్తనంబున ధర్ముండను మనువు పుట్టె వానికి శమ కామ హర్షు లనంగా మువ్వురు పుట్టిరి యా మువ్వురకుఁ గ్రమంబునఁ బ్రాప్తి రతి నందు లనంగా మువ్వురు భార్య లైరి సవితృనకు బడబా రూపధారిణి యైన త్వాష్ట్రికి నశ్వినులు పుట్టిరి బ్రహ్మహృదయంబున భృగుండు పుట్టె వానికిఁ గవి పుట్టె వానికి శుక్రుండు పుట్టి యసురుల కాచార్యుండయ్యె వానికిఁ జండామర్క త్వష్టృ ధరాత్త్రు లనంగా నలువురు గొడుకులు పుట్టిరి వా రసురులకు యాజకు లైరి మఱియును.

(బ్రహ్మ శరీరభాగాలనుండి పుట్టినవారిలో హృదయంనుండి పుట్టిన భృగుడికి కవి, ఆ కవికి శుక్రుడు జన్మించారు. శుక్రుడు రాక్షసులకు గురువు అయ్యాడు.)

1_3_68 కందము వోలం - శ్రీహర్ష

కందము

ఆ విశ్వకర్మ నిర్మిత
దేవవిమానుండు నిఖిలదివ్యాభరణ
శ్రీ విరచన పరితోషిత
దేవుఁడు శిల్ప ప్రజాపతియు నై నెగడెన్.

(విశ్వకర్మ దేవతలకు విమానాలను నిర్మించినవాడు. అతడు శిల్పప్రజాపతిగా ప్రసిద్ధికెక్కాడు.)

1_3_67 వచనము వోలం - శ్రీహర్ష

వచనము

మఱియుఁ బులస్త్యుం డను మానసపుత్త్రునకు ననేక రాక్షసులు పుట్టిరి పులహుం డను మానస పుత్త్రునకుఁ గిన్నర కింపురుషాదులు పుట్టిరి క్రతువను మానస పుత్త్రునకు సత్యవ్రత పరాయణులైన పతంగ సహచరులు పుట్టిరి పైతామహుండైన దేవుండను మునికిఁ బ్రజాపతి పుట్టె వానికి ధూమ్రా బ్రహ్మవిద్యా మనస్వినీ రతా శ్వసా శాండిలీ ప్రభాత లనంగా నేడ్వురు భార్యలై రందు ధూమ్రకు ధరుండును బ్రహ్మవిద్యకు ధ్రువుండును మనస్వినికి సోముండును రతకు నహుండును శ్వసకు ననిలుండును శాండిలికి నగ్నియుఁ బ్రభాతకుఁ బ్రత్యూష ప్రభాసు లనంగా నెనమండ్రు వసువులు బుట్టి రందు ధరుండను వసువునకు ద్రవిణుండును హుతహవ్యవహుండునుం బుట్టిరి ధ్రువుండను వసువునకుఁ గాలుండు పుట్టె సోముండను వసువునకు మనోహర యనుదానికి వర్చసుండును శిబిరుండును బ్రాణుండును రమణుండును బృథయను కూఁతురునుం బుట్టిరి పృథకుఁ బదుండ్రు గంధర్వపతులు పుట్టిరి యహుండను వసువునకు జ్యోతి పుట్టె ననిలుండను వసువునకు శివ యను దానికి మనోజవుండును నవిజ్ఞాతగతియునుం బుట్టిరి యగ్ని యను వసువునకుఁ గుమారుండు పుట్టెఁ బ్రత్యూషుం డను వసువునకు ఋషి యైన దేవలుండు పుట్టెఁ బ్రభాసుం డను వసువునకు బృహస్పతి చెలియ లైన యోగసిద్ధికి విశ్వకర్మ పుట్టె.

(పులస్త్యుడనే మానసపుత్రుడికి రాక్షసులు జన్మించారు. మిగిలినవారికి కిన్నరులు మొదలైనవారు జన్మించారు. ప్రభాసుడనే వసువుకు బృహస్పతి సోదరి అయిన యోగసిద్ధి భార్య. వారికి విశ్వకర్మ జన్మించాడు.)

1_3_66 సీసము + ఆటవెలది వోలం - శ్రీహర్ష

సీసము

మఱి యంగిరసుఁ డను మానసపుత్త్రున
        కయ్యుతథ్యుండు బృహస్పతియును
సంవర్తుఁడును గుణాశ్రయయోగసిద్ధి య
        న్కూఁతురు బుట్టి రక్కొడుకులందు
విభుఁడు బృహస్పతి వేల్పుల కాచార్యుఁ
        డై లోకపూజితుఁడై వెలింగె
మానుగా నత్రి యన్మానసపుత్త్రున
        కుద్భవించిరి ధర్మయుతచరిత్రు

ఆటవెలది

లఖిలవేదవేదు లాద్యు లనేకులు
దీప్త రవిసహస్రతేజు లనఘ
లధికతరతపో మహత్త్వ సంభృతవిశ్వ
భరులు సత్యపరులు పరమమునులు.

(అంగీరసుడనే మానసపుత్రుడికి ఉతథ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు, యోగసిద్ధి అనే కూతురు జన్మించారు. వారిలో బృహస్పతి దేవగురువు అయ్యాడు. అత్రి అనే మానసపుత్రుడికి చాలా మంది మునులు జన్మించారు.)

1_3_65 వచనము వోలం - శ్రీహర్ష

వచనము

మఱియు సింహిక యను దానికి రాహువుపుట్టె ముని యనుదానికి భీమసేనోగ్రసేనాదు లయిన గంధర్వులు పదార్వురు పుట్టిరి కపిల యనుదానికి నమృతంబును గోగణంబును బ్రాహ్మణులును ఘృతాచీ మేనకాదు లయిన యప్సరసలును బుట్టిరి వినత యనుదానికి ననూరుండును గరుడండును బుట్టి రం దనూరునకు శ్యేని యనుదానికి సంపాతిజటాయువులు పుట్టిరి క్రోధ యనుదానికిఁ గ్రోధవశగణంబు పుట్టెఁ బ్రాధ యనుదానికి సిద్ధాదులు పుట్టిరి క్రూర యనుదానికి సుచంద్ర చంద్రహంత్రాదులు పుట్టిరి కద్రువ యనుదానికి శేషవాసుకి పురోగ మానేక భుజంగముఖ్యులు పుట్టిరి.

(సింహికకు రాహువు, మునికి పదహారుమంది గంధర్వులు, కపిలకు అమృతం, గోవులు, బ్రాహ్మణులు, అప్సరసలు జన్మించారు. వినతకు అనూరుడు, గరుడుడు పుట్టారు. క్రోధకు క్రోధవశగణం, ప్రాధకు సిద్ధాదులు, క్రూరకు సుచంద్రాదులు జన్మించారు. కద్రువకు శేషుడు, వాసుకి మొదలైనవారు పుట్టారు.)

1_3_64 ఆటవెలది వోలం - శ్రీహర్ష

ఆటవెలది

అజితశక్తియుతుల నాయువ యనుదాని
కజరు లధిక వీరు లతుల భూరి
భుజులు శక్రరిపులు పుట్టిరి నలువురు
విక్షర బలవీర వృత్రు లనఁగ.

(అనాయువు అనే ఆమెకు ఇంద్రుడి శత్రువులైన నలుగురు కుమారులు జన్మించారు.)

1_3_63 వచనము వోలం - శ్రీహర్ష

వచనము

ఆ ప్రహ్లాద సంహ్లా దానుహ్లాద శిబి బాష్కళుల యందుఁ బ్రహ్లాదునకు విరోచన కుంభ నికుంభ లనంగా మువ్వురు పుట్టి రందు విరోచనునకు బలి పుట్టె బలికి బాణాసురుండు పుట్టె దను వను దానికి విప్రచిత్తి శంబర నముచి పులోమాసి లోమకేశి దుర్జయాదు లయిన దానవులు నలువండ్రు పుట్టిరి వారల పుత్త్రపౌత్త్రవర్గం బసంఖ్యాతంబై ప్రవర్తిల్లెఁ గాల యను దానికి వినాశన క్రోధాదులెనమండ్రు పుట్టిరి.

(ప్రహ్లాదుడికి పుట్టిన ముగ్గురు కుమారులలో ఒకడైన విరోచనుడికి బలి, బలికి బాణాసురుడు జన్మించారు. దనువు అనే కుమార్తెకు విప్రచిత్తి మొదలైన నలభైమంది దానవులు పుట్టారు. వారి సంతానం లెక్కించటానికి శక్యం కానిది. కాల అనే కుమార్తెకు ఎనిమిదిమంది పుట్టారు.)

1_3_62 కందము వోలం - శ్రీహర్ష

కందము

దితి యనుదానికి నప్రతి
హతబలుఁడు హిరణ్యకశిపుఁ డనఁ బుట్టె సుతుం
డతనికి నేవురు పుట్టిరి
ప్రతాపగుణయుతులు సుతులు ప్రహ్లాదాదుల్.

(ఇంకొక కుమార్తె అయిన దితికి హిరణ్యకశిపుడు పుట్టాడు. అతడికి ప్రహ్లాదుడు మొదలుగా అయిదుగురు కుమారులు పుట్టారు.)

1_3_61 వచనము వోలం - శ్రీహర్ష

వచనము

పదంపడి యేఁబండ్రు గూఁతులుం బుట్టిన వారల నెల్ల దక్షుం డపుత్త్రకుండు గావునఁ బుత్త్రీకరణంబు సేసి యందుఁ గీర్తి లక్ష్మీ ధృతి మేధా పుష్టి శ్రద్ధా క్రియా బుద్ధి లజ్జా మతులను వనితలఁ బదుండ్రను ధర్ముండను మనువున కిచ్చె నశ్విన్యాదులైన యిరువదేడ్వురను జంద్రున కిచ్చె నదితి దితి దను కాలానాయు స్సింహికా ముని కపిలా వినతా క్రోధా ప్రాధా క్రూరా కద్రువలను పదుమువ్వురను గశ్యపున కిచ్చె నం దదితి యనుదానికి ధాతృ మిత్రార్యమశక్ర వరుణాంశు భగవివస్వత్పూష సవితృ త్వష్టృ విష్ణు లనంగా ద్వాదశాదిత్యులు పుట్టిరి మఱియును.

(దక్షుడికి యాభైమంది కుమార్తెలు పుట్టారు. వారిలో పదిమందిని ధర్ముడికి, ఇరవై ఏడుమందిని చంద్రుడికి ఇచ్చాడు. అదితి, దితి, దనువు, కాల, అనాయువు, సింహిక, ముని, కపిల, వినత, క్రోధ, ప్రాధ, క్రూర, కద్రువ అనే పదమూడు మందిని కశ్యపుడికి ఇచ్చాడు. వారిలో అదితికి ద్వాదశాదిత్యులు జన్మించారు.)

Saturday, October 29, 2005

1_3_60 కందము వోలం - శ్రీహర్ష

కందము

సుతు లనఘులు వేవురు దమ
యుతులై యుదయించి సాంఖ్యయోగాభ్యాసో
న్నతిఁ జేసి ముక్తులై భూ
రితేజు లందఱును నూర్ధ్వరేతసు లైనన్.

(వేయిమంది పుత్రులు జన్మించి ఋషులయ్యారు.)

1_3_59 వచనము వోలం - శ్రీహర్ష

వచనము

అనిన విని జనమేజయునకు వైశంపాయనుం డిట్లని చెప్పెఁ దొల్లి సకలజగ దుత్పత్తినిమిత్తభూతుం డైన బ్రహ్మకు మానసపుత్త్రు లైన మరీచియు నంగీరసుండును నత్రియుఁ బులస్త్యుండును బులహుండును గ్రతువును నను నార్వురు పుట్టి రందు మరీచికిఁ గశ్యప ప్రజాపతి పుట్టెఁ గశ్యపు వలనఁ జరాచర భూతరాశియెల్ల నుద్భవిల్లె నెట్లనిన బ్రహ్మదక్షిణాంగుష్ఠంబున దక్షుండును వామాంగుష్ఠంబున ధరణియను స్త్రీయునుం బుట్టిన యయ్యిరువురకును.

(అప్పుడు వైశంపాయనుడు ఇలా చెప్పాడు: బ్రహ్మదేవుడి ఆరుగురు మానసపుత్రులలో ఒకడైన మరీచికి కశ్యపప్రజాపతి పుట్టాడు. కశ్యపుడి నుండి చరాచరజీవాలన్నీ ఉద్భవించాయి. ఎలాగంటే - బ్రహ్మ కుడిచేతి బొటనవేలు నుండి దక్షప్రజాపతి, ఎడమచేతి బొటనవేలినుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారిద్దరికీ.)

-: దేవదానవ ప్రముఖుల యుత్పత్తి క్రమము :-

1_3_58 కందము వోలం - శ్రీహర్ష

కందము

ఆదిత్య దైత్యదానవు
లాదిగఁ గల భూతరాశి దగు సంభవమున్
మేదినిఁ దదంశముల మ
ర్త్యోదయములు నాకుఁ జెప్పు మొగి నేర్పడఁగన్.

(దేవతలు, దైత్యులు, దానవులు మొదలైనవారి పుట్టుక గురించీ, వారు మనుషులుగా జన్మించటం గురించీ నాకు చెప్పండి.)

1_3_57 వచనము వోలం - శ్రీహర్ష

వచనము

అనిన విని జనమేజయుండు వైశంపాయనున కిట్లనియె.

(ఇది విని జనమేజయుడు వైశంపాయనుడితో ఇలా అన్నాడు.)

1_3_56 చంపకమాల వోలం - శ్రీహర్ష

చంపకమాల

అతులబలాఢ్యు లైన యమరాంశసముద్భవు లెల్ల బాండుభూ
పతిసుతపక్ష మై సురవిపక్షగణాంశజు లెల్ల దుర్మదో
ద్ధతకురురాజపక్ష మయి ధారుణిభారము వాయ ఘోరభా
రతరణభూము నీల్గిరి పరస్పర యుద్ధము సేసి వీరులై.

(దేవతల అంశ గలవారు పాండవుల పక్షాన, రాక్షసుల అంశ గలవారు దుర్యోధనుడి పక్షాన భారతరణంలో పోరాడి మరణించి భూభారం తగ్గించారు.)

1_3_55 కందము వోలం - శ్రీహర్ష

కందము

దితిసుత దానవ యక్ష
ప్రతతుల యంశములఁ బుట్టి ప్రజలకు విహితా
హితు లగుచుండి రనేకులు
జితకాశులు ధరణిపతులు శిశుపాలాదుల్.

(దేవదానవుల అంశలతో ప్రజలకు మిత్రులూ, శత్రువులూ అయిన రాజులు చాలామంది పుట్టారు.)

1_3_54 కందము వోలం - శ్రీహర్ష

కందము

వనజాసను ననుమతమున
వనరుహనాభుండు వాసవ ప్రముఖసుప
ర్వనికాయాంశంబులతోఁ
దనరఁగఁ బుట్టించె నుర్విఁ దనయంశమ్మున్.

(బ్రహ్మ సమ్మతితో విష్ణువు ఇంద్రాదుల అంశలతో, తన అంశ అతిశయించేలా భూమిపై జన్మింపజేశాడు.)

1_3_53 కందము వోలం - శ్రీహర్ష

కందము

భూరి ప్రజానిరంతర
భారము దాల్చు టిది కరము భారము దయతో
మీ రీభారమునకుఁ బ్రతి
కారము గావించి నన్నుఁ గావుం డనినన్.

(ఇంతమంది ప్రజలను మోయడం నాకు భారంగా ఉంది. దీనికి చికిత్స చేసి నన్ను కాపాడండి అని భూదేవి పలికింది.)

1_3_52 వచనము వోలం - శ్రీహర్ష

వచనము

ఇట్లు బ్రాహ్మణవీర్య ప్రభవు లయిన క్షత్త్రియులు ధర్మమార్గంబునం బ్రజాభిరక్షణంబు సేయుటంజేసి వర్ణాశ్రమ ధర్మస్థితులు దప్పక ప్రవర్తిల్లుటయు బ్రహ్మక్షత్త్రంబుల కాయుర్వర్ధనంబును ననవరతయాగతర్పిత పర్జన్య ప్రసాదంబునం గోరిన యప్పుడు వానలు గురియుచు సకలసస్యసమృద్ధియుఁ బ్రజావృద్ధియు నైన భూదేవి ప్రజాభారపీడిత యై సురాసురమునిగణపరివృతులై యున్న హరిహరహిరణ్యగర్భులకడకుం జని యిట్లనియె.

(వారి పాలనలో ప్రజల ఆయుర్దాయాలు పెరిగి, ప్రజావృద్ధి అవగా భూదేవి ఆ భారాన్ని సహించలేక త్రిమూర్తుల దగ్గరకు వెళ్లి.)

1_3_51 సీసము + ఆటవెలది వోలం - శ్రీహర్ష

సీసము

పరశురాముండు భీకరనిజకోపాగ్ని
        నుగ్రుఁడై యిరువదియొక్కమాఱు
ధాత్రీతలం బపక్షత్త్రంబు సేసినఁ
        దత్క్షత్త్రసతులు సంతానకాంక్ష
వెలయంగ ఋతుకాలముల మహావిప్రుల
        దయఁ జేసి ధర్మువు దప్పకుండఁ
బడసిరి పలువురఁ గొడుకులఁ గూఁతుల
        నిప్పాటఁ దత్క్షత్ర మెసఁగి యుర్విఁ

ఆటవెలది

బర్వి రాజధర్మపద్ధతి ననఘ మై
జారచోర దుష్టజనుల బాధఁ
బొరయ కుండ నిఖిలభూప్రజాపాలనఁ
జేయుచుండె శిష్టసేవ్య మగుచు.

(పరశురాముడు ఇరవైయొక్కమార్లు దండెత్తి క్షత్రియులందరినీ వధించాడు. వారి భార్యలు సంతానకాంక్షతో, మహావిప్రుల దయతో సంతానాన్ని పొందారు. ఆ క్షత్రియవంశం పాపరహితంగా పరిపాలన సాగించింది.)

1_3_50 వచనము వోలం - శ్రీహర్ష

వచనము

జనమేజయునకు వైశంపాయనుం డిట్లనియె.

(వైశంపాయనుడు ఇలా అన్నాడు.)

1_3_49 కందము వోలం - శ్రీహర్ష

కందము

అమరాసురముఖ్యుల యం
శములను మహిఁ బుట్టి సకలజనపాలకసం
ఘములకు భారతరణరం
గమునను లయ మొంద నేమి కారణ మనినన్.

("దేవదానవుల అంశలతో పుట్టిన రాజసమూహాలు భారతయుద్ధంలో నశించటానికి కారణమేమిటి?")

1_3_48 వచనము వోలం - శ్రీహర్ష

వచనము

మఱియు దేవదైత్యదానవ మునియక్షపక్షిగంధర్వాదుల యంశావతారంబులు దాల్చి భీష్మాది మహావీరులు భారతయుద్ధంబు సేయ ననేకులు పుట్టిరి వారల కొలంది యెఱుంగచెప్ప ననేకకాలం బనేక సహస్రముఖంబుల వారికైన నలవిగా దనిన విని జనమేజయుండు వైశంపాయనున కిట్లనియె.

(అంతేకాక దేవతలు, రాక్షసులు మొదలైనవారి అంశలతో భీష్ముడు మొదలైన మహావీరులు భారతయుద్ధం చేయటానికి పుట్టారు. వారందరి సామర్ధ్యం గురించి చెప్పటం అనేకవేల ముఖాలు కలవారు చాలాకాలం చెప్పినా సాధ్యం కాదు - అనగా విని జనమేజయుడు వైశంపాయనుడితో ఇలా అన్నాడు.)

-:భీష్మాదివీరులు దేవదానవాదుల యంశంబువలనఁ బుట్టుట:-

1_3_47 ఉత్పలమాల వోలం - శ్రీహర్ష

ఉత్పలమాల

సంచితపుణ్యుఁ డంబురుహసంభవునంశము దాల్చి పుట్టి లో
కాంచితు డైన వాఁడు నిఖిలాగమపుంజము నేర్పడన్ విభా
గించి జగంబు లందు వెలుఁగించి సమస్తజగద్ధితంబుగాఁ
బంచమవేద మై పరగు భారతసంహితఁ జేసె నున్నతిన్.

(వ్యాసుడు వేదాలను విభజించి, వాటిని లోకాలలో ప్రకాశింపజేసి, పంచమవేదమనే పేరుతో ప్రసిద్ధి చెందిన భారతసంహితను రచించాడు.)

1_3_46 వచనము వోలం - శ్రీహర్ష

వచనము

పరాశరుండును సత్యవతి కోరినవరంబు లిచ్చి నిజేచ్ఛ నరిగె నంతఁ గృష్ణద్వైపాయనుండును గృష్ణాజినపరిధానకపిలజటామండలదండకమండలు మండితుండై తల్లి ముందట నిలిచి కరకమలంబులు మొగిచి మ్రొక్కి మీకుం బని గల యప్పుడ నన్నుం దలంచునది యాక్షణంబ వత్తునని సకలలోక పావనుఁ డఖిలలోకహితార్థంబుగాఁ దపోవనంబునకుం జని యందు మహా ఘోరతపంబు సేయుచు.

(పరాశరుడు సత్యవతి కోరిన వరాలిచ్చి వెళ్లిపోయాడు. వ్యాసుడు తల్లి ముందు నిలిచి, "మీకు పని కలిగినప్పుడు నన్ను తలవండి, ఆ క్షణమే వస్తాను", అని చెప్పి తపస్సు చేయటానికి వెళ్లిపోయాడు.)

1_4_45 కందము వోలం - శ్రీహర్ష

కందము

ఆ యమునాద్వీపమున న
మేయుఁడు కృష్ణుం డయి పుట్టి మెయిఁగృష్ణద్వై
పాయనుఁ డనఁ బరగి వచ
శ్శ్రీయుతుఁడు తపంబునంద చిత్తము నిలిపెన్.

(నల్లనివాడైన అతడు ఆ యమునాద్వీపంలో కృష్ణద్వైపాయనుడు అనే పేరుతో ప్రసిద్ధి చెంది తపస్సులో దృష్టి నిలిపాడు.)

1_3_44 కందము వోలం - శ్రీహర్ష

కందము

సద్యోగర్భంబున నహి
మద్యుతితేజుండు వేదమయుఁ డఖిలమునీం
ద్రాద్యుఁడు వేదవ్యాసుం
డుద్యజ్ఞానంబుతోడ నుదితుం డయ్యెన్.

(గొప్పవాడైన వ్యాసుడు జన్మించాడు.)

1_3_43 కందము వోలం - శ్రీహర్ష

కందము

పరమేష్ఠి కల్పుఁడగు న
ప్పరాశరు సమాగమమునఁ బరమగుణైకా
భరణకు ననవద్యమనో
హరమూర్తికి సత్యవతికి నమ్మునిశక్తిన్.

(పరాశరుడి మహిమ వల్ల సత్యవతికి.)

-:శ్రీవేదవ్యాసమునీంద్రుని యవతారము:-

1_3_42 తేటగీతి వోలం - శ్రీహర్ష

తేటగీతి

ఎల్లవారును జూడంగ నిట్టిబయల
నెట్లగు సమాగమం బని యింతి యన్న
నమ్మునీంద్రుఁడు గావించె నప్పు డఖిల
దృష్టిపథరోధి నీహారతిమిర మంత.

(ఇది అందరూ చూసే బాహ్యప్రదేశమని యోజనగంధి అనగా ప్రజల దృష్టి నిరోధించేందుకు పరాశరుడు మంచుచీకట్లను సృష్టించాడు.)

Friday, October 28, 2005

1_3_41 వచనము వోలం - శ్రీహర్ష

వచనము

అనిన నమ్మునివరుండు గరంబు సంతసిల్లి నాకు నిష్టంబు సేసిన దాన నీ కన్యాత్వంబు దూషితంబు గా దోడకుండు మని దానికి వరం బిచ్చి నీవు వసువను రాజర్షి వీర్యంబునం బుట్టిన దానవు గాని సూతకుల ప్రసూతవు కావని చెప్పి దాని శరీరసౌగంధ్యంబు యోజనంబునం గోలె జనులకు నేర్పడునట్లుగాఁ బ్రసాదించిన నది గంధవతి యనియు యోజనగంధి యనియుఁ బరఁగి తత్ప్రసాదంబున ననేకదివ్యాంబరాభరణభూషిత యై యమునానదీ ద్వీపంబున నోడ చేర్చి.

(అని అనగా పరాశరుడు సంతోషించి, ఆమె కన్యాత్వం పోకుండా వరమిచ్చి, "నువ్వు వసువుకు పుట్టినదానివి కానీ సూతకులంలో పుట్టలేదు", అని తెలిపి, ఆమెకు యోజనదూరంలో ఉండే జనాలకు కూడా తెలిసేలాంటి శరీరసుగంధం అనుగ్రహించాడు. ఆమె అప్పటినుండి గంధవతిగా, యోజనగంధిగా ప్రసిద్ధిచెందింది. ఆమె ఓడను యమునానదిలోని ఒక ద్వీపానికి చేర్చి.)

1_3_40 తరలము వోలం - శ్రీహర్ష

తరలము

తనువు మీన్పొల వల్చు జాలరిదాన నట్లును గాక యే
ననఘ కన్యకఁ గన్యకావ్రత మంతరించిన నెట్లు మ
జ్జనకునింటికిఁ బోవ నేర్తుఁ బ్రసాదబుద్ధి యొనర్పు స
న్మునిగణోత్తమ నాకు దోషవిముక్తి యె ట్లగు నట్లుగాన్.

(చేపలవాసన వచ్చే శరీరం గల జాలరిదాన్ని నేను. అదీగాక, నేను కన్యను. నా కన్యకావ్రతం అంతరిస్తే నా తండ్రి ఇంటికి ఎలా వెళ్లగలను? నాకు దోషం కలగని విధంగా అనుగ్రహించండి.)

1_3_39 వచనము విజయ్ - విక్రమాదిత్య

వచనము

ఇట్లు విగతలజ్జాపరవశుం డయి మునివరుండు దనయభిప్రాయం బక్కన్యక కెఱింగించిన నదియును దీని కొడంబడనినాఁడు నా కలిగి యిమ్ముని శాపం బిచ్చునో యని వెఱచి యి ట్లనియె.

(ఇలా ఆ ముని సిగ్గువిడిచి తెలిపిన కోరికకు ఒప్పుకోకపోతే శపిస్తాడేమోనని భయపడి మత్స్యగంధి ఇలా అన్నది.)

1_3_38 సీసము + ఆటవెలది విజయ్ - విక్రమాదిత్య

సీసము

చపలాక్షిచూపులచాడ్పున కెడ మెచ్చుఁ
        జిక్కనిచనుఁగవఁ జీఱఁ గోరు
నన్నువకౌఁదీగ యందంబు మది నిల్పు
        జఘనచక్రంబుపైఁ జలుపు దృష్టి
యభిలాష మేర్పడు నట్లుండఁగాఁ బల్కు
        వేడ్కతో మఱుమాట వినఁగఁ దివురు
నతిఘనలజ్జావనత యగు యక్కన్య
        పైఁ బడి లజ్జయుఁ బాపఁ గడఁగు

ఆటవెలది

నెంతశాంతు లయ్యు నెంత జితేంద్రియు
లయ్యు గడువివిక్త మయినచోట
సతులగోష్ఠిఁ జిత్తచలన మొందుదు రెందుఁ
గాముశక్తి నోర్వఁగలరె జనులు.

(ఆమెకు తన కోరిక తెలిపాడు. మన్మథుడి శక్తిని ప్రజలు ఓర్చగలరా?)

1_3_37 వచనము విజయ్ - విక్రమాదిత్య

వచనము

ఇట్లేకతంబ యేకవస్త్రయై యోడ నెక్కవచ్చువారి నిరీక్షించుచున్న సత్యవతిం జూచి యా మునివరుండు దానియందు మదనపరవశుం డై దానిజన్మంబు దన దివ్యజ్ఞానంబున నెఱింగి యయ్యోడ యెక్కి దానితో నొక్కటఁ జని చని.

(ఓడనెక్కేవారికోసం ఎదురుచూస్తున్న మత్స్యగంధిని పరాశరుడు చూసి, మోహించి, ఆ ఓడనెక్కి.)

1_3_36 చంపకమాల విజయ్ - విక్రమాదిత్య

చంపకమాల

గతమదమత్సరుండు త్రిజగద్వినుతుండు వసిష్ఠపౌత్త్రుఁ డు
న్నతమతి శక్తిపుత్త్రుఁ డఘనాశనఘోరతపోధనుండు సు
వ్రతుఁడయి తీర్థయాత్ర చనువాఁడు పరాశరుఁ డన్మునీంద్రుఁ డ
య్యతివఁ దలోదరిం గనియె నయ్యమునానది యోడరేవునన్.

(వశిష్ఠుని మనవడు, శక్తిమహాముని పుత్రుడు, గొప్పవాడు అయిన పరాశరమునీంద్రుడు తీర్థయాత్రలకు వెళుతూ యమునానది ఓడరేవులో మత్స్యగంధిని చూశాడు.)

1_3_35 వచనము విజయ్ - విక్రమాదిత్య

వచనము

అంత.

(అప్పుడు.)

1_3_34 కందము విజయ్ - విక్రమాదిత్య

కందము

అంబుజముఖి యక్కన్య ప్రి
యం బొనరఁగ మత్స్యగంధి యనఁగా ధర్మా
ర్థంబుగఁ దనతండ్రి నియో
గంబున నయ్యమున నోడఁ గడపుచు నుండెన్.

(ఆమె మత్స్యగంధి అనే పేరుతో తండ్రి ఆజ్ఞ ప్రకారం యమునానదిలో ఓడ నడుపుతూండేది.)

1_3_33 వచనము విజయ్ - విక్రమాదిత్య

వచనము

అయ్యద్రికయు మానుషప్రసవం బొనరించినం దనకు శాపమోక్షణం బగునని బ్రహ్మవచనంబు గలుగుటంజేసి మీనయోని విడిచి దివ్యవనిత యయి దేవలోకంబునకుం జనియె మఱియును మత్స్యోదరంబునఁ బుట్టిన యక్కొడుకు మత్స్యరాజునాఁ బరఁగి ధర్మపరుం డయి మత్స్యదేశంబున కధిపతి యయ్యె నక్కూఁతును దాశరాజు దనకూఁతుంగాఁ జేకొని పెంచినం బెరుఁగుచు.

(అద్రిక శాపవిమోచనం పొంది దేవలోకానికి వెళ్లిపోయింది. ఆమె కొడుకు మత్స్యదేశానికి రాజు అయ్యాడు. ఆమె కుమార్తెను దాశరాజు తన కూతురుగా పెంచుకోసాగాడు.)

-:మత్స్యగంధి వృత్తాంతము:-

1_3_32 తేటగీతి విజయ్ - విక్రమాదిత్య

తేటగీతి

తెరలవల వైచి జాలరుల్ దిగిచి దాని
యుదరదళనంబు సేసి యం దొక్కకొడుకు
నొక్కకూఁతును గని వారి నొనరఁ దెచ్చి
దాశరాజున కిచ్చిరి తత్క్షణంబ.

(జాలరులు ఆ చేపను పట్టి, దాని కడుపు చీల్చి అందులో ఒక కొడుకును, కూతురును చూసి వారిని తెచ్చి దాశరాజుకు ఇచ్చారు.)

1_3_31 వచనము విజయ్ - విక్రమాదిత్య

వచనము

తొల్లి బ్రహ్మశాపనిమిత్తంబున నద్రిక యను నప్సరస యమునయందు మీనయి క్రుమ్మరుచున్నయది యవ్వసువీర్యబిందుద్వయంబు త్రావి గర్భంబు దాల్చిన దశమమాసంబునందు.

(బ్రహ్మశాపం వల్ల చేపగా మారిన అద్రిక అనే అప్సరస ఆ బిందువులు రెండింటిని తాగి గర్భం ధరించింది. పదవ నెలలో.)

1_3_30 కందము నచకి - విజయ్

కందము

సునిశితతుండహతిని వ్ర
స్సినపర్ణపుటంబు వాసి చెదరుచు నృపనం
దనువీర్యము యమునానది
వనమధ్యమునందు వాయువశమునఁ బడియెన్.

(ఆ పక్షి ముక్కు దెబ్బ చేత ఆ ఆకుదొప్ప చెదిరి వసురాజువీర్యం యమునానదినీటి మధ్యలో గాలివాటున పడిపోయింది.)

1_3_29 కందము నచకి - విజయ్

కందము

అమిష మని దానిం గొనఁ
గా మది సమకట్టి యొక్కఖగ మాఖగమున్
వ్యోమమునఁ దాఁక దివిసం
గ్రామం బారెంటి కయ్యెఁ గడురభసమునన్.

(దాన్ని మాంసం అనుకొని, ఆ డేగను ఇంకొక డేగ ఆకాశంలో ఎదుర్కొన్నది. ఆ రెండిటికీ యుద్ధం జరిగింది.)

1_3_28 వచనము విజయ్ - విక్రమాదిత్య

వచనము

అయ్యమోఘవీర్యం బొక్కయజీర్ణపర్ణపుటంబున నిమ్ముగా సంగ్రహించి యొక్కడేగయఱుతంగట్టి దీనింగొనిపోయి గిరికకిమ్మని యుపరిచరుండు పనిచిన నదియు నతిత్వరితగతి నా కానం గడచి యాకాశంబునం బఱచునప్పుడు.

(దాన్ని ఒక ఆకుదొప్పలో చేర్చి, ఒక డేగ మెడకు కట్టి, గిరికకు ఇమ్మని ఉపరిచరుడు పంపాడు. ఆ డేగ ఆకాశంలో ఎగురుతున్నప్పుడు.)

1_3_27 సీసము + ఆటవెలది విజయ్ - విక్రమాదిత్య

సీసము

పలుకులముద్దును గలికిక్రాల్గన్నుల
        తెలివును వలుఁదచన్నులబెడంగు
నలఘుకాంచీపదస్థలములయొప్పును
        లలితాననేందుమండలము రుచియు
నళినీలకుటిలకుంతలములకాంతియు
        నెలజవ్వనంబున విలసనమును
నలసభావంబునఁ బొలుపును మెలుపును
        గలుగు నగ్గిరికను దలఁచి తలఁచి

ఆటవెలది

ముదితయందుఁ దనదు హృదయంబు నిలుపుటఁ
జేసి రాగ మడర భాసురముగ
రమణతో వనాంతరమున రేతస్స్యంద
మయ్యె నవనిపతికి నెయ్య మొనర.

(అడవిలో గిరికాలగ్నమనస్కుడైన ఉపరిచరుడికి రేతస్స్యందమయ్యింది.)

1_3_26 వచనము నచకి - విక్రమాదిత్య

వచనము

అట్టి యింద్రోత్సవంబున నతిప్రీతుం డయిన యింద్రువరంబున నుపరిచరుండు బృహద్రథ మణివాహన సౌబల యదు రాజన్యు లనియెడి కొడుకుల నేవురం బడసి వారలం బెక్కు దేశంబుల కభిషిక్తులం జేసిన నయ్యేవురు వాసవులు వేఱు వేఱ వంశకరు లయి పరఁగి ర ట్లుపరిచరుండు లబ్ధసంతానుండయి రాజర్షి యయి రాజ్యంబు సేయుచు నిజపురసమీపంబునం బాఱిన శుక్తిమతి అను మహానదిం గోలాహలం బను పర్వతంబు గామించి యడ్డంబు వడిన దానిం దన పాదంబునం జేసి తలఁగం ద్రోచిన నన్నదికిఁ బర్వతసమాగమంబున వసుపదుం డను కొడుకును గిరిక యను కూఁతురుం బుట్టిన నయ్యిరువురను శుక్తిమతి దద్దయు భక్తిమతియై గిరినిరోధంబు బాచి యుపకారంబు సేసిన యుపరిచరునకు మెచ్చి కానిక యిచ్చిన నాతండు వసుపదుం దనకు సేనాపతిం జేసికొని గిరికం దనకు ధర్మపత్నిగాఁ జేసికొని యున్నంత నగ్గిరిక ఋతుమతి యయిన దీనికి మృగమాంసంబు దెచ్చిపెట్టు మని తన పితృదేవతలు పంచిన నప్పు డయ్యుపరిచరుండు మృగవధార్థంబు వనంబున కరిగి.

(ఉపరిచరుడి ఇంద్రోత్సవాలకు ఇంద్రుడెంతో సంతోషించాడు. ఇంద్రుడి వరం వల్ల అతడికి అయిదుగురు కుమారులు పుట్టి, అనేక దేశాలకు అధిపతులయ్యారు. అలా ఉపరిచరుడు రాజ్యాన్ని పాలిస్తుండగా, దగ్గరలోని శుక్తిమతి అనే నదిని కోలాహలం అనే పర్వతం కామించి అడ్డగించింది. ఉపరిచరుడు తన కాలితో ఆ పర్వతాన్ని తొలగించాడు. పర్వతసమాగమం చేత ఆ నదికి వసుపదుడనే కుమారుడు, గిరిక అనే కూతురు జన్మించగా శుక్తిమతి వారిని ఉపరిచరుడికి కానుకగా ఇచ్చింది. ఆ రాజు వసుపదుడిని తన సేనాపతిగా, గిరికను తన ధర్మపత్నిగా చేసుకున్నాడు. ఋతుమతి అయిన గిరికకు మృగమాంసం తెమ్మని పితృదేవతలు ఆజ్ఞాపించగా అందుకోసం ఉపరిచరుడు అడవికి వెళ్లాడు.)

Thursday, October 27, 2005

1_3_25 కందము విజయ్ - విక్రమాదిత్య

కందము

ఘనముగ నయ్యింద్రోత్సవ
మొనరించు మహీపతులకు నొగి నాయుర్వ
ర్ధనము నగుఁ బెరుఁగు సంతతి
యనవరతము ధరణిఁ బ్రజకు నభివృద్ధి యగున్.

(ఆ ఇంద్రోత్సవాన్ని చేసే రాజులకు, వారి ప్రజలకు మంచి జరుగుతుంది.)

1_3_24 వచనము నచకి - విక్రమాదిత్య

వచనము

నీ వర్ణధర్మప్రతిపాలనంబునకుఁ దపంబునకు మెచ్చితి నీవు నాతోడం జెలిమి సేసి నాయొద్దకు వచ్చుచుం బోవుచు మహీరాజ్యంబు సేయుచునుండు మని వానికి దేవత్వంబును గనకరత్నమయంబైన దివ్యవిమానంబును నెద్దానినేని తాల్చిన నాయుధంబులు దాఁక నోడు నట్టి వాడని వనజంబులు గలిగిన యింద్రమాల యను కమలమాలికయును దుష్టనిగ్రహశిష్టపరిపాలనక్షమంబైన యొక్క వేణుయష్టియు నిచ్చిన నవ్వసువును దద్విమానారూఢుండై యుపరిలోకంబున జరించుటం జేసి యుపరిచరుండు నాఁబరగి యక్కమలమాలికయుఁ దనకుం జిహ్నంబుగా నవ్వేణుయష్టికి మహావిభవంబు సేయుచు మెఱసి యేఁటేఁట నింద్రోత్సవం బను నుత్సవంబు సేయుచు నీశ్వరునకు నింద్రాది దేవతలకు నతిప్రీతి సేసె నదిమొదలుగా రాజు లెల్లం బ్రతిసంవత్సరంబు నింద్రోత్సవంబు సేయుచుండుదురు.

(అతడితో స్నేహం చేసి, అతడికి ఒక దివ్యవిమానాన్ని, మరికొన్ని కానుకలను ఇచ్చాడు. వసువు ఆ విమానాన్ని ఎక్కి పైలోకాలలో తిరగటం వల్ల ఉపరిచరుడు అనే పేరు పొంది, ఏటేటా ఇంద్రోత్సవం జరిపి దేవతలకు సంతోషం కలిగించాడు. అప్పటినుండి రాజులందరూ ప్రతి సంవత్సరం ఇంద్రోత్సవం జరుపుతున్నారు.)

1_3_23 సీసము + ఆటవెలది విజయ్ - విక్రమాదిత్య

సీసము

వాసవప్రతిముండు వసు వను నాతండు
        చేదిభూనాథుండు శిష్టలోక
నుతకీర్తి మృగయావినోదార్థ మడవికిఁ
        జని యొక్కమునిజనాశ్రమమునందు
నిర్వేదమున మహానిష్ఠతో సన్న్యస్త
        శ్రస్త్రుఁడై తప మొప్పుఁ జలుపుచున్న
నాతనిపాలికి నమరగణంబుతో
        నింద్రుండు వచ్చి తా నిట్టు లనియె.

ఆటవెలది

ధరణిఁ బ్రజఁ గరంబు దయతోడ వర్ణధ
ర్మాభిరక్షఁ జేసి యమలచరిత
నేలి రాజ్యవిభవ మది యేల యని తప
శ్చరణ నునికి నీక చనియె ననఘ.

(చేదిదేశానికి రాజైన వసువు ఒకరోజు వేటకు వెళ్లి అక్కడ ఒక మునుల ఆశ్రమాన్ని చూసి, నిర్వేదం చెంది, ఆయుధాలు వదిలి అక్కడే తపస్సు చేయనారంభించాడు. ఒకరోజు ఇంద్రుడు అతని దగ్గరకు వెళ్లి అతడిని మెచ్చుకొని.)

1_3_22 వచనము విజయ్ - విక్రమాదిత్య

వచనము

ఇట్టి శ్రీమహాభారతంబునకుం గర్త యయిన శ్రీవేదవ్యాసునిజన్మంబు సవిస్తరంబుగాఁ జెప్పెద వినుము.

(ఇలాంటి భారతాన్ని రచించిన వ్యాసుడి పుట్టుక గురించి చెపుతాను. వినండి.)

-:ఉపరిచరవసుమహారాజు వృత్తాంతము:-

Wednesday, October 26, 2005

1_3_21 శార్దూలము విజయ్ - విక్రమాదిత్య

శార్దూలము

ఆ నారాయణపాండవేయగుణమాహాత్మ్యామలజ్యోత్స్నఁ జి
త్తానందం బొనరించుచున్ జనుల కర్థాంశుప్రకాశంబుతో
మానై సాత్యవతేయధీవనధి జన్మ శ్రీమహాభారతా
ఖ్యానాఖ్యామృతసూతి యొప్పు నిఖిలాఘధ్వాంతవిధ్వంసి యై.

(కృష్ణపాండవేయుల గుణాలు అనే వెన్నెలచేత, పురుషార్థాలనే కిరణాలతో, వ్యాసుడి మేధాసముద్రంలో పుట్టిన చంద్రుడు అనే మహాభారతం పాపాలనే చీకట్లను నశింపజేస్తుంది.)

1_3_20 వచనము విజయ్ - విక్రమాదిత్య

వచనము

ఇట్టి భరతకులముఖ్యులవంశచరితానుకీర్తనంబునం జేసి యిక్కథ శ్రీమహాభారతంబునాఁ బరఁగె.

(భరతకులముఖ్యుల గురించి చెప్పేది కాబట్టి ఈ కథను శ్రీమహాభారతం అంటారు.)

1_3_19 అక్కర విజయ్ - విక్రమాదిత్య

అక్కర

వనమునఁ బదియు రెండేఁడు లజ్ఞాతవాస మొక్కేఁడు
జనపదంబున నుండి తపన నయ్యేండ్లు సలిపి సద్వృత్తు
లనఘులు మును వేఁడి కొనక మఱి భారతాజి సేయంగ
మొనసిరి పాండవ కౌరవుల భేదమూల మిట్టిదియ.

(పన్నెండేళ్లు అరణ్యవాసం, ఒకయేడు అజ్ఞాతవాసం చేసిన తర్వాత కూడా పాండవులకు రాజ్యభాగం లభించకపోవడం వల్ల వారు భారతయుద్ధానికి తలపడ్డారు.)

1_3_18 చంపకమాల విజయ్ - విక్రమాదిత్య

చంపకమాల

పరమగురూపదేశమునఁ బార్థుఁడు పార్థివవంశశేఖరుం
డరిది తపంబునన్ భుజబలాతిశయంబున నీశుఁ బన్నగా
భరణుఁ బ్రసన్నుఁ జేసి దయఁ బాశుపతాదిక దివ్యబాణముల్
హరసురరాజదేవనివహంబులచేఁ బడసెం బ్రియంబునన్.

(గురూపదేశం ప్రకారం అర్జునుడు తపస్సుచేసి, శంకరుడి చేత, ఇంద్రుడి చేత పాశుపతం మొదలైన దివ్యాస్త్రాలు పొందాడు.)

1_3_17 వచనము విజయ్ - విక్రమాదిత్య

వచనము

మఱియు నగ్నిదేవుచేత దివ్యరథంబును దివ్యాశ్వంబులును గాండీవదేవదత్తంబులును నక్షయబాణతూణీరంబులుం బడసి సురగణంబులతో సురపతి నోర్చి ఖాండవదహనంబున నగ్నిదేవునిం దనిపె మఱి మయువలన సభాప్రాప్తుండై భీమునిచేత జరాసంధుం జంపించి దిగ్విజయంబు సేసి సార్వభౌముండై ధర్మరాజు రాజసూయమహాయజ్ఞంబుఁ గావించె నివి మొదలుగాఁ గల పాండవులగుణసంపదలు చూచి సహింప నోపక దుర్యోధనుండు శకునికైతవంబున మాయాద్యూతంబున ధర్మరాజుం బరాజితుం జేసి పండ్రెండేఁడులు వనవాసంబును నొక్కయేఁడు జనపదంబున నజ్ఞాతవాసంబునుగా సమయంబుసేసి భూమి వెలువరించినం జని పాండవులు వనవాసంబున నున్నంత.

(అగ్నిదేవుడి దగ్గర దివ్యరథాన్ని, గాండీవాన్ని, దేవదత్తమనే శంఖాన్ని, అక్షయతూణీరాన్ని పొంది, దేవేంద్రుడిని ఓడించి, ఖాండవదహనం చేసి, అగ్నిదేవుడిని తృప్తుడిని చేశాడు. భీముడి చేత జరాసంధుడిని చంపించి, మయుడి చేత సభాభవనాన్ని పొంది, ధర్మరాజు సార్వభౌముడై రాజసూయయజ్ఞం చేశాడు. ఇది దుర్యోధనుడు సహించలేక శకుని చేత మాయాజూదంలో ధర్మరాజును ఓడించాడు. పన్నెండేళ్లు వనవాసం, ఒక ఏడు అజ్ఞాతవాసం చేయాలనే నియమం ప్రకారం దేశం నుంచి వారిని వెళ్లగొట్టాడు. వారు అడవిలో ఉండగా.)

1_3_16 కందము విజయ్ - విక్రమాదిత్య

కందము

ద్వారవతి కేఁగి యర్జునుఁ
డారంగ సుభద్రఁ బెండ్లి యై వచ్చి మహా
వీరు నభిమన్యుఁ గులవి
స్తారకు సత్పుత్త్రు నతిముదంబునఁ బడసెన్.

(అర్జునుడు ద్వారకకు వెళ్లి, సుభద్రను పెళ్లాడి, అభిమన్యుడనే సుపుత్రుడిని పొందాడు.)

Tuesday, October 25, 2005

1_3_15 వచనము నచకి - విజయ్

వచనము

ఇట్లు దుర్యోధనుచేయు నపాయంబులవలనం బాయుచుఁ బాండవులు లాక్షాగృహదాహంబువలన నక్షయులై జననీసహితంబుగా వనంబులకుం జనిన నందు భీమసేనుండు హిడింబాసురుం జంపి వాని చెలియలి హిడింబను వివాహంబై యేకచక్రపురంబున కేఁగి యందు బకాసురుం జంపి విప్రులం గాచె మఱి యందఱు విప్రవేషంబున ద్రుపదపురంబునకుం జని యందు ద్రౌపదీస్వయంవరంబున మత్స్యయంత్రం బర్జునుం డశ్రమంబున నురులనేసి సకలరాజలోకంబు నొడిచి ద్రోవదింజేకొనిన దాని నేవురు గురువచనంబున వివాహంబై ద్రుపదుపురంబున నొక్కసంవత్సరం బున్న నెఱింగి ధృతరాష్ట్రుండు వారి రావించి వారల కర్ధరాజ్యంబిచ్చి యింద్రప్రస్థపురంబున నుండం బనిచిన నందుఁ బాండవులు రాజ్యంబు సేయుచున్నంత.

(పాండవులు అలా తప్పించుకొని తల్లితో కూడా అడవులకు వెళ్లారు. అక్కడ భీముడు హిడింబాసురుడిని చంపి, అతడి చెల్లెలైన హిడింబను పెళ్లాడి, ఏకచక్రపురానికి వెళ్లి, బకాసురుడిని చంపాడు. తరువాత పాండవులు విప్రవేషాలలో ద్రుపదపురానికి వెళ్లారు. అక్కడ ద్రౌపది స్వయంవరంలో అర్జునుడు మత్స్యయంత్రాన్ని కొట్టి ద్రౌపదిని గ్రహించాడు. తరువాత గురువచనం ప్రకారం పాండవులందరూ ద్రౌపదిని పెళ్లాడి ఒక సంవత్సరం పాటు ద్రుపదపురంలో ఉన్నారు. ఇది ధృతరాష్ట్రుడు తెలుసుకొని వారిని రప్పించి, సగం రాజ్యం ఇచ్చి ఇంద్రప్రస్థంలో ఉండమని ఆజ్ఞాపించాడు. పాండవులు అక్కడ రాజ్యం చేస్తూ ఉండగా.)

Monday, October 24, 2005

1_3_14 సీసము + ఆటవెలది నచకి - విజయ్

సీసము

వదలక కురుపతి వారణావతమున
        లక్కయిల్ గావించి యక్కజముగ
నందఱఁ జొన్పి యం దనలంబు దరికొల్పఁ
        బనిచినఁ బాండునందను లెఱింగి
విదురోపదిష్టభూవివరంబునం దప
        క్రాంతు లై బ్రదికి నిశ్చింతు లయిరి
ధర్మువు నుచితంబుఁ దప్పనివారల
        సదమలాచారుల నుదిత సత్య

ఆటవెలది

రతుల నఖిలలోకహితమహారంభుల
భూరిగుణుల నిర్జితారివర్గు
లై వెలుంగువారి దైవంబ రక్షించు
దురితవిధుల నెపుడుఁ బొరయకుండ.

(దుర్యోధనుడు వారణావతంలో ఒక లక్క ఇల్లు కట్టించి, అందులో పాండవులు ప్రవేశించిన తరువాత, దానికి నిప్పంటించమని ఆజ్ఞాపించాడు. అది పాండవులు తెలుసుకొని, విదురుడు చెప్పిన సొరంగం నుండి బయటపడ్డారు. మంచివారిని ఆ దైవమే రక్షిస్తుంది.)

Sunday, October 23, 2005

1_3_13 వచనము విజయ్ - విక్రమాదిత్య

వచనము

అది యెట్లనిన నొక్కనాఁడు జలక్రీడాపరిశ్రమవిచేష్టితుండయి ప్రమాణకోటిస్థలంబున నిద్రితుండైన భీమసేనునతిఘనలతాపాశబద్ధుం జేసి గంగమడువునం ద్రోచిన నాతం డనంతసత్త్వుండు గావునఁ దద్బంధంబు లెల్లఁ దెగ నీల్గి మీఁదికి నెగసె మఱియొక్కనాఁ డతివ్యాయామఖేదంబున సుప్తుండైన వానిసర్వాంగంబులయందుఁ గృష్ణసర్పంబులం బట్టి కఱపించిన నాతండు వజ్రమయదేహుండు గావునఁ దద్విషదంష్ట్రలు నాఁటవయ్యె మఱియు నొక్కనాఁడు భోజన సమయంబున వానికి విషంబు వెట్టిన నతండు దివ్యపురుషుండు గావునఁ దద్విషం బన్నంబుతోడన జీర్ణం బయ్యె మఱియు వారల కెల్ల నపాయంబు సేయసమకట్టి.

(అదెలాగంటే, జలక్రీడలాడి, అలసి, ప్రమాణకోటి అనే చోట నిద్రపోతున్న భీముడిని తీగలతో బంధించి గంగానది మడుగులో తోసినా అతడు అనంతబలవంతుడు కాబట్టి నిద్రలేచి, ఒళ్లు విరుచుకొని బయటికి వచ్చాడు. మరొక రోజు, వ్యాయమం చేసి నిద్రపోతున్న భీముడిని నల్లత్రాచులతో కాటువేయించగా అతడు వజ్రదేహుడు కాబట్టి ఆ పాముల కోరలు అతడి శరీరంలో దిగబడలేదు. భీముడికి భోజనంలో విషం కలిపిపెట్టినా అది అతనికి అన్నంతోపాటే జీర్ణమైపోయింది.అయినా, కౌరవులు వారికి హాని చేయాలని.)

Friday, October 21, 2005

1_3_12 సీసము + ఆటవెలది విజయ్ - విక్రమాదిత్య

సీసము

పాండుకుమారులు పాండుభూపతిపరో
        క్షంబున హస్తిపురంబునందు
ధృతరాష్ట్రునొద్దఁ దత్సుతులతో నొక్కటఁ
        బెరుఁగుచు భూసురవరులవలన
వేదంబులును ధనుర్వేదాదివిద్యలుఁ
        గఱచుచుఁ గడలేనియెఱుకఁ దనరు
చున్నఁ దద్విపులగుణోన్నతి సైఁపక
        దుర్యోధనుండు దుష్కార్య మెత్తి.

ఆటవెలది

దుర్ణయమున శకునికర్ణదుశ్శాసనుల్
గఱపఁ బాండవులకు నఱయ చేయఁ
గడఁగెఁ బాండవులును గడుధార్మికులు గానఁ
బొరయ రైరి వారిదురితవిధుల.

(పాండురాజు చనిపోయిన తర్వాత పాండవులు హస్తినాపురంలో కౌరవులతోపాటు పెరుగుతూ, విద్యలు నేర్చుకుంటూండేవారు. వారిని చూసి దుర్యోధనుడు సహించలేక శకుని, కర్ణుడు, దుశ్శాసనులతో కలిసి పాండవులకు కీడు చేయాలని ప్రయత్నించినా పాండవులు ధార్మికులవటం వల్ల వారికి హాని కలిగేది కాదు.)

Wednesday, October 19, 2005

-:పాండవధార్తరాష్ట్రుల భేదకారణసంగ్రహము:-

1_3_11 శార్దూలము నచకి - విజయ్

శార్దూలము

ఆయుష్యం బితిహాసవస్తుసముదాయం బైహికాముష్మిక
శ్రేయఃప్రాప్తినిమిత్త ముత్తమసభాసేవ్యంబు లోకాగమ
న్యాయైకాంతగృహంబునాఁ బరఁగి నానావేదవేదాంతవి
ద్యాయుక్తం బగుదానిఁ జెప్పఁ దొడఁగెం దద్భారతాఖ్యానమున్.

(అయిన భారతకథను చెప్పటం ప్రారంభించాడు.)

1_3_10 చంపకమాల నచకి - విజయ్

చంపకమాల

వినుతపరాక్రముల్ ధృతివివేకులు సత్యసమన్వితుల్ యశో
ధనులు కృతజ్ఞు లుత్తములు ధర్మపరుల్ శరణాగతానుకం
పను లనఁగాఁ బ్రసిద్ధు లగు భారతవీరుల సద్గుణానుకీ
ర్తనముల నొప్పుదాని విదితం బగుదాని సభాంతరంబులన్.

(గొప్ప భారతవీరులను స్తుతించేదీ.)

1_3_9 సీసము + ఆటవెలది విజయ్ - విక్రమాదిత్య

సీసము

కమనీయధర్మార్థకామమోక్షములకు
        నత్యంతసాధనం బయినదాని
వేడ్కతోఁ దవిలి తన్ వినుచున్నవారల
        కభిమతశుభకరం బయినదాని
రాజుల కఖిలభూరాజ్యాభివృద్ధిని
        త్యాభ్యుదయప్రదం బయినదాని
వాఙ్మనఃకాయప్రవర్తితానేకజ
        న్మాఘనిబర్హణం బయినదాని

ఆటవెలది

సత్యవాక్ప్రబంధశతసహస్రశ్లోక
సంఖ్య మయినదాని సర్వలోక
పూజ్య మయినదాని బుధనుతవ్యాసమ
హామునిప్రణీత మయినదాని.

(గొప్పదీ, లక్షపద్యాలు గలదీ, వ్యాసుడు రచించినదీ.)

1_3_8 వచనము విజయ్ - విక్రమాదిత్య

వచనము

ఆ వైశంపాయనుండును నఖిలభువనవంద్యుం డయిన కృష్ణద్వైపాయనమునీంద్రునకు నమస్కారంబు సేసి విద్వజ్జనంబుల యనుగ్రహంబు వడసి.

(వైశంపాయనుడు వ్యాసుడికి నమస్కరించి.)

1_3_7 కందము నచకి - విజయ్

కందము

జనమేజయుండు విద్వ
జ్జన పరివృతుఁడై సమస్తజనపాలసభా
జనయోగ్యుని వైశంపా
యనమునిఁ బూజించె వినతుఁడై వినువేడ్కన్.

(జనమేజయుడు వైశంపాయనుడిని పూజించాడు.)

-:భారత మహిమము:-

1_3_6 వచనము నచకి - విజయ్

వచనము

అని యిట్లు పాండవధార్తరాష్ట్రవిభేదనకథాశ్రవణకుతూహలపరుండయి యడిగిన జనమేజయునకుం గరుణించి కృష్ణద్వైపాయనుండు వైశంపాయనమునిం జూచి శ్రీమహాభారతకథాఖ్యానం బాద్యంతం బితనికి సవిస్తరంబుగాఁ జెప్పుమని పంచి చనిన.

(వ్యాసుడు వైశంపాయనుడిని చూసి, "జనమేజయుడికి మహాభారతకథ చెప్పు", అని ఆజ్ఞాపించి వెళ్లాడు.)

Tuesday, October 18, 2005

1_3_5 సీసము + ఆటవెలది విజయ్ - విక్రమాదిత్య

సీసము

ప్రీతితో మీరును భీష్మాదికురువృద్ధ
        రాజులు నుండి భూరాజ్యవిభవ
మెల్ల విభాగించి యిచ్చినం దమతమ
        వృత్తుల నుండక వీఁగి పాండు
ధృతరాష్ట్రనందనుల్ ధృతి చెడి తా రేమి
        కారణంబునఁ బ్రజాక్షయము గాఁగ
భారతయుద్ధ మపారపరాక్రముల్
        చేసిరి మీపంపు సేయ రైరి

ఆటవెలది

యెఱిఁగి యెఱిఁగి వారి నేల వారింపర
యిట్టి గోత్రకలహ మేల పుట్టె
దీని కలతెఱంగు దెలియంగ నానతి
యిండు నాకు సన్మునీంద్రవంద్య.

(పెద్దవారైన మీ అందరి మాటలూ కాదని కౌరవపాండవులు భారతయుద్ధాన్ని ఎందుకు చేశారు? మీరంతా ఆ యుద్ధాన్ని ఎందుకు ఆపలేకపోయారు?)

1_3_4 వచనము విజయ్ - విక్రమాదిత్య

వచనము

వైశంపాయన ప్రభృతి శిష్యవర్గంబులతో ననేకమునిగణపరివృతుం డయి కనకమణిమయోచ్చాసనంబుననున్న వ్యాసభట్టారకు నతిభక్తి నర్ఘ్యపాద్యాదివిధులం బూజించి వినయవినమితశిరస్కుండై నమస్కరించి జనమేజయుం డిట్లనియె.

(వ్యాసుడితో ఇలా అన్నాడు.)

1_3_3 మత్తేభము నచకి - విజయ్

మత్తేభము

పరమబ్రహ్మనిధిం బరాశరసుతున్ బ్రహ్మర్షిముఖ్యున్ దయా
పరుఁ గౌరవ్యపితామహున్ జనహితప్రారంభుఁ గృష్ణాజినాం
బరు నీలాంబుదవర్ణ దేహు ననురూపప్రాంశు నుద్యద్దివా
కరరుక్పింగజటాకలాపు గతరాగద్వేషు నిర్మత్సరున్.

(గొప్పవాడైన.)

1_3_2 వచనము నచకి - విజయ్

వచనము

అక్కథకుండు శౌనకాదిమహామునులకుం జెప్పె నట్లు జనమేజయుం డుప సంహృతసర్పసత్త్రుం డయి యథావిధి సంపూర్ణదక్షిణల ఋత్విజులను సదస్యులనుం బూజించి దీనానాథజనంబులకుఁ గోరినధనంబు లిచ్చి యనేక పురాణపుణ్యకథాశ్రవణకృతసమాధానుండై విద్వజ్జనగోష్ఠి నుండి యొక్కనాఁడు.

(ఉగ్రశ్రవసుడు మునులకు ఇలా చెప్పాడు: జనమేజయుడు సర్పయాగాన్ని ముగించి ఒకరోజు సభలో.)

1_3_1 కందము విజయ్ - విక్రమాదిత్య

కందము

శ్రీమచ్చళుక్యవంశశి
ఖామణి మనుమార్గరాజకంఠీరవ ధై
ర్యామరధరణీధర ధర
ణీమండన ధర్మనిరత నిత్యాభ్యుదయా.

(రాజా!)

ఆదిపర్వము - తృతీయాశ్వాసము

Sunday, October 16, 2005

1_2_238 గద్యము విజయ్ - విక్రమాదిత్య

గద్యము

ఇది సకల సుకవిజన వినుత నన్నయభట్ట ప్రణీతంబయిన శ్రీమహాభారతంబునం దాదిపర్వంబున నాగ గరుడోత్పత్తియు సముద్రమథనంబును నమృతసంభవంబును సౌపర్ణాఖ్యానంబును జనమేజయ సర్పయాగంబును నాస్తీకు చరితంబును నన్నది ద్వితీయాశ్వాసము.

(ఇది నన్నయకవి రచించిన మహాభారతంలోని ఆదిపర్వంలో - నాగుల పుట్టుక, గరుడుడి పుట్టుక, సముద్రమథనం, అమృతసంభవం, గరుడోపాఖ్యానం, సర్పయాగం, ఆస్తీకుడి చరితం ఉన్న ద్వితీయాశ్వాసం.)

1_2_237 వసంతతిలకము విజయ్ - విక్రమాదిత్య

వసంతతిలకము

వీరావతార సుకవిస్తుత నిత్యధర్మ
ప్రారంభ శిష్టపరిపాలనసక్త రాజా
నారాయణాఖ్య కరుణారసపూర్ణ వీర
శ్రీరమ్య రాజకులశేఖర విష్ణుమూర్తీ.

(రాజకులశేఖరా!)

1_2_236 కందము విజయ్ - విక్రమాదిత్య

కందము

రాజమహేంద్రకవీంద్రస
మాజసురక్ష్మాజ రాజమార్తాండ ధరి
త్రీజననుత చారిత్ర వి
రాజితగుణరత్న రాజరాజనరేంద్రా.

(రాజరాజనరేంద్రా!)

1_2_235 వచనము విజయ్ - విక్రమాదిత్య

వచనము

మఱియు నయ్యాస్తీకుచరితంబు విన్నవారికి సర్వపాపక్షయం బగు నని.

(అదీగాక ఆస్తీకుడి కథ విన్నవారి పాపాలన్నీ తొలగిపోతాయి.)

1_2_234 కందము విజయ్ - విక్రమాదిత్య

కందము

ఒనర జరత్కారుమునీం
ద్రునకు జరత్కారునకు సుతుండైన మహా
మునివరు నాస్తీకుని ముద
మున దలఁచిన నురగభయముఁ బొందదు జనులన్.

(అందువల్ల జరత్కారుడికీ, జరత్కారువుకూ పుట్టిన ఆస్తీకుడిని స్మరిస్తే పాముల వల్ల భయం కలగదు.)

1_2_233 మత్తేభము విజయ్ - విక్రమాదిత్య

మత్తేభము

జననీశాపభయప్రపీడితమహాసర్పేంద్రులన్ సర్పయా
గనిమిత్తోద్ధతమృత్యువక్త్రగతులం గాకుండఁగాఁ గాచె నం
చును నాస్తీకమునీంద్రు నందుల సదస్యుల్ సంతసం బంది బో
రనఁ గీర్తించిరి సంతతస్తుతిపదారావంబు రమ్యంబుగగన్.

(సర్పవినాశనాన్ని ఆపిన ఆస్తీకుడిని అందరూ స్తుతించారు.)

1_2_232 కందము విజయ్ - విక్రమాదిత్య

కందము

అతని నత్యుగ్రానల
పాతోన్ముఖుఁ డైన వానిఁ బడకుండగా నో
హో తక్షక క్రమ్మఱు మని
యాతతభయుఁ గ్రమ్మఱించె నాస్తీకుఁ డెడన్.

(హోమగుండంలో పడటానికి సిద్ధంగా ఉన్న ఆ తక్షకుడిని ఆస్తీకుడు అగ్నిలో పడకుండా మధ్యలోనే మరల్చాడు.)

1_2_231 మత్తేభము విజయ్ - విక్రమాదిత్య

మత్తేభము

అతులోర్వీసురముఖ్యమంత్రహుతమాహాత్మ్యంబునన్ వాసవ
చ్యుతుఁడై ముందర తక్షకుం డురువిషార్చుల్ దూల వాత్యారయో
ద్ధతి నుద్ధూతవివర్దితాయతబృహద్దావాగ్నివోలెన్ విచే
ష్టితుఁడై మేఘపథంబులం దిరుగుచుండెన్ విస్మితుల్ గా జనుల్.

(తక్షకుడు హోమమంత్రాల ప్రభావం వల్ల ఇంద్రుడి నుండి విడివడి, చేష్టలుడిగి, విషాగ్నులు చలిస్తుండగా, ఆకాశంలో పరిభ్రమించసాగాడు. ప్రజలు ఆ దృశ్యాన్ని ఆశ్చర్యంతో చూడసాగారు.)

1_2_230 వచనము వసు - విజయ్

వచనము

అనిన సర్వజనానుమతంబుగా జనమేజయుం డాస్తీక ప్రార్థనంజేసి సర్పయాగం బుడిగించె నయ్యవసరంబున.

(అని చెప్పగా జనమేజయుడు అతడి కోరికను అనుసరించి సర్పయాగాన్ని మాన్పించాడు. అదే సమయంలో.)

1_2_229 చంపకమాల వసు - విజయ్

చంపకమాల

అనిన సదస్యు లందఱుఁ బ్రియంబున నిట్టి విశిష్టవిప్రము
ఖ్యునకు మహాతపోధనునకుం దగుపాత్రున కెద్ది యిచ్చినన్
ఘనముగ నక్షయం బగును గావున నీద్విజనాథుకోర్కిఁ బెం
పున వృథ సేయఁగాఁ దగదు భూవలయేశ్వర యిమ్ము నెమ్మితోన్.

(అని అడగగా సదస్యులందరూ, "ఆస్తీకుడి కోరిక వ్యర్థం చేయకూడదు కాబట్టి అతడు అడిగింది ఇవ్వండి")

1_2_228 ఉత్పలమాల వసు - విజయ్

ఉత్పలమాల

మానితసత్యవాక్య యభిమన్యుకులోద్వహ శాంతమన్యుసం
తానుఁడవై దయాభినిరతస్థితి నీవు మదీయబంధుసం
తానమనోజ్వరం బుపరతంబుగ నాకుఁ బ్రియంబుగా మహో
ర్వీనుత సర్పయాగ ముడిగింపుము కావుము సర్పసంహతిన్.

(మహారాజా! ఈ యాగాన్ని ఆపి పాములను కాపాడు.)

1_2_227 వచనము విజయ్ - విక్రమాదిత్య

వచనము

అని జనమేజయు నాతనియజ్ఞమహిమను ఋత్విజులను సదస్యులను భట్టారకు ననురూపశుభవచనంబులఁ బ్రస్తుతించిన నాస్తీకున కందఱును బ్రీతు లయి రంత జనమేజయుం డాస్తీకుం జూచి మునీంద్రా నీ కెద్ది యిష్టంబు దానిన యిత్తు నడుగు మనినఁ గరంబు సంతసిల్లి యాస్తీకుం డిట్లనియె.

(ఇలా ఆస్తీకుడు పొగడగా జనమేజయుడు ఆనందించి అతడిని ఇష్టమైనదాన్ని కోరుకొమ్మన్నాడు. ఆస్తీకుడు ఇలా అన్నాడు.)

1_2_226 ఉత్పలమాల వసు - విజయ్

ఉత్పలమాల

ఆర్తిహరక్రియాభిరతుఁడై కృతసన్నిధియై ప్రదక్షిణా
వర్తశిఖాగ్రహస్తముల వహ్ని మహాద్విజదివ్యమంత్రని
ర్వర్తితహవ్యముల్ గొనుచు వారిజవైరికులేశ నీకు సం
పూర్తమనోరథంబులును బుణ్యఫలంబులు నిచ్చుచుండెడున్.

(అగ్ని నీకు పుణ్యఫలాలు అందించుగాక.)

1_2_225 శార్దూలము విజయ్ - విక్రమాదిత్య

శార్దూలము

విద్వన్ముఖ్యుఁడు ధర్మమూర్తి త్రిజగద్విఖ్యాతతేజుండు కృ
ష్ణద్వైపాయనుఁ డేగుదెంచి సుతశిష్యబ్రహ్మసంఘంబుతో
సద్వంద్యుండు సదస్యుఁ డయ్యె ననినన్ శక్యంబె వర్ణింప సా
క్షాద్విష్ణుండవ నీవు భూపతులలోఁ గౌరవ్యవంశాగ్రణీ.

(వ్యాసుడే తన కుమారులతో వచ్చి పాలుపంచుకుంటున్న ఈ యజ్ఞాన్ని చేస్తున్న నువ్వు రాజులలో సాక్షాత్తుగా విష్ణుమూర్తివే.)

1_2_224 చంపకమాల వసు - విజయ్

చంపకమాల

వితతమఖ ప్రయోగవిధివిత్తము లుత్తమధీయుతుల్ జగ
న్నుత సుమహాతపోధను లనుగ్రహనిగ్రహశక్తియుక్తు లీ
క్రతువున ఋత్విజుల్ కమలగర్భసమానులు పూర్వదిక్పతి
క్రతువున యాజకోత్తములకంటెఁ బ్రసిద్ధులు సర్వవిద్యలన్.

(నీ సర్పయాగాన్ని చేసే ఋత్విక్కులు ఉత్తములు.)

1_2_223 ఉత్పలమాల వసు - విజయ్

ఉత్పలమాల

అమ్మనుజేంద్రుఁడైన నలుయజ్ఞము ధర్మజురాజసూయయ
జ్ఞమ్ముఁ బ్రయాగఁ జేసిన ప్రజాపతియజ్ఞముఁ బాశపాణియ
జ్ఞమ్మును గృష్ణుయజ్ఞము నిశాకరుయజ్ఞము నీమనోజ్ఞయ
జ్ఞమ్మును నొక్కరూప విలసన్మహిమం గురువంశవర్ధనా.

(నీ యజ్ఞం పూర్వం జరిగిన ప్రసిద్ధమైన యజ్ఞాలతో సమానమైనది.)

1_2_222 తరలము విజయ్ - విక్రమాదిత్య

తరలము

కువలయంబున వారి కోరిన కోర్కికిం దగ నీవు పాం
డవకులంబు వెలుంగఁ బుట్టి దృఢంబుగా నృపలక్ష్మితో
నవనిరాజ్యభరంబు దాల్చినయంతనుండి మఖంబులం
దివిరి యిష్టధనంబు లిచ్చుటఁ దృప్తులైరి మహాద్విజుల్.

(పాండవుల వంశం వెలిగేలా పుట్టి, భూభారం వహించి, యజ్ఞాలు చేస్తూ, ద్విజులకు ధనం ఇవ్వటం వల్ల వారు తృప్తులయ్యారు.)

1_2_221 మత్తేభము వసు - విజయ్

మత్తేభము

రజనీనాథకులై కభూషణుఁడవై రాజర్షివై ధారుణీ
ప్రజ నెల్లన్ దయతోడ ధర్మచరితం బాలించుచుం దొంటి ధ
ర్మజు నాభాగు భగీరథున్ దశరథున్ మాంధాతృ రామున్ రఘున్
విజయుం బోలితి సద్గుణంబుల జగద్విఖ్యాత పారీక్షితా.

(మహారాజా! నువ్వు పూర్వం ప్రసిద్ధులైన రాజులకు సమానమైనవాడివి.)

1_2_220 వచనము వసు - విజయ్

వచనము

అని యాస్తీకుండు వాసుకిప్రముఖుల నాశ్వాసించి సకలవేదవేదాంగ పారగులయిన విప్రవరులతో జనమేజయసర్పసత్త్రసదనంబునకుం జనుదెంచి స్వదేహకాంతి సభాంతరం బెల్ల వెలుంగుచుండ స్వస్తివచనపూర్వకంబుగా నిట్లని స్తుతియించె.

(అని చెప్పి ఆస్తీకుడు సర్పయాగశాలకు వచ్చి జనమేజయుడిని ఇలా కీర్తించాడు.)

1_2_219 కందము వసు - విజయ్

కందము

కడవఁబడి మున్ను వహ్నిం
గడుకొని పడినవియ కాని కద్రూసుతులం
బడనీ నింక నవశ్యము
నుడిగింతును సర్పయాగ మోడకుఁ డింకన్.

(భయపడకండి. ఇకముందు పాములను అగ్నిలో పడనివ్వను. సర్పయాగాన్ని ఆపుతాను.)

-:ఆస్తీకుఁడు సర్పయాగము నివారించుట:-

1_2_218 వచనము విజయ్ - విక్రమాదిత్య

వచనము

బ్రహ్మవచనంబు నిట్టిద కా విని యేలాపుత్త్రుండు మాకుఁ జెప్పె జరత్కారు మహామునికి నిన్ను వివాహంబు సేయుటయు నేతదర్థంబ యింకొక్కనిమేషజంబేని యుపేక్షించిన సకలసర్పప్రళయం బగుం గావున నాస్తీకుండు జనమేజయమహీపాలుపాలికిం బోయి సర్పయాగం బుడిగించి రక్షింపవలయుననిన నయ్యగ్రజువచనంబులు విని జరత్కారువు గొడుకుమొగంబు సూచి భవన్మాతులనియోగంబు సేయు మనిన నాస్తీకుం డిట్లనియె.

(అతడు జనమేజయమహారాజు దగ్గరకు వెళ్లి సర్పయాగం మాన్పించి పాములను రక్షించాలి అని చెప్పగా అన్న మాటలు విని జరత్కారువు ఆస్తీకుడిని అలాగే చేయమన్నది. అతడు ఇలా అన్నాడు.)

1_2_217 కందము విజయ్ - విక్రమాదిత్య

కందము

విమలతపోవిభవంబున
గమలజు నట్టిండ విగతకల్మషుఁ డాస్తీ
కమహాముని యీతని వచ
నమున మహాహికులరక్షణం బగుఁ బేర్మిన్.

(ఆస్తీకుడి మాటలు పాములకు రక్షణ కలిగిస్తాయి.)

1_2_216 కందము వసు - విజయ్

కందము

ప్రస్తుత ఫణిసత్త్రభయ
త్రస్తాత్ముల మైన యస్మదాదుల కెల్లన్
స్వస్తి యొనర్పఁగ నవసర
మా స్తీకున కయ్యె నిప్పు డంబుజనేత్రా.

(సర్పయాగం వల్ల కలిగిన ప్రమాదం నుండి పాములను నీ కుమారుడైన ఆస్తీకుడు కాపాడే సమయం వచ్చింది.)

1_2_215 వచనము వసు - విజయ్

వచనము

పురందరుడును దొల్లి కమలజువాక్యంబున వాసుకిప్రముఖసర్పకులముఖ్యులకు సర్పసత్త్రభయంబు లేమి యెఱింగినవాఁడు గావున వాని నోడకుండుమని చేకొనియుండె నిట వాసుకియు జనమేజయసమారబ్ధసర్పసత్త్రపరిత్రస్తుండై ద్వియోజనత్రియోజనాయామస్థూలవ్యాళనివహంబులు నిజవంశ భ్రాతృవంశజనితంబు లయినవి జననీవాగ్దండపీడితంబు లయి యగ్నికుండంబునబడుటకు శోకించి తనచెలియలి జరత్కారువుం జూచి యిట్లనియె.

(బ్రహ్మ వరం వల్ల వాసుకి మొదలైన సర్పశ్రేష్ఠులకు సర్పయాగం చేత ప్రమాదం లేదన్న విషయం తెలిసిన ఇంద్రుడు తక్షకుడిని భయపడవద్దని చెప్పి ఆదరించాడు. ఇక్కడ వాసుకి సర్పయాగానికి భయపడి, నాగులు అగ్నిలో పడటం చూసి దుఃఖించి, తన చెల్లెలైన జరత్కారువుతో ఇలా అన్నాడు.)

1_2_214 కందము వసు - విజయ్

కందము

తక్షకుఁ డతిభీతుండై
యాక్షణమున నరిగె సురగణాధిప నన్నున్
రక్షింపుమ రక్షింపుమ
రక్షింపుమ యనుచు న ప్పురందరుకడకున్.

(తక్షకుడు భయపడి రక్షించమంటూ ఇంద్రుడి దగ్గరకు వెళ్లాడు.)

1_2_213 వచనము వసు - విజయ్

వచనము

అంత.

(అప్పుడు.)

1_2_212 కందము వసు - విజయ్

కందము

తడఁబడఁ బడియెడు రవమును
బడి కాలెడు రవముఁ గాలి పలుదెఱఁగుల వ్ర
స్సెడు రవమును దిగ్వలయము
గడుకొని మ్రోయించె నురగకాయోత్థితమై.

(ఆ పాములు అగ్నిలో పడే శబ్దం, పడి కాలే శబ్దం, కాలి బ్రద్దలయ్యే శబ్దం దిక్కుల్లో మారుమోగింది.)

1_2_211 మత్తేభము విజయ్ - విక్రమాదిత్య

మత్తేభము

అతివేగకులచిత్తులై పడి రుదాత్తాశీవిషాగ్నుల్ సితా
సితపీతారుణవర్ణదేహులు నవాసృగ్రక్తనేత్రుల్ మహో
న్నతు లేక త్రిక పంచ సప్త నవ నానా మస్తకుల్ పల్వు రు
ద్ధత నాగేంద్రులు బ్రహ్మదండహతి నార్తధ్వానులై వహ్నిలోన్.

(వేగంగా వచ్చి అగ్నిలో పడ్డాయి.)

1_2_210 వచనము వసు - విజయ్

వచనము

మఱియుఁ గోటిశ మానసపూర్ణ శల పాల హలీమక పిచ్ఛిల గౌణప చక్ర కాలవేగ ప్రకాలన హిరణ్యబాహు శరణ కక్షక కాలదంతకాదు లయిన వాసుకి కులసంభవులును బుచ్ఛాండక మండలక పిండసేక్తృ రణేభ కోచ్ఛిఖ శరభ భంగ బిల్వతేజో విరోహణ శిలిశలకర మూక సుకుమార ప్రవేపన ముద్గర శిశురోమ సురోమ మహాహన్వాదులయిన తక్షకకులసంభవులును బారావత పారిజాతయాత్ర పాండర హరిణ కృశ విహంగ శరభ మోద ప్రమోద సంహత్యానాదు లయిన యైరావత కులసంభవులును నేరక కుండవేణి వేణీస్కంధ కుమారక బాహుక శృంగబేర ధూర్తక ప్రాతరాత కాదులయిన కౌరవ్యకులసంభవులును శంకుకర్ణ పిఠరక కుఠార సుఖసేచక పూర్ణాంగద పూర్ణముఖ ప్రహస శకుని దర్యమాహఠ కామఠక సుషేణ మానసావ్యయ భైరవ ముండ వేదాంగ పిశంగ చోద్రపారక వృషభ వేగవత్పిండారక మహాహను రక్తాంగ సర్వసారంగ సమృద్ధ పఠవాసక వరాహక వీరణక సుచిత్ర చిత్రవేగిక పరాశర తరుణక మణిస్కంధారుణ్యాదు లయిన ధృతరాష్ట్రకుల సంభవులును నయి యొక్కొక్క మొగి సహస్రాయుతసంఖ్యలు గలిగి.

(ఎన్నో సర్పాలు వేలసంఖ్యలో.)

1_2_209 కందము విజయ్ - విక్రమాదిత్య

కందము

ధరణిసురమంత్రహోమ
స్ఫురణను వివశు లయి భూరిభుజగప్రభు లొం
డొరుఁ బిలుచుచు నధికభయా
తురు లై కుండాగ్నులందుఁ దొరఁగిరి పెలుచన్.

(యాగప్రభావం వల్ల సర్పరాజులు ఒకరినొకరు పిలిచుకొంటూ, భయంతో, వచ్చి ఆ హోమాగ్నిలో పడ్డారు.)

1_2_208 వచనము వసు - విజయ్

వచనము

అనిన వాని వచనం బవకర్ణించి రాజనియుక్తు లయి చ్యవనకులవిఖ్యాతుండైన చండభార్గవుండు హోతఁగాఁ బింగళుం డధ్వర్యుండుగా శార్ఙ్గరవుండు బ్రహ్మగాఁ గౌత్సుండుద్గాతగా వ్యాసవైశంపాయన పైల జైమిని సుమంతు శుక శ్వేతకేతు మౌద్గ ల్యోద్దాలక మాండవ్య కౌశిక కౌండిన్య శాండిల్య క్రామఠక కోహ లాసిత దేవల నారద పర్వత మైత్రే యాత్రేయ కుండజఠర కాలఘట వాత్స్య శ్రుత శ్రవో దేవశర్మ శర్మద రోమ శోదంక హరిత రురుపులోమ సోమశ్రవసు లాదిగాఁ గల మహామునులు సదస్యులుగా నీలాంబర పరిధానులును ధూమసంరక్తనయనులును నై యాజ్ఞికు లగ్నిముఖంబు సేసి వేల్వం దొడంగిన.

(అన్న అతడి మాటను పెడచెవిని పెట్టి, చాలామంది మహామునులు సదస్యులుగా జనమేజయుడు యజ్ఞాన్ని ప్రారంభించగా.)

1_2_207 కందము వసు - విజయ్

కందము

అనఘా యీయజ్ఞము విధి
సనాథఋత్విక్ప్రయోగసంపూర్ణం బ
య్యును గడచన నేరదు నడు
మన యుడుగును భూసురోత్తమ నిమిత్తమునన్.

(మహారాజా! ఈ యజ్ఞం చివరిదాకా సాగదు. ఒక బ్రాహ్మణుని కారణంగా మధ్యలోనే ఆగిపోతుంది.)

1_2_206 వచనము వసు - విజయ్

వచనము

ఇట్లు కృతనిశ్చయుండై జనమేజయుండు కాశిరాజపుత్రి యయిన వపుష్టమయను మహాదేవి ధర్మపత్నిగా సర్పయాగదీక్షితుం డయి శాస్త్రోపదిష్ట ప్రమాణలక్షణనిపుణశిల్పాచార్యవినిర్మితంబును యజ్ఞోపకరణానేక ద్రవ్యసంభారసంభృతంబును బ్రభూత ధనధాన్యసంపూర్ణంబును స్వస్వనియుక్తక్రియారంభసంభ్రమపరిభ్రమద్బ్రాహ్మణనివహంబును నయిన యజ్ఞా యతనంబున నున్న యారాజునకు నొక్క వాస్తువిద్యానిపుణుం డైన పౌరాణికుం డిట్లనియె.

(ఇది విని, జనమేజయుడు కాశీరాజు కూతురైన వపుష్టమ అనే మహారాణి ధర్మపత్నిగా సర్పయాగం చేయటానికి దీక్షవహించి, యజ్ఞగృహాన్ని నిర్మింపజేయగా ఒక వాస్తునిపుణుడు ఇలా అన్నాడు.)

1_2_205 మత్తకోకిలము వసు - విజయ్

మత్తకోకిల

నీతదర్థమ కాఁగ దేవవినిర్మితం బిది యన్యు లు
ర్వీతలేశ్వర దీనిఁ జేయరు వింటి మేము పురాణ వి
ఖ్యాత మాద్యము నావుడున్ విని కౌరవప్రవరుండు సం
జాత నిశ్చయుఁ డయ్యె నప్పుడు సర్పయాగము సేయఁగన్.

(మహారాజా! ఈ యాగాన్ని నీకోసమే దేవతలు కల్పించారు. ఇతరులు దీన్ని చేయరు. ఇది ప్రసిద్ధమైనది, ప్రాచీనమైనది, అని వారు చెప్పగా విని జనమేజయుడు ఆ యాగం చేయటానికి నిశ్చయించాడు.)

1_2_204 వచనము వసు - విజయ్

వచనము

సర్పయాగం బిట్టిదని శాస్త్రవిధానంబు గలదేని చెప్పుండనిన ఋత్విజులిట్లనిరి.

(సర్పయాగవిధానం చెప్పమని ఋత్విజులను అడగగా వారు ఇలా అన్నారు.)

Saturday, October 15, 2005

1_2_203 చంపకమాల వసు - విజయ్

చంపకమాల

తనవిషవహ్ని మజ్జనకుఁ దక్షకుఁ డెట్లు దహించె నట్ల యే
నును సహమిత్రబాంధవజనుం డగు తక్షకు నుగ్రహవ్యవా
హనశిఖలన్ దహించి దివిజాధిపలోకనివాసుఁ డైన మ
జ్జనకున కీయుదంకునకు సాధుమతంబుగఁ బ్రీతిఁ జేసెదన్.

(తక్షకుడు తన విషాగ్నిలో నా తండ్రిని దహించినట్లే అతడినీ, అతడి బంధుమిత్రులనూ సర్పయాగంలో దహించి నా స్వర్గస్థుడైన తండ్రికీ, ఈ ఉదంకుడికీ ఆనందం కలిగిస్తాను.)

1_2_202 వచనము వసు - విజయ్

వచనము

అనిన విని జనమేజయుండు కోపోద్దీపితచిత్తుండై సర్పయాగము సేయ సమకట్టి పురోహితులను ఋత్విజులను బిలువంబంచి వారల కిట్లనియె.

(అది విని జనమేజయుడు, కోపంతో, సర్పయాగం చేయటానికి నిశ్చయించి, పురోహితులను పిలిపించి, వారితో.)

1_2_201 ఉత్పలమాల వసు - విజయ్

ఉత్పలమాల

కాదన కిట్టిపాటియపకారముఁ దక్షకుఁ డేక విప్రసం
బోధనఁ జేసి చేసె నృపపుంగవ నీవు ననేక భూసురా
పాదిత సర్పయాగమున భస్మము సేయుము తక్షకాది కా
కోదరసంహతిన్ హుతవహోగ్రసమగ్రశిఖాచయంబులన్.

(తక్షకుడు ఈ అపకారాన్ని (శృంగి అనే) ఒక విప్రుడి ప్రేరణ చేత చేశాడు. నీవు కూడా సర్పయాగంలో, తక్షకుడు మొదలైన సర్పాలను భస్మం చేయి.)
(ఇదీ, 1_1_124 ఒకే పద్యం.)

1_2_200 ఉత్పలమాల వసు - విజయ్

ఉత్పలమాల

పెంచితి ధర్మమార్గమునఁ బ్రీతి యొనర్చుచు ధారుణీప్రజన్
మంచి తనేకయాగముల మానుగ దక్షిణ లిచ్చి విప్రులన్
నించితి సజ్జనస్తుతుల నిర్మలమైనయశంబు దిక్కులన్
సంచితపుణ్య సర్వగుణసంపద నెవ్వరు నీ సమానులే.

(ఎన్నో మంచిపనులు చేసిన నీకు సాటి ఎవరన్నా ఉన్నారా?)

1_2_199 కందము విజయ్ - విక్రమాదిత్య

కందము

ఆయుష్మంతుఁడ వై ల
క్ష్మీయుత బాల్యంబునంద మీయన్వయరా
జ్యాయత్తమహీభారం
బాయతభుజ నీవు దాల్చి తభిషిక్తుఁడ వై.

(నీ చిన్నతనంలోనే నీకు రాజ్యాభిషేకం జరిగింది.)

-:జనమేజయ మహారాజు సర్పయాగము సేయుట:-

1_2_198 వచనము విజయ్ - విక్రమాదిత్య

వచనము

తత్పరిజనంబు లందఱు నశనిపాతంబున బెదరి చెదరినట్లు గనుకనిం బఱచి రయ్యేకస్తంభహర్మ్యంబును దక్షకవిషాగ్నిదగ్ధం బయ్యె నట్లు భవజ్జనకుండు పరలోకగతుం డైనం బురోహితపురస్సరానేకభూసురవరులు యథావిధిం బరలోకక్రియలు నిర్వర్తించి రంత.

(పరివారమంతా భయంతో పరుగెత్తగా, తక్షకుడి విషాగ్నిచేత ఆ ఒంటిస్తంభపుమేడ దగ్ధమైంది. అలా నీ తండ్రి మరణించగా అతడికి పురోహితులు యథావిధిగా పరలోకకర్మలు నిర్వహించారు.)

1_2_197 కందము విజయ్ - విక్రమాదిత్య

కందము

కొని వ్రచ్చుడు లోపల న
ల్లనిక్రిమి యై తోఁచి చూడ లత్తుకవర్ణం
బునఁ బామై విషవహ్నులు
దనుకఁగ గురువీరుఁ గఱచి తక్షకుఁ డరిగెన్.

(తినబోగా, అందులో నల్లనిపురుగై కనబడి, చూస్తుండగానే ఎర్రని పాముగా మారి, విషాగ్నులు జ్వలించగా, తక్షకుడు పరీక్షిత్తును కాటువేసివెళ్లాడు.)

1_2_196 ఉత్పలమాల విజయ్ - విక్రమాదిత్య

ఉత్పలమాల

సూరెల నున్న మంత్రులను జుట్టములం గడుఁగూర్చు మిత్త్రులన్
సారబలుండు చూచి మునిశాపదినంబులు వోవుదెంచె నం
భోరుహమిత్త్రుఁ డస్తగిరిఁ బొందెడు నం చొగిఁ దత్ఫలావలుల్
వారలకెల్లఁ బెట్టి యనవద్యుఁడు దా నొకపండు చెచ్చెరన్.

(పరీక్షిత్తు తన పక్కనే ఉన్న మంత్రులను, చుట్టాలను చూసి, "శృంగి శాపదినాలు గడిచాయి. సూర్యుడు అస్తమిస్తున్నాడు", అని, ఆ పండ్లను వారికందరికీ పెట్టి, తాను కూడా ఒక పండును.)

1_2_195 కందము విజయ్ - విక్రమాదిత్య

కందము

వారల నర్హప్రియస
త్కారులఁ గావించి పుచ్చి కాలనియోగ
ప్రేరితుఁడై యమరేంద్రా
కారుఁడు తద్వన్యఫలజిఘత్సాపేక్షన్.

(వారిని సత్కరించి పంపి, వారు తెచ్చిన ఫలాలు తినే కోరికతో.)

1_2_194 చంపకమాల విజయ్ - విక్రమాదిత్య

చంపకమాల

ద్విజవరులం గుమారుల నతిప్రియదర్శను లైన వారి ఋ
గ్యజుషపదక్రమంబులు క్రియన్ గుణియించుచు వచ్చువారి న
గ్గజపురవల్లభుండు గని గ్రక్కున డాయఁగఁ బిల్చి మెచ్చి భా
వజసుభగుండు చేకొనియె వారలు దెచ్చినవాని నన్నిటిన్.

(వేదాలు వల్లిస్తూ వచ్చిన ఆ బ్రాహ్మణయువకులను పరీక్షిత్తు ఆహ్వానించి వారు తెచ్చిన పూలను, పండ్లను స్వీకరించాడు.)

1_2_193 వచనము విజయ్ - విక్రమాదిత్య

వచనము

అట్లు కశ్యపుం గ్రమ్మఱించి తక్షకుండు తత్క్షణంబ నాగకుమారులం బిలిచి మీరలు విప్రుల రయి సురభికుసుమస్వాదువన్యఫలంబులు పలాశపర్ణపుటికలం బెట్టికొని పరీక్షితుపాలికిం జని యిం డని పంచి తానును వారితోడన యదృశ్యరూపుం డయి వచ్చిన.

(తక్షకుడు అలా కశ్యపుడిని మరల్చి, సర్పకుమారులను పిలిచి వారితో, "మీరు బ్రాహ్మణరూపాలు ధరించి, పూలను, పండ్లను, బుట్టలలో పెట్టుకొని పరీక్షిత్తు దగ్గరకు వెళ్లి ఇవ్వండి", అని, తాను కూడా వారివెంట అదృశ్యరూపంలో వెళ్లాడు.)

-:తక్షకవిషాగ్నిచే బరీక్షితుండు హర్మ్యంబుతోడ దగ్ధుం డగుట:-

1_2_192 తేటగీతి విజయ్ - విక్రమాదిత్య

తేటగీతి

ఇప్పురంబున బ్రాహ్మణుం డిందానర్థ
మేఁగి మున్న యావృక్షంబు నెక్కి దాని
తోన దగ్ధుఁడై మఱి దానితోన లబ్ధ
జీవుఁడై వచ్చి జనులకుఁ జెప్పె దీని.

(హస్తినాపురం నుండి అడవికి వెళ్లి, కట్టెల కోసం ఆ చెట్టునెక్కి ఉన్న బ్రాహ్మణుడు ఒకడు తక్షకుడి విషప్రభావానికి ఆ చెట్టుతోనే భస్మమైపోయి కశ్యపుడి మహిమ వల్ల ప్రాణాన్ని తిరిగిపొందివచ్చి ప్రజలకు ఈ విషయాన్ని చెప్పాడు.)

1_2_191 వచనము విజయ్ - విక్రమాదిత్య

వచనము

కశ్యపుండును నప్పుడ యాభస్మచయంబు గూడఁద్రోచి తనమంత్రతంత్రశక్తింజేసి యెప్పటియట్ల వృక్షంబుగాఁ జేసినం జూచి తక్షకుం డతివిస్మయం బంది మునీంద్రా నీవిద్యాబలంబున నిది సంజీవితం బయ్యె నేనియు నతికుపిత విప్రశాపవ్యపగతాయుష్యుం డైన పరీక్షితుండు సంజీవితుండు గానోపండు వానియిచ్చు ధనంబుకంటె నాయం దధికధనంబు గొనిపొ మ్మనినఁ గశ్యపుండును దన దివ్యజ్ఞానంబున నట్లకా నెఱింగి తక్షకుచేత ననంతంబైన యర్థంబు గొని క్రమ్మఱి చనియె విజనం బైన విపినాంతరంబున నైన యయ్యిరువున వృత్తాంతంబు మీరె ట్లెఱింగితి రంటేని వినుము.

(కశ్యపుడు వెంటనే బూడిదగా మారిన ఆ చెట్టును తన మంత్రబలంతో పునర్జీవింపజేశాడు. తక్షకుడు ఆశ్చర్యపోయి, "మునీంద్రా! ఈ చెట్టును బ్రతికించగలిగావేమోగానీ శృంగి శాపం తగిలిన పరీక్షిత్తు చావు తప్పించుకోలేడు. అతడిచ్చే సొమ్ముకన్నా ఎక్కువ నేనిస్తాను. అది తీసుకొని తిరిగివెళ్లు", అనగా కశ్యపుడు అందుకు అంగీకరించి వెళ్లిపోయాడు. జనంలేని అడవిలో జరిగిన ఈ సంభాషణ నాకెలా తెలిసిందని అడుగుతారేమో. వినండి.)

1_2_190 ఆటవెలది వోలం - విజయ్

ఆటవెలది

అయ్యహీంద్ర విషమహానలదగ్ధ మై
విపులపత్త్రదీర్ఘ విటపతతుల
గగనమండలంబుఁ గప్పిన యవ్వట
తరువు భస్మమయ్యెఁ తత్క్షణంబ.

(విశాలమైన ఆ మర్రిచెట్టు, తక్షకుడి విషానికి క్షణంలో భస్మమైంది.)

1_2_189 వచనము వోలం - విజయ్

వచనము

నీమందులు మంత్రంబులు నాయందుం బనిసేయవు క్రమ్మఱి పొమ్ము కాదేని నీవ చూడ నివ్వటవృక్షంబుఁ గఱచి నా విషానలంబున భస్మంబు సేసెద నోపుదేని దీనిని సంజీవితంబుఁ జేయు మని తక్షకుం డావృక్షంబుఁ గఱచిన.

(నీ మందులూ, మంత్రాలూ నా విషయంలో పనిచెయ్యవు. తిరిగి వెళ్లు. నీకు శక్తి ఉంటే, నేను ఈ మర్రిచెట్టును నా విషాగ్నితో దగ్ధం చేస్తాను, తిరిగి బ్రతికించు, అని ఆ చెట్టును కాటువేశాడు.)

1_2_188 కందము వోలం - విజయ్

కందము

అనిన విని నగుచు వాఁడి
ట్లనియెను దక్షకుఁడ నేన యశనినిపాతం
బున బ్రదుకఁగ నగునేనియు
ననఘా మద్విషనిహతుల కగునే బ్రదుకన్.

(అది విని తక్షకుడు నవ్వుతూ ఇలా అన్నాడు, "నేనే ఆ తక్షకుడిని. పిడుగు మీద పడినా చావు తప్పించుకోవచ్చేమో గానీ, నా విషం వల్ల చనిపోతే తిరిగి జీవించలేరు.")

1_2_187 కందము వోలం - విజయ్

కందము

తక్షకుఁ డను పన్నగుఁడు ప
రీక్షితుఁ గఱచునటె నేఁ డరిందము నతనిన్
రక్షింపఁగఁ బోయెద శుభ
దక్షిణు నా మంత్రతంత్రదాక్షిణ్యమునన్.

(పరీక్షిత్తును ఈ రోజు తక్షకుడు తన విషంతో చంపబోతున్నాడు, నా మంత్రశక్తితో అతడిని కాపాడేందుకు వెళ్తున్నాను.)

1_2_186 వచనము వోలం - విజయ్

వచనము

అని విచారించి హస్తినపురంబునకుం బోవు వానిఁ దక్షకుండు వృద్ధవిప్రుండయి వనంబులో నెదురం గని మునీంద్రా యెటవోయె దేమికార్యంబున కనిన వానికిం గశ్యపుం డిట్లనియె.

(అని ఆలోచించి హస్తినాపురానికి వెళ్తున్న కశ్యపుడి దగ్గరకు తక్షకుడు ఒక ముసలి బ్రాహ్మణుడి రూపంలో వెళ్లి, "మునీంద్రా! ఎక్కడికి వెళ్తున్నావు? ఏమి చేయడానికి?", అని అడగగా కశ్యపుడు ఇలా అన్నాడు.)

1_2_185 తేటగీతి వోలం - విజయ్

తేటగీతి

ధరణియెల్లను రక్షించు ధర్మచరితు
నాపరీక్షితు రక్షించి యతనిచేత
నపరిమితధనప్రాప్తుండ నగుదు కీర్తి
యును ధనంబు ధర్మము గొను టుఱదె నాకు.

(పరీక్షిత్తును తక్షకుడి విషం నుండి కాపాడి అతడి దగ్గర ధనం పొందుతాను.)

1_2_184 వచనము వోలం - విజయ్

వచనము

అట్టి కశ్యపుండను బ్రహ్మర్షి శృంగిశాపంబునఁ బరీక్షితుండు తక్షకదష్టుండగు నేఁడు సప్తమదివసం బటె యేను వాని నపేతజీవు సంజీవితుం జేసి నా విద్యాబలంబు మెఱయుదు మఱి యదియునుం గాక.

(కశ్యపుడు ఇలా ఆలోచించాడు - పరీక్షిత్తు చనిపోతే అతడిని పునర్జీవింపజేసి నా విద్యాబలాన్ని ప్రదర్శిస్తాను. అదీగాక.)

1_2_183 మధ్యాక్కర వోలం - విజయ్

మధ్యాక్కర

ధరణిఁ జరాచరభూతసంఘంబుఁ దమవిషవహ్ని
నురగంబు లేర్చుచు నునికి కలిగి పయోరుహగర్భుఁ
డురగవిషాపేత జీవసంజీవనోపదేశంబు
గరుణఁ గశ్యపునకు నిచ్చె నఖిలలోకహితంబుపొంటె.

(పాముల విషం వల్ల చనిపోయినవారిని తిరిగి జీవింపజేసే మంత్రాన్ని బ్రహ్మ కశ్యపుడికి ఉపదేశించాడు.)

-:కశ్యపునకుఁ దక్షకుఁడు గోరినధనం బిచ్చి మరల్చుట:-

1_2_182 వచనము వోలం - విజయ్

వచనము

మఱియు విషాపహరంబు లయి వీర్యవంతంబు లయిన మంత్రతంత్రంబులు గలిగి యాజ్ఞాసిద్ధులైన విషవైద్యుల నొద్దఁ బెట్టికొని పరీక్షితుం డుండు నంత నట తక్షకుండు విప్రవచనప్రచోదితుం డయి పరీక్షితునొద్దకు నెవ్విధంబునఁ బోవనగునో యని చింతించుచుండె నటఁ దొల్లి.

(పరీక్షిత్తు విషవైద్యులను దగ్గర ఉంచుకొని ఉండగా; అక్కడ తక్షకుడు పరీక్షిత్తు దగ్గరకు వెళ్లడం ఎలా అని ఆలోచించసాగాడు. అంతకు ముందే.)

1_2_181 మత్తేభము వోలం - విజయ్

మత్తేభము

సకలోర్వీశుఁ డతి ప్రయత్నపరుఁడై సర్వక్రియాదక్షత
క్షకకోటుల్ పని సేయఁగా ఘనతరైకస్తంభహర్మ్యంబుఁ ద
క్షకభీతిన్ రచియింపఁ బంచి దృఢరక్షన్ దానిలో నుండె బా
యక రాత్రిందివజాగరూక హితభృత్యామాత్యవర్గంబుతోన్.

(పరీక్షిత్తు రక్షణకోసం ఒంటిస్తంభపుమేడ కట్టించి అందులో నివసించసాగాడు.)

Friday, October 14, 2005

1_2_180 వచనము వోలం - విజయ్

వచనము

అని చెప్పి గౌరముఖుం డరిగినం బరీక్షితుండు పరిక్షీణహృదయుండై తన చేసిన వ్యతిక్రమంబునకు సంతాపించి శమీకు నుపశమనంబునకు మెచ్చి శృంగి శాపంబునకు వెఱచి మంత్రివర్గంబుతో విచారించి యాత్మరక్షయం ద ప్రమాదుండై.

(పరీక్షిత్తు తన తప్పుకు బాధపడి అప్రమత్తంగా ఉండసాగాడు.)

1_2_179 సీసము + ఆటవెలది వోలం - విజయ్

సీసము

అడవిలో నేకాంతమతి ఘోరతపమున
        నున్న మాగురులపై నురగశవము
వైచుట విని యల్గి వారితనూజుండు
        శృంగి యన్వాఁడు కార్చిచ్చునట్టి
శాపంబు నీకిచ్చె సప్తాహములలోన
        నాపరీక్షితుఁడు నాయలుకఁ జేసి
తక్షకవిషమున దగ్ధుఁ డయ్యెడ మని
        దానికి గురులు సంతాప మంది

ఆటవెలది

భూతలేశ నన్నుఁ బుత్తెంచి రిప్పుడు
తద్భయంబు లెల్లఁ దలఁగునట్టి
మంత్రతంత్రవిధు లమర్చి యేమఱకుండు
నది నిరంతరంబు ననియుఁ గఱప.

(శృంగి శాపం గురించి చెప్పాడు.)

1_2_178 వచనము వోలం - విజయ్

వచనము

నా వచనం బమోఘం బనిన శమీకుండు శోకాకులితచిత్తుండై తన శిష్యున్
గౌరముఖుం డనువానిం బిలిచి దీని నంతయుఁ బరీక్షితున కెఱింగించి తక్షకువలని
భయంబు దలంగునట్టి యుపాయంబు సేసికొమ్మని చెప్పి రమ్మనిన వాఁడు నప్పుడ
పరీక్షితు పాలికిం జని యిట్లనియె.

(నా మాట వ్యర్థం కాదు అని శృంగి చెప్పగా, శమీకుడు బాధపడి, తన శిష్యులను పిలిచి, తక్షకుడి వల్ల కలగబోయే ఆపద గురించి పరీక్షిత్తుకు చెప్పమని పంపగా గౌరముఖుడనే శిష్యుడు పరీక్షిత్తు దగ్గరకు వెళ్లి.)

1_2_177 కందము వోలం - విజయ్

కందము

అలుకమెయి మున్న పలికితి
నలుకని నాపలుకు తీక్ష్ణమై యింతకు ను
జ్జ్వలదహనాకృతిఁ దక్షకుఁ
దలరఁగఁ బ్రేరేఁప కేల తా నెడ నుడుగున్.

(కోపంలో శపించాను. నా శాపం ఇప్పటికే తక్షకుడిని ప్రేరేపించి ఉంటుంది.)

1_2_176 వచనము వోలం - విజయ్

వచనము

అతండు మృగయావ్యసనంబున నపరిమితక్షుత్పిపాసాపరిశ్రాంతుం డయి యెఱుంగక నాకవజ్ఞఁ జేసె నేనును దాని సహించితి నమ్మహాత్మునకు నీయిచ్చిన శాపంబుఁ గ్రమ్మఱింప నేర్తేని లగ్గగు ననిన శృంగి యిట్లనియె.

(అలసటలో ఆ రాజు చేసిన అవమానాన్ని నేను సహించాను. నీ శాపాన్ని ఉపసంహరిస్తే మంచిది అని శమీకుడు చెప్పగా శృంగి ఇలా అన్నాడు.)

Thursday, October 13, 2005

1_2_175 ఉత్పలమాల వోలం - విజయ్

ఉత్పలమాల

క్షత్రియవంశ్యులై ధరణిఁ గావఁగ బుట్టినవారు బ్రాహ్మణ
క్షత్రియ వైశ్య శూద్రు లనఁగాఁగల నాలుగుజాతులన్ స్వచా
రిత్రము దప్పకుండఁగఁ బరీక్షితు కాచినయట్లు రామమాం
ధాతృరఘుక్షితీశులు ముదంబునఁ గాచిరె యేయుగంబులన్.

(రాముడు, మాంధాత, రఘువు మొదలైన రాజులు కూడా పరీక్షిత్తు రక్షించినట్లు ప్రజలని రక్షించారా?)

1_2_174 వచనము వోలం - విజయ్

వచనము

క్షమ విడిచి నీవు దృష్టాదృష్టవిరుద్ధం బైన క్రోధంబుఁ జేకొని సకలక్షమారక్షకుండైన పరీక్షితునకుం బరీక్షింపక శాపంబిచ్చి చెట్టసేసితివి రాజరక్షితులై కాదె మహామును లతి ఘోరతపంబు సేయుచు వేదవిహిత ధర్మంబులు నడపుచు మహాశక్తిమంతు లయి యున్నవా రట్టిరాజుల కపకారంబు దలంచునంతకంటె మిక్కిలిపాతకం బొండెద్ది మరియు భరతకుల పవిత్రుండైన పరీక్షితు రాజసామాన్యుంగా వగచితే.

(కోపంలో ఆ రాజును శపించి తప్పుచేశావు.)

1_2_173 కందము వోలం - విజయ్

కందము

క్షమలేని తపసితపమును
బ్రమత్తు సంపదయు ధర్మబాహ్యప్రభు రా
జ్యము భిన్నకుంభమున తో
యములట్టుల యధ్రువంబు లగు నివి యెల్లన్.

(ఓర్పులేని ముని తపస్సు, జాగ్రత్తలేనివాడి డబ్బు, ధర్మంలేని రాజు ప్రభుత్వం - ఇవి పగిలిన కుండలోని నీటిలా అస్థిరమైనవి.)

1_2_172 కందము వోలం - విజయ్

కందము

క్రోధమ తపముం జెఱచును
గ్రోధమ యణిమాదు లైన గుణములఁ బాపుం
గ్రోధమ ధర్మక్రియలకు
బాధ యగుం గ్రోధిగాఁ దపస్వికిఁ జన్నే.

(కోపం ఎన్నో అనర్థాలకు కారణం. తపస్సుచేసే మునికి కోపం తగదు.)

1_2_171 వచనము వోలం - విజయ్

వచనము

కని యయ్యురగకళేబరంబుఁ బాఱవైచి తత్క్షణంబ ప్రబుద్ధనయనుండైన తండ్రి కభివాదనంబు సేసి బాష్పపూరితనయనుండై శృంగి పరీక్షితు నుద్దేశించి తనచేసిన శాపస్థితి సెప్పిన విని శమీకుండు గరం బడలి యిట్లనియె.

(చూసి, పాముశవాన్ని తొలగించి, తండ్రికి నమస్కరించి, పరీక్షితుడికి ఇచ్చిన శాపం గురించి చెప్పగా శమీకుడు బాధపడి ఇలా అన్నాడు.)

Tuesday, October 11, 2005

1_2_170 కందము వోలం - విజయ్

కందము

ఉరగకళేబర మంసాం
తరమునఁ బడి వ్రేలుచునికి దలఁపక యచల
స్థిరుఁడై పరమధ్యానా
వరతేంద్రియవృత్తి నున్నవాని శమీకున్.

(పాము మెడపై వేలాడుతున్న విషయం కూడా పట్టించుకోకుండా ధ్యానంలో ఉన్న శమీకమునిని.)

1_2_169 వచనము వోలం - విజయ్

వచనము

శాపజలంబు లెత్తికొని విజనం బైన విపినాతరంబున విజితేంద్రియుండై మొదవులచన్నులు వత్సంబులు గుడుచునప్పు డుద్గతంబగు పయఃఫేనంబ తన కాహారంబుగా మౌనవ్రతంబునం దపంబు సేయుచున్న మహావృద్ధు మదీయజనకు నవమానించిన పరీక్షితుండు నేఁడు మొదలుగా సప్తదివసంబులలోనఁ దక్షకవిషాగ్ని దగ్ధుండై యమసదనంబున కరిగెడు మని శాపం బిచ్చి తండ్రిపాలికిం జని.

(తన తండ్రిని అవమానించిన పరీక్షిత్తు మరో ఏడు రోజుల్లో తక్షకుడి విషం వల్ల మరణిస్తాడని శపించి శమీకుడి దగ్గరకు వెళ్లాడు.)

1_2_168 కందము వోలం - విజయ్

కందము

తనజనకు నఱుతఁ బవనా
శనశవముఁ దగిల్చి రాజసమునఁ బరీక్షి
జ్జనపాలు చనుట కృశుఁ డను
మునివలన నెఱింగి కోపమూర్ఛాన్వితుఁడై.

(కృశుడనే ముని ద్వారా పరీక్షిత్తు చేసిన పని తెలుసుకొని కోపంతో.)

1_2_167 ఆటవెలది వోలం - విజయ్

ఆటవెలది

ఆశమీకుపుత్త్రు డంబుజసంభవు
గుఱిచి భక్తితోడ ఘోరతపము
సేయుచున్న సుప్రసిద్ధుండు శృంగియ
న్వాఁడు భృంగిసముఁ డవంధ్యకోపి.

(శమీకుడి కుమారుడు శృంగి.)

1_2_166 వచనము వోలం - విజయ్

వచనము

కని మునీంద్రా నాచేత నేటువడి మృగం బమ్ముతోన యిట వచ్చె నది యెక్కడం బాఱె నీ వెఱుంగుదేని చెప్పుమనిన నమ్ముని మౌనవ్రతుండు గావునఁ బలుకకున్నం గినిసి తత్సమీపంబున నపగత ప్రాణంబై పడియున్న పాముం దనవింటికొప్పున నెత్తి యమ్మునియఱుతం దగులవైచి క్రమ్మఱి హస్తిపురంబునకు వచ్చియున్నంత.

(పరీక్షిత్తు అతడిని ఆ లేడి గురించి అడిగాడు. అతడు మౌనవ్రతం ధరించి ఉన్న కారణాన సమాధానం చెప్పకపోగా, పరీక్షిత్తు అక్కడే చచ్చిపడి ఉన్న ఒక పామును ఆ ముని మెడలో తగిలించి హస్తినాపురానికి తిరిగివచ్చాడు.)

1_2_165 పృథ్వీవృత్తము వోలం - విజయ్

పృథ్వీవృత్తము

అమిత్త్రమదభేది యొక్కరుఁడ యమ్మృగాన్వేషణ
భ్రమాకులితచిత్తుఁడై తగిలి పాఱుచున్ ముందటన్
శమీకుఁ డనువాని నొక్కమునిసత్తమున్ సంతత
క్షమాదమసమన్వితుం గనియెఁ గాననాంతంబునన్.

(అడవి చివరన తపస్సుచేస్తున్న శమీకుడనే మునిని చూశాడు.)

Monday, October 10, 2005

1_2_164 వచనము వోలం - విజయ్

వచనము

భవత్పితృప్రపితామహుం డైన పాండురాజునుంబోలె మృగయాసక్తుండై యొక్కనాఁడు మహాగహనంబులఁ బెక్కుమృగంబుల నెగచి చంపి తన చేత నేటువడి పాఱిన మృగంబు వెంటఁ దగిలి మహాధనుర్ధరుండై యజ్ఞమృగంబు పిఱుందం బఱచు రుద్రుండునుం బోలె.

(నీ తండ్రికి ముత్తాత అయిన పాండురాజులా వేటలో ఆసక్తిగల పరీక్షిత్తు, ఒకరోజు అడవిలో చాలా జంతువులను చంపి, తన బాణపుదెబ్బ తిన్న ఒక లేడిని అనుసరిస్తూ.)

1_2_163 సీసము + ఆటవెలది వోలం - విజయ్

సీసము

అభిమన్యునకు విరాటాత్మజ యైన యు
        త్తరకును బుట్టిన ధర్మమూర్తి
కౌరవాన్వయపరిక్షయమున నుదయించి
        ప్రథఁ బరీక్షితుఁడు నాఁబరఁగువాఁడు
ధర్మార్థకామముల్ దప్పక సలుపుచుఁ
        బూని భూప్రజ నెల్లఁ బుణ్యచరిత
ననఘుఁడై రక్షించి యఱువది యేఁడులు
        రాజ్యంబు సేసిన రాజవృషభుఁ

ఆటవెలది

డధిక ధర్మమార్గుఁడైన నీయట్టి స
త్పుత్త్రుఁ బడసి యున్న పుణ్యుఁ డన్య
నాథమకుటమణిగణ ప్రభారంజిత
పాదపంకజుండు భరతనిభుఁడు.

(అభిమన్యుడికీ విరాటుని కూతురైన ఉత్తరకూ కౌరవవంశవినాశనం జరిగే సమయంలో పరీక్షితుడు జన్మించాడు. అతడు భరతుడంతటి గొప్పవాడు.)

-:జనమేజయునకుఁ బరీక్షితు శాపకారణంబు మంత్రులు చెప్పుట:-

Sunday, October 09, 2005

1_2_162 వచనము వోలం – విజయ్

వచనము

అట జనమేజయుండు దక్షకవిషానలంబునం దన జనకు పంచత్వం బుదంకు వలన నెఱింగి మంత్రులం జూచి యిది యేమి నిమిత్తంబు దీని సవిస్తరంబుగాఁ జెప్పుం డనిన మంత్రు లిట్లనిరి.

(అక్కడ జనమేజయుడు తక్షకుడి విషం చేత తన తండ్రి మరణించాడనే విషయం ఉదంకుడి ద్వారా తెలుసుకొని మంత్రులను ఆ వృత్తాంతం వివరించమని అడిగాడు.)

1_2_161 తేటగీతి వోలం - విజయ్

తేటగీతి

చ్యవనసుతుఁ డైన ప్రమతితోఁ జదివె సకల
వేదవేదాంగములు నిజవిమలబుద్ధి
నెఱిఁగె సకలశాస్త్రంబుల నెల్ల యందు
నధిక సాత్త్వికుఁ డాస్తీకుఁ డనఁగ జనులు.

(చ్యవనుడి కుమారుడైన ప్రమతి దగ్గర ఆస్తీకుడు వేదవేదాంగాలను, శాస్త్రాలను అధ్యయనం చేశాడు.)

1_2_160 కందము విజయ్ - విక్రమాదిత్య

కందము

ఆపూర్ణతేజుఁ డపగత
పాపుఁ డపాకృతభవానుబంధుఁడు నిజమా
తాపితృపక్షప్రబల భ
యాపహుఁ డాస్తీకుఁ డుదితుఁ డై పెరిగెఁ బ్రభన్.

(గొప్పవాడైన ఆస్తీకుడు పుట్టి పెరగసాగాడు.)

1_2_159 వచనము శ్రీకాంత్ - వంశీ

వచనము

నీవు నా కవమానంబు దలంచితివి నీయొద్ద నుండనొల్లఁ దొల్లి నీకు నాచేసిన సమయంబు నిట్టిద నీగర్భంబున నున్నవాఁడు సూర్యానలసమప్రభుండైన పుత్త్రుం డుభయకులదుఃఖోద్ధరణసమర్థుండు సుమ్ము నీవు వగవక నీయగ్రజునొద్ద నుండు మని జరత్కారువు నూరార్చి జరత్కారుండు తపోవనంబునకుం జనియె జరత్కారువును దన యగ్రజుండైన వాసుకియొద్దకు వచ్చి తద్వృత్తాంతం బంతయు నెఱింగించి యుండునంత.

("నన్ను నిద్రలేపి అవమానించావు. ఇంతకు ముందే చెప్పినట్లు నిన్ను విడిచిపెడుతున్నాను. నీకు పుట్టబోయేవాడు చాలా గొప్పవాడు. విచారించక నీ అన్న దగ్గర ఉండు", అని ఆమెకు చెప్పి తపస్సుచేసుకోవటానికి అడవికి వెళ్లిపోయాడు.)

1_2_158 కందము శ్రీకాంత్ - వంశీ

కందము

ఇనుఁ డస్తమింపఁ బోయిన
ననఘా బోధింపవలసె ననవుడు నామే
ల్కనునంతకు నుండక యినుఁ
డొనరఁగ నస్తాద్రి కేఁగ నోడఁడె చెపుమా.

(సూర్యుడు అస్తమించబోవటం చూసి నిద్రలేపాననగా అతడు, "సూర్యుడు నేను నిద్రలేచేవరకూ అస్తమించటానికి భయపడడా? చెప్పు")

1_2_157 సీసము + ఆటవెలది శ్రీకాంత్ - వంశీ

సీసము

సంధ్యలం దొనరించు సద్విధుల్ గడచిన
        ధర్మలోపం బగు దడయ కేల
బోధింప వై తని భూసుర ప్రవరుండు
        పదరునో బోధింపఁబడి యవజ్ఞ
దగునె నా కిట్లు నిద్రాభంగ మొనరింప
        నని యల్గునో దీని కల్గెనేని
యలుకయ పడుదుఁగా కగునె ధర్మక్రియా
        లోపంబు హృదయంబులో సహింప

ఆటవెలది

నని వినిశ్చితాత్మయై నిజపతిఁ బ్రబో
ధించె మునియు నిద్ర దేఱి యలిగి
యేల నిద్ర జెఱచి తీవు నావుడు జర
త్కారు విట్టు లనియెఁ గరము వెఱచి.

(నిద్రలేపకపోతే కర్మలోపం జరిగిందని కోపగిస్తాడేమో? లేపితే నిద్రకు ఆటంకం కలిగించినందుకు కోపిస్తాడేమో? నిద్రలేపినందుకు కోప్పడితే కోపాన్ని భరిస్తాను గాక! ధర్మానికి లోపం జరగకూడదు అని నిశ్చయించుకొని అతడిని మేల్కొలిపింది. అతడు నిద్రచెడినందుకు కోపంతో ఎందుకు నిద్రాభంగం చేశావు అని అడగగా ఆమె భయపడుతూ ఇలా అన్నది.)

1_2_156 వచనము శ్రీకాంత్ - వంశీ

వచనము

అక్కోమలి యొక్కనాఁడు దన కుఱువు దలయంపిగాఁ గృష్ణాజినాస్తరణంబున నిజనాథుండు నిద్రితుండై యన్నయవసరంబున నాదిత్యుం డస్తగిరిశిఖరాసన్నుం డగుటయు సంధ్యాసమయోచితక్రియలు నిర్వర్తింపఁ దదాశ్రమవాసులైన మునులు గడంగుటం జూచి యాత్మగతంబున.

(ఒకరోజు జరత్కారుడు నిద్రిస్తున్న సమయంలో, సూర్యాస్తమయం అవుతుండగా, ఆ ఆశ్రమవాసులు సంధ్యావందనం మొదలైనవి చేయటానికి సిద్ధమవటం చూసి, జరత్కారువు తనలో.)

1_2_155 కందము శ్రీకాంత్ - వంశీ

కందము

అనవరతభక్తిఁ బాయక
తనపతికిం బ్రియము సేసి తద్దయు గర్భం
బనురక్తిఁ దాల్చి యొప్పెను
దినకరగర్భ యగు పూర్వదిక్సతి వోలెన్.

(తరువాత ఆమె గర్భం ధరించి, సూర్యుడు గర్భంలో ఉన్న తూర్పు దిక్కు అనే కాంతలా ప్రకాశించింది.)

1_2_154 కందము శ్రీకాంత్ - వంశీ

కందము

వాలుపయి నడచున ట్ల
బ్బాలిక నడునడ నడుంగి భయమున నియమా
భీలుఁడగు పతికిఁ బవళుల్
రేలును నేమఱక పరిచరించుచునుండెన్.

(జరత్కారువు కత్తిమీద నడుస్తున్నట్లు, భయంతో, పొరపాటు పడకుండా, శ్రద్ధతో భర్తకు సేవలు చేస్తూ ఉండేది.)

1_2_153 వచనము శ్రీకాంత్ - వంశీ

వచనము

అనిన నొడంబడి జరత్కారుండు సనామ యగుటంజేసి యక్కన్యకను వివాహంబై ప్రథమసమాగమంబునం దన ధర్మపత్నికి సమయంబు సేసె నాకు నీ వెన్నండేని యవమానంబు దలంచితి నాఁడ నిన్నుం బాసి పోవుదుననిన నాఁటంగోలె.

(జరత్కారుడు ఆమెను పెళ్లాడి తన భార్యతో, "నాకు నువ్వు ఎప్పడైతే అగౌరవం తలపోస్తావో అప్పుడే నిన్ను విడిచి వెళ్లిపోతాను", అని పలికాడు. అప్పటినుండి.)

1_2_152 శార్దూలము శ్రీకాంత్ - వంశీ

శార్దూలము

ధన్యం బయ్యె భవత్కులం బతికృతార్థం బయ్యె నస్మత్కులం
బన్యోన్యానుగుణాభిధానములఁ జిత్తానంద మొందెన్ వివే
కన్యాయాన్విత భూసురోత్తమ జరత్కారూ జగన్మాన్య యి
క్కన్యాభిక్షఁ బరిగ్రహింపుము జరత్కారున్ మదీయానుజన్.

(నీకూ, నా చెల్లెలికీ ఒకరికొకరికి తగిన గుణాలున్నాయి కాబట్టి ఈ జరత్కారువును వివాహార్థం స్వీకరించు.)

1_2_151 వచనము శ్రీకాంత్ - వంశీ

వచనము

ఇట్లు జరత్కారుండు వివాహసపేక్షం బ్రతీక్షించుచున్న వాసుకియుం దన చారులవలన నంతయు నెఱింగి నిజసహోదరియైన జరత్కారుం దోడ్కొని జరత్కారుమహమునిపాలికిం బోయి యిట్లనియె.

(జరత్కారుడు వివాహం కోసం ఎదురుచూస్తున్న సంగతి వాసుకి తెలుసుకొని తన చెల్లెలైన జరత్కారువును వెంటతీసుకొని అతడి దగ్గరకు వెళ్లి ఇలా అన్నాడు.)

1_2_150 తరువోజ శ్రీకాంత్ - వంశీ

తరువోజ

అనవరత వ్రతాయాసఖేదమున నతికృశం బగుచున్న యంగంబునందుఁ
దనరి యేర్సడ సిరల్ దద్దయు ముదిమిఁ దల వడంకుచునుండఁ దన పితృవరుల
ఘనముగా నూర్ధ్వాభిగమనులఁ జేయఁ గడఁగి వివాహంబుగా జరత్కారుఁ
డనఘుండు దనకోర్కి కనురూప యైనయట్టి కన్యకఁ గానఁడయ్యె మర్త్యమున.

(తనకు తగిన కన్య జరత్కారుడికి భూలోకంలో కనపడలేదు.)

1_2_149 వచనము శ్రీకాంత్ - వంశీ

వచనము

కావున నీవు కృతదారపరిగ్రహుండవై సంతానంబు వడసి మమ్ము నూర్ధ్వలోకగతులం జేయు మనిన జరత్కారుం డట్లేని నాకు సనామ్నియయినదాని వివాహంబు గావలయు నని వారికి నమస్కరించి వీడ్కొని సనామకన్యాన్వేషణపరుండై భూవలయం బెల్లఁ గలయం గ్రుమ్మరి.

(కాబట్టి పెళ్లిచేసుకొని, సంతానం పొంది మమ్మల్ని ఊర్ధ్వలోకాలకు పంపమనగా జరత్కారుడు తనతో సమానమైన పేరు గల కన్యను పెళ్లి చేసుకుంటానని వారికి నమస్కరించి అలాంటి కన్యను వెదుకుతూ భూచక్రమంతా తిరిగి.)

-: జరత్కారుండు వివాహంబు చేసికొనఁబూనుట:-

1_2_148 చంపకమాల కిరణ్ - వంశీ

చంపకమాల

తగియెడు పుత్త్రులం బడసి ధర్మువు దప్పక తమ్ము నుత్తముల్
పొగడఁగ మన్మహామతులు పొందుగతుల్ గడు ఘోరనిష్ఠతోఁ
దగిలి తపంబు సేసియును దక్షిణ లిమ్ముగ నిచ్చి యజ్ఞముల్
నెగడఁగఁ జేసియుం బడయు నేర రపుత్త్రకు లైన దుర్మతుల్.

(పుత్రులు గల సజ్జనులు పొందే ఉత్తమలోకాలను పుత్రులు లేని దుర్జనులు ఎన్ని యజ్ఞాలు చేసినా పొందలేరు.)

1_2_147 వచనము కిరణ్ - వంశీ

వచనము

అనిన నమ్మహామునులు జరత్కారుపల్కులకు సంతసిల్లి యిట్లనిరి.

(ఆ మునులు సంతోషించి ఇలా అన్నారు.)

1_2_146 కందము కిరణ్ - వంశీ

కందము

మిమ్మిట్లు చూచి మీకు హి
తమ్మెట్లగు నట్ల కా ముదంబున దారా
ర్థమ్ము ప్రవర్తింపఁగఁ జి
త్త మ్మిప్పుడు పుట్టె నాకు ధర్మస్థితిమై.

(ఇలా వేలాడుతున్న మిమ్మల్ని చూసి మీకు మేలు జరగటం కోసం పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాను.)

1_2_145 కందము వంశీ - శ్రీకాంత్

కందము

మీరలు నాపితృదేవత
లారాధ్యుల రేను మీకు నాత్మజుఁడ జర
త్కారుఁ డనువాఁడు ముందఱ
దారపరిగ్రహము సేయఁ దగులదు బుద్ధిన్.

(జరత్కారుడనే మీ కుమారుడిని నేనే. పెళ్లిచేసుకోవాలనే ఆలోచన ఇంతకుముందు నాకు లేదు.)

1_2_144 వచనము కిరణ్ - వంశీ

వచనము

అనిన విని జరత్కారుం డతికారుణ్యచిత్తుం డయి యపత్యార్థం బవశ్యంబు వివాహంబు గావలయు నని యెంతయుం బ్రొద్దు చింతించి తనపితృవర్గంబున కిట్లనియె.

(జరత్కారుడు ఇది విని సంతానం కోసం పెళ్లిచేసుకోవాలని ఆలోచించి వారితో ఇలా అన్నాడు.)

1_2_143 తేటగీతి కిరణ్ - వంశీ

తేటగీతి

నీవు మా చుట్టమవపోలె నెమ్మితోడ
నవహితుండవై మాపల్కు లాదరించి
తా జరత్కారుఁ గని చెప్పవయ్య వాని
నెఱుఁగుదేని మాపడియెడు నీయవస్థ.

(మా బంధువులా మా మాటలు విన్నావు. ఆ జరత్కారుడు నీకు తెలిస్తే మా అవస్థగురించి అతడికి చెప్పు.)

1_2_142 వచనము కిరణ్ -వంశీ

వచనము

మందభాగ్యుల మయిన మావంశంబున జరత్కారుం డను పాపకర్ముండు
పుట్టి దారపరిగ్రహంబు సేయను సంతానంబు వడయను నొల్లకున్నవాఁ
డే మాతని పితృపితామహులము మాపట్టిన యవురుగంట వేళ్ళెల్లం గాలుండు
మూషికవ్యాజంబునం దరతరంబ కొఱికిన నొక్కవేర తక్కి యున్నయది
యదియును జరత్కారుం డనపత్యుం డైనం దెగు నే మధఃపాతుల మగుదు
మాతం డపత్యంబు వడసెనేని యూర్ధ్వగతుల మగుదుము.

(మా వంశంలో జరత్కారుడనే పాపి పెళ్లి చేసుకోవటానికీ, సంతానం పొందటానికీ ఒప్పుకోవటంలేదు. మేము అతని తండ్రితాతలము. ఈ దుబ్బువేళ్లన్నీ యముడు ఎలుక రూపంలో కొరికేయగా ఒక్కవేరు మాత్రం మిగిలింది. జరత్కారుడు సంతానం పొందకపోతే అది కూడా తెగి మేము అధోలోకాల్లో పడతాము, లేకపోతే పైలోకాలకి వెళ్తాము.)

1_2_141 కందము వంశీ - శ్రీకాంత్

కందము

అనఘ యిది యేటితప మే
మనుపమ దుఃఖితుల మగుట నాధారము లే
కను సంతానోచ్ఛేదం
బున వ్రేలెద మధమలోకమున తెరువు చనన్.

("ఇది తపస్సేమిటి? మా తరువాత సంతానం లేకపోవటం వల్ల ఇలా వేలాడుతున్నాము")

1_2_140 కందం కిరణ్ - వంశీ

కందము

కడునుగ్రము దల క్రిందుగఁ
బడి వ్రేలుట యిదియు నొక తపంబొకొ నా కే
ర్పడఁ జెప్పుఁ డీతపం బేఁ
దొడఁగెద ననవుడును నయ్యధోముఖవిప్రుల్.

(తలకిందులుగా వేలాడటం చాలా కష్టం. ఇది కూడా ఒకరకమైన తపోవిశేషమా? నేను కూడా చేస్తాను అనగా ఆ మునులు ఇలా అన్నారు.)

1_2_139 వచనము కిరణ్ - వంశీ

వచనము

తపస్స్వాధ్యాయబ్రహ్మచర్యవ్రతంబులం జేసి ఋషులఋణంబుల
నీఁగుచుఁ బరిభ్రమించువాఁడు వనంబులో నొక్కపల్వలంబు గని యందు
మూషికవిలూనంబయి యొక్కమూలంబు తక్కియున్న వీరణతృణ
స్తంబంబు నవలంబించి తలక్రిందై యాదిత్యకిరణంబు లాహారంబుగా
వ్రేలుచున్న ఋషుల గొందఱం జూచి డాయం బోయి జరత్కారుండిట్లనియె.

(ఇలా తిరిగే జరత్కారుడికి ఒకరోజు అడవిలో ఒక కొలను కనిపించింది. అందులో ఎలుకలు కొరకటంచేత ఒక్కవేరు మాత్రమే మిగిలి ఉన్న గడ్డిదుబ్బును పట్టుకొని తలకిందులుగా, సూర్యకిరణాలే ఆహారంగా, వేలాడుతున్న కొందరు మునులను చూసి ఇలా అన్నాడు.)

1_2_138 కందము కిరణ్ - వంశీ

కందము

ఘోరవ్రతములు సలుపుచు
దారపరిగ్రహము సేయుఁ దా నొల్లక సం
సారపునర్భవభీతి న
పారవ్యామోహపాశబంధచ్యుతుఁడై.

(ఘోరవ్రతాలు చేస్తూ, భార్యను గ్రహించక, పునర్జన్మ భయంతో వ్యామోహాలు విడిచి.)

1_2_137 కందము వంశీ - శ్రీకాంత్

కందము

పరమతపోనిధి యాయా
వరవంశోత్తముఁడు నియమవంతుఁడు లోకో
త్తరుఁడు జరత్కారుఁడునాఁ
బరఁగిన ముని బ్రహ్మచర్యపరిపాలకుఁడై.

(యాయావరవంశానికి చెందిన గొప్పవాడైన జరత్కారుడు బ్రహ్మచర్యాన్ని పాటిస్తూ.)

1_2_136 వచనము కిరణ్ -వంశీ

వచనము

మఱియు సకలలోకహితాచారంబులై ప్రసిద్ధులైన నాగముఖ్యుల నెల్ల వాసుకిచెలియ లైన జరత్కారువునకు జరత్కారుం డను మహామునికిం
బుట్టెడువాఁడధిక తేజస్వి యాస్తీకుండను మహాముని జనమేజయ సమారబ్ధసర్పసత్త్రప్రళయంబువలన రక్షించునని పితామహుండు దేవతలకుంజెప్పిన తెఱంగు సెప్పిన వాసుకిప్రముఖనాగముఖ్యు లెల్ల సంతసిల్లి యేలాపుత్త్రు నెత్తుకొని సాధువాదంబుల నభినందించిరి వాసుకియు నాఁటంగోలె జరత్కారుమునీంద్రుం డెన్నండు దారపరిగ్రహంబు సేయునో యని తత్సమయసమాగమం బపేక్షించి యుండునంత.

(లోకాలకు మేలు కలిగించే నాగులను, వాసుకి చెల్లెలైన జరత్కారువుకూ, జరత్కారుడనే మునికీ జన్మించబోయే ఆస్తీకుడనే ముని ఆ సర్పయాగప్రళయం నుండి రక్షిస్తాడు, అని బ్రహ్మ దేవతలకు చెప్పిన విషయాన్ని ఏలాపుత్రుడు వివరించగా అతడిని అందరూ పొగిడారు. వాసుకి అప్పటినుండి జరత్కారుడు భార్యను పరిగ్రహించే సమయం కోసం ఎదురుచూడసాగాడు.)

1_2_135 కందము వంశీ - శ్రీకాంత్

కందము

క్రూరాకారుల జగదప
కారులఁ బన్నగులఁ దాల్పఁగా నోపని యి
ద్ధారుణికి హితంబుగ దు
ష్టోరగసంహార మిప్పు డొడఁబడ వలసెన్.

("దుర్మార్గులైన నాగులను మోయలేని ఈ భూమికి మేలు కలగటం కోసం వారి వినాశనానికి అంగీకరించవలసి వచ్చింది")

1_2_134 వచనము కిరణ్ - వంశీ

వచనము

అప్పలుకులు సవిస్తరంబుగాఁ జెప్పెద వినుండు శాపానంతరంబ యమరులెల్ల నజుని కిట్లని రయ్యా కద్రువ కడునిర్దయురాలై యిట్టి యనంతబలవీర్యసంపన్ను లయిన కొడుకులం బడసి వారి కకారణంబ దారుణంబైన శాపం బిచ్చె మీరును వారింపక యుపేక్షించితిరి దీనికిం బ్రతీకారంబు గలదే యనిన నమరులకుఁ గమలసంభవుం డిట్లనియె.

(ఆ వివరాలు వినండి. శాపం ఇచ్చిన వెంటనే దేవతలు బ్రహ్మతో, "కద్రువ అకారణంగా పుత్రులను ఘోరంగా శపించింది. మీరూ ఊరుకున్నారు. దీనిని ఉపసంహరించడం సాధ్యమా?", అన్నారు. అప్పుడు బ్రహ్మ ఇలా అన్నాడు.)

1_2_133 ఆటవెలది కిరణ్ - వంశీ

ఆటవెలది

శాపమిచ్చునాఁడు జననియుత్సంగంబు
నందు నిద్రవోయినట్ల యుండి
యమరవరుల కజున కైన యన్యోన్యసం
భాషణంబు లెఱుకపడఁగ వింటి.

(మన తల్లి శాపమిచ్చిన రోజు ఆమె ఒడిలో నిద్రపోతునట్లు ఉండి దేవతలకూ, బ్రహ్మకూ జరిగిన సంభాషణ విన్నాను.)

1_2_132 వచనము కిరణ్ - వంశీ

వచనము

అనిన విని నాగరాజానుజుం డైన యేలాపుత్త్రుం డిట్లనియె.

(అప్పుడు వాసుకి తమ్ముడైన ఏలాపుత్రుడు ఇలా అన్నాడు.)

1_2_131 కందము వంశీ - శ్రీకాంత్

కందము

ఇవి మీ కన్నియుఁ జేయఁగ
నవు నని తలఁపకుఁడు భూసురాహుతిమంత్రో
ద్భవదారుణదహనశిఖల్
గవిసిన నెద్దియును జేయఁగా నెడ గలదే.

("మీరు చెప్పినవన్నీ అవుతాయనుకోకండి. వారు పఠించే మంత్రాల వల్ల పుట్టే అగ్నిజ్వాలలు వ్యాపిస్తే అలాంటి పనులు చేయటానికి అవకాశముండదు.")

1_2_130 వచనము కిరణ్ - వంశీ

వచనము

అనిన వారలలోఁ గొందఱు బుద్ధిమంతు లయిన భుజంగముఖ్యు లి ట్లనిరి.

(అప్పుడు కొంతమంది బుద్ధిమంతులైన సర్పముఖ్యులు ఇలా అన్నారు.)

1_2_129 సీసము + ఆటవెలది కిరణ్ - వంశీ

సీసము

జనమేజయుని చేయు సర్పయాగమునకు
        విఘ్న మందఱము గావింత మతఁడు
ధర్మార్థి గావున ధారుణీసురుల మై
        యడుగుద మిదియుఁ జేయకు మనియును
గొందఱ మతనికిఁ గూర్చు మంత్రులమునై
        యీక్రతుక్రియఁ జేసి యిహపరముల
కగుఁ బెక్కుదోషంబు లని హేతువులు సూపి
        యుడిగింత మందఱు నొక్కమొగిన

ఆటవెలది

భక్షభోజ్యలేహ్యపానీయములమీఁద
సదములోని విప్రజనులమీఁద
వెగడుపడఁగఁ బాఱి వెఱపింత మొజ్జలు
తత్ప్రయోగవిధులు దప్పి పఱవ.

("ఆ యజ్ఞానికి ఆటంకాలు కలిగిద్దాం. బ్రాహ్మణరూపాలు ధరించి సర్పయాగం చేయవద్దని అడుగుదాం. మనలో కొందరం అతడి మంత్రులమై ఈ యాగం వల్ల దోషాలు కలుగుతాయని చెప్పి మానేలా చేద్దాం. యజ్ఞం జరిగే సమయంలో భోజనపదార్థాలమీద, ఋత్విక్కులమీద వికారంగా పరుగెత్తి వారు పారిపోయేలా భయపెడదాం")

1_2_128 వచనము కిరణ్ - వంశీ

వచనము

మఱి యమృతమథనంబునాఁడు మంథరమహానగంబునకు నేత్రంబ నయిన నా క్లేశంబునకు మెచ్చి యమరు లెల్లఁ బితామహుం బ్రార్థించి నాకు నవ్యయత్వంబును సకలభయవిమోక్షణంబునుం గా వరం బిప్పించి రైనను జననీశాపంబున నురగకులప్రళయం బగుటకు మనోదుఃఖంబు దుస్సహం బైయుండు దాని నుడిగించు నుపాయం బెద్ది యేమి సేయువార మని చింతించుచున్న యన్నాగరాజునకు నాగకుమారు లత్యుద్ధతులై యిట్లనిరి.

(అమృతమథనం జరిగేటప్పుడు నేను కవ్వంగా ఉపయోగపడినందుకు మెచ్చి దేవతలు బ్రహ్మను వేడి నాకు అమరత్వం కలిగేలా వరం అనుగ్రహింపజేశారు. నాకు భయం లేకపోయినా, మన తల్లి శాపానికి సర్పాలకు జరగబోయే హాని వల్ల దుఃఖం కలుగుతోంది. అది ఆపేందుకు ఉపాయమేది అని చింతిస్తున్న వాసుకితో కొందరు నాగకుమారులు ఇలా అన్నారు.)

1_2_127 చంపకమాల కిరణ్ - వంశీ

చంపకమాల

చిరముగ బ్రహ్మకుం దపము సేసి యనంతుఁ డనంతధారుణీ
భరగురుకార్యయుక్తుఁ డయి పన్నగముఖ్యుల పొత్తు వాసి చె
చ్చెరఁ దనయంత నుండి మదిఁ జేర్చి తలంపఁడ యొక్కనాఁడు దు
ర్భరతర దందశూకకుల భావిభయప్రవిఘాతకృత్యముల్.

(శేషుడు మనల్ని విడిచి వెళ్లిపోయాడు కాబట్టి మనకు సర్పయాగంలో జరగబోయే హాని గురించి ఆలోచించడు.)

-: వాసుకి తల్లిశాపంబునకు వగచుట:-

1_2_126 వచనము కిరణ్ - వంశీ

వచనము

అని బ్రహ్మ నియోగించిన శేషుం డశేషమహీభారంబు దాల్చి గరుడనితో బద్ధసఖ్యుండైయుండె నిట వాసుకియుం దల్లి శాపంబున జనమేజయు చేయు సర్పయాగంబునం దయ్యెడు సర్పకులప్రళయంబునకు వెఱచి తన బాంధవుల నైరావతాదిసహోదరుల రావించి విషణ్ణహృదయుం డై యిట్లనియె.

(అని బ్రహ్మ నియోగించగా శేషుడు భూభారం వహించి గరుడుడికి స్నేహితుడయ్యాడు. ఇక్కడ వాసుకి అనే సర్పశ్రేష్ఠుడు తన తల్లి శాపం వల్ల జరగబోయే వినాశనానికి భయపడి తన బంధువులను, తమ్ములను పిలిచి దుఃఖంతో ఇలా అన్నాడు.)

1_2_125 చంపకమాల కిరణ్ - వంశీ

చంపకమాల

వినతకు నాత్మజుం డయిన వీరుఁడు కశ్యపవాలఖిల్యస
న్మునులవరంబు గన్న ఖగముఖ్యుఁడు వాసపు నోర్చి యున్న స
ద్వినుతబలుండు కావున వివేకమునన్ వినతాతనూజుతో
ఘనముగఁ జెల్మిసేయు మిది కార్యము నీకు భుజంగమేశ్వరా.

("గొప్పవాడైన గరుడుడితో నువ్వు స్నేహం చేయాలి")

1_2_124 సీసము + ఆటవెలది కిరణ్ - వంశీ

సీసము

తల్లియు నాసహోదరులును మూర్ఖులై
        ధర్మువు నుచితంబుఁ దప్పి వినత
కావైనతేయున కపకారములు సేసి
        రెప్పుడు వారు సహింప కెగ్గు
సేయుదు రేను రోసితి వారితోడిపొ
        త్తొల్లఁదపంబు సేయుచు శరీర
భారంబు విడిచెదఁ బరమేష్ఠి యనవుడు
        నాతని సమబుద్ధి కజుఁడు మెచ్చి

ఆటవెలది

నిత్యసత్యధర్మనిరతుండ వఖిలంబు
దాల్పనోపునట్టి ధైర్యయుతుఁడ
విది యనన్యవిషయ మిమ్మహీభారంబు
నీవ తాల్పవలయు నిష్ఠతోడ.

("దేవా! నా తల్లి, తమ్ములు ధర్మాన్ని విడిచి గరుడుడికి, వినతకు కీడు చేశారు. వారు ఎప్పుడూ ఇలాగే ఓర్వలేక హాని చేయటం నాకు అసహ్యం కలుగజేస్తోంది. వారితో కలిసి ఉండడం నాకు ఇష్టం లేదు. తపస్సు చేస్తూ శరీరభారం విడుస్తాను", అనగా బ్రహ్మ మెచ్చి, "సర్వాన్నీ భరించే ధైర్యం గల నువ్వు ఈ భూభారాన్ని భరించడానికి తగినవాడివి", అన్నాడు.)

-:బ్రహ్మ యనుజ్ఞవలన శేషుఁడు భూభారంబు దాల్చుట:-

1_2_123 వచనము కిరణ్ - వంశీ

వచనము

ఇట్లురగు లమృతం బుపయోగింపం గానక చనిన శేషుండు దనతల్లి యుం
దమ్ములుఁ జేసిన యధర్మంబునకు నిర్వేదించి వారల విడిచి కడునిష్ఠతో
గంధమాదన బదరీవన గోకర్ణ పుష్కరారణ్య హిమవంతంబు లాదిగాఁ గల
పుణ్యస్థానంబులం దనేక సహస్రవర్షంబులు బ్రహ్మ నుద్దేశించి తపంబు
సేసిన బ్రహయుఁ బ్రత్యక్షంబై వరంబు వేడు మనిన శేషుం డిట్లనియె.

(ఇలా పాములు అమృతం పొందలేక వెళ్లిపోగా, ఆదిశేషుడు తన తల్లి, తమ్ములు చేసిన పనికి బాధపడి, వారిని విడిచివెళ్లి, రకరకాల పుణ్యక్షేత్రాల్లో బ్రహ్మను గురించి తపస్సు చేయగా బ్రహ్మ ప్రత్యక్షమై వరం కోరుకొమ్మన్నాడు.)

1_2_122 కందము కిరణ్ - విజయ్

కందము

ఈ సౌపర్ణాఖ్యానము
భాసురముగ వినిన పుణ్యపరులకు నధిక
శ్రీ సంపద లగు దురితని
రాసం బగుఁ బాయు నురగరక్షోభయముల్.

(ఈ కథ విన్నవారికి మంచి జరుగుతుంది.)

1_2_121 వచనము కిరణ్ - విజయ్

వచనము

అంత నయ్యురగులు నమృతం బుపయోగింపం గానక దానియున్నస్థానంబని దర్భలు నాకిన నాలుకలు రెండుగా వ్రయ్యుటంజేసి నాటంగోలె ద్విజిహ్యులు నాఁ బరఁగిరి యమృతస్థితింజేసి దర్భలు పవిత్రంబు లయ్యె.

(తరువాత పాములు వచ్చి, అమృతం కనపడక, అక్కడ ఉన్న దర్భలను నాకగా ఆ దర్భల పదునైన అంచులవల్ల వాటి నాలుకలు రెండుగా చీలాయి. అప్పటినుండి పాములకు రెండు నాలుకలు కలిగాయి. దర్భలపై అమృతం ఉంచడం వల్ల అవి పవిత్రమయ్యాయి.)

1_2_120 కందము విజయ్ - విక్రమాదిత్య

కందము

అమరాధిపుఁ డమృతముఁ గొని
యమరావతి కరిగి తొంటియట్టుల సుస్థా
నమున నవిచలిత రక్షా
క్షముఁడై రక్షించుకొని సుఖస్థితి నుండెన్.

(ఇంద్రుడు ఆ అమృతాన్ని తిరిగి తీసుకొని అంతకు ముందులాగానే మంచిరక్షణ ఉన్నచోట దాన్ని ఉంచాడు.)

1_2_119 వచనము కిరణ్ - విజయ్

వచనము

మీరలు స్నాతాలంకృతులరై వచ్చి దీని నుపయోగింపుం డని పంచి తల్లిందన వీ పెక్కించుకొని విహగేంద్రుండురగుల కదృశ్యుండై యున్న సురేంద్రు వీడ్కొని చనియె నిట యురగులును నమృతోపయోగకుతూహలంబున నొండొరులం గడవఁ గృతస్నానాలంకృతులై చనుదెంచుటకు ముందఱ.

(స్నానం చేసివచ్చి ఇది తాగండని చెప్పి, వినతను తన వీపుపై ఎక్కించుకొని, నాగులకు కనపడకుండా ఉన్న ఇంద్రుడి దగ్గర సెలవు తీసుకొని వెళ్లిపోయాడు. పాములు స్నానం చేసి రాకముందే.)

1_2_118 కందము కిరణ్ - విజయ్

కందము

అనిమిషనాథ సుగుప్త మ
యిన యమృతము దెచ్చి మీకు నిచ్చితి నస్మ
జ్జననీ దాస్యము వాసెను
దినకరపవనాగ్నితుహినదీప్తుల కరిగాన్.

(మీరు అడిగిన అమృతం తెచ్చి మీకు ఇచ్చాను. సూర్యుడు, వాయువు, అగ్ని, చంద్రుడు సాక్షులుగా నా తల్లి దాసీత్వం తొలగిపోయింది.)

1_2_117 వచనము కిరణ్ - విజయ్

వచనము

అని గరుడండు దనకు నురగభోజనత్వంబు సురపతిచేతం బడసి తదనుగమ్యమానుండై యురగులయొద్దకు వచ్చి మరకతహరితంబైన కుశాస్తరణంబున నమృతకలశంబు నిలిపి యురగులకుం జూపి యిట్లనియె.

(అని గరుడుడు ఇంద్రుడి అనుమతి పొంది, అతడు తన వెనుకే రాగా, నాగుల దగ్గరకు వచ్చి, దర్భలపై అమృతమున్న పాత్రను పెట్టి, పాములతో ఇలా అన్నాడు.)

1_2_116 కందము విజయ్ - విక్రమాదిత్య

కందము

భవదభిరక్ష్యము లగు నీ
భువనంబులయందు సర్పములు ద్రిమ్మరుటన్
దివిజాధిప నీ కెఱిఁగిం
పవలసె నీయాజ్ఞ నాకుఁ బడయఁగ వలసెన్.

("నీ రక్షణ ఉన్న లోకాల్లో పాములు తిరుగుతుండటం వల్ల నీ ఆజ్ఞ అవసరమైంది")

1_2_115 కందము కిరణ్ - విజయ్

కందము

నాకభిమత మొనరించితి
నీకిష్టము చెప్పికొను మనిన దుర్మదులై
మాకిట్ల హితముఁ జేసిన
యా కద్రువపుత్త్రు లశన మయ్యెడు నాకున్.

("నాకిష్టమైనదాన్ని చేశావు. నీ కోరిక తెలుపు", అన్నాడు. అప్పుడు గరుడుడు ఇంద్రుడితో, "మాకు అపకారం చేసిన కద్రువ కొడుకులు నాకు ఆహారంగా కావాలి.")

1_2_114 వచనము కిరణ్ - విజయ్

వచనము

అని చెప్పిన గరుడని జవసత్త్వసామర్థ్యంబులకు మెచ్చి సంతసిల్లి నీవు నాతో నెప్పుడు బద్దసఖ్యుండవై యుండవలయునని వెండియు దేవేంద్రుండు గరుడని కిట్లనియె.

(అని గరుడుడు చెప్పగా ఇంద్రుడు సంతోషించి, అతడి స్నేహం కోరి, ఇలా అన్నాడు.)

1_2_113 ఉత్పలమాల కిరణ్ - విజయ్

ఉత్పలమాల

స్థావరజంగమ ప్రవితతం బగు భూవలయంబు నెల్ల నా
లావునుఁ బూని తాల్తు నవిలంఘ్యపయోధిజలంబు లెల్ల ర
త్నావళితోన చల్లుదు బృహన్నిజపక్షసమీరణంబునన్
దేవగణేశ యీక్షణమ త్రిమ్మరి వత్తుఁ ద్రివిష్టపంబులున్.

(నేను ఈ భూమిని మోయగలను, నా రెక్కలతో అన్ని సముద్రాలనీటినీ వెదజల్లగలను, మూడులోకాలనూ క్షణంలో చుట్టి రాగలను.)

1_2_112 కందము విజయ్ - విక్రమాదిత్య

కందము

పరనిందయు నాత్మగుణో
త్కరపరికీర్తనముఁ జేయఁగా నుచితమె స
త్పురుషుల కైనను నీ క
చ్చెరువుగ నా కలతెఱంగుఁ జెప్పెదఁ బ్రీతిన్.

(ఇతరులను నిందించడం, తమ గుణాలను తామే మెచ్చుకోవటం సజ్జనులకు తగదు. అయినా సత్యమైనదాన్ని చెప్తాను.)

1_2_111 వచనము కిరణ్ - విజయ్

వచనము

ఏను మదీయమాతృదాసీత్వనిరాసార్థం బురగుల కమృతంబు దెచ్చి యిత్తునని కాద్రవేయులతో నొడివి వచ్చినవాఁడ నీయమృతంబు గొనిపోయి వారల కిచ్చి మదీయజననీదాస్యంబుఁ బాచికొనిన నురగు లీ యమృతం బుపయోగింపకుండ ముందఱ నీవు గొని చను మనిన నగ్గరుడని మహానుభావంబునకు మెచ్చి నీ బలపరాక్రమంబులు వినవలతుం జెప్పు మనిన నయ్యింద్రునకు గరుడం డిట్లనియె.

("నా తల్లి దాస్యం పోగొట్టడానికి నాగులకు ఈ అమృతం తెచ్చి ఇస్తానని చెప్పాను. ఇది నేను వారికిచ్చిన తaరువాత వారు దాన్ని తాగకముందే నువ్వు తిరిగి తీసుకో". ఇంద్రుడు గరుత్మంతుడిని మెచ్చుకొని, "నీ బలపరాక్రమాలు వినాలని ఉంది", అనగా గరుడుడు ఇలా చెప్పాడు.)

Saturday, October 08, 2005

1_2_110 కందము కిరణ్ - విజయ్

కందము

నీ వొరులకు నీయమృతం
బీ వలవదు నాకు మగుడ నిచ్చిన నీకి
ష్టావాప్తియగువిధం బేఁ
గావించెద ననిన హరికి గరుడం డనియెన్.

(అమృతాన్ని నాకు తిరిగి ఇస్తే నీకు ఇష్టమైనది జరిగేలా చేస్తాను, అని ఇంద్రుడనగా గరుడుడు ఇలా పలికాడు.)

1_2_109 కందము విజయ్ - విక్రమాదిత్య

కందము

అమరుఁడ వజరుఁడ వజితుఁడ
వమేయుఁడవు నీకు నమృత మది యేల ఖగో
త్తమ దీని నొరుల కిచ్చిన
నమరులకును వా రసాధ్యు లగుదురు పోరన్.

(నువ్వు మరణం, ముసలితనం, పరాజయం లేనివాడివి. నీకు అమృతం ఎందుకు? అది ఇతరులకిస్తే వారు దేవతలకి కూడా అసాధ్యులవుతారు.)

1_2_108 ఆటవెలది కిరణ్ - విజయ్

ఆటవెలది

నిరుపమానశౌర్య నీతోడఁ జెలిమి సే
యంగ నా కభీష్టమైనయదియు
నిట్టి విక్రమంబు నిట్టి సామర్థ్యంబుఁ
గలదె యొరుల కిజ్జగంబునందు.

(గొప్పవాడివైన నీతో నాకు స్నేహం చేయాలని ఉంది.)

1_2_107 వచనము కిరణ్ - విజయ్

వచనము

అదియును నంబరంబున నగ్నికణంబులు చెదరం బఱతెంచి పక్షిరాజు పక్షంబులు దాఁక వచ్చినం జూచి గరుడండు నగి నీచేయు వేదన నన్నుం దాఁక నోపదు నీవు మహామునిసంభవంబ వగుటను దేవేంద్రునాయుధంబ వగుటను నిన్ను నవమానింప గాదు గావున మదీయైకపర్ణశకలచ్ఛేదఁబు సేయుము నాయందు నీశక్తి యింతియ యనిన సకలభూతసంఘం బెల్ల నాతని పర్ణంబులసుస్థిరత్వంబునకు మెచ్చి సుపర్ణుండని పొగడె సురేంద్రుండును నవ్విహగేంద్రు మహాత్మ్యంబునకు మెచ్చి యచ్చెరువంది యిట్లనియె.

(ఆ వజ్రాయుధం గరుత్మంతుడి రెక్కలపైకి రాగా, అతడు నవ్వి, "నీవు నన్ను బాధపెట్టలేవు. కానీ, దధీచి వంటి మహాముని వెన్నెముకతో తయారైనదానివీ, ఇంద్రుని ఆయుధానివీ కనుక నిన్ను అవమానించను. కాబట్టి, నా ఈకను ఒకదాన్ని ఛేదించు. నాపై నీ శక్తి ఇంతే", అనగా అతని రెక్కల దృఢత్వాన్ని స్తుతించి సకలభూతాలూ అతన్ని సుపర్ణుడని పొగిడాయి. ఇంద్రుడు కూడా ఆశ్చర్యపోయి.)

1_2_106 సీసము + ఆటవెలది కిరణ్ - విజయ్

సీసము

అమృతాశనంబు చేయకయును దేవ నా
        కజరామరత్వంబు నందుటయును
నఖిలలోకంబుల కగ్రణివైన నీ
        యగ్రంబునందు ని న్నధికభక్తి
గొలుచుచు నునికియుఁ గోరితిఁ గరుణతో
        దయచేయు ముద్ధతదైత్యభేది
యనవుడు వానికి నభిమతంబులు ప్రీతుఁ
        డై యిచ్చి హరి యిట్టు లనియె నాకు

ఆటవెలది

ననఘ వాహనంబ వై మహాధ్వజమవై
యుండు మనినఁ బక్షియును బ్రసాద
మనుచు మ్రొక్కి పఱచె నంత నాతనిమీఁద
వజ్ర మెత్తి వైచె వాసవుండు.

("దేవా! అమృతం తాగకుండానే నాకు అమృతత్వం కలగాలనీ, భక్తితో నిన్ను సేవిస్తూ ఉండాలనీ కోరుకుంటున్నాను", అన్నాడు. విష్ణువు అతని కోరికలను అనుగ్రహించి తనకు వాహనంగా ఉండేలా వరమిచ్చాడు. గరుత్మంతుడు మహాప్రసాదమని ఎగిరిపోగా ఇంద్రుడు అతడిపై వజ్రాయుధాన్ని ప్రయోగించాడు.)

1_2_105 వచనము కిరణ్ - విజయ్

వచనము

అని ప్రసన్నుండై యానతిచ్చిన యాదిదేవుండగు శ్రీమన్నారాయణునకు నమస్కరించి గరుడం డిట్లనియె.

-:శ్రీమన్నారాయణుఁడు గరుడునకుఁ బ్రసన్నుఁ డగుట:-

1_2_104 కందము విజయ్ - విక్రమాదిత్య

కందము

నీవిజయోత్సాహమునకు
లావునకు జవంబునకు నలౌల్యమునకు స
ద్భావమునకు మెచ్చి వరం
బీవచ్చితి వేఁడు మెద్ది యిష్టము నీకున్.

("నిన్ను మెచ్చాను. నీకేది ఇష్టమో కోరుకో")

1_2_103 కందము విజయ్ - విక్రమాదిత్య

కందము

కలహమున నిట్లు సురవీ
రులఁ బల్వుర నోర్చి యొక్కరుఁడ యమృతముఁ దె
క్కలి కొని యాస్వాదింపక
యలోలుఁ డగు వానిఁ జూచి హరి యిట్లనియెన్.

(ఇలా దేవతలను ఓడించి అమృతాన్ని సాధించి కూడా దాన్ని రుచి సైతం చూడకుండా ఉన్న గరుత్మంతుడిని చూసి, విష్ణువు ఇలా అన్నాడు.)

1_2_102 వచనము కిరణ్ - విజయ్

వచనము

అయ్యురగంబులం దన పక్షరజోవృష్టి నంధంబులఁ జేసి వాని శిరంబులు ద్రొక్కి పరాక్రమం బెసంగ నమృతంబు గొని గరుడండు గగనంబున కెగసిన.

(తన రెక్కలతో దుమ్మురేపి వాటిని గుడ్డివాటిగా చేసి, వాటి తలలు తొక్కి, అమృతం తీసుకొని ఆకాశానికి ఎగిరాడు.)

1_2_101 ఉత్పలమాల కిరణ్ - విజయ్

ఉత్పలమాల

ఘోరవికారసన్నిహితకోపముఖంబులు దీప్తవిద్యుదు
ల్కారుణదారుణాక్షములు నై నిజదృష్టివిషాగ్ని నన్యులం
జేరఁగ నీక యేర్చుచుఁ బ్రసిద్ధముగా నమృతంబు చుట్టు ర
క్షారతి నున్న యుగ్రభుజగంబుల రెంటిని గాంచి చెచ్చెరన్.

(అక్కడ భయంకరమైన పాములు రెండు అమృతాన్ని కాపాడుతూ ఉండటం చూసి.)

1_2_100 వచనము కిరణ్ - విజయ్

వచనము

ఇట్లు నిర్జరవరుల నెల్ల నిర్జించి యూర్జితుండై గరుడం డమృతస్థానంబున కరిగి దానిం బరివేష్టించి ఘోరసమీరప్రేరితంబై దుర్వారశిఖాజిహ్వలనంబరంబు నాస్వాదించుచున్న యనలంబుం గని తత్క్షణంబ సకలనదీజలంబుల నెల్లఁ బుక్కిలించుకొని వచ్చి యయ్యనలంబు నాఱంజల్లి తీక్ష్ణధారంబై దేవనిర్మితంబై పరిభ్రమించుచున్న యంత్రచక్రంబు నారాంతరంబున సంక్షిప్తదేహుండై చొచ్చి యచ్చక్రంబుక్రింద.

(అలా దేవతలను ఓడించి, అమృతం చుట్టూ ఉన్న అగ్నిని చూసి, అన్ని నదుల్లో ఉన్న నీటినంతా నోటిలో ఉంచుకొని వచ్చాడు. ఆ నీటితో మంటలను ఆర్పి, అమృతాన్ని రక్షిస్తూ పదునైన అంచులు ఉన్న చక్రాన్ని చూసి సూక్ష్మరూపం ధరించి ఆ చక్రం కిందికి వెళ్లాడు.)

1_2_99 కందము ప్రదీప్ - విజయ్

కందము

తలరఁగ రేణుక్రథన
ప్రలిహ ప్రరుజాశ్వకృంత పదనఖులను ర
క్షులఁ గులిశనిశాతనఖా
వలిఁ బక్షీంద్రుండు వ్రచ్చి వందఱలాడెన్.

(గరుడుడు అమృతానికి కావలి కాసేవారిని తన గోళ్లతో చీల్చి ముక్కలు చేశాడు.)

1_2_98 సీసము + ఆటవెలది కిరణ్ - విజయ్

సీసము

పక్షతుండాగ్రనఖక్షతదేహులై
        బోరన నవరక్తధార లొలుక
విహగేంద్రునకు నోడి నిహతులై సురవరుల్
        సురరాజుమఱువు సొచ్చిరి కలంగి
సాధ్యు లనాయాససాధ్యులై పాఱిరి
        పూర్వాభిముఖు లయి గర్వ ముడిఁగి
వసువులు రుద్రులు వసుహీన విప్రుల
        క్రియ దక్షిణాశ్రితు లయిరి భీతి

ఆటవెలది:

వంది యపరదిక్కుఁ బొంది రాదిత్యు లా
శ్వినులు నుత్తరమున కొనరఁ బఱచి
రనల వరుణ పవన ధనద యమాసురుల్
వీఁక దఱిఁగి కాందిశీకు లయిరి.

(గరుడుడి పరాక్రమానికి దేవతలూ, దిక్పాలకులూ చెల్లాచెదురయ్యారు.)

1_2_97 కందము రాంబాబు - విజయ్

కందము

బలవత్ఖగేంద్రకోపా
నలభస్మీభూతుఁడై క్షణంబున వాఁడున్‌
బల మఱి క్రాఁగె నుదగ్ర
జ్వలనజ్వాలావలీఢశలభమపోలెన్‌.

(కానీ గరుత్మంతుడి కోపమనే అగ్నిలో మిడతలా మాడిపోయాడు.)

1_2_96 మాలిని పవన్ - విజయ్

మాలిని

పరశు కులిశ కుంత ప్రాస బాణాసనోద్య
త్పరిఘ కణప చక్ర ప్రస్ఫురద్బాహుసేనా
పరివృతుఁడయి తాఁకెన్ భౌమనుండ న్మహాకిం
కరుఁడు సమరకేళీగర్వితున్ వైనతేయున్.

(భౌమనుడనే వాడు రకరకాల ఆయుధాలతో గరుత్మంతుడిని ఎదుర్కొన్నాడు.)

1_2_95 వచనము విజయ్ - విక్రమాదిత్య

వచనము

గరుడండును నిజపక్షవిక్షిప్తరజోవృష్టి నమరవరుల దృష్టిపథంబుఁ గప్పి స్వర్గలోకంబ నిరాలోకంబుగాఁ జేసిన నమరేంద్రుపనుపునం బవనుం డా రజోవృష్టి చెదర వీచె నంత.

(గరుడుడు తన రెక్కలతో దుమ్మురేపి స్వర్గాన్ని చీకటిమయం చేయగా ఇంద్రుడు వాయువును ఆజ్ఞాపించి ఆ దుమ్ము చెదిరిపోయేలా చేశాడు.)

1_2_94 కందము చేతన - విజయ్

కందము

తడఁబడ నేసియు వైచియుఁ
బొడిచియు వివిధాస్త్రశస్త్రములు నుద్ధతులై
కడుగొని యుద్ధము సేసిరి
కడిమిమెయిన్‌ విబుధవరులు గరుడనితోడన్‌.

(గరుత్మంతుడితో రకరకాలుగా యుద్ధం చేశారు.)

1_2_93 కందమ&