Sunday, November 01, 2009

2_1_63 వచనము ప్రకాష్ - వసంత

వచనము

అదియును నూఱుయోజనంబుల వెడల్పును నూటయేఁబది యోజనంబుల నిడుపును నేను యోజనంబుల తనర్పునుం గలిగి వైహాయసంబయి కామగమనంబయి వ్యపేతశీతాతపంబయి సకల కాల కుసుమ ఫలభరిత పాదపవన సంకీర్ణ సరోవర విరాజితంబయి తపఃప్రభావంబున నమరేంద్రుచేత నిర్మితంబయి కరం బొప్పుచుండు నట్టి సభయందు.

(ఆ సభ నూరు ఆమడల వెడల్పు, నూట యాభై ఆమడల పొడవు, ఐదు ఆమడల ఎత్తు కలిగి ఆకాశంలో ఉంటుంది. అక్కడ చలి, ఎండ ఉండవు. అన్ని కాలాల్లోనూ అక్కడి సరస్సులు, చెట్ల తోపులు పూలు, పండ్లతో నిండుగా ఉంటాయి. దీన్ని ఇంద్రుడు తన తపోబలంతో నిర్మించుకున్నాడు.)

Tuesday, September 22, 2009

2_1_62 కందము ప్రకాష్ - వసంత

కందము

శతమఖు సభ శుభ రత్నాం
చిత కాంచన రచిత మతి విచిత్రము లోక
త్రితయాఖిల లక్ష్మీ సం
శ్రిత మలవియె దానిఁ బొగడ శేషున కయినన్.

(ఇంద్రసభ ఎంతో వైభవంగా ఉంటుంది. దానిని పొగడటం ఆదిశేషుడికి కూడా సాధ్యం కాదు!)

-:ఇంద్రసభావర్ణనము:-

2_1_61 వచనము ప్రకాష్ - వసంత

వచనము

అనిన విని 'యవి యెట్టివి? వాని వినవలతు నానతిం' డని లోకపాల సభావిభవ శ్రవణ ప్రభూత కుతూహల చేతస్కుండై యడిగిన ధర్మరాజునకు నారదుం డిట్లనియె.

(దిక్పాలకుల సభలు ఎలా ఉంటాయో చెప్పమని ధర్మరాజు కుతూహలంతో నారదుడిని అడిగాడు.)

Saturday, September 19, 2009

2_1_60 కందము వోలం - వసంత

కందము

సురపతి యమ వరుణ ధనే
శ్వర కమలాసనుల దివ్యసభలెల్ల నరే
శ్వర! చూచితి నవి దీనికి
సరిగా వత్యంతవిభవ సౌందర్యములన్.

(ఇంద్ర, యమ, వరుణ, కుబేర, బ్రహ్మదేవుల సభలన్నీ చూశాను. ఐశ్వర్యంలో, సౌందర్యంలో అవి దీనికి సరితూగవు.)

2_1_59 కందము వోలం - వసంత

కందము

భూనాథ! యిది యపూర్వ మ
మానుషము విచిత్ర రత్నమయ మిట్టి సభన్
మానవలోకేశ్వరులం
దే నెన్నఁడుఁ జూచి వినియి నెఱుఁగ ధరిత్రిన్.

(మహారాజా! ఈ సభ అపూర్వం, మానవాతీతం, విచిత్రరత్నమయం. మానవలోకం లోని రాజుల దగ్గర ఇలాంటి సభను నేను ఎప్పుడూ చూసి, విని ఎరుగను.)

2_1_58 వచనం వోలం - వసంత

వచనం

అని కృతాంజలి యయి 'మునీంద్రా! యీత్రిలోకంబులయందును మీ చూడనివి లేవెందే నిట్టి యపూర్వంబైన సభ చూచి యెఱుంగుదురే?' యని మయ నిర్మితం బయిన సభ చూపినం జూచి విస్మితుండయి నారదుండు ధర్మరాజున కి ట్లనియె.

(అని, "మునీంద్రా! ఈ మూడులోకాల్లో మీరు చూడనివి లేవు. ఎక్కడైనా ఇలాంటి అపూర్వమైన సభను చూశారా?", అని మయుడు నిర్మించిన ఆ సభను చూపించగా నారదుడు ఆశ్చర్యపోయి ధర్మరాజుతో ఇలా అన్నాడు.)

-:ఇట్టి సభ నెచ్చటనైనఁ జూచితిరా యని ధర్మజుఁడు నారదు నడుగుట:-

2_1_57 తేటగీతి వోలం - వసంత

తేటగీతి

నాయథాశక్తిఁ జేసి యన్యాయపథముఁ
బరిహరించి మహాత్ముల చరితలందు
బుద్ధి నిలిపి మీ యుపదేశమున శుభంబు
లయిన వాని ననుష్ఠింతుఁ బ్రియముతోడ.

(నాకు చేతనైనంతవరకు అన్యాయమార్గం వదిలి, మహాత్ముల చరితలపై బుద్ధినిలిపి మీ ఉపదేశం వల్ల మంచి పనులు ఆచరిస్తాను.)

Saturday, May 30, 2009

2_1_56 వచనం వోలం - వసంత

వచనం

మఱియు నాస్తిక్యం బనృతంబు ప్రమాదం బాలస్యం బనర్థజ్ఞులతోడి చింతనంబు క్రోధంబు దీర్ఘచింత దీర్ఘ
సూత్ర్తత యెఱుకగలవారి నెఱుంగమి యర్థంబుల యందనర్థకచింత నిశ్చిత కార్యంబులు సేయమి మంత్రంబుల
రక్షింపమి శుభంబులఁ బ్రయోగింపమి విషయంబులం దగులుట యనంబరఁగిన పదునాలుఁగు
రాజదోషంబులఁ బరిహరింతె యని యడిగిన నారదునకు ధర్మరా జిట్లనియె.

(నాస్తికత, అబద్ధమాడటం, ఏమరుపాటు, సోమరితనం, తెలివితక్కువవాళ్లతో కార్యాలోచన చేయటం, కోపం, ఎక్కువకాలం చింతించటం, చేయవలసిన పనిగురించి ఎక్కువకాలం ఆలోచించటం, ఆలస్యంగా చేయటం, జ్ఞానులను గుర్తించకపోవటం, ప్రయోజనకరమైన విషయాల్లో ప్రయోజనం లేని ఆలోచనలు చేయటం, నిర్ణయించిన పనులు చేయకపోవటం, రహస్యాలు కాపాడుకోలేకపోవటం, శుభకార్యాలు చేయకపోవటం, ఇంద్రియలోలత్వం - అనే పదునాలుగు రాజదోషాలను విడిచిపెట్టావు కదా అన్న నారదుడితో ధర్మరాజు ఇలా అన్నాడు)

Monday, May 25, 2009

2_1_55 తేటగీతి వోలం - వసంత

తేటగీతి

కడిఁది రిపులపైఁ బోవంగఁ గడఁగి యున్న
నీకు ముందఱఁ జని రిపు నృపులయందు
దగిలి సామాద్యుపాయంబు లొగిన సంప్ర
యోగమునఁ జేసి వర్తిల్లుచున్నె చెపుమ.

(నువ్వు శత్రురాజులపై దండెత్తటానికి ముందే సామదానభేదదండోపాయాలను ప్రయోగిస్తున్నావు కదా!)

2_1_54 చంపకమాల వోలం - వసంత

చంపకమాల

వదలక బుద్ధి నంతరరివర్గము నోర్చి జితేంద్రియుండ వై
మొదలన దేశకాలబలముల్ మఱి దైవబలంబుఁ గల్గి భూ
విదిత బలుండవై యహితవీరుల నోర్వఁగ నుత్సహింతె దు
ర్మద మలినాంధ చిత్తులఁ బ్రమత్తుల నింద్రియ నిర్జితాత్ములన్.

(నీ మనసులోని శత్రువులను, ఇంద్రియాలను జయించి, బయటి శత్రువులను జయించాలనే ఉద్దేశంతో ఉన్నావు కదా!)

Thursday, May 21, 2009

2_1_53 చంపకమాల వోలం - వసంత

చంపకమాల

బహుధనధాన్య సంగ్రహము బాణశరాసన యోధవీర సం
గ్రహము నిరంతరాంతరుదకంబులు ఘాసరసేంధనౌఘ సం
గ్రహము ననేక యంత్రములుఁ గల్గి యసాధ్యములై ద్విషద్భయా
వహు లగుచుండ నొప్పునె భవత్పరిరక్ష్యములైన దుర్గముల్

(నీ కోటలన్నీ ధనధాన్యాలు, ధనుర్బాణాలు, వీరులు, నీళ్లు, గడ్డి, ఉప్పు, పులుపు, కారం వంటి ఆహారపదార్థాలు, పానీయాలు, వంటకట్టెలు, యంత్రాలు మొదలైనవి సమృద్ధిగా కలిగి దుర్భేద్యాలై ఉన్నాయి కదా!)

Tuesday, May 19, 2009

2_1_52 ఆటవెలది వోలం - వసంత

ఆటవెలది

దార సంగ్రహంబు ధరణీశ! రతి పుత్త్రఫలము
శీలవృత్త ఫలము శ్రుతము
దత్తభుక్తఫలము ధనము వేదము లగ్ని
హోత్ర ఫలము లనియు నొగి నెఱుంగు

(భార్యను పొందటానికి ఫలం - రతి, పుత్రులు. ధర్మాలను గురించి వినటానికి ఫలం - సచ్ఛీలం. సంపాదించిన ధనానికి ఫలం - దానం చెయ్యటం, అనుభవించటం. వేదాలకు ఫలం - అగ్నిహోత్రాలు)

Monday, May 18, 2009

2_1_51 ఆటవెలది వోలం - వసంత

ఆటవెలది

వార్తయంద జగము వర్తిల్లుచున్నది
యదియు లేని నాఁడ యఖిల జనులు
నంధకారమగ్ను లగుదురు గావున
వార్త నిర్వహింపవలయుఁ బతికి.

(ప్రపంచం వార్త మీదే నడుస్తున్నది. అది లేకుంటే ప్రజలు అంధకారంలో మునిగినట్లే. కాబట్టి ప్రభువు వార్తను బాగా నడపాలి.)

2_1_50 కందము వోలం - వసంత

కందము

వెలయఁగ విద్వజ్జన ము
ఖ్యులతోడ నశేషధర్మకుశలుఁడ వయి యి
మ్ముల
లోక వ్యవహార
మ్ములు దయఁ బరికింతె నిత్యమును సమబుద్ధిన్.

(రోజూ పండితులతో కలిసి లోకవ్యవహారాలు విచారిస్తున్నావు కదా!)

Sunday, August 10, 2008

2_1_49 కందము వోలం - వసంత

కందము

పరికించుచు బాహాభ్యం
తర జనములవలన సంతతము నిజరక్షా
పరుఁ డవయి పరమహీశుల
చరితము వీక్షింతె నిపుణచరనేత్రములన్

(శత్రువులనుంచి నిన్ను నువ్వు రక్షించుకుంటూ, గూఢచారుల ద్వారా వారి ప్రవర్తనను గమనిస్తున్నావు కదా!)

Wednesday, July 23, 2008

2_1_48 కందము వోలం - వసంత

కందము

వలయు నమాత్యులుఁ జుట్టం
బులు మూలబలంబు రాజపుత్త్రులు విద్వాం
సులు బలసియుండ నిచ్చలుఁ
గొలువుండుదె లోక మెల్లఁ గొనియాడంగన్

(నీకు ఇష్టమైనవారు ఆసీనులై ఉండగా రోజూ కొలువుదీరుతున్నావు కదా!)

2_1_47 సీసము + ఆటవెలది వోలం - వసంత

సీసము

ఆయంబునందు నాలవ భాగమొండె మూఁ
  డవ భాగమొండె నం దర్ధమొండె
గాని మిక్కిలి సేయఁగాదు వ్యయంబని
  యవధరించితె బుద్ధి నవనినాథ !
యాయుధాగారధనాధ్యక్ష్యములయందు
  వరవాజి వారణావళులయందు
బండారములయందుఁ బరమ విశ్వాసుల
  భక్తుల దక్షులఁ బంచితయ్య

ఆటవెలది

గురుల వృద్ధ శిల్పివరవణి గ్భాంధవ
జనుల నాశ్రితులను సాధుజనులఁ
గరుణఁ బేదఱికము వొరయకుండఁగఁ బ్రోతె
సకలజనులు నిన్ను సంస్తుతింప

(ఆదాయంలో సగానికి మించి ఖర్చుచేయకూడదని గ్రహించావు కదా! ముఖ్యమైన ఉద్యోగాలలో సమర్థులను నియమించావు కదా! ప్రజల్ని దయతో పోషిస్తున్నావు కదా!)

Wednesday, July 16, 2008

2_1_46 కందము వోలం - వసంత

కందము

కృత మెఱిఁగి కర్త నుత్తమ
మతుల సభల సంస్తుతించి మఱవక తగు స
త్కృతి సేయుదె కృత మెఱిఁగెడు
పతియె జగజ్జనుల నెల్లఁ బరిపాలించున్.

(మేలు చేసిన వారిని గుర్తిస్తున్నావు కదా!)