Saturday, June 02, 2007

2_1_23 ఉత్పలమాల కిరణ్ - వసంత

ఉత్పలమాల

నీరజమిత్రుఁ డేల ధరణీగతుఁ డయ్యెడు నొక్కొ యంచు వి
స్మేరమనస్కులై జనులు మెచ్చి నిజద్యుతి చూచుచుండఁగా
నారదుఁ డేఁగుదెంచె గగనంబున నుండి సురేంద్రమందిర
స్ఫారవిలాసహాసి యగుపార్థుగృహంబునకుం బ్రియంబునన్.

(నారదుడు అర్జునుడి ఇంటికి వచ్చాడు.)

-:నారదుఁడు పాండవుల యొద్దకు వచ్చుట:-

2_1_22 వచనము కిరణ్ - వసంత

వచనము

అమ్మహామునులనెల్ల నతిభక్తిం బూజించి లబ్ధాశీర్వచనుం డై ధర్మతనయుండు వారలవలన ధర్మకథలు వినుచుఁ దమ్ములుం దానును సుఖంబుండునంత నొక్కనాఁడు.

(ధర్మరాజు వారిని పూజించి, వారు చెప్పే ధర్మకథలు వింటూ తమ్ములతో సుఖంగా ఉండగా ఒకరోజు.)

2_1_21 సీసము + ఆటవెలది కిరణ్ - వసంత

సీసము

సుబల మార్కండేయ శునక మౌంజా
యన మాండవ్య శాండిల్య మందపాల
బక దాల్భ్యరైభ్యక భాలుకి జతు
కర్ణ గౌతమ కౌశిక కణ్వ కుత్స
సావర్ణి పర్ణాద సత్య గోపతి
గోపవేష మైత్రేయ పవిత్రపాణి
ఘటజాను కాత్రేయ కఠ కలాప
సుమిత్ర హారీత తిత్తిరి యాజ్ఞవల్క్య

ఆటవెలది

వాయుభక్ష భార్గవ వ్యాస జైమిని
శుక సుమంతు పైల సువ్రతాదు
లయినమునులు నేము నరిగితి మెంతయు
రమ్యమయిన ధర్మరాజుసభకు.

(మునులందరూ ధర్మరాజు సభకు వచ్చారు.)

2_1_20 వచనము కిరణ్ - వసంత

వచనము

మఱియును.

(ఇంకా.)

2_1_19 మత్తేభవిక్రీడితము కిరణ్ - వసంత

మత్తేభవిక్రీడితము

మదమాతంగ తురంగ కాంచన లసన్మాణిక్య గాణిక్య సం
పద లోలిం గొని వచ్చి యిచ్చి ముద మొప్పం గాంచి సేవించి ర
య్యుదయాస్తాచలాసేతుశీతనగమధ్యోర్వీపతుల్ సంతతా
భ్యుదయున్ ధర్మజుఁ దత్సభాస్థితు జగత్పూర్ణప్రతాపోదయున్.

(సేతువు నుండి హిమాలయాల వరకూ ఉన్న రాజులందరూ వచ్చి ధర్మరాజుకు కానుకలు ఇచ్చారు.)

2_1_18 వచనము కిరణ్ - వసంత

వచనము

తదవసరంబున.

(అప్పుడు)

2_1_17 ఉత్పలమాల కిరణ్ - వసంత

ఉత్పలమాల

మంచిగ భూరిభూసురసమాజము నెల్లను భక్తితోడఁ బూ
జించి, యభీష్టదానములు సేసి ధనార్థులఁ దన్పి, దిక్కులన్
నించె యశంబు, బంధులకు నెయ్యురకున్ హృదయప్రియంబు గా
వించె, విభూతి యేర్పడఁ బవిత్రుఁడు ధర్మసుతుండు నెమ్మితోన్.

(ధర్మరాజు ఎన్నో దానాలు చేశాడు.)

2_1_16 వచనము కిరణ్ - వసంత

వచనము

అనుజసహితుం డయి దైవజ్ఞదత్తశుభముహూర్తంబున ధౌమ్యాదిభూసురాశీర్వాదపుణ్యాహనాదంబు లెసంగ సభాప్రవేశంబు నేసి యంత.

(ధర్మరాజు విప్రులు నిర్ణయించిన ముహూర్తాన తన తమ్ములతో సభాప్రవేశం చేశాడు.)

2_1_15 ఉత్పలమాల కిరణ్ - వసంత

ఉత్పలమాల

వీరుఁడు ధర్మజుండు పదివేవురు విప్రుల కొప్పఁ బాయసా
హారము భక్తిఁ బెట్టి మఱి యందఱకుం జెఱు వేయునేసి వి
స్తారయశుండు ధేనువుల ధర్మవిధిన్ మణిముద్రికాద్యలం
కారదుకూలపుష్పఫలగంధయుతంబుగ నిచ్చి లీలతోన్.

(ధర్మరాజు విప్రులకు భోజనం పెట్టి గోదానం చేశాడు.)