Wednesday, March 12, 2008

2_1_45 కందము వోలం - వసంత

కందము

పంగుల మూకాంధుల విక
లాంగులను నబాంధవుల దయం బ్రోతె భయా
ర్తుం గడిఁది శత్రునైనను
సంగరరంగమునఁ గాతె శరణం బనినన్.

(కుంటివారిని, మూగవారిని, గుడ్డివారిని, వికలాంగులను, అనాథులను దయతో పోషిస్తున్నావు కదా! శరణుకోరితే శత్రువును కూడా కాపాడుతున్నావు కదా!)

Tuesday, March 11, 2008

2_1_44 కందము వోలం - వసంత

కందము

హీనులగు కర్షకులను
భూనుత! ధాన్యంబు బీజములు వణిజులకున్
మానుగ శతైకవృద్ధి న
నూనముగా ఋణము లిత్తె యుత్తమబుద్ధిన్.

(పేద రైతులకు విత్తనాలూ, వర్తకులకు నూటికి ఒక రూపాయి వడ్డీ వంతున అప్పులూ ఇస్తున్నావు కదా!)

2_1_43 కందము వోలం - వసంత

కందము

ధరణీనాథ భవద్భుజ
పరిపాలితయైన వసుధఁ బరిపూర్ణములై
కర మొప్పుచున్నె చెఱువులు
ధరణి కవగ్రహభయంబు దనుకక యుండన్.

(రాజా! నీ రాజ్యంలోని చెరువులు అనావృష్టి భయంలేకుండా నిండుగా ఉన్నాయి కదా!)

Monday, March 10, 2008

2_1_42 కందము వోలం - వసంత

కందము

చోర భయ వర్జితముగా
ధారుణిఁ బాలింతె యధికధనలోభమునం
జోరుల రక్షింపరుగా
వారలచే ధనముగొని భవద్భృత్యవరుల్.

(రాజ్యంలో దొంగల భయం లేకుండా పాలిస్తున్నావు కదా! నీ సేవకులు దొంగల దగ్గర డబ్బు పుచ్చుకొని వాళ్లని రక్షించటం లేదు కదా!)

Sunday, March 09, 2008

2_1_41 కందము వోలం - వసంత

కందము

ధనలుబ్ధుల మ్రుచ్చులఁ గూ
ర్పని వారలఁ బగఱవలని వారల ధృతి చా
లని వారల దుర్జనులం
బనుపవుగా రాజకార్యభారము దాల్పన్.

(రాజకార్యాలకు చెడ్డవారిని పంపటం లేదు కదా!)