Sunday, April 30, 2006

1_6_35 వచనము విజయ్ - విక్రమాదిత్య

వచనము

అంత ద్రోణుచేత ననుజ్ఞాతుం డయి కర్ణుం డర్జునుచూపిన యస్త్రవిద్యావిశేషంబులెల్ల నశ్రమంబునఁ జూపినఁ జూచి దుర్యోధనుండు దానుం దమ్ములును గర్ణునిం గౌఁగిలించుకొని నాతో బద్ధసఖ్యుండ వయి నాకును బాంధవులకును హితంబు సేసి నారాజ్యభోగంబులును నీవును నుపయోగింపు మనిన నట్ల చేయుదు నని కర్ణుం డాతనితోడి యిష్టసఖిత్వంబున కొడంబడి యిమ్మూఁగిన రాజలోకంబున నీవును జూడఁ బార్థుతో ద్వంద్వయుద్ధంబు చేయవలయు ననిన ధార్తరాష్ట్రమధ్యంబున నున్న యక్కర్ణుం జూచి పార్థుం డి ట్లనియె.

(కర్ణుడు ఆ విద్యలన్నీ అతిసులభంగా ప్రదర్శించాడు. దుర్యోధనుడు సంతోషించి కర్ణుడి స్నేహాన్ని కోరాడు. కర్ణుడు సమ్మతించి - ఈ రాజసమూహం, నువ్వూ చూస్తూ ఉండగా అర్జునుడితో ద్వంద్వయుద్ధం చేయాలి - అన్నాడు. అప్పుడు అర్జునుడు ఇలా అన్నాడు.)

1_6_34 కందము విజయ్ - విక్రమాదిత్య

కందము

అనిన నినతనయుపలుకులు
జనులకు విస్మయము సవ్యసాచికిఁ గోపం
బును సిగ్గును మఱి దుర్యో
ధనునకుఁ బ్రీతియును జేసెఁ దత్క్షణమాత్రన్.

(కర్ణుడి మాటలు ప్రజలకు ఆశ్చర్యాన్ని, అర్జునుడికి కోపాన్ని, సిగ్గును, దుర్యోధనుడికి సంతోషాన్ని కలిగించాయి.)

1_6_33 కందము విజయ్ - విక్రమాదిత్య

కందము

నీవ కడనేర్పుకాఁడవు
గా వలవదు వీనిఁ గొన్ని గఱచితి మేమున్
నీవిద్యలెల్లఁ జూపుదు
మే వీరుల సూచి మేలుమే లని పొగడన్.

(నువ్వే నేర్పరివి కాదు. మేము కూడా ఈ విద్యలు కొన్ని నేర్చుకుని ఉన్నాము. నువ్వు చూపిన ఈ విద్యలను - ఈ సామాన్య జనులు కాదు - వీరులు కూడా మెచ్చుకునేలా చూపుతాము కదా!)

1_6_32 వచనము విజయ్ - విక్రమాదిత్య

వచనము

కర్ణుండును జనులనందఱ నదల్చి చొత్తెంచి రంగమధ్యంబున నిలిచి కలయంజూచి కృపద్రోణాచార్యులకు నమస్కరించి సజలజలధరధ్వానగంభీరవచనంబుల నర్జున నాక్షేపించి యి ట్లనియె.

(కర్ణుడు రంగమధ్యంలో నిలిచి, అర్జునుడిని అడ్డగించి, ఇలా అన్నాడు.)

1_6_31 శార్దూలము విజయ్ - విక్రమాదిత్య

శార్దూలము

సాలప్రాంశు నిజోజ్జ్వలత్కవచు శశ్వత్కుండలోద్భాసితున్
బాలార్కప్రతిమున్ శరాసన ధరున్ బద్ధోగ్రని స్త్రింశు శౌ
ర్యాలంకారు సువర్ణవర్ణు ఘనుఁ గర్ణాఖ్యున్ జగత్కర్ణపూ
ర్ణాలోలద్గుణుఁ జూచి చూపఱు ప్రభూతాశ్చర్యు లై రచ్చటన్.

(కర్ణుడిని చూసి ప్రేక్షకులు ఆశ్చర్యపడ్డారు.)

-:కర్ణుఁడు ప్రవేశించి అర్జును నధిక్షేపించుట:-

Sunday, April 23, 2006

1_6_30 వచనము వసు - వసంత

వచనము

అంత.

(అప్పుడు.)

1_6_29 మత్తేభము వసు - వసంత

మత్తేభము

జనులెల్లం గడు సంభ్రమింపఁగ నజస్రం బై భుజాస్ఫాలన
ధ్వని శైలప్రకరంబుపైఁ బడు మహాదంభోళిశబ్దంబొకో
యన వీతెంచినఁ బాండవుల్ సనిరి ద్రోణాచార్యు డాయన్ సుయో
ధను వేష్టించిరి తమ్ములందఱును దద్ద్వారంబు వీక్షించుచున్.

(ఆ వాకిలి వైపు చూస్తూ పాండవులు ద్రోణుడి దగ్గర చేరారు, కౌరవులు దుర్యోధనుడి చుట్టూ చేరారు.)

1_6_28 వచనము వసు - వసంత

వచనము

మఱియుం బాఱెడుసింహవ్యాఘ్రవరాహాదిమృగంబుల ముఖంబులం దొక్కొక్కయ మ్మేసినట్ల యేనేసి యమ్ము లతిలాఘవంబున నేసియు రజ్జుసమాలంబితం బయిన గోశృంగంబునం దేకవింశతిశరంబులు వరుసన నాట నేసియు ని ట్లస్త్రవిద్యావైచిత్ర్యంబు మెఱసి గదాఖడ్గాదివివిధాయుధదక్షతం జూపి యర్జునుండు జనుల కాశ్చర్యంబు సేయుచున్నంతఁ గర్ణుండును నిజవిద్యాకౌశలంబు మెఱయ సమకట్టి రంగద్వారంబున నిలిచి భుజాస్ఫాలనంబు సేసిన.

(తన నైపుణ్యాన్ని ప్రజలకు ప్రదర్శిస్తూ ఉండగా కర్ణుడు ఆ రంగంలో ప్రవేశించాడు.)

1_6_27 సీసము + తేటగీతి వసంత - విజయ్

సీసము

ఆగ్నేయశరమున నతిభీకరాగ్నియు
        వారుణాస్త్రమున దుర్వారజలము
ననిలబాణంబున నధికానిలంబును
        మేఘాస్త్రమున మహామేఘచయముఁ
బుట్టించు మఱియును భూమిబాణంబున
        భూప్రవిష్టుండగు భూరిఘోర
శైలబాణంబున శైలరూపము దాల్చు
        వీరుఁ డదృశ్యాస్త్రవిద్యపేర్మిఁ

తేటగీతి

దా నదృశ్యదేహుం డగుఁ దత్క్షణంబ
హ్రస్వుఁడగు దీర్ఘుఁడగు సూక్ష్ముఁ డగు రయంబు
తోడ రథమధ్యగతుఁ డగు ధూర్గతుండు
నగు మహీతలగతుఁ డగు నద్భుతముగ.

(చాలా అస్త్రాలు ప్రదర్శించాడు.)

1_6_26 వచనము వసు - వసంత

వచనము

అని పొగడుచుండ నర్జునుం డాచార్యుననుమతంబున నస్త్రలాఘవవైచిత్ర్య ప్రకాశనపరుం డయి యెల్లవారును జూచుచుండ.

(అర్జునుడు అక్కడి వాళ్లందరూ చూస్తూ ఉండగా.)

-:అర్జునుండు తనయస్త్రవిద్యాకౌశలంబు సూపుట:-

Friday, April 21, 2006

1_6_25 కందము వసంత - విజయ్

కందము

భూరినిజద్యుతితోడఁ బృ
థారణిసంభూతపాండివాగ్నిత్రితయం
బారఁగ నస్మత్కులదురి
తోరుతరారణ్యదాహ మున్నతిఁ జేయున్.

(కుంతి అనే అరణిలో పుట్టిన మూడు అగ్నులు (ధర్మరాజు, భీముడు, ఆర్జునుడు) నా వంశం యొక్క పాపం అనే అరణ్యాన్ని పూర్తిగా దహించగలవు.)

1_6_24 కందము వసు - వసంత

కందము

అనవుడు ధృతరాష్ట్రుఁడు దన
మనమున సంతోషమంది మానుగ వీనుల్
గనినఫల మిపుడు గంటిన్
వినఁగంటినిఁ బాండుసుతులవిద్యాశక్తుల్.

(అని విదురుడు చెప్పగా ధృతరాష్ట్రుడు సంతోషించాడు.)

1_6_23 కందము వసు - వసంత

కందము

భూరిభుజుం డర్జునుఁ డతి
శూరుఁడు దనయస్త్రవిద్యఁ జూపఁగ రంగ
త్ప్రారంభుఁ డయిన నతని న
వారితముగఁ బొగడుజనరవం బిది యధిపా.

(రాజా! ఇది అర్జునుడిని ప్రశంసించే ప్రజల ధ్వని.)

1_6_22 వచనము వసు - వసంత

వచనము

అయ్యర్జునుస్తుతివచనంబు లొక్కట జనసంఘంబువలన నెగసి వియత్తల విదళనం బయిన నమ్మహాధ్వని విని యదిరిపడి ధృతరాష్ట్రుం డిది యేమి రభసం బని విదురు నడిగిన నాతం డి ట్లనియె.

(అర్జునుడిని ప్రజలు పొగడటం విని ధృతరాష్ట్రుడు ఇదేమిటి అని విదురుడిని ఆడిగాడు.)

1_6_21 కందము వసు - వసంత

కందము

చారుమనస్సమ్మదరస
పూరము వెలివేర్చునట్లు పొలఁతికి విగళ
ద్భూరిస్తనజనితపయో
ధారలు నానందబాష్పధారలు నొప్పెన్.

(కుంతి సంతోషించింది.)

Thursday, April 20, 2006

1_6_20 కందము వసు - వసంత

కందము

అని పలుకుజనులపలుకులు
విని గొంతి యనంతహర్షవిస్తారితలో
చన యై నందను నృపనం
దనసంఘములోనఁ జూచి తద్దయుఁ బొంగెన్.

(ఈ మాటలు విని కుంతి సంతోషించింది.)

1_6_19 తేటగీతి వసు - వసంత

తేటగీతి

వీఁడె కృతహస్తుఁ డఖిలాస్త్రవిద్యలందు
వీఁడె యగ్రగణ్యుఁడు ధర్మవిదులలోన
వీఁడె భరతవంశం బెల్ల వెలుఁగఁ గుంతి
కడుపు చల్లఁగాఁ బుట్టిన ఘనభుజుండు.

(ఇతడే అస్త్రవిద్యలన్నిటిలో నేర్పరి.)

1_6_18 కందము వసు - వసంత

కందము

నరు నింద్రాత్మజు నింద్రా
వరజసఖున్ వీరుఁ బాండవప్రవరు ధను
ర్ధరుఁ జూచి చూపఱెల్లం
బరమాద్భుతచిత్తు లగుచుఁ బలికిరి తమలోన్.

(అర్జునుడిని చూసి ప్రజలు ఇలా అనుకున్నారు.)

1_6_17 ఉత్పలమాల వసంత - విజయ్

ఉత్పలమాల

హారివిచిత్రహేమకవచావృతుఁ డున్నతచాపచారుదీ
ర్ఘోరుభుజుండు భాస్వదసితోత్పలవర్ణుఁడు సేంద్రచాపశం
పారుచిమేఘమో యనఁగ బాండవమధ్యముఁ డొప్పి బద్ధతూ
ణీరుఁడు రంగమధ్యమున నిల్చె జనంబులు దన్నుఁ జూడఁగన్.

(అర్జునుడు రంగమధ్యంలో నిలిచాడు.)

1_6_16 వచనము వసు - వసంత

వచనము

అంత భీమదుర్యోధనుల గదా కౌశలంబు సూచుజనుల పక్షపాత జనిత పరస్పర క్రోధ వచనంబులు విని ద్రోణుండు రంగ భంగ భయంబున నశ్వత్థామం బంచి వారి నిద్దఱ వారించి వారాశియుం బోలె బోరన మ్రోయుచున్న వాదిత్రశబ్దంబు లుడిపి నా ప్రియశిష్యుండయిన యర్జును ధనుర్విద్యా కౌశలంబుఁ జూడుం డనిన నయ్యాచార్యు వచనానంతరంబున.

(ఈ యుద్ధాన్ని చూస్తున్న ప్రజలు కోపావేశాలు పెంచుకొని ఒకరినొకరు అంటున్న మాటలు విని ద్రోణుడు అశ్వత్ధామను పంపి భీమదుర్యోధనులను వారించాడు. నా ప్రియశిష్యుడైన అర్జునుడి నైపుణ్యం చూడండి - అని ద్రోణుడు ప్రకటించిన తరువాత.)

Wednesday, April 19, 2006

1_6_15 కందము వసు - వసంత

కందము

ఆ రాజసుతులవిద్యా
పారగపటుచేష్టితములఁ బరువడి నగ్గాం
ధారీధృతరాష్ట్రుల కతి
ధీరుఁడు విదురుండు సెప్పి తెలుపుచునుండెన్.

(ఈ ప్రదర్శనలను విదురుడు గాంధారీధృతరాష్ట్రులకు వివరిస్తూ ఉన్నాడు.)

1_6_14 మత్తేభము వసు - వసంత

మత్తేభము

అవనీచక్రము పాదఘాతహతి నల్లాడంగ నత్యుగ్రభై
రవహుంకార రవంబునన్ వియదగారంబెల్ల భేదిల్లఁ బాం
డవకౌరవ్యగదావిఘట్టన మకాండప్రోత్థ మై భావిపాం
డవకౌరవ్యరణాభిసూచన పటిష్ఠం బయ్యె ఘోరాకృతిన్.

(వారి యుద్ధం రాబోయే కురుపాండవయుద్ధానికి సూచనలా ఉంది.)

1_6_13 వచనము వసు - వసంత

వచనము

అంత ననంతబలపరాక్రము లగు భీమదుర్యోధను లుద్యద్గదాహస్తు లయి మహామత్సరంబుతో నేక శృంగసముత్తుంగశైలద్వయంబు ననుకరించుచు వశానిమిత్తక్రుద్ధగంధసింధురంబులుం బోలె నొండొరులం దాకి సవ్యాపసవ్యచిత్రమండలమార్గంబుల గదాకౌశలంబు మెఱయునెడ.

(తరువాత భీమదుర్యోధనులు తమ గదాయుద్ధనైపుణ్యాన్ని ప్రదర్శించారు.)

-:భీమదుర్యోధనులు తమగదాకౌశలంబు సూపుట:-

1_6_12 సీసము + ఆటవెలది వసు - వసంత

సీసము

అసిచర్మకౌశలం బమరంగఁ జూపెడు
        వారును దృఢసౌష్ఠవంబు లొప్పఁ
దమతమనామాంకితము లైన శరముల
        నేర్పడ లక్ష్యంబు లేయువారు
హయ మదద్విరద రథారూఢ దక్షతఁ
        బ్రకటించువారును బ్రాసశక్తి
కుంత తోమర గదాకుశలత్వ మెఱిఁగించు
        వారునుగా నిట్లు వసుధలోని

ఆటవెలది

రాజసుతులతోడ రమణఁ బాండవధృత
రాష్ట్రసుతులు వృద్ధరాజులొద్దఁ
దద్దయును ముదమునఁ దమతమవిద్యలు
మెఱసి రెల్లజనులు మెచ్చి పొగడ.

(పాండవులు, కౌరవులు ఆ పెద్దల ముందు తమ సామర్థ్యాన్ని ప్రదర్శించారు.)

1_6_11 వచనము వసు - వసంత

వచనము

అట్లు నిలిచి రక్తచందనదిగ్ధాంగులు రక్తమాల్యాంబరాభరణులు రక్తపతాకులు రక్తాంతలోచను లై యాచార్యు ననుమతంబున.

(ద్రోణుడి ఆజ్ఞతో.)

Monday, April 17, 2006

1_6_10 శార్దూలము వసు - వసంత

శార్దూలము

ద్రోణాచార్యుపిఱుంద నొప్పి దృఢహస్తుల్ బద్ధగోధాంగుళీ
త్రాణుల్ మార్గణపూర్ణతూణులు మహాధన్వుల్ కుమారుల్ తను
త్రాణోపేతులు రంగమధ్యమున నంతన్ నిల్చి రుద్యద్గుణ
శ్రేణీరమ్యులు ధర్మజప్రముఖు లై జ్యేష్ఠానుపూర్వంబుగన్.

(అల్లెత్రాటిదెబ్బ తగలకుండా ఉడుముతోలుతో కుట్టిన కవచాలు వేళ్లకు తొడుక్కొని, ఇతర ఆయుధాలతో పాండవులు, కౌరవులు ద్రోణుడి వెనుక, ధర్మరాజు పక్కన, వయస్సు ప్రకారం నిలిచారు.)

1_6_9 వచనము వసు - వసంత

వచనము

అట్టియవసరంబున నాచార్యుండు శుక్లాంబరాభరణమాల్యానులేపన యజ్ఞోపవీతపలితకేశశ్మశ్రు శోభితదేహుం డై రంగమధ్యంబున నశ్వత్థామసహితుం డై విముక్తజలదజాలవియన్మధ్యంబున నంగారకసహితుం డైన యాదిత్యుండునుంబోలె నున్న నగణ్యభూసురవరేణ్యపుణ్యాహవాచనానంతరంబున.

(ద్రోణుడు అశ్వత్థామతో ఆ రంగం మధ్యలో ఉండి.)

1_6_8 సీసము + ఆటవెలది వసంత - విజయ్

సీసము

వ్యాసపురస్కృతావనిదేవ నివహంబుఁ
        గృప శల్య శకుని గాంగేయ విదుర
సోమదత్తాది భాసుర గురుబాంధవ
        మిత్త్రవర్గంబు నమేయమంత్రి
సామంత మండలేశ్వర సమూహంబును
        గాయక వైతాళికప్రవరులుఁ
దమతమ నియమితస్థానంబులం దోలి
        నుండిరి బోరన నులిసె భేరు

ఆటవెలది

లస్త్రదర్శనాగతాఖిల క్షత్త్రియ
వైశ్య శూద్ర వివిధవర్ణజనుల
కలకలంబు ప్రళయకాల సంక్షోభితాం
భోనిధి స్వనంబుఁ బోలెఁ జెలఁగె.

(పెద్దలందరూ వారి వారి స్థానాలలో కూర్చున్నారు.)

1_6_7 వచనము వసు - వసంత

వచనము

మఱియును.

(ఇంకా.)

1_6_6 తేటగీతి వసు - వసంత

తేటగీతి

సుతులవిద్యాప్రవీణతఁ జూచువేడ్క
నెంతయును సంతసంబునఁ గుంతిదేవి
రాజసన్నిధి గాంధారరాజపుత్త్రి
కెలన నుండె నున్మీలితనలిననేత్ర.

(కుంతి కూడా ఆ ప్రదర్శన చూడటం కోసం వచ్చింది.)

Sunday, April 16, 2006

1_6_5 తేటగీతి వసు - వసంత

తేటగీతి

అందుఁ గరమొప్పి సుందరీబృంద మఖిల
రత్నరాజితకనకధరాధరేంద్ర
కందరాంతరమున నున్న సుందరామృ
తాశనాంగనాబృందంబు ననుకరించె.

(ఆ ఇంట్లో ఉన్న స్త్రీలు దేవతలను పోలి ఉన్నారు.)

1_6_4 వచనము వసు - వసంత

వచనము

అనిన నట్ల చేయుదు నని ధృతరాష్ట్రుండు గుమారుల విద్యాసందర్శన రంగంబు రమ్యంబుగాఁ జేయింపు మని విదురుం బంచిన నతండును దాని శాస్త్రవిహిత ప్రమాణోపేత వృత్తాయామంబును నపాకృత వృక్ష గుల్మ వల్మీకంబును నంగీకృత పూర్వోత్తరప్లవంబును సమీకృత నిమ్నోన్నత ప్రదేశంబును దూరీకృత కంటక పాషాణ శల్య శకలంబును విరజీకృత రజోధూసర స్థలంబును విరచిత బహువిధ ప్రేక్షాగారాంచిత మణిమయమంచ ప్రపంచంబును నానాధ్వజ నవపల్లవ రంభాస్తంభమాలాలంకృత ద్వారతోరణంబును బ్రతిదిశ నిర్వర్తిత శాంతిక బలివిధానంబునుంగాఁ జేయించినం బంచాంగశుద్ధదినశుభముహూర్తంబున ధృతరాష్ట్రుండు గాంధారీపురస్కృత దేవీశతపరివృతుం డై వివిధభూషణ భూషితానేక విలాసీనీనివహంబుతోఁ జనుదెంచి విలంబిత కదంబక స్థూలముక్తాఫలదామ రమణీయం బై యాబద్ధ మరకత వజ్ర వైడూర్య పద్మరాగ ప్రవాళ ప్రభాప్రకర వ్యతికర విరచితాపూర్వ సురచాపచారుగౌరవం బై యతిమనోహరం బైన శాతకుంభమయ ప్రేక్షాగారంబున నున్న.

(ధృతరాష్ట్రుడు అందుకు అంగీకరించి విదురుడికి చెప్పి తగిన ఏర్పాట్లు చేయించాడు. ఆ ప్రదర్శన చూడటానికి నిర్మించిన ప్రత్యేకమైన ఇంటికి ధృతరాష్ట్రుడు తన భార్యలతో వచ్చాడు.)

1_6_3 కందము వసు - వసంత

కందము

ఘోరాస్త్ర శస్త్ర విద్యల
నారూఢత మిగుల నిపుణు లైరి కుమారుల్
మీరలు వీరల విద్యా
పారము సను టెఱుఁగవలయు భవదీయ సభన్.

(రాకుమారులు విద్యలలో నేర్పరులయ్యారు. మీరు సభలో వాళ్ల నేర్పును తెలుసుకోవాలి.)

-:కుమారాస్త్రవిద్యాసందర్శనము:-

1_6_2 వచనము వసు - వసంత

వచనము

అ క్కథకుండు శౌనకాది మహామునులకుం జెప్పె నట్లు కృతాస్త్రశస్త్రులయిన రాజకుమారుల విద్యాకౌశలంబు వ్యాస గాంగేయ విదుర కృప శల్య శకుని సోమదత్తాదుల సమక్షంబునం జూప సమకట్టి యొక్కనాఁడు ద్రోణుండు ధృతరాష్ట్రు కిట్లనియె.

(శౌనకాది మునులకు మహాభారత కథ చెపుతున్న రౌమహర్షణి కథను మళ్లీ ఇలా ప్రారంభించాడు - రాకుమారుల విద్యానైపుణ్యాన్ని పెద్దలముందు ప్రదర్శింపజేయాలనుకున్న ద్రోణుడు ధృతరాష్ట్లుడితో ఇలా అన్నాడు.)

1_6_1 కందము వసు - వసంత

కందము

శ్రీ జయవిభాసి వినమ
ద్రాజన్య కిరీటమణి విరాజిత పాదాం
భోజ భువనైక సుందర
రాజాన్వయతిలక రాజరాజనరేంద్రా.

(రాజరాజనరేంద్రా!)

ఆదిపర్వము - షష్ఠాశ్వాసము

Friday, April 14, 2006

1_5_262 గద్యము చేతన - వసంత

గద్యము

ఇది సకల సుకవి జన వినుత నన్నయభట్ట ప్రణీతం బైన శ్రీ మహాభారతంబునం దాదిపర్వంబున ధృతరాష్ట్ర పాండురాజుల వివాహంబును బాండురాజదిగ్విజయంబును బాండవ ధార్తరాష్ట్ర సంభవంబును బాండు రాజు నిర్యాణంబును గృపద్రోణజన్మకథనంబును గుమారాస్త్రవిద్యాగ్రహణంబును నన్నది పంచమాశ్వాశము.

(ఇది నన్నయ రచించిన మహాభారతంలో, ఆదిపర్వంలో, ధృతరాష్ట్ర పాండురాజుల వివాహం, పాండురాజు దిగ్విజయం, పాండవధార్తరాష్ట్రుల జననం, పాండురాజు మరణం, కృపాచార్య ద్రోణాచార్యుల పుట్టుక, కురుకుమారులు అస్త్రవిద్యను అభ్యసించటం - అనే కథార్థాలు గల ఐదవ ఆశ్వాసం.)

1_5_261 వనమయూరము చేతన - వసంత

వనమయూరము

రాజకులశేఖర పరంతప వివేక
భ్రాజిత జగద్వలయ భాసుర సముద్య
త్తేజ నిరవద్య యువతీమదన వీరో
గ్రాజి విజయా త్రిభువనాంకుశ నరేంద్రా.

(త్రిభువనాంకుశ అనే బిరుదం కలవాడా!)

1_5_260 కందము చేతన - వసంత

కందము

వ్యససవివర్జిత మాన
వ్యసగోత్రపవిత్ర విష్ణువర్ధన నృప స
ప్తసముద్రముద్రితాఖిల
వసుధాజనగీతకీర్తి వాసవమూర్తీ.

(మహారాజా!)

-:ఆశ్వాసాంతము:-

1_5_259 వచనము చేతన - వసంత

వచనము

అ మ్మహోగ్రగ్రాహంబు పార్థబాణపంచక విభిన్నదేహం బయి పంచత్వంబుఁ బొందినం జూచి ద్రోణుం డర్జును ధనుః కౌశలంబునకుఁ దనయం దతిస్నేహంబునకు మెచ్చి వీనిచే ద్రుపదుండు బంధుసహితంబు పరాజితుం డగు నని తన మనంబున సంతోషించి వానికి ననేక దివ్యబాణంబు లిచ్చె నని యర్జునుకొండుకనాఁటి పరాక్రమగుణసంపదలు వైశంపాయనుండు జనమేజయునకుం జెప్పె నని.

(అర్జునుడి చేతిలో ద్రుపదుడు ఓడిపోగలడని ద్రోణుడు సంతోషించాడు. అర్జునుడికి చాలా దివ్యబాణాలు ఇచ్చాడు - అని అర్జునుడి చిన్ననాటి పరాక్రమం గురించి వైశంపాయనుడు జనమేజయుడికి చెప్పాడు.)

1_5_258 శార్దూలము చేతన - వసంత

శార్దూలము

దానిన్ నేరక యందఱున్ వివశు లై తా రున్న నన్నీరిలోఁ
గానం గాని శరీరముం గల మహోగ్ర గ్రాహమున్ గోత్ర భి
త్సూనుం డేను శరంబులన్ విపుల తేజుం డేసి శక్తిన్ మహా
సేన ప్రఖ్యుఁడు ద్రోణుజంఘ విడిపించెన్ విక్రమం బొప్పఁగన్.

(అది చేతకాక ఆ రాకుమారులు దిక్కుతెలియకుండా ఉండగా అర్జునుడు బాణాలతో ఆ మొసలిని చంపాడు.)

1_5_257 కందము చేతన - వసంత

కందము

దాని విడిపింప ద్రోణుఁడు
దా నపుడు సమర్థుఁ డయ్యుఁ దడయక పనిచెన్
దీని విడిపింపుఁ డని నృప
సూనుల శరసజ్యచాపశోభితకరులన్.

(దీనిని విడిపించండి - అని రాకుమారులను ద్రోణుడు ఆజ్ఞాపించాడు.)

1_5_256 కందము చేతన - వసంత

కందము

వెఱచెఱవ నీరిలో నొ
క్కెఱగా నొక మొసలి చూడ్కికి నగోచర మై
పఱతెంచి కుంభసంభవు
చిఱుదొడ వడిఁ బట్టికొనియె శిష్యులు బెదరన్.

(ఒక మొసలి అతడి పిక్కను పట్టుకున్నది.)

1_5_255 కందము చేతన - వసంత

కందము.

మానుగ రాజకుమారుల
తో నొక్కట నొక్కనాఁడు ద్రోణుఁడు గంగా
స్నానార్థ మరిగి యందు మ
హా నియమస్థుఁ డయి నీళ్ళ నాడుచునున్నన్.

(ఒకరోజు ద్రోణుడు గంగానదిలో స్నానం చేస్తుండగా.)

-:అర్జునుఁడు ద్రోణుని మొసలినుండి విడిపించుట:-

1_5_254 వచనము చేతన - వసంత

వచనము

ఇ ట్లశ్రమంబునఁ గృత్రిమ పక్షి తలఁ దెగనేసిన యర్జును నచలిత దృష్టికి లక్ష్యవేధిత్వంబునకు మెచ్చి ద్రోణుం డాతనికి ధనుర్వేద రహస్యంబు లుపదేశించె నంత.

(ద్రోణుడు మెచ్చి అతడికి విలువిద్యారహస్యాలు నేర్పాడు.)

1_5_253 కందము చేతన - వసంత

కందము

గురువచనానంతరమున
నరుఁ డప్పుడు శరవిమోక్షణము సేయుఁడుఁ జె
చ్చెరఁ బక్షిశిరము దెగి త
ద్ధరణీరుహశాఖనుండి ధారుణిఁ బడియెన్.

(అర్జునుడు అలాగే చేశాడు.)

1_5_252 కందము చేతన - వసంత

కందము

పక్షిశిరంబు దిరంబుగ
నీక్షించితి నొండు గాన నెద్దియు ననినన్
లక్షించి యేయు మని సూ
క్ష్మేక్షణు ద్రోణుండు పనిచె నింద్రతనూజున్.

(పక్షితలను చూశాను. ఇంకేదీ నాకు కనిపించటం లేదు - అని అన్నాడు. గురి చూసి కొట్టు - అని ద్రోణుడు అతడిని ఆజ్ఞాపించాడు.)

1_5_251 వచనము చేతన - వసంత

వచనము

అనిన విని ద్రోణుండు ధర్మజుం బదరి నీదృష్టి చెదరె నీవు దీని నేయనోపవు పాయు మని యవ్విధంబున దుర్యోధనాదు లైన ధార్తరాష్ట్రులను భీమసేన నకుల సహదేవులను నానాదేశాగతు లైన రాజపుత్త్రులను గ్రమంబున నడిగిన వారలు ధర్మనందను చెప్పినట్ల చెప్పిన నందఱ నిందించి పురందరనందనుం బిలిచి వారి నడిగిన యట్ల యడిగిన నాచార్యునకు నర్జునుం డి ట్లనియె.

(నీ దృష్టి చెదిరింది - అని నిందించి ద్రోణుడు ధర్మరాజును పక్కకు తప్పుకొమ్మన్నాడు. మిగిలిన వారు కూడా ఆ సమాధానమే ఇచ్చారు. ద్రోణుడు అర్జునుడిని పిలిచి అదే ప్రశ్న అడిగాడు.)

1_5_250 కందము చేతన - వసంత

కందము

జననుత యా మ్రానిని న
న్నును మఱి నీ భ్రాతృవరులనుం జూచితె నీ
వనవుడుఁ జూచితి నన్నిటి
ననఘా వృక్షమున నున్న యవ్విహగముతోన్.

(ఆ మానును, నన్ను, నీ తమ్ముళ్లని చూశావా? - అని అడిగాడు. చూశానని ధర్మరాజు చెప్పాడు.)

1_5_249 తేటగీతి చేతన - వసంత

తేటగీతి

వృక్షశాఖాగ్రమున నున్న పక్షిశిరము
దెల్లముగఁ జూచితే మహీవల్లభుండ
యనిన నిమ్ముగఁ జూచితి ననిన వెండి
యును గురుఁడు ధర్మజున కిట్టు లనియెఁ బ్రీతి.

(ధర్మరాజా! ఆ పక్షితలను చూశావా? - అని అడిగాడు. చూశానని అతడు చెప్పాడు.)

1_5_248 వచనము చేతన - వసంత

వచనము

అ క్కుమారుల ధను ర్విద్యా కౌశలం బెఱుంగ వేఁడి యొక్కనాఁడు ద్రోణుండు కృత్రిమం బయిన భాసం బను పక్షి నొక్క వృక్ష శాఖాగ్రంబున లక్ష్యంబుగా రచియించి దాని నందఱుకుఁ జూపి మీమీ ధనువులు బాణంబులు సంధించి నా పంచిన యప్పుడ యిప్పక్షి తలఁ దెగ నేయుం డే నొకళ్లొకళ్లన పంచెద నని ముందఱ ధర్మనందనుం బిలిచి యీ వృక్షశాఖాగ్రంబున నున్న పక్షి నిమ్ముగా నీక్షించి మద్వచనానంతరంబున శరమోక్షణంబు సేయు మనిన నతండును వల్లె యని గురువచనంబు సేసి యున్న నయ్యుధిష్ఠిరునకు ద్రోణుం డి ట్లనియె.

(కురుకుమారుల విలువిద్యను తెలుసుకోవటానికి ద్రోణుడు ఒకనాడు భాసమనే పక్షిని ఒక చెట్టు కొమ్మ చివరన కట్టి, ముందుగా ధర్మరాజును పిలిచి.)

-:ద్రోణుఁ డస్త్రవిద్యం దనశిష్యులఁ బరీక్షించుట:-

1_5_247 కందము చేతన - వసంత

కందము

అనిలాత్మజు బలమును న
ర్జును కార్ముక కౌశలంబు శూరగుణంబుల్
మనమున సహింపనోపక
వనరుచు ధృతరాష్ట్రసుతులు వందిరి తమలోన్.

(భీముడి బలాన్నీ, అర్జునుడి అస్త్రవిద్యానైపుణ్యాన్నీ సహించలేక కౌరవులు దుఃఖించారు.)

1_5_246 మత్తకోకిలము చేతన - వసంత

మత్తకోకిలము

భూపనందను లివ్విధంబున భూరి శస్త్రమహాస్త్రవి
ద్యోపదేశపరిగ్రహస్థితి నున్న నందఱయందు వి
ద్యోపదేశము దుల్య మైనను నుత్తమోత్తముఁ డయ్యె వి
ద్యాపరిశ్రమకౌశలంబున దండితారి నరుం డిలన్.

(రాకుమారులు అందరూ ద్రోణుడి దగ్గర విలువిద్య నేర్చుకున్నా అర్జునుడు వారిలో సర్వశ్రేష్ఠుడు అయ్యాడు.)

1_5_245 కందము చేతన - వసంత

కందము

విలువిద్య నొరులు నీ క
గ్గలముగ లేకుండ నిన్నుఁ గఱపుదు నని మున్
బలరిపు సుతునకుఁ బలికిన
పలు కప్పుడు గురుఁడు సేసెఁ బరమార్థముగన్.

(తన మాటను ద్రోణుడు ఇలా నిజం చేశాడు.)

1_5_244 తేటగీతి చేతన - వసంత

తేటగీతి

దక్షిణాంగుష్ఠ మిచ్చిన దానఁ జేసి
బాణ సంధాన లాఘవ భంగ మయిన
నెఱుకు విలువిద్య కలిమికి హీనుఁ డయ్యెఁ
బార్థునకును మనోరజ పాసె నంత.

(ఏకలవ్యుడు ఈ విధంగా అస్త్రవిద్యాసంపద కోల్పోవటం వల్ల అర్జునుడికి దుఃఖం తొలగింది.)

1_5_243 కందము చేతన - వసంత

కందము

నెమ్మిని నీ దక్షిణహ
స్తమ్మున పెనువ్రేలు దునిమి దక్షిణ యి మ్మి
ష్ట మ్మిది నా కనవుడు విన
యమ్మున వాఁ డిచ్చె దాని నాచార్యునకున్.

(ద్రోణుడు ఏకలవ్యుడి కుడిచేతి బొటనవేలిని దక్షిణగా అడిగాడు. ఏకలవ్యుడు వినయంతో దానిని ద్రోణుడికి ఇచ్చాడు.)

1_5_242 కందము చేతన - వసంత

కందము

ఇది దేహం బిది యర్థం
బిది నా పరిజన సమూహ మిన్నిటిలో నె
య్యది మీ కిష్టము దానిన
ముద మొదవఁగ నిత్తుఁ గొనుఁ డమోఘం బనినన్.

(మీకేది ఇష్టమో అది తీసుకోండి - అని ఏకలవ్యుడు అనగా.)

1_5_241 వచనము చేతన - వసంత

వచనము

అనిన విని ద్రోణుం డదరిపడి వానిం జూతము ర మ్మని యర్జునుం దోడ్కొని యనవరతశరాసనాభ్యాసనిరతుం డయి యున్న యేకలవ్యుకడ కేఁగిన నెఱింగి వాఁడు నెదురు పఱతెంచి ద్రోణునకు మ్రొక్కి తన శరీరంబు సర్వస్వంబును నివేదించి యేను మీ శిష్యుండ మి మ్మారాధించి మీప్రసాదంబున నివ్విలువిద్యఁ గఱచితి నని కరంబులు మొగిచియున్నం జూచి ద్రోణుం డట్లేని మాకు గురుదక్షిణ యి మ్మనిన సంతసిల్లి వాఁ డి ట్లనియె.

(అది విని ద్రోణుడు అదిరిపడి, అర్జునుడిని తీసుకొని ఏకలవ్యుడి దగ్గరకు వెళ్లాడు. ఏకలవ్యుడు ద్రోణుడికి నమస్కరించి - మిమ్మల్ని సేవించి నేను విలువిద్య నేర్చుకున్నాను - అని అన్నాడు. అయితే నాకు గురుదక్షిణ ఇవ్వు - అని ద్రోణుడు అన్నాడు.)

1_5_240 కందము నచకి - వసంత

కందము

నాకంటెను మీకంటెను
లోకములో నధికుఁ డతిబలుండు ధనుర్వి
ద్యాకౌశలమున నాతఁడు
మీకుం బ్రియశిష్యుఁ డటె యమిథ్యావచనా.

(అతడు నాకంటే, మీకంటే, ఈ లోకంలో అధికుడు. అతడు మీ శిష్యుడట కదా!)

1_5_239 కందము నచకి - వసంత

కందము

విలువిద్య నొరులు నీ క
గ్గలముగ లేకుండ నిన్నుఁ గఱపుదు నని మున్
బలికితిరి నాక కా దీ
త్రిలోకముల కధికుఁ జూచితిమి యొక యెఱుకున్.

(విలువిద్యలో నాకంటే గొప్పవాడు లేనట్లుగా నేర్పుతానని నాతో అన్నారు. కానీ, నాకే కాక, ముల్లోకాలలో అధికుడైన ఒక ఎరుకును చూశాము.)

1_5_238 వచనము వసంత - విజయ్

వచనము

అనిన విని కురుకుమారులందఱు మగుడి వచ్చి ద్రోణున కంతయుఁ జెప్పి రంత నర్జునుం డేకాంతంబ యొక్కనాఁ డాచార్యున కి ట్లనియె.

(ఆ రాకుమారులు ఈ విషయం వచ్చి ద్రోణుడికి చెప్పారు. తరువాత అర్జునుడు ఒకరోజు ద్రోణుడితో ఇలా అన్నాడు.)

1_5_237 కందము నచకి - వసంత

కందము

వినుఁ డే హిరణ్యధన్వుం
డను వనచరనాథు కొడుక నాచార్యుఁడు ద్రో
ణునకున్ శిష్యుఁడ నెందును
ననవద్యుఁడ నేకలవ్యుఁ డనువాఁడ మహిన్.

(అతడు - నేను ఏకలవ్యుడిని, ద్రోణాచార్యుడి శిష్యుడిని - అన్నాడు.)

1_5_236 వచనము నచకి - వసంత

వచనము

అ క్కుమారులు వాని శరలాఘవంబునకు మెచ్చి నీ వెవ్వండ వెవ్వరిచేత విలువిద్యఁ గఱచి తని యడిగిన వారికి నయ్యెఱు కి ట్లనియె.

(అతడి శరలాఘవాన్ని మెచ్చుకుని - ఎవరు నువ్వు? విలువిద్య ఎవరి దగ్గర నేర్చుకున్నావు? - అని అడిగారు.)

1_5_235 ఉత్పలమాల నచకి - వసంత

ఉత్పలమాల

తేజితబాణహస్తు దృఢదీర్ఘమలీమసకృష్ణదేహుఁ గృ
ష్ణాజినవస్త్రు నస్త్రవిషయాస్తవిషాదు నిషాదుఁ జూచి యా
రాజకుమారులందఱుఁ బరస్పరవక్త్రవిలోకనక్రియా
వ్యాజమునం దదీక్షణనివారితు లై రతిమత్సరంబునన్.

(ఏకలవ్యుడిని చూసి.)

1_5_234 వచనము వసంత - విజయ్

వచనము

ఇ ట్లరిగి వనంబులోఁ గ్రుమ్మరుచున్న నం దొక్క భటుని కుక్క తోడు దప్పి పఱచి యొక్కెడ నేకతంబ యేయుచున్న నేకలవ్యుసమీపంబున మొఱింగిన నయ్యెలుంగు విని దానిముఖంబునం దేడుబాణంబు లొక్కటఁ దొడిగి యక్కజంబుగా నతిలాఘవంబున వాఁడేసిన నది శరపూరిత ముఖం బయి కురుకుమారుల యొద్దకుం బాఱిన దానిం జూచి విస్మయం బంది య ట్లేసినవాఁ డెవ్వఁడో యని రోయుచు వచ్చువారు ముందఱ.

(వారి కుక్క ఒకటి పరుగెత్తి ఏకలవ్యుడి దగ్గరకు వచ్చి మొరుగుతూ ఉండగా అతడు చాకచక్యంతో ఏడుబాణాలను ఒక్కటిగా సంధించి ఆ కుక్క నోట కొట్టాడు. అది పాండవుల దగ్గరకు పరుగెత్తింది. వారు ఆశ్చర్యపోయి, అలా కొట్టినవాడి కోసం వెదుకుతూ వస్తూ.)

1_5_233 కందము నచకి - వసంత

కందము

ఇట పాండవకౌరవు లొ
క్కొట నందఱు గురుననుజ్ఞఁ గొని మృగయాలం
పటు లై వనమున కరిగిరి
పటుతర జవసారమేయభటనివహముతోన్.

(ఇక్కడ హస్తినాపురంలో రాకుమారులు వేట కోసం అడవికి వెళ్లారు.)

1_5_232 తేటగీతి వసంత - విజయ్

తేటగీతి

వినయమున ద్రోణురూపు మన్నున నమర్చి
దాని కతిభక్తితోడఁ బ్రదక్షిణంబుఁ
జేసి మ్రొక్కుచు సంతతాభ్యాసశక్తి
నస్త్రవిద్యారహస్యంబు లర్థిఁ బడసె.

(మట్టితో ద్రోణుడి బొమ్మను చేసి, దానినే పూజిస్తూ, విలువిద్యలోని రహస్యాలన్నీ గ్రహించాడు.)

1_5_231 వచనము వసంత - విజయ్

వచనము

మఱియు గదాకార్ముకప్రాసాసితోమరకుంతశక్త్యాది వివిధాయుధంబులయందును గుమారుల నందఱ జితశ్రములం జేయుచున్న ద్రోణాచార్యుల మహాప్రసిద్ధి విని హిరణ్యధ్వనుం డను నెఱుకురాజుకొడు కేకలవ్యుం డనువాఁడు ధనుర్విద్యాగ్రహణార్థి యయి వచ్చినవాని నిషాదపుత్త్రుం డని శిష్యుంగాఁ జేకొన కున్న వాఁడును ద్రోణుననుజ్ఞ వడసి చని వనంబులోన.

(ద్రోణుడి కీర్తి విని, హిరణ్యధన్వుడు అనే ఎరుకరాజు కొడుకు అయిన ఏకలవ్యుడు అనేవాడు విలువిద్య నేర్చుకోవాలని వచ్చాడు. నేర్పటానికి ద్రోణుడు అంగీకరించకపోవటంతో ఏకలవ్యుడు అడవిలోకి వెళ్లి.)

-:ఏకలవ్యుం డనువాఁడు ద్రోణు నారాధించి విలువిద్య గఱచుట:-

1_5_230 సీసము + తేటగీతి నచకి - వసంత

సీసము

ఆతని యస్త్రవిద్యాభియోగమునకుఁ
        బ్రియశిష్యవృత్తికిఁ బెద్ద మెచ్చి
యన్న ధనుర్ధరు లన్యులు నీకంటె
        నధికులు గాకుండునట్లు గాఁగఁ
గఱపుదు విలువిద్య ఘనముగా నని పల్కి
        ద్వంద్వ సంకీర్ణ యుద్ధముల తెఱఁగు
రథ మహీ వాజి వారణములపై నుండి
        దృఢచిత్ర సౌష్ఠవస్థితుల నేయ

తేటగీతి

బహువిధ వ్యూహ భేదనోపాయములను
సంప్రయోగ రహస్యాతిశయము గాఁగఁ
గఱపె నర్జునుఁ దొంటి భార్గవుఁడు వింట
నిట్టిఁ డే యని పొగడంగ నెల్లజనులు.

(అతడి పట్టుదలకు మెచ్చుకుని - నీకంటే ఇంకెవరూ గొప్పవారు కానట్లుగా విలువిద్య నేర్పిస్తాను - అని - పరశురాముడు కూడా విలువిద్యలో ఇంతటి వాడు కాడు - అని ప్రజలు ప్రశంసించేలా అర్జునుడికి విలువిద్యలోని రహస్యాలు నేర్పాడు.)

1_5_229 కందము వసంత - విజయ్

కందము

పాయక చీఁకటియందును
నేయంగా నభ్యసించు నిట్టియెడం గౌం
తేయ ధనుర్జ్యా ధ్వని విని
ధీయుక్తుఁడు ద్రోణుఁ డరుగుదెంచి ముదమునన్.

(ద్రోణుడు సంతోషంతో అక్కడికి వచ్చి.)

1_5_228 ఉత్పలమాల నచకి - వసంత

ఉత్పలమాల

వాసవనందనుండు గుడువం గుడువం బటుమారుతాహతిం
జేసి చలించి దీపశిఖ చెచ్చెరఁ బాయుడు భోజనక్రియా
భ్యాసవశంబునన్ గుడిచి పన్నుగ నిట్టుల విద్య లెల్ల న
భ్యాసవశంబునం బడయ భారము లే దని నిశ్చితాత్ముఁ డై.

(అర్జునుడు అన్నం తింటూండగా గాలికి దీపం ఆరిపోయింది. అయినా ఆ చీకటిలోనే అన్నం తిని, ఆ విధంగా విద్యలను సాధన చేయవచ్చని నిశ్చయించుకున్నాడు.)

1_5_227 వచనము వసంత - విజయ్

వచనము

అ య్యర్జునుతోడి విద్యా మత్సరంబునఁ జీఁకటి నాతం డేయ నేరకుండ వలయు నని తలంచి యశ్వత్థామ రహస్యంబున నన్నసాధకుం బిలిచి యెన్నండును నరునకు నంధకారంబునఁ గుడువం బెట్టకుమీ యని పంచిన వాఁడును దద్వచనానురూపంబు సేయుచున్న నొక్కనాఁటి రాత్రియందు.

(చీకట్లో బాణాలు వేయటం అర్జునుడు నేర్చుకోకుండా ఉండాలని, అశ్వత్ధామ విద్యాస్పర్ధతో - చీకట్లో అర్జునుడికి అన్నం పెట్టవద్దు - అని వంటవాడిని ఆజ్ఞాపించాడు. ఒకరోజు.)

1_5_226 కందము నచకి - వసంత

కందము

నరుఁ డస్త్ర శస్త్ర విద్యా
పరిణతి నధికుఁ డయి వినయపరుఁ డయి శశ్వ
ద్గురుపూజాయత్నంబునఁ
బరఁగుచు సంప్రీతుఁ జేసె భారద్వాజున్.

(అర్జునుడు విలువిద్యలో నైపుణ్యం సాధించి, గురుపూజ చేస్తూ, ద్రోణుడిని సంతోషపరిచాడు.)

1_5_225 వచనము వసంత - విజయ్

వచనము

ఇట్లు దన యిష్టంబు దీర్పం బూనిన యర్జును నాచార్యుం డతి స్నేహంబునఁ గౌఁగిలించుకొని కరంబు సంతసిల్లి కుమారుల కెల్ల విలువిద్యఁ గఱపుచున్న నానాదేశంబులం గల రాజపుత్త్రు లెల్ల వచ్చి వారితోడఁ గలసి కఱచుచుండిరి మఱియు సూతపుత్రుం డయిన రాధేయుండును ధనుర్విద్యాకౌశలంబున నర్జునునితోడ మచ్చరించుచు దుర్యోధనపక్షపాతి యై యుండె నంత.

(ద్రోణుడు సంతోషించి వారికి విలువిద్య నేర్పుతుండగా సూతుడి కుమారుడైన రాధేయుడు అర్జునుడి మీద ద్వేషంతో దుర్యోధనుడి పక్షంలో వచ్చి చేరాడు.)

1_5_224 తేటగీతి వసంత - విజయ్

తేటగీతి

అస్త్రవిద్యలు గఱచి నా దైన యిష్ట
మొగిన తీర్పంగ నిం దెవ్వఁ డోపు ననినఁ
బాయ మొగమిడి కౌరవుల్ పలుకకుండి
రేను దీర్చెద నని పూనె నింద్రసుతుఁడు.

(నా దగ్గర అస్త్రవిద్యలు నేర్చుకుని నా కోరిక మీలో ఎవ్వడు తీర్చగలడు - అని అడిగాడు. కౌరవులందరూ పెడమొగం పెట్టి మౌనం వహించగా అర్జునుడు - నేను తీరుస్తాను - అని ముందుకు వచ్చాడు.)

1_5_223 వచనము విజయ్ - విక్రమాదిత్య

వచనము

అని కుమారుల నెల్లం జూపి ద్రోణునకు శిష్యులంగా సమర్పించిన ద్రోణుండును వారలం జేకొని యందఱ కి ట్లనియె.

(రాకుమారులందరినీ ద్రోణుడికి శిష్యులుగా సమర్పించాడు. ద్రోణుడు వారితో ఇలా అన్నాడు.)

1_5_222 చంపకమాల నచకి - వసంత

చంపకమాల

మనుమల నెల్లఁ జూపి మతిమంతుఁడు శాంతనవుండు వీరిఁ జే
కొని గురువృత్తిమైఁ గఱపు ఘోరశరాసనవిద్యలెల్లఁ బెం
పున జమదగ్నినూనుఁడును బోలఁడు ని న్నని విందు విల్లునే
ర్పున నయనైపుణంబునను భూరిపరాక్రమగర్వసంపదన్.

(భీష్ముడు తన మనుమలను ద్రోణుడికి చూపించి.)

1_5_221 వచనము నచకి - వసంత

వచనము

మఱియును.

(అంతేకాక.)

1_5_220 కందము నచకి - వసంత

కందము

విని రోయు తీఁగ గాళ్లం
బెనఁగెం దా ననుచుఁ బొంగి భీష్ముఁడు ద్రోణున్
ఘనభుజ నభీష్ట పూజా
ధన దాన విధానముల ముదంబునఁ దనిపెన్.

(వెదుకబోయిన తీగ కాళ్లకు చుట్టుకున్నట్లు భీష్ముడు సంతోషించి అతడిని పూజించి ధనధాన్యాలు ఇచ్చాడు.)

1_5_219 వచనము వసంత - విజయ్

వచనము

అని నిశ్చయించి ద్రుపదునొద్దకుం బోయి న న్నెఱింగించిన నాతండు దన రాజ్యమదంబున నన్నును దన్నును నెఱుంగక యేను రాజను నీవు పేద పాఱుండవు నాకును నీకును నెక్కడి సఖ్యం బని పలికిన వానిచేత నవమానితుండ నయి వచ్చితి నని ద్రోణుండు దనవృత్తాంతం బంతయుఁ జెప్పిన.

(కానీ అతడు నన్ను అవమానించాడు - అని చెప్పాడు.)

1_5_218 మత్తకోకిలము నచకి - వసంత

మత్తకోకిలము

వేఁడు టెంతయుఁ గష్టమైనను వేఱులేని సుహృజ్జనున్
వేఁడికో లుచితంబ కావున వేడ్కతోఁ జని సోమకున్
వేఁడినన్ ధన మోపఁడేనియు వీని మాత్రకు నాలుగేన్
పాఁడి కుఱ్ఱుల నీఁడె వీనికిఁ బాలు ద్రావుచునుండఁగన్.

(యాచించటం కష్టమే అయినా మిత్రుడిని అడగటం ఉచితమే. ధనం కాకపోయినా అశ్వత్ధామ పాలు తాగటం కోసం ద్రుపదుడు నాలుగు పాడి ఆవులు ఇవ్వడా?)

1_5_217 వచనము నచకి - వసంత

వచనము

దానిం జూచి దారిద్ర్యంబున కంటెఁ గష్టం బొం డెద్దియు లేదు దీని నా బాలసఖుండగు పాంచాలు పాలికిం బోయి పాచికొందు నాతండు తనదేశంబున కభిషిక్తుండు గాఁ బోవుచుండి నన్ను రాఁ బనిచిపోయె.

(దారిద్ర్యం కంటే కష్టం లేదని భావించి నేను ద్రుపదుడి దగ్గరకు వెళ్లాను.)

1_5_216 కందము వసంత - విజయ్

కందము

ధనపతుల బాలురు ముదం
బున నిత్యముఁ బాలు ద్రావఁబోయిన నస్మ
త్తనయుండు వీఁడు బాల్యం
బున నేడ్చెను బాలు నాకుఁ బోయుం డనుచున్.

(నా కుమారుడు పాలు కావాలని ఏడ్చాడు.)

1_5_215 కందము నచకి - వసంత

కందము

పురుషవిశేషవివేకా
పరిచయు లగు ధరణిపతుల పాలికిఁ బోవం
బరులందు దుష్ప్రతిగ్రహ
భర మెదలో రోసి ధర్మపథమున నున్నన్.

(ఇతరుల నుండి దానాలు తీసుకోవటానికి ఇష్టపడక నేను ధర్మమార్గంలో జీవితం గడుపుతూ ఉండగా.)

1_5_214 వచనము నచకి - వసంత

వచనము

ఏను ద్రోణుం డను వాఁడ భరద్వాజపుత్త్రుండ నగ్నివేశ్యుండను మహామునివరునొద్ద బ్రహ్మచర్యాశ్రమంబున వేదాధ్యయనంబు సేసి ధనుర్వేదం బభ్యసించుచున్ననాఁడు పాంచాలపతి యైన పృషతుపుత్త్రుండు ద్రుపదుం డను వాఁడు నా కిష్టసఖుం డయి యెల్లవిద్యలు గఱచి యేను పాంచాల విషయంబునకు రాజయిననాఁడు నా యొద్దకు వచ్చునది నా రాజ్యభోగంబులు నీవు ననుభవింప నర్హుండ వని నన్నుఁ బ్రార్థించి చని పృషతు పరోక్షంబునఁ దద్దేశంబునకు రాజయి యున్న నేను గురునియుక్తుండ నై గౌతమిం బాణిగ్రహణంబు సేసి యిక్కుమారు నశ్వత్థామ నధికతేజస్వి నాత్మజుం బడసి ధనంబు లేమిం గుటుంబభరణంబునం దసమర్థుండ నయి యుండియు.

(ద్రోణుడు తన వృత్తాంతం చెప్పాడు.)

1_5_213 కందము వసంత - విజయ్

కందము

ఎందుండి వచ్చి తిందుల
కెం దుండఁగ నీకు నిష్ట మెఱిఁగింపుము స
ద్వందిత యని యడిగిన సా
నందుఁడు ద్రోణుండు భీష్మునకు ని ట్లనియెన్.

(ద్రోణాచార్యా! ఎక్కడి నుండి వచ్చావు? ఎక్కడ ఉండటం నీకు ఇష్టం? - అని అడగగా.)

1_5_212 కందము నచకి - వసంత

కందము

ఆసన్నపలితు ననఘు శ
రాసనగురు భూరిసత్త్వు నసితకృశాంగున్
భూసురవరు ద్రోణు గుణో
ద్భాసితు వినినట్ల చూచి పరమప్రీతిన్.

(భీష్ముడు సంతోషంతో.)

1_5_211 వచనము వసంత - విజయ్

వచనము

దీని బాణపరంపరం జేసి పుచ్చి యిచ్చెదఁ జూడుఁ డీ విద్య యొరు లెవ్వరు నేరరని ద్రోణుం డొక్కబాణం బభిమంత్రించి దృష్టి ముష్టి సౌష్ఠవంబు లొప్ప నక్కందుకంబు నాట నేసి దాని పుంఖంబు మఱియొక బాణంబున నేసి తత్పుంఖం బొండొకబాణంబున నేసి వరుసన బాణరజ్జువు గావించి దానిం దిగిచికొని యిచ్చినం జూచి రాజకుమారు లెల్ల విస్మయం బంది ద్రోణుం దోడ్కొని చని భీష్మున కంతయు నెఱింగించిన నాతండును.

(ఈ బాణపరంపరతో దాన్ని తీసి ఇస్తాను చూడండి - అని చెప్పి వరుసగా బాణాలు కొట్టి, ఆ బాణాల తాడుతో బంతిని లాగి వారికి ఇచ్చాడు. రాకుమారులు ఆశ్చర్యపోయి భీష్ముడికి జరిగినదంతా చెప్పారు.)

1_5_210 చంపకమాల నచకి - వసంత

చంపకమాల

భరతకులప్రసూతులరు భాసురశస్త్రమహాస్త్ర విద్యలం
గరము ప్రసిద్ధుఁ డై పరఁగు గౌతమశిష్యుల రిట్టి మీకు దు
ష్కరముగ నూతిలోఁ బడిన కాంచనపిండుఁ గొనంగనేర కొం
డొరుల మొగంబు చూచి నగుచుండఁగఁ జన్నె యుపాయహీనతన్.

(మహాప్రసిద్ధుడైన కృపాచార్యుడి శిష్యులైన మీకు బావిలో పడిన బంతిని తీసుకోలేక ఒకరినొకరు చూసుకుంటూ నవ్వుకోవటం తగిన పనేనా?)

1_5_209 కందము నచకి - వసంత

కందము

నానావిధశరశరధుల
తో నున్నతచాపధరుఁడు ద్రోణుఁడు వారిం
గానఁ జనుదెంచి యంతయుఁ
దా నప్పు డెఱింగి రాజతనయుల కనియెన్.

(ద్రోణుడు అక్కడికి వచ్చి, విషయం తెలుసుకుని వారితో ఇలా అన్నాడు.)

-:ద్రోణుఁడు హస్తిపురంబునకు వచ్చుట:-

1_5_208 వచనము నచకి - వసంత

వచనము

అట్టి యవసరంబున.

(ఆ సమయంలో.)

1_5_207 ఆటవెలది వసంత - విజయ్

ఆటవెలది

నీరిలోనఁ దోఁచు తారక ప్రతిబింబ
మొక్కొ యనఁగ వెలుఁగుచున్నదాని
రాచకొడుకులెల్లఁ జూచుచునుండిరి
దానిఁ బుచ్చుకొనువిధంబు లేక.

(దాన్ని తీసుకునే మార్గం లేక రాకుమారులంతా చూస్తూ ఉండగా.)

1_5_206 వచనము వసంత - విజయ్

వచనము

మఱి యట్లుంగాక రాజులకుఁ గార్యవశంబునం జేసి మిత్త్రామిత్త్ర సంబంధంబులు సంభవించుం గావున మా యట్టి రాజులకు మీయట్టి పేదపాఱువారలతోఁ గార్యకారణంబైన సఖ్యం బెన్నండును గానేర దని ద్రుపదుం డైశ్వర్యగర్వంబున మెచ్చక పలికిన విని ద్రోణుం డవమానజనిత మన్యుఘూర్ణమాన మానసుం డయి యెద్దియుం జేయునది నేరక పుత్త్ర కళత్రాగ్నిహోత్ర శిష్యగణంబులతో హస్తిపురంబునకు వచ్చె నంత నప్పుర బహిరంగణంబున ధృతరాష్ట్ర పాండునందను లందఱుఁ గందుకక్రీడాపరు లయి వేడుకతో నాడుచున్నంత నక్కాంచనకందుకం బొక్కనూతం బడిన.

(అని అవమానించగా, ద్రోణుడు కోపం కలిగినా ఏమీ చేయలేక, హస్తినాపురానికి వచ్చాడు. అప్పడు ఆ పట్టణం బయట కౌరవులు, పాండవులు చెండాట ఆడుకుంటూ ఉండగా వాళ్లు ఆడుకుంటున్న బంతి బావిలో పడింది.)

Thursday, April 13, 2006

1_5_205 కందము నచకి - వసంత

కందము

సమశీలశ్రుతయుతులకు
సమధనవంతులకు సమసుచారిత్రులకుం
దమలో సఖ్యమును వివా
హము నగుఁ గా కగునె రెండు నసమానులకున్.

(సమానులకు స్నేహం, వివాహం ఏర్పడతాయి కానీ, కాని వాళ్లకు కాదు.)

1_5_204 చంపకమాల వసంత - విజయ్

చంపకమాల

ధనపతితో దరిద్రునకుఁ దత్త్వవిదుం డగు వానితోడ మూ
ర్ఖునకుఁ బ్రశాంతుతోడఁ గడుఁ గ్రూరునకున్ రణశూరుతోడ భీ
రునకు వరూథితోడ నవరూథికి సజ్జనుతోడఁ గష్టదు
ర్జనునకు నెవ్విధంబునను సఖ్యము దా నొడఁగూడ నేర్చునే.

(ధనవంతుడితో దరిద్రునికి, పండితుడితో మూర్ఖుడికి, ప్రశాంతంగా ఉండేవాడితో క్రూరుడికి, వీరుడితో పిరికివాడికి, కవచం కలవాడితో కవచం లేనివాడికి, సజ్జనుడితో దుర్మార్గుడికి స్నేహం ఎలా కలుగుతుంది?)

1_5_203 చంపకమాల నచకి - వసంత

చంపకమాల

కొలఁది యెఱుంగ కిట్టి పలుకుల్ వలుకం దగుఁ గాదు నా కనన్
బలుగుఁదనంబునం బలుకఁ బాడియె నీ సఖి నంచుఁ బేదవి
ప్రులకును ధారుణీశులకుఁ బోలఁగ సఖ్యము సంభవించునే
పలుకక వేగ పొ మ్మకట పాఱుఁడు సంగడికాఁడె యెందునన్.

(మన అంతరం తెలియకుండా నన్ను నీ స్నేహితుడని చెప్పటం న్యాయమేనా? నోరు మూసుకొని వెళ్లు.)

-: ద్రోణుఁడు ద్రుపదునిచే నవమానితుడుఁ డగుట :-

1_5_202 వచనము వసంత - విజయ్

వచనము

అని పరశురాముచేత దివ్యాస్త్రంబులు ప్రయోగ రహస్య మంత్రంబులతోడం బడసి ధనుర్విద్యయు నభ్యసించి ధనార్థి యయి తన బాలసఖుం డైన ద్రుపదుపాలికిం జని యేను ద్రోణుండ నీ బాలసఖుండ సహాధ్యాయుండ న న్నెఱుంగుదే యని ప్రణయపూర్వకంబుగాఁ బలికిన విని యప్పలుకులు విన సహింపక ద్రుపదుం డలిగి యి ట్లనియె.

(అని అవి తీసుకొని, ధనం కోసం తన స్నేహితుడు ద్రుపదుడి దగ్గరకు వెళ్లి మాట్లాడగా, అతడు కోపంతో ఇలా అన్నాడు.)

1_5_201 కందము వసంత - విజయ్

కందము

ధనములలో నత్యుత్తమ
ధనములు శస్త్రాస్త్రములు ముదంబున వీనిం
గొని కృతకృత్యుఁడ నగుదును
జననుత నాకొసఁగు మస్త్రశస్త్రచయంబుల్.

(పరశురామా! నీ శస్త్రాలు తీసుకొంటాను.)

1_5_200 చంపకమాల నచకి - వసంత

చంపకమాల

కలధన మెల్ల ముందఱ జగన్నుత విప్రుల కిచ్చి వార్ధిమే
ఖలనిఖిలోర్వి యంతయును గశ్యపుఁ డన్ముని కిచ్చితిన్ శరం
బులును శరీరశస్త్రములుఁ బొల్పుగ నున్నవి వీనిలోన నీ
వలసిన వస్తువుల్గొను ధ్రువంబుగ నిచ్చెద నీకు నావుడున్.

(ఉన్న ధనం అంతా ఇచ్చేశాను. నా శస్త్రాస్త్రాలు, శరీరం మాత్రమే మిగిలి ఉన్నాయి. వీటిలో నీకు కావలసినవి ఇస్తాను - అని పరశురాముడు అనగా.)

Wednesday, April 12, 2006

1_5_199 వచనము విజయ్ - విక్రమాదిత్య

వచనము

ఏను భారద్వాజుండ ద్రోణుం డను వాఁడ నర్థార్థి నై నీ కడకు వచ్చితి ననినఁ బరశురాముం డి ట్లనియె.

(ధనం ఆశించి నీ దగ్గరకు వచ్చాను - అని అనగా పరశురాముడు ఇలా అన్నాడు.)

1_5_198 కందము విజయ్ - విక్రమాదిత్య

కందము

అరిగి మహేంద్రాచలమునఁ
బరమ తపోవృత్తి నున్న భార్గవు లోకో
త్తరు భూరి కర్మ నిర్మల
చరితుని ద్రోణుండు గాంచి సద్వినయమునన్.

(మహేంద్రపర్వతం మీద తపస్సు చేస్తున్న పరశురాముడిని చూసి వినయంతో.)

1_5_197 కందము విజయ్ - విక్రమాదిత్య

కందము

అనవరతము బ్రాహ్మణులకుఁ
దనియఁగ ధన మిచ్చు జామదగ్న్యుఁడు రాముం
డను జనవాద పరంపర
విని యరిగెను వాని కడకు విత్తాపేక్షన్.

(బ్రాహ్మణులకు పరశురాముడు ధనమిస్తున్నాడని విని ద్రోణుడు అతడి దగ్గరకు వెళ్లాడు.)

1_5_196 వచనము విజయ్ - విక్రమాదిత్య

వచనము

మఱియు ననంతరంబు భరద్వాజ సఖుం డైన పృషతుం డను పాంచాలపతి మహాఘోరతపంబు సేయుచు నొక్కనాఁడు దన సమీపంబున వాసంతికాపచయవినోదంబున నున్న యప్సరస మేనక యను దానిం జూచి మదనరాగంబున రేతస్కందం బయిన దానిం దన పాదంబునఁ బ్రచ్ఛాదించిన నందు ద్రుపదుం డను కొడుకు మరుదంశంబునఁ బుట్టిన వాని భరద్వాజాశ్రమంబునఁ బెట్టి చని పృషతుండు పాంచాలదేశంబున రాజ్యంబు సేయుచుండె ద్రుపదుండును ద్రోణునితోడ నొక్కట వేదాధ్యయనంబు సేసి విలువిద్యయుం గఱచి యా పృషతు పరోక్షంబునం బాంచాలదేశంబున కభిషిక్తుం డయ్యె ద్రోణుండును నగ్నివేశ్యుం డను మహామునివలన ధనుర్విద్యా పారగుం డై తత్ప్రసాదంబున నాగ్నేయాస్త్రం బాదిగా ననేకదివ్యబాణంబులు వడసి భరద్వాజు నియోగంబునఁ బుత్రలాభార్థంబు కృపుని చెలియలిఁ గృపి యనుదాని వివాహం బయి దానియం దశ్వత్థామ యను కొడుకుం బడసి యొక్కనాఁడు.

(భరద్వాజుడి స్నేహితుడైన పృషతుడనే పాంచాలదేశపు రాజు మేనక అనే అప్సరసను చూసి కామించాడు. వారికి ద్రుపదుడనే పుత్రుడు జన్మించాడు. ద్రుపదుడు, ద్రోణుడితో కలిసి చదివి, పృషతుడి తరువాత పాంచాలదేశానికి రాజు అయ్యాడు. ద్రోణుడు కృపుడి చెల్లెలైన కృపిని వివాహమాడాడు. వారికి అశ్వత్ధామ జన్మించాడు.)

1_5_195 సీసము + తేటగీతి విజయ్ - విక్రమాదిత్య

సీసము

అమ్ముని యొక్కనాఁ డభిషేచనార్థంబు
        గంగకుఁ జని మున్న కరము లీల
నందు జలక్రీడ లాడుచునున్న య
        ప్సరస ఘృతాచి యన్సదమలాంగి
పటుపవనాపేత పరిధాన యైన య
        య్యవసరంబునఁ జూచి యమ్మృగాక్షిఁ
గామించి యున్నఁ దత్కామరాగంబున
        యతిరేకమునఁ జేసి యాక్షణంబ

తేటగీతి

తనకు శుక్లపాతం బైన దానిఁ దెచ్చి
ద్రోణమున సంగ్రహించిన ద్రోణుఁ డనఁగఁ
బుట్టె శుక్రునంశంబునఁ బుణ్యమూర్తి
ధర్మతత్త్వజ్ఞుఁ డగు భరద్వాజమునికి.

(ఘృతాచి అనే అప్సరసను చూసి కామించాడు. వారికి ద్రోణుడు పుట్టాడు.)

1_5_194 కందము విజయ్ - విక్రమాదిత్య

కందము

సద్వినుత చరిత్రుండు భ
రద్వాజుం డను మునీశ్వరప్రవరుఁడు గం
గాద్వారమునఁ దపంబు జ
గద్వంద్యుఁడు సేయుచుండె గతకల్మషుఁ డై.

(భరద్వాజ మహాముని గంగాద్వారం దగ్గర తపస్సు చేస్తూ ఉండగా.)

1_5_193 వచనము విజయ్ - విక్రమాదిత్య

వచనము

మఱియు వారల కాచార్యుం డైన ద్రోణుజన్మంబును వానిచరిత్రంబును జెప్పెద విను మని జనమేజయునకు వైశంపాయనుం డి ట్లనియె.

(ద్రోణుడి పుట్టుక గురించి తెలుపుతాను - అని జనమేజయుడితో వైశంపాయనుడు ఇలా అన్నాడు.)

-:ద్రోణాచార్యుల జన్మ వృత్తాంతము:-

1_5_192 కందము విజయ్ - విక్రమాదిత్య

కందము

సవిశేషముగ ధనుర్వే
దవిశారదు లైరి కడు జితశ్రములై పాం
డవ ధృతరాష్ట్రాత్మజ యా
దవు లాదిగ రాజసుతులు తత్కృపుశిక్షన్.

(అతడి శిక్షణలో ఆ రాకుమారులు విలువిద్యలో పండితులయ్యారు.)

1_5_191 వచనము విజయ్ - విక్రమాదిత్య

వచనము

అట్టి కృపాచార్యు రావించి భీష్ముం డతి భక్తిం బూజించి వానితోడఁ దన మనుమల నందఱ విలువిద్య గఱవం బంచిన.

(తన మనుమలకు విలువిద్య నేర్పటానికి భీష్ముడు కృపాచార్యుడిని రప్పించాడు.)

1_5_190 శార్దూలము విజయ్ - విక్రమాదిత్య

శార్దూలము

వేదంబుల్ చదివించె భూసురులతో విఖ్యాతిగా నాత్మసం
వేదిం జేసెఁ జతుర్విధం బగు ధనుర్వేదంబు నానాస్త్రవి
ద్యాదాక్షిణ్యముతోడఁ దాన కఱపెం దద్విత్తముల్ సూచి సం
వాదుల్ గాఁ దననందనుం గృపు శరద్వంతుండు దాంతాత్ముఁ డై.

(కృపుడికి ధనుర్వేదంతోపాటు చాలా విద్యలు నేర్పించాడు.)

1_5_189 కందము విజయ్ - విక్రమాదిత్య

కందము

చనుదెంచి శరద్వంతుం
డనవద్యుఁడు దన యపత్య మని వారిని శం
తనున కెఱిఁగించి కృపు న
త్యనుపము నుపనీతుఁ జేసె నధికప్రీతిన్.

(శరద్వంతుడు వచ్చి, ఆ పిల్లను తన సంతానమని శంతనుడికి తెలిపి, కృపుడికి ఉపనయనం చేశాడు.)

1_5_188 వచనము విజయ్ - విక్రమాదిత్య

వచనము

దాని నెఱింగి శరద్వంతుం డయ్యాశ్రమంబు విడిచి చని యొండుచోటం దపంబు సేయుచుండె నవ్వీర్యం బొక్క శరస్తంబంబున ద్వివిధం బయి పడిన నందొక కొడుకునుం గూఁతురుం బుట్టి రంత శంతనుండు మృగయా వినోదార్థం బరిగిన వాని సేనాచరుం డా శరస్తంబంబున నున్న కొడుకుం గూఁతుఁ దత్సమీపంబుననున్న శర చాప కృష్ణాజినంబులుం జూచి యివి యెయ్యేనియు నొక్కధనుర్వేదవిదుం డయిన బ్రాహ్మణునపత్యం బగునని శంతనునకుం జూపిన శంతనుండును వారలఁ జేకొని కృపాయత్త చిత్తుం డయి పెనుచుటం జేసి యయ్యిరువురుఁ గృపుఁడును గృపియు ననం బెరుఁగుచున్నంత.

(దానినుండి ఒక కొడుకు, ఒక కూతురు పుట్టారు. శరద్వంతుడు వేరే ఆశ్రమంలో తపస్సు చేసుకోవటానికి వెళ్లగా, కొంతకాలానికి శంతనుడు వచ్చి, ఆ పిల్లలను చూసి, కృపతో పెంచటం వల్ల వారు కృపుడు, కృపి అనే పేర్లతో పెరుగుతూ ఉండగా.)

1_5_187 కందము విజయ్ - విక్రమాదిత్య

కందము

ఆ తరుణికటాక్షేక్షణ
పాతము గౌతమున కపుడు పటుబాణధనుః
పాతముతోడన రేతః
పాతము గావించె రాగపరవశుఁ డగుటన్.

(అతడి ధనుర్బాణాలతోపాటు వీర్యం కూడా జారిపడింది.)

1_5_186 కందము విజయ్ - విక్రమాదిత్య

కందము

అమ్ముదితఁ జూచి కాముశ
రమ్ములచే విద్ధుఁ డై శరద్వంతుఁడు చి
త్తమ్మలర మదనరాగర
సమ్మునఁ ద న్నెఱుఁగకుండెఁ జంచలతనుఁ డై.

(ఆమెను చూసి శరద్వంతుడు మైమరచి ఉండగా.)

1_5_185 సీసము + ఆటవెలది విజయ్ - విక్రమాదిత్య

సీసము

వినవయ్య గౌతముం డనఁ బ్రసిద్ధుం డైన
        మునికి శరద్వంతుఁ డను మహాత్ముఁ
డురుతరతేజుఁ డై శరసమూహంబుతో
        నుదయించి వేదముల్ చదువ నొల్ల
కతిఘోరతపమున నుతభూసురోత్తముల్
        వేదముల్ చదువన ట్లాదరమున
సర్వాస్త్రవిదుఁడు ధనుర్వేద మొప్పఁగఁ
        బడసి మహానిష్ఠఁ గడఁగి తపము

ఆటవెలది

సేయుచున్న దివిజనాయకుఁ డతిభీతి
నెఱిఁగి వానితపముఁ జెఱుపఁ బనిచె
జలజనయనఁ దరుణి జలపద యనియెడు
దాని నదియు వచ్చె వానికడకు.

(గౌతముడనే మునికి శరద్వంతుడు పుట్టి, ధనుర్వేదం నేర్చుకొని, తపస్సు చేస్తుండగా ఇంద్రుడు ఆ తపస్సును భగ్నం చేయటానికి జలపద అనే ఆమెను పంపించాడు.)

-:కృపాచార్యుల జన్మవృత్తాంతము:-

1_5_184 వచనము విజయ్ - విక్రమాదిత్య

వచనము

అని యడిగిన వైశంపాయనుం డి ట్లనియె.

(అని అడగగా వైశంపాయనుడు ఇలా చెప్పాడు.)

1_5_183 తేటగీతి విజయ్ - విక్రమాదిత్య

తేటగీతి

కృపుఁడు ద్రోణుండు ననఁగ సత్కీర్తు లైన
వారి జన్మప్రకారంబు వారు వచ్చి
కౌరవులకెల్ల గురు లైన కారణంబు
విప్రముఖ్య నా కెఱుఁగంగ విస్తరింపు.

(మహర్షీ! కృపుడు, ద్రోణుడు పుట్టిన విధం, వాళ్లు కౌరవపాండవులకు గురువులైన విధం వివరించండి.)

1_5_182 వచనము విజయ్ - విక్రమాదిత్య

వచనము

కౌరవులు, పాండవులు కృపద్రోణాచార్యుల దగ్గర విలువిద్య నేర్చుకోవటం ప్రారంభించారు.

(అని వైశంపాయనుడు చెప్పగా జనమేజయుడు ఇలా అన్నాడు.)

1_5_181 కందము విజయ్ - విక్రమాదిత్య

కందము

విలువిద్యఁ గఱచుచుండిరి
బలయుతులు కుమారకులు కృపద్రోణాచా
ర్యులతోడఁ గలసి యొక్కట
నలఘు పరాక్రమ సమేతు లధిక స్పర్ధన్.

(కౌరవులు, పాండవులు కృపద్రోణాచార్యుల దగ్గర విలువిద్య నేర్చుకోవటం ప్రారంభించారు.)

1_5_180 వచనము విజయ్ - విక్రమాదిత్య

వచనము

ఇట్లు దుర్యోధనుండు భీమునకుఁ దనచేసిన యెగ్గులెల్లను గృతఘ్నునకుం జేసిన లగ్గులునుంబోలె నిష్ఫలంబులైన సిగ్గువడి వెండియుఁ బాండవుల కెల్ల నపాయంబు సేయ నుపాయంబుఁ జింతించుచుండె నంత భీష్మనియోగంబున.

(ఇలా దుర్యోధనుడి ప్రయత్నాలు వ్యర్ధం అయినా మళ్లీ ఉపాయాలు ఆలోచిస్తూ ఉండగా భీష్ముడి ఆజ్ఞ వల్ల.)

1_5_179 కందము విజయ్ - విక్రమాదిత్య

కందము

సముఁ డై యుయుత్సుఁ డయ్య
న్నము దుష్టం బగుటఁ జెప్పినను గుడిచె విషా
న్నము నాఁకటిపెలుచను నది
యమృతాన్నం బయ్యె జీర్ణ మై మారుతికిన్.

(యుయుత్సుడు వద్దని చెప్పినా భీముడు ఆకలి వల్ల ఆ అన్నం తిన్నాడు. అది అతడికి జీర్ణమైపోయింది.)

1_5_178 కందము విజయ్ - విక్రమాదిత్య

కందము

మఱియును నొకనాఁ డెవ్వరు
నెఱుఁగక యుండంగఁ గౌరవేంద్రుఁడు ధర్మం
బెఱుఁగక విష మన్నముతో
గుఱుకొని పెట్టించె గాడ్పుకొడుకున కలుకన్.

(ఇంకొకరోజు దుర్యోధనుడు అన్నంలో విషం కలిపి భీముడికి పెట్టించాడు.)

1_5_177 చంపకమాల విజయ్ - విక్రమాదిత్య

చంపకమాల

అలఘు బలుండు భీముఁడును నంతన మేల్కని యవ్విషోరగం
బులఁ జరణంబులం జమరి ముక్కున వాతను నెత్తు రొల్కగాఁ
దలరఁగ సారథిం జఱచెఁ దా నపహస్తమునన్ వసుంధరా
తలమునఁ ద్రెళ్లె సారథియుఁ దత్క్షణమాత్రన ముక్తజీవుఁ డై.

(భీముడు లేచి ఆ పాములను, సారథినీ చంపాడు.)

1_5_176 కందము విజయ్ - విక్రమాదిత్య

చంపకమాల

అవిరళ విష ఫణిదంష్ట్రలు
పవనజు వజ్రమయతనువుపయితోలును నో
పవ భేదింపఁగఁ బాప
వ్యవసాయులచెయ్వు లర్థవంతము లగునే.

(ఆ పాముల కోరలు భీముడి చర్మాన్ని ఏమీ చేయలేకపోయాయి.)

1_5_175 కందము విజయ్ - విక్రమాదిత్య

కందము

జనపతి పనుపఁగ సారథి
ఘన విష కృష్ణోరగములఁ గఱపించె శ్రమం
బున నిద్రితుఁ డైన ప్రభం
జనసుతుసర్వాంగమర్మసంధుల నెల్లన్.

(నిద్రపోతున్న భీముడి మీదికి దుర్యోధనుడి ఆజ్ఞతో అతడి సారథి విషసర్పాలను ప్రయోగించాడు.)

1_5_174 వచనము విజయ్ - విక్రమాదిత్య

వచనము

మఱియు నొక్కనాడు.

(మరొకరోజు.)

1_5_173 ఆటవెలది విజయ్ - విక్రమాదిత్య

ఆటవెలది

కర్మ బంధనములు గ్రక్కునఁ బాయుడుఁ
బుణ్యగతికి నెగయు పురుషు నట్లు
బంధనంబు లెల్లఁ బాయుడు భీముండు
నీరిలోననుండి నెగయుదెంచె.

(భీముడు నీటినుండి పైకి వచ్చాడు.)

1_5_172 కందము విజయ్ - విక్రమాదిత్య

కందము

అనిల సుతుం డంతన మే
ల్కని నీల్గుడు నతని వజ్రఘనకాయముఁ బొం
దిన లతికాపాశము లె
ల్లను ద్రెస్సె మృణాళనాళలతికల పోలెన్.

(భీముడు మేలుకొని ఒళ్లువిరువగానే ఆ తీగలు తెగిపోయాయి.)

1_5_171 కందము విజయ్ - విక్రమాదిత్య

కందము

ఆ పవనజు నతిఘనలతి
కాపాశావలుల నంటఁ గట్టించి మహా
కోపమున గంగమడువునఁ
ద్రోపించె సుయోధనుండు దురితకరుం డై.

(దుర్యోధనుడు భీముడిని గట్టి తీగలతో బంధించి ఆ గంగ మడుగులోకి తోయించాడు.)

Tuesday, April 11, 2006

1_5_170 ఉత్పలమాల విజయ్ - విక్రమాదిత్య

ఉత్పలమాల

వేడుక నొక్కరుండు శతవీరకుమారులతోడఁ జల్లుఁ బో
రాడి జయించి యందఱ ననంతపరిశ్రమ పారవశ్యముం
గూడి ప్రమాణకోటి ననఘుండు సమీరణనందనుండు మే
యాడక నిద్రవోయె శిశిరానిలముల్ పయి వీచుచుండఁగన్.

(భీముడు అలసటతో ప్రమాణకోటి అనే స్థలంలో నిద్రలో ఉండగా.)

1_5_169 వచనము విజయ్ - విక్రమాదిత్య

వచనము

అని పాపబుద్ధియందుఁ గృతనిశ్చయుం డై దుర్యోధనుండు భీష్మ విదురు లెఱుంగకుండ భీమున కపాయంబు సేయ సమకట్టి యంతరం బన్వేషించుచున్నంత నొక్కనాఁడు జలక్రీడావసరంబున.

(అని అవకాశం కోసం వెతుకుతూ, జలక్రీడలు ఆడే సమయంలో.)

-:దుర్యోధనుఁడు భీమునిఁ జంపింపఁ దివురుట:-

1_5_168 పృథ్వి విజయ్ - విక్రమాదిత్య

పృథ్వి

ఉపాంశువధఁ జేసి మధ్యము మదోద్ధతుం జంపి ని
స్సపత్నముగ ధర్మనందను నశక్తు బంధించి యే
నపాండవముగా సముద్రవలయాఖిలక్షోణి మ
త్కృపాణపటుశక్తి నత్యధికకీర్తి నై యేలెదన్.

(భీముడిని రహస్యంగా చంపి, ధర్మరాజును చెరసాలలో పెట్టి రాజ్యాన్ని పరిపాలిస్తాను.)

1_5_167 వచనము విజయ్ - విక్రమాదిత్య

వచనము

దాని సహింపనోపక యొక్కనాఁడు దుర్యోధనుండు శకుని దుశ్శాసనాదులతో విచారించి యిట్లనియె.

(భీముడి వల్ల బాధను ఓర్చుకోలేక ఒకరోజు దుర్యోధనుడు శకుని, దుశ్శాసనుడు మొదలైన వాళ్లతో ఆలోచించి.)

1_5_166 సీసము + ఆటవెలది విజయ్ - విక్రమాదిత్య

సీసము

కూడి జలక్రీడ లాడుచోఁ గడఁగి యా
        ధృతరాష్ట్రతనయుల నతులశక్తి
లెక్కించియుఁ బదుండ్ర నొక్కొక్క భుజమున
        నెక్కించుకొని వారి యుక్కడంగఁ
గ్రంచఱ నీరిలో ముంచుచు నెత్తుచుఁ
        గారించి తీరంబు చేరఁ బెట్టుఁ
గోరి ఫలార్థు లై వారల యెక్కిన
        మ్రాఁకుల మొదళుల వీఁకఁ బట్టి

ఆటవెలది

వడిఁ గదల్చుఁ బండ్లు దడఁబడువారల
తోన ధరణిమీఁద దొరఁగుచుండ
నిట్టిపాట గాడ్పుపట్టిచే దుశ్శాస
నాదులెల్ల బాధితాత్ము లైరి.

(కౌరవులను నీటిలో ముంచుతూ, పైకెత్తుతూ బాధపెట్టి గట్టుకు చేర్చేవాడు. పండ్లు కోయటానికి వారు చెట్లెక్కితే చెట్టును బలంగా, వేగంగా కదిలించి, వాళ్లూ, పండ్లూ నేలమీద పడేటట్లు చేసేవాడు.)

1_5_165 కందము విజయ్ - విక్రమాదిత్య

కందము

వదలక పెనఁగి పదుండ్రం
బదియేవుర నొక్కపెట్ట పట్టి ధరిత్రిం
జెదరఁ బడవైచి పవనజుఁ
డదయుండయు వీపు లొలియ నందఱ నీడ్చున్.

(వదలక పోరాడి, పది పదిహేనుమందిని ఒక్కసారిగా పట్టి నేల మీద చెల్లాచెదురుగా పడవేసి భీముడు దయలేకుండా అందరి వీపుల చర్మాలు లేచిపోయేటట్లు ఈడుస్తాడు.)

1_5_164 కందము విజయ్ - విక్రమాదిత్య

కందము

గిఱుపునెడ నేయునెడ వడిఁ
బఱచునెడం బెనఁగునెడ నపార బలంబుల్
మెఱయునెడ భీమునకు నం
దొఱుఁ గీడ్పడఁ దొడఁగి రుద్ధతులు రాజసుతుల్.

(ఆటల్లో అందరూ భీముడికి తక్కువగా ఉండేవారు.)

1_5_163 కందము విజయ్ - విక్రమాదిత్య

కందము

ధృతరాష్ట్రునెయ్యమున సం
తతవర్ధితు లగుచుఁ బాండుతనయులు వినయా
న్వితులు కుమారక్రీడా
రతు లయి యొడఁగూడి ధార్తరాష్ట్రులతోడన్.

(పాండవులు, కౌరవులు ఆటలలో ఆసక్తి కలిగి.)

1_5_162 కందము విజయ్ - విక్రమాదిత్య

కందము

తన సుతులు పాండు సుతు లని
మనమున భేదింప కతిసమంజసభావం
బున నొక్క రూపకాఁ జే
కొని యుండెం బాండురాజుకొడుకులఁ బ్రీతిన్.

(పాండవులు, కౌరవులు అనే భేదం లేకుండా అందరినీ ప్రేమతో పెంచుతూ ఉండేవాడు.)

-:కురు పాండు కుమారుల బాలక్రీడలు:-

1_5_161 వచనము విజయ్ - విక్రమాదిత్య

వచనము

దాని ధృతరాష్ట్రుండు తాన యనుభవించుంగాని మీ రీ దారుణంబుఁ జూడక వీరి విడిచి తపోవనంబున కరుగుండని చెప్పి చనిన సత్యవతియుఁ బారాశర్యునుపదేశంబు భీష్మవిదురుల కెఱింగించి కోడండ్ర నంబికాంబాలికలం దోడ్కొని వనంబునకుం జని తానును వారు నతిఘోరతపంబు సేసి కొండొక కాలమునకు శరీరంబులు విడిచి పుణ్యగతికిం బోయి రిట ధృతరాష్ట్రుండును.

(దానిని ధృతరాష్ట్రుడే అనుభవిస్తాడు. మీరు తపోవనానికి వెళ్లండి - అని చెప్పి వెళ్లగా సత్యవతి అలాగే అంబిక, అంబాలికలతో అడవికి వెళ్లింది. వారు తపస్సు చేసి కొంతకాలానికి స్వర్గం చేరారు. ఇక్కడ ధృతరాష్ట్రుడు.)

1_5_160 కందము విజయ్ - విక్రమాదిత్య

కందము

క్రూరులు విలుప్త ధర్మా
చారులు ధృతరాష్ట్ర సుతు లసద్వృత్తులు ని
ష్కారణ వైరులు వీరల
కారణమున నెగ్గు పుట్టుఁ గౌరవ్యులకున్.

(ధృతరాష్ట్రుని పుత్రుల వల్ల కౌరవవంశానికి కీడు జరుగుతుంది.)

1_5_159 కందము విజయ్ - విక్రమాదిత్య

కందము

మతిఁ దలఁపఁగ సంసారం
బతి చంచల మెండమావులట్టుల సంప
త్ప్రతతు లతిక్షణికంబులు
గతకాలము మేలు వచ్చుకాలము కంటెన్.

(సంసారం ఎండమావుల లాగా అతిచంచలం.)

1_5_158 వచనము విజయ్ - విక్రమాదిత్య

వచనము

అంతఁ గృష్ణద్వైపాయనుండు వారి కందఱకు దుఃఖోపశమనంబు సేసి యొక్కనాఁడు సత్యవతికి నేకాంతంబున ని ట్లనియె.

(తరువాత వ్యాసుడు సత్యవతితో ఒకరోజు రహస్యంగా ఇలా అన్నాడు.)

1_5_157 సీసము + ఆటవెలది విజయ్ - విక్రమాదిత్య

సీసము

వెలయంగఁ బితృమేధవిధి విచక్షణశీల
        సద్భూసురోపదేశక్రమమున
నధికవిభూతితో నతిపవిత్రప్రదే
        శమున నయ్యంగముల్ సంస్కరించి
పుణ్యస్వధామృతంబున నొప్పఁగా
        శ్రాద్ధవిధి యొనరించి సద్విప్రతతికి
నగ్రహారములు దివ్యాంబరాభరణ శ
        య్యాసన చ్ఛత్ర గవాశ్వకరుల

ఆటవెలది

నిచ్చి సర్వజనుల కెల్లను భోజన
దాన మొనరఁ జేసి ధర్మవిదుఁడు
విదురుఁ డట్లు పాండువిభునకుఁ జేయించె
నన్యలోకహితము లైన విధులు.

(విదురుడు ఆ అస్థికలకు సంస్కారం జరిపించాడు.)

1_5_156 వచనము విజయ్ - విక్రమాదిత్య

వచనము

ఈ దేవియును బతితోడన పోవ సమకట్టినం బుత్త్ర రక్షణార్థంబు మునిగణ ప్రార్థిత యై యెట్టకేనియు ధృతప్రాణ యయ్యె నిక్కుమారులు కురుకులవిస్తారకులు దేవమూర్తులు యుధిష్ఠిర భీమార్జున నకుల సహదేవు లనంగా దేవాధిష్ఠిత నామంబులు దాల్చి బ్రహ్మర్షి ప్రణీతోపనయను లై శ్రుతాధ్యయన సంపన్ను లగుచుఁ బెరుఁగుచున్నవారు వీరలం జేకొని కురువృద్ధులు ధర్మబుద్ధి రక్షించునది యని చెప్పి సిద్ధచారణ గణంబులతో నమ్మహామును లంతర్థానంబు సేసి రంత వ్యాస భీష్మ ధృతరాష్ట్రుల యనుమతంబున.

(కుంతినీ, పాండవులనూ రక్షించండి అని చెప్పి అంతర్ధానమయ్యారు. తరువాత వ్యాస, భీష్మ, ధృతరాష్ట్రుల అనుమతితో.)

1_5_155 కందము విజయ్ - విక్రమాదిత్య

కందము

కమనీయలీల నొక్కట
నమరపురంబునకుఁ జనిన యయ్యిరువుర యం
గము లివి పితృమేధవిధి
క్రమ మొనరఁగ సంస్కరింపఁ గడఁగుఁడు వీనిన్.

(వారి అస్థులివి. వీటిని సంస్కరించటానికి ప్రయత్నించండి.)

1_5_154 కందము విజయ్ - విక్రమాదిత్య

కందము

త్రిదశాధినాథసదృశుఁడు
ద్రిశాలయమునకు మాద్రిదేవియుఁ దానున్
ముదమొనర నరిగె నేఁటికిఁ
బదియేడగు నాఁడు దురితబంధచ్యుతుఁ డై.

(పాండురాజు మాద్రితో పదిహేడు రోజుల క్రితం స్వర్గానికి వెళ్లాడు.)

1_5_153 ఉత్పలమాల విజయ్ - విక్రమాదిత్య

ఉత్పలమాల

భాను నిభుండు పాండుజనపాలుఁడు ఘోరతపంబు సేసి ధ
ర్మానిల వాసవాశ్వినుల దైనవరంబున శక్తిపేర్మితో
నీ నరనాథ నందనుల నేవుర వంశవివృద్ధిపొంటెఁ బం
చానన సత్త్వులం బడసె నాశతశృంగమహానగంబునన్.

(పాండురాజు శతశృంగపర్వతం మీద అయిదుగురు కొడుకులను కన్నాడు.)

1_5_152 వచనము విజయ్ - విక్రమాదిత్య

వచనము

ముని సహస్ర పరివృతులయి జననీ సహితంబు పాండురాజ కుమారులు రాజమార్గంబు దఱియవచ్చి రాజమందిర ద్వారాసన్నులగు నంత మంత్రి పురోహిత బ్రాహ్మణ నివహంబులు దుర్యోధన దుశ్శాసన ప్రముఖ ధార్తరాష్ట్ర శతంబును నెదురు వచ్చి పాండవులం దోడ్కొని తెచ్చిన భీష్మ విదుర ధృతరాష్ట్ర సత్యవత్యంబికాంబాలికలు మొదలుగా నమ్మునులకు నమస్కరించి రంతం దమకు మ్రొక్కిన కుమారుల నతిస్నేహంబున నెత్తికొని కుంతిని బ్రియపూర్వకంబున సంభావించి పాండురాజవియోగదుఃఖితు లయి మహాశోకంబునం దేలుచున్న విదుర ధృతరాష్ట్రుల గాంధారీ సహితం బూరార్చి యమ్మునులయం దొక్కవృద్ధతపస్వి మునిసహస్రానుమతంబున ని ట్లనియె.

(పాండురాజు కుటుంబంలోని వారందరూ వచ్చి కుంతిని, పాండవులనూ గౌరవించారు. దుఃఖిస్తున్న వారిని మునులు ఓదార్చి.)

1_5_151 ఉత్పలమాల విజయ్ - విక్రమాదిత్య

ఉత్పలమాల

వీరలు దైవశక్తిఁ బ్రభవించిన వా రగు టేమి సందియం
బీరమణీయకాంతి నుపమింపఁగ వేల్పుల కారె యిట్టి యా
కారవిశేషసంపదఁ బ్రకాశితతేజముపేర్మిఁ జూడ సా
ధారణమర్త్యులేఁ యని ముదంబునఁ బౌరులు దమ్ముఁ జూడఁగన్.

(ప్రజలు వారిని సంతోషంతో చూశారు.)

Monday, April 10, 2006

1_5_150 చంపకమాల వసు - వసంత

చంపకమాల

సురల వరప్రసాదమునఁ జూవె సుపుత్త్రులఁ బాండురాజు భా
సురముగఁ గాంచెఁ దత్సుతులఁ జూతము రండని పౌరు లెల్ల నొం
డొరులకుఁ జెప్పుచుం దెరలి యొండొరులం గడవంగ వచ్చి చూ
చిరి భుజవిక్రమాధరిత సింహకిశోరులఁ బాండవేయులన్.

(పాండురాజు పుత్రులను హస్తినాపురప్రజలందరూ వచ్చి చూశారు.)

1_5_149 వచనము వసు - వసంత

వచనము

అని తమలో విచారించి కుంతీదేవిని గుమారులం దోడ్కొని మునులెల్ల హస్తిపురంబునకు వచ్చి రంత.

(అని ఆలోచించి, వారిని వెంటబెట్టుకొని హస్తినాపురానికి వచ్చారు. అప్పుడు.)

1_5_148 కందము వసంత - విజయ్

కందము

కొడుకుల నిందఱ కిల్లడ
యిడి పరలోకమున కరిగె నెడసేయక యి
ప్పుడ వీరలఁ గురువృద్ధుల
కడకుం గొని పోవవలయు గజపురమునకున్.

(తన కొడుకులను మనకు అప్పగించి స్వర్గానికి వెళ్లాడు. మనం వీరిని హస్తినాపురానికి తీసుకొనివెళ్లాలి.)

1_5_147 కందము వసు - వసంత

కందము

ధరణీరాజ్యవిభూతియు
పరిజనులను బాంధవులను బ్రజ విడిచి తప
శ్చరణ తపస్వుల తనకున్
శరణం బని నమ్మి పాండుజనపతి నెమ్మిన్.

(పాండురాజు అన్నిటినీ విడిచి, ఋషులు మాత్రమే తనకు దిక్కు అని నమ్మి.)

1_5_146 వచనము వసు - వసంత

వచనము

మఱియు మృగశాపభయం బెఱింగియు ని ట్లేమఱిన యతిప్రమత్తురాల నే నిందుండి పుత్త్రుల రక్షింప నేర నన్ను వారింప వలవదు కొడుకుల నేమఱక రక్షించునది యని చెప్పి కుంతీదేవి వీడ్కొని మునిసహస్రంబునకు మ్రొక్కి మద్రరాజపుత్త్రి పతితోడన చితారూఢ యై యగ్నిశిఖల నపగత ప్రాణ యయ్యె నంత నయ్యిరువుర యంగంబులు సంగ్రహించుకొని మహామునులు కుంతీదేవిం గొడుకుల నూరార్చి.

(శాపం విషయం తెలిసి కూడా జాగ్రత్త లేని నేను ఇక్కడ ఉండి మన కొడుకులను కాపాడలేను. నన్ను అడ్డుకోవద్దు - అని చెప్పి సహగమనం చేసింది. తరువాత మునులు కుంతినీ, ఆమె కొడుకులనూ ఓదార్చి.)

1_5_145 తరువోజ వసు - వసంత

తరువోజ

కురువంశ నిస్తారకుల ధర్మయుక్తిఁ గొడుకులఁ బడసి యి క్కురుకుంజరునకుఁ
గరము మనఃప్రీతి గావించి పుణ్యగతికిఁ గారణమవై కమలాక్షి నీవు
దిరముగా నిష్టంబు దీర్చి తే నిందు ధృతిఁ బతియిష్టంబు దీర్పన కాన
యరిగెదఁ బతితోడ నన్యలోకంబునం దైనఁ బ్రీతిసేయఁగ గాంతు ననియు.

(కుంతీ! నువ్వు సంతానం కలిగించి ఆయన కోరిక తీర్చావు. నేను పరలోకంలో అయినా ఆయన కోరిక తీర్చటానికి ఆయన వెంట వెళ్తాను.)

-:మాద్రి సహగమనము సేయుట:-

1_5_144 ఉత్పలమాల వసు - వసంత

ఉత్పలమాల

నా కెడ యిమ్ము లెమ్ము కురునాథు మనఃప్రియధర్మపత్ని నే
నేకత మెట్టు లుండుదు మహీపతితోడన పోదుఁ బుత్త్రులం
జేకొని పెన్పు నా పనుపుఁ జేయుము నావుడు మాద్రి దద్దయున్
శోకపరీతచిత్త యగుచుం బృథ కి ట్లనియెం బ్రియంబునన్.

(ఆయనతో నేను వెళ్లిపోతాను. నువ్వు మన సంతానాన్ని పెంచు - అని కుంతి అనగా మాద్రి ఇలా అన్నది.)

1_5_143 వచనము వసంత - విజయ్

వచనము

దానం జేసి విగత జీవుం డైన యప్పాండురాజుం గౌఁగిలించికొని మాద్రి యఱచుచున్న దాని యాక్రందన ధ్వని విని వెఱచి కుంతీదేవి గొడుకులుం దానునుం బఱతెంచి పతియడుగులపయిం బడి యేడ్చుచున్న నెఱింగి శతశృంగ నివాసు లగు మునులెల్లం దెరలివచ్చి చూచి శోక విస్మయాకులిత చిత్తు లయి రంతఁ గుంతీదేవి మాద్రి కి ట్లనియె.

(ప్రాణాలు కోల్పోయాడు. అందరూ బాధపడ్డారు. కుంతి మాద్రితో ఇలా అన్నది.)

1_5_142 కందము వసు - వసంత

కందము

కిందముశాపము డెందము
నం దలఁపక శాపభయమునన్ మాద్రి గడున్
వందురి వారింపఁగ బలి
మిం దత్సంభోగసుఖసమీహితుఁ డయ్యెన్.

(మాద్రి వారిస్తున్నా వినక కిందముడి శాపాన్ని మరచి ప్రవర్తించి.)

1_5_141 ఉత్పలమాల వసు - వసంత

ఉత్పలమాల

చారుసువర్ణహాసి నవచంపక భూషయు సిందువారము
క్తా రమణీయయున్ వకుళదామవతంసయు నై యపూర్వ శృం
గార విలాసలీల యెసఁగం దనముందట నున్న మాద్రి నం
భోరుహనేత్రఁ జూచి కురుపుంగవుఁ డంగజరాగమత్తుఁ డై.

(మన్మథవశుడై.)

1_5_140 వచనము వసు - వసంత

వచనము

ఇట్లు సర్వభూతసమ్మోహనంబయిన వసంత సమయంబునం బాండుతాజు మదనసమ్మోహనమార్గణ బందీకృత మానసుం డై మద్రరాజపుత్త్రి దైన మనోహరాకృతియందు మనంబు నిలిపి యున్నంత నొక్కనాఁడు కుంతీదేవి బ్రాహ్మణభోజనంబు సేయించుచుండి మాద్రీరక్షణంబునం దేమఱి యున్న యవసరంబున.

(ఇలాంటి వసంతకాలంలో పాండురాజు మాద్రి మీద మనసు నిలిపి.)

-:పాండురాజు మరణము:-

1_5_139 లయగ్రాహి వసు - వసంత

లయగ్రాహి

చందన తమాలతరులందు నగరుద్రుమములందుఁ గదళీవనములందు లవలీ మా
కంద తరుషండములయందు ననిమీల దరవింద సరసీవనములందు వనరాజీ
కందళిత పుష్పమకరందరసముం దగులుచుం దనుపు సౌరభము నొంది జనచిత్తా
నందముగఁ బ్రోషితులడెందము లలందురఁగ మందమలయానిల మమందగతి వీచెన్.

(ప్రజలకు ఆనందం కలిగించేలా, దేశాంతరంలో ఉన్నవారి మనసులు దుఃఖించేలా సువాసన కలిగిన చల్లని గాలి వీచింది.)

1_5_138 లయగ్రాహి వసంత - విజయ్

లయగ్రాహి

కమ్మని లతాంతములకు మ్మొనసి వచ్చు మధుపమ్ముల సుగీత నినదమ్ము లెసఁగెం జూ
తమ్ముల లసత్కిసలయమ్ముల సుగంధి ముకుళమ్ములను నానుచు ముద మ్మొనర వాచా
లమ్ము లగు కోకిల కులమ్ముల రవమ్ము మధుర మ్మగుచు విన్చె ననిశమ్ము సుమనోభా
రమ్ముల నశోకనికరమ్ములును జంపకచయమ్ములును గింశుకవనమ్ములును నొప్పెన్.

(తుమ్మెదల ఝంకారం పెరిగింది. కోకిలల గానం వినిపించింది. పూలచెట్లు విరిశాయి.)

-:వసంత వర్ణనము:-

1_5_137 వచనము వసు - వసంత

వచనము

అ క్కశ్యపుండును జనుదెంచి పృథా మాద్రీ సహితుం డయి యున్న యప్పాండురాజుం గని వసుదేవు సందేశంబుఁ జెప్పి యక్కుమారులకు రత్నభూషణాంబరంబు లిచ్చి క్రమంబునఁ జౌలోప నయనంబు లొనరించి వేదాధ్యయనంబు సేయించుచున్నంత వసంతసమయం బఖిలజీవలోకానందజననం బై యేర్పడం జనుదెంచిన.

(వసుదేవుడి సందేశాన్ని కశ్యపుడు వారికి వినిపించి, వారి చేత వేదాధ్యయనం చేయిస్తూ ఉండగా వసంతకాలం వచ్చింది.)

1_5_136 సీసము + తేటగీతి వసు - వసంత

సీసము

మృగ శాప భయమున జగతీశుఁ డప్పాండు
        పతి శతశృంగపర్వతమునందుఁ
బత్నీసమేతుఁడై యత్నంబుతో ఘోర
        తప మొనరించుచు విపులశక్తి
నమరవరప్రసాదమున ధర్మస్థితిఁ
        గొడుకుల నేవురఁ బడసె ననియు
విని వసుదేవుండు మనమున హర్షించి
        యనుజను మఱఁదిని ఘనుఁడు చూడఁ

తేటగీతి

దనపురోహితుఁ గశ్యపుం డను మహాత్ముఁ
జీరి పుత్తెంచె నవ్విప్రుచేత భాగి
నేయు లగు కుమారులకు నమేయరత్న
భూషణావళు లిచ్చి విశేషలీల.

(కుంతి అన్న అయిన వసుదేవుడు పాండవులు పుట్టిన విషయం విని, తన పురోహితుడు కశ్యపుడితో, వారికి కానుకలు పంపాడు.)

Sunday, April 09, 2006

1_5_135 వచనము వసు - వసంత

వచనము

అంత నట.

(తరువాత, అక్కడ.)

1_5_134 కందము వసు - వసంత

కందము

ఊర్జితులు యుధిష్ఠిర భీ
మార్జున నకుల సహదేవు లన నిట్లు వివే
కార్జితయశు లుదయించిరి
నిర్జరుల వరప్రసాదనిర్మితశక్తిన్.

(పాండవులు ఇలా జన్మించారు.)

1_5_133 తేటగీతి వసంత - విజయ్

తేటగీతి

కవలవారు సూర్యేందుప్రకాశతేజు లా
శ్వినుల యంశములఁ బుట్టి రమరగుణులు
వారలకుఁ బ్రీతి నాకాశవాణి సేసె
నకుల సహదేవు లనియెడు నామయుగము.

(కవలలు జన్మించారు. వారికి ఆకాశవాణి నకుల సహదేవులనే పేర్లు పెట్టింది.)

1_5_132 వచనము వసంత - విజయ్

వచనము

అని పలికి యప్పుడ కుంతీదేవిం బిలిచి మద్రరాజపుత్త్రిదయిన మనోవాంఛితంబుఁ జెప్పి సకలలోక కళ్యాణకారు లాశ్వినులు గావున వారి నారాధించి యపత్యంబు వడయు మనిన గొంతియుం బతివచనానురూపంబు సేసిన మాద్రికి.

(అని మాద్రితో చెప్పి, కుంతికి మాద్రి కోరికను తెలియజేసి అశ్వినీదేవతలను ఆరాధించమని చెప్పాడు. ఆమె అలాగే చేయగా మాద్రికి.)

1_5_131 కందము వసు - వసంత

కందము

నా వచనమున నపత్యముఁ
గావించును గుంతి నీకుఁ గడు నెయ్యముతో
నీ వగచిన యీయర్థమ
చూవె మనంబునఁ దలంచుచుండుదు నేనున్.

(నా కోరిక కూడా అదే. నా మాట ప్రకారం కుంతి నీకు సంతానం కలుగుజేస్తుంది.)

1_5_130 వచనము వసు - వసంత

వచనము

అని వగచుచు నొక్కనాఁ డేకాంతంబునం బతియొద్ద గద్గద వచన యై తన మనోవాంఛితంబుఁ జెప్పి కుంతిదేవి యనుగ్రహంబుం బడయ నగునేని కొడుకులం బడయుదు నట్లయిన నాకును నీకును లోకంబులకును హితం బగుఁ గావున నాకుఁ బుత్త్రోత్పాదనంబు దయసేయం గుంతీదేవికి నానతి యిమ్మనిన మాద్రికిఁ బాండురా జి ట్లనియె.

(అని బాధపడి పాండురాజుతో తన కోరిక తెలిపి - నాకు కొడుకులు పుట్టేటట్లు చేయమని కుంతికి ఆజ్ఞ ఇవ్వండి - అని మాద్రి అనగా పాండురాజు ఇలా అన్నాడు.)

-:మాద్రికి నకులసహదేవులు పుట్టుట:-

1_5_129 ఉత్పలమాల వసు - వసంత

ఉత్పలమాల

కోరిన కోర్కికిం దగఁగఁ గుంతి సుతత్రితయంబుఁ గాంచె గాం
ధారియు నక్కడన్ సుతశతంబు ముదం బొనరంగఁ గాంచె నేఁ
బోరచి యాఁడుఁబుట్టువునఁ బుట్టి నిరర్థకజీవ నైతి సం
సారసుఖావహం బయిన సత్సుతజన్మముఁ గానఁ బోలమిన్.

(కుంతి ముగ్గురు కొడుకులను కన్నది. అక్కడ హస్తినాపురంలో గాంధారి వందమంది కొడుకులను కన్నది. నిస్సారమైన ఆడజన్మ ఎత్తి, కొడుకులు కనలేక, నా జీవితం నిరర్థకమయింది.)

1_5_128 వచనము వసు - వసంత

వచనము

పాండురాజును బరమోత్సవంబునం గుంతివలనఁ బురుషత్రయసమానం బయిన పుత్త్రత్రయంబు వడసి భువనత్రయ రాజ్యంబు వడసినంతియ సంతసిల్లి కుమారులతోడి వినోదంబులం దగిలి యున్నంత మాద్రి దనయందుఁ బుత్త్రజన్మంబు వడయు నుపాయంబు లేమికి దుఃఖించి యాత్మగతంబున.

(కుంతికి పుట్టిన పుత్రులతో పాండురాజు సంతోషంగా ఉండగా కొడుకులు లేనందుకు మాద్రి బాధపడి.)

1_5_127 మాలిని వసు - వసంత

మాలిని

సరస సురవధూలాస్యంబులున్ సిద్ధవిద్యా
ధరపటుపటహాతోద్యంబులుం గిన్నరీ కిం
పురుష లలితగీతంబుల్ మహారమ్య మయ్యెన్
వరమునిదివిజాశీర్వాదనాదంబుతోడన్.

(నృత్యాలు, వాద్యాలు, గానాలు, ఆశీర్వచనాల శబ్దంతో మనోహరమయింది.)

1_5_126 కందము వసంత - విజయ్

కందము

శతశృంగ నగేంద్రము శత
ధృతి సర్గ దినంబపోలెఁ ద్రిభువన భూత
ప్రతతిఁ బరిపూర్ణ శోభా
ధృతి నింద్రతనూజు జన్మదినమున నొప్పెన్.

(అర్జునుడి పుట్టినరోజు బ్రహ్మదేవుడు సృష్టి చేసే రోజులాగా ప్రకాశించింది.)

1_5_125 వచనము వసు - వసంత

వచనము

మఱియు మరీచ్యాది ప్రజాపతులును ధాత్రాది ద్వాదశాదిత్యులును మృగవ్యాధాది రుద్రులును ధరాది వసువులును భరద్వాజాది మహర్షులును భీమసేనాది గంధర్వులును శేషాది మహానాగముఖ్యులును వైనతేయాది ఖచరులును మేనకాద్యప్సరసలును నాశ్వినులును విశ్వేదేవతలును మఱియు స్వర్గంబున నున్న రాజులుం జనుదెంచిన.

(మహర్షులు మొదలైనవారు చాలామంది అక్కడికి రాగా.)

Saturday, April 08, 2006

1_5_124 సీసము + ఆటవెలది వసు - వసంత

సీసము

విను కార్తవీర్యుకంటెను వీరుఁ డగుట న
        ర్జున నామ మీతండ యొనరఁ దాల్చు
నీతండ యనిఁ బురుహూతాది సురుల నో
        డించి ఖాండవము దహించు బలిమి
నీతండ నిఖిలావనీతలేశుల నోర్చి
        రాజసూయము ధర్మరాజు ననుచు
నీతండ వేల్పులచేత దివ్వాస్త్రముల్
        వడసి విరోధుల నొడుచుఁ గడిమి

ఆటవెలది

ననుచు నవపయోదనినదగంభీర మై
నెగసె దివ్యవాణి గగనవీధిఁ
గురిసెఁ బుష్పవృష్టి సురదుందుభిధ్వనుల్
సెలఁగె సకలభువనవలయ మద్రువ.

(అతడు అర్జునుడు అనే పేరు వహిస్తాడని ఆకాశవాణి పలికింది.)

1_5_123 వచనము వసు - వసంత

వచనము

అయ్యవసంబున.

(ఆ సమయంలో.)

1_5_122 కందము వసు - వసంత

కందము

స్థిర పౌరుషుండు లోకో
త్తరుఁ డుత్తరఫల్గునీప్రథమ పాదమునన్
సురరాజునంశమున భా
సురతేజుఁడు వంశకరుఁడు సుతుఁ డుదయించెన్.

(అర్జునుడు ఉత్తర ఫల్గునీ నక్షత్ర ప్రథమపాదంలో జన్మించాడు.)

1_5_121 వచనము వసు - వసంత

వచనము

అని నియోగించినఁ గుంతియుఁ దొల్లిటి యట్ల దుర్వాసుం డిచ్చిన మంత్రంబున నింద్రు నారాధించినఁ దత్ప్రసాదంబున గుంతికి.

(అని ఆజ్ఞాపించగా కుంతి అలాగే ఇంద్రుడిని ప్రార్థించింది. అతడి దయతో కుంతికి.)

1_5_120 చంపకమాల వసు - వసంత

చంపకమాల

అమరగణంబులోనఁ బరమార్థమ యింద్రుఁడు పెద్ద సర్వలో
కములకు వల్లభుం డతఁడ కావున నయ్యమరాధిపప్రసా
దమున సుతున్ సురేంద్రసము ధర్మసమన్వితు నస్మదీయవం
శము వెలుఁగింపఁగా బడయు సర్వజగత్పరిరక్షణక్షమున్.

(నా వంశాన్ని వెలిగించే కొడుకును దేవేంద్రుడి దయతో పొందు.)

1_5_119 కందము విజయ్ - విక్రమాదిత్య

కందము

ధనమున విద్యను సంతతిఁ
దనిసిన వా రెందుఁ గలరె ధవలేక్షణ కా
వున నా కింకను బలువురఁ
దనయులఁ బడయంగ వలయు ధర్మువు పేర్మిన్.

(కుంతీ! ధనం, విద్య, సంతానం విషయాలలో తృప్తి పొందిన వాళ్లు ఉన్నారా? నాకు ఇంకా చాలామంది కొడుకులను ధర్మమార్గంలో పొందాలని ఉంది.)

1_5_118 కందము విజయ్ - విక్రమాదిత్య

కందము

పుత్త్రుఁడు నీ కుదయించు న
మిత్త్రక్షయకరుఁడు బంధుమిత్త్రాంబుజ స
న్మిత్త్రుం డని వర మిచ్చిన
ధాత్త్రీపతి పొంగి పృథకుఁ దా ని ట్లనియెన్.

(శత్రువులను జయించే పుత్రుడు నీకు జన్మిస్తాడు - అని వరమిచ్చాడు. పాండురాజు సంతోషించి కుంతీదేవితో ఇలా అన్నాడు.)

1_5_117 వచనము విజయ్ - వసంత

వచనము

ఇ ట్లతి నిష్ఠ నేక పాద స్థితుం డయి తపంబు సేయుచుఁ గుంతి నొక్క సంవత్సరంబు వ్లతంబు సేయం బంచియున్న నప్పాండురాజున కింద్రుండు ప్రత్యక్షం బై.

(కుంతీదేవిని ఒక సంవత్సరం వ్రతం చెయ్యమని చెప్పాడు. తపస్సు చేస్తున్న పాండురాజుకు దేవేంద్రుడు ప్రత్యక్షమై.)

1_5_116 కందము విజయ్ - విక్రమాదిత్య

కందము

కొడుకుం ద్రిలోక విజయుం
బడయుదు నని ఘోర మగు తపం బొనరింపం
దొడఁగె సురరాజు నెడలో
నిడికొని యేకాగ్రబుద్ధి నేకాంతమునన్.

(ముల్లోకాలను జయించగల కొడుకు కోసం దేవేంద్రుడిని ధ్యానిస్తూ తపస్సు చేయటానికి పూనుకొన్నాడు.)

-:ఇంద్రప్రసాదంబునఁ గుంతి కర్జునుఁ డుదయించుట:-

Friday, April 07, 2006

1_5_115 వచనము విజయ్ - విక్రమాదిత్య

వచనము

దానిం జూచి పాండురాజు సంభ్రమంబునఁ బఱతెంచి విస్మితుం డై కొడుకు నెత్తికొని కుంతీదేవిం దోడ్కొని వేల్పులకు మ్రొక్కించి మగుడి నిజాశ్రమంబునకు వచ్చి సుఖం బుండి గాంధారీధృతరాష్ట్రులకుఁ బుత్త్రశతంబు పుట్టుట విని ఋషులవలన దివ్యమంత్రోపదేశంబుఁ గొని.

(అది చూసి పాండురాజు ఆశ్చర్యపోయి, కొడుకును ఎత్తుకొని, కుంతితో దేవాలయానికి వెళ్లి, తిరిగి ఆశ్రమానికి వచ్చి, సుఖంగా ఉండసాగాడు. గాంధారీ ధృతరాష్ట్లులకు వందమంది కొడుకులు పుట్టారని విని ఋషుల దగ్గర మంత్రోపదేశం పొంది.)

1_5_114 కందము నచకి - వసంత

కందము

ఉరు శార్దూల భయంబునఁ
బరవశ యయి కుంతి యున్న బాలకుఁడు శిలో
త్కరముపయిఁ బడియెఁ దన ని
ష్ఠుర తను హతిఁ జేసి రాలు చూర్ణంబులుగన్.

(పులిని చూసిన భయంతో కుంతి శరీరం స్వాధీనం తప్పగా, భీముడు కిందపడ్డాడు. కఠినమైన అతడి శరీరం తాకిడికి కొండరాళ్లు పొడి అయ్యాయి.)

1_5_113 కందము నచకి - వసంత

కందము

వీరుఁడు పాండుమహీపతి
దారుణ బాణ త్రయమునఁ దద్వ్యాఘ్రంబున్
ధారుణిఁ ద్రెళ్లఁగ నడుమన
భూరిభుజుం డేసి కాచెఁ బుత్త్రుం దేవిన్.

(పాండురాజు బాణాలతో ఆ పులిని చంపి కుంతిని, భీముడిని కాపాడాడు.)

-:భీముడి శరీర దార్ఢ్యము:-

1_5_112 వచనము వసంత - విజయ్

వచనము

కావున నిప్పుడ దుర్యోధను దూషింతము నీకు వెండియుఁ బుత్త్రశతంబు సంపూర్ణం బయి పెరుఁగుచున్నయది యనిన ధృతరాష్ట్రుండు పుత్త్రమోహంబున నప్పలుకులు విననొల్లకుండె నంత నట శతశృంగంబునఁ గుంతీదేవి భీమసేను సుపుత్త్రుం బడసి దశమదివసంబున వేల్పులకు మ్రొక్కఁ గొడుకు నెత్తికొని దేవగృహంబునకుఁ బోవునెడ నతివిషమగహనగిరిగహ్వరంబుననుండి యొక్కపులి వెలువడి యామిషార్థి యయి పయికి లంఘించిన.

(నీకు ఇంకా వందమంది పిల్లలు ఉన్నారు - అనగా ధృతరాష్ట్రుడు ఆ మాటలు వినలేదు. అక్కడ శతశృంగం మీద కుంతి, భీముడిని కన్న పదోరోజున, దేవాలయానికి పోతూ ఉండగా ఒక పులి వారి మీదికి దూకింది.)

1_5_111 కందము నచకి - వసంత

కందము

కులమునకు నఖిల లోకం
బులకు నపాయంబు సేయు పురుషాధము ని
మ్ముల దూషించి జగంబును
గులమును రక్షించు టుఱదె కువలయనాథా.

(మహారాజా! నీచుడైన ఈ దుర్యోధనుడిని విడిచిపెట్టి లోకాన్ని రక్షించవచ్చు కదా?)

Thursday, April 06, 2006

1_5_110 కందము వసంత - విజయ్

కందము

మన దుర్యోధను జన్మం
బునఁ బెక్కులు దుర్నిమిత్తములు పుట్టె జగ
జ్జనసంక్షయజననుం డగు
నని పలికెద రెఱుక గల మహాత్ములు వానిన్.

(దుర్యోధనుడు పుట్టినప్పుడు చాలా దుశ్శకునాలు కనిపించాయి. వాడు లోకనాశనం కలిగించేవాడవుతాడని జ్ఞానులు అంటున్నారు.)

1_5_109 వచనము వసంత - విజయ్

వచనము

ఇట్లేకోత్తరశతపుత్త్రులం బడసి కృతార్థుండై యున్న ధృతరాష్ట్రుకడకు భీష్మవిదురాది బంధుజనంబులుఁ బురోహితప్రముఖ బ్రాహ్మణవరులును వచ్చి యొక్కనాఁ డేకాంతంబున ని ట్లనిరి.

(అప్పుడు ధృతరాష్ట్రుడి దగ్గరకు భీష్ముడు, విదురుడు మొదలైన వాళ్లు వచ్చి ఇలా అన్నారు.)

1_5_108 తేటగీతి నచకి - వసంత

తేటగీతి

ఆ తనూజుల కందఱ కనుజ యై ల
తాంగి దుశ్శల యను కూఁతు రమరఁ బుట్టె
నందు దౌహిత్రవంతుల దైన పుణ్య
గతియుఁ గాంతు నే నని పొంగెఁ గౌరవుండు.

(వారందరికీ చెల్లెలిగా దుశ్శల పుట్టింది.)

1_5_107 వచనము వసంత - విజయ్

వచనము

మఱియు దుర్యోధనజన్మాంతరంబున ధృతరాష్ట్రునకు వైశ్యాపుత్త్రుం డయిన యుయుత్సుండు పుట్టె నంత గాంధారికి నొక్కొక్క దివసంబున నొక్కొక్కరుండుగాఁ గ్రమంబున దుశ్శాసన దుస్సహ దుశ్శల జలసంధ సమ సహ విందానువింద దుర్ధర్ష సుబాహు దుష్ప్రధర్షణ దుర్మర్షణ దుర్ముఖ దుష్కర్ణ కర్ణ వివింశతి వికర్ణ శల సత్త్వ సులోచన చిత్రోపచిత్ర చిత్రాక్ష చారుచిత్ర శరాసన దుర్మద దుర్విగాహ వివిత్సు వికటాన నోర్ణనాభ సునాభ నందోపనందక చిత్రబాణ చిత్రవర్మ సువర్మ దుర్వమోచనాయోబాహు మహాబాహు చిత్రాంగ చిత్రకుండల భీమవేగ భీమబల బలాకి బలవర్ధ నోగ్రాయుధ సుషేణ కుండధార మహోదర చిత్రాయుధ నిషంగి పాశి బృందారక దృఢవర్మ ధృఢక్షత్త్ర సోమకీ ర్త్యనూదర దృఢసంధ జరాసంధ సద సువా గుగ్రశ్రవ ఉగ్రసేన సేనానీ దుష్పరాజ యాపరాజిత కుండశాయి విశాలాక్ష దురాధర దుర్జయ దృఢహస్త సుహస్త వాతవేగ సువర్చ ఆదిత్యకేతు బహ్వాశి నాగదత్తాగ్రయాయి కవచి క్రధన కుండి ధనుర్ధరోగ్ర భీమరథ వీరబాహ్వ లోలుపాభయ రౌద్రకర్మ దృఢరథాశ్రయా నాధృష్య కుండభేది విరావి ప్రమథ ప్రమాథి దీర్ఘరోమ దీర్ఘబాహు వ్యూఢోరు కనకధ్వజ కుండాశి విరజసు లనంగా నూర్వురు గొడుకులు బుట్టిన.

(ధృతరాష్ట్రుడికి వరుసగా నూరుగురు కొడుకులు పుట్టారు.)

1_5_106 శార్దూలము నచకి - వసంత

శార్దూలము

ఆదుర్యోధనుఁ డుద్భవిల్లుడును గ్రవ్యాదారవంబుల్ శివా
నాదంబుల్ మదఘూకఘూంకృతులు నానారాసభధ్వానముల్
భూదిక్కంపముగాఁ జెలంగె విగతాంభోభృన్నభోవీథియం
దాదిత్యద్యుతి మాయఁగా గురిసె నుగ్రాసృఙ్మహావర్షముల్.

(దుర్యోధనుడు పుట్టగానే చాలా అపశకునాలు కనిపించాయి.)

Wednesday, April 05, 2006

1_5_105 కందము నచకి - వసంత

కందము

అనిలజు పుట్టిన దివసము
నన యట దుర్యోధనుండు నరనుత ధృతరా
ష్ట్రునకున్ గాంధారికి న
గ్ర నందనుఁడు ఘనుఁడు పుట్టెఁ గలియంశమునన్.

(జనమేజయ మహారాజా! అదే రోజు గాంధారీ ధృతరాష్ట్రులకు కలి అంశతో దుర్యోధనుడు పుట్టాడు ( - అని వైశంపాయన మహర్షి చెప్పటం ప్రారంభించాడు.))

-:దుర్యోధనాదుల జననము:-

1_5_104 చంపకమాల వసంత - విజయ్

చంపకమాల

సుతుఁడు నభస్వదంశమున సుస్థిరుఁ డై యుదయించినన్ మహా
యతికృత జాతకర్ముఁ డగు నాతని కాతతవీర్యవిక్రమో
న్నతునకు భీమసేనుఁ డను నామముఁ దా నొనరించె దివ్యవా
క్సతి శతశృంగశైల నివసన్మునిసంఘము సంతసిల్లఁ గన్.

(మహాబలవంతుడైన కొడుకు పుట్టగా మహర్షులు అతడికి జాతకర్మ చేశారు. ఆకాశవాణి ఆ బాలుడికి భీమసేనుడని నామకరణం చేసింది.)

1_5_103 వచనము నచకి - వసంత

వచనము

అని పనిచిన నెప్పటియట్ల కుంతీదేవి వాయుదేవు నారాధించి తత్ప్రసాదంబున గర్భంబు దాల్చి సంవత్సరంబు సంపూర్ణం బగుడును.

(ఆమె అలాగే వాయుదేవుడి దయవల్ల గర్భం ధరించి ఒక సంవత్సరం పూర్తి కాగానే.)

1_5_102 చంపకమాల నచకి - వసంత

చంపకమాల

నిరుపమకీర్తి పాండుధరణీపతి వెండియుఁ గుంతిఁ జూచి యం
బురుహదళాక్షి యింక నొకపుత్త్రు నుదారచరిత్రు నుత్తమ
స్థిరజవసత్త్వు నయ్యనిలదేవుదయం జనియింపు పెంపుతోఁ
గురుకులరక్షకుం డతఁ డగున్ బలవద్భుజవిక్రమోన్నతిన్.

(పాండురాజు కుంతీదేవిని వాయుదేవుడి దయతో ఇంకొక పుత్రుడిని పొందమని కోరాడు.)

1_5_101 వచనము వసంత - విజయ్

వచనము

అని గాంధారిం బదరి తొల్లి వేదంబులు విభాగించిన మహానుభావుం డమ్మాంస పేశినేకోత్తర శతఖండంబులుగా విభాగించి వీని వేఱు వేఱ ఘృత కుండంబులం బెట్టి శీతలజలంబులం దడుపుచు నుండునది యిందు నూర్వురు గొడుకులు నొక్క కూతురుం బుట్టుదు రని చెప్పి చనినఁ దద్వచనప్రకారంబు చేయించి గాంధారీధృతరాష్ట్రులు సంతసిల్లియున్న నిట శతశృంగంబున.

(అని ఆ ముద్దను నూటొక్క ముక్కలుగా చేసి, వాటిని ఎలా కాపాడుకోవాలో చెప్పి వెళ్లాడు. గాంధారి, ధృతరాష్ట్రుడు అలాగే చేశారు. అక్కడ శతశృంగం దగ్గర.)

Tuesday, April 04, 2006

1_5_100 కందము నచకి - వసంత

కందము

ఇమ్మాంసపేశి నేకశ
త మ్ముదయింతురు సుతులు ముదమ్మున నిది త
థ్య మ్మింక నైన నతియ
త్నమ్మున రక్షింపు దీని నా వచనమునన్.

(ఈ మాంసపు ముద్దనుండి నూటొక్కమంది కొడుకులు, కూతుళ్లు జన్మిస్తారు. నా మాట నమ్మి దీనిని జాగ్రత్తగా కాపాడుకో.)

1_5_99 కందము వసంత - విజయ్

కందము

దాని నెఱింగి పరాశర
సూనుఁడు చనుదెంచి సుబలసుతఁ జూచి మనో
హీన వయి గర్భపాతము
గా నిట్టులు సేయు టిదియుఁ గర్తవ్యం బే.

(అది తెలిసి, వ్యాసుడు వచ్చి - బుద్ధిలేకుండా ఇలా గర్భపాతం చేసుకోవటం ఉచితమేనా - అన్నాడు.)

1_5_98 వచనము నచకి - వసంత

వచనము

ఇట్లు పుత్త్రోదయంబునఁ బరమహర్ష సంపూర్ణ హృదయుం డై పాండురాజు కుంతీ మాద్రీ సహితుం డై శతశృంగంబున నుండునంత నట ముందఱ ధృతరాష్ట్రువలనన్ గాంధారి కృష్ణద్వైపాయనువరంబున గర్భంబు దాల్చి యొక్క సంవత్సరంబు నిండినఁ బ్రనూతి కాకున్నం బదరుచుఁ బుత్త్రలాభలాలస యయి యున్న యది యప్పు డయ్యుధిష్ఠిరుజన్మంబు విని మనస్తాపంబున నుదరతాడనంబుఁ జేసికొనిన గర్భపాతం బగుడును.

(కుంతికన్నా ముందే గర్భవతి అయిన గాంధారి, కుంతికి యుధిష్ఠిరుడు జన్మించాడని విని కడుపును బాదుకోగా ఆమెకు గర్భపాతమయింది.)

-:గాంధారి యుదరతాడనంబు గావించుకొనుట:-

1_5_97 కందము వసంత - విజయ్

కందము

కురుకుల విభుఁ డగు ధర్మ
స్థిరమతి యగు నీతఁ డనుచు ధృతిఁ జేసి యుధి
ష్ఠరుఁ డను నామముఁ దా ను
చ్చరించె నాకాశవాణి జనవినుతముగన్.

(ఇతడు కురువంశానికి రాజవుతాడు. ధర్మంలో స్థిరమైన బుద్ధి కలవాడవుతాడు. ధైర్యం వల్ల యుధిష్ఠిరుడవుతాడు - అని ఆకాశవాణి పలికింది.)

1_5_96 కందము వసంత - విజయ్

కందము

శతశృంగ నిలయు లగు సం
శ్రితవ్రతులు విప్రవరులు సేసిరి ధర్మ
స్థితి జాతకర్మ మత్యు
న్నతిఁ బాండుప్రథమ పుత్త్రునకు హర్షముతోన్.

(పాండురాజు మొదటి కుమారుడికి శతశృంగపర్వతం మీద ఉన్న బ్రాహ్మణులు జాతకర్మ చేశారు.)

1_5_95 కందము నచకి - వసంత

కందము

ధరణీసురు లాదిగ ను
ర్వరలోఁ గల సర్వభూతవర్గం బెల్లం
బరమోత్సవ మొందెను గుణ
శరణ్యుఁ డగు ధర్మజన్ము జన్మదినమునన్.

(అందరూ ఆనందించారు.)

1_5_94 ఉత్పలమాల నచకి - వసంత

ఉత్పలమాల

శాత్త్రవజైత్రతేజమున సర్వదిశల్ వెలుఁగంగ నైంద్ర న
క్షత్త్రయుతుండుగా శశి ప్రకాశజయోన్నత మైన యష్టమిన్
మిత్త్రముఖగ్రహప్రతతి మేలుగ నాభిజితోదయంబునం
బుత్త్రుఁడు ధర్మునంశమునఁ బుట్టె నతిస్థిరధర్మమూర్తి యై.

(ధర్మరాజు జన్మించాడు.)

-:కుంతీదేవియందు ధర్మరాజు జననము:-

1_5_93 వచనము వసంత - విజయ్

వచనము

అని నియోగించినఁ గుంతియు బతికిఁ బ్రదక్షిణంబుఁ జేసి సమాహిత చిత్త యై మహాముని యిచ్చిన మంత్రంబు విధివంతంబుఁ జేసి ధర్ముని నారాధించిన నా ధర్ముండును యోగమూర్తి ధరుం డై వచ్చి వరం బిచ్చినం గుంతియుఁ దత్ప్రసాదంబున గర్భంబు దాల్చి సంవత్సరంబు పరిపూర్ణం బైన.

(కుంతి యముడి దయవల్ల గర్భం ధరించి సంవత్సరకాలం కాగానే.)

1_5_92 కందము వసంత - విజయ్

కందము

లలితాంగి యెల్లలోకం
బులు ధర్మువునంద నిలుచుఁ బొలుపుగ ధర్ముం
దలఁపుమ యాతఁడ మఱి వే
ల్పుల లోపలఁ బెద్ద ధర్మమున సత్యమునన్.

(కుంతీ! ధర్మదేవతను స్మరించు. దేవతలలో అతడే పెద్దవాడు.)

1_5_91 వచనము వసంత - విజయ్

వచనము

అని పుత్త్రముఖావలోకన లోలత్వంబున దీన వదనుండై దేవిం బ్రార్థించినఁ గుంతియుం బుత్రోత్పాదనోన్ముఖియై కుంతిభోజునింటఁ దన కొండుకనాఁడు దుర్వాసునిచేతం బడసిన మంత్రంబు తెఱంగు పతి కెఱింగించి యమ్మంత్రంబున కిది యవసరం బయ్యె నేవేల్పు నారాధింతు నానతి మ్మనిన సంతసిల్లి కుంతీదేవికిం బాండురా జి ట్లనియె.

(అని కుంతిని ప్రార్థించగా ఆమె దుర్వాసుడి ద్వారా తనకు లభించిన మంత్రం గురించి పాండురాజుకు చెప్పి ఏ దేవుడిని సేవించాలో ఆజ్ఞాపించమని భర్తను అడిగింది. పాండురాజు సంతోషించి.)

Monday, April 03, 2006

1_5_90 చంపకమాల నచకి - వసంత

చంపకమాల

అలయక ధర్మశాస్త్రములయందుఁ బురాణములందుఁ జెప్ప ను
త్పలదళనేత్ర విందుమ యపత్యము మే లని కావునన్ యశో
నిలయులఁ బుత్త్రులం బడయు నీ కొనరించెద సంగతాంగుళీ
దళ విలసన్మదీయ కరతామరసద్వయ యోజితాంజలిన్.

(నా చేతులెత్తి నీకు నమస్కారం చేస్తాను.)

1_5_89 వచనము వసంత - విజయ్

వచనము

పతి నియోగించిన దానిం జేయని నాఁడు భార్యకుం బాతకం బని యెఱింగి కాదె తొల్లి సౌదాసుం డైన కల్మాషపాదుం డను రాజర్షిచేత నియుక్త యై వాని భార్య మదయంతి యనునది వసిష్ఠు వలన నశ్మకుం డను పుత్త్రుం బడసె నస్మజ్జనంబు నిట్టిద మహాముని యయిన కృష్ణద్వైపాయనువలనఁ గురుకులవృద్ధిపొంటె నే ముద్భవిల్లితిమి కావున నీ విన్నికారణంబులు విచారించి నా నియోగంబు సేయుము.

(అందుకే కదా కల్మాషపాదుడి ఆజ్ఞతో అతడి భార్య మదయంతి వశిష్ఠుడి వల్ల పుత్రుడిని పొందింది? మా పుట్టుక కూడా ఇలాంటిదే. కాబట్టి నేను చెప్పినట్లు చెయ్యి.)

1_5_88 తేటగీతి నచకి - వసంత

తేటగీతి

భర్తచేత నియోగింపఁ బడక సతికి
నెద్దియును జేయఁగాఁ దగ దెద్ది యైన
భర్తచేత నియోగింపఁ బడిన దానిఁ
జేయకునికి దోషం బని చెప్పె మనువు.

(భర్త ఆజ్ఞలేనిదే భార్య ఏదీ చేయకూడదు. భర్త ఆజ్ఞాపించిన పని చేయకపోవటం దోషం - అని మనువు చెప్పాడు.)

1_5_87 కందము వసంత - విజయ్

కందము

పురుషులచే ధర్మస్థితిఁ
బరిగ్రహింపంగఁ బడిన భార్యలకు నిరం
తరము నిజ పురుష భక్తియుఁ
బరపురుష వివర్జనంబుఁ బరిచిత మయ్యెన్.

(భార్యలకు పరపురుషులను విడవటం అలవాటైంది.)

1_5_86 వచనము వసంత - విజయ్

వచనము

మఱియుఁ దిర్యగ్యోనులయందును నుత్తరకురుదేశంబులయందును మొదలింటి ధర్మంబ యిప్పుడుం బ్రవర్తిల్లుచుండునట్లు మనుష్యులయందు శ్వేతకేతుండు సేసిన ధర్మస్థితి కారణంబున నాటంగోలె.

(ఆ రోజు నుండీ.)

Sunday, April 02, 2006

1_5_85 సీసము + ఆటవెలది నచకి - వసంత

సీసము

ఇది యాదిగా సతు లెన్నండుఁ బరపురు
        షార్థినుల్ గాఁ జన దన్యపురుష
సంగమంబునఁ జేసి సకలపాతకములు
        నగుఁ బరిగ్రహ భూత లయిన సతుల
కిట్టిద మర్యాద యి మ్మనుష్యుల కెల్లఁ
        జేసితి లోక ప్రసిద్ధి గాఁగ
నని ధర్మ్య మైన మర్యాద మానవులకుఁ
        దద్దయు హితముగా ధర్మమూర్తి

ఆటవెలది

యబ్జ భవ సమానుఁ డగు శ్వేతకేతుండు
నిలిపె నదియు ధారుణీ జనంబు
నందు లోకపూజ్య మై ప్రవర్తిల్లుచు
నుండె శిష్ట సంప్రయుక్తిఁ జేసి.

(స్త్రీలు పరపురుషులను కోరకూడదు - అని కట్టడి చేశాడు.)

-:శ్వేతకేతుఁడు స్త్రీపురుషుల విషయంబునఁ గావించిన కట్టడి:-

1_5_84 వచనము నచకి - వసంత

వచనము

ఋతుమతి వయిన యష్టమ దివసంబున నేనిం జతుర్దశ దివసంబున నేని శుచి వై శయనంబున నుండి నన్నుఁ దలంపు మనిన నదియుం దద్వచనానురూపంబు సేసి మువ్వురుసాల్వులును నల్వురుమద్రులునుంగా నేడ్వురు గొడుకులం బడసె నది గావున నీవు మాయందు దైవానుగ్రహంబున నపత్యంబువడయు మనినం గుంతిం జూచి పాండురాజు ధర్మ్యం బయిన యొక్క పురాణ కథఁ జెప్పెదఁ దొల్లి స్త్రీలు పురుషులచేత ననావృతలయి స్వతంత్రవృత్తి నఖిలప్రాణిసాధారణం బైన ధర్మంబునం దమతమవర్ణంబులయందు ఋతుకాలంబు దప్పక నియతానియతపురుష లయి ప్రవర్తిల్లుచున్న నుద్దాలకుం డను నొక్కమహాముని భార్య నతిసాధ్వి నధికతపోనిధి యైన శ్వేతకేతుతల్లి ఋతుమతి యైన దాని నొక్క వృద్ధవిప్రుం డతిథి యై వచ్చి పుత్త్రార్థంబు గామించిన శ్వేతకేతుం డలిగి యిది ధర్మవిరుద్ధం బని యాక్రోశించి దాని సహింపనోపక.

(అని ఆమెకు సంతానం అనుగ్రహించింది. కాబట్టి నువ్వు కూడా దైవానుగ్రహంతో మావల్ల సంతానం పొందు - అని కుంతి చెప్పగా, పాండురాజు ఆమెకు ఒక కథ చెప్పాడు - పూర్వం స్త్రీలు భర్తవల్ల కట్టడి లేకుండా ప్రవర్తిస్తూండగా శ్వేతకేతుడనే ముని.)

1_5_83 కందము వసంత - విజయ్

కందము

విదితముగ నీకు వర మి
చ్చెద నోడకు లెమ్ము గుణ వశీ కృత భువనుల్
సదమలచరిత్రు లాత్మజు
లుదయింతురు వగవకుండు ముదితేందుముఖీ.

(నీకు పుత్రులు జన్మిస్తారు. బాధపడకు.)

1_5_82 వచనము నచకి - వసంత

వచనము

కాదేని నాకు నీ పుణ్యమూర్తిప్రతిమూర్తులైన పుత్త్రులం బ్రసాదింపు మని దర్భాస్తరణశాయిని యై యాశవంబుఁ గౌఁగిలించుకొని విలాపించుచున్న దానికి వాని శరీరముననుండి యొక్క దివ్యవాణి యి ట్లనియె.

(అలా కాకపోతే నాకు పుత్రులను ప్రసాదించు - అని భర్తశవాన్ని కౌగిలించుకొని ఏడుస్తూ ఉండగా ఆమెతో ఒక దివ్యవాణి ఇలా అన్నది.)

1_5_81 తేటగీతి నచకి - వసంత

తేటగీతి

పతియులేక జీవించు నయ్యతివ కయిన
జీవనముకంటె దానికిఁ జావ లగ్గు
కాన నీతోన చనుదెంతుఁ గాని నిన్ను
బాసి యిం దుండఁగా నోప వాసవాభ.

(నేను కూడా నీతో వస్తాను.)