Wednesday, July 04, 2007

2_1_40 కందము వోలం - వసంత

కందము

అనఘా నీ ప్రస్తవమున
నని నీల్గిన వీరభటుల యనుపోష్యుల నె
ల్లను బ్రోతె భుజనాచ్ఛా
దనముల వారలకు నెమ్మి దఱుఁగక యుండన్.

(నీ ఉద్యోగుల కుటుంబాలకు లోటు లేకుండా చూసుకొంటున్నావు కదా!)

2_1_39 కందము వోలం - వసంత

కందము

కులపుత్త్రు లైన సద్భృ
త్యులకును సత్కార మర్థితోఁ జేయుదె వా
రలు నీ ప్రస్తవమున ని
మ్ములఁ గృతము దలంచి ప్రాణములు విడుతు రనిన్.

(భృత్యులను సత్కరిస్తే వారు నీకోసం ప్రాణమిస్తారు.)

2_1_38 కందము వోలం - వసంత

కందము

తమతమ కనియెడు తఱి జీ
తము గానక నవయు భటుల దౌర్గత్యవిషా
దము లేలిన వాని కవ
శ్యము నెగ్గొనరించు నతఁడు శక్రుం డైనన్.

(జీతాలు అందనివారి కష్టాలు ఎంతటివారికైనా కీడు చేస్తాయి.)

2_1_37 ఉత్పలమాల వోలం - వసంత

ఉత్పలమాల

ఉత్తమమధ్యమాధమ నియోగ్యత బుద్ధి నెఱింగి వారి న
య్యుత్తమమధ్యమాధమని యోగములన్ నియమించితే నరేం
ద్రోత్తమ భృత్యకోటికి ననూనముగాఁ దగు జీవితంబు లా
యత్తము సేసి యిత్తె దయ నయ్యయి కాలము దప్పకుండఁగన్.

(ఉద్యోగులకు సకాలంలో జీతాలు ఇస్తున్నావు కదా.)

2_1_36 కందము వోలం - వసంత

కందము

ఉపధాశుద్ధులఁ బాప
వ్యవగతబుద్ధుల వినీతివర్తుల సములన్
సుపరీక్ష నియోగించితె
నిపుణుల నర్థార్జనాది నృపకార్యములన్.

(పన్నులు వసూలు చేయటానికి సమర్థులనే నియమించావు కదా?)

Sunday, June 10, 2007

2_1_35 కందము వోలం - వసంత

కందము

సారమతిఁజేసి మానస
శారీర రుజావళులకు సతతంబుఁ బ్రతీ
కారములు సేయుచుండుదె
యారఁగ వృద్ధోపసేన నౌషధసేవన్.

(మనోవ్యాధులకు, శారీరకవ్యాధులకు చికిత్స చేసుకొంటున్నావు కదా?)

2_1_34 కందము వోలం - వసంత

కందము

అనిశము సేవింతురె ని
న్ననఘా యష్టాంగమైన యాయుర్వేదం
బున దక్షు లైన వైద్యులు
ఘనముగ ననురక్తులై జగద్ధితబుద్ధిన్.

(ఆయుర్వేదంలో సమర్థులైన వైద్యులు నీకు సేవలు చేస్తున్నారా?)

2_1_33 కందము వోలం - వసంత

కందము

క్షితినాథ శాస్త్రదృష్టి
ప్రతిభను దివ్యాంతరిక్ష భౌమోత్పాత
ప్రతికారులగుచు సన్మా
నితులయి వర్తింతురయ్య నీదైవజ్ఞుల్.

(నీ జ్యోతిషులు ఉత్పాతాలు కనిపెట్టి వాటికి విరుగుడుగా శాంతిక్రియలు జరుపుతున్నారు కదా!)

2_1_32 చంపకమాల వోలం - వసంత

చంపకమాల

కడుఁ జనువాఁడు నై పురుషకారియ దక్షుఁడు నైనమంత్రి పెం
పడరఁగ రాజపుత్త్రుల మహాధనవంతులఁ జేసి వారితో
నొడఁబడి పక్ష మేర్పడఁగ నుండఁడుగా , ధన మెట్టి వారికిం
గడుకొని చేయకుండునె జగన్నుత గర్వము దుర్విమోహమున్.

(నీ మంత్రి ఇతరులతో కలిసి నీకు వ్యతిరేకవర్గం ఏర్పడేలా చేయటం లేదు కదా? ధనం ఎటువంటివారికైనా దురాశనూ, గర్వాన్నీ కలిగిస్తుంది.)

2_1_31 కందము వోలం - వసంత

కందము

నానావిధ రణవిజయ మ
హా నిపుణు లవార్యవీర్యు లనఁ దగువారిన్
సేనాధ్యక్షులఁ జేసి తె
నీ నమ్మిన వారి మాననీయుల హితులన్.

(నీ సేనాధ్యక్షులు నువ్వు నమ్మినవారే కదా.)

Saturday, June 02, 2007

2_1_30 కందము కిరణ్ - వసంత

కందము

జనవర ! నీయజ్ఞములం
దనవరతనియుక్తుఁ డయినయాజ్ఞికుఁడు ప్రయో
గనిపుణుఁ డై యేమఱ కుం
డునె నిజకృత్యముల నెప్పును సమబుద్ధిన్.

(నీ యాజ్ఞికుడు సమర్థుడేనా?)

2_1_29 కందము కిరణ్ - వసంత

కందము

ధీరుఁడు ధర్మాధర్మవి
శారదుఁడు బహుశ్రుతుండు సమచిత్తుఁడు వా
ణీరమణీశ్రితవదనస
రోరుహుఁ డనఁ జనునె నీ పురోహితుఁ డధిపా.

(నీ పురోహితుడు ధర్మం తెలిసినవాడేనా?)

2_1_28 కందము కిరణ్ - వసంత

కందము

రాజునకు విజయమూలము
రాజితమంత్రంబు సుస్థిరంబుగ దానిన్
రాజాన్వయ! రక్షింతె ధ
రాజనులకుఁ గర్ణగోచరము గాకుండన్.

(రాజుకు రహస్యమే విజయమూలం. రహస్యాలను జాగ్రత్తగా కాపాడుతున్నావా?)

2_1_27 కందము కిరణ్ - వసంత

కందము

అనఘుల శాస్త్రవిధిజ్ఞుల
ననురక్తులఁ బితృపితామహక్రమమున వ
చ్చినవిప్రుల మంత్రులఁ గా
నొనరించితె కార్యసంప్రయోగము పొంటెన్.

(శాస్త్రం తెలిసిన విప్రులను మంత్రులుగా నియమించావా?)

2_1_26 సీసము + ఆటవెలది కిరణ్ - వసంత

సీసము

మీవంశమున నరదేవోత్తముల దైన
సద్ధర్మమార్గంబు సలుపు దయ్య
ధర్మవిదుండవై ధర్మార్థకామంబు
లొండొంటి బాధింపకుండ నుచిత
కాలవిభక్తముల్ గా లీల సేవింతె
ధర్మువునంద చిత్తంబు నిలిపి
యిమ్ముల నపరరాత్రమ్ములం దెప్పుడుఁ
జింతింతె నిజబుద్ధిఁ జేయఁ దగిన

ఆటవెలది

రాజకృత్యములఁ దిరంబుగా నిఖిలని
యోగవృత్తులందు యోగ్యులయిన
వారిఁ గరము గారవమ్మునఁ బంచితె
నీవు వారి దయిన నేర్పెఱింగి.

(ధర్మార్థకామాల మధ్య కాలాన్ని సరిగా విభజిస్తున్నావా? రాజకార్యాలకు యోగ్యులైన వారిని నియమిస్తున్నావా?)

-:నారదుఁడు ధర్మరాజును రాజనీతి విషయములం గొన్నిటి నడుగుట:-

2_1_25 వచనము కిరణ్ - వసంత

వచనము

పర్వత పారిజాత రైవత సుముఖు లనుమహామునులతో నిట్లు వచ్చిన నారదమహామునికిం బ్రత్యుద్గతుం డయి ధర్మరాజు దమ్ములుం దానును నమస్కరించి తోడ్కొని తెచ్చి యున్నతాసనంబున నునిచి యడుగులు గడిగి యర్ఘ్య పాద్యాదివిధులం బూజించిన వారలకుశలం బడిగి నారదుండు రాజనీతివిషయంబుల నయ్యుధిష్ఠిరు నిట్లని యడిగె.

(నారదుడిని ధర్మరాజు పూజించాడు. అప్పుడు నారదుడు రాజనీతివిషయంలో ధర్మరాజును ఇలా అడిగాడు.)

2_1_24 కందము కిరణ్ - వసంత

కందము

తన పిఱుఁద ధర్మసంబో
ధనవాంఛను వచ్చు దేవతాఖచరమహా
మునివరులఁదపమార్గం
బునఁ గ్రమ్మఱఁ బంచె బ్రహ్మపుత్త్రుఁడు నెమ్మిన్.

(నారదుడు తన వెంట వచ్చే భక్తులను తపస్సు చేయమని పంపాడు.)

2_1_23 ఉత్పలమాల కిరణ్ - వసంత

ఉత్పలమాల

నీరజమిత్రుఁ డేల ధరణీగతుఁ డయ్యెడు నొక్కొ యంచు వి
స్మేరమనస్కులై జనులు మెచ్చి నిజద్యుతి చూచుచుండఁగా
నారదుఁ డేఁగుదెంచె గగనంబున నుండి సురేంద్రమందిర
స్ఫారవిలాసహాసి యగుపార్థుగృహంబునకుం బ్రియంబునన్.

(నారదుడు అర్జునుడి ఇంటికి వచ్చాడు.)

-:నారదుఁడు పాండవుల యొద్దకు వచ్చుట:-

2_1_22 వచనము కిరణ్ - వసంత

వచనము

అమ్మహామునులనెల్ల నతిభక్తిం బూజించి లబ్ధాశీర్వచనుం డై ధర్మతనయుండు వారలవలన ధర్మకథలు వినుచుఁ దమ్ములుం దానును సుఖంబుండునంత నొక్కనాఁడు.

(ధర్మరాజు వారిని పూజించి, వారు చెప్పే ధర్మకథలు వింటూ తమ్ములతో సుఖంగా ఉండగా ఒకరోజు.)

2_1_21 సీసము + ఆటవెలది కిరణ్ - వసంత

సీసము

సుబల మార్కండేయ శునక మౌంజా
యన మాండవ్య శాండిల్య మందపాల
బక దాల్భ్యరైభ్యక భాలుకి జతు
కర్ణ గౌతమ కౌశిక కణ్వ కుత్స
సావర్ణి పర్ణాద సత్య గోపతి
గోపవేష మైత్రేయ పవిత్రపాణి
ఘటజాను కాత్రేయ కఠ కలాప
సుమిత్ర హారీత తిత్తిరి యాజ్ఞవల్క్య

ఆటవెలది

వాయుభక్ష భార్గవ వ్యాస జైమిని
శుక సుమంతు పైల సువ్రతాదు
లయినమునులు నేము నరిగితి మెంతయు
రమ్యమయిన ధర్మరాజుసభకు.

(మునులందరూ ధర్మరాజు సభకు వచ్చారు.)

2_1_20 వచనము కిరణ్ - వసంత

వచనము

మఱియును.

(ఇంకా.)

2_1_19 మత్తేభవిక్రీడితము కిరణ్ - వసంత

మత్తేభవిక్రీడితము

మదమాతంగ తురంగ కాంచన లసన్మాణిక్య గాణిక్య సం
పద లోలిం గొని వచ్చి యిచ్చి ముద మొప్పం గాంచి సేవించి ర
య్యుదయాస్తాచలాసేతుశీతనగమధ్యోర్వీపతుల్ సంతతా
భ్యుదయున్ ధర్మజుఁ దత్సభాస్థితు జగత్పూర్ణప్రతాపోదయున్.

(సేతువు నుండి హిమాలయాల వరకూ ఉన్న రాజులందరూ వచ్చి ధర్మరాజుకు కానుకలు ఇచ్చారు.)

2_1_18 వచనము కిరణ్ - వసంత

వచనము

తదవసరంబున.

(అప్పుడు)

2_1_17 ఉత్పలమాల కిరణ్ - వసంత

ఉత్పలమాల

మంచిగ భూరిభూసురసమాజము నెల్లను భక్తితోడఁ బూ
జించి, యభీష్టదానములు సేసి ధనార్థులఁ దన్పి, దిక్కులన్
నించె యశంబు, బంధులకు నెయ్యురకున్ హృదయప్రియంబు గా
వించె, విభూతి యేర్పడఁ బవిత్రుఁడు ధర్మసుతుండు నెమ్మితోన్.

(ధర్మరాజు ఎన్నో దానాలు చేశాడు.)

2_1_16 వచనము కిరణ్ - వసంత

వచనము

అనుజసహితుం డయి దైవజ్ఞదత్తశుభముహూర్తంబున ధౌమ్యాదిభూసురాశీర్వాదపుణ్యాహనాదంబు లెసంగ సభాప్రవేశంబు నేసి యంత.

(ధర్మరాజు విప్రులు నిర్ణయించిన ముహూర్తాన తన తమ్ములతో సభాప్రవేశం చేశాడు.)

2_1_15 ఉత్పలమాల కిరణ్ - వసంత

ఉత్పలమాల

వీరుఁడు ధర్మజుండు పదివేవురు విప్రుల కొప్పఁ బాయసా
హారము భక్తిఁ బెట్టి మఱి యందఱకుం జెఱు వేయునేసి వి
స్తారయశుండు ధేనువుల ధర్మవిధిన్ మణిముద్రికాద్యలం
కారదుకూలపుష్పఫలగంధయుతంబుగ నిచ్చి లీలతోన్.

(ధర్మరాజు విప్రులకు భోజనం పెట్టి గోదానం చేశాడు.)

Thursday, May 31, 2007

2_1_14 వచనము కిరణ్ - వసంత

వచనము

మఱియు సకలజన మనోహరంబు లైన నానావిధ యంత్రంబులును ననవరత కుసుమఫలభరితంబు లైన తరువనంబులును వికచకమల కుముదాభిరామంబు లైన జలాశయంబులును వివిధ విచిత్రపతాకావలంబిత తోరణ విటంక ప్రదేశంబులునుం గలిగి దశ కిష్కు సహస్ర ప్రమాణవృత్తాయతంబును సహస్రకర ప్రభా ప్రసర విస్తార విభూతియును వివిధరత్న విభవాభిశోభితంబునుంగా నపూర్వ సభా భవనంబు నందుఁ బదునాలుగు నెలలు నిర్మించి దాని నెనిమిది వేల రాక్షస కింకరుల మహాకాయుల మహాజవసత్త్వ సంపన్నుల నంతరిక్షచరులం బనిచి మోపించికొని వచ్చి ధర్మరాజున కిచ్చి గదయును శంఖంబును భీమార్జునుల కిచ్చి ధర్మరాజు చేత సత్కృతుండయి మయుం డరిగిన.

(ఎన్నో యంత్రాలు, తోటలు, కొలనులు అమర్చి ఆ సభను నిర్మించి, బలవంతులైన రాక్షసులచేత ఆ భవనాన్ని మోయించి ధర్మరాజుకు ఇచ్చాడు. భీముడికి గదను, అర్జునుడికి శంఖాన్ని అందించి, ధర్మరాజు వద్ద సన్మానం పొంది వెళ్లాడు.)

2_1_14 వచనము కిరణ్ - వసంత

వచనము

మఱియు సకలజన మనోహరంబు లైన నానావిధ యంత్రంబులును ననవరత కుసుమఫలభరితంబు లైన తరువనంబులును వికచకమల కుముదాభిరామంబు లైన జలాశయంబులును వివిధ విచిత్రపతాకావలంబిత తోరణ విటంక ప్రదేశంబులునుం గలిగి దశ కిష్కు సహస్ర ప్రమాణవృత్తాయతంబును సహస్రకర ప్రభా ప్రసర విస్తార విభూతియును వివిధరత్న విభవాభిశోభితంబునుంగా నపూర్వ సభా భవనంబు నందుఁ బదునాలుగు నెలలు నిర్మించి దాని నెనిమిది వేల రాక్షస కింకరుల మహాకాయుల మహాజవసత్త్వ సంపన్నుల నంతరిక్షచరులం బనిచి మోపించికొని వచ్చి ధర్మరాజున కిచ్చి గదయును శంఖంబును భీమార్జునుల కిచ్చి ధర్మరాజు చేత సత్కృతుండయి మయుం డరిగిన.

(ఎన్నో యంత్రాలు, తోటలు, కొలనులు అమర్చి ఆ సభను నిర్మించి, బలవంతులైన రాక్షసులచేత ఆ భవనాన్ని మోయించి ధర్మరాజుకు ఇచ్చాడు. భీముడికి గదను, అర్జునుడికి శంఖాన్ని అందించి, ధర్మరాజు వద్ద సన్మానం పొంది వెళ్లాడు.)

2_1_13 సీసము + ఆటవెలది కిరణ్ - వసంత

సీసము

సురుచిరహరినీల కిరణ జలంబులఁ
బద్మరాగారుణపద్మములను
రాజిత రాజీవరాజ హంసావళి
నిర్మల సౌవర్ణ కూర్మములను
గమనీయవైదూర్య కుముదంబులను వజ్ర
మీన మౌక్తిక నవ ఫేనములను
మరకతశైవలోత్కరముల విలసిల్లఁ
గొల నని సన్మణిస్థలము చూచి

ఆటవెలది

పలుఁగురాలకుడ్యముల రుచుల్ గప్పిన
జలము లున్నయెడలు వెలయఁ జూచి
యననుపస్థలంబు లని జను లెఱుఁగక
యుండునట్లుగా మయుండు సేసె

(ఇంద్రనీలమణుల కిరణాలనే నీళ్లతో,
పద్మరాగమణులతో చెక్కిన ఎర్రని పద్మాలతో,
వెండితో చేసిన తెల్లని తామరలతో,
బంగారుపోతపోసిన తాబేళ్లతో,
వైదూర్యాలతో మలిచిన కలువలతో,
ముత్యాలతో కల్పించిన నురుగులతో,
మరకతాలతో చేసిన నాచులతో ప్రకాశించే మణిమయప్రదేశాలు చూసి అవి నీటిమడుగులని,
స్ఫటికపురాళ్లగోడల కాంతులు కప్పటం చేత నీళ్లుండే చోట నీళ్లు లేవనీ - జనులు భ్రమపడేలా మయుడు సభను నిర్మించాడు.)

2_1_12 వచనము కిరణ్ - వసంత

వచనము

మఱియును.

(అంతే కాక.)

2_1_11 కందము కిరణ్ - వసంత

కందము

విమలమణిమయము లగుదూ
లములం గంబముల గోడలను వేదులఁ గు
ట్టిమములఁ జుట్టినప్రాకా
రములను గరమొప్పుచుండ రచియించెసభన్

(మణిమయాలైన వస్తువులతో మయుడు అందమైన సభను నిర్మించాడు.)

Wednesday, May 30, 2007

2_1_10 కందము కిరణ్ - వసంత

కందము

దేవబ్రాహ్మణులకు నా
నావిధపూజనలఁ దర్పణము సేసి ధరి
త్రీవనితకపూర్వశ్రీఁ
గావింపఁ దొడంగె మయుఁడు గడు రమ్యముగాన్

(మయుడు సభను నిర్మించటం ప్రారంభించాడు.)

2_1_9 సీసము + ఆటవెలది కిరణ్ - వసంత

సీసము

ఎందేని సర్వభూతేశుండు సృజియించె
సచరాచరములైన జగము లెల్ల
గంగఁ బ్రత్యక్షంబు గావింప నెందేనిఁ
గృతవాసుఁ డయ్యె భగీరథుండు
నలినసంభవ నరనారాయణస్థాణు
వాసవప్రభృతి గీర్వాణముఖ్యు
లెందేనిఁ గ్రతువు లనేక యుగంబులఁ
జేసిరి రత్నవిచిత్ర వితత

ఆటవెలది

చైత్యములు మహా విశాల హిరణ్మయ
యూపతతులు నోలి నొప్పు చుండ
నట్టి బిందుసరమునం దున్న వివిధర
త్నోపకరణచయము లొనరఁ గొనియె

(బిందుసరంలో ఉన్న రత్నోపకరణాలన్నీ మయుడు గ్రహించాడు.)

2_1_8 వచనము కిరణ్ - వసంత

వచనము

తొల్లి వృషపర్వుండను దానవేంద్రున కొక్కసభ నిర్మింప సమకట్టి వివిధ రత్నమయంబులయిన యుపకరణంబు లొడఁగూర్చి బిందుసరంబను కొలన సంగ్రహించినవాఁడ నయ్యుపకరణంబుల దాని విచిత్రంబుగా రచియించి తెచ్చి ధర్మరాజున కిచ్చెద మఱియును భౌమాదిత్యుండను రాజర్షిచేత నిహితంబయి సకలశత్రుఘాతినియైనదాని భీమసేనున కొక్కగదను దారుణం బయిన దివ్యఘోషంబు గలుగు దేవదత్తంబను శంఖం బర్జునునకు నిచ్చెదనని చెప్పి ధర్మరాజుచేత సత్కృతుండై మయుం డరిగె నంత నిట నారాయణుండును బాండవుల వీడ్కొని పితృదర్శనలాలసుండై ద్వారవతీపురంబున కరిగె నట మయుండును బూర్వోత్తరదిశాభిముఖుండై పోయి కైలాసంబునుత్తరంబున మైనాకశైలంబునందు హిరణ్యశృంగంబున.

(బిందుసరం అనే కొలనులో ఉంచిన సామగ్రితో ధర్మరాజుకు సభ నిర్మిస్తాను. శత్రువులను హతమార్చే గదను భీముడికి, దేవదత్తం అనే శంఖాన్ని అర్జునుడికి ఇస్తాను - అని చెప్పి మయుడు బయలుదేరాడు. కృష్ణుడు కూడా తన తండ్రిని చూడటానికి ద్వారవతికి వెళ్లాడు. మయుడు ఈశాన్యదిశలో వెళ్లి కైలాసపర్వతానికి ఉత్తరాన మైనాకపర్వతం మీది హిరణ్యశిఖరాన్ని చేరుకున్నాడు.)

2_1_7 వచనము కిరణ్ - వసంత

వచనము

ఇమ్మనుజేంద్రుఁ డింద్ర దనుజేంద్రులకంటె మహావిలాస సౌ
ఖ్యమ్ములఁ బెద్ద యిద్ధరణిఁ గావున నీతని పేర్మికిం దగన్
నెమ్మి నొనర్చెదన్ సభ మణిప్రభ నొప్పఁగ దేవతా విమా
నమ్ములు నిట్టివే యని జనమ్ములు దానిన మెచ్చి చూడఁగన్.

(ఈ ధర్మరాజు వైభవంలో ఇంద్రుడి కంటే, రాక్షసుల రాజు కంటే గొప్పవాడు. ఆయనకు తగిన సభను నిర్మిస్తాను.)

2_1_6 వచనము కిరణ్ - వసంత

వచనము

అనిన వాసుదేవునకు మయుం డిట్లనియె.

(అన్న కృష్ణుడితో మయుడు ఇలా అన్నాడు.)

2_1_5 చంపకమాల కిరణ్ - వసంత

చంపకమాల

కురుపతికిన్ యుధిష్ఠిరునకున్ సకలక్షితిపాలసేవ్య సు
స్థిర విభవాభిరామున కతి ప్రమదంబుగ రత్నరాజి సుం
దర మగు దాని నొక్క సభ ధాత్రి కపూర్వముగా నొనర్చి చె
చ్చెరఁ గొనిరమ్ము నీదయిన శిల్పకలాకుశలత్వ మేర్పడన్.

(కురుపతి అయిన ధర్మరాజు ఆనందించేలా, అపూర్వమైన ఒక సభను నీ శిల్పకళానైపుణ్యానికి నిదర్శనంగా నిర్మించి తీసుకురా.)

2_1_4 వచనము కిరణ్ - వసంత

వచనము

ఏను దానవ విశ్వకర్మ ననేకవిధ శిల్ప కలా కుశలుండ మీ కిష్టంబయిన దాని నిర్మించెదం బనుపుం డనిన నర్జునుం డచ్యుతుమొగంబు చూచి యతని నెద్దియేనియు నొక్క యపూర్వం బయినదాని నిర్మింప నియోగింపు మనినఁ గృష్ణుండు పెద్దయుంబ్రొద్దు విచారించి మయున కిట్లనియె.

(నేను దానవశిల్పిని. వివిధశిల్పకళలు తెలిసినవాడిని. మీకిష్టమైనది నిర్మిస్తాను. ఆజ్ఞాపించండి - అని మయుడు అడిగాడు. అర్జునుడు కృష్ణుడితో - అపూర్వమైనది ఏదన్నా నిర్మించమని ఆజ్ఞాపించండి - అన్నాడు. కృష్ణుడు ఆలోచించి మయుడితో.)

2_1_3 కందము కిరణ్ - వసంత

కందము

ఘనముగఁ బ్రాణము రక్షిం
చిన యుపకారికిఁ బ్రియంబు సేయుదు నన నే
ర్తునె యైనను నీకుఁ బ్రియం
బనఘా చేయంగ నిష్టమైనది నాకున్.

(నా ప్రాణాలు కాపాడిన నీకే మేలు చేయగలనని చెప్పలేను. అయినా నీకు ఇష్టమైనది చేయాలన్నది నా కోరిక.)

2_1_2 వచనము కిరణ్ - వసంత

వచనము

అక్కథకుండు శౌనకాది మహామునులకుం జెప్పె నట్లు ధర్మతనయునొద్ద వాసుదేవ సహితుం డయి యున్న యర్జునున కతిప్రీతిం గృతాంజలి యయి మయుండి ట్లనియె.

(కథకుడైన ఉగ్రశ్రవసుడు శౌనకాది మునులతో ఖాండవదహనం వరకూ జరిగిన కథను చెప్పాడు. ఖాండవదహనం తరువాత కృష్ణుడితో కలిసి ధర్మరాజు దగ్గర ఉన్న అర్జునుడితో మయుడు ఇలా అన్నాడు - అని ఉగ్రశ్రవసుడు మళ్లీ కథను ప్రారంభించాడు.)

Tuesday, May 29, 2007

మయుండొక్కసభను నిర్మించి ధర్మజున కిచ్చుట

2_1_1 కందము కిరణ్ - వసంత

కందము

శ్రీదయితోరస్థ్సల విమ
లాదిత్యాత్మజ నిరంతరానందమతీ ,
కోదండపార్థ నిఖిల ధ
రాదేవ స్తుత్య రాజరాజనరేంద్రా!

(రాజరాజనరేంద్రా!)

సభాపర్వము - ప్రథమాశ్వాసము