Thursday, May 31, 2007

2_1_13 సీసము + ఆటవెలది కిరణ్ - వసంత

సీసము

సురుచిరహరినీల కిరణ జలంబులఁ
బద్మరాగారుణపద్మములను
రాజిత రాజీవరాజ హంసావళి
నిర్మల సౌవర్ణ కూర్మములను
గమనీయవైదూర్య కుముదంబులను వజ్ర
మీన మౌక్తిక నవ ఫేనములను
మరకతశైవలోత్కరముల విలసిల్లఁ
గొల నని సన్మణిస్థలము చూచి

ఆటవెలది

పలుఁగురాలకుడ్యముల రుచుల్ గప్పిన
జలము లున్నయెడలు వెలయఁ జూచి
యననుపస్థలంబు లని జను లెఱుఁగక
యుండునట్లుగా మయుండు సేసె

(ఇంద్రనీలమణుల కిరణాలనే నీళ్లతో,
పద్మరాగమణులతో చెక్కిన ఎర్రని పద్మాలతో,
వెండితో చేసిన తెల్లని తామరలతో,
బంగారుపోతపోసిన తాబేళ్లతో,
వైదూర్యాలతో మలిచిన కలువలతో,
ముత్యాలతో కల్పించిన నురుగులతో,
మరకతాలతో చేసిన నాచులతో ప్రకాశించే మణిమయప్రదేశాలు చూసి అవి నీటిమడుగులని,
స్ఫటికపురాళ్లగోడల కాంతులు కప్పటం చేత నీళ్లుండే చోట నీళ్లు లేవనీ - జనులు భ్రమపడేలా మయుడు సభను నిర్మించాడు.)

No comments: