Wednesday, May 31, 2006

1_6_65 కందము పవన్ - వసంత

కందము

వల్లె యని రాజ నందను
లెల్లను సమకట్టి రథము లెక్కి దిశల్ భే
దిల్లఁగ గర్జిల్లి నిశా
తోల్లసిత కృపాణ కార్ము కోద్యత కరులై.

(రాజకుమారులు అందుకు అంగీకరించి రథాలెక్కి, ఆయుధాలు ధరించి.)

1_6_64 వచనము పవన్ - వసంత

వచనము

అంతఁ బ్రభాతం బగుటయు సమయ నియమంబులు దీర్చి యాచార్యుండు శిష్యులనెల్ల రావించి మీరు నాకు గురుదక్షిణ యిం డనిన నందఱు మ్రొక్కి యెదుర నిలిచి మీకెద్ది యిష్టంబు సెప్పుం డనిన విని యవివేకకారణదారుణైశ్వర్యావలిప్తుం డైన ద్రుపదు నొడిచిపట్టి తెండిదియ నాకిష్టం బైన గురుదక్షిణ యని పంచిన.

(తెల్లవారగానే ద్రోణుడు శిష్యులను పిలిచి – మీరు నాకు గురుదక్షిణ ఇవ్వండి – అని అడిగాడు. మీకేది ఇష్టమో చెప్పండి – అని వాళ్లు అడిగారు. ద్రుపదుడిని ఓడించి తీసుకొని రండి. ఇదే నాకు ఇష్టమైన గురుదక్షిణ – అని ద్రోణుడు ఆజ్ఞాపించాడు.)

-:కౌరవపాండవులు గురుదక్షిణార్థంబు ద్రుపదుం బట్టఁజనుట:-

1_6_63 కందము పవన్ - వసంత

కందము

వినుత ధనుర్విద్యావిదు
ఘనుఁ గర్ణు సహాయుఁ బడసి కౌరవవిభుఁ డ
ర్జునువలని భయము సెడి ఱొ
మ్మునఁ జేయిడి నిద్రవోయె ముదితాత్ముం డై.

(కర్ణుడిని మిత్రుడిగా పొందిన దుర్యోధనుడు సంతోషించి అర్జునుడి వల్ల భయంలేక గుండెమీద చెయ్యి వేసుకొని నిద్రపోయాడు.)

1_6_62 ఆటవెలది పవన్ - వసంత

ఆటవెలది

కుంతి యంత సహజ కుండల కవచాభి
రాముఁ గర్ణుఁ జూచి రవి సమానుఁ
బ్రత్యభిజ్ఞ నెఱిఁగి ప్రథమ పుత్త్ర స్నేహ
మెఱుక పడక యుండ నింతి యుండె.

(కుంతి కర్ణుడిని గుర్తుపట్టినా బయటపడకుండా ఉండింది.)

1_6_61 వచనము పవన్ - వసంత

వచనము

వానితోడి దేమి దివ్య లక్షణ లక్షితుండును సహజ కవచ కుండల మండితుండును గాని ప్రకృతిపురుషుండు గాఁడు తన బాహుబలంబున నీ యంగరాజ్యంబునక కాదు సకల మహీరాజ్యంబునకు నర్హుం డగు ననుచున్నయంత నాదిత్యుం డస్తగతుం డైన నస్త్రసందర్శనరంగంబు వెలువడి దుర్యోధనుండు గర్ణుం దోడ్కొని కరదీపికాసహస్రంబుతో నిజమందిరంబున కరిగెఁ బాండవులును భీష్మద్రోణవిదురకృపాచార్యులతో నిజనివాసంబుల కరిగిరి.

(పుట్టుకలతో ఏమి పని? కర్ణుడు సామాన్యుడు కాదు. అంగరాజ్యాన్నే కాక భూమండలాన్నంతా పరిపాలించగల సమర్థుడు – అని కర్ణుడిని వెంటబెట్టుకొని తన ఇంటికి వెళ్లాడు.)

Tuesday, May 30, 2006

1_6_60 సీసము + తేటగీతి పవన్ - వసంత

సీసము

శూరులజన్మంబు సురలజన్మంబును
        నేఱులజన్మంబు నెఱుఁగ నగునె
మొగిని దధీచియెమ్మునఁ బుట్టదయ్యెనే
        వాసవాయుధ మైన వజ్ర మదియు
గాంగేయుఁ డన మఱి కార్తికేయుం డన
        నాగ్నేయుఁ డన రౌద్రుఁ డనగ శరవ
ణోద్భవుం డన గుహుం డుద్భవిల్లఁడె శర
        స్తంబజన్ముఁడు గాఁడె ధర్మవిదుఁడు

తేటగీతి

గృపుఁడు ఘటసంభవుఁడు గాఁడె కీర్తిపరుఁడు
వరుఁడు ద్రోణుండు విప్రులవలనఁ బుట్ట
రైరె సత్క్షత్రియుల్ ఘను లవనిఁ గావఁ
గడఁగి మీ జన్మములు నిట్ల కావె వినఁగ.

(శూరుల పుట్టుక, దేవతల పుట్టుక, నదుల పుట్టుక తెలుసుకోవటం సాధ్యమేనా? వజ్రాయుధం పుట్టుక, కుమారస్వామి పుట్టుక, కృపద్రోణుల పుట్టుకలు, ఆఖరికి మీ పుట్టుకలు ఎలాంటివి?)

1_6_59 కందము పవన్ - వసంత

కందము

అనిలజ నీ కి ట్లని ప
ల్కను దలపను నగునె లేడి కడుపునఁ బులి పు
ట్టునె యిట్టి దివ్యతేజం
బున వాఁ డధమాన్వయమునఁ బుట్టునె చెపుమా.

(ఇలా మాట్లాడటం, ఆలోచించటం నీకు తగిన పనేనా?)

1_6_58 వచనము పవన్ - వసంత

వచనము

అనినం గర్ణుండు వెల్లనయి యెద్దియుం జేయునది నేరక దీర్ఘోష్ణనిశ్వాసవ్యాకులిత వదనుం డయి యాకాశంబువలన నున్న యాదిత్యుం జూచుచు మిన్నకుండె నంత నంతర్విలులితుం డయిన యక్కర్ణుం జూచి భాతృపద్మవనమధ్యంబున నుండి దుర్యోధనమదాంధగంధసింధురంబు వెలువడి వచ్చి కడు నలిగి భీమున కి ట్లనియె.

(ఇది విని కర్ణుడు ఏమీ తోచక బాధతో సూర్యుడివైపు చూస్తూ ఉండగా దుర్యోధనుడు వచ్చి భీముడితో కోపంగా ఇలా అన్నాడు.)

1_6_57 తేటగీతి పవన్ - వసంత

తేటగీతి

ఉత్తమ క్షత్త్రియ ప్రవరోపయోగ్య
మైన యంగరాజ్యంబు నీ కర్హమగునె
మంత్రపూత మై గురుయజమానభక్ష్య
మగు పురోడాశ మది గుక్క కర్హ మగునె.

(ఉత్తమక్షత్రియులు అనుభవించదగిన అంగరాజ్యం నీకు తగినదేనా? యజ్ఞం కోసం చేసిన వంటను కుక్కలు తినవచ్చా?)

1_6_56 వచనము పవన్ - వసంత

వచనము

మఱి యదియునుం గాక.

(అంతేకాక.)

Monday, May 29, 2006

1_6_55 కందము పవన్ - వసంత

కందము

నీదు కులమునకుఁ దగఁగఁ బ్ర
తోదము గొని రథము గడపఁ దొరఁగుము నృపధ
ర్మోదయుఁ డగు నర్జునుతోఁ
గాదనక రణంబు సేయఁగా నీ కగునే.

(నీ కులానికి తగ్గట్లు రథం నడపాలి గానీ అర్జునుడితో యుద్ధం చేయటం నీకు తగిన పనేనా?)

1_6_54 వచనము పవన్ - వసంత

వచనము

దానిం జూచి భీముండు గర్ణుని సూతకుల సంభవుంగా నెఱింగి నగుచు ని ట్లనియె.

(ఇది చూసి కర్ణుడు సూతకులంలో పుట్టినవాడని భీముడు తెలుసుకొని అవహేళనగా నవ్వుతూ ఇలా అన్నాడు.)

1_6_53 తేటగీతి పవన్ - వసంత

తేటగీతి

కడఁగి సూతుండు పుత్త్రకుఁ గౌఁగిలించి
కొని తదీయమూర్ధాఘ్రాణ మొనరఁ జేసి
యంగరాజ్యాభిషేకార్ద్రమైన శిరముఁ
దడిపె వెండియు హర్షాశ్రుతతుల నొప్ప.

(అధిరథుడు కర్ణుడిని కౌగిలించుకున్నాడు.)

1_6_52 వచనము పవన్ - వసంత

వచనము

అనిన విని దుర్యోధనున కెంతయు సంతోషంబుగాఁ గర్ణుం డతనితోడి యిష్ట సఖిత్వంబున కొడంబడియె నంతఁ గొడుకు రాజ్యాభిషేకోత్సవంబు సూచి హర్షపరవశుం డయి సూతుండు రథంబు డిగ్గి కర్ణునొద్దకుం బఱతెంచినఁ గర్ణుండును బితృగౌరవంబున సంభ్రమించి వానికి వినయవినమితోత్తమాంగుం డయిన.

(కుమారుడి అంగరాజ్యాభిషేకం చూసి అధిరథుడు రథం దిగి కర్ణుడి దగ్గరకు వచ్చాడు. కర్ణుడు తండ్రికి నమస్కరించాడు.)

1_6_51 కందము పవన్ - వసంత

కందము

దీనికి సదృశముగా మఱి
యే నేమి యొనర్తు నీకు నిష్టం బనినన్
మానుగ నాతోఁ జెలిమి మ
హీనుతముగఁ జేయు మిదియ యిష్టము నాకున్.

(ఈ మహోపకారానికి సమానంగా నీకు ఇష్టమైనది నేను ఏమి చేయగలను? – అని కర్ణుడు అడిగాడు. నాతో స్నేహం చెయ్యి, అదే నాకు ఇష్టం – అని దుర్యోధనుడు అన్నాడు.)

Sunday, May 28, 2006

1_6_50 కందము పవన్ - వసంత

కందము

బృహదబ్ధిమేఖలాఖిల
మహీతలక్షత్త్రవరసమక్షమున మహా
మహిమాన్వితుఁగా నన్నును
మహీశుఁగా జేసి తతిసమర్థత వెలయన్.

(ఈ రాజుల సమక్షంలో నన్ను గౌరవించి రాజుగా చేశావు.)

1_6_49 వచనము పవన్ - వసంత

వచనము

అని యప్పుడ భీష్మధృతరాష్ట్రులకుం జెప్పి వారి యనుమతంబున మహా మహీసుర సహస్రంబునకు గోసహస్రాయుతంబు దానంబు సేసి యంగరాజ్యంబునకు వీఁ డర్హుం డయ్యెడమను బ్రాహ్మణవచనంబు వడసి కర్ణుం గాంచనపీఠంబున నునిచి యంగరాజ్యమున కభిషిక్తుం జేసినఁ గర్ణుండును మణిమకుట కేయూర హారాది భూషణ భూషితుం డై సకల రాజ చిహ్నంబుల నొప్పి పరమ హర్షంబుతోడం గురుపతి కి ట్లనియె.

(అలా దుర్యోధనుడు కర్ణుడికి రాజ్యాభిషేకం చేశాడు. కర్ణుడు దుర్యోధనుడితో ఇలా అన్నాడు.)

-:దుర్యోధనుఁడు కర్ణుని నంగరాజ్యమున కభిషిక్తుం జేయుట:-

1_6_48 తేటగీతి పవన్ - వసంత

తేటగీతి

రాజవరుఁ డైన పార్థుతో రాజు గాని
యీతఁ డని సేయఁగా దగఁడేని వీని
నెల్లవారును జూడంగ నీక్షణంబ
రాజుఁ జేసెద నే నంగరాజ్య మిచ్చి.

(రాజు కాని కర్ణుడు యుద్ధానికి తగనివాడైతే ఇతడికి అంగరాజ్యం ఇచ్చి రాజుగా చేస్తాను.)

1_6_47 కందము పవన్ - వసంత

కందము

కులముగలవాఁడు శౌర్యము
గలవాఁడును నధిక సేన గలవాడును భూ
తలమున రాజనునామము
విలసిల్లఁగఁ దాల్చు మూఁడువిధముల పేర్మిన్.

(కులమున్నవాడు, శౌర్యమున్నవాడు, సేన కలవాడు భూమిమీద రాజు అనే పేరు పెట్టుకుంటున్నాడు.)

1_6_46 వచనము పవన్ - వసంత

వచనము

అనిన విని కర్ణుండు దనకులంబును దల్లిదండ్రులను జెప్ప సిగ్గువడి తలవాంచి యున్నం జూచి దుర్యోధనుండు గృపున కి ట్లనియె.

(ఇది విని కర్ణుడు సిగ్గుపడటం చూసి దుర్యోధనుడు కృపాచార్యుడితో ఇలా అన్నాడు.)

Wednesday, May 10, 2006

1_6_45 చంపకమాల పవన్ - వసంత

చంపకమాల

కురుకులజుండు పాండునకుఁ గుంతికిఁ బుత్త్రుఁడు రాజధర్మబం
ధరచరితుండు నీవితనితోడ రణం బొననరించెదేని వి
స్తరముగ నీదువంశమును దల్లిని దండ్రిని జెప్పు చెప్పినన్
దొరయగుదేని నీ కెదిరి దోర్బలశక్తి నితండు సూపెడిన్.

(అర్జునుడు కురువంశంలో పాండురాజుకు, కుంతీదేవికి పుత్రుడు. ఇతనితో యుద్ధం చేయదలిస్తే నీ వంశం గురించి, తల్లిదండ్రుల గురించి చెప్పు. సమానుడివైతే నిన్ను అర్జునుడు ఎదుర్కొంటాడు.)

1_6_44 వచనము పవన్ - వసంత

వచనము

అంత నర్జునుం డనిలబాణంబున నమ్మేఘపటలంబు పఱవనేసి యాదిత్యసమతేజుం డయి యుండె నంత విదురదర్శితు లైన యక్కర్ణార్జునులం జూచి కుంతి సంతసిల్లె నపుడు ధర్మవిదుం డఖిలద్వంద్వయుద్ధసమాచారనిపుణుండు కృపాచార్యుం డయ్యిద్దఱ నడుమ నిలిచి కర్ణున కి ట్లనియె.

(అర్జునుడు వాయవ్యాస్త్రం ప్రయోగించి ఆ మేఘాలు చెదిరిపోయేలా చేశాడు. కృపాచార్యుడు కర్ణార్జునుల మధ్యన నిలిచి ఇలా అన్నాడు.)

1_6_43 కందము పవన్ - వసంత

కందము

ధృతి దఱిఁగి మోహమూర్ఛా
న్విత యైనను సంభ్రమించి విదురుఁడు ప్రత్యా
గతజీవఁ జేసె నప్పుడ
యతిశీతల చందనోదకాసేకమునన్.

(మూర్ఛపోగా విదురుడు నీళ్లు చల్లి ఆమెకు స్పృహ తెప్పించాడు.)

1_6_42 కందము పవన్ - వసంత

కందము

రవిసుతపార్థులఘోరా
హవమునకును వెఱచుచున్నయది కుంతి తదు
ద్భవఘనతరశరతిమిరౌ
ఘవృతాంగుఁ దనూజుఁ జూడఁగానక వంతన్.

(ఈ యుద్ధం చూసి భయపడుతున్న కుంతి కర్ణుడి మేఘాస్త్రం వల్ల కలిగిన చీకటిలో అర్జునుడు కనిపించక.)

1_6_41 వచనము పవన్ - వసంత

వచనము

అయ్యవసరంబున దుర్యోధనుందొట్టి ధృతరాష్ట్రనందనులందఱుఁ గర్ణువలన నుండిరి భీష్మద్రోణకృపపాండవులు పార్థువలన నుండి రంత.

(అప్పుడు కౌరవులు కర్ణుడి పక్షాన, భీష్మద్రోణకృపపాండవులు అర్జునుడి పక్షాన నిలిచారు.)

Sunday, May 07, 2006

1_6_40 మత్తేభము పవన్ - వసంత

మత్తేభము

జనితామర్షణుఁ డంతఁ బార్థుపయిఁ బర్జన్యాస్త్ర మక్కర్ణుఁ డే
సె నపారం బయి భూనభోంతరముఁ దజ్జీమూతయూధంబు గ
ప్పినఁ దద్ధ్వాంతతిరోహితాపఘనుఁ డై బీభత్సుఁ డుండెన్‌ విరో
చనుఁ డాత్మద్యుతి విస్తరించె సుతుపై సంప్రీతచేతస్కుఁ డై.

(కర్ణుడు అర్జునుడిపై మేఘాస్త్రం ప్రయోగించగా అర్జునుడు ఆ చీకటిలో మరుగుపడిపోయాడు.)

-:కర్ణార్జునుల ద్వంద్వయుద్ధము:-

1_6_39 వచనము విజయ్ - విక్రమాదిత్య

వచనము

అని గర్వించి దుర్యోధనానుమతంబునఁ బార్థుతో ద్వంద్వయుద్ధంబు సేయంబూని రణసన్నద్ధుం డయి రవితనయుండు రంగమధ్యంబున నున్నంత నర్జునుండును నాచార్యభ్రాతృచోదితుం డై యుగాంత కాలానలుండునుంబోలెఁ బ్రతిఘటించి నిలిచిన.

(అని దుర్యోధనుడి అనుమతితో అర్జునుడిని ఎదిరించి నిలిచాడు.)

1_6_38 కందము విజయ్ - విక్రమాదిత్య

కందము

ఈ రంగభూమి యస్త్రవి
శారదు లగువారి కెల్ల సామాన్యముగా
కారయ వీరికిఁ జొర నగు
వీరికిఁ గా దను విచారవిషయము దలదే.

(ఈ రంగభూమిలో అందరికీ ప్రవేశం లేదా!)

1_6_37 కందము విజయ్ - విక్రమాదిత్య

కందము

అనిన విని పార్థునకు ని
ట్లనియె నినాత్మజుఁడు దుర్బలాశ్వాసక్షే
పనిబంధమ్ములు వలుకక
ఘననిశితాస్త్రములఁ బలుకఁ గడుఁగుము నాతోన్.

(ఇది విని కర్ణుడు - ఈ మాటలు మాని బాణాలతో మాట్లాడు - అన్నాడు.)

1_6_36 కందము విజయ్ - విక్రమాదిత్య

కందము

పిలువంగఁబడక సభలకు
బలిమిం జని పలుకు పాపభాగుల లోకం
బులకు జనవేఁడి పలికెదు
పలువ యెఱుంగవు పరాత్మపరిమాణంబుల్.

(దుర్మార్గుడా! నీ బలం, ఎదుటివాళ్ల బలం తెలియకుండా మాట్లాడుతున్నావు.)