Sunday, December 10, 2006

1_8_325 గద్యము వోలం - వసంత

గద్యము

ఇది సకలసుకవిజనవినుత నన్నయభట్టప్రణీతం బైన శ్రీమహాభారతంబునం దాదిపర్వంబున విదురాగమనంబు గృష్ణసందర్శనంబును రాజ్యార్థలాభంబును ఖాండవప్రస్థనివాసంబును సుందోపసుందోపాఖ్యానంబును నారదువచనంబున ద్రౌపదియందు సమయక్రియయు నర్జునుతీర్థాభిగమనంబును నులూచీసమాగమంబును చిత్రాంగదయందు బభ్రువాహనజన్మంబును ద్వారకాగమనంబును వాసుదేవానుమతుం డయి యర్జునుండు సుభద్ర వివాహం బగుటయు సుభద్రాపహరణంబును హరణహారికయు నభిమన్యుసంభవంబును గాండీవదివ్యరథాశ్వలాభంబును ఖాండవదహనంబును నగ్నిభయంబువలన మయభుజంగమోక్షణంబును మందపాలోపాఖ్యానంబును నన్నది సర్వంబును నష్టమాశ్వాసము.

శ్రీ మహాభారతము నందలి యాదిపర్వము సమాప్తము.

(ఇది నన్నయభట్టు రచించిన శ్రీమహాభారతంలోని ఆదిపర్వంలో - విదురుడి రాక, కృష్ణుడు పాండవులను దర్శించటం, అర్ధరాజ్యం పాండవులకు లభించటం, ఖాండవప్రస్థంలో పాండవులు నివసించటం, సుందోపసుందుల ఉపాఖ్యానం, నారదుడి మాటలు విని పాండవులు ద్రౌపది విషయంలో నియమాన్ని పాటించటం, అర్జునుడి తీర్థయాత్రలు, ఉలూచి సమాగమం, చిత్రాంగదకు బభ్రువాహనుడు జన్మించటం, అర్జునుడు ద్వారకకు వెళ్లటం, సుభద్ర వివాహం, సుభద్రను తనతో తీసుకువెళ్లటం, సుభద్రకు యాదవులు అరణాలు అందించటం, అభిమన్యుడు జన్మించటం, గాండీవదివ్యరథాశ్వాలు అర్జునుడికి లభించటం, ఖాండవదహనం, మయుడిని రక్షించటం, మందపాలోపాఖ్యానం - మొత్తం ఎనిమిదవ ఆశ్వాసం.

ఆదిపర్వంలో అష్టమాశ్వాసం సమాప్తం.

శ్రీమహాభారతంలో ఆదిపర్వం సమాప్తం.)

1_8_324 మత్తకోకిల వోలం - వసంత

మత్తకోకిల

రాజభూషణ నిత్యసత్య సరస్వతీవిలసన్ముఖాం
భోజ రాజమనోజ భూజనపూజ్యమాన మహాయశో
రాజహంస పయోజినీవనరమ్య దిఙ్ముఖ విక్రమో
ద్వేజితాహిత విష్ణుసన్నిభ విష్ణువర్ధనభూపతీ.

(రాజరాజనరేంద్రా!)

1_8_323 కందము వోలం - వసంత

కందము

అభిమానమహార్ణవ హరి
నిభ విభవ విభాసమాన నిరవద్యరవి
ప్రభ రాజమనోహర వై
రిభయంకరశౌర్య నృపవరేణ్యశరణ్యా.

(రాజరాజనరేంద్రా!)

-:ఆశ్వాసాంతము:-

1_8_322 కందము వోలం - వసంత

కందము

జనమేజయజనపాలున
కనఘచరిత్రునకుఁ బ్రీతుఁ డయి వైశంపా
యనుఁ డాదిపర్వకథ యె
ల్లను నిమ్ముగఁ జెప్పె నని విలాసమహేంద్రా.

(రాజరాజనరేంద్రా! జనమేజయుడికి వైశంపాయనుడు ఆదిపర్వకథ అంతా చెప్పాడు అని సూతుడు శౌనకాది మునులకు చెప్పాడు.)

1_8_321 వచనము వోలం - వసంత

వచనము

ఇంద్రుండు నుపేంద్రార్జునుల నతి స్నేహంబునఁ గౌఁగిలించుకొని యర్జునునకు నాగ్నేయవారుణవాయవ్యాదిదివ్యబాణంబు లిచ్చి వీని కెప్పుడు నిష్టసఖుండ వయి యుండు మని కృష్ణుం బ్రార్థించి దివ్యవిమానారూఢుం డయి దివిజాప్సరోగణసేవితుం డయి దివంబున కరిగె నిట వాసుదేవార్జునులు మయుం దోడ్కొని మగిడి యింద్రప్రస్థపురంబునకు వచ్చి ధర్మరాజునకు మ్రొక్కి ఖాండవదహనప్రకారంబు సెప్పి మయుం జూపి సుఖం బుండి రని.

(ఇంద్రుడు అర్జునుడికి దివ్యాస్త్రాలు ఇచ్చి - ఎప్పుడూ అర్జునుడికి ప్రియమిత్రుడివై ఉండు - అని కృష్ణుడిని ప్రార్థించి, స్వర్గానికి వెళ్లాడు. కృష్ణార్జునులు కూడా మయుడిని వెంటబెట్టుకొని ఇంద్రప్రస్థానికి వచ్చి, ధర్మరాజుకు ఖాండవదహనం గురించి చెప్పి, మయుడిని పరిచయం చేసి, సుఖంగా ఉన్నారు.)

1_8_320 కందము వోలం - వసంత

కందము

అనఘులు నరనారాయణు
లన నాదియుగంబునన్ సురాసురనుతుల
య్యును నపుడు మనుజు లగుటను
వినయంబున మ్రొక్కి రమరవిభునకు నంతన్.

(వారు నరనారాయణులైనా మానవరూపంలో ఉండటం వల్ల ఇంద్రుడికి మొక్కారు.)

1_8_319 కందము వోలం - వసంత

కందము

అతిమానుష మత్యద్భుత
మతిదుష్కర మయిన కేశవార్జునకృతి గో
పతి చూచి మెచ్చి సురపరి
వృతుఁ డయి చనుదెంచెఁ గృష్ణవిజయులకడకున్.

(ఈ ఘనకార్యం చూసి మెచ్చుకొని ఇంద్రుడు దేవతలతో కృష్ణార్జునుల దగ్గరకు వచ్చాడు.)

1_8_318 వచనము వోలం - వసంత

వచనము

ఆలికి నెయ్యుండ వయి దానియోగక్షేమం బరయం దలంచి తది పులుఁ గెటయేనియుం బఱచుం గా కేమి యయ్యెడు వగవకుండు మనిన మందపాలుండు మందస్మితవదనుం డగుచు వసిష్ఠు నట్టి పురుషు నైన నరుంధతియట్టి భార్య యైనను నిర్నిమిత్తంబున స్త్రీవిషయంబునందు సంశయింపకుండ దిది స్త్రీలకు నైజంబ యని పలికి లపిత వీడ్కొని ఖాండవంబునకు వచ్చి పుత్త్రసహిత యయి కుశలిని యయి యున్న జరితం జూచి సంతుష్టుడై నిజేచ్ఛనరిగె నగ్నిదేవుండు నిట్లు నిర్విఘ్నంబున ఖాండవవనౌషధంబు లుపయోగించి విగతరోగుం డయి కృష్ణార్జునుల దీవించి చనియె నంత.

(భార్య మీది ప్రేమతో విచారిస్తున్నావు. దానికేమీ కాదు. చింతించకు - అని లపిత అనగా - వసిష్ఠుడి వంటి పురుషుడినైనా అరుంధతి వంటి భార్య కూడా స్త్రీ విషయంలో అనుమానించకుండా ఉండదు. ఇది స్త్రీలకు సహజమే - అని, ఖాండవానికి వచ్చి, కొడుకులతో క్షేమంగా ఉన్న జరితను చూసి, తృప్తిపొందాడు. అగ్నిదేవుడు కూడా అక్కడి ఔషధాలవల్ల రోగం తొలగి, కృష్ణార్జునులను దీవించి వెళ్లాడు.)

Saturday, December 09, 2006

1_8_317 కందము వోలం - వసంత

కందము

నాయొద్దన ప్రార్థించిన
వాయుసఖుం డపుడు నీకు వరదుం డయి శార్
ఙ్గేయుల నలువురఁ గాతును
ధీయుత యని పలికె మఱచితే మునినాథా.

(మునీశ్వరా! అగ్నిదేవుడు ఆ నలుగురినీ రక్షిస్తానని పలికిన సంగతి మరచిపోయావా?)

1_8_316 వచనము వోలం - వసంత

వచనము

అనిన విని లపిత యిట్లనియె.

(అది విని లపిత ఇలా అన్నది.)

1_8_315 కందము వోలం - వసంత

కందము

మఱచునొకొ మఱవకుండియు
నెఱుఁగక యుండునొకొ యనలుఁ డెఱిఁగియు నెడ నే
మఱునొకొ పుత్త్రులఁ గావక
గుఱుకొని నమ్మంగ నగునె క్రూరాత్మకులన్.

(అగ్నిహోత్రుడు నా ప్రార్థనను మరచిపోతాడేమో? మరవకపోయినా నా పుత్రులను గుర్తించలేకపోతాడేమో? గుర్తించినా రక్షించక మోసగిస్తాడేమో? క్రూరాత్ములను నమ్మతగదుకదా?)

1_8_314 కందము వోలం - వసంత

కందము

తరుణుల నజాతపక్షులఁ
జరణంబులు లేనివారి శార్జ్గేయుల న
ల్వుర నొక్కతె యెట దోడ్కొని
యరుగంగా నేర్చు జరిత యాపద గడవన్.

(పసివాళ్లైన శార్ఙ్గేయులు నలుగురినీ జరిత ఒక్కటే ఎక్కడికి తీసుకువెళ్లగలదు?)

1_8_313 వచనము వోలం - వసంత

వచనము

అగ్నిదేవుం డప్పుడు మందపాలుప్రార్థనం దలంచి యన్నలువురు శార్జ్గకులు నున్న వృక్షంబు భక్షింపక పరిహరించిన జరితయు దానిం జూచి సంతసిల్లి కొడుకులయొద్దకు వచ్చి సుఖం బుండె నంత నక్కడ మందపాలుండు పురందరువనంబు దహనుచేత దగ్ధం బగుట యెఱింగి యం దున్న జరితను బుత్త్రులం దలంచి యతిదుఃఖితుం డయి లపిత కి ట్లనియె.

(అగ్నిదేవుడు ఆ నలుగురూ ఉన్న చెట్టును దహించకుండా విడవగా, జరిత దానిని చూసి సంతోషించి, కొడుకుల దగ్గరకు తిరిగివచ్చి సుఖంగా ఉన్నది. ఖాండవదహనం గురించి మందపాలుడు విని, అందులో ఉన్న భార్యాపుత్రులను తలచి, దుఃఖించి, తన మొదటి భార్య అయిన లపితతో ఇలా అన్నాడు.)

1_8_312 కందము వోలం - వసంత

కందము

నలుగురు నాలుగు వేద
మ్ములమంత్రము లొప్ప బ్రహ్మముఖములు వోలెన్
వెలయంగ సంస్తుతించుచు
నలఘులు మా కభయ మభయి మని రయ్యనలున్.

(ఆ నలుగురూ వేదమంత్రాలతో స్తోత్రం చేస్తూ అభయం ఇమ్మని అగ్నిదేవుడిని ప్రార్థించారు.)

1_8_311 వచనము వోలం - వసంత

వచనము

కావున నీవు మెచ్చినచోటికిఁ బోవనోపము మావలని మోహంబు విడిచి యరుగు మేము దహనక్లేశంబునం బొందినను నీవు జీవించి పుత్త్రులం బడయనోపుదువు నీపుణ్యవంశమున మాకు నగ్నిభయంబు దొలంగెనేని నీవు మాయొద్దకు వచ్చి యెప్పటియట్ల రక్షింతు వని కొడుకు లెల్ల మ్రొక్కినం జూచి జరితయు బాష్పపూరితనయన యై యాసన్నతరుగుల్మగహనదహనమహోత్సాహుం డయి వచ్చు హవ్యవాహనుం జూచి ప్రాణభయంబున గగనంబున కెగసి చనె నంత.

(కాబట్టి మేము బొరియలోకి వెళ్లము. మా మీద మమకారం విడిచి వెళ్లు. మేము మరణించినా నీవు మళ్లీ పుత్రులను పొందగలవు. ఒకవేళ మేము జీవిస్తే నీవు తిరిగివచ్చి మమ్మల్ని రక్షిస్తావు - అని ప్రార్థించగా జరిత కన్నీటితో ఆకాశానికి ఎగిరి వెళ్లింది.)

1_8_310 కందము వోలం - వసంత

కందము

జ్వలనంబు వాయువశమునఁ
దొలఁగుడు జీవనము మాకు దొరకొనుఁ గృచ్ఛ్రం
బుల సంశయయుతకార్యం
బులు గర్తవ్యములు నియతములు వర్జ్యముల్.

(గాలి వశాన మంట తొలగిపోతే మేము జీవించవచ్చు. కష్టాలలో ఉన్నప్పుడు, బాధ తప్పదు అనిపించే పనులు విడిచిపెట్టదగినవి. బాధ కలిగితే కలుగవచ్చు, లేకపోతే తప్పిపోవచ్చు అనిపించే పనులు చేయదగినవి.)

1_8_309 వచనము వోలం - వసంత

వచనము

మఱియు మాంసపిండంబుల మయియున్న మాకు బిలప్రవేశంబున మూషకభయంబు నియతం బింద యుండిన నగ్నిభయంబు సంశయితం బె ట్లనిన.

(ఎలుక వల్ల ప్రమాదం తప్పనిది. అగ్నిభయం అనుమానాస్పదం. ఎలాగంటే.)

1_8_308 తేటగీతి వోలం - వసంత

తేటగీతి

బిలము సొచ్చితిమేని నం దెలుక చంపు
నింద యుండితిమేనిఁ దా నేర్చు నగ్ని
యెలుకచేఁ జచ్చుటకంటె నీజ్వలనశిఖలఁ
గ్రాగి పుణ్యలోకంబులఁ గాంతు మేము.

(బొరియలోని ఎలుక చేతిలో చనిపోవటం కంటే ఇక్కడే ఉండి మంటలలో మాడి పుణ్యలోకాలు పొందుతాము.)

1_8_307 వచనము వోలం - వసంత

వచనము

అని దుఃఖిత యై యున్న తల్లిం జూచి యగ్రతనయుం డైన జరితారి యి ట్లనియె.

(అని దుఃఖించే తల్లిని చూసి పెద్దకొడుకైన జరితారి ఇలా అన్నాడు.)

1_8_306 చంపకమాల వోలం - వసంత

చంపకమాల

కొడుకుల బ్రహ్మవిత్తములఁ గోరినయట్టుల వీరి నల్వురం
బడసితి నిమ్మహాత్ముల నపాయము నొందకయుండఁ బెంచుచున్
నడపుమటంచు నన్ను మునినాథుఁడు మీజనకుండు పంచి యి
ప్పుడ యెటయేనిఁ బోయె హుతభుక్ప్రళయంబు దలంప కక్కటా.

(మీ తండ్రి కోరుకొన్నట్లు నలుగురు కొడుకులను కన్నాను. వీరికి అపాయం కలుగకుండా పెంచు - అని నన్ను ఆజ్ఞాపించి, ఈ ప్రమాదం ఏర్పడినప్పుడు ఎక్కడికో వెళ్లాడు. )

1_8_305 చంపకమాల వోలం - వసంత

చంపకమాల

ఇది ప్రళయాగ్నివోలె దెసలెల్లను గప్పఁగ విస్ఫులింగముల్
వదలక వాయుసారథిజవంబునఁ దా నిట వచ్చె నేమి సే
యుదు సుతులార యీబిలము నొయ్యన పోయి చొరుండు దీనిఁ గ
ప్పెద ఘనపాంసుజాలముల భీమశిఖావళి దాఁకకుండఁగన్.

(అగ్నిదేవుడు వేగంగా ఇటు వస్తున్నాడు. ఏమి చేయాలి? ఈ బొరియలో ప్రవేశించండి. మంటలు తాకకుండా దుమ్ముతో ఈ బొరియను కప్పుతాను.)

1_8_304 కందము వోలం - వసంత

కందము

వీరలఁ దోడ్కొనిపోవఁగ
నేరను బాలకులఁ బెట్టి నిర్దయబుద్ధిన్
వీరలతండ్రిక్రియం జన
నేరను విధికృతము గడవనేరఁగ లావే.

(వీరిని వెంటపెట్టుకు వెళ్లలేను. వీరి తండ్రిలా దయలేకుండా ఇక్కడే విడిచి వెళ్లలేను.)

1_8_303 కందము వోలం - వసంత

కందము

తనయుల నజాతపక్షుల
ననలశిఖాభీతిచంచలాత్ముల నెటయుం
జననేరనిబాలకులను
జననియు వీక్షించి శోకసంతాపిత యై.

(ఎక్కడికీ వెళ్లలేని పసివాళ్లయిన కుమారులను చూసి తల్లి కూడా దుఃఖించింది.)

1_8_302 వచనము వోలం - వసంత

వచనము

అనిన నమ్మందపాలుప్రార్థనంజేసి యానలువురుశార్జ్గకులను నగ్నిదేవుండు రక్షించువాఁ డయ్యె నంత నిట.

(ఆ ప్రార్థన వల్ల ఆ నలుగురు శార్ఙ్గకులను అగ్నిదేవుడు రక్షించాడు. ఇక ఇక్కడ.)

1_8_301 కందము వోలం - వసంత

కందము

నీవఖిలధర్మమూర్తివి
నావీర్యప్రభవు లయిన నలువురుసుతులన్
లావుకలఁ గరుణఁ గావుము
పావక భువనోపకారపర్యాప్తమతీ.

(నా కుమారులను దయతో రక్షించు.)

1_8_300 వచనము వోలం - వసంత

వచనము

అనిన విని మందపాలుండు మర్త్యలోకంబునకుఁ దిరిగివచ్చి నాకుం జెచ్చెరం బెక్కండ్రుపుత్త్రుల నెవ్విధంబునం బడయనగునో యని చింతించి పక్షులయందు వేగంబ యపత్యంబు పెద్దయగుటం జూచి తానును శార్జ్గకుం డై జరిత యను లావుక పెంటి యందు రమియించి దానివలన జరితారి సారిసృక్కస్తంబమిత్రద్రోణు లనువారల నలువురఁ గొడుకులఁ బరమబ్రహ్మవిదులం బడసి వారల ఖాండవంబునం బెట్టి తనపూర్వభార్యయైన లపితయుం దానును విహరించుచు నొక్కనాఁడు ఖాండవదహనోద్యతుండై వచ్చుచున్న యగ్నిభట్టారకుం గని యగ్ని సూక్తంబుల స్తుతియించి యి ట్లనియె.

(ఇది విని, మందపాలుడు మానవలోకానికి తిరిగివచ్చి, పక్షులలో సంతానం చాలా ఎక్కువగా ఉండటం చూసి, మగ లావుక పక్షిరూపం ధరించి, జరిత అనే ఆడ లావుక పక్షితో నలుగురు కుమారులను పొందాడు. వారిని ఖాండవవనంలో ఉంచి, తన మొదటి భార్య లపితతో విహరిస్తూ, ఆ వనాన్ని దహించటానికి వస్తున్న అగ్నిహోత్రుడిని చూసి, ఇలా అన్నాడు.)

1_8_299 కందము వోలం - వసంత

కందము

ఎంతతపం బొనరించియు
సంతానము లేనివారు సద్గతిఁ బొందం
గాంతురె నీతప మేటికి
సంతానమువడయు మరిగి సన్మునినాథా.

(ఎంత తపస్సు చేసినా సంతానం లేక సద్గతి లభిస్తుందా? నీ తపస్సెందుకు? వెళ్లి సంతానం పొందు.)

1_8_298 వచనము వోలం - వసంత

వచనము

నాకుఁ బుణ్యలోకంబులు లేకుండ నే నేమి దుష్కృతంబు సేసితి నమ్మునీంద్రునకు దేవత లి ట్లనిరి.

(నేనేమి పాపం చేశాను - అని అడగగా దేవతలు ఇలా అన్నారు.)

1_8_297 కందము వోలం - వసంత

కందము

అమ్ముని యోగాభ్యాసవ
శమ్మున దేహంబు విడిచి చని పుణ్యులలో
కమ్ములు సొరఁ గానక వడిఁ
ద్రిమ్మరి దేవతలఁ గాంచి ధృతి ని ట్లనియెన్.

(ఆ ముని యోగాభ్యాసంతో శరీరం విడిచివెళ్లి, పుణ్యలోకాలు ప్రవేశించలేక, వెనుదిరిగి, దేవతలతో ఇలా అన్నాడు.)

1_8_296 కందము వోలం - వసంత

కందము

జనపాల మందపాలుం
డనుమునిముఖ్యుండు దొల్లి యత్యుగ్రతపం
బొనరించె బ్రహ్మచర్యం
బున దివ్యసహస్రవర్షములు నైష్ఠికుఁ డై.

(పూర్వం మందపాలుడనే ముని భయంకరమైన తపస్సు చేశాడు.)

1_8_295 వచనము వోలం - వసంత

వచనము

అని యడిగిన జనమేజయునకు వైశంపాయనుం డి ట్లనియె.

(అప్పుడు జనమేజయుడితో వైశంపాయనుడు ఇలా అన్నాడు.)

1_8_294 కందము వోలం - వసంత

కందము

మయభుజగమోక్షణము ని
ర్ణయముగ నెఱిఁగితి నెఱుంగ నా కర్థిత్వం
బయినది నలుగురు శార్జ్గకు
లయు మోక్షణ మెట్లు నిర్మలజ్ఞాననిధీ.

(మహర్షీ! మందపాలుని కుమారులు నలుగురూ ఎలా తప్పించుకొన్నారో తెలుసుకోవాలనుంది.)

1_8_293 వచనము వోలం - వసంత

వచనము

అనిన విని జనమేజయుండు వైశంపాయనున కి ట్లనియె.

(ఇది విని జనమేజయుడు వైశంపాయనుడితో ఇలా అన్నాడు.)

-:మందపాలోపాఖ్యానమ:-

1_8_292 తేటగీతి వోలం - వసంత

తేటగీతి

మయుఁడు నశ్వసేనుండును మందపాల
సుతులు నలుగురు శార్జ్గకు లతులదావ
దాహభీతి కయ్యార్వురుఁ దప్పి రన్య
జీవులెల్ల నం దపగతజీవు లైరి.

(మయుడు, అశ్వసేనుడు, మందపాలుని కుమారులైన నలుగురు శార్ఙ్గకులు - మొత్తం ఆరుమంది తప్ప మిగిలిన ప్రాణులన్నీ ఆ దావాగ్నిలో మరణించాయి.)

1_8_291 కందము వోలం - వసంత

కందము

శరణాగతరక్షణత
త్పరుఁడు ధనంజయుఁడు మయుని ప్రాణము గాచెం
గరుణను శరణాగతులగు
పురుషుల రక్షించునంత పుణ్యము గలదే.

(అర్జునుడు దయతో మయుడిని కాపాడాడు.)

1_8_290 వచనము వోలం - వసంత

వచనము

అట్టియవసరంబున నముచి యను దనుజుననుజుండు మయుం డను వాఁడు ఖాండవంబు వెలువడనేరక తక్షకుగృహంబునఁ బరిభ్రమించుచున్నంతఁ ద న్నగ్ని చుట్టుముట్టిన నచ్యుతుండును జంప వచ్చిన నతిభీతుం డై యర్జునుమఱువు సొచ్చిన.

(అప్పుడు నముచి అనే రాక్షసుడి తమ్ముడైన మయుడు ఖాండవం నుండి బయటపడలేక, తక్షకుడి ఇంట్లో దిక్కుతోచక తిరుగుతూ, అగ్ని తనను చుట్టుముట్టగా, కృష్ణుడు చంపటానికి రాగా, భయపడి అర్జునుడి చాటుకు వెళ్లాడు.)

1_8_289 కందము వోలం - వసంత

కందము

బలయుతులు మనుజసింహులు
నలిఁ గృష్ణార్జునులు సింహనాదముల వియ
త్తలమును దిక్కులు బధిరం
బులుగాఁ జేసిరి త్రిలోకములు భయ మందన్.

(కృష్ణార్జునులు ముల్లోకాలూ భయపడేటట్లుగా, ఆకాశం, దిక్కులు చెవిటివయ్యేటట్లుగా సింహనాదాలు చేశారు.)

1_8_288 వచనము వోలం - వసంత

వచనము

నీయిష్టసఖుం డయిన తక్షకుం డిందుండక ముందరన కురుక్షేత్రంబున కరిగి ఖాండవప్రళయంబునకుఁ దప్పె ఖాండవం బగ్నిచేత దగ్ధం బగు నని తొల్లి బ్రహ్మవచనంబు గలుగుటం జేసి యిది హుతాశనున కశనం బయ్యె నింక దీనికి వగవం బనిలే దనిన దాని విని సురపతి సురగణంబులతో మరలిన.

(నీ మిత్రుడు తక్షకుడు ఇక్కడ లేడు. ముందుగానే కురుక్షేత్రానికి వెళ్లిపోయాడు. అగ్నివల్ల ఖాండవం కాలిపోతుందని ముందే బ్రహ్మ చెప్పాడు. ఇక దీనికి దుఃఖింపనక్కర లేదు - అనగా ఇంద్రుడు దేవతలతో తిరిగి వెళ్లగా.)

1_8_287 చంపకమాల వోలం - వసంత

చంపకమాల

అలఘులు కృష్ణపార్థులు మహాత్ములు యాదవకౌరవాన్వయం
బులు వెలుఁగించుచున్న నృపపూజ్యులు వీరల నీకు నోర్వఁగా
నలవియె వీరు దొల్లియు సురాసురయుద్ధము నాఁడు దైత్యులన్
వెలయఁగ నోర్చియున్న రణవీరులు గావుట ము న్నెఱుంగవే.

(వీరిని ఓడించటం నీకు సాధ్యమా? పూర్వం దేవదానవయుద్ధంలో రాక్షసులను వీరు ఓడించటం నీకు తెలియదా?)

1_8_286 కందము వోలం - వసంత

కందము

పరమమును లయిన తొల్లిటి
నరనారాయణులు కృష్ణనామంబుల ను
ర్వర నుదయించిరి నీ క
య్యిరువుర పేర్మియును వింతయే దివిజేంద్రా.

(దేవేంద్రా! నరనారాయణులైన వీరి గొప్పతనం నీకు ఆశ్చర్యం కలిగిస్తున్నదా?)

1_8_285 వచనము వోలం - వసంత

వచనము

అంత నొక్కయశరీరవాణి పాకశాసనున కి ట్లనియె.

(అప్పుడు ఒక ఆకాశవాణి ఇంద్రుడితో ఇలా అన్నది.)

1_8_284 కందము వోలం - వసంత

కందము

ధరణీధరుచక్రమునకుఁ
బురుహూతతనూజుబాణముల కనిలో నె
వ్వరు మార్కొననోపరు సుర
గరుడోరగసిద్ధసాధ్యగణములలోనన్.

(కృష్ణుడి చక్రాన్ని, అర్జునుడి బాణాలను ఎవ్వరూ ఎదుర్కొనలేరు.)

1_8_283 చంపకమాల వోలం - వసంత

చంపకమాల

అరుదుగ దివ్యరత్ననివహంబులఁ జేసి వెలుగుచున్న మం
దరశిఖరంబు నెత్తికొని తద్దహనార్చు లడంగునట్లుగాఁ
దెలకఁగ వైచినం దపనతేజుఁడు పాండుసుతుండు దానిజ
ర్జరితము సేసె వజ్రమయశాతశిలీముఖచండధారలన్.

(మందరపర్వతాన్ని ఎత్తి అగ్నిహోత్రుడి మంటలు అణిగేటట్లు వేయగా, అర్జునుడు తన బాణాలతో దాన్ని ముక్కలు చేశాడు.)

1_8_282 కందము వోలం - వసంత

కందము

కొడుకుభుజవిక్రమమునకుఁ
గడుసంతసపడియుఁ దృప్తిగానక చల మే
ర్పడఁగ హుతాశను నార్పం
గడఁగి మహారౌద్రభంగి గౌశికుఁడు వడిన్.

(కొడుకు పరాక్రమం చూసి సంతోషించి కూడా తృప్తిపొందక అగ్నిహోత్రుడిని ఆర్పటానికి వేగంగా.)

1_8_281 కందము వోలం - వసంత

కందము

నిశితశరవర్షమున ను
గ్రశిలావర్షమ్ముఁ జిత్రగతి నస్త్రకలా
కుశలుఁడు నరుఁ డశ్రమమునఁ
బ్రశాంతిఁ బొందించె నమరపతి వెరఁగందన్.

(ఇంద్రుడు కూడా ఆశ్చర్యపడేటట్లు అర్జునుడు తన బాణాలతో ఆ రాళ్లవానను అణగిపోయేలా చేశాడు.)

1_8_280 వచనము వోలం - వసంత

వచనము

మఱియును వారల బల పరాక్రమంబు లెఱుంగ వేఁడి శక్రుండు శిలావర్షంబుఁ గురియించిన.

(వారి బలం తెలుసుకోవాలని ఇంద్రుడు రాళ్లవాన కురిపించగా.)

1_8_279 సీసము + ఆటవెలది వోలం - వసంత

సీసము

బలవైరి కృష్ణుపైఁ బార్థుపైఁ గడునల్గి
పంచినఁ గలయంగఁ బన్ని కడఁగి
సురగరుడోరగాసురసిద్ధగంధర్వు
లార్చుచుఁ దాఁకి యుగ్రాహవంబు
సేసిన నమరులఁ జెచ్చెరఁ బార్థుండు
భంజించెఁ దనదివ్యబాణశక్తిఁ
జక్రధరుండును జక్రబలంబున
గరుడోరగాసురఖచరవరులఁ

ఆటవెలది

దత్క్షణంబ విగతదర్పులఁ జేసె న
య్యిద్దఱకు సురాసురేశు లెల్ల
భీతు లగుట చూచి పెద్దయు విస్మిత
హృదయుఁ డయ్యె సురగణేశ్వరుండు.

(ఇంద్రుడి ఆజ్ఞతో దేవదైత్యులంతా కృష్ణార్జునులతో యుద్ధం చేశారు. కృష్ణార్జునులకు వారంతా భయపడటం చూసి ఇంద్రుడు ఆశ్చర్యపడ్డాడు.)

1_8_278 వచనము వోలం - వసంత

వచనము

అంత.

(అప్పుడు.)

1_8_277 ఉత్పలమాల వోలం - వసంత

ఉత్పలమాల

అ న్నవవారివాహ నివహమ్ములఁ జూచి భయప్రపన్నుఁ డై
యున్నహుతాశనున్ విజయుఁ డోడకు మంచును మారుతాస్త్రమ
త్యున్నతచిత్తుఁ డేసె నదియున్ విరియించె రయంబుతో సము
త్పన్నసమీరణాహతి నపార పయోద కదంబకంబులన్.

(ఆ కొత్త మేఘాలను చూసి భయపడి శరణువేడిన అగ్నిహోత్రుడిని చూసి, అర్జునుడు భయపడవద్దని చెప్పి వాయవ్యాస్త్రాన్ని ప్రయోగించి, వాటిని చెదరగొట్టాడు. )

1_8_276 ఉత్పలమాల వోలం - వసంత

ఉత్పలమాల

ఆ నరుమీఁద ఘోరనిశితాశని వైచె నఖండచండ ఝం
ఝానిలజర్జరీకృతమహాజలధారలతో నిరంతరా
నూన పయోధరప్రకర ముద్ధత మై హరిదంతరంబులన్
భానుపథంబు నొక్కమొగిఁ బర్వి భయంకరలీలఁ గప్పఁగన్.

(ఇంద్రుడు అర్జునుడి మీద భయంకరమైన వజ్రాయుధాన్ని ప్రయోగించాడు.)

-:ఇంద్రుండు కృష్ణార్జునులతోఁ బోరుట:-

1_8_275 వచనము వోలం - వసంత

వచనము

వెండియు నశ్వసేను నేయసమకట్టిన యప్పార్థునకుఁ దత్క్షణంబ మోహిని యను మాయ గావించి యమరేంద్రుఁ డశ్వసేను విడిపించి యందుఁ దక్షకుండు దగ్ధుం డయ్యెను కా వగచి కడు నలిగి.

(మళ్లీ అశ్వసేనుడిని కొట్టబోగా, ఇంద్రుడు మోహిని అనే మాయను అర్జునుడి మీద ప్రయోగించి, అశ్వసేనుడిని విడిపించి, ఖాండవంలో తక్షకుడు కాలిపోయాడేమో అని భావించి కోపంతో.)

1_8_274 ఆటవెలది వోలం - వసంత

ఆటవెలది

వెఱచి తల్లిఁ దోఁకఁ గఱపించుకొని దివిఁ
బఱచువానిఁ జూచి పార్థుఁ డలిగి
వాని తల్లి శిరము తోన తత్పుచ్ఛంబు
దునిసి యగ్నిశిఖలఁ దొరఁగ నేసె.

(భయపడి, తల్లిని తోకలో కరపించుకొని ఆకాశంలో పరుగెత్తుతున్న అశ్వసేనుడిని చూసి, తల్లి తలతో కూడా అతడి తోక తెగి మంటలలో పడేటట్లు కొట్టాడు.)

1_8_273 తేటగీతి వోలం - వసంత

తేటగీతి

దాని వెల్వడనేరక తద్వనంబు
జీవులెల్లను బావకశిఖలఁ జేసి
దగ్ధు లగుచున్నఁ దక్షకతనయుఁ డశ్వ
సేనుఁ డను భుజంగము మగ్నిశిఖల కపుడు.

(ఆ ఇంటిని దాటలేక ఆ వనంలోని ప్రాణులన్నీ కాలిపోతుండగా, తక్షకుడి కుమారుడైన అశ్వసేనుడు ఆ మంటలకు.)

1_8_272 వచనము వోలం - వసంత

వచనము

ఇట్లు కావించిన.

(ఇలా చేయగా.)

1_8_271 కందము వోలం - వసంత

కందము

పాండుసుతుఁ డంత నానా
కాండసహస్రముల నేసి ఘనముగఁ జేసెన్
ఖాండవగృహము నఖండా
ఖండలధారలకుఁ దూఱఁ గాకుండంగన్.

(అప్పుడు అర్జునుడు ఆ వర్షం దూరటానికి వీలుకాకుండా బాణాలతో ఖాండవవనానికి ఇల్లు కట్టాడు.)

Friday, December 08, 2006

1_8_270 కందము వోలం - వసంత

కందము

ఉఱుముచు మెఱుముచుఁ బిడుగులు
వఱలఁగ నలుగడలఁ బడ నవారితవృష్టుల్
గుఱుకొని కురియఁగఁ బంచెను
మఱియును నయ్యనలుమీఁద మఘవుం డలుకన్.

(అడ్డగించటానికి సాధ్యం కాకుండా కురవమని ఇంద్రుడు మేఘాలను ఆజ్ఞాపించాడు.)

1_8_269 కందము వోలం - వసంత

కందము

ఆ వారిధార లెల్ల మ
హావహ్నిశిఖాహతంబు లయి శుష్కము లై
లావఱి నడుమన యడఁగుటఁ
బావకు పయి నొక్కచినుకుఁ బడదయ్యె వడిన్.

(ఆ నీళ్లు మంటల వల్ల ఎండి, బలం చెడటం వల్ల, అగ్నిమీద ఒక్క చినుకు కూడా పడలేదు.)

1_8_268 వచనము వోలం - వసంత

వచనము

అంత దేవత లెల్ల మహావహ్నిశిఖాహతికిఁ వెఱచి దేవేంద్రుపాలికిం బోయి ఖాండవంబున కైనయకాండ ప్రళయంబు సెప్పిన విని యదరిపడి యింద్రుండు తక్షకరక్షణాపేక్ష ననేకధారాధారనివహంబుతో నతిత్వరితగతి ఖాండవంబునకు వచ్చి హుతాశనుమీఁద మహావారిధారలు గురియించిన.

(అప్పుడు తక్షకుడిని కాపాడేందుకు ఇంద్రుడు వచ్చి అగ్నిదేవుడి మీద నీటిధారలు కురిపించాడు.)

1_8_267 కందము వోలం - వసంత

కందము

అలుగుల పడి ఖాండవమునఁ
గల యాశీవిషమహోరగము లెల్ల విషా
గ్నులు గ్రక్కుచు నత్యుగ్రా
నలబహులజ్వాలలందు నాశము వొందెన్.

(అక్కడి పాములన్నీ జ్వాలలలో పడి నశించిపోయాయి.)

1_8_266 చంపకమాల వోలం - వసంత

చంపకమాల

అమితకృశానుదగ్ధ మగు నయ్యమరేంద్రువనంబులోని యు
త్తమసలిలాశయావళుల తప్తజలంబులయం దపేతజీ
వము లయి తేలుచుండె వరవారిచరంబులు వారిపక్షులుం
గమరె నశేషకోకనదకైరవపంక్తులు శైవలంబులున్.

(అక్కడి మడుగులలో కాగిన నీటిలో జలచరాలు, నీటి పక్షులు చచ్చి తేలుతున్నాయి. కలువలు, నాచుతీగలు మాడిపోయాయి.)

1_8_265 కందము వోలం - వసంత

కందము

తనతేజోజాలము ప
ర్విన దగ్ధము లగు ననేకవిధదేహుల దే
హనికాయంబుల బహువిధ
తనువులు గలవాఁడవోలె దహనుం డొప్పెన్.

(కాలిపోతున్న ప్రాణుల దేహాలతో అగ్నిదేవుడు ఎన్నో దేహాలు కలవాడిలా ప్రకాశించాడు.)

1_8_264 కందము వోలం - వసంత

కందము

నెగయుడు నెగసి పిఱుందం
దగిలెడు మిడుఁగుఱులచేత దగ్ధచ్ఛద మై
గగనమునఁ బఱవ నోపక
ఖగనివహము వహ్నియంద కడువడిఁ బడియెన్.

(తప్పించుకోవటానికి ఎగిరిన పక్షులు, నిప్పురవ్వలు వాటి రెక్కలను కాల్చటం వల్ల, ఎగరలేక అగ్నిలోనే పడ్డాయి.)

1_8_263 చంపకమాల వోలం - వసంత

చంపకమాల

జ్వలనశిఖాలియున్ విజయుసద్విశిఖాలియుఁ జుట్టుముట్టినం
దలరి భయాకులంబు లగు తద్వనజీవులయార్తనాదమం
దులియుచు నొక్కపెట్ట దివి నుద్గత మయ్యె నమందమందరా
చలపరివర్తనప్రసభసంక్షుభితార్ణవఘోషఘోర మై.

(భయంతో చెల్లాచెదరైన అక్కడి ప్రాణుల ఏడుపు ఆకాశంలో మీదికి ఎగసింది.)

1_8_262 మత్తేభము వోలం - వసంత

మత్తేభము

ఘనధూమధ్వజ దహ్యమాన లవలీ కర్పూర తక్కోల చం
దన కాలాగరు సల్లకీతరుల యుద్యద్ధూమధూపానువా
సన నొప్పెన్ సురభీకృతంబు లగుచున్ సంక్రీడమానామృతా
శనవిద్యాధరసద్విమానవితతుల్ సావిత్రవర్త్మంబునన్.

(అగ్నిహోత్రుడు అక్కడి వృక్షాలను దహించసాగాడు.)

1_8_261 సీసము + ఆటవెలది వోలం - వసంత

సీసము

చక్రధరుం డయ్యు జలరుహనాభుండు
గాండీవధరుఁ డయ్యుఁ బాండవుండు
నుండి రవ్వనమువ కుభయపార్శ్వంబులఁ
దొల్లింటి యట్టులు పెల్లు రేఁగి
యనలంబు నార్పంగ నార్చుచుఁ బఱతెంచి
వనరక్షకులు పార్థు సునిశితాస్త్ర
ధారల నవగతదర్పు లై యరిగిరి
యమసదనంబున కమితబలులు



ఆటవెలది

శిఖియు నుగ్రదీర్ఘజిహ్వలు సాచి యు
ద్ధరసమీరణంబు తోడు సేసి
కొని యుగాంతకాల కుపితానలాకారుఁ
డయ్యె ఖాండవమున కద్భుతముగ.

(ఆ వనానికి రెండువైపులా కృష్ణుడు, అర్జునుడు నిలబడ్డారు. ఆ నిప్పును ఆర్పటానికి వస్తున్న వనరక్షకులను అర్జునుడు సంహరించాడు.)

1_8_260 వచనము వోలం - వసంత

వచనము

అంత.

(అప్పుడు.)

1_8_259 చంపకమాల వోలం - వసంత

చంపకమాల

పెడిలి సువర్ణపర్వతము పెక్కుదెఱంగుల వ్రయ్యునట్టు ల
ప్పుడు వివిధప్రకారముల భూరిశిఖావలి ఖాండవంబు న
ల్గడఁ గడుఁబర్వఁగాఁ బెఱిఁగి కాల్పఁదొడఁగె హుతాశనుండు సే
డ్పడఁగ వనంబులోని మృగపక్షిభుజంగమభూతసంఘముల్.

(అగ్నిదేవుడు ఆ వనాన్ని దహిస్తూ వ్యాపించసాగాడు.)

1_8_258 వచనము వోలం - వసంత

వచనము

అని తత్ప్రభావప్రకారంబు చెప్పినఁ గృష్ణార్జునులు సంతసిల్లి సన్నద్ధు లయి రథం బెక్కి యగ్నిదేవుం జూచి సురాసురపరివృతుం డయి సురపతి వచ్చినను జయింతు మింక శంకింపక ఖాండవదహనార్థం బుపక్రమింపు మనిన నగ్నిదేవుండు హర్షించి తైజసంబయిన రూపంబు ధరియించి.

(అప్పుడు కృష్ణార్జునులు రథం ఎక్కి అగ్నిదేవుడితో - ఇంద్రుడు దేవదానవులతో కలిసివచ్చినా జయిస్తాము. సంకోచించకుండా ఖాండవవనాన్ని దహించటం ప్రారంభించు - అనగా అగ్నిదేవుడు సంతోషించి.)

-:కృష్ణార్జును లగ్నిహోత్రునిచే ఖాండవంబు దహింపఁ జేయుట:-

1_8_257 కందము వోలం - వసంత

కందము

ఈచక్రము మధుసూదన
నీచేత విముక్త మగుచు నీరిపులఁ ద్రియా
మాచరులఁ జంపి క్రమ్మఱ
నచేతికి వచ్చు దేవనిర్మితశక్తిన్.

(కృష్ణా! ఈ చక్రాన్ని నీవు ప్రయోగిస్తే నీ శత్రువులను సంహరించి మళ్లీ నీ చేతికి వచ్చి చేరుతుంది.)

1_8_256 కందము వోలం - వసంత

కందము

ఈ రథ మప్రతిహతము స
మీరజవోపేతహయసమేతము దీనిన్
భూరిబలుఁ డెక్కి సోముఁడు
ధీరుం డయి తొల్లి యెల్లదిక్కుల నొడిచెన్.

(ఈ రథంతో సోముడు పూర్వం దిక్కులన్నీ జయించాడు.)

1_8_255 కందము వోలం - వసంత

కందము

ఘనభుజ యిది గాండీవం
బనఁబరఁగిన ధనువు దీని నస్త్రావలి పె
ల్చన తాఁకి భగ్న మగు న
త్యనుపమవజ్రాభిహతశిలావలి వోలెన్.

(ఇది గాండీవం అనే ధనుస్సు.)

1_8_254 వచనము వోలం - వసంత

వచనము

మఱియుఁ బ్రతిపక్ష సంక్షయకరంబు లయిన యక్షయబాణంబులు గల తూణీరంబులును వివిధాయుధభరితం బై సింహలాంగూలకపిధ్వజవిరాజమానంబై మహాంబుధరకధ్వానబంధురంబై మనోవాయువేగసితవాహవాహ్యమానంబై రణితరమణీయమణికింకిణీకలాపాలంకృతం బై సకలదిగ్విజయాధిష్ఠానంబై యొప్పుచున్న దివ్యరథంబు నర్జునున కిచ్చి సహస్రకరసహస్రదుస్సహమహఃపటలభాసురం బగుచు దేవదైత్యదానవయక్షరాక్షసపిశాచోరగప్రశమనంబయి వెలుంగుచున్న సుదర్శనం బను చక్రంబును గౌమోదకి యను గదయును నారాయణున కిచ్చె నట్లు సంప్రాప్తదివ్యచాపరథాయుధు లయి యున్న నరనారాయణులం జూచి యగ్నిదేవుం డి ట్లనియె.

(అంతేకాక అమ్ములపొదులను, తోక కల కోతి గుర్తు ఉన్న జెండాతో ప్రకాశిస్తున్న రథాన్ని అర్జునుడికిచ్చాడు. సుదర్శన చక్రాన్ని, కౌమోదకి అనే గదను కృష్ణుడికి ఇచ్చాడు. అలా ఆయుధాలను పొందిన కృష్ణార్జునులతో అగ్నిదేవుడు ఇలా అన్నాడు.)

1_8_253 మత్తేభము వోలం - వసంత

మత్తేభము

అమరాహీంద్రవియచ్చరాదుల కజేయం బప్రధృష్యం బభే
ద్యము వజ్రస్థిరమన్యసాధనభిదాదక్షంబు నై సర్వలో
కమనోజ్ఞం బయి దివ్య మై వెలుఁగు నగ్గాండీవ మన్ చాపర
త్నము నిచ్చెన్ వరుణుండు పార్థునకు నుద్యద్విక్రమోద్భాసికిన్.

(వరుణుడు అర్జునుడికి గాండీవం అనే ధనుస్సును ఇచ్చాడు.)

1_8_252 వచనము వోలం - వసంత

వచనము

అనిన నగ్నిదేవుండును నప్పుడ వరుణుం దలంచి వానిం దనకు సన్నిహితుం జేసికొని తొల్లి నీకు సోముం డిచ్చిన బ్రహ్మనిర్మితకార్ముకంబు నక్షయతూణీరయుగళంబును గంధర్వజహయంబులం బూన్చిన రథంబు నియ్యతిరథుం డయిన యర్జునున కిమ్ము మఱి చక్రంబును గదయును వాసుదేవున కి మ్మని పంచిన.

(అప్పుడు అర్జునుడు వరుణుడిని స్మరించి, తన దగ్గరకు రప్పించి - పూర్వం నీకు సోముడు ఇచ్చిన ధనుస్సు, అమ్ములపొదులు, గుర్రాలు ఈ అర్జునుడికి - చక్రాన్ని, గదను కృష్ణుడికి ఇవ్వు - అని ఆజ్ఞాపించగా.)

1_8_251 సీసము + ఆటవెలది వోలం - వసంత

సీసము

వారణహస్తానుకారంబు లగు వారి
ధారలు గురియు దుర్వారఘోర
తరవారివాహప్రకరములు వారింప
సురనివహంబుతో సురగణేశు
నైన నోర్వ సుశక్త మైన మహాదివ్య
శరసంచయము నా కపరిమితంబు
గల దట్టిసాయకావలికి నాదగు భుజ
బలశీఘ్రసంధానములకుఁ దగిన

ఆటవెలది

ధనువు సర్వవహనఘనరథాశ్వములుఁ గృ
ష్ణునకు నాయుధములు ననఘ యిపుడు
లేమిఁ జేసి చూవె యీమహకార్యంబు
గడఁగకున్నవార మెడయుఁ జేసి.

(ఇంద్రుడినైనా ఓడించగల అస్త్రసమూహం నా దగ్గర ఉంది. కానీ వాటికి తగిన ధనుస్సు, రథం, గుర్రాలు, శ్రీకృష్ణుడికి ఆయుధాలు ఇప్పుడు లేవు.)

-:అగ్నిదేవుండు కృష్ణార్జునులకుఁ జక్రకార్ముకాదు లొసంగుట:-

1_8_250 వచనము వోలం - వసంత

వచనము

ఏను మీయానతిచ్చినవిధంబున ఖాండవం బుపయోగింపం బోయి తద్రక్షకులు గావించువిఘాతంబులు వారింపనేరక యేడుమాఱులు విఫలప్రయత్నుండ నైతి నింక నెద్దియుపాయంబు నాకు నెవ్విధంబున ఖాండవభక్షణంబు దొరకొను నని దుఃఖించిన యతనిం జూచి కమలభవుండు కరుణించి భావికార్యం బప్పుడు దలంచియుఁ గొంతకాలంబునకు నరనారాయణులను నాదిమునులు నరలోకంబున దేవహితార్థం బర్జునవాసుదేవు లయి జన్మించి యాఖాండవసమీపంబున విహరింతురు వారు భవత్ప్రార్థితు లై తమ యస్త్రబలంబున నఖిలవిఘ్నంబుల నపనయించి నిరాకులంబున నీకు ఖాండవోపయోగంబు ప్రసాదింతు రనిన నగ్నిదేవుండు గరంబు సంతసిల్లి కమలజువచనం బవలంబంబుగాఁ బెద్దకాలం బుండి తద్వచనమార్గంబున నప్పుడు కృష్ణార్జునులం గని ఖాండవదహనార్థంబు ప్రార్థించిన నగ్నిదేవున కర్జునుం డి ట్లనియె.

(నా ప్రయత్నాలు విఫలమయ్యాయి - అని దుఃఖించగా బ్రహ్మదేవుడు - కొంతకాలానికి నరనారాయణులు కృష్ణార్జునులుగా ఖాండవవనం దగ్గర విహరిస్తారు. వారు నీ ఆటంకాలు తొలగిస్తారు - అనగా అగ్నిదేవుడు అలాగే వేచి ఉండి కృష్ణార్జునులను ప్రార్థించగా అగ్నిదేవుడితో అర్జునుడు ఇలా అన్నాడు.)

1_8_249 కందము వోలం - వసంత

కందము

చని ఖాండవంబుఁ గాల్పఁగ
మొనసి మహాహస్తియూథములఁ బోని ఘనా
ఘనములచే బాధితుఁ డయి
వనజజుకడ కరిగి హవ్యవాహనుఁ డనియెన్.

(అగ్నిహోత్రుడు ఖాండవవనాన్ని దహించాలనుకోగా అతడిని వర్షించే మేఘాలు బాధించగా బ్రహ్మ దగ్గరకు వెళ్లి ఇలా అన్నాడు.)

1_8_248 కందము వోలం - వసంత

కందము

ఈవ్యాధి యొంటఁ దీఱదు
దివ్యౌషధయుక్త మైన దివిజవనంబున్
హవ్యాశన భక్షింపు మ
హావ్యాధి శమంబు దాన నగు నీ కనినన్.

(దివ్యౌషధాలున్న దేవతావనాన్ని దహించటం వల్ల నీ వ్యాధిపోతుంది - అనగా.)

1_8_247 వచనము వోలం - వసంత

వచనము

శ్వేతకియుఁ దనకు దుర్వాసుండు ఋషిగణంబులతో ఋత్విజుండుగా నభిమతం బయిన సత్త్రయాగంబు సేసె న ట్లాశ్వేతకి చేసిన నిరంతరఘృతధారాకారణంబున నగ్నిదేవుండు దన కగ్నిమాంద్యంబును దేజోహీనతయు దప్పియు నైనఁ బితామహుపాలికిం జని తనశరీరస్థితి చెప్పినఁ బితామహుండును దాని నపరిమితఘృతోపయోగంబున నయిన మహావ్యాధిఁగా నెఱింగి యగ్నిదేవున కి ట్లనియె.

(ఆ యజ్ఞంలోని నేతి కారణంగా అగ్నిదేవుడికి జీర్ణశక్తి తగ్గి, కాంతి సన్నగిల్లి, దప్పిక ఎక్కువై బ్రహ్మదేవుడి దగ్గరకు వెళ్లగా, అది నేతిని అపరిమితంగా ఉపయోగించటం వల్ల కలిగిన వ్యాధిగా గ్రహించి ఇలా అన్నాడు.)

1_8_246 కందము వోలం - వసంత

కందము

ఈతఁ డనవరతయజన
ప్రీతుం డీతనికి దురితభీతునకు మనః
ప్రీతిగ నార్త్విజ్యమ్ము మ
హాతేజోధికుఁడ చేయు మని దయఁ బంచెన్.

(ఎన్నో యజ్ఞాలు చేసిన ఇతడిచేత యజ్ఞం చేయించు - అని శివుడు ఆజ్ఞాపించాడు.)

1_8_245 వచనము వోలం - వసంత

వచనము

దేవా నీప్రసాదంబున శతవార్షికసత్త్రయాగంబు చేసెద నాకు నీవు ఋత్విజుండవు గావలయు నని ప్రార్థించినం గరుణించి యాజకత్వంబు బ్రాహ్మణులకు విధిదృష్టం బగుటంజేసి దాని నొరులకుఁ జేయంగాదు గావున నింక నీవు బ్రహ్మచర్యంబునఁ బండ్రెండేండ్లు నిరంతరఘృతధారంజేసి హుతాశనుఁ దృప్తుం జేయు మనిన వాఁడును బరమేశ్వరుపంచిన విధంబున నగ్నితర్పణంబు సేసిన సంతుష్టుం డై యీశ్వరుండు వాని పాలికి వచ్చి యప్పుడ దుర్వాసు రావించి.

(దేవా! నా సత్రయాగానికి నీవు ఋత్విజుడివి కావాలి - అని ప్రార్థించగా - బ్రాహ్మణులు కాక ఇతరులు యాజకత్వం వహించకూడదు. నీవు బ్రహ్మచర్యవ్రతం పూని పన్నెండేళ్లు ఎడతెగని నేతిధారతో అగ్నిదేవుడిని తృప్తిపెట్టు - అనగా శ్వేతకి అలాగే చేశాడు. అప్పుడు శివుడు దుర్వాసుడిని రప్పించి.)

1_8_244 కందము వోలం - వసంత

కందము

శ్వేతకి నీతపమున కేఁ
బ్రీతాత్ముఁడ నయితి నీకుఁ బ్రియ మెయ్యది వి
ఖ్యాతముగ నిత్తు దానిన
యాతతమతి వేఁడు మనిన నన్నరపతియున్.

(వరం కోరుకొమ్మనగా శ్వేతకి.)

1_8_243 వచనము వోలం - వసంత

వచనము

జనమేజయునకు వైశంపాయనుం డి ట్లని చెప్పెఁ దొల్లి శ్వేతకి యనురాజర్షి ఘృతసంపూర్ణదక్షిణానేకాధ్వరుం డయి శతవార్షికసత్త్రయాగంబు సేయ సమకట్టి ఋత్విజులం బ్రార్థించిన ఋత్విజులు నేము నిరంతర క్లేశంబున కోపము నీవనవరతయజనశీలుండవు నీకు నీశ్వరుండ యాజకత్వంబు సేయనోపుంగాని యొరు లోప రని విసివి పలికిన నాతండును గైలాసంబున కరిగి కైలాసవాసు నిఖిలలోకవంద్యునిందుశేఖరునీశ్వరు నుద్దేశించి యుగ్రతపంబు సేసినఁ బరమేశ్వరుండు ప్రత్యక్షం బయి వాని కి ట్లనియె.

(అప్పుడు జనమేజయుడికి వైశంపాయనుడు ఇలా చెప్పాడు - పూర్వం ఎన్నో యజ్ఞాలు చేసిన శ్వేతకి అనే రాజర్షి సత్రయాగం చేయబోగా - మేము ఎడతెగని శ్రమకు ఓర్వలేము. నీ యజ్ఞానికి ఋత్విక్కుగా ఈశ్వరుడే ఉండగలడు - అనగా శ్వేతకి కైలాసానికి వెళ్లాడు. అక్కడ తపస్సు చేయగా శివుడు ప్రత్యక్షమై ఇలా అన్నాడు.)

-:శ్వేతకి యను రాజర్షి వృత్తాంతము:-

1_8_242 ఆటవెలది వోలం - వసంత

ఆటవెలది

ఏమి కారణమున నింద్రుఖాండవ మగ్ని
దేవుఁ డట్లు గాల్పఁ దివిరె దీని
విప్రముఖ్య నాకు వినఁగ వేడుకయయ్యె
నెఱుఁగఁ జెప్పుమయ్య యిదియు ననిన.

(ఇంద్రుడి ఖాండవవనాన్ని అగ్నిదేవుడు ఎందుకు కాల్చాలని ప్రయత్నించాడో చెప్పండి - అనగా.)

1_8_241 వచనము వోలం - వసంత

వచనము

అనిన విని జనమేజయుండు వైశంపాయనున కి ట్లనియె.

(అనగా విని జనమేజయుడు వైశంపాయనుడితో ఇలా అన్నాడు.)

1_8_240 కందము పవన్ - వసంత

కందము

అని యగ్నిదేవుఁ డయ్య
ర్జునదామోదరుల శౌర్యశోభితులఁ బ్రియం
బునఁ బ్రార్థించెను బలసూ
దనరక్షితఖాండవప్రదాహోత్సుకుఁ డై.

(అని అగ్నిదేవుడు కృష్ణార్జునులను ప్రార్థించాడు.)

1_8_239 వచనము పవన్ - వసంత

వచనము

తక్షకుం డను పన్నగేంద్రుఁ డింద్రున కిష్టసఖుం డయి ఖాండవంబునం దుండుటంజేసి దీని నమృతంబు రక్షించున ట్లతిప్రయత్నంబున నింద్రుండు రక్షించుకొనియుండు నది నిమిత్తంబుగా సర్వసత్త్వంబులు నిందు సుఖం బుండు మీరు మహాసత్త్వుల రఖిలాస్త్రవిదుల రమరేంద్రుండు గావించువిఘాతంబులు మీయస్త్రబలంబున వారింపనోపుదు రేనును దీని ననాకులంబున నుపయోగించి కృతార్థుండ నగుదు.

(తక్షకుడు ఈ ఖాండవంలో ఉండటం వల్ల ఇంద్రుడు దీనిని రక్షిస్తుంటాడు. మీరు ఇంద్రుడు కలిగించే ఆటంకాలను తొలగిస్తే నేను ఈ వనాన్ని దహించి కృతార్థుడినవుతాను.)

Thursday, December 07, 2006

1_8_238 ఆటవెలది పవన్ - వసంత

ఆటవెలది

అగ్ని నేను నాకు నాహార మయ్యింద్రు
ఖాండవంబు దీనిఁ గాల్పఁ గడఁగి
యెగువఁ బడితి ముంద రింద్రుపంచిన మహా
దారుణాంబుధరశతంబుచేత.

(నేను అగ్నిదేవుడిని. నాకు ఆహారం ఆ ఇంద్రుడి ఖాండవవనం. ఇదివరకు దీనిని కాల్చటానికి పూనుకొన్నప్పుడు ఇంద్రుడు పంపిన మేఘాలు నన్ను తరిమివేశాయి.)

1_8_237 వచనము పవన్ - వసంత

వచనము

అనిన నీ కెద్దిభోజనం బిష్టంబు దానిన పెట్టెద మడుగు మనిన వారికి నవ్విప్రుం డి ట్లనియె.

(నీకు ఏ భోజనం ఇష్టమో అదే అడుగు - అనగా వారితో అతడు ఇలా అన్నాడు.)

1_8_236 కందము పవన్ - వసంత

కందము

ఏ నమితభోజనుండ న
హీనాగ్నిబలుండ నాకు నిష్టాన్నము స
మ్మనముగఁ బెట్టుఁ డోపుదు
రేని సుతృప్తుండ నగుదు నే న ట్లయినన్.

(నేను చాలా ఆకలి గలవాడిని. మీకు చేతనైతే నాకు ఇష్టమైన అన్నం పెట్టండి.)

1_8_235 వచనము పవన్ - వసంత

వచనము

వారు న వ్విప్రు నతిభక్తిం బూజించిన వారలకు నవ్విప్రుం డి ట్లనియె.

(కృష్ణార్జునులు అతడిని పూజించగా ఆ విప్రుడు ఇలా అన్నాడు.)

1_8_234 మాలిని పవన్ - వసంత

మాలిని

అసితపథుఁడు విప్రుం డై మహాశ్రాంతలీలన్
మసృణకపిలకేశశ్మశ్రు లొప్పంగఁ దేజం
బెసఁగ ముదముతో నయ్యిద్దఱన్ డాయవచ్చెన్
వసునిభు లగు వారిన్ వాసవిన్ వాసుదేవున్.

(అప్పుడు వారి దగ్గరకు అగ్నిదేవుడు బ్రాహ్మణరూపంలో, బడలికపొందినవాడిలా వచ్చాడు.)

1_8_233 వచనము పవన్ - వసంత

వచనము

అని పురందరనందనుండు గోవిందు ననుమతంబు వడసి మిత్రామాత్యభృత్యసమేతు లయి యిద్దఱు నరిగి యథారుచి ప్రదేశంబుల విహరించుచు నొక్కనాఁడు ఖాండవవనసమీపంబున నొక్కచందనలతాభవనచంద్రకాంతవేదికయందు మందశీతలసురభిమారుతం బనుభవించుచు నిష్టకథావినోదంబుల నుండునంత.

(అని, విహరిస్తూ, ఒకరోజు ఖాండవవనానికి దగ్గరలో కూర్చొని ఉండగా.)

1_8_232 చంపకమాల పవన్ - వసంత

చంపకమాల

జలరుహనాభ రమ్యగిరిసానువనంబుల వేఁటలాడుచున్
జలుపుద మీనిదాఘదివసంబుల నీవును నేను నున్మిష
న్నలిన రజస్సుగంధి యమునాహ్రద తుంగ తరంగ సంగతా
నిలశిశిరస్థలాంతరవినిర్మితనిర్మలహర్మ్యరేఖలన్.

(మనం చల్లనైన ప్రదేశాలలో ఈ వేసవిరోజులు గడుపుదాము.)

1_8_231 వచనము పవన్ - వసంత

వచనము

అట్టి ఘర్మ దివసంబులు సహింప నోప కర్జునుం డొక్కనాఁడు కృష్ణున కి ట్లనియె.

(ఆ ఎండలు తట్టుకోలేక అర్జునుడు కృష్ణుడితో ఇలా అన్నాడు.)

1_8_230 చంపకమాల పవన్ - వసంత

చంపకమాల

ఉరుతర దావపావక శిఖోత్కలిత శ్వసనంబులున్ సితే
తరగతి తీవ్రతిగ్మ కరధామ సహస్రములున్ బహుప్రవా
హరహితనిమ్నగాతతులు నై కడుదీర్ఘము లై నిదాఘవా
సరములు సర్వజీవుల కసహ్యము లయ్యెను దారుణంబు లై.

(వేసవిలో కార్చిచ్చుమంటలు, గాడ్పులు ప్రాణులు ఓర్చుకోలేనంతగా ఏర్పడ్డాయి.)

1_8_229 కందము పవన్ - వసంత

కందము

సుతవంతు లయి విశుద్ధ
శ్రుతనయవంతు లయి పాండుసుతు లతులగుణా
న్వితులు జగజ్జన నుత వి
శ్రుతులు మహారాజ్యలీల సుఖ మున్నంతన్.

(అలా పాండవులు కొడుకులను పొంది సుఖంగా ఉండగా.)

1_8_228 వచనము పవన్ - వసంత

వచనము

అంత ద్రుపదరాజనందనయుం గ్రమంబునఁ బాండురాజనందనులవలనఁ బ్రతివింధ్య శ్రుతసోమ శ్రుతకీర్తి శతానీక శ్రుతసేను లనువారిఁ బంచోపపాండవులను సుపుత్త్రులం బడసిన.

(తరువాత ద్రౌపదికి కూడా ఉపపాండవులు జన్మించారు.)

1_8_227 మత్తకోకిల పవన్ - వసంత

మత్తకోకిల

ఆదిఁగోలెను గృష్ణుచే దయ నావృతుం డయి ధౌమ్యుతో
వేద మంగయుతంబుగాఁ జదివెన్ ధనంజయుతో ధను
ర్వేద మిమ్ముగ నభ్యసించెఁ బ్రవీరవైరిపతాకినీ
భేదమార్గము లెల్ల నేర్చె నభేద్యవిక్రమసంపదన్.

(అభిమన్యుడు ఎన్నో విద్యలను నేర్చుకొన్నాడు.)

1_8_226 వచనము పవన్ - వసంత

వచనము

ఇ ట్లుదయించిన యభిమన్యుండు దల్లిదండ్రులకు సకల జనులకు నానందం బొనరించుచు ధౌమ్య నిర్మిత జాతకర్మ చౌలోపనయనుం డయి పెరుఁగుచు.

(అభిమన్యుడికి ధౌమ్యుడు జాతకర్మనూ, ఉపనయనాన్నీ చేయగా.)

1_8_225 చంపకమాల పవన్ - వసంత

చంపకమాల

సుతజననోత్సవంబున విశుద్ధయశుండు యుధిష్ఠిరుండు సం
భృతహృదయప్రమోదుఁ డయి పెంపున నిచ్చె సువర్ణభూషణ
ప్రతతులు గోధనాయుతము బ్రాహ్మణముఖ్యులకున్ నిరంతర
వ్రతులకు వేదవేదులకు వారిజసంభవునట్టివారికిన్.

(అభిమన్యుడు పుట్టినప్పుడు జరిపిన పండుగలో ధర్మరాజు ఎన్నో దానాలు చేశాడు.)

1_8_224 ఉత్పలమాల పవన్ - వసంత

ఉత్పలమాల

ధన్యుల కా సుభద్రకు శతక్రతు పుత్ర్త్రున కుద్భవించె స
మ్మాన్య యశుండు పుత్త్రుఁ డభిమన్యుఁడు వైన్యనిభుం డనన్యసా
మాన్యపరాక్రమప్రబలమాన్యుఁడు పుణ్యచరిత్రుఁ డన్యరా
జన్యభయంకరుండు రణశౌర్యుఁడు పాండవవంశకర్త యై.

(సుభద్రార్జునులకు పాండవవంశాన్ని నిలిపే కుమారుడు జన్మించాడు.)

-:అభిమన్యు ప్రభృతుల జననము:-

1_8_223 వచనము పవన్ - వసంత

వచనము

మఱియు బలదేవాభియాదవముఖ్యు లెల్ల సుభద్రార్జునులం బూజించి పాండవులచేతం బ్రతిపూజితు లై ద్వారవతికిం జని రుపేంద్రుం డింద్రనందనుతోడి యిష్టవినోదంబుల నింద్రప్రస్థపురంబున నుండె నంత.

(బలరాముడు, యాదవులు సుభద్రార్జునులను పూజించి ద్వారకకు వెళ్లారు. కృష్ణుడు అర్జునుడితో కలిసి ఇంద్రప్రస్థంలో ఉండగా.)

1_8_222 కందము పవన్ - వసంత

కందము

క్రమమునను గొంతిదేవిని
యమనందను భీముఁ గవల నాద్రౌపది ను
త్తమరత్నాభరణాదుల
నమరఁగ వేర్వేఱ నెయ్యుఁ డయి పూజించెన్.

(కుంతిని, ధర్మరాజును, భీముడిని, కవలలను, ద్రౌపదిని కానుకలతో పూజించాడు.)

1_8_221 సీసము + ఆటవెలది పవన్ - వసంత

సీసము

అవిరళక్షరితదానార్ద్రగండస్థల
గజసహస్రంబును గనకరత్న
రచిత మై తురగసారథిసహితం బైన
రథసహస్రంబును రమ్యభూష
ణాలంకృతస్త్రీసహస్రంబుఁ గాంచన
శిబికాసహస్రంబుఁ జిత్రలలిత
గతి నొప్పు నేనూఱుగాడిదలను సింధు
బాహ్లికకాంభోజపారసీక

ఆటవెలది

జాత మైన తురగశతసహస్రము లక్ష
గోధనంబు నధికఘోరవీర
దర్పయుక్తు లైన దశలక్షదాశార్హ
వరుల నరణ మిచ్చె వామనుండు.

(ఇంకా ఎన్నో కానుకలను కృష్ణుడు అరణంగా ఇచ్చాడు.)

1_8_220 వచనము పవన్ - వసంత

వచనము

మఱియును.

(అంతేకాక.)

1_8_219 కందము పవన్ - వసంత

కందము

నిరుపమపరార్థ్యరుచి సుం
దరరత్నావళులశోభితము లగువానిన్
వరదుఁడు సహస్రసంఖ్యా
భరణంబులఁ బార్థునకు సుభద్రకు నిచ్చెన్.

(కృష్ణుడు ఎన్నో ఆభరణాలను అర్జునుడికి, సుభద్రకు ఇచ్చాడు.)

1_8_218 వచనము పవన్ - వసంత

వచనము

అంత.

(అప్పుడు.)

Wednesday, December 06, 2006

1_8_217 ఉత్పలమాల పవన్ - వసంత

ఉత్పలమాల

ఆనకదుందుభిప్రభృతియాదవులుం గురుముఖ్యులున్ మృదం
గానకదుందుభుల్ సెలఁగ నత్యనురాగముతో నిరంతర
శ్రీనుతు లొప్ప నుత్సవము సేసిరి సప్తదినంబు లిష్టస
మ్మానములన్ మహీసురసమాజసమీహితపూజనంబులన్.

(యాదవులు, కురువంశప్రముఖులు ఆనందంగా ఏడురోజులు పండుగ చేశారు.)

1_8_216 వచనము పవన్ - వసంత

వచనము

వసుదేవాది యాదవవృద్ధుల కెల్ల మ్రొక్కి బలదేవ వాసుదేవ సాత్యకి సారణ ప్రద్యుమ్నాదుల నుచితప్రియపూర్వకంబున సత్కృతులం జేసిన.

(వారిని గౌరవించి.)

1_8_215 సీసము + ఆటవెలది పవన్ - వసంత

సీసము

బలదేవ సాత్యకి ప్రద్యుమ్న వసుదేవు
లాదిగా బెరసిన యాదవాగ్ర
గణ్యులుఁ దాను నగణ్యమహావస్తు
వాహనంబులు గొని వాసుదేవుఁ
డనుజకు నరణమీ నర్థితోఁ జనుదెంచె
హరి రాక యెఱిఁగి ధర్మాత్మజుండు
గరము గారవమునఁ గవలను గృష్ణున
కెదురు పుత్తెంచిన నింద్రలీల

ఆటవెలది

నిందువంశవిభుఁ డుపేంద్రుఁ డింద్రప్రస్థ
పురము సొచ్చె నతివిభూతి మెఱసి
యనుజవరులతోడ నంతఁ బ్రత్యుద్గతుం
డై యుధిష్ఠిరుండు హర్ష మెసఁగ.

(కృష్ణుడు యాదవులతో కలిసి ఇంద్రప్రస్థానికి రాగా ధర్మరాజు తమ్ములతో ఎదురువచ్చి.)

-:శ్రీకృష్ణబలదేవాదులు పాండవులకుఁ గానుకలు తెచ్చియిచ్చుట:-

1_8_214 కందము పవన్ - వసంత

కందము

చెలియలు మఱఁదియుఁ జని యి
మ్ముల నింద్రప్రస్థనగరమున నభిమతబం
ధులయొద్ద నున్నవా రని
జలశయనుఁడు విని కరంబు సంతుష్టుం డై.

(సుభద్ర, అర్జునుడు ఇంద్రప్రస్థంలో బంధువులతో సుఖంగా ఉన్నారని విని కృష్ణుడు సంతోషించి.)

1_8_213 వచనము పవన్ - వసంత

వచనము

ఇట్లు ద్రోవదిచేత దీవనలు సేకొని కుంతీదేవియొద్ద సుభద్ర యున్నంత నట యర్జునుండును నసంఖ్యాకదాశార్హసైన్యసమేతుం డై యనేకబ్రాహ్మణాశీర్వాదంబు లెసంగ నింద్రప్రస్థపురంబుం బ్రవేశంబుసేసి ధౌమ్యునకు ధర్మరాజునకు భీమునకుఁ గుంతీదేవికి మ్రొక్కి తనకు మ్రొక్కిన కవలం గౌఁగిలించుకొని పరమానందంబున నుండు నంత.

(అలా సుభద్ర అందరికీ మొక్కి ఆనందంగా ఉండగా.)

1_8_212 తేటగీతి పవన్ - వసంత

తేటగీతి

పంకజాక్షి నీపతి ప్రతిపక్షవీర
విజయుఁ డయ్యెడు నీవును వీరపుత్త్ర
జనని వగు మని దీవించె సంతసంబు
తోడ వసుదేవపుత్త్రి నాద్రుపదపుత్త్రి.

(నీ భర్త శత్రుపక్షవీరవిజయుడు అగు గాక - అని ద్రౌపది సుభద్రను దీవించింది.)

1_8_211 వచనము పవన్ - వసంత

వచనము

మన మివ్విధంబునఁ జనునప్పుడు నిన్నుఁ జూచి ద్రుపదరాజపుత్త్రి యప్రియంబులు వలుకునో యప్పరమ పతివ్రతపలుకు నిక్కువం బగుం గావున నీవేకతంబ గోపాలబాలికలతో ముందఱ నరిగి యక్కోమలిం గను మని పనిచిన సుభద్రయు నిజేశ్వరుపంచిన మార్గంబున నింద్రప్రస్థపురంబునకుం బోయి కుంతీదేవికి ద్రౌపదికి మ్రొక్కిన.

(మనం కలిసి వెడితే ద్రౌపది పరుషంగా మాట్లాడుతుందేమో. కాబట్టి నీవు ముందుగా వెళ్లి ఆమెను చూడు - అనగా సుభద్ర అలాగే ఇంద్రప్రస్థపురానికి వెళ్లి కుంతీదేవికి, ద్రౌపదికి మొక్కగా.)

1_8_210 ఆటవెలది ప్రకాష్ - వసంత

ఆటవెలది

ఘనభుజుండు నరుఁడు దనతొఱ్ఱుపట్టుల
విశ్రమించి భువనవిశ్రుతుండు
మతిఁ దలంచి యాత్మహిత మగు నట్లుగా
నిష్టమున సుభద్ర కిట్టు లనియె.

(తన ఆలమందలున్న చోట విశ్రమించి, సుభద్రతో ఇలా అన్నాడు.)

1_8_209 వచనము ప్రకాష్ - వసంత

వచనము

ఇ ట్లింద్రప్రస్థపురంబున కభిముఖుం డై యానర్తకదేశంబులకుం జని యందు ముందఱ ముకుందప్రేషితు లయిన దాశార్హవీరులతో నగణ్యారణ్యంబులు గడచుచుఁ బుణ్యతీర్థంబుల నాడుచు నానాజనపదంబుల విహరించుచు వచ్చి యింద్రప్రస్థపురసమీపంబున.

(అలా అర్జునుడు సుభద్రతో వస్తూ ఇంద్రప్రస్థపురానికి సమీపంలో.)

1_8_208 సీసము + ఆటవెలది ప్రకాష్ - వసంత

సీసము

భరతకులాగ్రణి పాండవసింహంబు
సర్వధర్మజ్ఞుఁ డాసవ్యసాచి
దనమేనమఱఁదలి ధవళాక్షిఁ దోడ్కొని
చనియె నాతని కది చనదె చెపుఁడ
యప్పార్థుపిఱుఁద మీ రరుగంగ వాఁ డంత
యశ్రమసాధ్యుఁడె యాహవమున
నఖిలాస్త్రవిదుఁడు ద్రోణాచార్యశిష్యుండు
జితకాశి యని వానిఁ జెప్ప వినరె

ఆటవెలది

వలవ దుడుగుఁ డనిన వామను పలుకను
వేలఁ గడవదయ్యె వృష్ణిభోజ
యాదవాంబురాశి యట ధనుంజయుఁ డవి
జేయుఁ డభిమతార్థసిద్ధిఁ బొంది.

(అర్జునుడు తన మేనమరదలిని తీసుకువెళ్లటం తగదా? అతడిని యుద్ధంలో ఓడించటం అంత సులభమా? - అనగా కృష్ణుడి మాటలు అనే చెలియలికట్టను యాదవులనే సముద్రం దాటలేకపోయింది. అర్జునుడు తాను కోరినదానిని పొందాడు.)

1_8_207 కందము ప్రకాష్ - వసంత

కందము

నీ వెఱుఁగకుండ గర్వము
తో విజయుఁడు దా సుభద్రఁ దోడ్కొని బలిమిం
బోవఁగ నంతసమర్థుఁడె
నావుడుఁ గృష్ణుండు రామునకు ని ట్లనియెన్.

(నీకు తెలియకుండానే సుభద్రను బలవంతంగా తీసుకువెళ్లగల సమర్థుడా అర్జునుడు! - అని అడగగా కృష్ణుడు ఇలా అన్నాడు.)

1_8_206 వచనము ప్రకాష్ - వసంత

వచనము

అని విజృంభించి విలయసమయ సముద్ధూత వారాశియుంబోలె ఘూర్ణిల్లుచున్న యాదవవీరుల వారించి వాసుదేవుం జూచి బలదేవుం డి ట్లనియె.

(అంటూ ఉన్న యాదవవీరులను ఆపి కృష్ణుడితో బలరాముడు ఇలా అన్నాడు.)

1_8_205 మత్తకోకిల ప్రకాష్ - వసంత

మత్తకోకిల

ఏల పార్థుపరాక్రమంబు సహింప నాతనినాహవ
వ్యాలు నిప్పడ పట్టి తెత్తము వాతధూతదవానల
జ్వాలకున్ వనరాశివేల కసంఖ్యయాదవసేనకున్
దేలిపోవక చక్కనయ్యెడు ధీరు లెవ్వరు పోరిలోన్.

(యుద్ధంలో పొగరుపట్టిన ఏనుగు వంటి అతడిని పట్టుకొని వద్దాము. యాదవసేనను ఎదిరించగల ధీరులెవరు?)

1_8_204 కందము ప్రకాష్ - వసంత

కందము

యాదవుల నాదరింపక
యాదవిఁ దోడ్కొని కిరీటి యరిగెను గంభీ
రోదధిఁ గరముల నీఁదం
గాదనక కడంగె నధిక గర్వోద్ధతుఁ డై.

(యాదవులను లెక్కపెట్టక అర్జునుడు సుభద్రను తీసుకువెళ్లాడు. గర్వంతో ఈ పనికి పూనుకొన్నాడు.)

1_8_203 వచనము ప్రకాష్ - వసంత

వచనము

అంత సభాపాలుండు ప్రబల జలధర ధ్వాన గంభీరభేరీధ్వనిచే నర్జునుపరాక్రమం బెఱింగించిన దాని విని యంతర్ద్వీపంబున నున్న బలదేవాదియాదవులందఱు నాక్షణంబ పురంబునకు వచ్చి సభాసీసు లయి.

(ఈ విజయం గురించి విని అంతర్ద్వీపంలో ఉన్న బలరాముడు యాదవులతో ద్వారకకు వచ్చి సభ చేసి.)

1_8_202 కందము ప్రకాష్ - వసంత

కందము

అమరేంద్రసుతుఁడు దనకుం
గమలాక్షి సుభద్ర రథముఁ గడపఁగ ననిలో
నమిత యదుసైన్యముల న
శ్రమమున నోడించి లబ్ధ జయుఁ డయి యరిగెన్.

(సుభద్ర రథం నడుపుతూ ఉండగా అర్జునుడు ఆ సైన్యాలను సులభంగా ఓడించి వెళ్లాడు.)

1_8_201 చంపకమాల ప్రకాష్ - వసంత

చంపకమాల

హరితనయుండు పార్థుఁడు రయంబున నందఱ నాహవక్రియా
విరతులఁ జేసి యప్పురమువీధుల వేదుల రమ్యహర్మ్యగో
పురములఁ దద్గిరీంద్రమణిభూముల భూరితటాకపంకజా
కరనవనందనావళులఁ గాండమయంబులఁ జేసె నీసునన్.

(అర్జునుడి వెంటనే ఆ సైనికులు యుద్ధం విరమించుకొనేలా చేసి ఆ ప్రదేశాలను బాణాలతో నింపాడు.)

1_8_200 కందము ప్రకాష్ - వసంత

కందము

వీఁకఁ బఱతెంచి నలుగడఁ
దాఁకినఁ గడు నలిగి ఘోరతరశరహతి న
మ్మూఁకలు విరియఁగ నర్జునుఁ
డాఁకరమున నేసె నుగ్రుఁ డయి రణభూమిన్.

(వారు ముట్టడించగా అర్జునుడు ఆ సేనలు చెదిరిపోయేలా బాణాలు ప్రయోగించాడు.)

1_8_199 ఉత్పలమాల ప్రకాష్ - వసంత

ఉత్పలమాల

వీరుఁడు వీఁడు పాండవుఁడు వృష్ణికులోత్తము లైన సీరిదై
త్యారు లెఱుంగకుండఁగ మహారథుఁ డై తరుణిన్ సుభద్ర నం
భోరుహనేత్రఁ దోడ్కొనుచుఁ బోయెడి నీతనిఁ బోవనిచ్చినన్
ధీరుఁడు మాధవుండు బలదేవుఁడు నల్గుదు రంచు నడ్డ మై.

(సుభద్రను తోడ్కొనిపోతున్న వీడిని ఆపకపోతే బలరామకృష్ణులు కోపగించుకొంటారని అడ్డగించి.)

1_8_198 కందము ప్రకాష్ - వసంత

కందము

హరి పంచిన మార్గంబునఁ
గురువిభుడు సుభద్రఁ దోడుకొని చనునెడఁ ద
త్పురపరిరక్షకు లతిభీ
కరులు పృథుశ్రవసుఁ డాదిగాఁ గలవీరుల్.

(అలా అర్జునుడు సుభద్రను తోడ్కొని వెడుతుండగా ద్వారకకు కాపలాగా ఉన్న వీరులు.)

1_8_197 వచనము ప్రకాష్ - వసంత

వచనము

ఇట్లు నారాయణుండు నిజారంభంబు సఫలం బగుటకు సంతసిల్లి సంప్రాప్తమనోరథుం డయిన యప్పార్థుం గౌఁగిలించుకొని యక్షయబాణతూణీరబాణాసనసనాథం బయి పవనజవనహయంబులం బూన్చిన యక్కాంచనరథం బెక్కి సుభద్రం దోడ్కొని యింద్రప్రస్థపురంబున కరుగు మని పంచి యనంతరం బంతర్ద్వీపంబున కరిగిన.

(తన ప్రయత్నం సఫలం అయినందుకు కృష్ణుడు సంతోషించి - ఈ రథం ఎక్కి సుభద్రతో ఇంద్రప్రస్థానికి వెళ్లు - అని పంపి తాను కూడా అంతర్ద్వీపానికి వెళ్లగా.)

1_8_196 మాలిని ప్రకాష్ - వసంత

మాలిని

నరునకు దయ ని ట్లానంద మొందించి యింద్రుం
డరిగె దివికి దివ్యానంతరత్నాంశుజాల
స్ఫురితసురవిమానంబుల్ నభోభాగ మెల్ల
న్మెరసి వెలుఁగుచుండన్ నిర్జరశ్రేణితోడన్.

(ఇంద్రుడు తరువాత దేవతలతో కలిసి స్వర్గలోకానికి వెళ్లాడు.)

1_8_195 తరువోజ ప్రకాష్ - వసంత

తరువోజ

అనిమిషప్రభుఁడు నిజాత్మజు ననఘు నర్జునుఁ బ్రీతితో నభిషిక్తుఁ జేసి
మనుజేంద్రుఁ గాంచనమణిమయోత్తుంగ మకుటవిభూషమస్తకుఁ జేసి
యనుపమకేయూరహారాదిభూష ణాభిశోభితుఁ జేసి యప్పు డానంద
జనితాంబుకణికార్ద్రచక్షుస్సహస్ర జలరుహంబులు దాల్చె సమ్మదం బెసఁగ.

(ఇంద్రుడు అర్జునుడిని అభిషేకించాడు.)

1_8_194 వచనము ప్రకాష్ - వసంత

వచనము

ఇట్లు వాసుదేవుండు వసుదేవాక్రూరసారణసాంబసాత్యకిసహితంబుగా నంతర్ద్వీపంబుననుండి వచ్చిన యనంతరంబ యమరావతినుండి యమరసిద్ధసాధ్యమునిగణపరివృతుం డై యమరేంద్రుండు వచ్చె నంత బృహస్పతి యిచ్చిన యుత్తమలగ్నంబున నగ్నియమనిరృతివరుణవాయుధనదేశానాదిసురవరులు నత్రిభృగునారదవసిష్ఠవామదేవప్రభృతిమహామునులను సదస్యులుగాఁ గశ్యపప్రజాపతి హోమకర్తగా నరుంధతియు శచియు సత్యభామయు రుక్మిణియు నప్సరోగణంబులతోడం బురంధ్రీకార్యంబులు నిర్వహింప సుభద్రార్జునుల వివాహమహోత్సవం బతిరమ్యం బయ్యె నంత.

(దేవతలు, యాదవులు ఉండగా వారి వివాహం చూడముచ్చటగా జరిగింది. అప్పుడు.)

-:అర్జునుండు సుభద్రను వివాహంబగుట:-

1_8_193 కందము ప్రకాష్ - వసంత

కందము

హరిఁ దలఁచె సుభద్ర పురం
దరుఁ దలఁచె ధనంజయుండు దడయక వార
య్యిరువురఁ బెండిలి సేయఁగ
వరదులు తద్ద్వారవతికి వచ్చిరి ప్రీతిన్.

(వారి పెళ్లిచేయటానికి కృష్ణుడు, ఇంద్రుడు ద్వారకకు వచ్చారు.)

1_8_192 కందము ప్రకాష్ - వసంత

కందము

తగఁగ వివాహం బెన్నం
డగునొకొ యెన్నండు సంగమావాస్తియు మా
కగునొకొ యని యెడఁ గోరుచు
నొగి నిట యండిరి సుభద్రయును విజయుండున్.

(వివాహం ఎప్పుడు జరుగుతుందో అని అనుకొంటూ సుభద్రార్జునులు ద్వారకలో ఉన్నారు.)

1_8_191 కందము ప్రకాష్ - వసంత

కందము

అం దమరబృందవంద్యున
కిందుకళాభరణునకు నుమేశ్వరునకు నా
నందం బొందఁగ నందఱ
నందకధరుఁ డుత్సవం బొనర్పఁగఁ బంచెన్.

(అంతర్ద్వీపంలో శివుడికి ఉత్సవం చేయండి - అని కృష్ణుడు అందరినీ ఆజ్ఞాపించాడు.)

1_8_190 వచనము ప్రకాష్ - వసంత

వచనము

అయ్యిరువుర యన్యోన్యప్రణయంబులు దనదివ్యజ్ఞానంబునం జేసి దివ్యపురుషుండు పురుషోత్తముం డెఱింగి యర్జునునకు భోజనవిధు లమర్ప రుక్మిణీదేవిం బంచి యొక్కనాఁ డేకాంతంబున దేవకీ వసుదేవప్రద్యుమ్న సాంబసంకర్షణసారణసాత్యకులకు నర్జును స్థితియును నాతనియందు సుభద్రనెయ్యంబును నెఱింగించి తమతొల్లింటి విచారంబున కనుగుణం బగుటకు సంతసల్లి బలదేవాదు లెఱుంగకుండ సుభద్రార్జునుల వివాహంబు సేయ సమకట్టి తమ నిశ్చయం బయ్యిరువురకుం జెప్పి పశుపతిపూజా మహోత్సవవ్యాజ్యంబున నఖిలయాదవభోజాంధకవృష్ణివరులతో నంతర్ద్వీపంబునకుం జని.

(కృష్ణుడు బలరాముడికి తెలియకుండా వారి వివాహం చేయటానికి నిశ్చయించాడు. శివపూజ నెపంతో అంతర్ద్వీపానికి వెళ్లి.)

1_8_189 తేటగీతి ప్రకాష్ - వసంత

తేటగీతి

నన్ను నీ నర్హు లెల్ల నిం దున్నవారు
వార యెఱిఁగి చేయుదురు వివాహ మనుచు
వనజనేత్ర యంతఃపురంబునకుఁ జనియె
నరిగెఁ దన లతాగృహమున కర్జునుండు.

(నన్ను ఇవ్వటానికి అర్హులైనవారంతా ఇక్కడే ఉన్నారు. వాళ్లే తెలుసుకొని వివాహం చేస్తారు - అని సుభద్ర అంతఃపురానికి వెళ్లింది. అర్జునుడు తన పొదరింటికి వెళ్లాడు.

1_8_188 వచనము ప్రకాష్ - వసంత

వచనము

బ్రాహ్మంబు మొదలగాఁగల యెనిమిదివివాహంబులయందును గాంధర్వ రాక్షసంబులు క్షత్త్రియులకు నుత్తమ వివాహంబులు గావున నిది గాంధర్వ వివాహంబున కవసరం బనిన సుభద్ర లజ్జావనత వదన యయి.

(ఎనిమిది రకాల వివాహాలలో ఇది గాంధర్వవివాహానికి తగిన సమయం.)

1_8_187 సీసము + ఆటవెలది ప్రకాష్ - వసంత

సీసము

అమరావతికి నెనయనఁగ నివ్వసుమతిఁ
బరఁగు నింద్రప్రస్థపురవరంబు
చూచితిరే పాండుసుతు లందు సుఖ మున్న
వారె మాయత్త యంభోరుహాక్షి
కుంతీమహాదేవి కుశలయే యమ్మహా
వీరుఁ డర్జునుఁడు జితారి తీర్థ
గమనోత్సుకుం డయ్యెఁ గ్రమ్మఱి వచ్చెనే
యెఱుఁగుదురేని నా కెఱుఁగఁ జెప్పుఁ

ఆటవెలది

డనిన నేన చూవె యయ్యర్జునుండ నీ
యొద్ద నివ్విధమున నున్నవాఁడఁ
దరుణి నీకు నాకు ధరుణీధరుం డను
జలజభవుఁడు సేసె సంగమంబు.

(ఇంద్రప్రస్థపురాన్ని మీరు చూశారా? అందులో పాండవులు సుఖంగా ఉన్నారా? మా అత్త కుంతీదేవి కుశలమా? అర్జునుడు తీర్థయాత్రలనుండి తిరిగివచ్చాడా? - అని అడిగింది. అందుకు అర్జునుడు - నేనే అర్జునుడిని. శ్రీకృష్ణుడు అనే బ్రహ్మ నిన్నూ నన్నూ కలిపాడు.)

1_8_186 వచనము ప్రకాష్ - వసంత

వచనము

మునీంద్రా నీ యాడని తీర్థంబులుం జూడని పురంబులు నెఱుంగని రాజ కులంబును లే వని విచారింతు.

(మునీంద్రా! నీవు స్నానం చేయని పుణ్యతీర్థాలూ, చూడని పట్టణాలూ, తెలియని రాజవంశాలూ లేవని అనుకొంటాను.)

1_8_185 సీసము + ఆటవెలది ప్రకాష్ - వసంత

సీసము

అలినీలకుంతలుం డనియును హరినీల
సమవర్ణుఁ డనియు నాజానులంబి
తాయతస్థిరబాహుఁ డనియును రక్తాంత
నలినదళాకారనయనుఁ డనియు
నుత్తుంగఘనవిశాలోరస్కుఁ డనియును
గవ్వడి యనియును గరము వేడ్క
వివ్వచ్చు నెప్పుడు వినియెడునది దన
వినియట్ల యతిఁ జూచి వీఁడు విజయుఁ

ఆటవెలది

డొక్కొ యనుచు సంశయోపేతచిత్త యై
యుండి యుండ నోప కొక్కనాఁడు
భోజనావసానమున నున్న యమ్ముని
కిందువదన ప్రీతి నిట్టు లనియె.

(అర్జునుడి గురించి ఎప్పుడూ వినే సుభద్ర, తాను విన్న విధంగానే ఉన్న ఆ యతిని చూసి, ఇతడు అర్జునుడో ఏమో అని అనుమానించి, ఒకరోజు భోజనం చివర అతడితో ఇలా అన్నది.)

1_8_184 వచనము ప్రకాష్ - వసంత

వచనము

మఱియును.

(అంతేకాక.)

1_8_183 చంపకమాల ప్రకాష్ - వసంత

చంపకమాల

అలయక నాఁడు నాఁటికి లతాంగి యపూర్వము లైన భోజనం
బులు గడుభక్తిఁ బెట్టుచు నపూర్వము లైన వపుర్విలాసయు
క్తులు వెలయించుచున్ ముదముతోఁ బెనిచెన్ మఱి నాఁడునాఁటి క
గ్గల మగుచుండ నెయ్యమును గామవికారము సవ్యసాచికిన్.

(సుభద్ర రోజూ అర్జునుడికి భోజనం పెడుతూ, హొయలు ప్రదర్శిస్తూ అర్జునుడిలో స్నేహాన్నీ, కామవికారాన్నీ పెంచింది.)

1_8_182 కందము ప్రకాష్ - వసంత

కందము

ధీరుఁడు యతి రూపంబున
నారఁగ నిందున్నయాతఁ డర్జునుఁ డని స
త్యారుక్మిణులకుఁ జెప్పె ము
రారాతి రహస్యమున ననంత ప్రీతిన్.

(ఇక్కడ యతిరూపంలో ఉన్నది అర్జునుడు - అని కృష్ణుడు సత్యభామకు, రుక్మిణికి రహస్యంగా చెప్పాడు.)

1_8_181 కందము ప్రకాష్ - వసంత

కందము

అందు ధృతమందరుండు పు
రందర నందనుఁడు దనకు రమణి గుణశ్రీ
సుందరి సుభద్ర నెయ్యం
బొందఁగఁ బరిచర్య సేయుచుండఁగ నుండెన్.

(సుభద్ర సేవచేస్తూ ఉండగా అర్జునుడు ఆ అంతఃపురంలో ఉన్నాడు.)

-:అర్జునుండు యతిరూపంబున కన్యాపురంబున నుండుట:-

1_8_180 వచనము విజయ్ - విక్రమాదిత్య

వచనము

నీవు సుభద్రయందు బద్ధానురాగుండ వగుట తొల్లియు నే నెఱుంగుదు నోడకుండుము నీ కోర్కి వసుదేవ దేవకీ దేవులకుం జెప్పి సఫలంబు సేయుదు నని యర్జునునకు హృదయానందంబుగాఁ బలికి యప్పుడ వడిగల చారుల రావించి ద్వారవతియం దర్జునుం డున్న వాఁ డనుకుశలవార్త ధర్మజున కెఱింగింప నింద్రప్రస్థపురంబునకురి బుచ్చియున్నంత నచ్చటికి వచ్చి బలదేవాది యాదవు లతిభక్తు లై యతియకా వగచి యర్జునునకు నమస్కరించి యాతనివలన సర్వతీర్థంబులుఁ దత్సేవాఫలంబులును విని సంతసిల్లి యి వ్వర్షాకాలంబు మాయంద యుండి చాతుర్మాస్యంబు సేసి మమ్ముం గృతార్థులం జేయుం డని ప్రార్థించి పార్థుం దోడ్కొని చని వానికి నన్నపానాది విధులం బరిచరింప సుభద్రం బంచి కన్యాపురంబునందు నివాసంబు సేసిన.

(నీకు సుభద్రమీద అనురాగం ఉందని నాకు ముందే తెలుసు. భయపడకు. నీ కోరిక వసుదేవుడికీ, దేవకీదేవికీ చెప్పి సఫలం చేస్తాను - అని చెప్పాడు. తరువాత అర్జునుడు ద్వారకలో ఉన్నాడన్న విషయం ధర్మరాజుకు చెప్పటానికి వేగులను పంపాడు. అప్పుడే బలరాముడితో యాదవులు వచ్చి, అర్జునుడిని యతిగా భావించి - ఈ వర్షాకాలం ఇక్కడే ఉండండి - అని ప్రార్థించి అతడి సేవ కోసం సుభద్రను నియోగించి కన్యాంతఃపురంలోనే ఉండటానికి ఏర్పాటు చేయగా.)

1_8_179 ఉత్పలమాల వోలం - వసంత

ఉత్పలమాల

దాని సుభద్రఁగా నెఱిఁగి తత్క్షణజాతమనోజసంచల
న్మానసుఁ డైన యవ్విజయు మానుగఁ జూచి మునీంద్ర నీకుఁ జ
న్నే నలినాక్షులందు మది నిల్పఁగ నంచును మందహాసగ
ర్భాననుఁ డై రథాంగధరుఁ డాతని కి ట్లనియెం బ్రియంబునన్.

(ఆమె సుభద్ర అని తెలుసుకొని మనసు చలించిన అర్జునుడిని చూసి కృష్ణుడు - మునీంద్రా! స్త్రీల మీద మనసు నిలపటం ఉచితమేనా - అని చిరునవ్వుతో ఇలా అన్నాడు.)

1_8_178 చంపకమాల వోలం - వసంత

చంపకమాల

క్వణదణుకింకిణీకలితకాంచనకాంచికలాపమున్ రణ
న్మణికలనూపురంబులు సమధ్వని నొప్పఁగ భక్తిఁ బాదచా
రిణి యయి కన్యకాజనపరీత సుభద్ర తదద్రిపూజన
ప్రణతులు సేసె నింద్రసుతుఁ బార్థు నిజేశ్వరుఁగాఁ దలంచునున్.

(సుభద్ర అర్జునుడిని భర్తగా తలచుకొంటూ రైవతకాద్రిని పూజించింది.)

1_8_177 వచనము వోలం - వసంత

వచనము

ఇ ట్లరిగి జనార్దనుండు ధనంజయుం దలంచి తత్సమీపగతుం డై తోడ్కొని యాతనికి న ప్పర్వత రమణీయ ప్రదేశంబులం జూపుచు విహరించి యిద్దఱు నొక్కవిమలమణివేదికయం దభిమతసంభాషణంబుల నుండు నంత.

(అర్జునుడికి ఆ పర్వతంలోని అందమైన ప్రదేశాలను చూపుతూ విహరించాడు. తరువాత వారిద్దరూ మాట్లాడుకుంటూ ఉండగా.)

1_8_176 సీసము + ఆటవెలది వోలం - వసంత

సీసము

సారణ సత్య కాక్రూర విదూరథ
సాంబ సంకర్షణ శంబరారి
భాను సుషే ణోగ్రసేన శైనే యాని
రుద్ధ హార్దిక్య గ దోద్ధవాది
యాదవు లధికప్రమోదు లై యొక్కటఁ
దరుణులు దారును గరికరేణు
హయశిబికారూఢు లయి తదుత్సవమున
కరిగిరి మఱి జగద్గురుఁడు గృష్ణుఁ

ఆటవెలది

డింద్రలీలతో నుపేంద్రుండు రుక్మిణీ
దేవి మొదలుగాఁగ దేవు లెల్ల
నొప్పుతోడ రాఁగ నప్పర్వతమునకుఁ
జనియె సకలజనులుఁ దనకు నెరఁగ.

(యాదవులందరూ ఆ ఉత్సవానికి వెళ్లారు. కృష్ణుడు కూడా తన భార్యలతో రైవతకాద్రికి వెళ్లాడు.)

Tuesday, December 05, 2006

1_8_175 చంపకమాల వోలం - వసంత

చంపకమాల

గురు కుచ యుగ్మముల్ గదలఁ గ్రొమ్ముడులందుల పుష్పముల్ పయిం
దొరఁగ నిదాఘబిందువితతుల్ చెదరన్ మదిరామదంబునన్
బరవశ లయ్యు నింపెసఁగఁ బాడుచుఁ దాళము గూడ మెట్టుచుం
దరుణియ లొప్పు నాడిరి ముదంబునఁ దమ్ము జనాలి మెచ్చఁగన్.

(యౌవనంలో ఉన్న స్త్రీలు నాట్యం చేశారు.)

1_8_174 చంపకమాల వోలం - వసంత

చంపకమాల

పొలుపుగఁ బూసి కట్టి తొడిభూరివిభూతిప్రకాశితంబుగాఁ
గలయఁగఁ దత్పురీజనులు కాంస్యమృదంగముకుందవేణుకా
హలపటహధ్వనుల్ చెలఁగ నాటలుఁ బాటలు నొప్పె నెల్లవా
రలుఁ జని చేసి రర్చనలు రైవతకాద్రికి నుత్సవంబుతోన్.

(ప్రజలంతా ఆటపాటలతో రైవతకాద్రికి ఊరేగింపుగా వెళ్లి అక్కడ పూజలు చేశారు.)

1_8_173 వచనము వోలం - వసంత

వచనము

ఇట్లు పరమపురుషు లయిన నరనారాయణులు దమ పూర్వజన్మ సహవాసంబున య ట్లప్పుడు పరమానందంబునఁ బరస్పరప్రియమధురసంభాషణంబుల నొక్కటనుండి యారాత్రి సలిపి రంతఁ బ్రభాతంబ వాసుదేవుండు వాసవనందను నంద యుండం బంచి కాంచనరథారూఢుం డయి పురంబునకుం జని పౌరజనప్రధానసమక్షంబున రైవతకమహోత్సవంబు ఘోషింపం బంచిన.

(వేకువనే కృష్ణుడు అర్జునుడిని అక్కడనే ఉండమని చెప్పి తాను ద్వారకకు వెళ్లి రైవతక మహోత్సవాన్ని చాటించటానికి ఆజ్ఞాపించాడు.)

1_8_172 కందము వోలం - వసంత

కందము

శ్రీపతి గడునెయ్యంబున
నాపోవక పార్థునొద్ద నారాత్రి ప్రియా
లాపములఁ దగిలి యుండెను
దీపమణుల్ వెలుఁగ భువనదీపుఁడు దానున్.

(ఆ రాత్రి కృష్ణుడు అర్జునుడితో మాట్లాడుతూ గడిపాడు.)

1_8_171 ఉత్పలమాల వోలం - వసంత

ఉత్పలమాల

భ్రాజితశాతకుంభగృహపంక్తులఁ బుష్పితవల్లివేల్లితో
ర్వీజవనావృతిన్ విమలవిద్రుమవజ్రవిచిత్రవేదికా
రాజిఁ గరంబు రమ్య మగు రైవతకాచలకందరంబునన్
రాజకులైకసుందరుఁ బురందరనందను నుంచి లీలతోన్.

(రైవతకాద్రి గుహలో అర్జునుడిని ఉంచి.)

1_8_170 వచనము వోలం - వసంత

వచనము

అనిన విని నగుచు నబ్జనాభుం డర్జును నతిస్నేహంబునం గౌఁగిలించుకొని యెల్లవారల కుశలంబును నడిగి యాతనితీర్థాభిగమననిమిత్తంబును సుభద్రయందు బద్ధానురాగుం డగుటయు నుపలక్షించి ద్వారకాపురంబునకుఁ దోడ్కొని యరిగి.

(కృష్ణుడు అతడిని ద్వారకకు పిలుచుకొనివెళ్లి.)

1_8_169 ఉత్పలమాల వోలం - వసంత

ఉత్పలమాల

ద్వాదశమాసికవ్రతము ధర్మవిధిం జలుపంగ నేఁగి గం
గాదిమహానదీహిమవదాదిమహాగిరిదర్శనంబు మీ
పాదపయోజదర్శనముఁ బన్నుగఁ జేయుటఁజేసి పూర్వసం
పాదితసర్వపాపములుఁ బాసె భృశంబుగ నాకు నచ్యుతా.

(కృష్ణా! వ్రతకారణంగా కలిగిన దర్శనాలతో పాటుగా నీ దర్శనం దొరకటం వల్ల నా పాపాలన్నీ తొలగిపోయాయి.)

1_8_168 వచనము వోలం - వసంత

వచనము

ఇట్లు దనకడకు వచ్చిన యాదిదేవునకు దేవకీనందనునకు నతిసంభ్రమంబున నమస్కరించి పురందర నందనుం డానందజలభరిత నయనుం డయి యి ట్లనియె.

(అర్జునుడు కృష్ణుడికి నమస్కరించి ఇలా అన్నాడు.)

-:అర్జునుండు ద్వారకానగరంబునకుఁ జనుట:-

1_8_167 కందము వోలం - వసంత

కందము

నరునికి యెఱిఁగి కృష్ణుడు
తిరముగ దయతోఁ బ్రభాసతీర్థమునకు నొ
క్కరుఁడ చనుదెంచె సర్వే
శ్వరుఁ డెప్పుడు భక్తులకుఁ బ్రసన్నుఁడ కాఁడే.

(అర్జునుడు ఉన్నాడని తెలుసుకొని కృష్ణుడు ఆ ప్రభాసతీర్థానికి వచ్చాడు.)

1_8_166 కందము వోలం - వసంత

కందము

పరమబ్రహ్మణ్యు జగద్గురు
గరుడధ్వజు ననంతగుణు నేకాగ్ర
స్థిరమతి యై నిజహృదయాం
తరసుస్థితుఁ జేసి భక్తిఁ దలఁచుచు నుండెన్.

(కృష్ణుడిని ధ్యానించాడు.)

1_8_165 వచనము వోలం - వసంత

వచనము

మఱియు నప్పురంబునం ద న్నొరు లెఱుంగకుండ వలయు ననియు యాదవులు యతుల కతిభక్తులనియును మనంబునం దలంచి కృతకయతివేషధరుం డయి.

(అంతేకాక అక్కడ ఇతరులు తెలుసుకోకుండా ఉండాలని కపట సన్న్యాసి వేషం ధరించి.)

1_8_164 సీసము + ఆటవెలది వోలం - వసంత

సీసము

అందుల కేఁగి యే నిందీవరశ్యాము
నరవిందనాభు నంబురుహనేత్రు
సన్మిత్రుఁ జూచి నాజన్మంబు సఫలంబు
సేయుదు నఘములు వాయుపొంటె
నదియునుంగాక మున్ గదుఁ డనువానిచే
వింటిఁ దిలోత్తమకంటె రూప
వతియట్టె సద్గుణాన్వితయట్టె నాకట్టి
భద్రేభగమన సుభద్రఁ జూచు

ఆటవెలది

వేడుకయును గలదు విష్ణుభట్టారకు
దయ నభీష్టసిద్ధి దనరు ననుచుఁ
దద్ద సంతసిల్లి తద్ద్వారకాపురి
కరుగ నిశ్చయించె నర్జునుండు.

(కృష్ణుడినీ, సుభద్రనూ చూడవచ్చని ద్వారకకు వెళ్లాలని నిశ్చయించాడు.)

1_8_163 వచనము వోలం - వసంత

వచనము

అనిన నన్నారదువచనంబులు విని వచ్చి మహోగ్రగ్రాహముల మై భవదాగమనంబు ప్రతీక్షించుచు నిప్పంచతీర్థంబుల నుండి నేఁడు నీకారణంబునం గృతార్థుల మయితి మనిన నర్జునుండును గరుణాయత్తచిత్తుం డయి వంద చెప్పినయన్నలువురకు శాపమోక్షణంబు సేసిన నమరకన్యక లతిహర్షంబున నమరేంద్రనందను దీవించి దేవలోకంబున కరిగి రదిమొదలుగా నిప్పంచతీర్థంబులు నారీతీర్థంబులు నాఁ బరగె నర్జునుండును గ్రమ్మఱి మణిపూరపురంబునకు వచ్చి రాజ్యలీల సుఖంబుండి చిత్రాంగద యందు బభ్రువాహనుండను పుత్త్రుం బడసి చిత్రవాహనునకు వంశకరుంగా నిచ్చి వాని వీడ్కొని గోకర్ణంబుఁ జూచుచుఁ బశ్చిమసముద్రపార్శ్వంబునఁ బ్రభాసం బను తీర్థంబునకుఁ జని యందులకు ద్వారవతి పురంబ కుఱంగలి యని విని.

(అనగా అర్జునుడు మిగిలిన నలుగురికి కూడా శాపవిమోచనం కలిగించాడు. తరువాత మణిపూరపురానికి వచ్చి చిత్రాంగదకు బభ్రువాహనుడనే కుమారుడు పుట్టగా అతడిని వంశకరునిగా ఇచ్చి, అక్కడి నుండి బయలుదేరి గోకర్ణతీర్థాన్ని చూస్తూ, పడమటి సముద్రం పక్కగా ప్రభాసతీర్థానికి వెళ్లి అక్కడికి ద్వారవతి దగ్గర అని విని.)

1_8_162 కందము వోలం - వసంత

కందము

జననుతుఁడు పాండుతనయుఁడు
ధనంజయుఁ డశేషతీర్థదర్శనకాంక్షం
జనుదెంచి మీకు దయ న
మ్ముని చెప్పినయట్ల శాపమోక్షము సేయున్.

(అర్జునుడు వచ్చి మీకు శాపవిమోచనం కలిగిస్తాడు.)

1_8_161 సీసము + ఆటవెలది వోలం - వసంత

సీసము

అట్టిమహాబాహుఁ డత్యంతబలుఁ డెవ్వఁ
        డగునొక్కొ యనుచు నే మరుగుదెంచు
వారము త్రైలోక్యవర్తి నంబుజభవ
        ప్రభవు నారదుఁ గని భక్తితోడ
మ్రొక్కిన మమ్ము నమ్ముని చూచి యి ట్లేల
        వగఁ బొంది కందినవార లనియు
నడిగి మావృత్తాంతమంతయు మాచేత
        విని విప్రునలుకయు విధికృతంబుఁ

ఆటవెలది

గ్రమ్మఱింప లావె కావున దక్షిణ
జలధితీరమునఁ బ్రశస్త పంచ
తీర్థములకు నేఁగి ధృతి నందు నూఱేఁడు
లుండుఁ డట్లు మీర లుండు నంత.

(అలా చేయగలవాడు ఎవడా అనుకొంటూ వస్తున్న మాతో నారదుడు - దక్షిణతీరంలోని ఐదు నీటి మడుగుల్లో ఉండండి. అక్కడ మీరు ఉండగా.)

Monday, December 04, 2006

1_8_160 వచనము వోలం - వసంత

వచనము

కావున మాచేసిన యజ్ఞానంబు సహించి మాకు శాపమోక్షంబుఁ బ్రసాదింపు మనిన నవ్విప్రుండును గరుణించి యెవ్వండేని మీచేత గృహీతుండయు మీయున్నజలాశయంబు మిమ్ము వెలువరించు నాతండ మీకు శాపమోక్షకారణుం డగు ననిన.

(కాబట్టి మా అజ్ఞానం సహించి, శాపవిమోచనం ప్రసాదించమనగా అతడు కరుణించి - ఎవడు మిమ్మల్ని మీ మడుగునుండి బయట పడవేస్తాడో అతడే మీకు శాపవిమోచనం కలిగిస్తాడు - అనగా.)

1_8_159 చంపకమాల వోలం - వసంత

చంపకమాల

అలుగుదురయ్య విప్రులు మహాపురుషుల్ పరుషాపరాధముల్
దలిఁగెడువారు ధర్మువులు దప్పక సల్పెడువారు సత్యముల్
పలికెడువారు వారల కపాయము డెందములం దలంచు మూ
ర్ఖులకు విధాతృచెయ్వున నగున్ దురితంబులు దుర్యశంబులున్.

(విప్రులు కోపగించుకోవటం ఉచితమేనా?)

1_8_158 వచనము వోలం - వసంత

వచనము

ఏము రాగకారణవికారంబులు గావించిన నవి దనకుం గోపకారణంబు లయిన నతికుపితుం డయి బ్రాహ్మణుండు మమ్మేవురను మహాగ్రాహంబులుగా శపియించిన నమ్మునివరునకు ముకుళితహస్తల మై యి ట్లంటిమి.

(మేము చేసిన చేష్టలు అతడికి కోపం తెప్పించాయి. మొసళ్లుగా మారమని శపించాడు. మేము అప్పుడు చేతులు జోడించి ఇలా అన్నాము.)

1_8_157 కందము వోలం - వసంత

కందము

ధృతిహీనులచిత్తము ల
ట్లతివలయం దేల తగులు నత్యంతదృఢ
వ్రతుల మనంబులు వారల
మతులఁ దృణస్త్రైణములు సమంబుల కావే.

(నిగ్రహపరుల దృష్టిలో స్త్రీలు, గడ్డిపరకలు సమానమే కదా.)

1_8_156 కందము వోలం - వసంత

కందము

వేడుక నమ్ముని ముందటఁ
బాడితి మాడితిమి పెక్కుపరిహాసంబుల్
రూఢిగఁ బలికితి మెట్లుం
జూడఁడు మావలను నీరసుం డన నుండెన్.

(అతడి ముందు మేము వేడుకతో పాడి, ఆడి, పరిహాసాలు పలికాము. ఆయన మా వైపు చూడకపోవటంతో.)

1_8_155 వచనము వోలం - వసంత

వచనము

వినవయ్య యే మేవురము నఖిలలోకపాలకపురంబులు చూచుచు భూలోకంబునకు వచ్చి యొక్క వనంబునం దుగ్రతపంబు సేయుచున్నవాని నత్యంతశాంతు నేకాంతచారి నగ్నికల్పు నొక్కబ్రాహ్మణుం గని వానితపంబునకు విఘ్నంబు సేయ సమకట్టి.

(ఒకరోజు మేము భూలోకానికి వచ్చి అడవిలో ఒంటరిగా కూర్చున్న ఒక బ్రాహ్మణుడి తపస్సు చెడగొట్టాలని.)

1_8_154 కందము వోలం - వసంత

కందము

వనజాక్షి యేమికారణ
మున నుగ్రగ్రాహరూపములు దాల్చితి రీ
రని యడిగిన వేడుక నా
తని కది యి ట్లనుచుఁ జెప్పెఁ దద్విధమెల్లన్.

(మీరు ఈ రూపాలలో ఉండటానికి కారణం ఏమిటి - అని అడగగా ఆమె ఇలా చెప్పింది.)

1_8_153 వచనము వోలం - వసంత

వచనము

ఏను వంద యను నప్సరసఁ గుబేరుననుంగ నాసఖులు సౌరభేయియు సమీచియు బుద్బుదయు లతయు ననువారలు నలువురు నాయట్ల యత్తీర్థంబులందున్న వారలు వారిని శాపవిముక్తలం జేసి రక్షింపు మనిన దానికి నర్జునుం డి ట్లనియె.

(నేను కుబేరుని స్నేహితురాలిని, అప్సరసను. నా స్నేహితురాండ్రు నలుగురు నా లాగానే ఆ తీర్థాలలో ఉన్నారు. వారికి కూడా శాపవిమోచనం కలిగించు - అనగా అర్జునుడు ఇలా అన్నాడు.)

1_8_152 ఉత్పలమాల వోలం - వసంత

ఉత్పలమాల

ఆ లలితాంగిఁ జూచి నరుఁ డద్భుత మంది మృగాయతాక్షి యి
ట్లేల జలేచరత్వమున నిజ్జలధిన్ వసియించి తిప్పు డి
ట్లేల సురూప భామ వయి తెందుల దానవు నీవు నావుడున్
బాలిక పాండు పుత్త్రునకుఁ బార్థున కిట్లనియెం బ్రియంబునన్.

(అర్జునుడు ఆశ్చర్యపడి - ఇలా మొసలి రూపంలో ఎందుకు ఉన్నావు - అని అడగగా ఆమె ఇలా అన్నది.)

1_8_151 ఆటవెలది వోలం - వసంత

ఆటవెలది

దాని నశ్రమమునఁ దజ్జలాశయము వె
ల్వడఁగ వైచె నరుఁడు బాహుశక్తి
నదియుఁ దత్క్షణంబ యభినవ యౌవనో
ద్భాసమాన దివ్యభామ యయ్యె.

(అర్జునుడు ఆ మొసలిని మడుగునుండి బయటకు విసరగా అది వెంటనే దివ్యకాంత రూపం దాల్చింది.)

1_8_150 కందము హర్ష - వసంత

కందము

సాహసికుం డై నరుఁ డవఁ
గాహము సేయుటయు జలము గ్రక్కదల మహా
గ్రాహము బీభత్సు బృహ
ద్బాహుబలుం బట్టికొనియెఁ బఱతెంచి వడిన్.

(నీటిలో దిగగా పెద్ద మొసలి ఒకటి వేగంగా వచ్చి అతడిని పట్టుకొన్నది.)

1_8_149 వచనము హర్ష - వసంత

వచనము

సౌభద్ర పౌలోమ కారంధమ ప్రసన్న భారద్వాజంబు లను నామంబుల దక్షిణసముద్ర తీరంబునం బ్రసిద్ధంబు లయిన యిప్పంచతీర్థంబు లిప్పుడు నూఱేండ్లగోలె నుగ్రగ్రాహగృహీతంబు లయి దుర్జనగృహీతంబు లయిన రాజులవిభవంబులుంబోలె సాధుజనవర్జితంబు లయి యుండు ననిన విని విజయుం డశేషతీర్థసేవార్థి నయి వచ్చిన నాకు నీతీర్థంబు లాడకునికి పౌరుషంబు గా దని యందు.

(వీటిని మొసళ్లు ఆక్రమించాయి - అనగా విని అర్జునుడు - అన్ని తీర్థాలనూ సేవించగోరిన నాకు వీటిలో స్నానం చేయకపోవటం పౌరుషం కాదు - అని.)

1_8_148 తరలము హర్ష - వసంత

తరలము

ఇది సొరంగ నసాధ్య మెవ్వరి కిందువంశవరేణ్య వి
న్మిదియ కా దివియేనుతీర్థము లీసముద్రతటంబునన్
విదితముల్ దురితాపహంబులు వీని నెన్నఁడు నాడనో
డుదురు సన్మును లిందుఁ గోల్మొసళుల్ గొనున్ వడిఁ జొచ్చినన్.

(అర్జునా! ఈ తీర్థాన్ని ప్రవేశించటం ఎవ్వరికీ సాధ్యం కాదు. ఇదే కాదు. ఇక్కడ ప్రసిద్ధమైన ఐదు తీర్థాలు ఉన్నాయి. వాటిలో ప్రవేశిస్తే పెద్ద మొసళ్లు పట్టుకొంటాయి.)

1_8_147 వచనము హర్ష - వసంత

వచనము

ఇట్లుండి యొక్కనాఁడు తపోధనబ్రాహ్మణసమేతుం డై తత్సమీపంబున సముద్రతీరతీర్థంబులు చూచుచుం జని సౌభద్రం బను తీర్థంబుఁ గని యందు స్నానంబు సేయ సమకట్టిన నర్జునుం జూచి యందుల మును లి ట్లనిరి.

(ఇలా ఉన్న అర్జునుడు ఒకనాడు ఆ పురానికి దగ్గరలో సముద్రతీరతీర్థాలను చూస్తూ సౌభద్రతీర్థం దర్శించాడు. అందులో స్నానం చేయబోగా అక్కడ ఉన్న మునులు ఇలా అన్నారు.)

1_8_146 ఉత్పలమాల హర్ష - వసంత

ఉత్పలమాల

అంగరాజ్యలక్ష్మి పొడవైనదియొక్కొ యనంగ నొప్పు చి
త్రాంగదయందుఁ బార్థుఁడు మహాప్రణయప్రవణాంతరంగుఁ డై
యంగజభోగసంగమున నమ్మణిపూరపురిన్ సమస్తలో
కాంగణరంగసంగతవిహారయశోంగదుఁ డుండె లీలతోన్.

(అర్జునుడు ఆమెతో మణిపూరనగరంలో విలాసంతో ఉన్నాడు.)

1_8_145 వచనము హర్ష - వసంత

వచనము

అనిన నర్జునుండు చిత్రవాహను వచనంబున కొడంబడి చిత్రాంగద వివాహం బై.

(అర్జునుడు అందుకు అంగీకరించి ఆమెను వివాహమాడి.)

1_8_ 144 తేటగీతి హర్ష - వసంత

తేటగీతి

ఇందుఁ బుట్టినసుతుఁడు మా కిందువంశ్య
వంశవిస్తారకుండు గావలయు నిదియ
యీలతాంగికి నుంకు వి ట్లీఁగనోపు
దేని పెండిలియగుమ యీయింతిఁ బ్రీతి.

(ఈమెకు పుట్టినవాడు మా వంశం నిలపాలి. ఇదే నీవు ఈ కన్యకు ఇవ్వవలసిన శుల్కం. ఇలా ఇవ్వగలిగితే ఈమెను పెళ్లి చేసుకో.)

1_8_143 వచనము హర్ష - వసంత

వచనము

పరమేశ్వరుండును వానికిం గరుణించి నీకు నొక్కపుత్త్రుం డుద్భవించు నీకులంబున వారికెల్ల సంతానం బిట్ల యగు నని వరం బిచ్చిన నదిమొదలుగా మావంశంబునవారికెల్ల నొక్కొక్కపుత్త్రుండ కా జన్మించుచు వచ్చిన నిప్పుడు నాకు నిక్కన్యక పుట్టె నేను దీనిం బుత్త్రీకరణంబునం బెనిచితి.

(శివుడు కరుణించి - నీకొక కొడుకు పుడతాడు. నీ వంశంలో వారందరికీ కూడా ఇలాగే సంతానం కలుగుతుంది - అని వరం ఇచ్చాడు. అది మొదలుగా మా వంశంలో వారందరికీ ఒక్కొక్క కొడుకే జన్మిస్తూ వచ్చాడు. ఇప్పుడు నాకీ కన్యక పుట్టింది. ఆమెను నేను వంశం నిలిపేదానిగా పెంచాను.)

1_8_142 కందము హర్ష - వసంత

కందము

మా కులమునందుఁ దొల్లి ప్ర
భాకరుఁ డను రాజవరుఁ డపత్యము దనకున్
లేకున్న నుమేశ్వరునకుఁ
బ్రాకటముగ భక్తితోఁ దపం బొనరించెన్.

(పూర్వం మా వంశంలో ప్రభాకరుడనే రాజు సంతానం లేక శివుడి గురించి తపస్సు చేశాడు.)

1_8_141 కందము హర్ష - వసంత

కందము

ధన్యుండ నైతి నీ కీ
కన్యక నీఁగాంచి యైనఁ గలతెఱఁగు జగ
న్మాన్య యెఱిఁగింపవలయు న
నన్యమనస్కుండ వయి దయన్ విను మనఘా.

(నీకు ఈ కన్యకను ఇవ్వగలిగి ధన్యుడనయ్యాను. అయినా ఉన్న సంగతి చెప్పాలి. దయతో విను.)

1_8_140 వచనము హర్ష - వసంత

వచనము

పదమూఁడగు మాసంబున మణిపూరపురంబునకుం జని యం దున్న రాజుఁ జిత్రవాహనుం గని వానిచేతం బూజితుం డయి తత్పుత్త్రిఁ జిత్రాంగద యనుదాని వివాహంబుగా నపేక్షించిన నయ్యర్జునునభిప్రాయం బాప్తులవలన నెఱింగి చిత్రవాహనుం డర్జునున కి ట్లనియె.

(పదమూడవ మాసంలో అర్జునుడు మణిపూరనగరానికి వెళ్లాడు. అక్కడి రాజు చిత్రవాహనుడి కూతురైన చిత్రాంగదను పెళ్లిచేసుకోవాలనుకోగా అతడు అర్జునుడితో ఇలా అన్నాడు.)

-:అర్జునుండు చిత్రాంగదను వివాహం బగుట:-

1_8_139 సీసము + తేటగీతి హర్ష - వసంత

సీసము

దక్షిణగంగ నాఁ దద్దయు నొప్పిన
        గోదావరియు జగదాది యైన
భీమేశ్వరంబును బెడఁగగుచున్న శ్రీ
        పర్వతంబును జూచి యుర్విలోన
ననఘ మై శిష్టాగ్రహారభూయిష్ఠ మై
        ధరణీసుతోత్తమాధ్వరవిధాన
పుణ్యసమృద్ధ మై పొలుచు వేంగీదేశ
        విభవంబుఁ జూచుచు విభుఁడు దక్షి

తేటగీతి

ణాంబురాశితీరంబున కరిగి దురిత
హారి యైన కావేరీమహాసముద్ర
సంగమంబున భూసురేశ్వరుల కభిమ
తార్థదానంబుఁ జేసి కృతార్థుఁ డగుచు.

(గోదావరిని, భీమేశ్వరాన్ని, శ్రీశైలాన్ని, వేంగీదేశాన్ని చూస్తూ దక్షిణసముద్రతీరానికి వెళ్లి కావేరీసముద్రసంగమంలో దానాలు ఇచ్చాడు.)

1_8_138 వచనము హర్ష - వసంత

వచనము

కళింగవిషయంబు సొచ్చు నంతఁ దోడిబ్రాహ్మణులు కొందఱు కళింగద్వారంబునఁ గ్రమ్మఱి యుత్తరకురుదేశంబులకుం జనిన నందుం గతిపయబ్రాహ్మణసహాయుం డయి పార్థుం డరిగి పూర్వసముద్రతీరంబునఁ బురుషోత్తమదేవరకు నమస్కరించి మహేంద్రపర్వతంబు చూచుచు.

(కళింగదేశంలో ప్రవేశించగానే అర్జునుడి వెంట వచ్చినవారిలో కొందరు తిరిగి ఉత్తరకురుదేశాలకు వెళ్లారుయ మిగిలిన వారితో అర్జునుడు తూర్పుసముద్రతీరంలో ఉన్న జగన్నాథస్వామిని సేవించి, మహేంద్రపర్వతం చూస్తూ.)

1_8_137 కందము హర్ష - వసంత

కందము

ఏలావరరమ్యము లగు
వేలావనములను బవనవిచలద్వీచీ
లాలితసముద్రవిద్రుమ
మాలాపులినస్థలముల మసలుచు లీలన్.

(ఏలకి తీగల తోటలతో అందంగా ఉన్న సముద్రతీరవనాలలో తిరుగుతూ.)

1_8_136 వచనము హర్ష - వసంత

వచనము

అందును గోదాన భూదాన హిరణ్యదానంబు లాదిగాఁ బెక్కుదానంబులు సేసి యజ్ఞార్థంబుగా భూసురోత్తములకు గోసహస్రంబు లిచ్చి ప్రాగ్దేశంబున కరిగి నైమిశారణ్యంబునందు జగన్నాథునారాయణు నారాధించి యుత్పలినియుఁ గౌశికియు నందయు నపరనందయు గయయు గంగయు గంగాసాగరసంగమంబును జూచుచు.

(అక్కడ దానాలు చేసి, తూర్పుదేశానికి పోయి, జగన్నాథుడిని ఆరాధించి, గంగాసాగరసంగమం మొదలైన ప్రదేశాలను చూస్తూ.)

1_8_135 కందము హర్ష - వసంత

కందము

వితతయశుఁ డరిగి హిమప
ర్వతపార్శ్వంబున నగస్త్యవటమును నత్యు
న్నతభృగుతుంగముఁ జూచుచు
ధృతి నేఁగి హిరణ్యబిందుతీర్థంబునకున్.

(అర్జునుడు హిమపర్వతం పక్కన ఉన్న అగస్త్యవటక్షేత్రాన్నీ, భృగు తుంగ క్షేత్రాన్నీ చూస్తూ హిరణ్యబిందుతీర్థానికి వెళ్లి.)

1_8_134 వచనము హర్ష - వసంత

వచనము

అనిన నవనతానన యయి నాగకన్యక యర్జునుం జూచి ద్రుపదరాజపుత్త్రియందు మీచేసిన సమయంబును భవత్తీర్థాగమననిమిత్తంబును వ్రతంబును నెఱుంగనిదానఁ గాను సర్వతీర్థ సేవంబును సర్వవ్రతంబులు సలుపుటయును సర్వదాన ధర్మక్రియలును బ్రాణదానంబుతో సమానంబులు గావు నామనోరథంబు విఫలం బయిన మనోజానలంబునం బ్రాణపరిత్యాగం బగుం గావున నన్ను రక్షింపుము దీన నీకు వ్రతభంగంబు గా దనిన నర్జునుండు దానిమనోరథంబు సలిపి యారాత్రి నాగభువనంబున వసియించి నాగకన్యకయందు సద్యోగర్భంబున నిరావంతుం డను కొడుకుం బడసి నాగలోకంబు వెలువడి యాదిత్యోదయంబుతోడన గంగాద్వారంబునకు వచ్చి తద్వృత్తాంతం బంతయుఁ దనసహాయు లయిన విప్రులకుం జెప్పి వారలకు హృదయానందంబు సేయుచు.

(అప్పుడు ఉలూచి - మీ వ్రతం తెలియని దాన్ని కాను. కానీ ఈ వ్రతాలేవీ ప్రాణదానంతో సమానం కావు. నా కోరిక నెరవేరకపోతే నేను ప్రాణత్యాగం చేస్తాను. కాబట్టి నన్ను రక్షించు, నీకు వ్రతభంగం కాదు - అనగా అర్జునుడు అంగీకరించాడు. ఆమె వల్ల ఇరావంతుడు అనే పుత్రుడిని అప్పటికప్పుడే పొంది సూర్యోదయం కాగానే గంగాద్వారానికి చేరి జరిగిన వృత్తాంతం తనకు తోడుగా ఉన్న విప్రులకు చెప్పాడు.)

1_8_133 మధ్యాక్కర హర్ష - వసంత

మధ్యాక్కర

ద్వాదశమాసికవ్రతము సలుపుదుఁ దరుణి మాయన్న
యాదేశమునఁ జేసి సర్వతీర్థము లాడుచు బ్రహ్మ
వాదులసంగతి బ్రహ్మచర్యసువ్రతుఁడ నై యుండి
నీదుమనోరథ మెట్లు సలుపంగనేర్తు నే నిపుడు.

(అన్నగారి ఆజ్ఞతో ద్వాదశమాసికవ్రతం చేస్తూ బ్రహ్మచర్యంలో ఉన్న నేను నీ కోరికను ఎలా తీర్చగలను?)

1_8_132 వచనము హర్ష - వసంత

వచనము

అనిన దాని కర్జునుం డి ట్లనియె.

(అప్పుడు అర్జునుడు ఇలా అన్నాడు.)

1_8_131 కందము హర్ష - వసంత

కందము

నీ గుణములు దొల్లియు నా
గీగీతములందు విని తగిలి యిపుడు మనో
రాగమునఁ జూడఁ గంటిని
భాగీరథియందు నిన్నుఁ బరహితచరితా.

(నీ గురించి నాగకన్యకల పాటలలో ఇదివరకే విని ఉన్నాను. ఇప్పటికి నిన్ను చూడగలిగాను.)

1_8_130 వచనము హర్ష - వసంత

వచనము

ఏ నులూచి యను నాగకన్యక నైరావతకులసంభవుం డయిన కౌరవ్యుకూఁతుర నిన్నుం జూచి మనోజబాణబాధిత నయితి నామనోరథంబు సలుపుము.

(నేను ఉలూచి అనే నాగకన్యకను. ఐరావత వంశంలో పుట్టిన కౌరవ్యుడి కూతురిని. నిన్ను మోహించాను.)

1_8_129 కందము హర్ష - వసంత

కందము

తామరసనేత్ర నీ పే
రేమీ యెవ్వరితనూజ వి ట్లేల మహా
వ్యామోహిత వై తనవుడుఁ
గోమలి సురరాజపుత్త్రకున కి ట్లనియెన్.

(నీ పేరు ఏమిటి, నీవు ఎవరి కూతురివి - అని అడగగా ఆమె ఇలా అన్నది.)

1_8_128 సీసము + ఆటవెలది హర్ష - వసంత

సీసము

వేల్వంగ సమకట్టి వెలువడ నున్న న
        య్యింద్రనందను రుచిరేంద్రనీల
సుందరశ్యామాంగు సురరాజకరికరా
        కారమహాబాహుఁ గఱ్ఱిఁ జూచి
నలినాక్షి యం దొక్కనాగకన్యక కామ
        పరవశ యై వానిఁ బట్టి తిగిచి
కొని నాగపురమునకును జని తన నిజరమ్య
        హర్మ్యంబునందు నెయ్యమున నునిచె

ఆటవెలది

నందు నగ్ని తొంటియట్టు లభ్యర్చితం
బయి వెలుంగుచున్న నర్జునుండు
హోమకార్య మొప్ప నొనరించి యప్పు డ
య్యింతిఁ జూచి నగుచు నిట్టు లనియె.

(హోమం చేయబోతున్నా అర్జునుడిని చూసి ఒక నాగకన్యక మోహించి అతడిని పట్టి లాక్కొని నాగపురానికి వెళ్లి తన మేడలో ఉంచింది. అర్జునుడు అక్కడి అగ్నిలో హోమం చేసి ఆ నాగకన్యను చూసి నవ్వుతూ ఇలా అన్నాడు.)

-:ఉలూచి యర్జునునిఁ గామించుట:-

1_8_127 వచనము హర్ష - వసంత

వచనము

అందు నిత్యంబును గంగాస్నానంబు సేసి తత్తీరంబున హోమంబు సేయుచు వాసవసుతుండు మహీసురవరసహితుం డయి కొన్ని దివసంబులు వసియించి యొక్కనాఁడు ప్రభాతంబ విధిపూర్వకంబునం గృతాభిషేకుం డయి దేవర్షిపితృతర్పణంబులు సేసి.

(గంగాతీరంలో కొన్నిరోజులు గడిపి ఒకరోజు వేకువనే లేచి, స్నానం చేసి, దేవ ఋషి పితృ తర్పణాలు చేసి.)

1_8_126 కందము హర్ష - వసంత

కందము

గంగాధర పింగజటా
సంగమ మంగళ విశాల చటుల తరంగన్
గంగానది సేవించెను
గంగాద్వారమున విగతకల్మషుఁ డగుచున్.

(అర్జునుడు గంగాద్వారంలో గంగానదిని సేవించాడు.)

1_8_125 ఆటవెలది హర్ష - వసంత

ఆటవెలది

ధరణిసురుల గురులఁ బరమయోగుల మహా
భాగు లయిన యట్టి భాగవతుల
రాజవంశవరుఁడు పూజించుచును వారి
వలనఁ బుణ్యకథలు వెలయ వినుచు.

(అర్జునుడు పుణ్యాత్ములను పూజిస్తూ, వారి దగ్గర పుణ్యకథలు వింటూ.)

1_8_124 వచనము హర్ష - వసంత

వచనము

కావున వ్రతదానంబు నా కనుగ్రహింప వలయు నని మ్రొక్కి యర్జునుం డగ్రజు వీడ్కొని గురుజనానుమతుం డై యఖిలవేదవేదాంగపారగు లైన బ్రాహ్మణులు ననేకశాస్త్రవిదు లయి వివిధకథాకథనదక్షు లయిన పౌరాణికులును దనకు సహాయులుగా నరిగి సకలతీర్థసేవచేయుచు నయ్యైతీర్థంబులందు.

(అందువల్ల నాకు ద్వాదశమాసికవ్రతదానం అనుగ్రహించండి - అని అనుమతి పొంది తీర్థాలు సేవిస్తూ.)

-:సమయభంగకారణమున నర్జునుండు తీర్థయాత్రకుం జనుట:-

1_8_123 కందము హర్ష - వసంత

కందము

భూజనపరివాదం బ
వ్యాజంబునఁ బరిహరింపవలయును మనకున్
వ్యాజమున ధర్మలోపం
బాజిజయా పరిహరింతురయ్య మహాత్ముల్.

(ధర్మరాజా! అకారణంగా కలిగిన నిందనైనా తొలగించాలి. ఏదో సాకు పెట్టి మహాత్ములు ధర్మం తప్పటాన్ని తోసిపుచ్చుతారా!)

1_8_122 వచనము హర్ష - వసంత

వచనము

మఱి యట్లుంగాక తస్కరవధోపేక్షల నశ్వమేధ భ్రూణహత్యల ఫలం బగు నని వేదంబులయందు వినంబడుఁ దస్కరుల వధియించి బ్రాహ్మణహితంబు చేసినవాఁడవు నీకు సమయోల్లంఘనప్రాయశ్చిత్తంబు సేయ నేల యనిన నర్జునుం డి ట్లనియె.

(దొంగలను చంపటం అశ్వమేధం చేసినంత పుణ్యం, వారిని వదిలిపెట్టటం కడుపులోని బిడ్డను చంపినంత పాపం అని వేదాల వల్ల వింటున్నాము. అందువల్ల నువ్వు ప్రాయశ్చిత్తం చేసుకోవటం ఎందుకు? - అని ధర్మరాజు అనగా అర్జునుడు ఇలా అన్నాడు.)

1_8_121 ఆటవెలది హర్ష - వసంత

ఆటవెలది

క్రూర కర్ము లయ్యు గో బ్రాహ్మణుల కగు
బాధ లుడుచుజనులఁ బాపచయము
లెట్టియెడలఁ బొంద వింద్రనందన నీకు
సమయభంగభీతిఁ జనఁగ నేల.

(అర్జునా! ఎంతటి దుర్మార్గులైనా గోబ్రాహ్మణులను రక్షించేవారు పాపాలను పొందరు. అలాంటప్పుడు నీకు నియమభంగం అయిందన్న భయం ఎందుకు?)

1_8_120 వచనము వోలం - వసంత

వచనము

ఇ ట్లరిగి యర్జునుం డతివీరు లయిన చోరుల వధియించి బ్రాహ్మణునకు గోధనంబు నిచ్చి క్రమ్మఱి వచ్చి ధర్మరాజునకు మ్రొక్కి లోకంబులమర్యాదలు విచారించి రక్షించుచున్న మనయందు మర్యాదాభంగం బయ్యె నను నింత కంటె దుర్యశం బొండెద్దియు లేదు గావున నాకు ద్వాదశమాసికవ్రతంబు సలుపవలయు నని పోవ సమకట్టి యున్న నర్జునునకు యుధిష్ఠిరుం డి ట్లనియె.

(ఇలా అర్జునుడు ఆ దొంగలను చంపి, బ్రాహ్మణుడికి గోవును అప్పగించి, తిరిగి వచ్చి, ధర్మరాజుకు మొక్కి - నియమభంగం జరిగినందుకు నేను ద్వాదశమాసికవ్రతాన్ని చేయాలి - అనగా ధర్మరాజు ఇలా అన్నాడు.)

1_8_119 కందము వోలం - వసంత

కందము

ధరణీసురవరులకుఁ గడు
సెరగై నెడ నెఱిఁగి యెడయుఁ జేయుదురె మహా
పురుషు లని నరుఁడు విలుగొని
యరిగెను మ్రుచ్చులపిఱుంద నవ్విప్రుపనిన్.

(అర్జునుడు ధనుస్సు తీసుకొని ఆ విప్రుడి పనిమీద దొంగల వెంటపడ్డాడు.)

1_8_118 సీసము + ఆటవెలది వోలం - వసంత

సీసము

వదలక మ్రుచ్చుల వధియించి నాహోమ
        ధేనువుఁ గ్రమ్మఱఁ దెచ్చియిమ్ము
జననుత దానివత్సంబు నిన్నటఁగోలె
        నుడుగక యఱచుచునున్నయదియ
బలుకుల కెడ లేదు బాణాసనము గొని
        చనుదెమ్ము నాతోడఁ జట్ట ననిన
ద్రౌపదీసహితుఁ డై ధర్మరాజాయుధా
        గారంబునం దున్నఁ గార్ముకంబుఁ

ఆటవెలది

బుచ్చికొనఁగఁ దనకుఁబోలమి యెఱిఁగియు
విప్రునార్తరవము వినఁగ నోప
కర్జునుండు నిజశరాసనగ్రహణార్థ
మాయుధాలయమున కరిగె నపుడు.

(అర్జునా! ఆ దొంగలను వధించి నా హోమధేనువును నాకు తెచ్చి ఇవ్వు. మాటలకు సమయం లేదు. వెంటనే ధనుస్సు తీసుకొని నా వెంట రా - అని అతడు అనగా ధర్మరాజు ద్రౌపదితో ఆయుధాల గదిలో ఉన్నాడనీ, అక్కడికి వెళ్లి ధనుస్సు తీసుకోవటం తప్పనీ తెలిసికూడా అర్జునుడు ఆ విప్రుడి ఏడుపు వినలేక అక్కడికి వెళ్లాడు.)

1_8_117 కందము వోలం - వసంత

కందము

యమతనయు ధర్మరాజ్యము
తమరాజ్యమ యని మహాముదంబున విప్రో
త్తము లున్నచోటనే బ
న్నమువడి కోల్పడితి గోధనము మ్రుచ్చులచేన్.

(ధర్మరాజు ధర్మసామ్రాజ్యం తమ రాజ్యమే అని విప్రులు ఆనందంతో ఉన్నచోటనే నా గోవులను దొంగలు అపహరించారు.)

1_8_116 వచనము వోలం - వసంత

వచనము

ఇట్లు హితోపదేశంబు సేసి నారదుం డరిగినం బాండవులు దమచేసిన సమయస్థితిం దప్పక సలుపుచు సుఖంబుండఁ గొండొకకాలంబున కొక్కనాఁ డొక్కబ్రాహ్మణుండు మ్రుచ్చులచేతఁ దనహోమధేనువు గోల్పడి వచ్చి యాక్రోశించిన నశ్రుతపూర్వం బయిన యయ్యాక్రోశంబు విని విస్మితుం డయి విజయుండు విప్రుల కయిన బాధ దీర్పక యుపేక్షించుట పాతకం బని యప్పుడ యవ్విప్రు రావించి యిది యేమి కారణం బని యడిగిన నర్జునునకు విప్రుం డి ట్లనియె.

(ఇలా హితోపదేశం చేసి నారదుడు వెళ్లగా పాండవులు తమ ప్రతిజ్ఞను తప్పక పాలిస్తూ సుఖంగా ఉన్నారు. తరువాత ఒకనాడు ఒక బ్రాహ్మణుడు తన హోమధేనువును దొంగలు అపహరించారని ఏడుస్తూ ఉండగా అర్జునుడు ఆ ఏడుపు విని కారణం అడగగా అతడు ఇలా అన్నాడు.)

1_8_115 సీసము + ఆటవెలది వోలం - వసంత

సీసము

అనిన నారదమహామునిపల్కు చేకొని
        దమలో నొడంబడి విమలబుద్ధి
నేవురయందును ద్రోవది ప్రీతితో
        నొక్కొక్కయింట దా నొక్కయేఁడు
క్రమమున నుండను గమలాక్షి యెవ్వరి
        యింటఁ దా నుండె నయ్యింటివలనఁ
బెఱవారు చనకుండ నెఱుఁగక చనిరేని
        వెలయఁగఁ బండ్రెండునెలలు తీర్థ

ఆటవెలది

సేవ సేయుచును విశేషవ్రతంబులు
ధీరవృత్తిఁ జలుపువారు గాను
సన్మునీంద్రునొద్ద సమయంబు సేసిరి
రాజనుతులు పాండురాజసుతులు.

(పాండవులు అందుకు ఒప్పుకొని, ద్రౌపది ఒక్కొక్కరి ఇంట ఒక్కొక్క సంవత్సరం ఉండటానికీ, ఆమె ఉన్న ఇంటివైపు ఇతరులు వెళ్లకుండా ఉండటానికీ, ఒకవేళ తెలియక ఎవరైనా వెడితే పన్నెండు నెలలు యాత్రలు, వ్రతాలు చేయటానికీ అంగీకరించి ప్రతిజ్ఞ చేశారు.)

-:నారదుప్రేరితు లయి పాండవులు సమయము సేయుట:-

1_8_114 కందము వోలం - వసంత

కందము

ఇంతుల నిమిత్తమున ధృతి
మంతులుఁ బొందుదురు భేదమతి గావునఁ మీ
రింతయు నెఱింగి యొండులు
చింతింపక సమయ మిందు సేయుఁడు బుద్ధిన్.

(ధైర్యవంతులు కూడా స్త్రీల కారణంగా విరోధం పొందుతారు. కాబట్టి ఒక ఏర్పాటు చేసుకోండి.)

1_8_113 కందము వోలం - వసంత

కందము

అన్యోన్యప్రియభాషణు
లన్యోన్యహితైషు లసుర లన్యులపోలెన్
మన్యుపరిప్రేరితు లై
యన్యోన్యాభిహతిఁ జనిరి యమపురమునకున్.

(వారు అలా కొట్టుకొని చనిపోయారు.)

Sunday, December 03, 2006

1_8_112 కందము వోలం - వసంత

కందము

విపరీతమతని సుందుఁడు
నుపసుందుఁడుఁ దాఁకి పొడిచి రొండొరుతోడం
గుపితాత్ము లయి తిలోత్తమ
నెపమున దృఢముష్టిఘాతనిర్ఘాతములన్.

(తిలోత్తమ కారణంగా వారు కోపంతో ఒకరినొకరు పిడికిలి పోట్లతో ఒకరినొకరు పొడుచుకొన్నారు.)

1_8_111 కందము వోలం - వసంత

కందము

అనవుడుఁ నిద్దఱుఁ దమలోఁ
బొనుపడ కొండొరులతోడ భుజబలు లలుకన్
ఘనవజ్రతనులు దాఁకిరి
తనరఁగ నటఁ గొండ గొండఁ దాఁకినభంగిన్.

(అప్పుడు వారిద్దరూ ఒకరినొకరు ఎదుర్కొన్నారు.)

-:సుందోపసుందు లొండొరులతోఁ బోరి చచ్చుట:-

1_8_110 కందము వోలం - వసంత

కందము

సుందరి మాయిద్దఱలో
నిం దెవ్వరి వలతు చెప్పు మీ వనవుడుఁ బూ
ర్ణేందుముఖి వారి కను మీ
యం దెవ్వఁడు వొడిచి యొడుచు నతనిన వలతున్.

(మా ఇద్దరిలో నీవు ఎవరిని కోరుతావో చెప్పు - అని సుందోపసుందులు అడగగా - మీరు యుద్ధం చేసి ఎవడు గెలుస్తారో అతడినే వరిస్తాను - అని తిలోత్తమ చెప్పింది.)

1_8_109 వచనము వోలం - వసంత

వచనము

ఇట్లు పట్టుకొని.

(ఇలా పట్టుకొని.)

1_8_108 కందము వోలం - వసంత

కందము

ఇది నావల్లభ యిది నా
హృదయేశ్వరి యనుచుఁ గోరి యిరువురు మదనో
న్మదు లయి పరిగ్రహించిరి
తదీయ కమనీయ సవ్య దక్షిణ కరముల్.

(వారు - ఇది నా భార్య, ఇది నా భార్య - అని ఆమె ఎడమ కుడి చేతులను పట్టుకొన్నారు.)

1_8_107 కందము వోలం - వసంత

కందము

ఘను లయ్యిరువురు నేకా
సనభోజనయాననిలయశయనక్రియలం
దనరెడువా రేకస్త్రీ
వినిహితకాము లయి రపుడు విధినియమమునన్.

(అంతవరకూ ఒక్కటిగా ఉన్న ఆ సోదరులు దైవనిర్ణయం వల్ల ఒకే స్త్రీని కామించారు.)

1_8_106 కందము వోలం - వసంత

కందము

అమ్ముదితఁ జూచి యన్నయుఁ
దమ్ముఁడు నొక్కట మనోజతాడితు లై రా
గమ్మున నన్యోన్యస్నే
హమ్ములు చెడి దృష్ట్లు నిలిపి రయ్యువతి పయిన్.

(సుందోపసుందులు ఆమెను చూసి పరస్పరస్నేహం వదిలి ఆమె మీద చూపులు నిలిపారు.)

1_8_105 సీసము + ఆటవెలది వోలం - వసంత

సీసము

అబ్జజు వీడ్కొని యది దేవసభకుఁ బ్ర
        దక్షిణం బొనరించెఁ దత్క్షణంబ
తద్రూపసౌందర్యదర్శనలోలుఁ డై
        యజుఁడు నాలుగుదిక్కులందుఁ దనకు
గావించుకొనియె ముఖంబులు మఱిరెండు
        కన్నులఁ జూచినం గాదు తృప్తి
యని సురేంద్రుండు సహస్రాక్షుఁ డయ్యె న
        య్యమరులు కామమోహాంధు లైరి

ఆటవెలది

ముదిత యిట్లు సర్వమోహిని యై మర్త్య
భువమునకు మెఱుఁగుఁ బోలె నొప్పి
యరుగుదెంచె సుందరాంగి వింధ్యాచల
విపినదేశ మెల్ల వెలుఁగుచుండ.

(తిలోత్తమ బ్రహ్మ దగ్గర సెలవు తీసుకొని దేవసభకు ప్రదక్షిణం చేయగా ఆమె సౌందర్యం చూడటానికి తనకు నాలుగు ముఖాలు సృష్టించుకొని చతుర్ముఖుడయ్యాడు. ఇంద్రుడు రెండుకళ్లు చాలవని వేయి కళ్లు కలవాడయ్యాడు. దేవతలందరూ కామమోహితులయ్యారు. ఇలా అందరినీ మోహింపజేసి తిలోత్తమ వింధ్యపర్వతప్రాంతానికి వచ్చింది.)

1_8_104 వచనము వోలం - వసంత

వచనము

అదియును సురేంద్రప్రముఖ బృందారక మునిబృంద పరివృతుం డై యున్న పరమేష్ఠికిం బరమభక్తిం బ్రణమిల్లి పనియేమి యని ముందట నిలిచిన నరవిందసంభవుం డాసుందరిం జూచి సుందోపసుందు లను దైత్యులు దర్పితు లయి జగంబుల కహితంబులు సేయుచు వింధ్యాచలకందరంబున నున్నవారు వార లిద్దరు నీకారణంబునం దమలో నొండొరులతోఁ బొడిచి దండధరుపురంబున కరుగునట్లుగాఁ జేయు మని పంచిన వల్లె యని.

(బ్రహ్మ ఆమెతో - సుందోపసుందులు నీ కారణంగా తమలో తాము పోరాడుకొని మరణించేలా చెయ్యి - అని ఆజ్ఞాపించగా తిలోత్తమ అలాగేనని.)

1_8_103 పృథ్వి వోలం - వసంత

పృథ్వి

తిలాణుమణికోటిసంఘటితదివ్యదేహంబుతోఁ
దిలోత్తమ యనంగ నొక్కయువతీలలామంబు ను
త్పలాక్షి నొనరించె సర్వగుణభాసిరూపక్రియా
కలావిదుఁడు విశ్వకర్మ తనకౌశలం బేర్పడన్.

(తిలోత్తమను సృజించాడు.)

1_8_102 వచనము వోలం - వసంత

వచనము

పుణ్యవంతుల నిత్యనైమిత్తికకర్మంబులకు విఘ్నంబులు సేయుచు సింహవ్యాఘ్రగజరూపధరు లై వనంబులం దిరుగుచు మునిపల్లియలు సొచ్చి మునులకుఁ బ్రాణభయంబు సేయు చున్న వారలక్రూరకర్మంబులకు వెఱచి వేల్పులును మునులును బురాణముని యైన బ్రహ్మపాలికిం జని కృతాంజలు లయి జగంబులకు సుందోపసుందులు సేయు నుపద్రవంబులు సెప్పిన విని విశ్వగురుండు విస్మితుం డయి వార లన్యులచేత వధ్యులు గారు గావున పరస్పరయుద్ధంబునఁ బంచత్వంబుఁ బొందవలయునని విచారించి విశ్వకర్మ రావించి రూపలావణ్యవతి యైన యొక్కయువతి సృజియుంపు మని పంచినఁ బ్రసాదం బని మ్రొక్కి యప్పుడు.

(జంతురూపంలో ఆ కర్మలకు విఘ్నాలు, ముని పల్లెలకు ప్రాణభయం కలిగిస్తుండగా వారు బ్రహ్మ దగ్గరకు వెళ్లి ఈ ఉపద్రవాల గురించి చెప్పారు. బ్రహ్మ ఆశ్చర్యపడి, వాళ్లను ఇతరులు చంపలేరు కాబట్టి పరస్పరయుద్ధంలో మరణించాలని ఆలోచించి విశ్వకర్మతో - రూపలావణ్యవతి అయిన యువతిని సృష్టించు - అని ఆజ్ఞాపించగా అతడు బ్రహ్మకు మొక్కి.)

1_8_101 కందము వోలం - వసంత

కందము

ద్విజవరవినిర్మితము లగు
యజనస్వాధ్యాయకవ్యహవ్యతపోదా
నజపంబులఁ బితృదేవత
లజస్రమును దృప్తు లగుదు రని కడునలుకన్.

(ద్విజుల యజ్ఞాలచేత పితృదేవతలు తృప్తిపొందుతున్నారన్న కోపంతో.)

1_8_100 కందము వోలం - వసంత

కందము

సురగరుడోరగకిన్నర
పురములు వడిఁ జూఱకొనుచు భూలోకమునం
బరఁగిన రాజర్షిమహీ
సురవరులకు బాధసేయుచును గర్వమునన్.

(నగరాలను కొల్లగొడుతూ, అందరినీ బాధిస్తూ.)

1_8_99 కందము వోలం - వసంత

కందము

అనుపమరాజ్యవిభూతిం
దనరి జగద్విజయకాంక్ష దైత్యులకు ముదం
బొనరఁగ నకాలకౌముది
యను నుత్సవ మొప్పఁ జేసి రగణితబలు లై.

(సాటిలేని రాజ్యవైభవంతో వెలిగి, అకాలకౌముది అనే ఉత్సవాన్ని చేసి, అపరిమితమైన బలం కలిగి.)

1_8_98 ఆటవెలది వోలం - వసంత

ఆటవెలది

కమలభవుఁడు వారి కమరత్వ మొక్కటి
దక్కఁ గోర్కులెల్ల నక్కజముగఁ
గరుణ నిచ్చె నిట్లు సరసిజగర్భుచే
వరము వడసి యసుర వరులు పెఱిగి.

(వారికి బ్రహ్మ అమరత్వం తప్ప మిగిలిన వరాలన్నీ అనుగ్రహించగా వారు చెలరేగి.)

1_8_97 వచనము వోలం - వసంత

వచనము

ఇట్లు పితామహుండు సుందోపసుందులతపంబునకు మెచ్చి సన్నిహితుం డయి మీకిష్టం బైన వరం బిచ్చెద వేఁడుం డనిన వారలు వారిజాసనునకు ముకుళితకరకమలు లయి దేవా మాయిష్టంబు దయసేయ మీకిష్టం బేని మాకుఁ గామరూపత్వంబును గామగమనత్వంబును సకలమాయావిత్వంబును నన్యులచేత నవధ్యత్వంబును నమరత్వంబునుం బ్రసాదింపుం డనిన.

(వారిని వరం కోరుకొమ్మనగా - కామరూపత్వం, కామగమనత్వం, సకలమాయావిత్వం, అవధ్యత్వం, అమరత్వం ప్రసాదించండి - అని వారు కోరుకొన్నారు.)

1_8_96 సీసము + ఆటవెలది వోలం - వసంత

సీసము

వారిదారుణతపోవహ్నిదాహంబున
        వింధ్యాద్రిదరుల నావిర్భవించి
యత్యుచ్చ మయి ధూమ మాకాశమెల్లను
        గప్పిన నమరులు గరము వెఱచి
రత్నంబులను వధూరత్నంబులను జేసి
        తత్తపోవిఘ్నవిధాననిరతు
లయి ప్రబోధింపంగ నలవిగాకున్నఁ దో
        యజుగర్భుపాలికి నరిగి యసుర

ఆటవెలది

వరులతపముఁ జెఱువవలయు నావుడుఁ గమ
లాసనుండు త్రిభువనార్చితుండు
సురహరితంబుపొంటె సుందోపసుందుల
కడకు వచ్చె వరము కరుణ నీఁగ.

(వారి తపస్సుకు విఘ్నం కలిగించే ప్రయత్నాలు విఫలమై దేవతలు బ్రహ్మను ప్రార్థించగా, అతడు వారికి మేలు చేయాలని సుందోపసుందుల దగ్గరకు వచ్చాడు.)

1_8_95 వచనము వోలం - వసంత

వచనము

తొల్లి దితిపుత్త్రుం డైన హిరణ్యకశిపువంశంబున నికుంభుం డనువానికి సుందోపసుందు లన నిద్దఱుగొడుకులు పుట్టి నియతాత్ము లయి తపంబునన కాని సర్వంబునం బడయంగాదని యేకనిశ్చయులై వింధ్యాచలంబున కరిగి నిగృహీతేంద్రియు లై నిదాఘకాలం బెల్లఁ బంచాగ్ని మధ్యంబున నిలిచి వానకాలంబును శీతకాలంబును జలాశయంబుల వసియించి మఱియు వాయుభక్షులు నేకపాదస్థితులు నూర్ధ్వబాహులు నధోముఖులును నై పెద్దకాలంబు తపంబు సేసిన.

(పూర్వం సుందోపసుందులనే సోదరులు సర్వం పొందటానికి వింధ్యపర్వతానికి వెళ్లి చాలా కాలం తపస్సు చేయగా.)

-:సుందోపసుందోపాఖ్యానము:-

1_8_94 కందము వోలం - వసంత

కందము

అనిన నది యెట్టు లని యమ
తనయుఁడు గడువేడ్కతోడఁ ద న్నడిగిన నా
తనికిఁ దదీయానుజులకు
నినసన్నిభుఁ డమ్మునీంద్రుఁ డి ట్లని చెప్పెన్.

(అని నారదుడు చెప్పగా ధర్మరాజు కుతూహలంతో అది ఎలాగని అడిగాడు. నారదుడు ఇలా చెప్పాడు.)

1_8_93 సీసము + ఆటవెలది వోలం - వసంత

సీసము

సర్వధర్మజ్ఞుల రుర్వీశపూజ్యుల
        రన్యోన్యనిత్యసౌహార్దయుతుల
రగణితగుణయుక్తిఁ బొగడంగఁ దగువార
        లిట్టి మీకేవుర కిపుడు ద్రుపద
సుత యొక్కతియ ధర్మమతి ధర్మపత్ని యై
        నది యీక్రమంబు లోకాగమంబు
లందు విరుద్ధ మీసుందరికారణం
        బున మీకు విప్రీతి పుట్టకుండ

ఆటవెలది

నుండవలయుఁ బ్రియసహోదరుల్ దొల్లి సుం
దోపసుందు లొక్కయువతి కడరి
విగ్రహించి యసురవీరులు దమలోనఁ
బొడిచి మృత్యునిలయమునకుఁ జనిరి.

(మీ ఐదుగురికీ ఇప్పుడు ద్రౌపది ఒక్కతే భార్య. ఈ పద్ధతి లోకవిరుద్ధం, శాస్త్రవిరుద్ధం. ఆమె కారణంగా మీలో విరోధం పుట్టకూడదు. ఇంతకు ముందు అన్నదమ్ములైన సుందోపసుందులనే రాక్షసులు ఒక స్త్రీకోసం కలహించి మృతిచెందారు.)

1_8_92 వచనము వోలం - వసంత

వచనము

మాపుణ్యంబునంజేసి భవద్దర్శనంబు సంభవించె నని పరమప్రీతహృదయులై పలికి పరమభక్తిం బాంచాలి మ్రొక్కించి యున్నంత నందఱ నాశీర్వచనంబుల నభినందించి వారల కుశలం బడిగి నారదుండు ద్రౌపదిం బోవం బనిచి వారేవురకు నేకాంతంబున ని ట్లనియె.

(నారదుడు వారిని ఆశీర్వదించి, ద్రౌపదిని పొమ్మని పాండవులతో రహస్యంగా ఇలా అన్నాడు.)

1_8_91 మానిని వోలం - వసంత

మానిని

తమ్ములుఁ దానును ధర్మతనూజుఁడు తత్క్షణసంభృతసంభ్రముఁ డై
యమ్మునినాథవరేణ్యునకున్ వినయమ్మున మ్రొక్కి సమున్నతపీ
ఠమ్మున నుంచి యథావిధి పూజ లొడంబడఁ జేసి మునీశ్వర నె
య్యమ్మున నీ విట వచ్చుటఁజేసి కృతార్థుల మైతిమి యిందఱమున్.

(ధర్మరాజు అతడిని పూజించి - మీ రాకతో మేము కృతార్థులమయ్యాము - అన్నాడు.)

1_8_90 తరలము ప్రకాష్ - వసంత

తరలము

ప్రవిమలాగమతత్త్వవేది తపఃప్రభాసి జగత్త్రయీ
శివకరుండు హితోపదేశము సేయఁగాఁ గడువేడ్కతో
దివిజవంద్యుఁడు బ్రీతితోఁ జనుదెంచె నారదుఁ డంబుజో
ద్భవతనూజుఁడు భానుతేజుఁడు పాండవేయులపాలికిన్.

(నారదుడు పాండవుల దగ్గరకు వచ్చాడు.)

-:నారదుఁడు పాండవులపాలికి వచ్చుట:-

1_8_89 వచనము ప్రకాష్ - వసంత

వచనము

పాండవులును పరాక్రమ, ప్రణయ, వశీకృతాఖిలరాజన్యు లయి సుఖం బుండు నంత నొక్కనాఁడు.

(పాండవులు కూడా తమ పరాక్రమంతో, స్నేహంతో రాజులందరినీ తమ వశం చేసుకొని సుఖంగా ఉండగా ఒకరోజు.)

1_8_88 కందము ప్రకాష్ - వసంత

కందము

నారదుఁడు వచ్చుఁ దద్వచ
నారంభుల రగుఁడు మీర లని కఱపి మహో
దారుఁడు వారల వీడ్కొని
నారాయణుఁ డరిగెఁ దత్క్షణమ తనపురికిన్.

(మీ దగ్గరకు నారదుడు వస్తాడు, అతడు చెప్పిన విధంగా నడుచుకోండి - అని పాండవులకు చెప్పి కృష్ణుడు ద్వారకకు వెళ్లాడు.)

1_8_87 వచనము ప్రకాష్ - వసంత

వచనము

అంత.

(అలా ఉండగా.)

1_8_86 కందము ప్రకాష్ - వసంత

కందము

పరమద్విజశుశ్రూషా
పరు లయి శూద్రాదు లవనిఁ బరగిరి ధర్మ
స్థిరమతు లయి ధర్మజు ధ
ర్మరాజ్య మభివృద్ధిఁ బొందె మహిమాన్విత మై.

(శూద్రులు మొదలైనవారు కేవలం బ్రాహ్మణులకు సేవ చేయటంలో ఆసక్తి కలిగి ఉన్నారు. ధర్మజుడి ధర్మరాజ్యం గొప్పగా అభివృద్ధి పొందింది.)

1_8_85 కందము ప్రకాష్ - వసంత

కందము

పంబి యజనాధ్యయన దా
నంబుల వర్తిల్లె బ్రాహ్మణప్రియ మయి ధ
ర్మ్యం బయి క్షత్రియవైశ్యకు
లం బవిరతపుణ్మకర్మలాలస మగుచున్.

(క్షత్రియవైశ్యులు బ్రాహ్మణభక్తి కలిగి, పుణ్యకార్యాలు చేస్తూ జీవిస్తున్నారు.)

1_8_84 కందము ప్రకాష్ - వసంత

కందము

తనరిరి తద్దేశంబున
ననవరతము యజనయాజనాధ్యయనాధ్యా
పనదానములుఁ బ్రతిగ్రహ
మును నను షట్కర్మములను భూసురవంశ్యుల్.

(అక్కడి విప్రులు యజ్ఞం చేయటం, చేయించటం, వేదం చదవటం, చదివించటం, దానం చేయటం, పుచ్చుకోవటం అనే షట్కర్మలను ఎప్పుడూ ఆచరిస్తూ ఉంటారు.)

1_8_83 కందము ప్రకాష్ - వసంత

కందము

ధరణిప్రజ ధర్మసుతు సు
స్థిరనిర్మలధర్మచరితఁ జేసి రుజాత
స్కరపరరాష్ట్రవిబాధలఁ
బొరయక సంతతసమృద్ధిఁ బొందె విభూతిన్.

(అతడి రాజ్యంలో ప్రజలు బాధలు లేక సంపదలు సమృద్ధిగా పొందారు.)

1_8_82 సీసము + ఆటవెలది ప్రకాష్ - వసంత

సీసము

అనఘు వేదాధ్యయనాసక్తు నారభ్య
        మాణమహాధ్వరు మనుచరిత్రు
సర్వవర్ణాశ్రమసంరక్షణక్షము
        సత్వసంధాను నజాతశత్రు
భరతవంశోత్తముఁ బ్రభు ధర్మనందను
        రాజుఁగాఁ బడసి సురాజ యయ్యె
వసుధ యధిష్ఠానవతి యయ్యె మఱి లక్ష్మి
        బంధుమంతం బయ్యెఁ బరమధర్మ

ఆటవెలది

మన్నరేంద్రునందు నాపూర్ణతరశర
దైందవాతపంబునందుఁ బ్రీతి
సమమ కా సమస్తజనులచిత్తంబు లా
నందరసభరంబు నొందఁ దాల్చె.

(ధర్మరాజు వల్ల భూమికి మంచి రాజు, లక్ష్మికి మంచి భర్త, ధర్మానికి మంచి బంధువు లభించారు. ప్రజలు ధర్మరాజు మీద ప్రేమతో సంతోషంగా ఉన్నారు.)

1_8_81 చంపకమాల ప్రకాష్ - వసంత

చంపకమాల

అనుజులు నల్వురుం దనకు నత్యనురాగమునన్ విధేయు లై
తనరుచు నుండ వేదవిహితం బగు యజ్ఞమపోలె సర్వపా
వనశుభమూర్తి యై భువనవంద్యుఁడు ధర్మపరుండు ధర్మనం
దనుఁడు ధరాధిరాజ్యము ముదంబునఁ జేయుచునుండెఁ బేర్మితోన్.

(తమ్ములు విధేయులై ఉండగా ధర్మరాజు సంతోషంగా రాజ్యపాలన చేస్తూ ఉన్నాడు.)

1_8_80 వచనము ప్రకాష్ - వసంత

వచనము

ఇట్టియింద్రప్రస్థపురంబున నింద్రవిలాసంబుతో వ్యాసవాసుదేవానుమతుం డై ధర్మతనయుండు ధౌమ్యపురస్సరమహీసురప్రవరవేదఘోషంబులు సకలజనాశీర్వాదనాదంబులు మృదుమధుర మంగళ సంగీత రవంబులు వివిధతూర్యధ్వనులు నతిసమృద్ధంబు లై యెసంగ వర్గచతుష్టయంబునుం బోని యనుజవర్గంబుతో శుభముహూర్తంబునం బురప్రవేశంబు సేసి సర్వప్రకృతిజనానురాగకరుం డయి.

(ఇటువంటి ఇంద్రప్రస్థపురంలో, ఆశీర్వాద శబ్దాలు వినబడుతుండగా ధర్మరాజు తన తమ్ములతో పురప్రవేశం చేశాడు.)

1_8_79 మత్తేభము ప్రకాష్ - వసంత

మత్తేభము

అనిలం బప్పురిఁ బౌరచిత్తముల కత్యానంద మొందంగ నం
దిని యన్నేటితరంగలం బెనఁగుచున్ దివ్యద్రుమాకీర్ణ నం
దనసందోహముఁ దూఱుచున్ వికచకేతక్యాదినానాలతాం
తనవామోదముఁ బొందుచున్ సుడియు నిత్యంబుం గరం బిష్ట మై.

(అక్కడి గాలి, నందిని అనే నది మీది నుంచి పూల సువాసనలతో వచ్చి, ప్రజలకు ఆనందం కలిగిస్తూ ఉంటుంది.)

1_8_78 చంపకమాల ప్రకాష్ - వసంత

చంపకమాల

సరళ తమాల తాల హరిచందన చంపక నారికేళ కే
సర కదలీ లవంగ పనస క్రముకార్జున కేతకీలతా
గరుఘనసార సాల సహకార మహీరుహరాజ రాజి సుం
దర నవనందనావళులఁ దత్పురబాహ్యము లొప్పుఁ జూడఁగన్.

(ఇంద్రప్రస్థం వెలుపలి ప్రదేశాలు తెల్లతెగడ, తాటి, మామిడి వంటి చెట్లవరుసలతో, అందమైన కొత్త ఉద్యానవనాలతో చూడముచ్చటగా ఉంటాయి.)

1_8_77 చంపకమాల ప్రకాష్ - వసంత

చంపకమాల

తమము నడంచుచున్ వెలుఁగుతత్పురగోపురశాతకుంభకుం
భముల విచిత్రసన్మణిగభస్తివితానములన్ విచిత్రవ
ర్ణములగు నాత్మవాహముల నమ్మక పల్మఱుఁ జూచి యన్యవా
హము లని సంశయప్రణిహితాత్ముఁ డగున్ హరిదశ్వుఁ డెప్పుడున్.

(ఇంద్రప్రస్థపురద్వార గోపురాల మీది బంగారు కలశాల కాంతుల వల్ల తన గుర్రాల రంగు నానావిధాలుగా మారిపోగా సూర్యుడు అవి తన గుర్రాలని నమ్మక వేరే గుర్రాలని సందేహపడుతూ ఉంటాడు.)

1_8_76 చంపకమాల ప్రకాష్ - వసంత

చంపకమాల

పరిఘజలంబులం దమల పంకరుహోత్పలకైరవాదిసుం
దర కుసుమంబులున్ ఘనపథంబున నుజ్జ్వలతారకా నిరం
తర కుసుమంబులున్ వెలయుఁ దత్పురవప్రము పాదపీఠికా
శిరముల కొప్ప నర్చనలు సేసిన పువ్వుల యవ్విధంబునన్.

(అక్కడి అగడ్తల నీళ్లలో ఉన్న పూలు, ఆకాశంలో ఉన్న నక్షత్రాలనే పూలు, ఆ పట్టణం ప్రాకారపాదపీఠానికి పూజ చేసిన పువ్వులా అన్నట్లు ప్రకాశిస్తున్నాయి.)

1_8_75 కందము ప్రకాష్ - వసంత

కందము

శరనిధినినాదనిభ మగు
పురఘోషముఁ గీడుపఱిచి పొలుపగుఁ గర మ
ప్పురి బ్రహ్మపురి మహీసుర
వరవేదాధ్యయనరవ మవార్యం బగుచున్.

(అక్కడి బ్రాహ్మణపురంలోని వేదాధ్యయన ధ్వని, సముద్రఘోషతో సమానమైన ఆ పట్టణ ధ్వనిని మించి వినిపిస్తూ ఉంటుంది.)

1_8_74 సీసము + తేటగీతి ప్రకాష్ - వసంత

సీసము

వలరాజుసచివులవడువున బెడఁగగు
        కర్కశస్తనములఁ గరమువాఁడి
చూడ్కుల నతిరాగసురుచిరాధరముల
        మదివిలాసాలసమందగతుల
వక్రాలకంబుల వలుఁదపిఱుందుల
        దర్పగద్గదభాషితములఁ జేసి
జనులచిత్తములకు సంక్షోభ మొనరించు
        కామినీజనములు గలిగి సకల

తేటగీతి

కామభోగములకు సదేకాంతగృహముఁ
బోలి పొలిచియు ధర్మార్థములకు నిదియ
యాస్పదంబు నా వర్గత్రయావిరుద్ధు
లైన జనుల కెంతయు నొప్పు నప్పురంబు.

(ధర్మార్థకామాలు మూడింటిలోనూ ఆసక్తులైనవారికి ఆ ఇంద్రప్రస్థపురం ఎంతో తగినది.)

Saturday, December 02, 2006

1_8_73 చంపకమాల ప్రకాష్ - వసంత

చంపకమాల

వననిధిలోని రత్నములు వాసుకిమూర్ధజరత్నసంఘముల్
గొనఁగ నవశ్యమున్ జనులకున్ సమకూరదు గాన నెప్పుడుం
గొనుఁడు పరార్థ్యరత్నములు గోరినవానిన యిత్తుమ న్తెఱం
గునఁ బచరింతు రంగడులఁ గోమటు లప్పురి నిద్ధరత్నముల్.

(శ్రేష్ఠమైన రత్నాలు ఇస్తాము, ఎప్పుడైనా కొనండి - అని ఆ పట్టణంలోని కోమటులు అంగళ్లలో రత్నాలను అమరుస్తారు.)

1_8_72 చంపకమాల ప్రకాష్ - వసంత

చంపకమాల

అలఘుతరంబు లై తుహిన హారి సుధారుచి నిందురోచిరా
కులశశికాంతవేది పృథుకుంజగళ జ్జలనిర్ఝరంబులన్
విలసిత జాహ్నవీ విమలవీచి విలోల లసత్పతాకలం
బొలుపగుఁ దత్పురీభవనముల్ హిమశైలముఁ బోలి యున్నతిన్.

(మంచు వంటి సున్నపు కాంతి చేత, పొదరిళ్ల నుండి జాలువారే నీటిప్రవాహాల చేత, గంగానది తరంగాల వలె చలిస్తూ ప్రకాశించే జెండాల చేత, ఆ మేడలు హిమాలయపర్వతాన్ని పోలి ఉన్నాయి.)

1_8_71 ఉత్పలమాల ప్రకాష్ - వసంత

ఉత్పలమాల

ఇమ్ముగ విశ్వకర్మ రచియించిన కాంచన హర్మ్య తుంగ శృం
గమ్ముల రశ్మిరేఖలు ప్రకాశము లై కడుఁ బర్వి తత్సమీ
పమ్మునఁ బాఱుచున్న ఘన పంక్తులయం దచిరద్యుతి ప్రతా
నమ్ములఁ గ్రేణి సేయుచు ననారతమున్ విలసిల్లుఁ దత్పురిన్.

(ఇంద్రప్రస్థంలోని బంగారు మేడల కాంతిరేఖలు వాటి సమీపంలో పోతున్న మేఘాలలోని మెరుపుతీగలను ఎగతాళి చేస్తూ ప్రకాశిస్తున్నాయి.)

1_8_70 సీసము + ఆటవెలది ప్రకాష్ - వసంత

సీసము

ద్వైపాయనుండును ధౌమ్యుండు నాదిగా
        భూసురుల్ సూత్రవిన్యాస మమరఁ
జేసి శాంతికవిధుల్ సేయంగ సుప్రశ
        స్తం బైన రమ్యదేశంబునందు
వాసవాదిష్టుఁ డై వసుధకు నేతెంచి
        పేర్మితో నవ్విశ్వకర్మ పురము
నిర్మించె నదియును నిరుపమలీలలఁ
        దనరి యింద్రప్రస్థ మనఁగ నింద్రు

ఆటవెలది

పురముతోఁ గుబేరపురముతో వరుణేంద్రు
పురవరంబుతోడ నురగరాజ
పురవిభీతితోడ నురువిలాసంబుల
సరి యనంగ నొప్పు ధరణిమీఁద.

(విశ్వకర్మ అలాగే ఇంద్రప్రస్థం అనే నగరాన్ని నిర్మించాడు.)

1_8_69 కందము ప్రకాష్ - వసంత

కందము

హరి యింద్రుఁ దలఁచె నింద్రుఁడు
కరమనురాగమున విశ్వకర్మను బనిచెన్
సురపురమున కెన యగు పుర
మరుదుగ నిర్మింపు ముర్వి నని కడుఁ బ్రీతిన్.

(శ్రీకృష్ణుడు ఇంద్రుడిని తలవగా ఇంద్రుడు - అమరావతికి దీటైన పట్టణాన్ని భూమి మీద నిర్మించు - అని దేవశిల్పి విశ్వకర్మను ఆజ్ఞాపించాడు.)

-:విశ్వకర్మ యింద్రప్రస్థపట్టణమును నిర్మించుట:-

1_8_68 వచనము ప్రకాష్ - వసంత

వచనము

పాండవులును ధృతరాష్ట్రు శాసనంబునను భీష్మాదుల యనుమతంబునను వాసుదేవ సహితు లయి ఖాండవప్రస్థమ్మునకుం జని రంత.

(పాండవులు అలాగే శ్రీకృష్ణుడితో కలిసి ఖాండవప్రస్థానికి వెళ్లారు.)

1_8_67 కందము ప్రకాష్ - వసంత

కందము

నెమ్మిఁ జని ఖాండవప్ర
స్థమ్ము నివాసమ్ముఁ జేసి తద్దయు ననురా
గ మ్మెసఁగ నుండుఁ డందుఁ ది
రమ్ముగ నని పనిచెఁ బాండురాజాత్మజులన్.

(ఖాండవప్రస్థాన్ని రాజధానిగా చేసుకొని ఉండండి - అని పాండవులను ఆజ్ఞాపించాడు.)

1_8_66 వచనము ప్రకాష్ - వసంత

వచనము

అని ధర్మరాజు నభిషిక్తుం జేసి.

(అని ధర్మరాజును అభిషేకించి.)

1_8_65 ఆటవెలది ప్రకాష్ - వసంత

ఆటవెలది

సర్వ లోక కర్మసాక్షి యీకృష్ణుండు
సాక్షి గాఁగ మీకు సకల వృద్ధ
రాజు లొద్ద నర్ధ రాజ్య మిచ్చితిఁ బాండు
రాజ విభవ మెల్ల రమణఁ గొనుఁడు.

(శ్రీకృష్ణుడు సాక్షిగా అందరి ఎదుట మీకు అర్ధరాజ్యం ఇస్తున్నాను. పాండురాజు ఐశ్వర్యం స్వీకరించండి.)

1_8_64 వచనము ప్రకాష్ - వసంత

వచనము

అని పౌరులెల్ల దీవించుచుండఁ బౌరవకులనందను లయిన పాండునందనులు వచ్చి భీష్మధృతరాష్ట్రాదికురువృద్ధులకు మ్రొక్కి సకలజనానురాగం బొనరించుచు దుర్యోధనాదులతోఁ గలసి యెప్పటియట్ల రాజ్యవిద్యావినోదంబుల నేనుసంవత్సరంబు లుండు నంత నొక్కనాఁడు ధృతరాష్ట్రుండు భీష్మవిదురద్రోణదుర్యోధనాదుల సమక్షంబున బాండవుల కి ట్లనియె.

(అని ప్రజలు ఆశీర్వదించగా పాండవులు వచ్చి ఐదు సంవత్సరాలు హస్తినాపురంలో గడిపారు. ఒకరోజు ధృతరాష్ట్రుడు పెద్దల సమక్షంలో పాండవులతో ఇలా అన్నాడు.)

1_8_63 సీసము + ఆటవెలది ప్రకాష్ - వసంత

సీసము

పుర జను లెల్లను గర మనురక్తు లై
        ధర్మస్వరూపుఁ డీ ధర్మతనయుఁ
డనుజులుఁ దానును జనుదెంచెఁ బాండుభూ
        జనపతి జీవించి మనలఁ గావఁ
బ్రీతితోఁ దా నిప్పు డేతెంచె మే లయ్యె
        నిమ్మహాత్ములకుఁ దైవమ్ముఁ బురుష
కారంబుఁ గలుగంగ ధారుణీరాజ్యంబు
        వాయునే యాపదల్ వాయుఁగాక

ఆటవెలది

దాన హోమ జప విధానముల్ మన కివి
గలవయేని ధరణివలయరాజ్య
మింద యుండి ధర్మనందనుఁ డొనరించు
చుండుఁ గావుతమ యఖండితముగ.

(ప్రజలంతా పాండవులను చూసి ప్రేమతో ఇలా అనుకొన్నారు - పాండవులు రావటం మనకు మేలైనది. ధర్మరాజు హస్తినాపురంలోనే ఉండి అవిచ్ఛిన్నంగా భూమండలాన్ని పరిపాలిస్తూ ఉండుగాక.)

1_8_62 వచనము ప్రకాష్ - వసంత

వచనము

అని యుధిష్ఠిరుండు వారి యనుమతంబు వడసి తమ్ములు దానును హస్తిపురంబునకుఁ బోవ నిశ్చయించి ద్రుపదు వీడ్కొని ప్రయాణోన్ముఖుం డయ్యె నిట్లు విదురుండు పాండవులఁ బాంచాలిని గుంతీదేవినిం దోడ్కొని వాసుదేవ ధృష్టద్యుమ్ను లపరిమిత సేనాసమన్వితు లై తోడ రాఁగా వచ్చునంత వారలరాక విని ధృతరాష్ట్రుండు వికర్ణ చిత్రసేన ద్రోణ కృపాచార్యుల నెదురు పుత్తెంచినం దత్సైన్యసమేతు లయి మహోత్సవంబుతోఁ బాండవులు గజపురవ్రవేశంబు సేయునప్పుడు వారలం జూచి.

(అని ధర్మరాజు వారి అనుమతి పొంది హస్తినాపురానికి అందరితో కలిసి వెళ్లగా.)

-:పాండవులు హస్తిపురంబునకు వచ్చుట:-

1_8_61 కందము ప్రకాష్ - వసంత

కందము

కురు ముఖ్యులు ధృతరాష్ట్రవి
దుర భీష్ములు గురులు మాకు ద్రుపద ప్రభుఁడున్
గురుఁడు మురాంతకుఁడు జగ
ద్గురుఁ డిందఱ మతమునను నగున్ శుభయుక్తుల్.

(వీరందరి సమ్మతి వల్ల మాకు శుభాలే కలుగుతాయి.)

1_8_60 వచనము కిరణ్ - వసంత

వచనము

అనిన నందఱకు ధర్మనందనుం డి ట్లనియె.

(అనగా ధర్మరాజు ఇలా అన్నాడు.)

1_8_59 కందము కిరణ్ - వసంత

కందము

ఎవ్వరును నేమి సేయుదు
రివ్విదురుఁడు పాండవులకు హిత మొనరింపన్
నెవ్వగ నొండు దలంపకుఁ
డివ్వీరుల కగు నభీష్ట మిది మొదలుంగాన్.

(పాండవులకు మేలు చేసే విదురుడు ఉండగా వారిని ఎవరు ఏమి చేయగలరు? ఇది మొదలుగా పాండవులకు కోరుకొన్నది సిద్ధిస్తుంది.)

1_8_58 వచనము కిరణ్ - వసంత

వచనము

అనిన వాసుదేవుం డి ట్లనియె.

(అప్పుడు శ్రీకృష్ణుడు ఇలా అన్నాడు.)

1_8_57 కందము కిరణ్ - వసంత

కందము

నీవును ద్రోణుండును వసు
దేవతనూజుండు భీష్మధృతరాష్ట్రులు స
ద్భావమున నెద్ది సేయం
గా వగచితి రది హితంబ కా కొం డగునే.

(మీరు చేయదలచుకొన్నదానివల్ల పాండవులకు మేలే అవుతుంది.)

1_8_56 చంపకమాల కిరణ్ - వసంత

చంపకమాల

రవినిభతేజుఁ డైన ధృతరాష్ట్రుఁడు పంపఁగ నీవు కార్యగౌ
రవమున వచ్చినప్పుడ తిరంబుగ వీరికి నిష్టసిద్ధి దా
నవు టది యేమి సందియమె యంబుజనాభుఁడు నీవుఁ బాండవ
ప్రవరుల కెల్లప్రొద్దును శుభంబ తలంతురుకాదె నెమ్మితోన్.

(ధృతరాష్ట్రుడు పంపగా, నీవు రాగా పాండవులకు మంచి జరుగుతుందనటంలో సందేహం లేదు. శ్రీకృష్ణుడు, నీవు పాండవులకు ఎప్పుడూ శుభమే కోరుతారు కదా!)

1_8_55 వచనము కిరణ్ - వసంత

వచనము

నీచేత ననుజ్ఞాతు లై కాని వీరలు రా నేరరు గావున వీరలం బుత్తెంచు నది యనిన విదురునకు ద్రుపదుం డి ట్లనియె.

(నీ అనుమతి లభిస్తే పాండవులు రాగలరు. అందువల్ల వీరిని పంపండి - అనగా ద్రుపదుడు ఇలా అన్నాడు.)

1_8_54 కందము కిరణ్ - వసంత

కందము

గురుగుణయుతు లగు కొడుకులఁ
గురుకులము వెలుంగ నయిన కోడలిఁ గృష్ణం
బరమపతివ్రత గొంతిని
గరుణను రాఁ బనిచె రాజు గజపురమునకున్.

(పాండవులను, ద్రౌపదిని, కుంతిని ధృతరాష్ట్రుడు హస్తినాపురానికి పిలుచుకొని రమ్మన్నాడు.)

1_8_53 ఉత్పలమాల కిరణ్ - వసంత

ఉత్పలమాల

తల్లియుఁ బుత్త్రులేవురు నుదాత్తమతుల్ దమయొద్ద వాసినం
దల్లడమంది యందఱును దద్దయు దుఃఖిత చిత్తు లైరి నీ
యల్లురఁ బాండుపుత్త్రులఁ బ్రియంబునఁ జూడఁగఁ గోరుచున్న వా
రెల్ల జనంబులుం గురుకులేశ్వరుఁ డాదిగ బంధువర్గమున్.

(అక్కడ అందరూ పాండవులను చూడగోరుతున్నారు.)

1_8_52 మత్తేభము కిరణ్ - వసంత

మత్తేభము

అభిజాతుండవు ధర్మశీలుఁడవు నీయం దైన సంబంధ మిం
దభిరమ్యం బనురూప మిష్ట మని సౌహార్దంబునన్ జాహ్నవీ
ప్రభవుండున్ ధృతరాష్ట్రుఁడుం గృపుఁడుఁ గుంభప్రోద్భవుండున్ యశో
విభవాలంకృత సంతసంబు పడి రుర్వీవంద్యు లిష్టంబునన్.

(మహారాజా! నీతో బంధుత్వం ఏర్పడినందుకు భీష్మ, ధృతరాష్ట్ర, కృప, ద్రోణులు సంతోషించారు.)

1_8_51 వచనము కిరణ్ - వసంత

వచనము

మీపంచినవిధంబున నప్పాండవుల కర్ధరాజ్యం బిచ్చెద నని భీష్మవిదురద్రోణాదు లయిన బాంధవప్రధానులయు దుర్యోధనాదు లయిన పుత్త్రులయు సమక్షంబున నిశ్చయించి యప్పుడ పాండవులం దోడ్తేర విదురుం బంచిన నాతండును ధృతరాష్ట్రుశాసనంబున ద్రుపదుపురంబునకుం జని పుత్త్రభ్రాతృపరివృతుం డై యున్న ద్రుపదుని వాసుదేవసహితు లై యున్నపాండవులనుం గాంచి ధృతరాష్ట్రుండు పుత్తెంచిన వివిధరత్నభూషణాదుల వేఱువేఱ యిచ్చి తానును వారిచేతఁ బ్రతిపూజితుం డై కేశవపాండవసమక్షంబున విదురుండు ద్రుపదున కి ట్లనియె.

(మీరు ఆజ్ఞాపించిన విధంగా ఆ పాండవులకు సగం రాజ్యం ఇస్తాను - అని పాండవులను పిలుచుకొనిరావటానికి విదురుడిని పంపాడు. విదురుడు అలాగే ద్రుపదుడి పురానికి వెళ్లి ధృతరాష్ట్రుడు పంపిన కానుకలను ఇచ్చి శ్రీకృష్ణపాండవుల ఎదుట ద్రుపదుడితో ఇలా అన్నాడు.)

-:పాండవులను దోడ్తేర ధృతరాష్ట్రుండు విదురునిఁ బంచుట:-

1_8_50 కందము కిరణ్ - వసంత

కందము

నీవును భీష్ముఁడు ద్రోణుఁడు
భూ వినుత విశుద్ధ ధర్మబుద్ధుల రగుటన్
మీ వచనమున కవజ్ఞత
గావింపఁగ నంత కార్యగతి మూఢుఁడనే.

(నీవు, భీష్మద్రోణులు ధర్మబుద్ది కలవాళ్లు. మీ మాటను తోసిపుచ్చుతానా? అంత పనివైనం తెలియని అవివేకినా?)

1_8_49 వచనము కిరణ్ - వసంత

వచనము

వారల బలపరాక్రమంబు లెల్లవారికి దృష్టపూర్వంబుల యట్టివారితోడ విగ్రహంబు సేయు దుర్బుద్ధులుం గలరె నీపుణ్యమ్మున నమ్మహాత్ములు జననీసహితంబు లక్కయింట బ్రతికిరి నీయందుఁ బురోచనదిగ్ధం బయిన దుర్యశఃపంకంబుఁ బాండవానుగ్రహజలంబులం జేసి కడిగికొనుము దుర్యోధనాపరాధంబున నఖిలమహీప్రజకు నపాయం బగు నని తొల్లియు నీకుం జెప్పితి నట్లు గాకుండ రక్షింపు మనిన విని ధృతరాష్ట్రుండు విదురున కి ట్లనియె.

(వారితో యుద్ధం చేసే దుర్బుద్ధులు ఉన్నారా? నీ పుణ్యం వల్ల వారు లక్కయింట్లో తల్లితో కూడా బ్రతికారు. పురోచనుడి వల్ల నీకు అంటిన అపకీర్తిని పాండవుల పట్ల దయ చూపి తొలగించుకో. దుర్యోధనుడి తప్పు వల్ల లోకానికి అపాయం కలుగుతుందని నీకు ముందే చెప్పాను. అలా కాకుండా రక్షించు - అనగా ధృతరాష్ట్రుడు విదురుడితో ఇలా అన్నాడు.)

1_8_48 కందము కిరణ్ - వసంత

కందము

తమ్ములయట్టుల తనకు వ
శమ్మయి ధర్మువును ధృతియు సత్యముఁ గారు
ణ్యమ్మును నొప్పఁగఁ బేర్మి ని
జమ్ముగ మను ధర్మజున కసాధ్యము గలదే.

(ఆ ధర్మరాజుకు అసాధ్యమైనది ఏముంది?)

1_8_47 ఉత్పలమాల కిరణ్ - వసంత

ఉత్పలమాల

ఆయుతబాహుఁ డాతనికి నగ్రజుఁ డగ్రణి పోరులందు నా
గాయుతసత్త్వుఁ డుద్ధతయుగాంతకృతాంతనిభుండు భీముఁ డ
వ్యాయుజసవ్యసాచుల నవార్యబలోన్నతిఁ బోలుచున్న మా
ద్రేయు లజేయు లెవ్వరికి దేవసముల్ సమరాంతరంబునన్.

(ఆ అర్జునుడి అన్న భీముడు మహావీరుడు. పరాక్రమంలో వారిని పోలే నకులసహదేవులను జయించటం ఎవరికీ సాధ్యం కాదు.)

1_8_46 ఉత్పలమాల కిరణ్ - వసంత

ఉత్పలమాల

ఆహవభూమిలోనఁ బరమార్థము పార్థుఁడు వైరివాహినీ
వ్యూహము వ్రచ్చుచోట మఘవుండును వానికి మార్కొనంగ ను
త్సాహముసేయఁ డన్న లఘుసారు లధీరు లసాహసుల్ నిరు
త్సాహులు ద్రోహులై యెదిరి చత్తురొ మందురొ మానవేశ్వరా.

(మహారాజా! అర్జునుడు శత్రుసేనల వ్యూహాన్ని చీల్చేచోట ఇంద్రుడు కూడా అతడిని ఎదుర్కొనలేడు. ఇక బలం, సాహసం, ఉత్సాహం లేనివారు ద్రోహబుద్ధితో అతడిని ఎదుర్కొని చస్తారో, బ్రతుకుతారో నీవే ఆలోచించు.)

1_8_45 మత్తేభము కిరణ్ - వసంత

మత్తేభము

బలదేవాచ్యుతసాత్యకుల్ దమకు నొప్పన్ మిత్రులుం గూర్చు మం
త్రులుఁగా దైవము మానుషంబుఁ గల నిత్యుల్ నీకు దుర్యోధనా
దులకంటెం గడుభక్తు లెంతయు వినీతుల్ వీరు లప్పాండుపు
త్త్రులు నీపుత్త్రుల కారె వారిఁ దగునే దూరస్థులం జేయఁగన్.

(బలరాముడు, శ్రీకృష్ణుడు, సాత్యకి పాండవులకు మిత్రులు. దుర్యోధనాదుల కంటే భక్తి వినయాలు కల పాండవులు నీకు పుత్రులు కారా? వారిని దూరం చేయటం తగిన పనేనా?)

1_8_44 మత్తేభము కిరణ్ - వసంత

మత్తేభము

తమకుం దార యజేయు లెవ్వరికి దోర్దర్పంబునన్ దానిపై
శమితారాతి బలుండు వారలకుఁ బాంచాల ప్రభుం డిప్డు సు
ట్టము దానయ్యెఁ దదాత్మజుండయిన ధృష్టద్యుమ్నుడున్ వారితో
సమవీర్యుం డొడఁగూడె నిష్ట సఖుఁ డై సంబంధ బంధంబునన్.

(పాండవులు ఎవరికీ జయింప శక్యం కాని వాళ్లు. మహాబలవంతుడైన పాంచాలరాజు ఇప్పుడు వారికి మిత్రుడు. అతడి కుమారుడైన ధృష్టద్యుమ్నుడు పాండవులతో సమానమైన పరాక్రమం కలవాడు.)

1_8_43 సీసము + ఆటవెలది కిరణ్ - వసంత

సీసము

ధర్మార్థవిత్తముల్ తథ్యవాదులు వయో
        వృద్ధులు మధ్యస్థవిమలమతులు
ద్రోణగాంగేయులు దురితవిదూరులు
        ని న్నెద్దిగఱపిరి నెమ్మితోడ
దానిన చేయుట ధర్మువు వారల
        కంటె హితుల్ నీకుఁ గలరె యొరులు
దుర్యోధనుండును దుశ్శాసనుండును
        గర్ణుండు శకునియుఁ గరము బాలు

ఆటవెలది

రెఱుఁగ రిదియు ధర్ము విది యధర్మం బని
యట్టివారిపలుకు లాచరించి
వినక పాండుసుతుల వేగ రావించి వా
రలకుఁ బ్రీతి నర్ధరాజ్య మిమ్ము.

(ద్రోణభీష్ములు ఉపదేశించినది చేయటం నీకు ధర్మం. ఆ యిద్దరి కంటే నీ మేలు కోరేవారెవరున్నారు? దుర్యోధనుడు, దుశ్శాసనుడు, కర్ణుడు, శకుని చాలా అవివేకులు. వారి మాటలు వినక పాండవులను రప్పించి అర్ధరాజ్యం ఇవ్వు.)

1_8_42 వచనము కిరణ్ - వసంత

వచనము

అనుచున్న సమయంబున నయ్యిద్దఱ వారించి విదురుండు ధృతరాష్ట్రున కి ట్లనియె.

(అప్పుడు విదురుడు ద్రోణకర్ణులను ఆపి ధృతరాష్ట్రుడితో ఇలా అన్నాడు.)

Thursday, November 30, 2006

1_8_41 కందము కిరణ్ - వసంత

కందము

నీకఱపుల నిక్కురుకుల
మాకులతం బొందు టేమి యాశ్చర్యము సౌ
మ్యాకృతులు గానివారల
వాకులు శిక్షలు నుపద్రవంబుల కావే.

(నీ ఉపదేశాలవల్ల కురుకులం కలతపొందటం ఆశ్చర్యం కాదు. సౌమ్యంగా లేనివారి మాటలు కీడునే కలిగిస్తాయి కదా.)

1_8_40 కందము కిరణ్ - వసంత

కందము

ఉడుగక యే మహితముఁ బలి
కెడు వారము నీవు హితవు క్రియ గొనఁగా బ
ల్కెడు వాఁడవు మాకంటెను
గడు హితుఁడవు నీవ కావె కౌరవ్యులకున్.

(మేము చెడు చెప్పేవాళ్లమా? నీవు హితం చెప్పేవాడివా? కౌరవులకు మాకంటే నీవే హితుడవా?)

1_8_39 వచనము కిరణ్ - వసంత

వచనము

మంత్రులు దమ తమ బుద్ధి దోషంబుల నెట్లునుం బలుకుదురు వారల సాధుత్వంబును నసాధుత్వంబును నెఱుంగవలయు నెట్లనినఁ దొల్లి నితంతు వను మగధరాజు వికలేంద్రియవర్గుం డయి శ్వాసమాత్రంబ తక్కి రాజ్యతంత్రంబునం దసమర్థుం డై యున్న నాతనిమంత్రి యేకప్రధానుం డయి రాజ్యతంత్రం బెల్లఁ దనవశంబ యగుటం జేసి వాని నవమానించి తదీయరాజ్యవిభవం బెల్లఁ జేకొనియె వాఁడును విక్రమహీనుం డయి రాజ్యంబు గోల్పడియెం గావున మంత్రులు హితులపోలె నుండి యహితం బాచరింతురు మీయిద్దఱపలుకులు మాకుం జూడ నహితంబు లనిన నలిగి వానికి ద్రోణుం డి ట్లనియె.

(మంత్రులు మనస్సులో కల్మషం ఉంచుకొని ఏదో విధంగా మాట్లాడుతారు. మేలుకోరేవారిలా ఉండి కీడు చేస్తారు. మీ ఇద్దరి మాటలు మాకు కీడు చేసేటటువంటివి - అనగా ద్రోణుడు కోపంతో ఇలా అన్నాడు.)

1_8_38 తేటగీతి కిరణ్ - వసంత

తేటగీతి

ముదుసళులు దమ కిమ్ముగాఁ జదివికొండ్రు
గాక పతులకు హిత మగు కర్జ మేల
యొలసి చెప్పుదు రహితులఁ గలపి కొనుట
ధర్ము వని రిది నయ విరుద్ధంబు గాదె.

(ముసలివారు తమకు అనుకూలంగా చెపుతారు కానీ రాజులకు మేలు కలిగేలా చెప్పరు. శత్రువులైన పాండవులను చేర్చుకోవటం ధర్మం అన్నారు. ఇది న్యాయవిరుద్ధం కాదా?)

1_8_37 వచనము కిరణ్ - వసంత

వచనము

వారితో విగ్రహించుట కార్యంబు గాదు కావునఁ బాండవద్రుపదధృష్టద్యుమ్నకుంతీద్రౌపదులకుఁ బ్రియపూర్వకంబున నుచితభూషణాంబరావళులు వేఱు వేఱ యిచ్చిపుచ్చి పాండవుల నిందులకుఁ దోడ్కొనివచ్చువారుగా దుశ్శాసనవికర్ణప్రభృతులసమకట్టి పంపు మనిన ద్రోణుపలుకు లవకర్ణించి కర్ణుం డి ట్లనియె.

(వారితో యుద్ధం తగని పని. వారికి కానుకలు పంపి పిలుచుకొని రావటానికి దుశ్శాసనుడు, వికర్ణుడు మొదలైనవారిని పంపు - అనగా కర్ణుడు ద్రోణుడి మాటలు పెడచెవిని పెట్టి ఇలా అన్నాడు.)

1_8_36 చంపకమాల కిరణ్ - వసంత

చంపకమాల

తనరుచు దైవయుక్తి మెయి ధర్మువు సత్యముఁ దప్పకున్న య
య్యనఘుల పైతృకం బయిన యంశము మిన్నక వజ్రపాణి కై
ననుగొనఁబోలునయ్య కురునందన పాండుతనూజు లున్న వా
రని విని వారికిం దగు ప్రియం బొనరింపక యున్కి ధర్మువే.

(పాండవుల తండ్రి భాగాన్ని తీసుకోవటం ఇంద్రుడికి కూడా సాధ్యం కాదు. వారు జీవించే ఉన్నారని విని కూడా వాళ్లకు సంతోషం కలిగించపోవటం ధర్మమా?)

1_8_35 మత్తేభము కిరణ్ - వసంత

మత్తేభము

విలసద్ధర్మవిశుద్ధవృత్తులు వయోవృద్ధుల్ కుశాగ్రీయబు
ద్ధులు మధ్యస్థులు కార్యనిర్ణయసమర్థుల్ మానమాత్సర్యదూ
రులు నాఁ జాలినవారిపల్కులకు వైరుద్ధ్యంబు గావించు న
జ్ఞులు భూనాథున కాప్తులున్ సఖులు నై శోషింతు రత్యంతమున్.

(మంచివారి మాటలు కాదనే అవివేకులు రాజుకు స్నేహితులై అతడిని చెడగొడతారు.)

1_8_34 చంపకమాల కిరణ్ - వసంత

చంపకమాల

బహుగుణ ముత్తమోత్తమము పథ్యము ధర్మ్యము సాధుసమ్మతం
బహిత బలప్రమాధివిపులార్థయుతం బగుటన్ భవత్పితా
మహువచనంబుఁ జేకొనుము మానుగ వారలతోడ నీవు ని
గ్రహ మొనరింప నేమిటికిఁ గౌరవసౌబలకర్ణశిక్షలన్.

(నీ తాత భీష్ముడి మాట స్వీకరించు. కౌరవులు, శకుని, కర్ణుడు చెప్పే మాటలు విని పాండవులతో యుద్ధం చేయటం ఎందుకు?)

1_8_33 వచనము కిరణ్ - వసంత

వచనము

కీర్తియు నపకీర్తియు జనులకు స్వర్గ నరక నిమిత్తంబులు గావున నపకీర్తి పరిహరించి కీర్తింబ్రతిష్టించి పైతృకంబగు రాజ్యంబు పాండవుల కిచ్చి వారితోడ బద్ధప్రణయుండ వయి కీర్తి నిలుపు మనిన భీష్ముపలుకులకు సంతసిల్లి ద్రోణుండు దుర్యోధనున కి ట్లనియె.

(పాండవులతో స్నేహంగా ఉండి, కీర్తిని నిలుపు - అని భీష్ముడు అనగా ద్రోణుడు సంతోషించి, దుర్యోధనుడితో ఇలా అన్నాడు.)

1_8_32 కందము కిరణ్ - వసంత

కందము

ఇలఁ గీర్తి యెంత కాలము
గలిగి ప్రవర్తిల్లె నంతకాలంబును ని
త్యుల కారె కీర్తి గల పు
ణ్యులు కీర్తివిహీనుఁ డెందునుం బూజ్యుండే.

(కీర్తి ఉన్నంతకాలం పుణ్యాత్ములు జీవించి ఉంటారు. కీర్తిలేనివాడు ఎక్కడైనా పూజార్హుడవుతాడా?)

1_8_31 ఆటవెలది కిరణ్ - వసంత

ఆటవెలది

కీర్తి లేని వానికిని జీవనంబు ని
రర్థకంబ చూవె యవనిమీఁద
నిత్య మయిన ధనము నిర్మల కీర్తియ
యట్టి కీర్తి వడయు టశ్రమంబె.

(కీర్తిలేనివాడి బ్రతుకు వ్యర్థమే. భూమిమీద శాశ్వతధనమైన కీర్తిని పొందటం సులభమా?)

1_8_30 వచనము పవన్ - వసంత

వచనము

అ ప్పాండవులతోడి విగ్రహంబుసేఁత కెన్నండును నొడంబడనేరఁ బితృపైతామహం బయిన రాజ్యంబునకు నీయట్ల వారు నర్హులు గావున వారికి నర్ధరాజ్యం బిచ్చిన నీకును నీ బాంధవులకును లోకంబులకును బ్రియం బగు నట్లు గానినాఁ డపకీర్తి యగుఁ గీర్తి నిలుపుటయ కాదె రాజులకు జన్మఫలంబు.

(పాండవులతో యుద్ధానికి నేను సమ్మతించను. మీలాగా వారు కూడా సగం రాజ్యానికి అర్హులు. అలా ఇవ్వకపోతే అపకీర్తి కలుగుతుంది. రాజులకు కీర్తి నిలపటమే జన్మఫలం.)

-:భీష్మద్రోణులు దుర్యోధనునకు బుద్ధి సెప్పుట:-

1_8_29 మత్తకోకిల పవన్ - వసంత

మత్తకోకిల

ధీరు లౌ ధృతరాష్ట్రపాండు లతి ప్రశస్త గుణుల్ ప్రసి
ద్ధోరుకీర్తులు నాకు నిద్దఱు నొక్కరూప తలంపఁగా
వీరు వారను నట్టిబుద్ధివిభేద మెన్నడు లేదు గాం
ధారిపుత్త్రశతంబునందుఁ బృథాతనూజులయందునున్.

(ధృతరాష్ట్రపాండురాజులు ఇద్దరూ నాకొక్కటే. గాంధారి కొడుకులు, కుంతి కొడుకులు అనే భేదభావం నాకెన్నడూ లేదు.)

1_8_28 వచనము పవన్ - వసంత

వచనము

కావునఁ జతురంగ బల సాధనసన్నద్ధుల మయి యుద్ధంబునం బాంచాలు భంజించి పాండవుల నొండుగడ నుండనీక తోడ్కొనితెత్త మనినఁ గర్ణుపలుకు లాకర్ణించి ధృతరాష్ట్రుం డిది యకార్యం బగు నయినను మతిమంతులతో విచారించి చేయుద మని భీష్మద్రోణవిదురశల్యకృపాశ్వత్థామసోమదత్తాదులం బిలువంబంచి యంతయు నెఱింగించిన భీష్ముండు దుర్యోధనుం జూచి యి ట్లనియె.

(కాబట్టి ద్రుపదుడిని యుద్ధంలో ఓడించి, పాండవులను వెంటతీసుకువద్దాము - అని కర్ణుడు అనగా ధృతరాష్ట్రుడు - ఇది చేయదగని పని. అయినా బుద్ధిమంతులతో ఆలోచించి చేద్దాము - అని పెద్దలను పిలిపించి చెప్పాడు. అప్పుడు భీష్ముడు దుర్యోధనుడితో.)

1_8_27 చంపకమాల పవన్ - వసంత

చంపకమాల

ఘన మగు విక్రమంబునన కాదె జగత్త్రితయంబుఁ బాకశా
సనుఁడు జయించె భూతలము సర్వము మున్ భరతుండు విక్రమం
బునన జయించె విక్రమము భూరి యశఃప్రియు లైన రాజనం
దనులకు సర్వసాధనము ధర్మువు శత్రు నిబర్హణంబులన్.

(దేవేంద్రుడు ముల్లోకాలను, భరతుడు భూమండలాన్ని పరాక్రమం చేతనే జయించారు. గొప్పకీర్తిని కోరుకొనే వారికి పరాక్రమమే సర్వసాధనం, శత్రువధలలో ధర్మం.)