Sunday, November 01, 2009

2_1_63 వచనము ప్రకాష్ - వసంత

వచనము

అదియును నూఱుయోజనంబుల వెడల్పును నూటయేఁబది యోజనంబుల నిడుపును నేను యోజనంబుల తనర్పునుం గలిగి వైహాయసంబయి కామగమనంబయి వ్యపేతశీతాతపంబయి సకల కాల కుసుమ ఫలభరిత పాదపవన సంకీర్ణ సరోవర విరాజితంబయి తపఃప్రభావంబున నమరేంద్రుచేత నిర్మితంబయి కరం బొప్పుచుండు నట్టి సభయందు.

(ఆ సభ నూరు ఆమడల వెడల్పు, నూట యాభై ఆమడల పొడవు, ఐదు ఆమడల ఎత్తు కలిగి ఆకాశంలో ఉంటుంది. అక్కడ చలి, ఎండ ఉండవు. అన్ని కాలాల్లోనూ అక్కడి సరస్సులు, చెట్ల తోపులు పూలు, పండ్లతో నిండుగా ఉంటాయి. దీన్ని ఇంద్రుడు తన తపోబలంతో నిర్మించుకున్నాడు.)

Tuesday, September 22, 2009

2_1_62 కందము ప్రకాష్ - వసంత

కందము

శతమఖు సభ శుభ రత్నాం
చిత కాంచన రచిత మతి విచిత్రము లోక
త్రితయాఖిల లక్ష్మీ సం
శ్రిత మలవియె దానిఁ బొగడ శేషున కయినన్.

(ఇంద్రసభ ఎంతో వైభవంగా ఉంటుంది. దానిని పొగడటం ఆదిశేషుడికి కూడా సాధ్యం కాదు!)

-:ఇంద్రసభావర్ణనము:-

2_1_61 వచనము ప్రకాష్ - వసంత

వచనము

అనిన విని 'యవి యెట్టివి? వాని వినవలతు నానతిం' డని లోకపాల సభావిభవ శ్రవణ ప్రభూత కుతూహల చేతస్కుండై యడిగిన ధర్మరాజునకు నారదుం డిట్లనియె.

(దిక్పాలకుల సభలు ఎలా ఉంటాయో చెప్పమని ధర్మరాజు కుతూహలంతో నారదుడిని అడిగాడు.)

Saturday, September 19, 2009

2_1_60 కందము వోలం - వసంత

కందము

సురపతి యమ వరుణ ధనే
శ్వర కమలాసనుల దివ్యసభలెల్ల నరే
శ్వర! చూచితి నవి దీనికి
సరిగా వత్యంతవిభవ సౌందర్యములన్.

(ఇంద్ర, యమ, వరుణ, కుబేర, బ్రహ్మదేవుల సభలన్నీ చూశాను. ఐశ్వర్యంలో, సౌందర్యంలో అవి దీనికి సరితూగవు.)

2_1_59 కందము వోలం - వసంత

కందము

భూనాథ! యిది యపూర్వ మ
మానుషము విచిత్ర రత్నమయ మిట్టి సభన్
మానవలోకేశ్వరులం
దే నెన్నఁడుఁ జూచి వినియి నెఱుఁగ ధరిత్రిన్.

(మహారాజా! ఈ సభ అపూర్వం, మానవాతీతం, విచిత్రరత్నమయం. మానవలోకం లోని రాజుల దగ్గర ఇలాంటి సభను నేను ఎప్పుడూ చూసి, విని ఎరుగను.)

2_1_58 వచనం వోలం - వసంత

వచనం

అని కృతాంజలి యయి 'మునీంద్రా! యీత్రిలోకంబులయందును మీ చూడనివి లేవెందే నిట్టి యపూర్వంబైన సభ చూచి యెఱుంగుదురే?' యని మయ నిర్మితం బయిన సభ చూపినం జూచి విస్మితుండయి నారదుండు ధర్మరాజున కి ట్లనియె.

(అని, "మునీంద్రా! ఈ మూడులోకాల్లో మీరు చూడనివి లేవు. ఎక్కడైనా ఇలాంటి అపూర్వమైన సభను చూశారా?", అని మయుడు నిర్మించిన ఆ సభను చూపించగా నారదుడు ఆశ్చర్యపోయి ధర్మరాజుతో ఇలా అన్నాడు.)

-:ఇట్టి సభ నెచ్చటనైనఁ జూచితిరా యని ధర్మజుఁడు నారదు నడుగుట:-

2_1_57 తేటగీతి వోలం - వసంత

తేటగీతి

నాయథాశక్తిఁ జేసి యన్యాయపథముఁ
బరిహరించి మహాత్ముల చరితలందు
బుద్ధి నిలిపి మీ యుపదేశమున శుభంబు
లయిన వాని ననుష్ఠింతుఁ బ్రియముతోడ.

(నాకు చేతనైనంతవరకు అన్యాయమార్గం వదిలి, మహాత్ముల చరితలపై బుద్ధినిలిపి మీ ఉపదేశం వల్ల మంచి పనులు ఆచరిస్తాను.)

Saturday, May 30, 2009

2_1_56 వచనం వోలం - వసంత

వచనం

మఱియు నాస్తిక్యం బనృతంబు ప్రమాదం బాలస్యం బనర్థజ్ఞులతోడి చింతనంబు క్రోధంబు దీర్ఘచింత దీర్ఘ
సూత్ర్తత యెఱుకగలవారి నెఱుంగమి యర్థంబుల యందనర్థకచింత నిశ్చిత కార్యంబులు సేయమి మంత్రంబుల
రక్షింపమి శుభంబులఁ బ్రయోగింపమి విషయంబులం దగులుట యనంబరఁగిన పదునాలుఁగు
రాజదోషంబులఁ బరిహరింతె యని యడిగిన నారదునకు ధర్మరా జిట్లనియె.

(నాస్తికత, అబద్ధమాడటం, ఏమరుపాటు, సోమరితనం, తెలివితక్కువవాళ్లతో కార్యాలోచన చేయటం, కోపం, ఎక్కువకాలం చింతించటం, చేయవలసిన పనిగురించి ఎక్కువకాలం ఆలోచించటం, ఆలస్యంగా చేయటం, జ్ఢానులను గుర్తించకపోవటం, ప్రయోజనకరమైన విషయాల్లో ప్రయోజనం లేని ఆలోచనలు చేయటం, నిర్ణయించిన పనులు చేయకపోవటం, రహస్యాలు కాపాడుకోలేకపోవటం, శుభకార్యాలు చేయకపోవటం, ఇంద్రియలోలత్వం - అనే పదునాలుగు రాజదోషాలను విడిచిపెట్టావు కదా అన్న నారదుడితో ధర్మరాజు ఇలా అన్నాడు)