Wednesday, August 30, 2006

1_7_140 చంపకమాల నచకి - వసంత

చంపకమాల

అతని తపంబు పెంపునఁ జరాచరసంభృత మైన విష్టప
త్రితయము భీతిఁ బొందిన ధృతిం బితృలోకనివాసు లైన త
త్పితృవరు లెల్ల వచ్చి కడుఁ బ్రీతిఁ నపాకృత గర్వు నౌర్వున
ప్రతిమ తపోవిభాసిఁ గని పల్కిరి తద్దయు శాంతచిత్తు లై.

(అతడి తపస్సుకు అందరూ భయపడగా అతడి పితృదేవతలు వచ్చి ఔర్వుడితో ఇలా పలికారు.)

1_7_139 వచనము నచకి - వసంత

వచనము

ఇ క్కుమారుండు నూఱు సంవత్సరములు నా యూరు గర్భంబున నుండి సకల వేదవేదాంగంబులు నేర్చినవాఁడు మహాతపోనిధి మీకుం గరుణించు నితనిం బ్రార్థింపుం డనిన నాక్షత్త్రియులు నతిభక్తు లై యౌర్వుం బ్రార్థించి తత్ప్రసాదంబున దృష్టులు వడసి చని రంత నౌర్వుండు దన పిత్రుబంధుజనులెల్ల నొక్కటం బరలోకగతు లగుటకు దుఃఖించి సకలలోక ప్రళయార్థంబుగా ఘోరతపంబు సేయందొడంగిన.

(ఇతడిని ప్రార్థించండి - అనగా వారు అలాగే చేసి తమ దృష్టిని తిరిగిపొందారు. తరువాత ఔర్వుడు తన తండ్రులు, బంధువులు అందరూ ఒక్కసారిగా మరణించినందుకు దుఃఖించి లోకాలన్నీ నాశనం చేసేందుకు ఘోరతపస్సు చేయటానికి పూనుకొన్నాడు.)

1_7_138 మధ్యాక్కర నచకి - వసంత

మధ్యాక్కర

ఏను మీ దృష్టులు గొన్నదానఁ గా నిక్కుమారుండు
భానుతేజుండు మీచేఁ దనగురులు పరిభూతు లయిన
దానికి నలిగి మీ పాపబుద్ధికిఁ దగ నిట్లు సేసె
వీని మీ రెఱుఁగరె భార్గవకులము వెలిఁగించువాని.

(మీ దృష్టిని పోగొట్టింది ఈ కుమారుడు. తన తండ్రితాతలను మీరు అవమానించినందుకు ఇలా చేశాడు. భార్గవకులాన్ని ప్రకాశింపజేసే వీడు మీకు తెలియదా?)

1_7_137 వచనము నచకి - వసంత

వచనము

అ ట్లా క్షత్త్రియులందఱు నంధు లై భృగుపత్నియొద్దకు వచ్చి మాకు దృష్టిదానంబుఁ బ్రసాదింపవలయు నని వేఁడిన నది వారల కి ట్లనియె.

(ఆ &త్రియులు భృగుపత్ని దగ్గరకు వచ్చి, మాకు దృష్టిదానం చేయమని వేడుకోగా, ఆమె ఇలా అన్నది.)

1_7_136 మత్తేభము నచకి - వసంత

మత్తేభము

అమితౌజుం డగు వానిఁ జూచి కృతవీర్యామ్నాయజ క్షత్త్రియా
ధములెల్లన్ హతదృష్టు లై కృపణతం దద్పర్వతారణ్యదే
శములం గ్రుమ్మరుచుండి రంధు లయి నిశ్శంకం బతిక్రూరక
ర్మములం దుద్యతు లైన వారికి నశర్మప్రాప్తి గాకుండునే.

(ఔర్వుడిని చూడగానే కృతవీర్యుని వంశంవారు దృష్టి కోల్పోయారు. క్రూరమైన పనులు చేసేవారిికి దుఃఖం కలగకుండా ఉంటుందా?)

Saturday, August 26, 2006

1_7_135 కందము నచకి - వసంత

కందము

భువనోపప్లవసమయో
ద్భవ భానునిభప్రభాసితుఁ డయి భా
ర్గవుఁ డూరు దేశమున ను
ద్భవించె మహి వెలుఁగుచుండఁ బ్రభ నౌర్వుఁ డనన్.

(ఆమె తొడనుండి ఔర్వుడనేవాడు పుట్టాడు.)

-:భార్గవుండైన ఔర్వునిజననము:-

1_7_134 వచనము నచకి - వసంత

వచనము

అంత నా క్షత్త్రియు లొక్క భార్గవుని యిల్లు గ్రొచ్చి యనంతం బయిన యర్థంబుం గని యలిగి రాజధనవంచకు లై రని భార్గవుల నెల్ల నిగ్రహించి గర్భంబుల నున్న యర్భకులు మొదలుగా వధియించిన వెఱచి భార్గవుల భార్యలెల్ల హిమవంతంబునకుం బాఱిన నం దొక్క భృగుపత్ని భయంపడి తన యూరుదేశంబున గర్భంబు ధరియించిన నెఱింగి క్షత్త్రియులు దాని భేదింప సమకట్టి వచ్చిన నంతకు ముందఱ.

(తరువాత ఆ క్షత్రియులు ఒక భార్గవుడి ఇల్లు తవ్వి, ధనం చూసి, ఆగ్రహించి భృగువంశం వారందరినీ చంపగా, వారి భార్యలు హిమాలయాలకు పరుగెత్తారు. క్షత్రియులు వారిలో ఒక భృగుపత్ని గర్భం విచ్ఛిన్నం చేయటానికి రాగా, అంతకు ముందే.)

1_7_133 సీసము + తేటగీతి నచకి - వసంత

సీసము

వినవయ్య కృతవీర్యుఁ డను జనపతి దొల్లి
        భృగు వంశ యాజ్యుఁ డై పెక్కుక్రతువు
లొనరించి యగణిత ధనదానముల వారిఁ
        దృప్తులఁ గావించి దివికిఁ జనిన
నతనివంశమున వా రతిధనలుబ్ధు లై
        కృతవీర్యు ధనమెల్లఁ గ్లప్తి సేసి
కొని డాఁచియున్నవా రని భార్గవుల నెల్లఁ
        బలికిన భార్గవుల్ భయము వొంది

తేటగీతి

కొంద ఱర్థము వారిక కూర్చి యిచ్చి
రవనిసురవంశ్యులకు నిచ్చి రందుఁ గొంద
ఱెవ్వరికి నీక తమ తమ యిండ్లఁ బాఁతి
కొని సుఖం బుండి రధము లై కొంద ఱందు.

(పూర్వం కృతవీర్యుడనే రాజు భృగువంశ బ్రాహ్మణులకు చాలా ధనం దానం చేశాడు. అతని వంశంవాళ్లు - కృతవీర్యుని ధనమంతా భార్గవులు దాచుకొని ఉన్నారు - అనగా వాళ్లు భయపడి తమ ధనాన్ని ఒకచోట చేర్చి వాళ్లకే ఇచ్చారు. కొంతమంది మాత్రం ధనాన్ని వేరే వంశాల వారికి ఇచ్చారు. కొందరు తమ ఇళ్లలో పాతిపెట్టుకొన్నారు.

1_7_132 వచనము నచకి - వసంత

వచనము

అని తన భార్యయైన మదయంతి యనుదానిని ఋతుమతి సమర్పించిన నదియు వసిష్ఠు ప్రసాదంబున గర్భిణి యయి పండ్రెండేఁడులు గర్భంబు మోచి వేసరి యొక్క యశ్మశకలంబున నుదరభేదనంబుఁ జేసిన నశ్మకుం డను రాజర్షి పుట్టె నట యదృశ్యంతికిం బరాశరుం డుదయించి వసిష్ఠ నిర్మిత జాతకర్మాదికుం డయి పెరుఁగుచు నొక్కనాఁడు రాక్షసభక్షణంబునం దన జనకు పంచత్వంబు దల్లివలన విని కోపదహనదందహ్యమానహృదయుం డయి తపోమహత్త్వంబున నఖిల లోక సంహారంబు సేయుదు నని యున్న మనుమని వారించి వసిష్ఠుం డి ట్లనియె.

(వసిష్ఠుడి ప్రసాదం వల్ల మదయంతి గర్భం ధరించి, పన్నెండేళ్లు మోసి, విసుగు చెంది, ఒక రాతిముక్కతో కడుపు చీల్చుకోగా ఆమెకు అశ్మకుడు జన్మించాడు. అదృశ్యంతికి పరాశరుడు జన్మించాడు. రాక్షసుడి వల్ల తన తండ్రి మరణించాడని తన తల్లి ద్వారా తెలుసుకొని, ఆగ్రహించి, తపోశక్తితో లోకాలను నాశనం చేస్తానని పూనుకొన్నాడు. వసిష్ఠడు మనుమడిని వారించి ఇలా అన్నాడు.)

1_7_131 కందము నచకి - వసంత

కందము

మనుకుల పవిత్రుఁ బుత్త్రకు
నినసన్నిభ నాకుఁ బడయు మే నట్లయినన్
మునినాథ నీ ప్రసాదం
బునఁ బితరులవలన ఋణవిముక్తుఁడ నగుదున్.

(నాకు పుత్రుడిని ప్రసాదించు.)

-:వసిష్ఠప్రసాదంబునఁ గల్మాషపాదుఁడు పుత్త్రవంతుఁ డగుట:-

1_7_130 వచనము నచకి - వసంత

వచనము

అని కఱపిన నట్ల చేయుదు నని యమ్మహీపతి వసిష్ఠుం దోడ్కొని యయోధ్యాపురంబున కరిగి సకలప్రజానురాగకరుం డయి యమ్మునివరు నతిభక్తిం బూజించుచుఁ దొల్లి రాక్షసుం డయి మదయంతీసహితంబు వనంబునం గ్రుమ్మరియెడి కాలం బొక్క బ్రాహ్మణ మిథునంబు ఋతుకాలప్రవృత్తి నున్నం గని యాఁ కంటి పెలుచన నందు బ్రాహ్మణుం బట్టికొని భక్షించిన నతిదుఃఖిత యై యాబ్రాహ్మణభార్య పరమపతివ్రత యాంగిరసి యనునది పురుషవియోగంబునం బుత్త్రార్థంబయిన నిజప్రయత్నంబు విఫలం బగుటకు శోకించి వనితాసంభోగంబున నీవును నా పురుషునట్లు పంచత్వంబునుం బొందు మని శాపంబిచ్చి వసిష్ఠువలన నీకుఁ బుత్త్రలాభం బగు నని చెప్పి యగ్నిప్రవేశంబు సేసినం బదంపడి దీని నంతయు మదయంతి వలన నెఱింగినవాఁ డై తనకుఁ బుత్త్రోత్పాదన సామర్థ్యంబు లేమిం దలంచి కల్మాషపాదుండు పుత్త్రార్థి యయి వసిష్ఠున కి ట్లనియె.

(అతడు అంగీకరించి, వసిష్ఠుడిని వెంటబెట్టుకొని అయోధ్యకు వెళ్లాడు. పూర్వం రాక్షసరూపంలో ఉండి తన భార్య మదయంతితో అడవిలో తిరిగే కాలంలో, ఆకలితో, ఒక బ్రాహ్మణ దంపతుల జంటలో భర్తను భక్షించగా అతడి భార్య ఆంగిరసి - వనితాసంభోగంలో నువ్వు కూడా నా భర్తలాగే మరణిస్తావు - అని శపించి - వసిష్ఠుడి వల్ల నీకు పుత్రలాభం కలుగుతుంది - అని చెప్పి అగ్నిప్రవేశం చేసింది. ఈ విషయం మదయంతి ద్వారా తెలుసుకొని కల్మాషపాదుడు వసిష్ఠుడితో ఇలా అన్నాడు.)

1_7_129 చంపకమాల నచకి - వసంత

చంపకమాల

గుణముల నొప్పి బ్రాహ్మణులకుం గడుభక్తుఁడ వై సమస్త ధా
రుణి ప్రజ గూర్పఁగా విగతరోషుఁడ వై సుఖ ముండు మింక బ్రా
హ్మణుల కవజ్ఞ సేయక శమంబును చేకొను మింద్రుఁ డైన బ్రా
హ్మణుల కవజ్ఞ సేసి యవమానముఁ బొందుఁ బ్రతాపహీనుఁ డై.

(మంచి గుణాలతో జీవించు. బ్రాహ్మణులను అవమానిస్తే ఇంద్రుడైనా పరాక్రమహీనుడై అవమానం పొందుతాడు.)

1_7_128 వచనము నచకి - వసంత

వచనము

ఇట్లు శాప విముక్తుం డై కల్మాషపాదుండు వసిష్ఠునకు నమస్కరించి ముకుళిత కర కమలుఁ డై మునీంద్రా నీ ప్రసాదంబున శాపంబువలనం బాసి కృతార్థుండ నయితి ననిన వానికి వసిష్ఠుం డి ట్లనియె.

(నీ దయవల్ల నాకు శాపవిముక్తి కలిగింది - అనగా వసిష్ఠుడు ఇలా అన్నాడు.)

1_7_127 కందము నచకి - వసంత

కందము

భూపాలకుండు బ్రాహ్మణ
శాపంబునఁ బదియురెండుసంవత్సరముల్
పాపమతి నుండి రాక్షస
రూపము చెడి యపుడు మనుజ రూపముఁ దాల్చెన్.

(అప్పుడు కల్మాషపాదుడు మానవరూపం పొందాడు.)

-:వసిష్ఠువలనఁ గల్మాషపాదుండు శాపవిముక్తిఁ జెందుట:-

1_7_126 వచనము నచకి - వసంత

వచనము

అనవరత వేదాధ్యయనశీలుం డయిన శక్తిచదువు వినుచుం బండ్రెండేఁడులు గర్భంబునుండి సకలవేదంబులు ధరియించినవాఁ డీ పౌత్రుముఖంబు చూచి యేను గృతార్థుండ నగుదు నని వసిష్ఠుండు మరణవ్యవసాయ నివృత్తుం డై నిజాశ్రమంబున నుండునంత నొక్కనాఁడు రాక్షస రూప ధరుం డై రౌద్రాకారంబున వచ్చు కల్మాషపాదుం జూచి యదృశ్యంతి వెఱచిన దాని నోడకుండు మని మునివరుండు హుంకారంబున రాక్షసు వారించి వానిపయి మంత్రపూతంబు లైన కమండలుజలంబు లొలికిన.

(ఆ మనుమడిని చూడటం కోసం వసిష్ఠుడు ఆత్మహత్యాప్రయత్నం మాని తన ఆశ్రమంలో ఉండిపోయాడు. ఒకరోజు కల్మాషపాదుడు రాక్షసరూపంలో రాగా అదృశ్యంతి భయపడింది. వసిష్ఠుడు ఆమెను భయపడవద్దని చెప్పి ఆ రాక్షసుడిపైన తన కమండలజలాన్ని చల్లాడు.)

Thursday, August 24, 2006

1_7_125 తేటగీతి నచకి - వసంత

తేటగీతి

శక్తి చదువును బోలె సువ్యక్త మగుచు
వీనులకు నిది యమృతోపమాన మయ్యె
వేదనాదంబు దీని పుణ్యోదరమున
నున్నవాఁడు సుతుండు విద్వన్నుతుండు.

(శక్తి చదువుతున్న వేదంలా వినపడుతున్న ఆ వేదనాదం విని - ఇతడు విద్వన్నుతుడవుతాడు - అని.)

1_7_124 వచనము నచకి - వసంత

వచనము

ఇట్లు పెక్కువిధంబుల నాత్మపరిత్యాగంబునందుఁ గృతనిశ్చయుం డయ్యును నప్రాప్త మరణుం డయి వసిష్ఠుండు నిజాశ్రమంబునకు వచ్చువాఁడు దన పిఱుంద వచ్చు కోడలి నదృశ్యంతి యనుదాని శక్తిభార్య నప్పు డెఱింగి దాని యుదరంబుననుండి షడంగాలంకృత వేదధ్వని గరంబు మధురం బై వీతెంచిన విని విస్మితుం డయి.

(మరణించటానికి ఇలా చాలా రకాలుగా ప్రయత్నించి, వీలు కాక, ఆశ్రమానికి తిరిగివస్తూ, తన వెనుకనే వస్తున్న తన కోడలిని, అదృశ్యంతిని, చూసి ఆమె గర్భం నుండి వస్తున్న వేదధ్వని విని ఆశ్చర్యపడి.)

1_7_123 మధ్యాక్కర నచకి - వసంత

మధ్యాక్కర

ఘన పాశములఁ జేసి యెల్ల యంగముల్ గలయ బంధించి
కొని యొక్కనదిఁ జొచ్చి మునిఁగినను వంతఁ గూరి యున్నదియుఁ
దన దివ్యశక్తి నప్పాశముల విడిచి తన్మునినాథుఁ
బనుగొనఁ దీరంబు చేరఁ బెట్టి విపాశనాఁ బరగె.

(తనను తాను తాళ్లతో కట్టుకొని మరొక నదిలో దూకగా అది ఆ కట్లు విప్పి వసిష్ఠుడిని తీరం చేర్చి విపాశ అనే పేరు పొందింది.)

1_7_122 మధ్యాక్కర నచకి - వసంత

మధ్యాక్కర

వదలక మరణార్థి యగుచు మునినాథవరుఁడు దా నొక్క
నది నుదగ్రగ్రాహవతిఁ బ్రవేశించినను ముని నంట
నది యోడి శతవిధంబులఁ బరిద్రుతయయి స్థలం బయిన
నది యాదిగాఁగ శతద్రునామ యై యున్నది యొప్పె.

(మొసళ్లున్న నదిలో ప్రవేశించినా ఆ నది మునిని తాకకుండా వంద దిక్కుల్లో ప్రవహించి శతద్రువ అనే పేరు పొందింది.)

1_7_121 చంపకమాల నచకి - వసంత

చంపకమాల

సుతశతవర్జితాశ్రమము చూడఁగ నోపక మేరుపర్వతో
న్నతపృథుశృంగ మెక్కి పడినన్ మునివల్లభుదేహబంధ మ
క్షత మయి తూలసంచయనికాశత నొప్పె ననంత సంతత
వ్రతనియమప్రభావు లగు వారలఁ బొందునె దేహదుఃఖముల్.

(కొడుకుల్లేని తన ఆశ్రమాన్ని చూడలేక వసిష్ఠుడు మేరుపర్వతం ఎక్కి దూకాడు. కానీ, దూదిమూటకు తగలనట్లు అతని శరీరానికి దెబ్బలేమీ తగలలేదు.)

Wednesday, August 23, 2006

1_7_120 ఉత్పలమాల పవన్ - వసంత

ఉత్పలమాల

పంబిన శోక భారమునఁ బ్రాణవిమోక్షముఁ గోరి కంఠ దే
శంబున రాయి గట్టికొని సన్మునినాథుఁడు నిశ్చితాత్ముఁ డై
యంబుధిఁ జొచ్చినం గడు భయంపడి వార్ధిలసత్తరంగ హ
స్తంబుల నెత్తిపట్టె నుచితస్థితిఁ దీరముఁ జేర నమ్మునిన్.

(వసిష్ఠుడు మెడకు రాయి కట్టుకొని సముద్రంలో దూకగా, సముద్రుడు భయపడి తన అలలనే చేతులతో అతడిని ఒడ్డుకు చేర్చాడు.)

1_7_119 చంపకమాల పవన్ - వసంత

తేటగీతి

అమిత వివృద్ధ శోక వివశాత్మకుఁ డై మది నాత్మఘాతదో
షమును దలంప కెంతయు విషాదమునన్ బలవద్దవాగ్నిమ
ధ్యము వడిఁ జొచ్చినన్ బృహదుదగ్రశిఖానల మాక్షణంబ యు
ష్ణము చెడి శీత మయ్యె మునినాథున కుగ్రతపంబుపెంపునన్.

(దుఃఖం వల్ల మనసు స్వాధీనం తప్పి, ఆత్మహత్య పాపమని కూడా ఆలోచించకుండా అగ్నిలో ప్రవేశించాడు. కానీ అతడి తపోమహిమ వల్ల ఆ అగ్ని వేడిని కోల్పోయి చల్లబడింది.)

1_7_118 తేటగీతి పవన్ - వసంత

తేటగీతి

సుతుల రాక్షస నిహతులఁ జూచి పరమ
యోగధరుఁ డయ్యుఁ బుత్త్ర వియోగశోక
భరము దాల్చె వసిష్ఠుం డపారభూరి
ధరణిభరము నగేంద్రుండు దాల్చునట్లు.

(చనిపోయిన తన పుత్రులను వసిష్ఠుడు చూసి పర్వతరాజు భూభారాన్ని దాల్చినట్లు దుఃఖభారాన్ని వహించాడు.)

-:పుత్త్రశోకమున వసిష్ఠుఁడు ఆత్మహత్యకుఁ బ్రయత్నించుట:-

1_7_117 వచనము పవన్ - వసంత

వచనము

ఇట్లు బ్రాహ్మణ శాపంబునం గల్మాషపాదుండు మానుష భావంబు విడిచి రాక్షసుం డై శక్తి యొద్దకు వచ్చి నీ కారణంబున నిట్టి శాప వ్యాపారంబు సంభవించె దీని ఫలంబు ముందఱ నీవ యనుభవింపు మని శక్తి నపగత ప్రాణుం జేసి విశ్వామిత్రుచేతఁ బ్రచోదితుం డయి పదంపడి వసిష్ఠపుత్త్రుల నందఱ వధియించిన.

(ఇలా రాక్షసుడైన కల్మాషపాదుడు శక్తి దగ్గరకు వచ్చి - ఈ శాపఫలం నువ్వే మొదట అనుభవించు - అని అతడిని చంపాడు. తరువాత విశ్వామిత్రుడి ప్రేరణతో వసిష్ఠుడి మిగిలిన కుమారులందరినీ కూడా వధించాడు.)

1_7_116 కందము పవన్ - వసంత

కందము

తివిరి యభోజ్యం బగు మా
నవ మాంసముతోడ భోజనము పెట్టిన వాఁ
డవు నీవు మనుష్యాదుఁడ
వవు మని వాఁ డిచ్చె శాప మన్నరపతికిన్.

(నరమాంసం తినే రాక్షసుడిగా జీవించు - అని ఆ రాజుకు శాపమిచ్చాడు.)

Tuesday, August 22, 2006

1_7_115 వచనము పవన్ - వసంత

వచనము

ఆ కల్మాషపాదు నొక్కనాఁ డొక్కబ్రాహ్మణుం డధిక క్షుధార్తుం డయి వచ్చి సమాంసంబయిన భోజనం బడిగిన నిచ్చి పోయిన వాఁ డంతఃపురంబున నుండి మఱచి యర్ధరాత్రంబునప్పుడు దలంచికొని తన బానసంబు వానిం బిలిచి యేనొక్కబ్రాహ్మణునకుం గుడువ నిచ్చి వచ్చి మఱచియుండితిం జెచ్చెర నవ్విప్రునకు మాంసంబుతోఁ గుడువంబెట్టు మని పంచిన వాఁడు నింతప్రొద్దు మాంసంబు వడయనేర ననిన నప్పు డారాజు రాక్షసాధిష్ఠితుం డగుటం జేసి మనుష్యమాంసంబుతోనయినం గుడువం బెట్టు మనిన సూపకారుండు వధ్యస్థానంబునకుఁ జని మనుష్యమాంసంబు దెచ్చి యిమ్ముగా వండి పెట్టిన నవ్విప్రుండు దన దివ్యదృష్టిం జూచి దాని మానవమాంసంబుగా నెఱింగి కడు నలిగి.

(ఒకరోజు కల్మాషపాదుడి దగ్గరకు ఒక బ్రాహ్మణుడు వచ్చి మాంసాహారం కావాలని అడిగాడు. అతడు అంగీకరించి అంతఃపురానికి వెళ్లి ఈ విషయం మరచిపోయాడు. అర్ధరాత్రి సమయంలో గుర్తుకు వచ్చి, వంటవాడిని పిలిచి - మాంసంతో ఆ బ్రాహ్మణుడికి భోజనం పెట్టు - అని ఆజ్ఞాపించాడు. అర్ధరాత్రి మాంసం సంపాదించలేను - అని వాడనగా రాక్షసుడు ఆవహించిన కల్మాషపాదుడు - నరమాంసంతోనైనా అతడికి భోజనం పెట్టు - అన్నాడు. వంటవాడు అలాగే వధ్యస్థానానికి వెళ్లి మానవమాంసం తెచ్చి ఆ బ్రాహ్మణుడికి వండిపెట్టాడు. ఆ విప్రుడు అది మానవమాంసం అని తెలుసుకొని, ఆగ్రహించి.)

1_7_114 తేటగీతి పవన్ - వసంత

తేటగీతి

రాక్షసావిష్టుఁ డైనప్డు రాజ్యలీల
విడిచి త న్నెఱుంగక తదావేశరహితుఁ
డైన యప్పుడు రాచకార్యంబులందు
బద్ధబుద్ధి యై కల్మాషపాదుఁ డుండె.

(రాక్షసుడు తనను ఆవేశించినప్పుడు కల్మాషపాదుడు రాచకార్యాలు విచారించక, తనను తాను మరచి ఉండేవాడు. ఆవేశించనప్పుడు రాజ్యవ్యవహారాలు చూస్తూండేవాడు.)

1_7_113 వచనము పవన్ - వసంత

వచనము

ఏను ధర్మపథంబున నున్నవాఁడ నేల తొలంగుదు ననిన నలిగి కల్మాషపాదుండు దనచేతి కశకోల నమ్మునీంద్రుని వ్రేసిన నవమానితుం డయి కోపారుణిత నయనంబుల నతనిం జూచి నీవు రాక్షసభావంబున నకారణంబ నాకు నికారంబు సేసితి కావున రాక్షసుండ వయి మనుష్యపిశితం బశనంబుగా నుండు మని శాపం బిచ్చినఁ గల్మాషపాదుం డమ్మహామునివరు వసిష్ఠతనయుంగా నెఱింగి నాకు శాపవ్యపాయంబు ప్రసాదింప వలయు నని ప్రార్థించుచున్న నచ్చోటికి విశ్వామిత్రుండు వచ్చి వారలు దన్నెఱుంగకుండ నంతర్హితుం డయి కల్మాషపాదు నంతర్గతుం డయి యుండ నొక్కరక్కసుం గింకరుం డను వానిం బంచిన వాఁడు విశ్వామిత్రు నాదేశంబునను శక్తి శాపంబుననుం జేసి కల్మాషపాదునంతరాత్మ నావేశించి యున్నంత.

(ధర్మమార్గంలో ఉన్న నేను ఎందుకు తొలగుతాను - అనగా కల్మాషపాదుడు ఆగ్రహించి శక్తిని తన కొరడాకర్రతో కొట్టాడు. ఆ ముని కళ్లెర్రజేసి - రాక్షసుడివై నరమాంసం తింటూ జీవించు - అని శపించాడు. అప్పుడు కల్మాషపాదుడు శాపవిమోచనం కోసం ప్రార్థిస్తూండగా - విశ్వామిత్రుడు అక్కడికి వచ్చి, వారికి కనపడకుండా ఉండి, కింకరుడనే రాక్షసుడిని కల్మాషపాదుడి మనసులో చేరమని ఆజ్ఞాపించాడు. వాడు అలాగే ప్రవేశించగా.)

-:శక్తిమహాముని కల్మాషపాదుని శపియించుట:-

1_7_112 ఆటవెలది పవన్ - వసంత

ఆటవెలది

ఎట్టి రాజులును మహీసురోత్తము లెదు

రరుగుదెంచు నప్పు డధికభక్తి

దెరలి ప్రియము వలికి తెరువిత్తు రిట్టిద

ధర్ము వీవు దీనిఁ దలఁప వెట్టు.

(ఎంత గొప్ప రాజులైనా బ్రాహ్మణులు ఎదురుగా వస్తే తాము పక్కకు తొలగి దారి ఇస్తారు. ఇది ధర్మం.)

1_7_111 వచనము పవన్ - వసంత

వచనము

ఆ విశ్వామిత్రుం డిక్ష్వాకు కుల సంభవుం డైన కల్మాషపాదుం డను రాజునకు యాజకత్వం బపేక్షించి తత్పురోహితుం డైన వసిష్ఠుతో బద్ధవైరుం డయి తదపకారంబు రోయుచున్నంత నొక్కనాఁడు కల్మాషపాదుండు వేఁట పోయి రమ్యా రణ్య భ్రమణ ఖిన్నుం డయి విశ్రమార్థంబు వసిష్ఠాశ్రమంబునకుం జనువాఁడు దన కభిముఖుం డయి వచ్చువాని వసిష్ఠు పుత్త్రుం బుత్త్ర శతాగ్రజు నధికతపశ్శక్తియుక్తు శక్తి యనుమహామునిం గని తెరువు దొలంగు మని రాజాభిమానంబున మెచ్చక పలికిన నమ్మునివరుం డి ట్లనియె.

(విశ్వామిత్రుడు ఇక్ష్వాకురాజైన కల్మాషపాదుడికి యాజకుడు అవ్వాలని, అతడి పురోహితుడైన వసిష్ఠుడితో వైరం కలవాడై అతడికి అపకారం చేయాలని ఆలోచిస్తూ ఉండేవాడు. ఒకరోజు కల్మాషపాదుడు వసిష్ఠుడి ఆశ్రమానికి వెడుతూ వసిష్ఠుడి నూరుమంది కొడుకుల్లో పెద్దవాడైన శక్తి మహాముని ఎదురుగా వస్తూండగా చూశాడు. కానీ రాజగర్వంతో అతడిని లక్ష్యపెట్టక పక్కకు తప్పుకొమ్మని పలికాడు. అప్పుడు అతడు ఇలా అన్నాడు.)

Monday, August 21, 2006

1_7_110 చంపకమాల పవన్ - వసంత

చంపకమాల

పొలుపగు రాజ్యసంపదుపభోగములెల్లఁ దృణంబుగా మదిం

దలఁచి విరక్తుఁ డై విడిచి దారుణశైలవనాంతరంబులన్

వెలయఁ దపంబు సేసి గుణవిశ్రుతుఁ డై పడసెన్ మహాతపో

బలమున సర్వసంపదలు బ్రహ్మఋషిత్వము దివ్యశక్తియున్.

(రాజభోగాలన్నీ విడిచి, తపస్సు చేసి, బ్రహ్మర్షిత్వాన్ని పొందాడు.)

1_7_109 వచనము పవన్ - వసంత

వచనము

అట్టి బ్రహ్మతేజో జనితం బయిన ప్రభావంబుఁ జూచి విశ్వామిత్రుండు విలక్షముఖుం డై క్షాత్రబలంబు నిందించి యెల్ల బలంబులకు మిక్కిలి తపోబలంబ యని.

(ఈ మహిమ చూసి, విశ్వామిత్రుడు సిగ్గుపడి, అన్ని బలాలకంటే తపోబలమే ఎక్కువ అని.)

1_7_108 కందము పవన్ - వసంత

కందము

నలి రేఁగి కడఁగి తద్బల

ములు విశ్వామిత్రు సైన్యముల కేను మడుం

గులు పెరిఁగి మూఁడు యోజన

ములు వాఱఁగ నెగిచె నొక్క మొగిఁ బ్రతిబలమున్.

(ఆ సైన్యాలు విశ్వామిత్రుడి సైనికులను తరిమికొట్టాయి.)

1_7_107 వచనము పవన్ - వసంత

వచనము

తదీయాభిప్రాయం బెఱింగి నందినియుఁ దనవత్సంబుఁ బట్టికొన వచ్చిన జనుల కలిగి చిందఱరేఁగి నిదాఘ సమయ మధ్యందిన దినకరమూర్తియుం బోలె దుర్నిరీక్ష్య యయి యంగవిక్షేపంబున నంగారవృష్టిఁ గురియుచు వాలంబున శబరులను శకృన్మూత్రంబుల శక యవన పుండ్ర పుళింద ద్రవిళ సింహళులను ఫేనంబున దరదబర్బరులను బుట్టించిన.

(నందిని వసిష్ఠుడి అభిప్రాయం తెలుసుకొని, తన దూడను పట్టుకోవటానికి వచ్చిన సైనికులను చూసి ఆగ్రహించి, దేహాన్ని విదిలించి, నిప్పులవాన కురిపిస్తూ, సైన్యాన్ని పుట్టించింది.)

1_7_106 కందము పవన్ - వసంత

కందము

న న్నేల యుపేక్షించితి

రిన్నరుల కధర్మపరుల కిచ్చితిరే వి

ద్వన్నాథ యిదియు ధర్మువె

యన్నను విని పలుకకుండె నమ్ముని యంతన్.


(మీరు నన్ను ఈ వీరికి ఎందుకిచ్చారు? ఇది ధర్మమా? - అని అడగగా వసిష్ఠుడు మౌనంగానే ఉండిపోయాడు. తరువాత.)

1_7_105 వచనము పవన్ - వసంత

వచనము

ఇట్లు విశ్వామిత్రుండు వసిష్ఠు హోమధేనువుం బట్టికొనఁ బంచిన నది పట్టీక జనులవలని కశాదండతాడనంబులం బీడింపం బడి యఱుచుచు వసిష్ఠునొద్దకు వచ్చి యి ట్లనియె.


(నందిని ఆ సైనికులకు చిక్కక, వారి దెబ్బలకు అరుస్తూ వసిష్ఠుడి దగ్గరకు వచ్చి ఇలా అన్నది.)

1_7_104 ఆటవెలది పవన్ - వసంత

ఆటవెలది

పరులవలన బాధ పొరయకుండఁగ సాధు

జనుల ధనము గాచు జనవిభుండు

కరుణ దప్పి తాన హరియించువాఁ డగు

నేని సాధులోక మేమి సేయు.


(సాధుజనుల ధనాన్ని కాపాడవలసిన రాజే అపహరించేవాడైతే వాళ్లు ఏమి చేయగలరు?)

1_7_103 వచనము పవన్ - వసంత

వచనము

దీని నొరున కీఁ గా దనిన నలిగి విశ్వామిత్రుండు నేను క్షత్త్రియుండ నిగ్రహానుగ్రహ సమర్థుండ నీవు బ్రాహ్మణుండవు శాంతుండ వేమి సేయ నోపుదు దీనికి లక్షమొదవుల నీఁబోయిన నొల్లవ యిమ్మొదవు నవశ్యంబును బలిమి నైనం బరిగ్రహింతు నని నందినిం బట్టికొనఁ బంచినం బలుకక వసిష్ఠుండు చూచుచుండె.

(దీన్ని మరొకరికి ఇవ్వటానికి వీలు కాదు - అన్నాడు. విశ్వామిత్రుడు ఆగ్రహించి బలవంతంగా నందినిని పట్టుకొమ్మని ఆజ్ఞాపించాడు. వసిష్ఠుడు మాట్లాడకుండా చూస్తూ ఉండిపోయాడు.)

1_7_102 చంపకమాల పవన్ - వసంత

చంపకమాల

అనిన వసిష్ఠుఁ డి ట్లనియె నంత ధనంబును నట్టి రాజ్యముం

గొననగు నయ్య యిచ్చిడిపికుఱ్ఱికి నీ కిది యేల యేను దీ

నన పితృదేవతాతిథిజనంబులఁ దృప్తులఁ జేయుచుండుదున్

జననుత దీనిఁ బ్రోచుటయ చాలుఁ దపస్వుల కేల సంపదల్.

(నీకు ఇది ఎందుకు? నేను దీనితో పితృదేవతలను, అతిథులను తృప్తిపరుస్తుంటాను. ఈ ఆవును ఒక్కదానిని కాపాడుకుంటే చాలు, ఋషులకు సంపదలెందుకు?)

1_7_101 తేటగీతి పవన్ - వసంత

తేటగీతి

దీనికంటెను నొప్పెడి వాని నొక్క

లక్ష మొదవుల నిచ్చెద నక్షయముగ

రాజ్యమయిన నిచ్చెద జగత్పూజ్య నాకు

నిమ్ము నీ హోమధేనువు నెమ్మితోడ.


(నీకు లక్ష ధేనువులను ఇస్తాను. నా రాజ్యాన్నైనా ఇస్తాను. నీ హోమధేనువును నాకు ఇవ్వు.)

Sunday, August 20, 2006

1_7_100 వచనము పవన్ - వసంత

వచనము

అని పెద్దయుంబ్రొద్దు చింతించి తత్పరిగ్రహకుతూహలహృదయుం డయి విశ్వామిత్రుండు వసిష్ఠున కి ట్లనియె.

(అని ఆలోచించి, దాన్ని పొందాలని, విశ్వామిత్రుడు వసిష్ఠుడితో ఇలా అన్నాడు.)

1_7_99 మధ్యాక్కర పవన్ - వసంత

మధ్యాక్కర

మృదు రోమములును శంకునిభ కర్ణముల్ మెత్తని వలుఁద
పొదుగును నిడుదచన్నులును గుఱుచలై పొలుచు కొమ్ములును
సదమలశరదిందుశంఖనిభ మైన చాయయుఁ గలుగు
మొద విది నిధి చేరినట్లు చేరె నిమ్మునికిఁ బుణ్యమున.

(ఇలాంటి పాడియావు ఈ ముని పుణ్యం వల్ల ఇతడిని చేరింది.)

1_7_98 వచనము పవన్ - వసంత

వచనము

ఇట్లు చతుర్విధాహారంబుల నందఱం దృప్తులం జేసి యున్న యా నందినిం జూచి విశ్వామిత్రుండు విస్మితుం డయి యాత్మగతంబున.

(ఇలా చతుర్విధాహారాలు - భక్ష్యభోజ్యచోష్యలేహ్యాలు - అందించిన ఆ నందినిని చూసి విశ్వామిత్రుడు ఆశ్చర్యపడి.)

1_7_97 కందము పవన్ - వసంత

కందము

ఘృత నదులును నోదన ప
ర్వతములు దధి కుల్యములు నవారిత రసపూ
రిత బహువిధోపదంశో
న్నత పుంజంబులును దత్క్షణంబునఁ గురిసెన్.

(నేతి నదులు, అన్నం పర్వతాలు, పెరుగు కాల్వలు, ఊరగాయల రాసులు తక్షణం సిద్ధమయ్యాయి.)

1_7_96 వచనము పవన్ - వసంత

వచనము

చెప్పు మని యర్జునుం డడిగిన గంధర్వుం డి ట్లని చెప్పెఁ దొల్లి కన్యాకుబ్జంబున గాధిపుత్త్రుండు విశ్వామిత్రుం డనురాజు నిరమిత్రంబుగా ధాత్రి నేలుచు నొక్కనాఁడు మృగయార్థం బరిగి యపారబలసమేతుం డయి ఘోరారణ్యంబునం గ్రుమ్మరి వడంబడి కడు డస్సి వసిష్ఠునాశ్రమం బాశ్రయించిన నమ్మునివరుండు విశ్వామిత్రు నతిప్రీతిం బూజించి వానికిని వానిసేనకు నభిమతంబు లైన యాహారంబులు గురియ నందిని యను తనహోమధేనువుం బంచిన నదియు.

(అని అర్జునుడు అడగగా ఆ గంధర్వుడు ఇలా చెప్పాడు - కన్యాకుబ్జంలో గాధి కుమారుడైన విశ్వామిత్రుడు అనే రాజు ఒకరోజు వేటకోసం తన సైన్యంతో ఒక అడవిలోకి వెళ్లి, అలసిపోయి, వసిష్ఠుడి ఆశ్రమాన్ని ఆశ్రయించాడు. ఆ ముని విశ్వామిత్రుడిని పూజించి, అతడికి, అతడి సేనకు తగిన ఆహారం కోసం తన హోమధేనువైన నందినిని ఆజ్ఞాపించగా అది.

-:అంగారపర్ణుఁడు అర్జునునకు వసిష్ఠుమహిమ సెప్పుట:-

1_7_95 సీసము + ఆటవెలది పవన్ - వసంత

సీసము

        శమహీనుఁ డైన విశ్వామిత్రు చేసిన
యపకారమునఁ జేసి యాత్మసుతులు
        యమసదనంబున కరిగిన వారలఁ
దనతపోవీర్య సత్త్వములపేర్మిఁ
        గ్రమ్మఱింపఁగ శక్తి కలిగియు వేల న
య్యంబుధి గడవనియట్ల శాంతుఁ
        డయి యెవ్వఁడేని కృతాంతకుఁ గడవంగ
నొల్లండ యట్టి యత్యుగ్రతేజుఁ

ఆటవెలది

డగు వసిష్ఠముని మహాత్మతఁ జెప్పనా
యలవియయ్య యనిన నవ్వసిష్ఠ
గాధిసుతుల కేమికారణంబున నిట్టి
వైర మయ్యె నెఱుఁగ వలతు దీని.

(విశ్వామిత్రుడు చేసిన అపకారం వల్ల తన కుమారులు యమలోకానికి వెడితే, వారిని మరలించగల శక్తి ఉన్నా, యముడిని అతిక్రమించటానికి ఇష్టపడక శాంతంగా ఉన్న వసిష్ఠుడి మహిమను గురించి చెప్పటం నా తరమా? - అని ఆ గంధర్వుడు అనగా - వసిష్ఠవిశ్వామిత్రులకు వైరం ఎందుకు ఏర్పడిందో చెప్పండి.)

1_7_94 కందము పవన్ - వసంత

కందము

బలమఱి కామక్రోధం
బులు రెండు జయింపఁబడి తపోవీర్య బలం
బులఁ జేసి చేయునవి ని
చ్చలు నెవ్వనియేని పాదసంవాహంబుల్.

(ఎవరి కాళ్లు ఒత్తితే కామక్రోధాలు బలహీనమవుతాయో.)

1_7_93 కందము పవన్ - వసంత

కందము

ధృతి నెవ్వని నేని పురో
హితుఁగా బుణ్యమునఁ బడసి యిక్ష్వాకుకులో
దితు లైన పతులు రాజ్యో
న్నతి నొప్పం జేసి రుర్వి నానాక్రతువుల్.

(ఇక్ష్వాకువంశప్రభువులు ఎవరినైతే పురోహితుడిగా పొంది యజ్ఞాలు చేశారో.)

1_7_92 వచనము పవన్ - వసంత

వచనము

అనిన గంధర్వుం డి ట్లనియె.

(అనగా ఆ గంధర్వుడు ఇలా అన్నాడు.)

1_7_91 కందము పవన్ - వసంత

కందము

నుతముగ నస్మత్కుల భూ
పతులకు నాద్యులకుఁ బుణ్యభాగులకుఁ బురో
హితుఁ డయిన వసిష్ఠు మహా
త్మతఁ జెప్పుము వినఁగవలతు మది నేర్పడఁగన్.

(మా వంశంలో మొదటి ప్రభువులకు పురోహితుడైన వసిష్ఠుడి మహిమ గురించి చెప్పండి.)

1_7_90 వచనము పవన్ - వసంత

వచనము

దానం జేసి మహీతలంబున కనావృష్టి యయిన నెఱింగి వసిష్ఠుండు శాంతికపౌష్టికవిధు లొనరించి సంవరణుం దోడ్కొని హస్తిపురంబున కరిగిన నఖిలప్రజకు ననురాగం బయ్యె ననావృష్టి దోషంబునుం బాసె నంత సంవరణునకుఁ దపతికిం దాపత్యుం డై వంశకరుండు కురుండు పుట్టె నది మొదలుగా మీరును దాపత్యుల రయితి రని గంధర్వుండు చెప్పిన నర్జునుండు వెండియు ని ట్లనియె.

(అందువల్ల అనావృష్టి ఏర్పడగా వసిష్ఠుడు శాంతిక్రియలు చేసి, సంవరణుడిని తనవెంట హస్తినాపురానికి పిలుచుకువెళ్లాడు. అనావృష్టి తొలగింది. తపతీసంవరణులకు కురుడు పుట్టాడు. అప్పటినుండి మీరు తాపత్యులయ్యారు - అని గంధర్వుడు చెప్పగా అర్జునుడు ఇలా అన్నాడు.)

1_7_89 కందము పవన్ - వసంత

కందము

ఆ తరుణియందుఁ జేతో
జాత సుఖప్రీతిఁ దగిలి శైలాటవులన్
వీతనృపకార్యధర్మ
వ్రాతుం డయి పదియురెండువర్షము లుండెన్.

(సంవరణుడు రాచకార్యాలు వదిలి ఆమెతో పన్నెండేళ్లు కొండలలో, అడవులలో ఉండిపోయాడు.)

1_7_88 వచనము పవన్ - వసంత

వచనము

ఇ ట్లొక్కనిమిషంబున మున్నూటయఱువదినాలుగు యోజనంబులు పఱచు నాదిత్యురథంబుతో నశ్రమంబున నరిగి తపనదత్త యయిన తపతిం దోడ్కొని వచ్చి వసిష్ఠుండు విధివంతంబుగా సంవరణునకుం దపతి వివాహంబు సేయించెఁ గావున మహాత్ము లయిన పురోహితులం బడసిన రాజుల కభీష్టంబు లయిన శుభంబు లగుట నిశ్చయం బిట్లు సంవరణుండు దపతి వివాహం బయి.

(వసిష్ఠుడు తపతీసంవరణులకు వివాహం జరిపించాడు. కాబట్టి, మంచి పురోహితులు ఉన్న రాజులకు శుభం కలగటం నిశ్చయం.)

1_7_87 సీసము + ఆటవెలది పవన్ - వసంత

సీసము

అలఘుండు పౌరవకులశేఖరుండు సం
        వరణుఁ డన్వాఁ డనవరత కీర్తి
విదితుండు ధర్మార్థవిదుఁడు నీ పుత్త్రికి
        నగణిత గుణములఁ దగు వరుండు
గావున నతనికి దేవిఁగాఁ దపతి నీ
        వలయుఁ గూఁతులఁ గన్నఫలము దగిన
వరులకు సద్ధర్మచరితుల కీఁ గాన్ప
        కాదె నావుడు సూర్యుఁ డాదరించి

ఆటవెలది

వరుఁడు రాజవంశకరుఁడు సంవరణుండ
యనుగుణుండు దీని కని కరంబు
గారవమున నిచ్చి యా ఋషితోడఁ బు
త్తెంచెఁ దపతిఁ గురుకులాంచితునకు.

(పురువంశానికి చెందిన సంవరణుడే తపతికి తగిన భర్త కాబట్టి అతడికి భార్యగా తపతిని ఇవ్వాలి - అని చెప్పగా సూర్యుడు అంగీకరించి వసిష్ఠుడి వెంట తపతిని పంపాడు.)

1_7_86 వచనము పవన్ - వసంత

వచనము

సూర్యుండును వసిష్ఠమహాముని నతిగౌరవంబున సంభావించి భవదాగమన ప్రయోజనంబు సెప్పు మనిన వసిష్ఠుం డి ట్లనియె.

(సూర్యుడు కూడా వసిష్ఠుడిని పూజించి - మీ రాకకు కారణం చెప్పండి - అని అడిగాడు.)

1_7_85 చంపకమాల పవన్ - వసంత

చంపకమాల

జగదభివంద్యుఁ డాక్షణమ సమ్మతి సంవరణ ప్రయోజనం
బొగి నొనరింపఁగా నయుతయోజనముల్ చని లోకలోచనుం
డగు దిననాథు నాతతసహస్రకరుం గని సంస్తుతించె న
త్యగణితవేదమంత్రముల నమ్మునినాథుఁ దతిప్రియంబునన్.

(వసిష్ఠుడు సంవరణుడి కోరిక తీర్చటానికి సూర్యుడి దగ్గరకు వెళ్లి అతడిని స్తుతించాడు.)

1_7_84 వచనము పవన్ - వసంత

వచనము

ఇట్లు దలంచిన పండ్రెం డగు దివసంబునకు వచ్చి వసిష్ఠుం డవిరత వ్రతోపవాస కృశీభూత శరీరుం డయి యున్న సంవరణుం జూచి యాతండు తపనసుత యయిన తపతియందు బద్ధానురాగుం డగుట తన యోగదృష్టి నెఱింగి.

(సంవరణుడికి తపతిపై ఉన్న ప్రేమను వసిష్ఠుడు తెలుసుకొని.)

1_7_83 చంపకమాల పవన్ - వసంత

చంపకమాల

ప్రతిహత రాగ కోపభయుఁ బంకరుహప్రభవప్రభావు దూ
రితదురితున్ మునీశ్వరవరిష్ఠు వసిష్ఠమహామునిం బురో
హితు నతిభక్తితోఁ దలఁచె నిష్ట మెఱింగి వసిష్ఠుఁడున్ సమా
హితమతి నేఁగుదెంచి కనియెం బ్రభు సంవరణుం బ్రియంబునన్.

(సంవరణుడు తన పురోహితుడైన వసిష్ఠుడిని స్మరించగా అతడు సంవరణుడి దగ్గరకు వచ్చాడు.)

1_7_82 వచనము పవన్ - వసంత

వచనము

నాయందు నీకుం బ్రియంబు గలదేని మదీయ జనకు నడుగుము న న్నిచ్చు నింతులకు స్వాతంత్ర్యంబు లేమి నీ వెఱుంగుదువు గాదె కావున ననవరత జప నియమ ప్రణిపాతంబుల నాదిత్యు నారాధింపు మని చెప్పి తపతి యాదిత్యమండలంబున కరిగె నంత సంవరణుండు మూర్ఛాగతుం డయి పడియున్న నాతని యమాత్యుండు వచ్చి శీతలపరిషేచనంబు సేసిన మూర్ఛదేఱి యమ్మహీపతి మహాభక్తి నప్పర్వతంబున నుండి సూర్యు నారాధించుచు.

(నీకు నాపై ప్రేమ ఉంటే నా తండ్రిని అడుగు. స్త్రీలకు స్వాతంత్ర్యం లేదన్న విషయం నీకు తెలుసు కదా! సూర్యుడిని ఆరాధించు - అని చెప్పి వెళ్లిపోయింది. సంవరణుడు అలాగే చేశాడు.)

1_7_81 కందము పవన్ - వసంత

కందము

భువనైక దీపకుం డగు
సవితృనకుఁ దనూజ మఱియు సావిత్రికి నే
నవరజ నవినయ వర్జిత
నవనీశ్వర వినుము తపతి యను సురకన్యన్.

(నేను సూర్యుడి కూతురిని, సావిత్రికి చెల్లెలిని. తపతిని.)

1_7_80 వచనము పవన్ - వసంత

వచనము

నన్ను గాంధర్వవివాహంబున వరియింపు మనిన సంవరణునకుఁ దపతి యి ట్లనియె.

(నన్ను గాంధర్వవివాహపద్ధతిలో వరించు - అనగా తపతి ఇలా అన్నది.)

1_7_79 చంపకమాల పవన్ - వసంత

చంపకమాల

ధరణి నతిప్రతాపబలదర్పములన్ విన నేన పెద్ద నె
వ్వరికిని మున్ భయంపడని వాఁడ భయార్తుఁడ నైతి నిప్డు పం
కరుహదళాయతాక్షి దయఁ గావుము నన్ను భవన్నిమిత్త దు
ర్భరతర పంచబాణహతిఁ బంచతఁ బొందకయుండు నట్లుగన్.

(ఎవరికీ భయపడనివాడిని ఇప్పుడు భయంతో బాధపడుతున్నాను. నీవల్ల కలిగిన మన్మథుడి దెబ్బతో మరణించకుండా నన్ను కాపాడు.)

1_7_78 వచనము పవన్ - వసంత

వచనము

ఇ ట్లదృశ్యం బయిన యక్కన్యకం గానక మానవపతి మానరహితుం డయి మహీతలంబు పయిం బడి ప్రలాపించుచున్న నాతని నభినవ యౌవన విభ్రమోద్భాసితు నంగజాకారుం జూచి తపతి తానును మదనబాణ బాధిత యై తన రూపంబుఁ జూపి మధుర వచనంబుల ని ట్లేల మోహగతుండ వయి తని పలికిన దానికి సంవరణుం డిట్లనియె.

(ఇలా ఆమె అదృశ్యమైపోగా సంవరణుడు ఆమె కనపడక దుఃఖించాడు. అప్పుడు ఆమె అతడి ఎదుట నిలిచి - ఇలా ఎందుకు మోహగతుడివయ్యావు? - అని అడగగా సంవరణుడు ఇలా అన్నాడు.)

1_7_77 కందము పవన్ - వసంత

కందము

అని పలుకుచున్న నృపనం
దనునకు మఱుమాట యీక తామరసనిభా
నన మేఘమధ్యసౌదా
మనివోలె నడంగె దృష్టిమార్గము గడవన్.

(అని మాట్లాడుతున్న సంవరణుడికి బదులు చెప్పకుండా తపతి మాయమైపోయింది.)

1_7_76 ఆటవెలది పవన్ - వసంత

ఆటవెలది

ఎఱుఁగఁ జెప్పు మబల యెవ్వరి దాన వి
ట్లేల యున్నదాన వేకతంబ
క్రూర వన మృగములు గ్రుమ్మరుచున్న యీ
విజన విషమ శైల విపిన భూమి.

(నువ్వు ఎవరివి? ఇక్కడ ఒంటరిగా ఎందుకున్నావు?)

Saturday, August 19, 2006

1_7_75 వచనము పవన్ - వసంత

వచనము

అని వితర్కించుచు మదనకర్కశమార్గణలక్షీభూతచేతస్కుం డయి తదీయ గుణమయపాశబద్ధుండునుంబోలెఁ గదలనేరక తన్నివేశితచేతనుండునుంబోలెఁ ద న్నెఱుంగక తద్రూపామృతపానంబున ననిమిషత్వంబునం బొందిన తన నయనంబుల దానియంద నిలిపి సంవరణుం డక్కన్యక కి ట్లనియె.

(సంవరణుడు ఆమెతో ఇలా అన్నాడు.)

1_7_74 చంపకమాల పవన్ - వసంత

చంపకమాల

నెఱికురులున్ విలోలసితనేత్రయుగంబును నొప్పులొల్కువా
తెఱయును దీని యాననము తెల్వి కరంబు మనోహరంబు నా
యెఱిఁగిన యంతనుండి సతి నిట్టి లతాలలితాంగిఁ జూచి యే
నెఱుఁగ సురేంద్రకన్యకలు నిట్టిరె రూపవిలాససంపదన్.

(దేవకన్యలలోనైనా ఇలాంటి వాళ్లున్నారా?)

1_7_73 సీసము + ఆటవెలది పవన్ - వసంత

సీసము

త్రిభునలక్ష్మి యేతెంచి యేకాంత మి
        ట్లేలొకో యున్నది యివ్వనమున
గగనమణిప్రభ గగనంబునం దుండి
        యవనీతల ప్రాప్త మయ్యె నొక్కొ
శంభుండు లావణ్యసద్గుణసముదాయ
        మింద యిమ్ముగ సంగ్రహించె నొక్కొ
దీని యంగములఁ బొందిన యివ్విభూషణ
        శ్రీ యేమి పుణ్యంబుఁ జేసె నొక్కొ

ఆటవెలది

యమరకన్యయొక్కొ యక్షకన్యక యొక్కొ
సిద్ధకన్య యొక్కొ శ్రీ సమృద్ధి
సర్వలక్షణ ప్రశస్తాంగి యిది దివ్య
కన్య యగు ననంతకాంతిపేర్మి.

(ఈమె దివ్యకన్యే అయి ఉంటుంది.)

1_7_72 వచనము పవన్ - వసంత

వచనము

కని యనిమిషలోచనుం డయి మనంబున ని ట్లని వితర్కించె.

(రెప్పవాల్చని కళ్లతో ఆశ్చర్యాన్ని ప్రకటిస్తూ ఇలా ఆలోచించాడు.)

-:సంవరణుండు తపతిం జూచి మోహించుట:-

1_7_71 కందము పవన్ - వసంత

కందము

కనియె నొక కన్యఁ గోమలిఁ
గనక ప్రభ నిజ శరీర కాంతి నుపాంతం
బున వృక్షలతావలిఁ గాం
చనమయముగఁ జేయుచున్న చంద్రనిభాస్యన్.

(అక్కడ అందమైన ఒక కన్యను చూశాడు.)

1_7_70 వచనము పవన్ - వసంత

వచనము

అంత నొక్కనాఁడు సంవరణుండు మృగయావినోదార్థి యయి వనంబునఁ బరిభ్రమించి అధికక్షుత్పిపాసాపీడిత పతిత తురంగుం డయి యేకతంబ పాదచారి యై చని యొక్కపర్వతవనోద్దేశంబునందు.

(ఒకరోజు సంవరణుడు వేటకు వెళ్లి, ఆకలిదప్పులతో తన గుర్రం పడిపోగా, ఒంటరిగా కాలినడకన వెళ్లి ఒక కొండ అడవిలోని ఎత్తైన ప్రదేశంలో.)

1_7_69 చంపకమాల పవన్ - వసంత

చంపకమాల

గగనమునందు నెందు నధిక ప్రభ నేను వెలుంగునట్టు లి
జ్జగతిఁ బ్రసిద్ధుఁడై వెలుఁగు సంవరణుండ మదీయ పుత్త్రికిం
దగుపతి వీని కిచ్చెద ముదంబున నీలలితాంగి నంచు మా
నుగ నెడ నిశ్చయించెఁ దపనుండు దదీయతపఃప్రసన్నుఁడై.

(సంవరణుడే తపతికి తగిన భర్త - అని సూర్యుడు నిశ్చయించుకొన్నాడు.)

1_7_68 సీసము + ఆటవెలది పవన్ - వసంత

సీసము

        ఆదిత్యునకుఁ బుత్త్రి యనఘ సావిత్రికిని
ననుజ యుత్తమ లక్షణామలాంగి
        తపతి యక్కన్యక ధవళాయతేక్షణ
యౌవనసంప్రాప్త యైన దానిఁ
        జూచి యక్కన్యక సురుచిరగుణముల
కనుగుణుం డగు నిర్మలాభిజాత్యుఁ
        బతి నెవ్విధంబునఁ బడయుదునో యని
తలఁచుచు నున్న యత్తపనుగుఱిచి

ఆటవెలది

భక్తిఁ దపము సేసెఁ బ్రభుఁ డజామీఢనం
దనుఁడు భరతకులుఁడు ధర్మవిదుఁడు
సర్వగుణయుతుండు సంవరణుం డను
వాఁడు కృతజపోపవాసవిధుల.

(తపతి సూర్యుడికి కూతురు, సావిత్రికి చెల్లెలు. ఆమెకు తగిన భర్త కోసం సూర్యుడు ఆలోచిస్తుండగా - భరతవంశీయుడైన సంవరణుడు సూర్యుడు గురించి తపస్సు చేశాడు.)

1_7_67 వచనము పవన్ - వసంత

వచనము

అనిన నర్జునునకు నంగారపర్ణుం డిట్లనియె.

(అనగా అర్జునుడితో అంగారపర్ణుడు ఇలా అన్నాడు.)

-:తపతీసంవరణోపాఖ్యానము:-

1_7_66 తేటగీతి పవన్ - వసంత

తేటగీతి

అనిన వానికి నర్జునుం డనియె మమ్ము
ననఘ తాపత్యు లని పల్కి తతిముదమున
నేము కౌంతేయులము మఱి యెట్లు సెప్పు
మయ్య తపతి కపత్యుల మైన తెఱఁగు.

(అనగా అర్జునుడు ఇలా అన్నాడు - నువ్వు మమ్మల్ని 'తపతిసంతతివారు' అన్నావు. మేము ఏ విధంగా తపతి సంతతి వాళ్లమో తెలియజెప్పు.)

1_7_65 ఉత్పలమాల పవన్ - వసంత

ఉత్పలమాల

వేదము వేదియుం గలుగు విప్ర వరేణ్యుఁ డగణ్య పుణ్య సం
పాది పురోహితుం డయినఁ బాపము పొందునె భూపతిం
బ్రతాపోదయ కాన మీదగు గుణోన్నతికిం దగ ధర్మతత్త్వ సం
వేదిఁ బురస్కరింపుఁడు పవిత్రచరిత్రు మహీసురోత్తమున్.

(అర్జునా! మంచి బ్రాహ్మణుడు పురోహితుడైతే రాజుకు పాపం అంటుతుందా? కాబట్టి, అలాంటివాడిని పురోహితుడిగా చేసుకొండి.)

1_7_64 వచనము పవన్ - వసంత

వచనము

మఱియుఁ గామ ప్రవృత్తుం డయ్యును మహీపతి మహీసుర వర పురస్సరుం డగు నేని యెల్ల యుద్ధంబు శత్రుల జయించు.

(అంతేకాక, రాజు కామప్రవృత్తి కలిగినవాడైనా, పురోహితుడిని ముందుంచుకొంటే శత్రువులను జయించగలడు.)

1_7_63 ఆటవెలది పవన్ - వసంత

ఆటవెలది

పాండుపుత్త్ర నీవు బ్రహ్మచర్యస్థుండ
వగుటఁ జేసి మన్మథార్తు నన్ను
నొడిచి తిందు రాత్రి యుద్ధంబు సేసి కా
మోపభోగ నిరతుఁ డోటు వడఁడె.

(నువ్వు బ్రహ్మచర్యంలో ఉండటం చేత మన్మథార్తుడినైన నన్ను ఓడించావు. కామోపభోగనిరతుడు ఓడిపోడా?)

1_7_62 వచనము పవన్ - వసంత

వచనము

మీరు ధర్మానిలశక్రాశ్వినులవరంబునం బాండురాజునకుం గుంతీమాద్రులకుం బుట్టినవారలు ధర్మవిదులరు వేదవేదాంగ ధనుర్వేదపారగుం డయిన భారద్వాజు శిష్యుల రఖిలలోకహితులరుం గావునం బురోహిత రహితుల రై యుండఁ దగదు.

(గొప్పవారైన మీరు పురోహితుడు లేకుండా ఉండటం తగదు.)

1_7_61 సీసము + ఆటవెలది పవన్ - వసంత

సీసము

అనవద్యు వేదవేదాంగ విశారదు
        జప హోమ యజ్ఞ ప్రశస్తు సత్య
వచను విప్రోత్తము వర్గ చతుష్టయ
        సాధన సఖు సదాచారు సూరి
సేవ్యుఁ బురోహితుఁ జేసిన భూపతి
        యేలు నుర్వీతలం బెల్ల నిందుఁ
బరలోకమునఁ బుణ్యపరుల లోకంబులు
        వడయు జయస్వర్గఫలము సూవె

ఆటవెలది

రాజ్య మదియు నుర్వరాసుర విరహితుఁ
డయిన పతికిఁ గేవలాభిజాత్య
శౌర్యమహిమఁ బడయ సమకూరునయ్య తా
పత్య నిత్యసత్యభాషణుండ.

(తపతి వంశానికి చెందినవాడా! మంచి బ్రాహ్మణుడిని పురోహితుడిగా చేసుకొన్న రాజు భూమినంతా పరిపాలిస్తాడు. పుణ్యగతులు పొందుతాడు. బ్రాహ్మణుడు లేకుండా కేవలం వంశపరాక్రమాల చేత అలాంటి ఫలం పొందటం సాధ్యమా?)

Thursday, August 17, 2006

1_7_60 కందము కిరణ్ - వసంత

కందము

సుర గరుడ విషో రగ య
క్ష రాక్షస పిశాచ భూత గంధర్వులు నో
పరు ధిక్కరింప బ్రాహ్మణ
పురస్కృతులఁ బుణ్యమతుల భూతల పతులన్.

(బ్రాహ్మణుడిని ముందుంచుకున్న రాజులను ఎవరూ ధిక్కరించలేరు.)

1_7_59 ఉత్పలమాల కిరణ్ - వసంత

ఉత్పలమాల

ఇంతుల గోష్ఠి నున్నయతఁ డెంత వివేకము గల్గెనేని య
త్యంత మదా భిభూతుఁ డగు ధర్మువు దప్పుఁ బ్రియం బెఱుంగఁ డే
నెంత వివేకి నయ్యును సహింపక యింతులయొద్దఁ బల్కితిన్
వింతయె కాము శక్తి యుడివింపఁగ శక్యమె యెట్టివారికిన్.

(నా భార్యల ఎదుట నిగ్రహం కోల్పోయి అలా మాట్లాడాను. మన్మథుని శక్తి అణచటం సాధ్యమా?)

1_7_58 వచనము కిరణ్ - వసంత

వచనము

ఏను మిమ్ము నెఱింగియు మీకు నగ్నిపరిగ్రహంబును బ్రాహ్మణసంగ్రహంబును లేమింజేసి పరుసంబులు పలికితి మఱియును.

(నాకు మీరు తెలిసినా, మీకు అగ్నిహోత్రం, బ్రాహ్మణుడు లేనందువల్ల కఠినంగా మాట్లాడాను. అంతేకాక.)

1_7_57 కందము కిరణ్ - వసంత

కందము

మేరు నగోత్తంస మహీ
భారదురంధరుల మిమ్ముఁ బాండవుల గుణో
దారుల ధీరుల నెఱుఁగని
వా రెవ్వరుఁ గలరె భరతవంశోత్తములన్.

(మీ గురించి తెలియనివాళ్లు ఉన్నారా?)

1_7_56 కందము కిరణ్ - వసంత

కందము

విమలము లయి లోకత్రిత
యమునఁ బ్రవర్తిల్లు మీ మహాగుణములు ని
త్యము విందు నారదప్రము
ఖ మునీశ్వర సిద్ధసాధ్య గణములవలనన్.

(మీ గురించి నారదుడు మొదలైన మునుల దగ్గర వింటూ ఉంటాను.)

1_7_55 వచనము కిరణ్ - వసంత

వచనము

నీతోడ సఖ్యంబుఁ జేసెద మఱి మమ్ముఁ బరమధార్మికులం బరమబ్రహ్మణ్యుల నేమి కారణంబున నుదరిపలికి తనిన గంధర్వుం డి ట్లనియె.

(నీతో స్నేహం చేస్తాను. కానీ మమ్మల్ని ఎందుకు అదిరించి మాట్లాడావు? - అని అడగగా ఆ గంధర్వుడు ఇలా అన్నాడు.)

1_7_54 ఆటవెలది కిరణ్ - వసంత

ఆటవెలది

ఎంత మిత్రు లైన నెన్నండు నొరులచే
విద్యయును జయంబు విత్తచయము
గొనఁగ నొల్ల నాకుఁ గూర్తేని యనలాస్త్ర
మనఘ నీవు గొనుము హయము లిమ్ము.

(ఎంత స్నేహితులైనా ఇతరులనుండి విద్యను, విజయాన్ని, ధనాన్ని స్వీకరించటానికి నేను ఇష్టపడను. కానీ, నువ్వు ఇవ్వాలనుకొంటే ఈ ఆగ్నేయాస్త్రం తీసుకొని ఆ గుర్రాలను ఇవ్వు.)

1_7_53 వచనము కిరణ్ - వసంత

వచనము

అనిన వాని కర్జునుం డి ట్లనియె.

(అనగా అర్జునుడు ఇలా అన్నాడు.)

1_7_52 సీసము + తేటగీతి కిరణ్ - వసంత

సీసము

వృత్రుపై గీర్వాణ విభుఁ డల్గి వజ్రంబు
        వైచిన నది వాని వజ్ర కఠిన
పటు మస్తకంబునఁ బడి పాతరయమునఁ
        బదివ్రయ్యలైనఁ దద్భాగచయము
క్రమమున బ్రాహ్మణ క్షత్ర విట్ఛూద్రుల
        యందు వేదంబులు నాయుధములు
హలము శుశ్రూషయు నయ్యె వజ్రంబులు
        వాహంబులందు జవంబు నయ్యె

తేటగీతి

నట్టి జవమున నభిమతం బగుచు నున్న
యట్టి హయసమూహం బయ్యె యవనిపతుల
కఖిల భువనముల్ రక్షించునపుడు సకల
సాధనములలో నుత్తమసాధనంబు.

(రాజులకు గుర్రాలు ఉత్తమసాధనాలు అయ్యాయి.)

1_7_51 వచనము కిరణ్ - వసంత

వచనము

నీ యాగ్నేయాస్త్రంబున దగ్ధరథుండ నయ్యును గంధర్వమాయ ననేక రత్నవిచిత్రితం బైన రథంబు వడసి యిది మొదలుగాఁ జిత్రరథుండ నయ్యెద నీ పరాక్రమంబునకు మెచ్చితి నీతోడి సఖ్యంబు నాకభిమతం బయిన యది నాతపంబునం బడయంబడిన చాక్షుషి యనువిద్య నీ కిచ్చెద దీనిం దొల్లి మనువువలన సోముండు వడసె సోమునివలన గంధర్వపతి యయిన విశ్వావసుండు వడసె నాతనివలన నేనుఁ బడసితి నెవ్వండేని మూఁడులోకంబులుం జూడ నిచ్చగించు నాతండు దనయిచ్చకుం దగ నివ్విద్యపెంపున సర్వస్వంబునుం జూచు నేము దీనన చేసికాదె మానవులకు విశేషుల మై వేల్పులచేత శాసింపంబడక జీవించెద మిది కాపురుషప్రాప్తం బై ఫలియింపదు. నీవు తాపత్యవంశవర్థనుండవు మహాపురుషుండవు నీకు సఫలం బగు నీ దివ్యవిద్యఁ గొను మిచ్చెద దీనిఁ గొనునుప్పుడు షణ్మాసవ్రతంబు సేయవలయు నీవు నాకు నాగ్నేయాస్త్రం బిచ్చునది మఱి మహాజవసత్త్వంబులుఁ గామగమనంబులు నయిన గంధర్వహయంబులు మీకేవురకుం జెఱు నూఱేసి యిచ్చెద.

(ఇక ముందు చిత్రరథుడనే పేరుగలవాడినవుతాను. నీ పరాక్రమానికి మెచ్చాను. నీతో స్నేహం కోరుతున్నాను. నీకు చాక్షుషీ విద్యను ఇస్తాను. నాకు ఆగ్నేయాస్త్రాన్ని ఇవ్వు. ఇంకా మీలో ఒక్కొక్కరికీ వంద గంధర్వజాతి గుర్రాలను ఇస్తాను.)

1_7_50 మత్తేభము కిరణ్ - వసంత

మత్తేభము

అని నీచేతఁ బరాజితుండ నయి నా యంగారపర్ణత్వ మిం
కను దాల్పన్ మది నంత నిర్లజుఁడనే గర్వం బడంగన్ రణం
బున మున్నోడియుఁ బూర్వనామమున బెంపున్ గర్వముం దాల్చువాఁ
డనఘా సత్సభలందు మెచ్చఁబడునే హాసాస్పదీభూతుఁ డై.

(అర్జునా! నీ చేతిలో ఓడిపోయిన తరువాత అంగారపర్ణుడనే పేరు ధరించలేను.)

-:అంగారపర్ణుం డర్జునునితో సఖ్యము సేయుట:-

1_7_49 వచనము కిరణ్ - వసంత

వచనము

అని వాని నాశ్వాసించి విడిచిన నట్లు నిర్జితుం డై యర్జునున కంగారపర్ణుం డి ట్లనియె.

(అని అంగారపర్ణుడిని విడిచిపెట్టగా, అతడు ఇలా అన్నాడు.)

1_7_48 ఆటవెలది కిరణ్ - వసంత

ఆటవెలది

అనిన నరుఁడు వల్లె యని వాని కనియె గం
ధర్వ నిన్నుఁ గరుణ ధర్మరాజు
కురుకులేశ్వరుం డశరణశరణ్యుండు
విడువఁ బనిచె నింక వెఱవకుండు.

(అనగా అర్జునుడు సరేనని - ధర్మరాజు నిన్ను విడిచిపెట్టమని ఆజ్ఞాపించాడు. ఇక భయపడకు.)

1_7_47 కందము కిరణ్ - వసంత

కందము

అని యఱచుచున్న దానికి
ననఘుఁడు గరుణించి పాండవాగ్రజుఁ డయ్య
ర్జునుఁ జూచి వీని విడువుమ
యని నోడినవాని హీను నపగతశౌర్యున్.

(అని దుఃఖిస్తున్న కుంభీనసిని చూసి ధర్మరాజు అర్జునుడితో - ఓడిపోయిన ఇతడిని విడిచిపెట్టు.)

1_7_46 కందము కిరణ్ - వసంత

కందము

వాని మనోవల్లభ కుం
భీనసి యనునది గరంబు భీతి నశేషో
ర్వీనాథులార దయఁ బతి
దానము నా కిండు మీకు ధర్మువు పెరుఁగున్.

(అతడి భార్య కుంభీనసి భయపడి - ప్రభువులారా! నాకు పతిదానం చేయండి.)

1_7_45 సీసము + ఆటవెలది కిరణ్ - వసంత

సీసము

అగ్నిదేవుండు బృహస్పతి కిచ్చె ము
        న్నతఁడు భరద్వాజుఁ డనఁగఁ బరఁగు
ముని కిచ్చె నమ్మహాముని భార్గవున కిచ్చె
        భార్గవుండును గుంభభవున కిచ్చె
నమ్మహాత్ముండు నా కతిదయ నిచ్చె ని
        య్యనలాస్త్ర మని దాని నమ్మహోగ్ర
గంధర్వుపై వైచె ఘనుఁ డింద్రసుతుఁ డంతఁ
        దద్రథం బప్పుడ దగ్ధ మయిన

ఆటవెలది

నగ్నిదాహభీతి నంగారపర్ణుండు
బమ్మరిల్లి నేలఁ బడిన వానిఁ
గొప్పు వట్టి యీడ్చికొని వచ్చె ధర్మజు
కడకు నింద్రసుతుఁడు కడిమి మెఱసి.

(అర్జునుడు అంగారపర్ణుడిపైన ఆగ్నేయాస్త్రాన్ని ప్రయోగించాడు. అతడి రథం దగ్ధమైపోగా అతడు దిమ్మదిరిగి నేలమీద పడిపోయాడు. అర్జునుడు అతడి జుట్టుపట్టి ధర్మరాజు దగ్గరికి ఈడ్చుకొని వచ్చాడు.)

1_7_44 ఆటవెలది కిరణ్ - వసంత

ఆటవెలది

వెడఁగ యిట్టి పాటి వెఱపించుటలును మా
యలును నేమి సేయు నస్త్రవిదులఁ
బెక్కులయ్యు నీ బిభీషికల్ నుఱువులు
విరియునట్టు లిందు విరియుఁ జూవె.

(వెర్రివాడా! నీ బెదిరింపులు అస్త్రవిదులను ఏమి చేయగలవు?)

1_7_43 వచనము కిరణ్ - వసంత

వచనము

అనుచు నిజ జననీ భ్రాతృ సహితుం డయి గంగాభిషేకార్థంబు చనుదెంచు నయ్యర్జునునిపయి నంగారపర్ణుం డతినిశిత సాయకంబులేసిన నర్జునుం డలిగి తనచేతికొఱవి విదిర్చి యయ్యమ్ములు దన్నుం దాఁకకుండం గాచి కొని వాని కి ట్లనియె.

(అని పలికిన అర్జునుడి పైన అంగారపర్ణుడు బాణాలు వేయగా, అర్జునుడు ఆ బాణాలు తనను తాకకుండా కాపాడుకొని ఇలా అన్నాడు.)

1_7_42 సీసము + ఆటవెలది కిరణ్ - వసంత

సీసము

హైమవతోత్తుంగ హేమశృంగంబున
        నుండి భూమికి వచ్చి యుదధిఁ గూడె
గంగనా మూఁడు దెఱంగుల నదియు మం
        దాకిని నా సత్పథంబునందు
సురసిద్ధముని వియచ్చర సేవ్య యయ్యె న
        య్యధమలోకంబునయందు భోగ
వతి యన నొప్పె నున్నతి నిట్లు త్రిభువన
        పావని యైన యిప్పరమ మూర్తిఁ

ఆటవెలది

బార్వతీశమకుటబంధబంధురతరా
వాస గంగ నాడ వచ్చి నీవు
వలవ దనిన నుడుగువారము గాము నీ
విఘ్నవచనములకు వెఱతు మెట్లు.

(గంగలో స్నానం చేయటానికి వచ్చి నువ్వు వద్దన్నంతమాత్రాన మానుకొనేవాళ్లం కాదు. నీ మాటలకు ఎలా భయపడతాము?)

1_7_41 కందము కిరణ్ - వసంత

కందము

అడవులు నేఱులు నివి నీ
పడసిన యవి యట్టె పుణ్య భాగీరథి యి
ప్పుడమిఁ గల జనుల కెల్లను
నెడపక సేవ్యంబ కాక యిది నీయదియే.

(అడవులు, నదులు నువ్వు సంపాదించినవా? గంగానది ప్రజలందరిదీ కాక నీదా?)

Wednesday, August 16, 2006

1_7_40 కందము కిరణ్ - వసంత

కందము

నడురేయి సంధ్యలందును
నడవఁగ నోడుదు రశక్తనరు లొరులు భయం
పడుదుమె యే మెయ్యెడ నె
ప్పుడు నడతుమ యధికశక్తి పురుషుల మగుటన్.

(అర్ధరాత్రి, సంధ్యాసమయాలలో నడవటానికి బలహీనులు భయపడతారు. మేము కాదు.)

1_7_39 వచనము కిరణ్ - వసంత

వచనము

ఇ వ్వేళలయందుఁ గ్రుమ్మరియెడువారి నెంత బలవంతుల నైనను రాజుల నయినను నిగ్రహింతుము నన్ను డాయకుం డెడగలిగి పొం డే నంగారపర్ణుం డను గంధర్వుండఁ గుబేరుసఖుండ నెప్పుడు నిందు విహరించుచుండుదు న న్నెఱుంగరె యి వ్వనంబును గంగాతీరంబును నంగారపర్ణంబులు నా జగద్విదితం బులు దీని మానవులు సొర నోడుదు రనిన వాని కర్జునుం డి ట్లనియె.

(ఈ సమయంలో మేము రాజులనైనా నిగ్రహిస్తాము. నా దగ్గరకు రావద్దు. నేను అంగారపర్ణుడనే గంధర్వుడిని. కుబేరుడి మిత్రుడిని. ఈ ప్రాంతంలో ప్రవేశించటానికి మానవులు భయపడతారు - అనగా, అతడితో అర్జునుడు ఇలా అన్నాడు.)h

-:అర్జునుఁ డంగారపర్ణుని జయించుట:-

1_7_38 కందము కిరణ్ - వసంత

కందము

ఇల నర్ధరాత్రమును సం
ధ్యలు రెండును భూత యక్ష దానవ గంధ
ర్వులు గ్రుమ్మరియెడు ప్రొద్దులు
వెలయఁగ నిం దవనిచరులు వెఱతురు నడవన్.

(అర్ధరాత్రి, ఉదయసాయంసంధ్యలు భూతయక్షదానవగంధర్వులు తిరిగే సమయాలు. ఈ వేళలలో తిరగటానికి మానవులు భయపడతారు.)

1_7_37 వచనము కిరణ్ - వసంత

వచనము

మీరు ద్రుపదుపురంబునకుం జక్కనరుగునది యందు మీకు ల గ్గగు నని చెప్పి కృష్ణద్వైపాయనుం డరిగినఁ బాండునందనులు జననీసహితం బనవరతంబు రాత్రులుం బగళ్లును బయనంబు వోవువా రొక్కనాఁ డర్ధరాత్రంబున గంగయందు సోమశ్రవం బను తీర్థంబున స్నానార్థు లై యర్జునుండు ప్రకాశార్థంబును రక్షణార్థంబునుంగా నొక్కకొఱవి సేతఁ బట్టుకొని ముందఱం బోవ నందఱు నరుగునెడ నంగారపర్ణుఁ డను గంధర్వుం డంగనాసహితంబు గంగకు నంతప్రొద్దు జలక్రీడార్థంబు వచ్చిన వాఁ డప్పాండవుల పాదధ్వని విని యలిగి విల్లుగొని గుణధ్వనిం జేసి వారి కి ట్లనియె.

(మీరు ద్రుపదుడి నగరానికి వెళ్లండి - అని చెప్పి వెళ్లాడు. కుంతి, పాండవులు ప్రయాణం చేస్తూ ఉండగా అంగారపర్ణుడనే గంధర్వుడు తన భార్యలతో జలక్రీడలకోసం గంగానదీతీరానికి వచ్చాడు. పాండవుల పాదధ్వనికి కోపించి, ధనుస్సు చేతబట్టి, వారితో ఇలా అన్నాడు.)

1_7_36 సీసము + ఆటవెలది కిరణ్ - వసంత

సీసము

తా నొక్క మునికన్య దనకర్మవశమునఁ
        బతిఁ బడయంగ నోపక యుపేత
దౌర్భాగ్య యై ఘోరతప మొనరించిన
        దానికి శివుఁడు ప్రత్యక్ష మయ్యు
వేఁడుము వర మన్న వేడ్కతోఁ బతిదాన
        మని యేనుమాఱు లయ్యబల వేఁడె
నట్లేని నీకు దేహాంతరంబునఁ బతు
        లగుదు రేవురు పరమార్థ మనియు

ఆటవెలది

హరుఁడు కరుణ నిచ్చె నది యిప్డు పాంచాల
పతికిఁ గృష్ణ యనఁగఁ బంకజాక్షి
యుద్భవిల్లి పెరుఁగుచున్నది తత్స్వయం
వరము సేయుచున్నవాఁడు నేఁడు.

(ఒక మునికన్య భర్తకోసం తపస్సు చేయగా శివుడు ప్రత్యక్షమై వరం కోరుకొమ్మన్నాడు. ఆమె సంతోషంచో పతిదానం ఇమ్మని ఐదుసార్లు అడిగింది. శివుడు - నీకు మరుసటి జన్మలో భర్తలు ఐదుగురు అవుతారు - అని వరమిచ్చాడు. ఆమె ఇప్పుడు పాంచాలరాజుకు కూతురుగా పుట్టింది. ద్రుపదుడు ఆమె స్వయంవరాన్ని ఈరోజు జరుపుతున్నాడు.)

1_7_35 కందము కిరణ్ - వసంత

కందము

ధర్మసుతుఁ డున్నచోటను
ధర్మువునకు హాని గలదె ధారుణి నైనన్
ధర్మువ తాత్పర్యముగా
నిర్మలమతి నెగడునది వినీతాత్ముల రై.

(ధర్మమే ప్రధానంగా, నిర్మలమైన మనస్సుతో, వినయవంతులై మెలగండి.)

1_7_34 వచనము కిరణ్ - వసంత

వచనము

కని వినయమ్మున నమ్మునీంద్రునకు నందఱు నమస్కారంబు సేసిన వారలం జూచి కరుణారస పూరితాంతఃకరణుం డయి వ్యాసభట్టారకుం డి ట్లనియె.

(వ్యాసుడు ఇలా అన్నాడు.)

1_7_33 చంపకమాల కిరణ్ - వసంత

చంపకమాల

ఉరు సరసీ వనంబులు మహోగ్రనగంబులు నేఱులున్ సుదు
స్తరవిపినంబులుం గడచి ధన్యులు పాండుకుమారకుల్ నిరం
తరగతి నేఁగుచుం గనిరి ధర్మసమేతుఁ బితామహుం దమో
హరు హరిమూర్తి నార్తిహరు నాదిమునీంద్రుఁ బరాశరాత్మజున్.

(ప్రయాణం చేస్తూ వెళ్లి వ్యాసుడిని దర్శించారు.)

-:పాండవులు ద్రుపదుపురంబున కరుగుచు వ్యాసమహర్షిం గనుట:-

1_7_32 వచనము కిరణ్ - వసంత

వచనము

అందులకుం బోవుద మనినం గొడుకులెల్ల వల్లె యని మీ పంచిన విధంబ చేయం గలవార మని యొడంబడి తమయున్న యింటిబ్రాహ్మణునకుం జెప్పి వీడ్కొని.

(అక్కడికి వెడదాము - అని కుంతి అనగా పాండవులు అంగీకరించి, తమకు ఆశ్రయమిచ్చిన విప్రుడి దగ్గర సెలవు తీసుకొని.)

1_7_31 కందము కిరణ్ - వసంత

కందము

అడుగకయు విప్రవరులకు
నడరఁగ నద్దేశమున గృహస్థులు భక్తిం
గుడువఁగఁ బెట్టుదు రెప్పుడుఁ
గడు హృద్యము లయిన మోదకంబులతోడన్.

(అక్కడి గృహస్థులు బ్రాహ్మణులకు అడగకుండానే కుడుములతో భోజనం పెడుతూ ఉంటారు.)

1_7_30 వచనము కిరణ్ - వసంత

వచనము

దక్షిణపాంచాలంబు గరంబు రమ్యం బనియును బాంచాలపతి పరమధార్మికుండనియును వింటిమి మఱి యట్లుం గాక.

(దక్షిణపాంచాలం చాలా అందమైనదని, ద్రుపదుడు ధార్మికుడని విన్నాము. అంతేకాక.)

1_7_29 కందము కిరణ్ - వసంత

కందము

కడుఁబెద్దకాల ముండితి
మొడఁబడి యిం దెంతకాల మున్నను మన క
య్యెడు లాభ మేమి మఱి యె
ప్పుడు నుచితమె యొరుల యిండ్ల పొత్తున నుండన్.

(ఇక్కడ చాలాకాలం ఉన్నాము. ఎప్పుడూ ఇతరుల ఇళ్లలో ఉండటం ఉచితమేనా?)

-:పాండవులు పాంచాలపురంబునకు బయలుదేరుట:-

1_7_28 వచనము కిరణ్ - వసంత

వచనము

దాని విని పాండునందను లందులకుం బోవనున్నఁ గొడుకుల యభిప్రాయం బెఱింగి కుంతీదేవి యిట్లనియె.

(ఇది విని అక్కడికి వెళ్లనున్న పాండవులతో కుంతి ఇలా అన్నది.)

1_7_27 కందము కిరణ్ - వసంత

కందము

ధరణిఁ గల రాజులెల్లను
బురుడున గాంపిల్య నగరమున కరిగెద రొం
డొరులం గడవఁగ నని భూ
సురవరుఁ డెఱిఁగించెఁ బృషతసుతుకథయెల్లన్.

(రాజులందరూ ద్రుపదుడి కాంపిల్యనగరానికి వెడుతున్నారు - అని ఆ విప్రుడు చెప్పాడు.)

1_7_26 కందము కిరణ్ - వసంత

కందము

ఎవ్వరికిని మోపెట్టను
దివ్వను శక్యంబు గాని దృఢకార్ముకమున్
దవ్వై దివమునఁ దిరిగెడు
నవ్విలసత్కనకమత్స్యయంత్రముఁ జేసెన్.

(ఒక బలమైన ధనుస్సును, మత్స్యయంత్రాన్ని రూపొందించాడు.)

1_7_25 వచనము కిరణ్ - వసంత

వచనము

తొల్లి దేవేంద్రుండు గొండొకకాలం బదృశ్యుం డై యుండిన నతనిం గానక శచీదేవి శోకింపం బోయిన నుపశ్రుతిం జేసి బృహస్పతి దానికి దేవేంద్రాగమనంబు సెప్పె నని వేదంబుల వినంబడుం గావున నేను నుపశ్రుతిం జూచితి నిది దప్పదు పాండవులు పరలోకగతులు గారు పరమానందంబున నున్నవారు వార లెందుండియు నిందులకు వత్తురు నీవును సుచిత్తుండ వయి స్వయంవరం బిప్పురంబున ఘోషింపం బంపు మిది కన్యాదానంబునందు రాజులకు శాస్త్రచోదితం బనినం బురోహితువచనంబునంజేసి యూఱడి ద్రుపదుండు నేఁటికి డెబ్బదియేనగు దివసంబునం బౌషమాసంబున శుక్లపక్షంబున నష్టమియు రోహిణినాఁడు స్వయంవరం బని ఘోషింపం బంచి.

(నేను శుభశకునాలను చూశాను. పాండవులు మరణించలేదు. స్వయంవరం చాటించు. వాళ్లు ఎక్కడున్నా ఇక్కడికి వస్తారు - అనగా ద్రుపదుడు అలాగే ప్రకటించాడు.)

1_7_24 సీసము + ఆటవెలది కిరణ్ - వసంత

సీసము

ఇంద్రసమానున కిందీవరశ్యామ
        సుందరాంగున కింద్రనందనునకు
దేవిఁగాఁ బ్రీతితో దీని నీఁ గాంచితి
        నని యున్నచో విధాతృనకు నిట్లు
పాడియే విఘ్న మాపాదింప నమ్మహా
        ధ్వరమునఁ బుట్టిన సరసిజాక్షి
నే నెట్టు లొరులకు నీ నేర్తు నని దుఃఖ
        పరవశుఁడయి యున్న ధరణిపతికిఁ

ఆటవెలది

దత్పురోహితుండు దా నిట్టు లనియె న
ప్పాండవులనుగుఱిచి బహువిధంబు
లగు నిమిత్తములు నయంబునఁ జూచితి
నెగ్గు లేదు వారి కెల్ల లగ్గు.

(నల్లని శరీరం కల అర్జునుడికి కృష్ణను భార్యగా ఇవ్వాలనుకుంటే ఇలా జరగటం న్యాయమా? ద్రౌపదిని ఇతరులకు ఎలా ఇవ్వగలను? - అని ద్రుపదుడు దుఃఖించాడు. అప్పుడు అతడి పురోహితుడు ఇలా అన్నాడు - పాండవుల గురించి శుభశకునాలను చూశాను. వారికి కీడు లేదు.)

1_7_23 వచనము కిరణ్ - వసంత

వచనము

మఱియును.

(అంతేకాక.)

1_7_22 ఉత్పలమాల కిరణ్ - వసంత

ఉత్పలమాల

మానితు లైన పాండవకుమారులుఁ గుంతియు లక్కయింట ను
గ్రానలదగ్ధు లై రని ధరామరముఖ్యు లెఱింగి చెప్పఁగా
నా నరనాయకుండు విని యాతత శోకమహానలజ్వల
న్మానసుఁ డయ్యె బంధుజనమంత్రిపురోహిత విప్రసన్నిధిన్.

(కుంతి, పాండవులు లక్కయింట్లో చనిపోయారన్న వార్త విని ద్రుపదుడు దుఃఖించాడు.)

-: ద్రౌపదీవివాహప్రయత్నము (అమూలకము):-

1_7_21 వచనము కిరణ్ - వసంత

వచనము

ఇట్లు పుట్టిన యక్కొడుకునకుం గూఁతునకు ధృష్టద్యుమ్నుండును గృష్ణయు నను నామంబు లాకాశవాణి జనవిదితంబుగా నుచ్చరించె నట్లు ద్రుపదుండు లబ్ధ సంతానుం డయి సంతసిల్లి యాజునకు యథోక్త దక్షిణ లిచ్చి బ్రాహ్మణులం బూజించి ధృష్టద్యుమ్నుని ధనుర్వేదపారగుం జేయించి యున్నంత నక్కన్య యిపుడు వివాహసమయప్రాప్త యయిన.

(వీరికి - ధృష్టద్యుమ్నుడు, కృష్ణ - అనే పేర్లను ఆకాశవాణి ప్రకటించింది.)

1_7_20 తరలము కిరణ్ -వసంత

తరలము

కుల పవిత్ర సితేతరోత్పల కోమ లామల వర్ణ యు
త్పలసుగంధి లసన్మహోత్పలపత్త్రనేత్ర యరాళకుం
తల విభాసిని దివ్యతేజముఁ దాల్చి యొక్క కుమారి ద
జ్జ్వలనకుండమునందుఁ బుట్టెఁ బ్రసన్నమూర్తి ముదంబుతోన్.

(ఒక కూతురు కూడా పుట్టింది.)

1_7_19 వచనము కిరణ్ - వసంత

వచనము

మఱియు.

(ఇంకా.)

1_7_18 కందము కిరణ్ - వసంత

కందము

జ్వాలాభీలాంగుఁడు కర
వాల బృహచ్చాపధరుఁడు వరవర్మకిరీ
టాలంకారుఁడు వహ్నియ
పోలె రథారూఢుఁ డొక్క పుత్త్రుఁడు పుట్టెన్.

(ఒక కొడుకు పుట్టాడు.)

1_7_17 వచనము కిరణ్ - వసంత

వచనము

అ య్యాజుండును యాజకత్వంబున కొడంబడి నీ కోర్కికిం దగినయట్టి కొడుకునుం గూఁతురుం బుట్టుదు రోడకుండుమని యజ్ఞోపకరణద్రవ్యంబులు సమకట్టికొని యథావిధి నుపయాజుండు సహాయుండుగా సౌత్రామణి యయిన కోకిలాదేవి పత్నిగా ద్రుపదుం బుత్రకామేష్టి సేయించిన నందు మంత్రాహుతులం దృప్తుం డయిన యగ్నిదేవువలన.

(యాజుడు అంగీకరించి ఉపయాజుడు సహాయుడుగా, ద్రుపదుడి భార్య కోకిలాదేవి ధర్మపత్నిగా ద్రుపదుడి చేత పుత్రకామేష్టి చేయించాడు. అగ్నిదేవుడి వలన.)

1_7_16 కందము కిరణ్ - వసంత

కందము

ష డరత్ని ధనుర్ధరుఁ డె
య్యెడ నజితుఁడు గాన వాని హీనుంగాఁ జే
యుఁడు నాకుఁ జతుర్వర్గము
వడయుట యని పృషతసుతుఁడు ప్రార్థించె మునిన్.

(అజితుడైన ద్రోణుడిని తక్కువచేస్తే నాలుగు పురుషార్థాలనూ నేను పొందినట్లే - అని ద్రుపదుడు యాజుడిని ప్రార్థించాడు.)

Tuesday, August 15, 2006

1_7_15 కందము కిరణ్ - వసంత

కందము

భారతవంశాచార్యుఁడు
భారద్వాజుండు నా కపాయము సేసెన్
ఘోరాజి నతని నోర్చు న
పార పరాక్రము సుపుత్త్రుఁ బడయఁగ వలయున్.

(ద్రోణుడు నాకు కీడు చేశాడు. అతడిని ఓడించే కొడుకు కావాలి.)

1_7_14 వచనము కిరణ్ - వసంత

వచనము

అని ప్రార్థించి వెండియు నా ద్రుపదుండు యాజున కి ట్లనియె.

(అని వేడుకొని ఇలా అన్నాడు.)

1_7_13 కందము కిరణ్ - వసంత

కందము

మునినాథ నాకు సత్సుత
జననం బగునట్టి క్రతువు సద్విధిఁ గావిం
చినఁ గృతకృత్యుఁడ నగుదుం
గొను మిచ్చెద నీకు లక్ష గో ధేనువులన్.

(మునినాథా! నాకు మంచి కుమారుడిని ప్రసాదించే యజ్ఞం జరిపించు. నీకు లక్ష గోధేనువులను ఇస్తాను.)

1_7_12 వచనము కిరణ్ - వసంత

వచనము

ఫలార్థి యయినవాఁడు తత్ఫలానుబంధంబు లయిన దోషంబులు పరికింపండు గావున నమ్మునివరుండు నీ కభిమతంబు సేయుం బొ మ్మనిన ద్రుపదుం డరిగి సంహితాధ్యయనాది పంచమహాయజ్ఞంబులు సేయుచు శిలోంఛవృత్తి భైక్షసంపాదిత కుటుంబభారుం డై ఘోరతపోవృత్తి నున్న యాజుం గని నమస్కరించి యి ట్లనియె.

(ఫలం కోరేవాడు దాని దోషాలను చూడడు. కాబట్టి నువ్వు అతడి దగ్గరకు వెళ్లు - అన్నాడు. ద్రుపదుడు అలాగే యాజుడి దగ్గరకు వెళ్లి.)

1_7_11 తేటగీతి కిరణ్ - వసంత

తేటగీతి

అనఘచరితుఁడు మాయన్న వనములోనఁ
జనుచు నొక్కనాఁ డొక్కపం డొనరఁ గాంచి
కొనియె శుచి యగు శుచియుఁ గా దని యెఱుంగఁ
బడని భూమి తలంబుపైఁ బడినదాని.

(మా అన్న యాజుడు ఒకరోజు అడవిలో వెడుతూ నేలమీద పడిన ఒక పండును చూసి, అది శుభ్రమైనదో కాదో తెలియకపోయినా, దాన్ని తీసుకువచ్చాడు.)

1_7_10 వచనము కిరణ్ - వసంత

వచనము

అనిన నుపయాజుం డే నిట్టి ఫలంబు నపేక్షింప నెవ్వరేని ఫలార్థు లగుదు రందుల కేఁగు మనిన ద్రుపదుండు వెండియు వానిన యొక్క సంవత్సరం బారాధించిన నమ్ముని వాని కి ట్లనియె.

(అనగా అతడు - నేను అలాంటి ఫలాన్ని ఆశించను. అలా ఆశించేవాళ్ల దగ్గరకు వెళ్లు - అన్నాడు. ద్రుపదుడు మరొక సంవత్సరం ఆ మునినే సేవించగా అతడు ద్రుపదుడితో ఇలా అన్నాడు.)

1_7_9 కందము కిరణ్ - వసంత

కందము

మునినాథ నాకు సత్సుత
జననం బగునట్టి క్రతువు సద్విధిఁ గావిం
చినఁ గృతకృత్యుఁడ నగుదుం
గొను మిచ్చెద నీకు లక్ష గోధేనువులన్.


(మునినాథా! నాకు మంచి కుమారుడిని ప్రసాదించే యజ్ఞం జరిపించు. నీకు లక్ష గోధేనువులను ఇస్తాను.)

1_7_8 వచనము కిరణ్ - వసంత

వచనము

రణరంగంబున ద్రోణు వధియించునట్టి కొడుకును నర్జునునకు దేవి యగునట్టి కూఁతునుం బడయుదు నని బ్రహ్మవిదు లయిన బ్రాహ్మణులనివాసంబులకుం జని నిత్యంబును బ్రాహ్మణోపాస్తి సేయుచు నొక్కనాఁడు గంగాకూలంబు నందు వానప్రస్థవృత్తి నున్న యాజోపయాజు లనువారి నిద్దఱ ననవరత వ్రత వ్యాసక్తులం గాశ్యపగోత్రులం గని వారికి నమస్కరించి యందుఁ గొండుక యయ్యును దపోమహిమ నెవ్వరికంటెఁ బెద్దయైన వాని నుపయాజు నుపాసించి యి ట్లనియె.

(ద్రోణుడిని చంపగల కొడుకును, అర్జునుడికి భార్యకాగల కూతురిని పొందాలని బ్రాహ్మణసేవ చేస్తూ ఒకనాడు గంగాతీరాన యాజ ఉపయాజులనే ఇద్దరిని చూసి, ఉపయాజిని పూజించి ఇలా అన్నాడు.)

1_7_7 ఆటవెలది కిరణ్ - వసంత

ఆటవెలది

ఉల్లసంబు లాడి యోడకు పొమ్మని
ద్రుపదు విడిచి పుచ్చె ద్రోణుచేత
నట్లు విడువఁ బడి తదవమాన తప్తుఁ డై
పృషతనందనుండు పెద్ద యలిగి.

(దెప్పిపొడుపు మాటలు మాట్లాడి, అవమానించి ద్రుపదుడిని విడిచిపెట్టాడు. ద్రుపదుడు ఈ అవమానానికి కోపించి.)

1_7_6 వచనము కిరణ్ - వసంత

వచనము

ఇట్లు దనవలన విలువిద్య గఱచిన పాండవ కౌరవ కుమారులం జూచి ద్రోణుండు నా కవమానంబు సేసిన య ప్పాంచాలు నోడించి పట్టికొని తెం డిదియ నాకు గురుదక్షిణ యగు నని పంచిన వల్లె యని యందఱు నా ద్రుపదుపయిం బోయి వానిచేత నిర్జితు లయిన నర్జునుండు ద్రుపదుతోడ మహాయుద్ధంబు సేసి వానిం బట్టికొని వచ్చి ద్రోణున కొప్పించిన నతండును.

(ద్రోణుడు ఆ రాజకుమారులతో - ద్రుపదుడిని ఓడించి తీసుకురండి. అదే నాకు గురుదక్షిణ - అని పంపాడు. కానీ వారందరూ ద్రుపదుడి పైకి దండెత్తి వెళ్లి ఓడిపోయారు. అప్పుడు అర్జునుడు వెళ్లి ద్రుపదుడిని ఓడించి పట్టుకొని వచ్చి ద్రోణుడికి అప్పగించాడు. అప్పుడు ద్రోణుడు.)

1_7_5 సీసము + ఆటవెలది కిరణ్ - వసంత

సీసము

ఆది భరద్వాజుఁ డను ముని కలశంబు
        నం దుద్భవించిన యనఘమూర్తి
ద్రోణుండు మఱి పృషతున కుద్భవించిన
        ద్రుపదుండు నొక్కటఁ దొడఁగి యిష్ట
సఖు లయి వేదముల్ సదివి ధనుర్వేద
        మగ్నివేశులతోడ నర్థిఁ గఱచి
చని ద్రుపదుండు పాంచాలభూములకు రా
        జైన భారద్వాజుఁ డతని కడకు

ఆటవెలది

నరిగి వానిచేత నవమానితుం డయి
హస్తిపురికి వచ్చి యఖిలకురుకు
మారవరుల నెల్ల మానుగా శస్త్రకో
విదులఁ జేసె లోకవిదితయశుఁడు.

(ద్రోణుడు, ద్రుపదుడు ఒకేచోట ఉండి, స్నేహితులై వేదాలు చదివారు. పాంచాలదేశానికి ద్రుపదుడు రాజైన తరువాత ఒకసారి ద్రోణుడిని అవమానించాడు. ద్రోణుడు హస్తినకు వెళ్లి కురుకుమారులకు శస్త్రవిద్యలు నేర్పించాడు.)

1_7_4 వచనము కిరణ్ - వసంత

వచనము

ఆ ద్రుపదుండు దనకూఁతు నగ్నికుండ సముద్భవ యైనదాని నయోనిజ నగణ్యపుణ్యలావణ్యగుణసమన్విత సమరూపుఁ డైన రాజపుత్త్రునకు వివాహంబు సేయంగానక స్వయంవరంబు రచియించుచున్నవాఁ డనినం గుంతియు ధర్మతనయుండును విస్మితు లై యది యేమి కారణంబున నయోనిజ యయ్యె నక్కన్య నెవ్విధంబున ద్రుపదుండు వడసె దీని సవిస్తరంబుగాఁ జెప్పుమనిన నవ్విప్రుండు వారల కి ట్లనియె.

(ఆ ద్రుపదుడు తన పుత్రిక, అయోనిజ అయిన ద్రౌపది వివాహం కోసం స్వయంవరం ఏర్పాటు చేస్తున్నాడు - అనగా కుంతి, ధర్మరాజు ఆశ్చర్యపడి - ఆమె ఎందుకు అయోనిజ అయింది? ద్రుపదుడg ఆమెను ఎలా కూతురిగా పొందాడు? - అని అడిగారు. అతడు వారితో ఇలా అన్నాడు.)

Monday, August 14, 2006

1_7_3 చంపకమాల కిరణ్ - వసంత

చంపకమాల

సొలయక యెల్లదేశములుఁ జూచితి నందుఁ బ్రసిద్ధు లైన రా
జుల సుచరిత్ర సంపదలుఁ జూచితి నా ద్రుపదేశుదేశముం
బొలుపున నొండు దేశములు పోల్పఁగ నెవ్వియు లేవు సద్గుణం
బులఁ బరు లెవ్వరున్ ద్రుపదుఁ బోలఁగ లేరు ధరాతలంబునన్.

(నేను చాలా దేశాలు చూశాను. వాటిలో ద్రుపదరాజు దేశంతో పోల్చదగిన వేరే దేశాలు లేవు. సద్గుణాలలో ద్రుపదుడిని పోలినవారు లేరు.)

1_7_2 వచనము కిరణ్ - వసంత

వచనము

అ క్కథకుండు శౌనకాదిమహామునులకుం జెప్పె నట్లు పాండవులు విప్రవేషంబున నేకచక్రపురంబునందు వేదాధ్యయనంబు సేయుచు విప్రగృహంబున నున్న కొన్నిదినంబులకు నొక్కబ్రాహ్మణుండు ద్రుపదుపురంబుననుండి చనుదెంచి విశ్రమార్థి యైన నాగృహస్థుండు వాని నభ్యాగతపూజల సంతుష్టుం జేసి యున్నంతఁ గుంతీదేవి గొడుకులుం దాను నవ్విప్రు నతిప్రీతి నుపాసించి యయ్యా మీర లెందుండి వచ్చితి రే దేశంబులు రమ్యంబు లెందుల రాజులు గుణవంతు లని యడిగిన న వ్విప్రుం డి ట్లనియె.

(మహాభారతకథ చెపుతున్న ఉగ్రశ్రవసుడు శౌనకాదిమునులకు భీముడు బకాసురుడిని వధించేవరకూ జరిగినకథను వివరించాడు. తరువాత వారు ఏకచక్రపురంలో ఉంటున్న సమయంలో ద్రుపదరాజు పట్టణం నుండి ఒక బ్రాహ్మణుడు అక్కడికి వచ్చాడు. కుంతి, పాండవులు అతడిని సేవించి - అయ్యా! మీరు ఎక్కడినుండి వచ్చారు? ఏ దేశాలు అందమైనవి? ఏ రాజులు గుణవంతులు? - అని అడిగారు. అతడు ఇలా చెప్పాడు.)

-:ధృష్టద్యుమ్న ద్రౌపదుల యుత్పత్తి వృత్తాంతము:-

1_7_1 కందము కిరణ్ - వసంత

కందము

శ్రీరాజరాజ వీర
శ్రీరమణీరమ్య గంధసింధుర హయ శి
క్షారూఢి దక్ష దక్ష మ
ఖారిదయాలబ్ధ సుస్థిరైశ్వర్యపదా.

(రాజరాజనరేంద్రా!)

Sunday, August 13, 2006

ఆదిపర్వము - సప్తమాశ్వాసము

1_6_313 గద్యము విజయ్ - విక్రమాదిత్య

గద్యము

ఇది సకలసుకవిజనవినుత నన్నయభట్టప్రణీతం బైన శ్రీమహాభారతంబునం దాదిపర్వంబునం గుమారాస్త్రవిద్యా సందర్శనంబును ద్రుపదగ్రహణమోక్షణంబును దుర్యోధనుదుర్మంత్రంబును వారణావతయాత్రయు జతుగృహదాహంబును విదురోపదిష్టద్వారంబునం బాండవాపక్రమణంబును హిడింబువధయు హిడింబావివాహంబును వ్యాససందర్శనంబును ఘటోత్కచసంభవంబును విప్రగృహంబున నజ్ఞాతచర్యయును బకాసురవధయును నన్నది షష్ఠాశ్వాసము.

(ఇది నన్నయభట్టు రచించిన మహాభారతంలో ఆదిపర్వంలో - కురుకుమారుల అస్త్రవిద్యాసందర్శనం, ద్రుపదుడిని యుద్ధంలో బంధించి విడిచిపెట్టటం, దుర్యోధనుడి దురాలోచన, పాండవుల వారణావత యాత్ర, లాక్షాగృహదహనం, విదురుడు చెప్పిన విధంగా పాండవులు బయటపడటం, హిడింబాసురుడిని సంహరించటం, భీమసేనుడు హిడింబను వివాహమాడటం, వ్యాసమహర్షిదర్శనం, ఘటోత్కచుడు జన్మించటం, పాండవులు బ్రాహ్మణుడి ఇంట్లో అజ్ఞాతంగా ఉండటం, బకాసురుడిని చంపటం - అనే అంశాలు కలిగినది ఆరవ ఆశ్వాసం.)

1_6_312 మాలిని విజయ్ - విక్రమాదిత్య

మాలిని

ప్రణమ దఖిల ధాత్రీ పాల కాలోల చూడా
మణిగణకిరణశ్రీమండితాంఘ్రీ నరేంద్రా
గ్రణి నిఖిలమహీరక్షామణీ రాజనారా
యణ విమలమతీ శీతాంశువంశప్రకాశీ.

(రాజరాజనరేంద్రా!)

1_6_311 కందము విజయ్ - విక్రమాదిత్య

కందము

మలహారినాథ విలస
చ్చళుక్యకులతిలక రాజసర్వజ్ఞ రిపు
ప్రళయప్రతాప పరనృప
లలనాననకమల హరిణలాంఛనమూర్తీ.

(మలహారిదేశప్రభూ!)

-:ఆశ్వాసాంతము:-

1_6_310 కందము విజయ్ - విక్రమాదిత్య

కందము

అని యిట్లు పాండునృపనం
దనుల చరిత్రంబు సెప్పఁ దా వైశంపా
యనుఁడు జనమేజయున కని
జనవినుతచరిత్రపాత్ర సౌజన్యనిధీ.

(రాజరాజనరేంద్రా! ఇలా పాండవుల చరిత్రను వైశంపాయనుడు జనమేజయుడికి చెప్పాడు - అని సూతుడు శౌనకాదిమునులకు చెప్పాడు.)

1_6_309 ఉత్పలమాల విజయ్ - విక్రమాదిత్య

ఉత్పలమాల

వీఁ డొక మంత్రసిద్ధుఁ డగు విప్రు డసాధ్య బలున్ బకాసురున్
నేఁ డనిఁ జంపెనట్టె యితనిం జని చూతమ యంచుఁ జెచ్చెరం
బోఁడిగ వేత్రకీయమున భూసురు లాదిగ వచ్చిచూచి ర
వ్వాఁడిమగంటిమిన్ వెలయువాని వృకోదరు నెల్లవారలున్.

(బకాసురుడిని చంపిన భీముడిని చూసేందుకు అందరూ వచ్చారు.)

1_6_308 వచనము విజయ్ - విక్రమాదిత్య

వచనము

అంత నారాక్షసులు భీతు లై భీము సేసిన సమయంబున కొడంబడి నాఁటంగోలె నేకచక్రనివాసులకు నుపద్రవంబుఁ చేయనోడి రట్లు భీముండు బకాసురుం జంపి వానిం జంపుట జగద్విదితంబుగాఁ దత్కళేబరం బీడ్చుకొని వచ్చి నగర ద్వార సమీపంబున వైచి యందుల విప్రులకు సంతోషంబు సేసి నిజనివాసంబునకుం జని త ద్వృత్తాంతం బంతయుఁ దల్లికి సహోదరులకుం జెప్పి యున్నంత.

(ఆ రాక్షసులు అందుకు అంగీకరించారు. భీముడు బకుడి కళేబరాన్ని ఏకచక్రనగరద్వారం దగ్గర పడవేసి, ఇంటికి వెళ్లి తల్లికి, అన్నదమ్ములకు జరిగినది చెప్పాడు. అప్పుడు.)

1_6_307 తేటగీతి విజయ్ - విక్రమాదిత్య

తేటగీతి

ఇంక నెన్నండు రక్కసు లిద్దురాత్ము
నట్లు మనుజులఁ దినకుండుఁ డడరి మనుజ
భక్షణము సేసితిరయేని బకుని యట్లు
చత్తురని రక్కసుల కెల్లఁ జాటె వినఁగ.

(మీరు ఇకపై మానవులను తినవద్దు. తింటే బకుడి లాగా మీకు కూడా చావు తప్పదు - అని ప్రకటించాడు.)

1_6_306 వచనము విజయ్ - విక్రమాదిత్య

వచనము

ఇట్లు బకాసురుండు భీముచేత నిహతుం డయి విగతజీవితుం డగుచుండి యఱచిన నమ్మహాధ్వని విని వాని బాంధవు లైన రక్కసులు పెక్కండ్రు పఱతెంచిన వారలం జూచి భీముం డి ట్లనియె.

(బకుడు చనిపోతూ అరిచిన అరుపు విని అతడి బంధువులైన రాక్షసులు రాగా భీముడు వారితో ఇలా అన్నాడు.)

1_6_305 ఉత్పలమాల విజయ్ - విక్రమాదిత్య

ఉత్పలమాల

దారుణ జానుదండమున దండధర ప్రతిముండు భీకరా
కారుఁడు వానివీపు విఱుగంబొడిచెం బిశితంబుతో నవ
ద్వారములన్ మహారుధిరధారలు బోరన నొల్కిమాంస పం
కారుణవారిఘోరనదు లై పఱవన్ విపినాంతరంబునన్.

(భీముడు బకుడి వీపు విరిగేలా పొడిచాడు.)

1_6_304 వచనము విజయ్ - విక్రమాదిత్య

వచనము

భీముండును వాని హీనసత్త్వుంగా నెఱింగి సుర హస్తి హస్తానుకారంబు లైన సవ్య దక్షిణ హస్తంబుల నమ్మనుజ కంటకు కటి కంఠ ప్రదేశంబులు వట్టికొని.

(బకుడు బలహీనపడటం భీముడు గమనించి.)

1_6_303 కందము విజయ్ - విక్రమాదిత్య

కందము

అనిలసుతుఁ బట్టికొని పె
ల్చన త్రోచి కడంగి కనకశైలనికుంజం
బునుబోని వానివక్షముఁ
దనదృఢతరముష్టిఁ బొడిచెఁ దద్దయు నలుకన్.

(బకుడు భీముడిని పిడికిలితో పొడిచాడు.)

1_6_302 కందము విజయ్ - విక్రమాదిత్య

కందము

కడఁగి వృకోదరుఁ డసురం
బడఁగా ధర వైచి వామపాదంబునఁ జే
డ్పడ వానిఱొమ్ముఁ దాఁచెం
గడుకొని యసురయును లేచి కడునుద్ధతుఁ డై.

(ఒకరినొకరు నేలమీద పడవేసి తన్నుకున్నారు.)

1_6_301 వచనము విజయ్ - విక్రమాదిత్య

వచనము

ఇట్లు భీమ బకాసురు లాసురంబునం బెనంగి మల్లయుద్ధంబు సేయునెడ.

(ఇలా వారు యుద్ధం చేస్తూండగా.)

1_6_300 ఉత్పలమాల విజయ్ - విక్రమాదిత్య

ఉత్పలమాల

ఇద్దఱ హుంకృతిధ్వనులు నిద్దఱ భూరి భుజారవంబు న
య్యిద్దఱముష్టిఘాతజనితేరితదారుణనిస్వనంబు న
య్యిద్దఱపాదఘట్టితమహీరవమున్ విని చూపఱెల్లనుం
దద్దయు భీతి నచ్చటికిఁ దా రెడగల్గఁగ బాఱి రొక్కఁడై.

(వీరి యుద్ధానికి భయపడి చూసేవాళ్లంతా అక్కడినుండి పరుగెత్తారు.)

1_6_299 చంపకమాల విజయ్ - విక్రమాదిత్య

చంపకమాల

పరువడి నొండొరుం బెనఁగిపట్టుచుఁ ద్రోచుచు నీడ్చుచుం బర
స్పరజయకాంక్షు లైన బక పాండవవీరుల పాదఘట్టనన్
ధరణితలంబు గ్రక్కదలెఁ దన్నికటద్రుమవల్లు లెల్ల జ
ర్జరితము లయ్యె నిష్ఠురవిశాలశిలల్ నుఱుమయ్యె నయ్యెడన్.

(ఇలా వారిద్దరూ యుద్ధం చేశారు.)

1_6_298 వచనము విజయ్ - విక్రమాదిత్య

వచనము

అనుచు సమీరణసుతుండు దన సమీపంబున నున్న విశాలసాలవృక్షంబు వెఱికికొని రక్కసుపై వైచిన వాఁడును దనచేతివృక్షంబున దాని భగ్నంబుఁ జేసె నిట్లిరువురు నొక్కవడి వృక్షయుద్ధంబు సేసి యాసన్న మహీరుహంబులు సమసిన మల్లయుద్ధసన్నద్ధు లై.

(అంటూ బకుడితో యుద్ధం చేశాడు.)

-:భీమసేనుఁడు బకాసురుం జంపుట:-

1_6_297 ఉత్పలమాల విజయ్ - విక్రమాదిత్య

ఉత్పలమాల

ఇంచుకయేని పాపమున కెన్నఁడు రోయక యెల్లవారి బా
ధించి మనుష్యమాంసములు దించును గ్రొవ్వితి వాని నెల్లఁ గ్ర
క్కించెద నీ మదాంధ్య ముడిగించెద నిప్పుడ కాలుప్రోలి కే
గించెదఁ జక్కనై నిలుము గిట్టి రణంబున రాక్షసాధమా.

(ఇప్పుడే నిన్ను చంపుతాను, యుద్ధానికి సిద్ధమై నిలబడు.)

1_6_296 వచనము విజయ్ - విక్రమాదిత్య

వచనము

అంతకు ముందఱ భీమసేనుం డంత కూడునుం గుడిచి యనంత బల సమేతుం డై యంతకాకారంబున మల్లసఱచుకొని యార్చుచు.

(ఈలోపు భీముడు ఆహారన్నంతా తిని.)

1_6_295 సీసము + ఆటవెలది విజయ్ - విక్రమాదిత్య

సీసము

చనుదెంచి ముందట శకటంబుపైనుండి
        యోడక కుడుచుచు నున్న భీము
దవ్వులఁ జూచి నిత్యము నాకు నియమించి
        కొనివచ్చు కూ డేల కుడిచె దీవు
గడుఁ గ్రొవ్వి రేకచక్రంబునవారల
        కే నింత యెల్లిద మేల యైతి
నని డాయ వచ్చి యయ్యనిలనందనువీఁపుఁ
        బిడికిటఁ బొడిచిన బెదర కసుర

ఆటవెలది

వలను సూడ కొండు వగవక యెప్పటి
యట్లు కుడుచుచున్న నలిగి బకుఁడు
వీని బాగు సూడ వే ఱంచు డాసిన
తరువుఁ బెఱికి కొనుచుఁ దాఁకుఁ దెంచె.

(బకుడు భీముడిని సమీపించి అతడి వీపున పిడికిట పొడిచాడు. భీముడు అతడి వైపు కూడా చూడకుండా అన్నం తింటూండగా బకుడు కోపించి, పక్కన ఉన్న చెట్టును పెరికి భీముడి దగ్గరకు వచ్చాడు.)

1_6_294 ఆటవెలది విజయ్ - విక్రమాదిత్య

ఆటవెలది

అలిగి యౌడుగఱచి యాఁకటి పెలుచన
నిలువనోప కసుర నింగి దాఁకఁ
బెరిఁగి యరుగు దెంచె భీమరూపంబుతో
నుగ్రభంగి భీముఁడున్న దెసకు.

(కోపించి భీముడుండే దిక్కుకు వచ్చాడు.)

1_6_293 ఆటవెలది విజయ్ - విక్రమాదిత్య

ఆటవెలది

ప్రొద్దు నేఁడు పెద్దపోయె నిత్యము నిట
తెచ్చియిచ్చుబలియుఁ దెచ్చి యీఁగ
నొల్ల కెలుఁగులిచ్చుచున్నవాఁ డమ్మను
జాధముండు మెచ్చఁడయ్యె ననుచు.

(బలిని తెచ్చి ఇచ్చే నీచుడు నన్ను లెక్కపెట్టకుండా పిలుస్తున్నాడు - అని.)

1_6_292 వచనము విజయ్ - విక్రమాదిత్య

వచనము

ఇట్లు భీమసేనుం డిష్టాన్నోపభోగంబునం దృప్తుం డయి భక్ష్యాన్నపూర్ణం బయిన శకటంబు నెక్కి దక్షిణాభిముఖుం డయి బకాసురుం డున్నచోటికిం జని యార్ద్రశుష్కకళేబరదుర్గంధనిందితం బయిన బకస్థానంబు డాయక యెడగలిగి యమునాతీరంబున శకటంబు నిలిపి యారక్కసుం బిలుచుచు వానివచ్చునంతకు మిన్నకుండ నేల యని కాళ్లుసేతులుఁ గడిగికొని యాచమించి యాశకటంబుపయి కూడు గుడుచుచుండె నట బకాసురుండును.

(భీముడు భోజనం నింపిన బండిని బకాసురుడు ఉండే చోటికి తీసుకువెళ్లి, అతడి నివాసాన్ని సమీపించక, యమునాతీరాన్నే బండి నిలిపి, ఆ రాక్షసుడిని పిలుస్తూ, వాడు వచ్చేవరకూ ఊరకుండటం ఎందుకని, బండిలోని భోజనం తినసాగాడు. అక్కడ బకుడు.)

-:భీముఁడు బకాసురునిఁ జంపఁబోవుట:-

1_6_291 తరలము విజయ్ - విక్రమాదిత్య

తరలము

పలుదెఱంగుల పిండివంటలుఁ బప్పుఁగూడును నేతికుం
డలు గుడంబు దధిప్రపూర్ణఘటంబులుం గొనివచ్చి యీ
నలఘుసత్త్వుఁడు మారుతాత్మజుఁ డన్నిటన్ గతఖేదుఁ డై
బలము గల్గి కడంగె నప్పుడు బ్రాహ్మణార్థము సేయఁగన్.

(భీముడికి పిండివంటలు, పప్పు, కూడు, నేతికుండలు, బెల్లం, పెరుగు నిండిన కుండలు తెచ్చిపెట్టారు. భీముడు అవి తిని బకాసురుడి మీదికి వెళ్లటానికి పూనుకొన్నాడు.)

1_6_290 ఆటవెలది విజయ్ - విక్రమాదిత్య

ఆటవెలది

బలము పెద్ద గలిగి పాపిష్ఠు రక్కసుఁ
జంపి యిప్పురమున జనుల కెల్ల
హర్ష మే నొనర్తు ననవుడు విప్రుఁడు
దానుఁ జుట్టములున్ దత్క్షణంబ.

(ఆ రాక్షసుడిని చంపి ఈ పురజనులకు సంతోషం కలిగిస్తాను - అనగా బ్రాహ్మణుడు, అతడి బంధువులు అప్పటికప్పుడే.)

1_6_289 ఆటవెలది విజయ్ - విక్రమాదిత్య

ఆటవెలది

కడుపునిండఁ గుడువఁ గానమి రేయెల్లఁ
గన్నువొందకున్నఁ గరము డస్సి
యున్నవాఁడ నాకు నోపుదురేని యా
హారతృప్తి సేయుఁ డట్టు లయిన.

(కడుపునిండా తిండిలేక రాత్రి పూర్తిగా నిద్రలేదు. అలసిపోయి ఉన్నాను. పెట్టగలిగితే నాకు తృప్తిగా భోజనం పెట్టండి.)

1_6_288 వచనము విజయ్ - విక్రమాదిత్య

వచనము

అనిన విని ధర్మతనయుండు గుంతీదేవి కారుణ్యబుద్ధికి బ్రాహ్మణభక్తికి ధర్మనిత్యతకు సంతసిల్లి తానును భీమసేను నియోగించె నంత భీముం డవ్విప్రున కి ట్లనియె.

(ఇది విని ధర్మజుడు సంతోషించి తాను కూడా భీముడిని ఆజ్ఞాపించాడు. అప్పుడు భీముడు ఆ విప్రుడితో ఇలా అన్నాడు.)

1_6_287 కందము విజయ్ - విక్రమాదిత్య

కందము

జననుత బ్రాహ్మణకార్యము
సనఁ జేసిన బ్రాహ్మణప్రసాదంబున నీ
కును నీతమ్ములకును నగు
ననవరతశ్రీసుఖాయురైశ్వర్యంబుల్.

(ఈ కార్యం పూర్తిచేస్తే మీకు మంచి జరుగుతుంది.)

1_6_286 సీసము + ఆటవెలది విజయ్ - విక్రమాదిత్య

సీసము

ఉత్తమక్షత్త్రియుం డొరులదుఃఖంబులు
        దలఁగంగఁ బుట్టిన ధర్మశీలుఁ
డలయక మృత్యుభయం బైనచో విప్రుఁ
        గాచి సత్పుణ్యలోకములు వడయు
ధన్యుఁ డై క్షత్త్రియు దయఁ గాచి బుధలోక
        కీర్తనీయంబగు కీర్తి వడయు
వైశ్యశూద్రులఁ గాచి వసుధాతలస్థిత
        సర్వప్రజానురంజనము వడయు

ఆటవెలది

ననఘ సన్మునీంద్రుఁ డయిన వేదవ్యాసు
వలన దీని నిక్కువముగ వింటి
బ్రాహ్మణులకుఁ బ్రియము పాయక చేయంగఁ
గాన్పచూవె పుణ్యకర్మఫలము.

(బ్రాహ్మణులకు ఇష్టమైనది చేయటమే పుణ్యఫలం.)

-:కుంతి ధర్మజునకుఁ బరదుఃఖనివారణము పరమపుణ్యం బని తెలుపుట:-

1_6_285 వచనము విజయ్ - విక్రమాదిత్య

వచనము

అట్టి వజ్రకాయుండు వజ్రధరు నయిన నోర్వనోపు నట్టి సమర్థుండు రక్కసు నశ్రమంబునం జంపి యిందుల బ్రాహ్మణులబాధ యుడుచుం బవనతనయు నుద్దేశించి సంతాపింపవలవదు మనకు సుఖనివాసంబు సేసి పరమోపకారి యైన యాబ్రాహ్మణునకుఁ బ్రత్యుపకారంబు సేయ సమకూరె.

(ఇతడు ఆ రాక్షసుడిని సులభంగా చంపగలడు.)

1_6_284 తేటగీతి విజయ్ - విక్రమాదిత్య

తేటగీతి

వీఁడు పుట్టిన పదియగునాఁడు పెలుచఁ
బడియె నా చేత నుండి య ప్పర్వతమునఁ
బడినవడిఁ జేసి బాలకు నొడలు దాఁకి
యచటి రాలెల్లఁ బెల్లు నుగ్గయ్యెఁ జూవె.

(ఈ భీముడు పుట్టిన పదవరోజు నా చేతినుండి జారి పర్వతం మీద గట్టిగా పడ్డాడు. అతడి శరీరం తగిలి అక్కడి రాళ్లన్నీ పొడి అయ్యాయి సుమా!)

1_6_283 ఆటవెలది విజయ్ - విక్రమాదిత్య

ఆటవెలది

భ్రమవిమోహలోభభయపరిభూత నై
కొడుకు విడువ నంత వెడఁగ నయ్య
యేను భీముశక్తి యెఱుఁగక పంచిన
దానఁ గాను వినుము వీనిశక్తి.

(భ్రాంతికి వశమై కొడుకును పోగొట్టుకోవటానికి నేనంత వెర్రిదాన్నటయ్యా! భీముడి శక్తి తెలియక నేనీ పని అప్పగించలేదు. ఇతడి శక్తి విను.)

1_6_282 వచనము విజయ్ - విక్రమాదిత్య

వచనము

అక్కట దుఃఖాతిశయంబున మతిభ్రమణం బయ్యెం గా కేమి యనినఁ గొడుకునకుఁ గుంతి యి ట్లనియె.

(దుఃఖాతిశయాన మతి భ్రమించిందా ఏమి? - అనగా ధర్మరాజుతో కుంతీదేవి ఇలా అన్నది.)

1_6_281 సీసము + ఆటవెలది విజయ్ - విక్రమాదిత్య

సీసము

ఇతని విక్రమ మాశ్రయించియ కాదె య
        య్యెడ లక్కయిల్లు వెల్వడఁగఁ గంటి
మడవిలో నిద్రావశాత్ముల మై యున్న
        మననిద్రఁ జెఱుపఁ గా దని హిడింబు
నెడగల్గఁ గొనిపోయి యెక్కటి సంపిన
        దండితశత్రుఁ డీతండ కాఁడె
యితనిబల్మిన కాదె యెంతయు భీతు లై
        ధృతరాష్ట్రనందనుల్ ధృతియుఁ దఱిఁగి

ఆటవెలది

నిద్రలేక తమకు నిలుచు నుపాయంబు
లొండుదక్కి వెదకుచున్నవారు
బలియు నిట్టిభీము బ్రాహ్మణార్థమ్ముగా
నసురవాతఁ ద్రోతు రవ్వ యిట్లు.

(మనను ఎన్నోసార్లు రక్షించిన భీముడిని విప్రుడికోసం బకాసురుడి నోట్లో ఇలా తోస్తారా!)

1_6_280 వచనము విజయ్ - విక్రమాదిత్య

వచనము

అని యడిగిన ధర్మతనయునకుఁ గుంతీదేవి యీ యేకచక్రపురంబున బ్రాహ్మణుల బకాసురుండు బాధించుటయుఁ దమ విడిసిన యింటిబ్రాహ్మణుని కైన యాపదయు దానిం దీర్పం బవనతనయు బ్రాహ్మణార్థంబుగాఁ దనసమర్పించుటయుం జెప్పిన విని ధర్మజుండు దుఃఖించి యిది యేమి సాహసంబు సేసితి రొడ్లకొడుకులకుంగాఁ దమకొడుకుల విడుచు దుర్బుద్ధులునుం గలరె యిదిలోకాచారవిరుద్ధంబు మఱి భీమసేనుఁడు మీకు విడువందగియెడు కొడుకే.

(అని అడిగిన ధర్మరాజుకు కుంతీదేవి జరిగిన విషయం చెప్పింది. ధర్మరాజు బాధపడి - ఇదేమి సాహసం? ఇతరుల కొడుకులను రక్షించటానికి తమ కొడుకులను కోల్పోయే దుర్బుద్ధులు ఉన్నారా? భీముడు మీకు విడువదగిన కుమారుడా?)

1_6_279 చంపకమాల విజయ్ - విక్రమాదిత్య

చంపకమాల

నరనుతకీర్తి యీ యనిలనందనుఁ డెవ్వరితోడనేని భీ
కరసమరంబు సేయ సమకట్టినయట్లు మహానురాగ ని
ర్భరమున నున్నవాఁ డితనిభావము సూడఁగ వేఱు వీని సు
స్థిరబలు మీరు పంచితిరొ చెచ్చెరఁ దాన యుపక్రమించెనో.

(భీముడు ఎవరితోనో యుద్ధానికి పూనుకొన్నట్లు మహాసంతోషంగా ఉన్నాడు. భీముడిని మీరు ఆజ్ఞాపించారా లేక తనంతట తానే ఉపక్రమించాడా?)

1_6_278 వచనము విజయ్ - విక్రమాదిత్య

వచనము

ఈతనిచేతఁ దొల్లియుఁ బెక్కం డ్రసురులు నిహతు లయిరి వీఁడు మహాబలసంపన్నుండు మంత్రసిద్ధుం డని భీముం బిలిచి యీ బ్రాహ్మణునాపదం దలఁగి నాకు మనఃప్రియంబు సేయు మనిన వల్లె యని భీముం డారక్కసుఁ జంపం బూనె బ్రాహ్మణుండును దనబంధువర్గంబుతో సంతసిల్లె నంత ధర్మార్జుననకులసహదేవులు వచ్చి పరమహర్షపరిపూర్ణుం డై యున్న పవనతనయునాకారం బుపలక్షించి విస్మితులగుచుండ ధర్మతనయుం డల్లనఁ దల్లికి ని ట్లనియె.

(ఇతడు మహాబలవంతుడు - అని భీముడిని పిలిచి - ఇతడి ఆపద తీర్చు - అనగా భీముడు అందుకు అంగీకరించాడు. తరువాత మిగిలిన పాండవులు వచ్చి మహానందంతో ఉన్న భీముడిని చూసి ఆశ్చర్యపడ్డారు. ధర్మరాజు మెల్లగా తల్లితో ఇలా అన్నాడు.)

1_6_277 కందము విజయ్ - విక్రమాదిత్య

కందము

ఖలు నసుర నోర్వ నోపెడు
బలయుతుఁగా నెఱిఁగి కొడుకుఁ బనిచెదఁ గా కి
మ్ముల శతపుత్త్రుల గల ధ
న్యుల కైన ననిష్టుఁ డగు తనూజుఁడు గలఁడే.

(ఆ రాక్షసుడిని చంపగలడని తెలిసే నా కుమారుడిని పంపుతున్నాను. కాకపోతే, వందమంది కొడుకులున్నవాళ్లకైనా ఇష్టంకాని కొడుకు ఉంటాడా?)

1_6_276 కందము విజయ్ - విక్రమాదిత్య

కందము

ఏనును దీనిన తలఁచి మ
హీనుత విప్రవధ యెద సహింపక మఱి నా
సూను సమర్పించితి మ
త్సూను వధింపంగ రక్కసునకు వశంబే.

(నా కుమారుడిని చంపటం ఆ రాక్షసుడికి సాధ్యం కాదు.)

-:బకునిఁజంప భీమునిఁ బంపుటకుఁ గుంతి నిశ్చయించుట:-

Saturday, August 12, 2006

1_6_275 వచనము విజయ్ - విక్రమాదిత్య

వచనము

మఱి యాత్మఘాతంబు మహాపాతకంబు దాని కెట్లొడంబడి తంటేని యది యనతిక్రమణీయం బయి యప్రతీకారం బయి యొరులచేతం జేయంబడుటంజేసి నాకుం బాతకంబు లేదు దానిం జేసినవానికి మహాపాతకం బగుం గావున బ్రాహ్మణహింస కే నొడంబడ నోప ననినఁ గుంతి యి ట్లనియె.

(మహాపాతకమైన ఆత్మహత్యకు ఎలా అంగీకరించావని అంటావేమో - అది దాటరానిది, ఇతరుల వల్ల జరుగుతున్నది కాబట్టి నాకు పాపం లేదు - అని పలుకగా కుంతి ఇలా అన్నది.)

1_6_274 కందము విజయ్ - విక్రమాదిత్య

కందము

ధృతి సెడి వేఁడెడువానిని
నతిథిని నభ్యాగతుని భయస్థుని శరణా
గతుఁ జంపఁగ నొడఁబడు దు
ర్మతి కిహముం బరముఁ గలదె మదిఁ బరికింపన్.

(ధైర్యం కోల్పోయి ప్రార్థించేవాడిని, అతిథిని, అభ్యాగతుడిని, భయస్థుడిని, శరణుకోరేవారిని చంపాలనుకొనే వాడికి ఇహపరాల్లో సుఖముంటుందా!)

1_6_273 మధ్యాక్కర విజయ్ - విక్రమాదిత్య

మధ్యాక్కర

అతిథి యై వచ్చిన బ్రాహ్మణున్ జీవితార్థి నై నాకు
హితముగా రక్కసువాతఁ ద్రోవ నే నె ట్లొడంబడుదు
మతి నవమానింపఁ గా దనిన విప్రుమరణంబు దలఁచు
టతిపాతకము పాతకములలో బ్రహ్మహత్యయ పెద్ద.

(ఇందుకు నేనెలా అంగీకరిస్తాను? బ్రహ్మహత్య మహాపాతకం.)

1_6_272 వచనము విజయ్ - విక్రమాదిత్య

వచనము

పెద్దకాలంబునకు నీ యిలువరుస నేఁడు మాకు వచ్చె ని చ్చిఱుత వాని నా రాక్షసునకు భక్ష్యంబుగాఁ బుచ్చనోప నేన పోయెద నని దుఃఖించి పలికిన బ్రాహ్మణునకుఁ గుంతి యిట్లనియె నయ్యా దీనికి సంతాపింపవలవ దీయాపద దలఁగునట్టి యుపాయంబు గంటి నీకుం గొడు కొక్కరుండ వాఁడును గడుబాలుండు బలిగొనపోవ నర్హుండు గాఁడు నా కేవురుగొడుకులు గలరు వారలలో నొక్కరుం డారక్కసునకు భవదర్థంబుగా బలిగొని పోయెడు ననిన దాని విననోడి బ్రాహ్మణుండు చెవులు మూసికొని యి ట్లనియె.

(చాలా కాలానికి ఈ ఇంటివరుస మా యింటికి వచ్చింది. ఈ బాలుడిని ఆహారంగా పంపలేను. నేనే పోతాను - అని పలుకగా కుంతి - అయ్యా! దీనికి దుఃఖించవద్దు. నీకు ఒక్కడే కొడుకు. బకుడికి బలిగా అర్హుడు కాడు. నాకు ఐదుగురు కొడుకులు. వారిలో ఒకడు ఈ బలి తీసుకొని వెళ్లగలడు - అని అంటూండగానే ఆ బ్రాహ్మణుడు ఆ మాటలు వినలేక చెవులు మూసుకొని ఇలా అన్నాడు.)

1_6_271 కందము విజయ్ - విక్రమాదిత్య

కందము

అరి యని విప్రులచేతను
ధరణీశులు పోఁకయును మొదలుగాఁ గొన రె
వ్వరు నిప్పాపుఁడు మానిసి
నరిగొనియెడు భక్షణార్థి యై విప్రులచేన్.

(రాజులు బ్రాహ్మణులనుండి పోకచెక్కను కూడా కప్పంగా తీసుకోరు. కానీ ఈ రాక్షసుడు విప్రులనుండి మనిషినే కప్పంగా కోరుతాడు.)

1_6_270 ఉత్పలమాల శిరీష - వసంత

ఉత్పలమాల

పోలఁగ ధర్మశీలుఁ డయి భూరిబలాధికుఁ డైన ధారుణీ
పాలకు రక్ష ము న్వడసి భార్యను బుత్త్రుల నర్థయుక్తితో
నోలిన మేలుగాఁ బడసి యూళ్లను నున్నది యట్లుగాని నాఁ
డేల గృహస్థవృత్తి సుఖమేఁగి వనంబున నున్కి కష్టమే.

(రాజు రక్షణ పొందిన తరువాత వివాహమాడి, పిల్లలను కని, ధనం సంపాదించి, ఊళ్లలో కాపురముండాలి కానీ అది లేనినాడు గృహస్థవృత్తి ఎందుకు? వెళ్లి అడవిలో ఉండటమే సుఖం కదా.)

1_6_269 ఆటవెలది శిరీష - వసంత

ఆటవెలది

మనుజభక్షుఁ డిదియ తనకు నప్పనముగా
నొరులవలనిబాధ నొరయకుండ
దీనిఁ గాచుచుండు నీనాఁటిరాజును
దలఁపఁ డసుర నోర్వ బలిమిలేమి.

(బకుడు ఇదే తనకు కానుకగా భావించి ఈ పట్టణాన్ని రక్షిస్తూ ఉన్నాడు. ఈ దేశప్రభువు కూడా ఇతడిని చంపగలిగే శక్తిలేక దీన్ని గురించి ఆలోచించడు.)

1_6_268 వచనము శిరీష - వసంత

వచనము

నిత్యంబు నిలువరుస నొక్కమానిసి రెండెనుపోతులం బూన్చిన శకటంబున నపరిమితభక్ష్యపిశితమిశ్రాన్నంబు నించికొని పోయిన దానిని వానిని నయ్యెనుపోతులను భక్షించుచు.

(ప్రతిరోజూ ఇంటివరుసన ఒక మనిషి రెండుదున్నపోతులను కట్టిన బండిలో భోజనాన్ని నింపుకొని వెడితే వాడు ఆ అన్నాన్నీ, మనిషినీ, దున్నపోతులనూ తింటూ.)

1_6_267 సీసము + ఆటవెలది శిరీష - వసంత

సీసము

ఏ నేమి సెప్పుదు దీని నెవ్వరికిని
        మానుషంబునఁ దీర్పరాని దాని
నయినను జెప్పెదఁ బ్రియహితవచన యీ
        ప్రోలికి నామడనేల నల్ల
యమునానదీ గహ్వరమున బకుం డను
        రక్కసుం డుండి వాఁ డక్కజముగ
నిందుల కాఁపులనందఱఁ దొల్లి యి
        ల్వరుస మ్రింగుచు నున్నఁ బరమసాధు.

ఆటవెలది

లగు ధరామరేంద్రు లగణిత జప హోమ
దానవిధులఁ జేసి వానివలనఁ
గ్రమము వడసి యొక్కసమయంబుఁ జేసిరి
యొనర దానితెఱఁగు వినుము తల్లి.

(ఈ పట్టణానికి ఆమడ దూరాన యమునానదీ తీరాన ఉండే అడవిలో బకుడనే రాక్షసుడున్నాడు. వాడు ఈ పట్టణవాసులను ఇంటివరుసన భక్షిస్తూ ఉండగా ఇక్కడివారు అతడితో ఒక ఏర్పాటు చేసుకొన్నారు.)

-:కుంతీదేవికి బ్రాహ్మణుండు తనదుఃఖకారణంబును దెలుపుట:-

1_6_266 వచనము శిరీష - వసంత

వచనము

ఇ ట్లడిగినఁ గుంతీదేవికి నవ్విప్రుం డి ట్లనియె.

(ఇలా అడిగిన కుంతీదేవితో ఆ బ్రాహ్మణుడు ఇలా అన్నాడు.)

1_6_265 కందము శిరీష - వసంత

కందము

ఇది యేమి తెఱఁగు దీనికి
మొద లెయ్యదిఁ నాకుఁ దెల్లముగఁ జెప్పుఁడు తీ
ర్చెద నని విగతాసులఁ దన
మృదు వచన ప్రశ్న మను నమృతమున నెత్తెన్.

(మీ ఆపదను నేను తొలగిస్తాను, అది ఏమిటో స్పష్టంగా చెప్పండి - అని అడిగింది.)

1_6_264 వచనము శిరీష - వసంత

వచనము

వాని యవ్యక్త వచనంబులు విని యందఱు నే డ్పుడిగిన నయ్యవసరంబునం గుంతీదేవి వారల డాయంబోయి.

(వాడి వచ్చీరాని మాటలు విని అందరూ ఏడ్పుమానగా కుంతీదేవి వాళ్ల దగ్గరకు వెళ్లి.)

1_6_263 తేటగీతి శిరీష - వసంత

తేటగీతి

బాలకుం డొక కొండుక కోల చేతఁ
బట్టికొని యేన రక్కసుఁ గిట్టి చంపి
చులుక వత్తు మీ రేడ్వఁగా వలవ దనుచుఁ
గలయ నూరార్చెఁ దన తొక్కుఁబలుకు లొప్ప.

(ఇంతలో వారి పిల్లవాడు ఒక చిన్న కర్రను చేతపట్టుకొని - నేనే ఆ రాక్షసుడి దగ్గరకు వెళ్లి చంపి వస్తాను. మీరు ఏడవవద్దు - అని వచ్చీరాని మాటలతో అందరినీ ఓదార్చాడు.)

1_6_262 వచనము శిరీష - వసంత

వచనము

మీకు నాయం దయ్యెడు దౌహిత్ర లాభంబునకంటె మీరిద్దఱు జీవించిన ననేక పుత్త్ర పౌత్త్ర లాభం బగు దానంజేసి కులంబు నిలుచుం గావున నన్నఁ బుచ్చుం డనినఁ గూఁతుం గౌఁగిలించుకొని యేడ్చుచున్న వారల కన్నీళ్లు దుడుచుచు.

(నన్ను పంపండి - అని పలికిన కూతురిని కౌగిలించుకొని ఏడుస్తున్న తల్లిదండ్రుల కన్నీళ్లు తుడుస్తూ.)

1_6_261 తేటగీతి శిరీష - వసంత

తేటగీతి

తండ్రిచేయు తిలోదక దాన విధులు
పొందుఁ బరలోకగత యైన పుత్త్రియందుఁ
బుత్త్రి చేసిన విధులు దత్పురుషుఁ గాని
తల్లిదండ్రులఁ బొందవు ధర్మయుక్తి.

(తండ్రి ఇచ్చే తిలోదకాలు మరణించిన కూతురికి చేరుతాయి కానీ కూతురు చేసే కర్మలు ఆమె భర్తకే కానీ తల్లిదండ్రులకు చెందవు.)

1_6_260 ఆటవెలది శిరీష - వసంత

ఆటవెలది

ఒలసి యెంతకాల ముండిన నేను మీ
దానఁ గాన యొరుల ధనమ నన్ను
నెన్నఁడయిన నొరుల కిచ్చుచో నసురకు
భోజనముగ నిచ్చి పుచ్చుఁ డిపుడ.

(నేను మీతో ఎంతకాలం ఉన్నా మీదాన్ని కాదు. ఇతరుల సొమ్మునే. ఎప్పటికైనా ఇతరులకివ్వటం తప్పనప్పుడు ఇప్పుడే ఆ రాక్షసుడికి ఆహారంగా ఇచ్చి పంపండి.)

1_6_259 వచనము శిరీష - వసంత

వచనము

కావున నేను భవ ద్విహీన నయి యొక్క నిమేషం బేనియు జీవింపనేర నేర్చితినేనియు ని క్కుమారుల రక్షింపనేర నె ట్లనిన శూద్రులు వేదశ్రుతిం బ్రార్థించునట్లు కులాచారసదృశులుగానివా రిక్కన్యం బ్రార్థించినం దత్ప్రతీకారంబుసేయను నిక్కుమారునందు గుణాధానంబు సేయను నాకొలంది గాదు మత్పరోక్షంబునం బునర్దారపరిగ్రహంబు సేసి గృహస్థధర్మంబును నగ్నిహోత్రంబునుం బుత్త్రులను రక్షించునది యనుచు మరణవ్యవసాయంబునం దున్న తల్లిని దండ్రిం జూచి కూఁతు రి ట్లనియె.

(కాబట్టి, మీరు లేకుండా నేను జీవించలేను. జీవించినా ఈ బిడ్డలను రక్షించలేను - అని చనిపోయే ప్రయత్నంలో ఉన్న తల్లిని, తండ్రిని చూసి వారి కూతురు ఇలా అన్నది.)

1_6_258 ఆటవెలది శిరీష - వసంత

ఆటవెలది

సతి విముక్త యయినఁ బతికిఁ బునర్దార
సంగ్రహంబు సేఁత శాస్త్రమతము
పతి విముక్తుఁ డయిన సతి కన్యపురుషసం
గ్రహముసేఁత లోకగర్హితంబు.

(భార్య మరణించిన భర్త మరొక భార్యను స్వీకరించటం శాస్త్రసమ్మతం. భర్త మరణించిన భార్య మరొక భర్తను స్వీకరించటం లోకగర్హితం.)

1_6_257 ఆటవెలది శిరీష - వసంత

ఆటవెలది

పడిన యామిషంబు పక్షు లపేక్షించు
నట్లు పురుషహీనయయిన యువతిఁ
జూచి యెల్లవారుఁ జులుక నపేక్షింతు
రిదియుఁ బాప మనక హీనమతులు.

(కిందపడిన మాంసపుముక్కను పక్షులు కోరే విధంగా భర్తను కోల్పోయిన స్త్రీని నీచులు కోరుతారు.)

1_6_256 ఆటవెలది శిరీష - వసంత

ఆటవెలది

పురుషుకంటె మున్ను పరలోక మేఁగిన
సతియ నోఁచినదియు సతులలోనఁ
బురుషహీన యైనఁ బరమపతివ్రత
యయ్యు జగముచేతఁ బ్రయ్యఁబడదె.

(భర్తకంటే ముందు మరణించిన భార్యే పుణ్యాత్మురాలు. భర్తలేని స్త్రీ లోకంచేత నింద పొందుతుంది కదా.)

1_6_255 వచనము శిరీష - వసంత

వచనము

ఆ రక్కసున కే నశనం బయ్యెద మీరు వగవకుండుఁడు భార్యయందుఁ బడయంబడు నపత్యంబు నాయందు మున్న పడసితి రేనును ఋణవిముక్త నయితిం బ్రాణవియోగంబు సేసి యయినును భార్య పతికి హితంబు సేయవలయు మఱి యట్లుంగాక.

(ఆ రాక్షసుడికి నేను ఆహారమవుతాను.)

1_6_254 కందము శిరీష - వసంత

కందము

మనుజులకు నెవ్విధంబున
ననతిక్రమణీయ మైన యాపద్విషయం
బున సంతాపింపఁగఁ జన
దని యెఱిఁగియు నగునె యెట్టు లని శోకింపన్.

(ఏ విధంగానూ దాటరానిదైన ఆపద విషయంలో బాధపడకూడదని తెలిసికూడా ఎలా అని బాధపడవచ్చా?)

1_6_253 వచనము శిరీష - వసంత

వచనము

అని యాత్మపరిత్యాగంబునందుఁ గృతనిశ్చయుం డై యున్న బ్రాహ్మణుం జూచి బ్రాహ్మణి యి ట్లనియె.

(అప్పుడు అతడి భార్య ఇలా అన్నది.)

1_6_252 ఆటవెలది శిరీష - వసంత

ఆటవెలది

ఎట్టు సూచి చూచి యిది పాప మనక య
య్యసుర వాతఁ ద్రోతు నదయవృత్తి
నరిగి యేన యిప్పు డసురకు నాహార
మగుదు వీరిఁ బుచ్చ నగునె నాకు.

(వీరిని ఎలా పంపగలను? నేనే వెళ్లి ఆ రాక్షసుడికి ఆహారమవుతాను?)

1_6_251 సీసము + ఆటవెలది శిరీష - వసంత

సీసము

మంత్రయుక్తంబుగా మత్పరిణిత యై
ధర్మచారిణి యగు దానివినయ
వతిఁ బ్రజావతి ననువ్రత నెట్టు లసురకు
భక్ష్యంబ వగు మని పనుపనేర్తు
ధర్మాభివృద్ధిగాఁ దగు వరునకు నీగ
నిల్లడ బ్రహ్మచే నిడఁగఁబడిన
యిక్కన్య యతిబాల యిం దుద్భవం బగు
దౌహిత్రలాభంబు దలుఁగ నెట్లు

ఆటవెలది

దీనిఁ బుత్తు మఱి మదీయ పిండోదక
నిధిఁ దనూజుఁ గులము నిస్తరించు
వాని బితృగణంబువలని ఋణంబుఁ బా
చిన మహోపకారిఁ జిఱుతవాని.

(నా భార్యను, కూతురిని, కొడుకును రాక్షసుడికి ఆహారం కమ్మని ఎలా పంపగలను?)

1_6_250 తరువోజ శిరీష - వసంత

తరువోజ

ఏనును బ్రజలును నీధర్మసతియు నే యుపాయంబున నిబ్బారిఁ గడవఁ
గానేర్తు మెయ్యది గర్జ మిందుండఁ గా దేగుదమ యొండు గడకని ముంద
రే నెంత సెప్పిన నెన్నండు వినద యిది యిట్టిదారుణ మిమ్మెయిఁ జేయఁ
గా నున్న విధి యేల కడవంగ నిచ్చుఁ గర్మవిపాకంబు గడవంగ లావె.

(ఈ ఆపదను దాటటమెలా? ఇక్కడ ఉండకూడదు, వేరేచోటికి వెడదామని నేనెంత చెప్పినా నా భార్య వినలేదు. ఇప్పుడు ఏమి చేయాలో తోచకుండా ఉన్నది.)

1_6_249 కందము శిరీష - వసంత

కందము

ఆదిని సంయోగవియో
గాదిద్వంద్వములు దేహి యగు వానికి సం
పాదిల్లక తక్కవు పూ
ర్వోదయ కర్మమున నెట్టి యోగికి నయినన్.

(ఎవరికైనా సంయోగం, వియోగం లాంటి ద్వంద్వాలను అనుభవించక తప్పదు.)

1_6_248 కందము శిరీష - వసంత

కందము

నలసారము సంసార మ
ఖిలదుఃఖావహము భయనికేతన మతిచం
చలము పరాధీనం బిం
దు జీవన మేల నమ్ముదురు తత్త్వవిదుల్.

(సంసారం నిస్సారమైనది. తత్త్వం తెలిసినవాళ్లు సంసారజీవనాన్ని ఎలా నమ్ముతారు?)

1_6_247 వచనము శిరీష - వసంత

వచనము

అనినం గుంతి యట్ల చేయుదు నని చని దుఃఖపరవశు లయి పరిదేవనంబు సేయుచున్న వారలం జూచి యడుగ నేరక మిన్న కున్నంత బ్రాహ్మణుండు దన బాంధవులు విన ని ట్లనియె.

(కుంతి అలాగేనని వెళ్లి, ఏడుస్తున్న వారిని చూసి ఏమీ అడగలేక ఊరకుండగా, ఆ విప్రుడు తన బంధువులు వినేలా ఇలా అన్నాడు.)

1_6_246 ఆటవెలది శిరీష - వసంత

ఆటవెలది

ఎఱిఁగి నాకుఁ జెప్పు మిది యేమి యెవ్వరి
వలన నింతమయ్యె వగవ నేల
యెంత కడిఁది యైన నిది యేను దీర్చి యీ
విప్రునకుఁ బ్రియంబు విస్తరింతు.

(ఆ కష్టమేమిటో తెలుసుకొని నాకు చెప్తే అది ఎంత కష్టమైనా నేను తీర్చి ఈ విప్రుడికి సంతోషం కలిగిస్తాను.)

1_6_245 వచనము శిరీష - వసంత

వచనము

అనిన విని భీమసేనుం డి ట్లనియె.

(అది విని భీముడు ఇలా అన్నాడు.)

1_6_244 కందము శిరీష - వసంత

కందము

కృత మెఱుఁగుట పుణ్యము స
న్మతి దానికి సమముసేఁత మధ్యము మఱి త
త్కృతమున కగ్గలముగ స
త్కృతిసేయుట యుత్తమంబు కృతబుద్ధులకున్.

(ఎదుటివాళ్లు చేసిన ఉపకారాన్ని గుర్తించటం పుణ్యకార్యం. అందుకు సమానమైన ప్రత్యుపకారం చేయటం మధ్యమ మార్గం. చేసిన ఉపకారం కంటే ఎక్కువగా ప్రత్యుపకారం చేయటం ఉత్తమమైన పద్ధతి.)

1_6_243 వచనము శిరీష - వసంత

వచనము

పరమోపకారి యైన యీ బ్రాహ్మణునకు నేమి ప్రియము సేయ సమకూరునో యని చింతించుచున్నచో నిప్పు డెద్ది యేనియు నొక్క దుస్తరం బయిన దుఃఖం బీ గృహస్థున కయ్యెంగావలయు నా మనంబు మలమల మఱిఁగెడుఁ గావున దీనిం దలఁగి వీరికి మనఃప్రియంబు సేయవలయు.

(ఆ కష్టం తీర్చి వీరికి సంతోషం కలిగించాలి.)

1_6_242 తేటగీతి శిరీష - వసంత

తేటగీతి

ఇందు సుఖ ముండితిమి యొరు లెఱుఁగకుండ
నేలొకో యిప్పు డీ విప్రు నింట నార్త
రవము వీతెంచె దీని నారసి యెఱుంగ
వలయుఁ దత్ప్రతీకారంబు వలయుఁ జేయ.

(ఇంతకాలం ఎవరికీ తెలియకుండా ఇక్కడ సుఖంగా ఉన్నాము. ఈ బ్రాహ్మణుడి ఇంట్లో ఇప్పుడు ఏడుపు వినిపిస్తున్నది. దీనిని విచారించి తొలగించాలి.)

1_6_241 వచనము శిరీష - వసంత

వచనము

కుంతియు దాని రెండుభాగంబులు సేసి యం దొక్క భాగంబు భీమునకుం బెట్టి తక్కిన భాగంబు గడమ కొడుకులుం దానును గుడుచుచు నిట్లు ప్రచ్ఛన్ను లై యేకచక్రపురంబున నున్నంత నొక్కనాఁడు ధర్మార్జునయములు భిక్షార్థం బరిగిన నిట కుంతియు భీముండును దమ విడిసిన విప్రగృహంబున నున్నంత నం దొక్కపెట్ట యార్తధ్వని యెగసిన విని కుంతీదేవి యెంతయు సంతాపించి భీమున కిట్లనియె.

(కుంతి ఆ ఆహారాన్ని రెండు భాగాలుగా చేసి ఒక భాగం భీముడికి పెట్టేది. మిగిలినది తాను, తక్కిన పాండవులు తినేవారు. ఇలా వారు మారువేషంలో కాలం గడుపుతూ ఉండగా ఒకరోజు ధర్మార్జుననకులసహదేవులు భిక్షకు వెళ్లారు. కుంతి, భీముడు ఇంట్లో ఉండగా ఒక్కసారిగా పెద్ద ఏడుపు వినిపించింది. కుంతి భీముడితో ఇలా అన్నది.)

1_6_240 కందము శిరీష - వసంత

కందము

పరమాన్నభక్ష్యభిక్షా
పరిపూర్ణతరంబు లయిన పాత్రము లయ్యే
వురు నిత్యంబు నివేదిం
తురు దల్లికిఁ గరముభక్తితో వినయమునన్.

(పాండవులు రోజూ భిక్ష ఉన్న పాత్రలను తెచ్చి తల్లికి ఇచ్చేవారు.)

1_6_239 కందము విజయ్ - విక్రమాదిత్య

కందము

జలజప్రియతేజుల వీ
రల ధీరుల ధరణివలయరాజ్యశ్రీయో
గ్యుల ని ట్లేలొకొ భిక్షా
శులఁ జేసె విధాతృఁ డంచు శోకింప జనుల్.

(వారిని చూసి - వీళ్లను బ్రహ్మదేవుడు భిక్షాన్నం తినేవాళ్లనుగా ఎందుకు చేశాడో కదా - అని అక్కడి ప్రజలు బాధపడ్డారు.)

1_6_238 కందము విజయ్ - విక్రమాదిత్య

కందము

ధృతిఁ జదువుచు భిక్షార్థము
ప్రతిగృహమున కరుగుచున్న భవ్యుల మౌన
వ్రతులం దృప్తులఁ జేసిరి
సతతము నందుల గృహస్థ సద్ద్విజులు దయన్.

(చదువుతూ, భిక్ష కోసం ప్రతి ఇంటికీ వెడుతూ, మౌనవ్రతులుగా ఉన్న పాండవులను ఆ అగ్రహారంలోని గృహస్థులు ఆదరించారు.)

1_6_237 కందము విజయ్ - విక్రమాదిత్య

కందము

లలితజటాజినకుశవ
ల్కలధరు లై వేద మొప్పఁగా జదువుచు ని
మ్ముల బ్రహ్మచారివృత్తిని
వెలయఁగ నం దుండి రొక్కవిప్రగృహమునన్.

(పాండవులు బ్రహ్మచర్యవృత్తిని అవలంబించి ఆ అగ్రహారంలో ఒక బ్రాహ్మణుడి ఇంట్లో ఉన్నారు.)

-:పాండవులేకచక్రపురంబున విప్రగృహంబున నుండుట:-

1_6_236 వచనము విజయ్ - విక్రమాదిత్య

వచనము

ఇట్లు సద్యోగర్భంబునం గామరూపధరుం డై ఘటోత్కచుండు పుట్టి తత్క్షణంబ నవయౌవనుండును ననేకాస్త్రశస్త్ర కుశలుండును నపరిమిత రాక్షస పిశాచ బలపరివృతుండును నై తల్లిదండ్రులకు గుంతీదేవికి మ్రొక్కిన నగ్రనందనుం డగుట నందఱును గరంబు గారవంబునఁ గొనియాడం గొన్నిదినంబు లుండి యొక్కనాఁ డంజలిపుటఘటితమస్తకుం డయి రాక్షసపిశాచబలంబులతోడ నాయిమ్ముల నుండెదం బని గలయప్పుడు నన్నుఁ దలంచునది యాక్షణంబ వత్తునని యందఱిచేత ననుజ్ఞాతుం డై తల్లిం దోడ్కొని యుత్తరాభిముఖుం డయి యరిగె నిట పాండవులును శాలిహోత్రునొద్ద ననేకధర్మశాస్త్రనీతిశాస్త్రంబు లభ్యసించి యమ్మునివరు వీడ్కొని చని విదర్భమత్స్యత్రిగర్తకీచకవిషయంబులు గడచి యేకచక్రం బను నగ్రహారంబు గని.

(నవయౌవనంతో పుట్టిన ఘటోత్కచుడు - నన్ను తలచుకోగానే వస్తాను - అని చెప్పి తల్లితో ఉత్తర దిశగా వెళ్లాడు. పాండవులు తరువాత శాలిహోత్రుడి దగ్గర సెలవు తీసుకొని చాలా దేశాలు దాటి ఏకచక్రమనే అగ్రహారం చేరారు.)

1_6_235 చంపకమాల విజయ్ - విక్రమాదిత్య

చంపకమాల

నరవరుఁ డైన భీమువలనం బ్రభవించె హిడింబకున్ సుతుం
డురుతర భీమ రూపుఁడు ఘటోత్కచ నాముఁడు విస్ఫుర ద్భయం
కర వదనంబు శంకునిభకర్ణములన్ వికృతాక్షులుం బయో
ధరవరవర్ణమున్ వికటదారుణదంష్ట్రలు నొప్పుచుండఁగన్.

(వారికి ఘటోత్కచుడు జన్మించాడు.)

-:హిడింబయందు ఘటోత్కచుండు పుట్టుట:-

1_6_234 చంపకమాల విజయ్ - విక్రమాదిత్య

చంపకమాల

పవనతనూజుఁ డక్కమలపాలికచేత వినీతుఁ డై మహా
ర్ణవవృతభూమిలోఁ గల వనంబుల హంసబలాకసారసా
రవరుచిరాపగావరసరఃపులినంబులఁ బర్వతంబులన్
వివిధవిహారుఁ డై యనుభవించె నభీష్టమనోజభోగముల్.

(భీముడు హిడింబతో చాలా ప్రదేశాలలో విహరించాడు.)

1_6_233 వచనము విజయ్ - విక్రమాదిత్య

వచనము

అంత.

(అప్పుడు.)

1_6_232 కందము విజయ్ - విక్రమాదిత్య

కందము

అమ్మునివరు కఱపిన మా
ర్గమ్మునఁ బాండవులు విగతకల్మషు లవిషా
దమ్మునఁ సుఖముండిరి విన
యమ్మొప్పఁగ శాలిహోత్రునాశ్రమభూమిన్.

(అలా పాండవులు ఆ ఆశ్రమంలో కొంతకాలం ఉన్నారు.)

1_6_231 వచనము విజయ్ - విక్రమాదిత్య

వచనము

దీని నెఱింగి మీకు హితోపదేశంబు సేయ వచ్చితి నిఖిల ధర్మవిదుల రయిన వినీతుల రయిన మీకు బాంధవవియోజనం బయిన యీ కర్మంబు పురాకృతంబు దీనికి శోకింపవలవదు కొండొకకాలంబునకు మీరును బాంధవులం గలసి యెప్పటియట్ల రాజ్యంబు సేయుదు రిది శాలిహోత్రుతపఃప్రభావంబున నైన కొలను దీని జలంబు లుపయోగించినవారికి బుభుక్షాపిపాసలు లే వివ్వనస్పతియును శీతవాతాతపవర్షంబులవలన రక్షించు నిం దొరు లెఱుంగకుండఁ గార్యార్థుల రై కతిపయదినంబు లుండి యేకచక్రపురంబున కేఁగి యందు బ్రాహ్మణభావంబున బ్రాహ్మణగోష్ఠి నుండి నారాక ప్రతీక్షించియుండు నది యని కఱపి తనకు వినయావనతులయి కృతాంజలు లయిన మనుమల దీవించి కౌఁగిలించుకొని బాష్పపూరితనయన యయి మ్రొక్కియున్న కోడలి నూరార్చి నీకొడుకు ధర్మనిత్యుం డీ యుధిష్ఠిరుండు నారాయణభుజంబులంబోని తననలువురుదమ్ములబలంబున సర్వపార్థివుల శాసించి సార్వభౌముం డై రాజసూయాశ్వమేధాదిక్రతువులు సేసి పితృపైతామహం బైన రాజ్యలక్ష్మి ననుభవించుచుం గురుకులంబునెల్లఁ బవిత్రంబు సేయు నని శోకోపశమనంబుఁ జేసి హిడింబం జూచి దీనిపేరు కమలపాలిక యిది భీమునకు వశవర్తిని యయి పరిచరించి మహాసత్త్వుం డయిన కొడుకుం గాంచు నాతండు మిమ్మందఱ నాపద్విషయంబున నుద్ధరించు నని చెప్పి మునివరుండు తిరోహితుం డైన.

(కొంతకాలానికి మీరు కూడా బంధువులతో కలిసి రాజ్యం చేస్తారు. మీరు ఇక్కడ కొంతకాలం ఉండి తరువాత ఏకచక్రపురంలో బ్రాహ్మణరూపంలో ఉంటూ నా రాక కోసం ఎదురుచూడండి - అని చెప్పాడు. హిడింబను చూసి - ఈమె మహాబలవంతుడైన కొడుకును కంటుంది. అతడు ఆపత్సమయంలో మిమ్మల్నందరినీ రక్షిస్తాడు - అని చెప్పి వెళ్లాడు.)

1_6_230 పద్మకము విజయ్ - విక్రమాదిత్య

పద్మకము

కొడుకు పల్కువిని కూడదు నాక దురాత్ముఁడై
కడఁగి మీకు నపకారము సేసి ధరిత్రి వె
ల్వడఁగఁబంచెఁ గడుఁబాపమతిన్ ధృతరాష్ట్రుఁ డె
య్యెడల దుర్జనుల నేమఱి నమ్మగఁ బోలునే.

(ధృతరాష్ట్రుడు కొడుకుమాట విని మిమల్ని రాజ్యంనుండి వెళ్లగొట్టాడు. దుర్మార్గులను ఎక్కడైనా ఎప్పుడైనా నమ్మకూడదు.)

1_6_229 వచనము విజయ్ - విక్రమాదిత్య

వచనము

ఇట్లు వచ్చిన వేదవ్యాస మునీంద్రునకు నందఱు నతిభక్తి నమస్కరించి యాస నార్ఘ్యాది విధులం బూజించి యున్నవారలం గరుణార్ద్రదృష్టిం జూచి కృష్ణద్వైపాయనుం డి ట్లనియె.

(వారితో వ్యాసుడు ఇలా అన్నాడు.)

1_6_228 ఉత్పలమాల విజయ్ - విక్రమాదిత్య

ఉత్పలమాల

పుణ్యతపోమయుండు మునిపూజ్యుఁడు బ్రహ్మసమప్రభుండు బ్ర
హ్మణ్యుఁడు ప్రావృషేణ్యుజలదాసితవర్ణుఁ డశేషకిల్బిషా
రణ్యదవానలుం డగు పరాశరనందనుఁ డేగుదెంచెఁ ద
త్పుణ్యచయస్వరూపమును బోలెఁ గరంబు మనోముదంబుగన్.

(వారు ఆ ఆశ్రమంలో ఉండగా వ్యాసుడు అక్కడికి వచ్చాడు.)

-:పాండవులకు వ్యాసుఁడు హితోపదేశము సేయుట:-

1_6_227 వచనము విజయ్ - విక్రమాదిత్య

వచనము

అని భీమసేను నొడంబఱచి హిడింబ కనురాగంబుగాఁ జెప్పి నీవు శుచి వయి యుత్తమ స్త్రీ గుణంబులు దాల్చి భీమునకు మనఃప్రియంబు సేయుము పగళ్లెల్లను మీ యిష్టంబున విహరించి రాత్రులు మాయొద్దన యుండు నది యని నియమించిన భీముండును బుత్త్రజన్మం బగునంతకు దీని మీవచనంబునఁ బరిగ్రహించెద నని వారల సమక్షంబున సమయంబు సేసె నంతఁ బాండవులు జననీసహితంబు శాలిహోత్రునాశ్రమంబునకుం జని ప్రభాతసమయంబున నక్కొలనఁ గృతస్నాను లయి సంధ్యావందనంబులు దీర్చి శాలిహోత్రుచేతం బూజితు లయి తద్వనస్పతి చ్ఛాయా శీతల తలంబున విశ్రమించి విగత క్షుత్పిపాసు లై సుఖం బున్నంత.

(భీముడు అందుకు అంగీకరించాడు. తరువాత పాండవులు తల్లితో శాలిహోత్రుడి ఆశ్రమానికి వెళ్లారు.)

1_6_226 కందము విజయ్ - విక్రమాదిత్య

226 కందము

ఇది పరమ సాధ్వి దీనిని
మది నొండుగఁ దలఁప వలదు మానుఁగఁ బుత్త్రా
భ్యుదయ మగుఁ బాండు హితముగ
నిది కార్యం బని పరిగ్రహింపుము నెమ్మిన్.

(ఈమెను వివాహమాడు.)

1_6_225 కందము విజయ్ - విక్రమాదిత్య

కందము

అన్న యిది ధర్ము వని మీ
యన్నను నన్నును నతిప్రియంబున నెదలో
మన్నించి యేమి వనిచినఁ
గ్రన్నన మా పనుపు సేయఁ గడఁగుము బుద్ధిన్.

(నాయనా! మేము ఏమి ఆజ్ఞాపించినా అది ధర్మమని భావించి చెయ్యి.)

-:భీముఁడు తల్లియనుమతంబున హిడింబను బరిగ్రహించుట:-

1_6_224 వచనము విజయ్ - విక్రమాదిత్య

వచనము

అంత దాని వినయంబునకు ననాగతం బెఱుంగుటకు సంతసిల్లి కుంతి భీమున కి ట్లనియె.

(తరువాత హిడింబ వినయానికి కుంతి మెచ్చి భీముడితో ఇలా అన్నది.)

1_6_223 కందము విజయ్ - విక్రమాదిత్య

కందము

విని కుంతియుఁ బాండవులను
మనమున విస్మయముపడి సమంజసభావం
బున దాని దివ్యవనితయ
యని తద్దయు నాదరించి రప్పుడు కరుణన్.

(హిడింబ మాటలు విని కుంతి, పాండవులు ఆశ్చర్యపడి ఆమెను ఆదరించారు.)

1_6_222 వచనము విజయ్ - విక్రమాదిత్య

వచనము

దీనియందు రాక్షసభావం బుపలక్షింపవలవదు మాకు నాత్మీయబుద్ధియ యుండు ననిన హిడింబ ధర్మరాజునకుం గుంతీదేవికి మ్రొక్కి యేకాంతంబునఁ గుంతి కి ట్లనియె నవ్వా సర్వప్రాణులకు సామాన్యంబయ్యును మనోజరాగంబు వనితల కసహ్యం బయి విశేషంబయి యుండు నేను వృకోదరునిమిత్తంబు మదనబాణబాధిత నయి నాచుట్టంబులను జెలులను విడిచితి నాయిష్టంబు మీరు గావింపనినాఁ డిప్పుడ ప్రాణంబులు విడితు నన్ను రక్షించిన మీకు నిష్టంబులయినవాని నెల్లం దలంచి చేయుదు నిమ్ముగానియెడ మిమ్మందఱ నెత్తికొని మీమెచ్చినచోటికిఁ బోవనేర్తు నాపలుకులు నమ్ము నది యేనతీతానాగతవర్తమానంబు లెల్లను దెల్లంబుగా నెఱుంగదు వలయునేని యనాగతంబు సెప్పెద వినుండు ముందట నొక్క సరోవరంబును నొక్కవనస్పతియునుం గల వవి రెండును శాలిహోత్రుం డనుమహామునిచేతం దపఃప్రభావంబునం బడయంబడినయవి యక్కొలనినీళ్లు ద్రావినవారికి నెన్నండును నాకలియును నీరువట్టును లే వవ్వనస్పతియు శీతవాతాతపవర్షంబులవలన రక్షించు మీర లందున్న మీకడకుఁ గృష్ణద్వైపాయనుండు వచ్చి మీకు హితోపదేశంబు సేయు నని చెప్పిన.

(హిడింబను రాక్షసిగా చూడవద్దు. ఈమె పట్ల మాకు బంధుభావమే ఉన్నది - అని ధర్మరాజు అనగా హిడింబ ధర్మరాజుకూ, కుంతికీ మొక్కి ఏకాంతంలో కుంతితో - నేను భీముడిమీద మనసుపడి బంధువులను, స్నేహితులను వదులుకున్నాను. నా కోరిక మీరు తీర్చకుంటే ప్రాణాలు విడుస్తాను. నన్ను రక్షిస్తే మీకు ఇష్టమైనవాటిని చేస్తాను. భూతభవిష్యద్వర్తమానాలను చెప్పగలను. భవిష్యత్తు చెప్తాను వినండి. కొంతదూరంలో ఒక సరోవరం, వృక్షం ఉన్నాయి. మీరు అక్కడ ఉండగా కృష్ణద్వైపాయనుడు వచ్చి మీకు మేలుకలిగే మాటలు చెప్తాడు - అని చెప్పగా.)

1_6_221 కందము విజయ్ - విక్రమాదిత్య

కందము

ఆపద యైనను ధర్మువ
ప్రాపుగ రక్షింపవలయుఁ బరమార్థము ధ
ర్మాపాయమ ధార్మికులకు
నాపద జన్మాంతరమున ననుగత మగుటన్.

(తమకు ఆపద కలిగినా ధర్మాత్ములు ధర్మాన్నే రక్షించాలి. ధర్మం చెడిపోవటమే ధర్మాత్ములకు నిజమైన ఆపద.)

1_6_220 తేటగీతి విజయ్ - విక్రమాదిత్య

తేటగీతి

వధకు నర్హుఁ డై వచ్చినవానిఁ జంపి
తదియు ధర్మువ యిది చాల నబల దీని
కలుగఁజన దాత్మరక్షకు నగ్గలంబు
ధర్మ రక్షయ యుత్తమ ధార్మికులకు.

(వధకు అర్హుడైన వాడిని చంపావు. ఈ హిడింబ మీద కోపపడటం తగదు. ఉత్తములకు ఆత్మరక్షణకంటే ధర్మరక్షణ ముఖ్యం.)

1_6_219 వచనము విజయ్ - విక్రమాదిత్య

వచనము

అట్టి చిత్ర వధం జూచి చిత్రీయమాణచిత్తు లై భీమసేను పరాక్రమంబు వొగడుచు నందఱు హిడింబానుగమ్యమాను లై చని ర ట్లరుగునెడ భీముండు హిడింబ రాక కొడంబడక రాక్షసులు వైరంబుఁ దలంచి మాయలు సేయుదురు కావున నీవు మాతోడ రావలవదు నిన్ను విశ్వసింపము నీవును మీయన్నవోయిన తెరువున పొ మ్మనిన నది భయంపడి వడవడ వడంకుచున్న దానిం జూచి కరుణారసార్ద్రచిత్తుండయి ధర్మరాజు భీమున కి ట్లనియె.

(అందరూ భీముడి దగ్గరకు వెళ్లారు. భీముడు హిడింబతో - రాక్షసులు మాయలు చేస్తారు. నువ్వు మాతో రావద్దు. మీ అన్న చచ్చినట్లే చావు - అనగా ఆమె భయపడటం చూసి ధర్మరాజు దయతో ఇలా అన్నాడు.)

1_6_218 ఆటవెలది విజయ్ - విక్రమాదిత్య

ఆటవెలది

లావు సెడఁగ నిట్లు వీవంగఁ బడి గత
చేష్టుఁ డయిన యసురఁ జిక్కఁ బట్టి
నేలఁ బెట్టి వాని కోలెమ్ము బ్రల్లన
విఱిచి నడుము ద్రుంచి వీచి వైచె.

(హిడింబుడి వెన్నెముక విరిచి, నడుము త్రుంచి విసిరివేశాడు.)

1_6_217 కందము విజయ్ - విక్రమాదిత్య

కందము

వడి నసురవాత ముక్కున
నుడుగక రక్తప్రవాహ మొలుకుచు నుండన్
గడకాలు వట్టి వానిని
మడవక పవనజుఁడు నూఱు మాఱులు వీచెన్.

(హిడింబాసురుడి నోట, ముక్కున రక్తధారలు కారుతూ ఉండగా భీముడు అతడి కాలుపట్టి గాలిలోకి ఎత్తి గిరగిరా తిప్పాడు.)

1_6_216 ఉత్పలమాల విజయ్ - విక్రమాదిత్య

ఉత్పలమాల

తూర్పరుణంబుగాఁ దొడఁగె దుష్టనిశాచరవేళ యయ్యెడున్
మార్పుము కాలయాపన మమర్పక యప్పిశితాశిఁ బట్టి పా
లార్పఁగ నేల నావుడు బలాఢ్యుఁడు భీముఁడు మల్లవిద్యనే
ర్పేర్పడఁగా హిడింబు బలహీనపరాక్రముఁ జేసెఁ జెచ్చెరన్.

(తూర్పుదిక్కు ఎర్రపడటం మొదలైంది. ఆలస్యం చేయకుండా అతడిని సంహరించు - అనగా భీముడు హిడింబుడిని బలహీనుడిని చేశాడు.)

1_6_215 వచనము విజయ్ - విక్రమాదిత్య

వచనము

నన్నును మిమ్మును రక్షించి యా రక్కసు నుక్కడంగ నశ్రమంబున నిప్పుడు చంపుం జూడుం డనిన నందఱు లేచి యుద్ధతులై మల్లయుద్ధంబు సేయుచున్న భీమహిడింబులంజూచి రంత నచ్చోటికిం జని యర్జునుండు భీమసేనున కి ట్లనియె.

(ఆ రాక్షసుడిని చంపి నన్నూ మిమ్మల్నీ రక్షించగలడు - అనగా అందరూ లేచి అక్కడికి వెళ్లారు. అప్పుడు అర్జునుడు వాళ్లు యుద్ధం చేసే చోటికి వెళ్లి భీముడితో ఇలా అన్నాడు.)

1_6_214 సీసము + తేటగీతి విజయ్ - విక్రమాదిత్య

సీసము

నీలజీమూతంబులీల నాక్షేపించి
        నల్ల నై తోతెంచు నల్లగృహము
గల హిడింబుం డను బలితంపురక్కసు
        చెలియల నాతండు వెలయ మీకు
రోయక యహితంబు సేయ నన్ బంచినఁ
        జనుదెంచి యేను మీ తనయునందుఁ
బతిబుద్ధిఁ దాల్చి యుద్ధతమన్మథార్త నై
        మసలితి మసలిన నసుర వచ్చి

తేటగీతి

యలిగి మీతోడ నన్నును గలయఁ బట్టి
మ్రింగ నున్న నయ్యసురతోడం గడంగి
మల్లయుద్ధంబు సేయుచు నల్లచోట
నున్నవాఁడు మీసుతుఁడు దర్పోన్నతుండు.

(నేను హిడింబుడనే రాక్షసుడి చెల్లెలిని. మీకు కీడు చేయమని అతడు నన్ను పంపిస్తే, నేను మీ కుమారుడిని భర్తగా భావించి ఆలస్యం చేయటం చేత, అతడు కోపించాడు. మీ కుమారుడు అతడితో యుద్ధం చేస్తూ అదిగో అక్కడ ఉన్నాడు.)

1_6_213 వచనము విజయ్ - విక్రమాదిత్య

వచనము

అమ్మహాధ్వని విని కుంతియుఁ గొడుకులను మేల్కని తమసమీపంబున నతిమానుషం బయిన రూపసౌందర్యములతో నున్న హిడింబం జూచి యిది వనదేవతయో సురకన్యయో యనుచు విస్మయంబంది రంతం గుంతి శాంతవచనంబుల నీ వెందులదాన విట కేల వచ్చి తని యడిగిన నది యి ట్లనియె.

(ఆ శబ్దానికి కుంతీదేవి, పాండవులు మేలుకొని దగ్గరలో ఉన్న హిడింబను చూసి ఆశ్చర్యపడ్డారు. తరువాత కుంతి మెల్లని మాటలతో - నువ్వు ఎక్కడి దానివి? ఇక్కడికెందుకు వచ్చావు? - అనగా హిడింబ ఇలా చెప్పింది.)

1_6_212 కందము విజయ్ - విక్రమాదిత్య

కందము

ఆరాక్షసుండు భీము న
పారభుజాబంధనమున బంధించి మహా
ధీరధ్వని రోదోంతర
పూరిత మగునట్లు గాఁగ బొబ్బిడి యార్చెన్.

(హిడింబుడు భీముడిని బంధించి సింహనాదం చేశాడు.)

1_6_211 కందము విజయ్ - విక్రమాదిత్య

కందము

భూరిపదఘాతజాత ధ
రారేణుప్రకరధూసరశరీరకు లై
వారిద్దఱు నొప్పిరి నీ
హారచ్ఛన్నంబు లయిన యద్రులపోలెన్.

(దుమ్ము వల్ల బూడిదరంగు శరీరాలు కలిగి వారిద్దరూ మంచు కప్పిన కొండల లాగా ఉన్నారు.)

1_6_210 చంపకమాల విజయ్ - విక్రమాదిత్య

చంపకమాల

చరణహతిన్ మహాతరులు సాల్వడి జర్జరితంబు లై మహిం
దొరఁగఁగ నిట్టు లొండొరులతోడ మదోద్ధతషష్టిహాయన
ద్విరదములట్లు ఘోరరణవీరులు సేసిరి మల్లయుద్ధ ము
ద్ధురబలు లై సమీరణసుతుండు హిడింబుఁడు తద్వనంబునన్.

(వారిద్దరూ మల్లయుద్ధం చేశారు.)

1_6_209 వచనము విజయ్ - విక్రమాదిత్య

వచనము

అట్టియెడ.

(అటువంటి సమయంలో.)

1_6_208 కందము విజయ్ - విక్రమాదిత్య

కందము

వడముడి యారక్కసు న
య్యెడ కష్టధనుఃప్రమాణ మెడ గలుగఁగ నె
వ్వడి నీడ్చె నల్పమృగమును
విడువక గజవైరి యీడ్చువిధమునఁ బెలుచన్.

(వడముడి (భీముడు) హిడింబుడిని దూరంగా ఈడ్చుకు వెళ్లాడు.)

1_6_207 కందము విజయ్ - విక్రమాదిత్య

కందము

నిరుపద్రవసుఖనిద్రా
నిరతాత్మకు లయిన వీరినిద్రకు నస్మ
చ్చరణభుజఘాతశబ్దం
బరుదుగ విఘ్నంబు సేయునని వగచి మదిన్.

(తమ యుద్ధం వల్ల నిద్రలో ఉన్న వీరికి భంగం కలుగుతుందని బాధపడి.)

1_6_206 కందము విజయ్ - విక్రమాదిత్య

కందము

చేసమరికొంచుఁ బొడువఁ గ
డాసినఁ దద్భుజముతోన డగ్గఱఁగ జయో
ద్భాసి యయి పట్టికొనియె మ
హాసత్త్వుఁడు భీమసేనుఁ డమ్మనుజాదున్.

(మీదికి రాగా భీముడు హిడింబుడితో తలపడ్డాడు.)

1_6_205 కందము విజయ్ - విక్రమాదిత్య

కందము

చక్కనగు మనిన రక్కసుఁ
డక్కజముగఁ బెరిఁగి యియ్యయగు నిప్పుడు నీ
యుక్కును బీరముఁ జూచెదఁ
జిక్కక నిలు మనుచుఁ గడు విజృంభించి వడిన్.

(హిడింబుడు - సరే, నీ బల పరాక్రమాలు చూస్తాను - అని.)

1_6_204 ఉత్పలమాల విజయ్ - విక్రమాదిత్య

ఉత్పలమాల

పన్నగవైరి విక్రముఁడు పాండవ సింహము దానిఁ జూచి మీ
యన్నను నన్నుఁ జూడుము భయంపడకుండుము యంచు వానిన
త్యున్నతిఁ దాఁకి రాక్షస వధోచిత నీ బల గర్వ మేదఁగా
నిన్ను వధించి యివ్వనము నెట్టన చేసెద నిర్భయంబుగన్.

(భీముడు హిడింబతో - మీ అన్నను, నన్ను చూడు. భయపడకు - అని చెప్పి హిడింబుడిని ఎదుర్కొని - నీ గర్వం నశించేలా నిన్ను చంపుతాను - అన్నాడు.)

1_6_203 వచనము విజయ్ - విక్రమాదిత్య

వచనము

అంత.

(అప్పుడు.)

-:భీమసేనహిడింబాసురుల యుద్ధము:-

1_6_202 సీసము + ఆటవెలది విజయ్ - విక్రమాదిత్య

సీసము

కాలమేఘంబునుబోలె విశాల మై
        నీల మై దేహంబు గ్రాలుచుండ
ఘనతటిల్లతలయ ట్లెనిమిది దంష్ట్రలు
        మెఱవంగఁ బండులుఁ గొఱికి పెలుచ
నతిరోషలోహితాయతవృత్తనేత్రముల్
        దిరుగంగఁ బెట్టుచుఁ బరుషకేశ
జాలంబు గాడ్పునఁ దూలంగఁ గాలోప
        మానుఁ డై చనుదెంచి మానుషాదుఁ

ఆటవెలది

డనుజఁ జూచి కష్టమనుజులఁ గూడి నా
పనుపు సేయకుండఁ జనునె నీకు
ననుచు నుదరిపలుక విని హిడింబయుఁ గడు
వెఱచి భీమసేను మఱువు సొచ్చె.

(హిడింబుడు అక్కడికి వచ్చి - నీచులైన మానవులతో కలిసి నా ఆజ్ఞ తోసిపుచ్చటం తగిన పనేనా? - అని గద్దించి పలుకగా హిడింబ భయపడి భీముడి చాటుకు వెళ్లింది.)

1_6_201 వచనము విజయ్ - విక్రమాదిత్య

వచనము

పెక్కులు వలుకక యారక్కసురాఁ బనుపు మని భీమసేనుండు విజృంభించి పలుకుచున్నంత నట హిడింబుండు హిడింబ మసలుటకు మహాక్రోధానలజ్వలితచిత్తుం డయి.

(ఎక్కువగా మాట్లాడక అతడిని ఇక్కడికి పంపు - అని భీముడు అంటూ ఉండగా - అక్కడ హిడింబుడు హిడింబ ఆలస్యం చేసినందుకు కోపించి.)

1_6_200 ఉత్పలమాల విజయ్ - విక్రమాదిత్య

ఉత్పలమాల

క్రచ్చఱ నొక్కరక్కసుఁడ కాఁడు సురాసురులెల్ల నొక్కటై
వచ్చిన నీవ చూడఁగ నవార్యబలోన్నతిఁజేసి వారలన్
వ్రచ్చి వధింతుఁగాక యిటు వచ్చి శ్రమంపడియున్న నిచ్చట
న్మెచ్చగువీరి దైన సుఖనిద్రకు భంగము సేయనేర్తునే.

(ఒక్క రాక్షసుడే కాదు, దేవదానవులంతా ఒక్కటై వచ్చినా, నువ్వు చూస్తుండగా వారిని చీల్చి చంపుతాను కానీ, అలసిపోయి నిద్రపోతున్న వీరి నిద్రకు భంగం కలిగించగలనా?)

1_6_199 తేటగీతి విజయ్ - విక్రమాదిత్య

తేటగీతి

అధికవీరుండు రక్కసుఁ డరుగుదెంచు
నని మనంబున భయమంది వనజనేత్ర
వీరిసుఖసుప్తు లై యున్నవారి నిద్ర
సెడఁగ బోధింప నోప నాకడిమి వినుము.

(వీరుడైన హిడింబుడు వస్తున్నాడని వీరి నిద్ర చెడిపోయేలా మేలుకొలుపలేను. నా బలం గురించి విను.)

1_6_198 వచనము విజయ్ - విక్రమాదిత్య

వచనము

అనిన విని హిడింబ వీరినందఱ రక్షించుట నీకుఁ బ్రియం బేని య ప్పురుషాదుండు రాకుండ ముంద వీరి నెత్తుకొని పోయెద వీరలఁ బ్రబోధింపు మనిన భీముం డి ట్లనియె.

(వీరిని రక్షించటం నీకు ఇష్టమైతే హిడింబుడు రాకముందే వీరిని ఎత్తుకొని వెడతాను. వీరిని మేలుకొలుపు - అనగా భీముడు ఇలా అన్నాడు.)

1_6_197 కందము విజయ్ - విక్రమాదిత్య

కందము

విను బేల యెట్టికష్టుఁడుఁ
దన పురుష గుణంబు సెడఁగఁ దల్లినిఁ దోఁబు
ట్టినవారి విడిచి రాగం
బునఁ జపల స్త్రీ సుఖంబుఁ బొందునె చెపుమా.

(ఎంతటి నీచుడైనా మోహంలో పడి తల్లిని, తోడబుట్టినవారిని విడిచిపెడతాడా?)

1_6_196 వచనము విజయ్ - విక్రమాదిత్య

వచనము

ఇది హిడింబువనం దీని జొచ్చి వెలువడుట జముకుత్తుకఁ జొచ్చి వెలువడునట్ల యాతం డింతకు వచ్చు వీరితోడి దేమి నీవు నాకుఁ బతి వై ప్రాణంబు రక్షించుకొని నావలన నిష్టోపభోగంబు లందు మేనును గామచారిణిని నీకిష్టం బైన చోటికి నిన్నుఁ దోడ్కొనిపోవనేర్తు ననిన దానికి భీముం డి ట్లనియె.

(ఇది హిడింబుడి అడవి. దీంట్లో ప్రవేశించి బయటపడటం యముడి కుత్తుకలో ప్రవేశించి బయటపడటమే. హిడింబుడు రాబోతున్నాడు. వీరి సంగతి మనకెందుకు? నువ్వు నాకు భర్తవై ప్రాణాలు రక్షించుకో - అని అనగా హిడింబతో భీముడు ఇలా అన్నాడు.)

1_6_195 చంపకమాల విజయ్ - విక్రమాదిత్య

చంపకమాల

ఉఱఁడు సురేంద్రు నైన బలియుండు హిడింబుఁడు వానిబారికిన్
వెఱవనివారలుం గలరె వీరలు ముంద రెఱుంగ రక్కటా
యెఱిఁ గిరయేని యిట్లు దమయిండులనుండిన యట్లు మెచ్చకే
మఱి శయనింతురే కడుఁ బ్రమాదము సేసిరి బుద్ధిహీను లై.

(హిడింబుడు దేవేంద్రుడిని కూడా లెక్కచేయడు. అతడికి భయపడనివాళ్లు లేరు. వీళ్లకు ముందుగా తెలియదు. తెలిసి ఉంటే ఇలా పడుకొంటారా! బుద్ధిహీనులై పెద్ద పొరపాటు చేశారు.)

1_6_194 కందము విజయ్ - విక్రమాదిత్య

కందము

నాకుఁ బతి వయిన నిన్నుం
జేకొని మాయన్న యెగ్గుసేయక కాచున్
నాకు మఱి నీవ పతివి గు
ణాకర యి జ్జన్మమున మహాస్నేహమునన్.

(నువ్వు నాకు భర్తవైతే మా అన్న నీకు కీడు చేయకుండా కాపాడుతాడు. ఈ జన్మలో నువ్వే నాకు భర్తవు.)