Wednesday, September 13, 2006

1_7_175 వచనము నచకి - వసంత

వచనము

అంత నా రాజనందనులు ద్రుపదరాజనందనం జూచి కందర్పబాణబాధితు లయి తమ్మును దమసామర్థ్యమ్ము నెఱుంగక యర్థిత్వంబున నవ్విల్లు మోపెట్టఁ బోయి.

(ఆ రాజకుమారులు ద్రౌపదిని చూసి, తమ సామర్థ్యం తెలుసుకోలేక, ఆశతో ఆ విల్లు ఎక్కుపెట్టటానికి పోయి.)

1_7_174 చంపకమాల నచకి - వసంత

చంపకమాల

అవిరళ భస్మ మధ్యమున నగ్నికణంబుల పోలె బ్రాహ్మణ
ప్రవరులలోన నేర్పడక పాండవు లేవురు నున్నఁ జూచి యా
దవ వృషభుండు కృష్ణుఁడు ముదంబున వారి నెఱింగి పార్థుఁ డీ
యువతిఁ బరిగ్రహించు ననియుం దలఁచెన్ హృదయంబులోపలన్.

(బ్రాహ్మణరూపంలో ఉన్న పాండవులను కృష్ణుడు గుర్తించి - అర్జునుడు ద్రౌపదిని చేపడతాడు - అని అనుకొన్నాడు.)

1_7_173 సీసము + ఆటవెలది నచకి - వసంత

సీసము

అమ్మహోత్సవము నెయ్యమ్మునఁ జూడంగఁ
        దివిరి యేతెంచిన దివిజ ఖచర
గరుడ గంధర్వ కిన్నరుల విమానముల్
        విలసిల్లె నంబర తలమునందుఁ
బణవవీణావేణురణితానుసార మై
        రసగీతరవ మెల్ల దెసల నెసఁగె
బోరన వివిధ తూర్యారవంబులు మహా
        వననిధి ధ్వానంబు ననుకరించె

ఆటవెలది

దివ్యమాల్యములయు దివ్యానులేపన
ములయి సౌరభంబు వెలయఁ దాల్చి
రంగమధ్యజనులకుం గడు తనుపుగాఁ
జేరి వీచె దివ్యమారుతంబు.

(సంగీతవాద్యాల హోరు వ్యాపించింది. సువాసన గల గాలి వీచింది.)

1_7_172 ఆటవెలది నచకి - వసంత

ఆటవెలది

ఇందు లక్ష్య మెవ్వఁ డేసె నాతని వరి
యింపు నెమ్మితోడ నిందువదన
యనిన రాజపుత్త్రు లవ్విల్లు మోపెట్టి
యేయఁ గడఁగి కదలి రెల్లవారు.

(వీరిలో మత్స్యయంత్రం కొట్టినవాడిని వరించు - అనగా ఆ రాజకుమారులు విల్లు ఎక్కుపెట్టటానికి పూనుకొన్నారు.)

-:రాజపుత్త్రులు మత్స్యయంత్రమును భేదింపఁబోయి భంగపడుట:-

1_7_171 వచనము నచకి - వసంత

వచనము

అని ధృష్టద్యుమ్నుండు మూఁగిన రాజపుత్త్రులకు నెల్ల నెఱుంగం జెప్పి ద్రుపదరాజపుత్త్రిఁ జూచి యఖిలజలధివేలావలయవలయితమహీతలంబునం గల రాజనందను లెల్ల నీస్వయంవరంబునకు వచ్చినవారు వీరలం జూడు మని
దుర్యోధన దుశ్శాసన దుర్ముఖ ప్రముఖు లయిన ధృతరాష్ట్రనందనుల నూర్వురం దత్సమీపంబున నున్న కర్ణాశ్వత్థామ సోమదత్త భూరిశ్రవశ్శ్రుతసేనాదులను బుత్త్రభ్రాతృసమేతు లయి యున్న శల్య విరాట జరాసంధ గాంధారపతులను నక్రూర సారణ సాత్యకి సాంబ సంకర్షణ ప్రద్యుమ్న కృష్ణ కృతవ ర్మానిరుద్ధ యుయుధాన ప్రముఖు లైన యదువృష్ణి భోజాంధకవరులను సుమిత్ర సుకుమార సుశర్మ సుదక్షిణ సుషేణ సేనాబిందు చంద్రసేన సముద్రసే నౌశీనర చేకితాన శిశుపాల శ్రేణీమ జ్జనమేజయ జయద్రథ బృహద్రథ సత్యవ్రత చిత్రాంగద శుభాంగద భగీరథ భగదత్త పౌండ్రకవాసుదేవ వత్సరాజ ప్రభృతు లయిన నానాదేశాధీశులను వేదధ్వని సనాథం బై యొప్పుచున్న బ్రాహ్మణసమూహంబునుం జూపి.

(అని ఆ రాజులకు చెప్పి, ద్రౌపదితో - నీ స్వయంవరానికి వీరంతా వచ్చారు - అని వారిని చూపి.)

1_7_170 తరువోజ నచకి - వసంత

తరువోజ

ఈ విల్లు మోపెట్టి యేను బాణముల నీ యంత్రమత్స్యంబు నేసిన వాఁడ
భావజప్రతిముఁ డిబ్బాలకుఁ దగిన పతి యిది మునిశక్తిఁ బడసిన విద్య
గావున మీ రిప్డుగావింపుఁ డిదియ ఘనతర కార్ముక కౌశలోన్నతియు
లావును గలవారలకు నవసరము లలితయశంబుఁ గల్యాణంబుఁ బడయ.

(ఈ విల్లును ఎక్కుపెట్టి ఐదు బాణాలతో ఈ యంత్రంలోని చేపను కొట్టినవాడే ఈ కన్యకు భర్త. ప్రయత్నించండి.)

1_7_169 వచనము నచకి - వసంత

వచనము

అట్టి యవసరంబున బోరన మ్రోయు జనులయులివును వాదిత్రనాదంబును వారించి ధృష్టద్యుమ్నుండు మూఁగినరాజలోకంబు నెల్లం జూచి యగ్నిసమీపంబున గంధపుష్పధూపదీపార్చితం బైన విల్లును నమ్ములను వైహాయసం బైన లక్ష్యంబును వారలకుం జూపి యి ట్లనియె.

(అప్పుడు ధృష్టద్యుమ్నుడు మత్స్యయంత్రాన్ని రాజులకు చూపి ఇలా అన్నాడు.)

1_7_168 సీసము + ఆటవెలది నచకి - వసంత

సీసము

ధవళవిభూషణ దామానులేపనా
        మలినాంగి సితపుష్పమాల చేతఁ
గొని పుష్పసాయకు కుసుమేతరం బైన
        యాఱగు సాయకం బనఁగ జనులు
ధవళాక్షి రంగమధ్యంబునఁ దనుమధ్య
        దా నొప్పి పాంచాలతనయ యున్న
భూసురప్రవరుల పుణ్యాహఘోషంబు
        విలసిల్లె నాశీర్వివృద్ధితోడ

ఆటవెలది

ద్రుపదపతి పురోహితుండును గృతపరి
స్తరణుఁ డై ప్రయోగదక్షుఁ డగ్ని
ముఖము సేసి వేల్వ మొనసి వివాహోప
కరణ వస్తుచయము గాచియుండె.

(ద్రౌపది వచ్చి స్వయంవర రంగం మధ్యలో నిలిచింది. ద్రుపదపురోహితుడు హోమారంభం చేసి హోమం చేయటానికి సిద్ధమయ్యాడు.)

1_7_167 వచనము నచకి - వసంత

వచనము

అదియును బురంబు పూర్వోత్తరదిగ్భాగంబునం జందనోదకసంసిక్త సమీకృతస్థలం బయి యగాధోన్నతపరిఖాప్రాకారంబులను విశాల ద్వార తోరణంబులను గైలాస శైల విలాసాపహాసి భాసుర గగనతలోల్లేఖిశిఖర రమ్యహర్మ్యతలంబులను బహుప్రకారంబు లైన సారువులనుం జేసి యొప్పుచున్న నందు యథాస్థానంబుల నానాదేశాధిపతుల నుండంబంచి ద్రుపదుండు వారల నెల్లం బూజించెఁ బరమబ్రహ్మణ్యు లగు బ్రాహ్మణులతోడం గలసియున్న పాండవులును బ్రాహ్మణసమూహంబులో నుండి పాంచాలరాజు సమృద్ధినిం జూచి సంతసిల్లి రంత.

(ఆ రాజులకు ద్రుపదుడు విడిది ఏర్పాటు చేశాడు. పాండవులు పాంచాలరాజు ఐశ్వర్యాన్ని చూసి సంతోషించారు.)

1_7_166 సీసము + ఆటవెలది నచకి - వసంత

సీసము

వైహాయసం బైన వరమత్స్యయంత్రంబు
        ని వ్విల్లు మోపెట్టి యెవ్వఁ డేను
శరముల నేయు నశ్రమమున నతఁడ నా
        తనయకు వరుఁ డగు ధర్మయుక్తి
నని చాటఁ బంచిన నాఘోషణము విని
        యుర్వీశులెల్ల నొండొరులఁ గడవఁ
గడువేడ్కఁ దొడి పూసికట్టి విభూతితోఁ
        దమతమచిహ్నముల్ దనరి యెఱుక

ఆటవెలది

పడఁగ వేఱువేఱ పన్ని భూతలము గ్ర
క్కదల సైన్యపాదఘట్టనమునఁ
బొలుచు ద్రుపదరాజపుత్త్రీస్వయంవర
రంగమునకుఁ జనిరి రమణ తోడ.

(ఆకాశంలో కట్టిన ఆ మత్స్యయంత్రాన్ని ఈ విల్లు ఎక్కుపెట్టి ఎవడు పడగొడతాడో అతడే నా కుమార్తెకు భర్త అవుతాడు - అని ద్రుపదుడు చాటింపు వేయగా రాజులందరూ ఆ స్వయంవరానికి వెళ్లారు.)

-:ద్రౌపదీస్వయంవరము:-

Monday, September 11, 2006

1_7_165 వచనము నచకి - వసంత

వచనము

కని వినయమ్మున న మ్మునీంద్రునకు నందఱు నమస్కరించి కృతాంజలు లై యున్న వారికి హృదయానందంబుగా సత్యవతీనందనుం డాగామి శుభంబు లావేదించి చనినఁ బాండవులును గతిపయ దినంబులకు ద్రుపదుపురంబు సొచ్చి నాలుగు సముద్రంబులుం బోలె ఘూర్ణిల్లి మ్రోయుచుం బురంబు నాలుగుదిక్కుల విడిసియున్న నానాదేశాగత మహీనాథుల బహువిధ స్కంధావారంబులఁ జూచుచుం జని యొక్కకుంభకారగృహంబున విడిసి త మ్మెవ్వరు నెఱుంగకుండ బ్రాహ్మణవృత్తి నుండు నంతఁ బాంచాలపతి పార్థునకుఁ గూఁతు నీ సమకట్టి పాండవుల నన్వేషించి యెందునుం గానక.

(వ్యాసుడు వారికి రానున్న శుభాల గురించి తెలిపి వెళ్లాడు. తరువాత పాండవులు ద్రుపదుడి పట్టణం చేరి ఒక కుమ్మరి ఇంట్లో విడిది చేశారు. ద్రుపదుడు అర్జునుడికి తన కూతురిని ఇవ్వాలని, పాండవుల కోసం చూసి, వాళ్లను కనిపెట్టలేక.)

1_7_164 కందము నచకి - వసంత

కందము

కృష్ణమృగాజినధరుఁ దరు
ణోష్ణద్యుతితేజుఁ బంకజోద్భవసదృశుం
గృష్ణద్వైపాయను గత
తృష్ణామయుఁ గాంచి రరుగుదెంచు మహాత్మున్.

(వస్తున్న వ్యాసుడిని చూశారు.)

1_7_163 వచనము నచకి - వసంత

వచనము

అని మాటలాడుచు వచ్చు బ్రాహ్మణులతోడఁ బాండవులు ద్రుపదుపురంబున కరుగు వా రెదుర.

(వారితో పాండవులు ద్రుపదుడి పట్టణానికి వెడుతూ ఎదురుగా.)

1_7_162 కందము నచకి - వసంత

కందము

మీయం దీ కృష్ణు నుదం
సాయతభుజుఁ జూచి తాన హర్షముతోడం
దోయజముఖి వరియించును
మా యెఱిఁగినకార్య మిది సమంజసబుద్ధిన్.

(మీలో నల్లనివాడైన ఇతడిని ద్రౌపది వరిస్తుంది.)

Wednesday, September 06, 2006

1_7_161 వచనము నచకి - వసంత

వచనము

అట్టి మహోత్సవంబు చూడ ద్రుపదు పురంబునకుం బోయెద మందులకు నుత్సవ దర్శనోత్సుకు లై దర్శనీయులుం దరుణులును నపార భూరి దక్షిణ యజ్ఞకరులును ననేకశస్త్రాస్త్రవిదులును నయిన నానాదేశాధిపతులు నింతకుఁ జనుదెంతు రనంతధనంబును బ్రాహ్మణులకు వా రిత్తు రట్టె మీరును వారిం జూడ వచ్చెదరేని యొక్కటఁ బోదము రండు.

(ఆ స్వయంవరం చూడటానికి వెడుతున్నాము. మీరు కూడా వచ్చేట్టయితే కలిసిపోదాం రండి.)

Monday, September 04, 2006

1_7_160 సీసము + ఆటవెలది నచకి - వసంత

సీసము

యజ్ఞసేన ప్రభు యజ్ఞమహావేదిఁ
        గవచశరాసనఖడ్గబాణ
రథయుక్తుఁ డై మహారథుఁడు ధృష్టద్యుమ్నుఁ
        డన నుదయించిన నతనితోడ
నొక్కటఁ బుట్టిన యక్కన్యకను కృష్ణ
        నసితోత్పల శ్యామలామలాంగి
మెఱపునుం బోలెను వఱలు నుత్పలగంధి
        బంధుర తను సౌరభంబు గలుగు

ఆటవెలది

దాని ద్రుపదరాజతనయఁ దదీయ స్వ
యం వరోత్సవంబు నపుడు చూడఁ
గనినవారు దృష్ట్లుగనిన ఫలం బెల్లఁ
గనినవారు పరమకౌతుకమున.

(ద్రుపదుడి యజ్ఞవేదికనుండి ధృష్టద్యుమ్నుడు, కృష్ణ జన్మించారు. ఆమె స్వయంవరం జరగబోతోంది.)

1_7_159 వచనము నచకి - వసంత

వచనము

ధౌమ్యుండును వారినతిప్రీతిం బూజించి పురోహితత్వంబుం బరిగ్రహించె నట్లు తేజోరూపబుద్ధివిభవంబుల బృహస్పతిసదృశుం డై వేదవేదాంగవిదుం డైన ధౌమ్యుం బురోహితుంగాఁ బడసి పాండునందను లశేషమహీరాజ్యంబు వడసినంతయ సంతసిల్లి తత్కృతస్వస్త్యయను లయి జననీ సహితంబు దక్షిణ పాంచాలంబున కరుగువారు ముందఱ ద్రుపదపురంబునకుఁ బోయెడు బ్రాహ్మణులం గని మీ రెందులకుం బోయెద రని యడిగిన వా రి ట్లనిరి.

(పాండవులు దక్షిణపాంచాలానికి వెడుతూ ద్రుపదుడి నగరానికి వెళ్లే బ్రాహ్మణులను చూసి - మీరు ఎక్కడికి వెడుతున్నారు - అని అడగగా వారు ఇలా అన్నారు.)

1_7_158 ఉత్పలమాల నచకి - వసంత

ఉత్పలమాల

వీత సమస్త దోషుఁ డయి వేడ్కఁ దపం బొనరించుచున్నవి
ఖ్యాతుఁ బురోహితప్రవరుఁగా వరియించిరి భక్తితో జగ
త్పూతచరిత్రు సాధుజనపూజితు ధార్మికు ధౌమ్యు దేవల
భ్రాతృవరున్ మహాత్ము హితభాషణు భూసురవంశభూషణున్.

(దేవలుడి తోబుట్టువులలో ఉత్తముడైన ధౌమ్యుడిని పాండవులు పురోహితుడిగా స్వీకరించారు.)

-:పాండవులు ధౌమ్యునిఁ బురోహితుఁగా వరియించుట:-

1_7_157 వచనము నచకి - వసంత

వచనము

అనిన గంధర్వుండు పెద్దయుంబ్రొద్దు విచారించి యిచ్చోటికిం గుఱంగట నుత్కచం బను పుణ్య తీర్థంబునం దపంబు సేయుచున్నవాని ధౌమ్యుం డను బ్రాహ్మణునిఁ బురోహితుఁగాఁ బ్రార్థింపుం డమ్మహాత్ముండు మీకుఁ బురోహితుం డైన సర్వార్థసిద్ధి యగు ననిన సంతసిల్లి వానికి నాగ్నేయాస్త్రంబు విధ్యుక్తంబుగా నిచ్చి మాకు నీ యిచ్చిన హయంబుల నీయంద సంగ్రహించి యుండుము ప్రయోజనంబు గలనాఁడు గొనిపోయెద మని గంధర్వు వీడ్కొని పాండవులు భాగీరథి నుత్తరించి యుత్కచం బను పుణ్యతీర్థంబున కరిగి యందు.

(ఇక్కడికి దగ్గరలో ఉన్న ఉత్కచం అనే తీర్థంలో ఉన్న ధౌమ్యుడు అనే బ్రాహ్మణుడిని పురోహితుడిగా స్వీకరించండి - అనగా అర్జునుడు సంతోషించి అతడికి ఆగ్నేయాస్త్రాన్ని ఇచ్చి - మాకు నువ్వు ఇచ్చిన గుర్రాలను నీ దగ్గరే ఉంచు. అవసరమైనప్పుడు తీసుకొంటాము - అని పాండవులు గంగానదిని దాటి ఆ తీర్థానికి వెళ్లి.)

1_7_156 ఉత్పలమాల నచకి - వసంత

ఉత్పలమాల

మాకు నతి ప్రియుండవు సమస్త విదుండవు చెప్పుమయ్య యీ
లోకములోని వర్తనములుం దగువారి నెఱుంగు దెవ్వనిం
బ్రాకటధర్మతత్త్వవిదు బ్రాహ్మణముఖ్యుఁ బురోహితుండుగాఁ
జేకొనువార మట్టి బుధసేవితుఁ గానఁగ మాకు నెం దగున్.

(మాకు పురోహితుడు కాగల వ్యక్తి మాకు ఎక్కడ లభిస్తాడో చెప్పండి.)

1_7_155 వచనము నచకి - వసంత

వచనము

పరాశరుండును బులస్త్యాదిమహామునిప్రార్థితుం డై రాక్షససత్త్రయాగం బుపసంహరించి తన్నియోగంబున నయ్యగ్ని హిమవదుత్తరపార్శ్వంబున వైచిన నదియును బర్వంబుల నందు వృక్షలతా గుల్మ శిలాభక్షణంబు సేయుచుండె నని యిట్లు గంధర్వుండు తాపత్యవసిష్ఠౌర్వోపాఖ్యానంబు చెప్పిన విని యర్జునుండు వాని కి ట్లనియె.

(పరాశరుడు అలాగే సత్రయాగాన్ని ఆపాడు - అని ఆ గంధర్వుడు తాపత్య - వసిష్ఠ - ఔర్వుల కథను చెప్పగా విని అర్జునుడు ఇలా అన్నాడు.)

1_7_154 కందము నచకి - వసంత

కందము

పరమ తపోనిలయు దినే
శ్వరదీప్తి సహస్రతేజు శాక్తేయుఁ బరా
శరుఁ గని యందఱుఁ బ్రార్థిం
చిరి రాక్షస మారణంబు సేయకు మనుచున్.

(రాక్షససంహారం ఆపమని ప్రార్థించారు.)

1_7_153 కందము నచకి - వసంత

కందము

అగ్నిహతిఁ జేసి మానవ
భుగ్నివహము మరణబాధఁ బొందించుచు మూఁ
డగ్నులయొద్దను నాలవ
యగ్నియనన్ వెలుఁగుచున్న యమ్మునినాథున్.

(మూడు అగ్నుల దగ్గర ఉన్న నాల్గవ అగ్నిలాగా ఉన్న పరాశరుడిని.)

1_7_152 వచనము నచకి - వసంత

వచనము

ఇట్లు పరాశరుండు గావించు సత్త్రయాగంబున నైన రాక్షసకులప్రళయంబుఁ జూచి పులస్త్యపులహక్రతువులు మహామునిసంఘంబులతో వసిష్ఠాశ్రమంబునకు వచ్చి.

(ఈ రాక్షసనాశనాన్ని చూసి పులస్త్యుడు, పులహుడు, క్రతువులు మునిసమూహాలతో వసిష్ఠుడి ఆశ్రమానికి వచ్చి.)

1_7_151 కందము నచకి - వసంత

కందము

ఘోరాకారులు కృతహా
హారవులు సబాలవృద్ధు లయి పడిరి దురా
చారులు రాక్షసులు ముని
ప్రారబ్ధాధ్వరసమిద్ధపావకశిఖలన్.

(రాక్షసులు హాహాకారాలతో పరాశరుడి యాగంలో - అగ్నిజ్వాలలలో పడిపోయారు.)

1_7_150 తేటగీతి నచకి - వసంత

తేటగీతి

శక్తి రాక్షసనిహతుఁ డై చనిన శోక
దహనహతుఁ డై వసిష్ఠుండు దానిఁ దలఁచి
కడుఁ బ్రశాంతాత్ముఁ డయ్యు రాక్షసవినాశ
మొలసి మనుమని వారింపకుండె నంత.

(వసిష్ఠుడు శాంతమనస్కుడైనా, శక్తి మరణాన్ని తలచుకొని, పరాశరుడు చేసే ఈ యాగప్రయత్నాన్ని వారించలేదు.)

-:పరాశరుఁడు రాక్షసవినాశార్థంబు సత్త్రయాగంబు సేయుట:-

1_7_149 వచనము నచకి - వసంత

వచనము

అనిన నౌర్వుండు పితృదేవతాదేశంబునఁ దన కోపానలంబు సముద్రంబులో వైచిన నది యౌర్వానలంబునా నశ్వముఖంబున నబ్ధిజలంబులం ద్రావుచుండు నిది వేదంబులయందు వినంబడియెడు కథ గావున నీవును నౌర్వునట్ల ధర్మవిదుండవు భువనపరిభావి యైన యీ క్రోధంబు విడువు మనిన వసిష్ఠు వచనంబునం బరాశరుండు గోపం బుపసంహరించి రాక్షసవినాశార్థంబుగా సత్త్రయాగంబు సేయం గడంగిన.

(అనగా ఔర్వుడు అలాగే చేశాడు. ఇది వేదాలలో ఉండే కథ - కాబట్టి ఔర్వుడిలాగానే నువ్వు కూడా లోకాలను నశింపజేసే ఈ కోపాన్ని విడిచిపెట్టు - అని వసిష్ఠుడు చెప్పగా పరాశరుడు అలాగే కోపాన్ని విడిచి, రాక్షసవినాశనం కోసం సత్రయాగం చేయాలని నిర్ణయించాడు.)

1_7_148 ఆటవెలది నచకి - వసంత

ఆటవెలది

జలములంద యుండు సర్వలోకంబులు
గాన నీ మహోగ్ర కలుష వహ్ని
జలధిలోన విడిచి సత్యప్రతిజ్ఞుండ
వగుము జలధి జలము నది దహించు.

(అన్ని లోకాలూ నీటిలోనే ఉంటాయి. నీ కోపాన్ని సముద్రంలో విడిచిపెట్టి నీ ప్రతిజ్ఞ నెరవేర్చుకో.)

1_7_147 వచనము నచకి - వసంత

వచనము

కావున లోకంబులయందు సామర్థ్యంబు గలిగి పాప ప్రతిషేధంబు సేయని వారల నుద్దేశించి యలిగితి నేనును మీ వచనం బతిక్రమింప నోడుదు నఖిలలోకదహనోద్యతం బయిన నాకోపదహనంబు నిగృహీతం బయిన నన్న దహించు నేమి సేయు వాఁడ మీరు సర్వలోకహితులరు నాకును లోకంబులకును హితం బగునట్లుగా నుపదేశింపుఁ డనిన నౌర్వునకుం బితరు లి ట్లనిరి.

(నా కోపాగ్నిని ఆపితే అది నన్నే దహిస్తుంది. ఇప్పుడు నేను ఏమి చేయాలి? - అని అడగగా వారు ఇలా అన్నారు.)

Sunday, September 03, 2006

1_7_146 తేటగీతి నచకి - వసంత

తేటగీతి

ఎఱుక గలఁ డేని మఱి శక్తుఁ డేని యన్యు
లన్యులకు హింస గావించునపుడు దానిఁ
బూని వారింపకున్న నప్పురుషుఁ డేఁగు
హింస చేసినవారల యేఁగుగతికి.

(ఒకరు మరొకరిని హింసించే సమయంలో సమర్థుడైనవాడు వారించకపోతే అతడు కూడా ఆ హింస చేసినవాళ్ల గతినే పొందుతాడు.)

1_7_145 తేటగీతి నచకి - వసంత

తేటగీతి

పాపు లై క్షత్త్రియాధముల్ భార్గవులకు
నట్లు హింస గావించు నాఁ డార్తనాద
మూరుగర్భగతుండనై యుండి వినిన
నాఁడ కోప మసహ్య మై నన్నుఁ బొందె.

(క్షత్రియులు భార్గవులను హింసిస్తున్నప్పుడు ఆ దుఃఖధ్వనిని నేను గర్భంలో ఉండి విన్నప్పుడే నాకు సహించరాని కోపం కలిగింది.)

Saturday, September 02, 2006

1_7_144 కందము నచకి - వసంత

కందము

అలయక నిమిత్తజంబగు
నలుకను క్షమియించి శాంతుఁ డగు పురుషుం డి
మ్ముల రక్షింపఁగ నోపునె
పొలుపుగ ధర్మార్థకామములు సమములుగన్.

(ఒక కారణం వల్ల కలిగిన కోపాన్ని తీర్చుకోక సహించే మానవుడు ధర్మార్థకామాలను రక్షించగలడా?)

1_7_143 కందము నచకి - వసంత

కందము

మతి మఱచి యనిస్తీర్ణ
ప్రతిజ్ఞుఁ డగు వాని కోపపటుదహన మని
ర్గత మయి వడి నరణి సము
త్థిత దహనమ పోలె నాత్మదేహము నేర్చున్.

(ప్రతిజ్ఞను నెరవేర్చనివాడి కోపం వెలుపలికి రాక అతడినే కాల్చివేస్తుంది.)

1_7_142 మత్తకోకిలము నచకి - వసంత

మత్తకోకిలము

మానితం బగు నా తపోమహిమం ద్రిలోక పరాభవం
బేను జేయఁగ బూని చేసితి నిట్టి దొక్క ప్రతిజ్ఞ మున్
దీని నెట్టులు గ్రమ్మఱింతు మదీయ భాషిత మెన్నఁడు
న్నేని మోఘము గాదు దిగ్ధరణీరవీందు లెఱుంగఁగన్.

(నా ప్రతిజ్ఞను ఎలా తప్పగలను?)

1_7_141 వచనము నచకి - వసంత

వచనము

అయ్యా నీ తపో మహత్త్వంబుఁ జూచి లోకంబు లెల్ల భయంపడియెడు లోకానుగ్రహంబుగా నీరోషంబును విడువుము మే మసమర్థుల మై క్షత్త్రియులచేత వధియింపం బడిన వారము గాము ధనలుబ్ధుల మయి ధనంబు దాఁచినవారము గాము ధనము వలసినం గుబేరుండు దాన మాకుఁ దెచ్చి యిచ్చుం దపోమహత్త్వంబునం మాకు నాయువు గడుంబెద్దయైన నిర్వేదించి మనుష్యలోకంబున నుండ నొల్లక యాత్మఘాతంబునం బుణ్యలోకంబులు లేమిం జేసి దానిం బరిహరించి యా క్షత్త్రియులతో వైరం బమర్చికొని తన్నిమిత్తంబున దేహంబులు విడిచితిమి భార్గవులతేజంబు నొరులు పరిభవింప నోపుదురె కావున నీవు దీనికింగా సర్వజనోపద్రవంబు సేయవల దిది మాకభీష్టం బనిన నౌర్వుండు వారల కి ట్లనియె.

(నీ తపోమహిమకు లోకాలు భయపడుతున్నాయి. నీ కోపం విడిచిపెట్టు - అనగా ఔర్వుడు ఇలా అన్నాడు.)

-:పితృదేవత లౌర్వుని శాంతచిత్తునిఁ జేయుట:-