Tuesday, August 30, 2005

1_2_3 తరలము సందీప్ - విజయ్

తరలము

అనలతేజులు దీర్ఘదేహులు నైనయట్టి తనూజులన్
వినుతసత్త్వులఁ గోరెఁ గద్రువ వేవురం గడువేడ్కతో
వినత గోరె సుపుత్త్రులన్ భుజవీర్యవంతుల వారి కం
టెను బలాధికులైనవారిఁ గడింది వీరుల నిద్దఱన్.

(కద్రువ గొప్పవారైన వెయ్యిమంది కుమారులను కోరుకోగా, వినత వారికంటే బలవంతులైన ఇద్దరు పుత్రులను కోరింది.)

1_2_2 వచనము సందీప్ - విజయ్

వచనము

ఆక్కథకుండు శౌనకాది మహామునులకుం జెప్పె నాదియుగంబునం గశ్యప
ప్రజాపతి భార్యలైన కద్రువయు వినతయు ననువారలు పుత్త్రార్థినులై
యనేకసహస్రవర్షంబులు కశ్యపునారాధించినం గశ్యపుండును బ్రసన్నుండై
మీ కోరిన వరంబు లిచ్చెద వేఁడుం డనిన.(ఆ కథకుడు శౌనకాదిమునులకు ఇలా చెప్పాడు. కృతయుగంలో కశ్యపప్రజాపతి భార్యలైన కద్రువ, వినతలు పుత్రులకోసం చాలాకాలం కశ్యపుడిని ఆరాధించగా, అతడు ప్రసన్నుడై మీరు కోరిన వరాలు ఇస్తాను కోరుకొమ్మనగా.)

-:కద్రూవినతలు పుత్త్ర్రులం గోరి పడయుట:-

1_2_1 సందీప్ - విజయ్

శ్రీవనితావల్లభ వేం
గీవిషయాధీశ కావ్యగీతప్రియ నా
నావనినాథ కిరీటత
టీవిలసద్రత్నసంఘటితపదకమలా.(వేంగీదేశరాజా! రాజరాజనరేంద్రా!)

ఆదిపర్వము - ద్వితీయాశ్వాసము

1_1_164 గద్యము కృష్ణ - విజయ్

గద్యము

ఇది సకలసుకవిజనవినుత నన్నయభట్ట ప్రణీతంబైన శ్రీ మహా భారతంబునం దాది పర్వంబున ననుక్రమణికయును బౌష్యోదంకమాహాత్మ్యంబును భృగువంశకీర్తనంబు నన్నది ప్రథమాశ్వాసము.

(ఇది నన్నయ రచించిన శ్రీమహాభారతంలోని ఆదిపర్వంలో అనుక్రమణిక, పౌష్యోదంకుల కథ, భృగువంశకీర్తనం గల ప్రథమాశ్వాసం.)

1_1_163 తోటకము కృష్ణ - విజయ్

తోటకము

నిరవద్యనరేశ్వర నిత్యనిరం, తరధర్మమతీ గుణధామ జగ
త్పరిపూరిత కీర్తివిభాసి విభా, కరతేజ నృపోత్తమ కాంతినిధీ.

(రాజరాజనరేంద్రా!)

1_1_162 కందము కృష్ణ - విజయ్

కందము

ఆదిక్షత్రచరిత్ర ధ
రాదేవాశీః పరంపరావర్ధితని
త్యోదయ సత్యోదిత విమ
లాదిత్యతనూజ విక్రమాదిత్యనిభా.(విమలాదిత్యుని కుమారా!)

1_1_161 ఉత్పలమాల కృష్ణ - విజయ్

ఉత్పలమాల

రాజకులాగ్రగణ్య మృగరాజపరాక్రమ రాజరాజ వి
భ్రాజితశుభ్రకీర్తిపరిపాండురసర్వదిగంతరాళ ఘో
రాజిముఖోపలబ్ధవిజయప్రమదాశ్రితబాహుదండ ని
స్తేజితవైరివీర కులదీప మృడప్రియ విష్ణువర్ధనా.(విష్ణువర్ధనబిరుదాంకితుడివైన రాజరాజా!)

1_1_160 వచనము కృష్ణ - విజయ్

వచనము

అని సౌపర్ణాఖ్యాన శ్రవణకుతూహలపరులై యడిగిన.(అని గరుడుని కథ వినే ఆసక్తితో అడగ్గా.)

1_1_159 ఆటవెలది ప్రదీప్ - కృష్ణ

ఆటవెలది

ఒరుల వలనఁ బుట్టు నోటమియును నెగ్గుఁ
బొరయకుండ నరసి పుత్త్రవరులఁ
దగిలి కాచునట్టి తల్లి సర్పములకు
నేల యలిగి శాప మిచ్చె నయ్య.(అయ్యా! ఇతరుల వల్ల జరిగే హాని కలుగకుండా పుత్త్రులను కాపాడే తల్లే వారికి ఎందుకు శాపమిచ్చింది?)

1_1_158 వచనము కృష్ణ - విజయ్

వచనము

అయ్యా నీవు బ్రాహ్మణుండవు భృగువంశసముత్పన్నుండవు సర్వగుణసంపన్నుండ విది యేమి దొడంగి తిట్టి దారుణక్రియారంభంబు క్షత్రియులకుం గాక బ్రాహ్మణులకుం జనునే బ్రహ్మణు లహింసాపరు లొరులు సేయు హింసలు వారించు పరమకారుణ్యపుణ్యమూర్తులు జనమేజయుండను జనపతి చేయు సర్పయాగంబునందుఁ గద్రూశాపంబున నయ్యెడు సర్పకులప్రళయంబును భవత్పిత్రు శిష్యుండయిన యాస్తీకుండను బ్రాహ్మణుండ కాఁడె యుడిగించె నని చెప్పి సహస్రపాదుండు రురునకు సర్పఘాతంబునందుపశమనబుద్ధి పుట్టించె ననిన విని శౌనకాదిమహామును లక్కథకున కిట్లనిరి.
("అయ్యా! గొప్పవాడివైన నీవు ఇలా చేయటం ఎందుకారంభించావు? బ్రాహ్మణులు అహింసాపరులు, ఇతరులు చేసే హింసను ఆపే దయగలవారు. జనమేజయుని సర్పయాగంలో నాగులకు జనని అయిన కద్రువ శాపం వల్ల జరిగే సర్పవినాశనాన్ని నీ తండ్రి శిష్యుడైన ఆస్తీకుడే కదా వారించింది?", అని సహస్రపాదుడు పలికి రురుడికి సర్పఘాతయత్నం మానివేసే బుద్ధి కలిగించాడు అని కథకుడు చెప్పగా విని శౌనకాదిమహర్షులు అతడిని ఇలా అడిగారు.)

1_1_157 ఉత్పలమాల కృష్ణ - విజయ్

ఉత్పలమాల

భూనుతకీర్తి బ్రాహ్మణుఁడు పుట్టుడుఁ దోడన పుట్టు నుత్తమ
జ్ఞానము సర్వభూతహిత సంహితబుద్ధియుఁ జిత్తశాంతియున్
మానమదప్రహాణము సమత్వము సంతతవేదవిధ్యను
ష్ఠానము సత్యవాక్యము దృఢవ్రతమం గురుణాపరత్వమున్.(బ్రాహ్మణుడు పుట్టగానే అనేక గొప్పగుణాలు కూడా కలుగుతాయి.)

1_1_156 వచనము ప్రవీణ్ - విజయ్

వచనము

ఏను సహస్రపాదుండను మునిముఖ్యుండ నాసహాధ్యాయుండు ఖగముండను మునిముఖ్యుం డగ్నిహోత్రగృహంబున నున్న నే నపహాసార్థంబు తృణమయసర్పం బమ్మునిపై వైచిన నతం డులికిపడి నా కలిగి నీవు నిర్వీర్యంబైన యురగంబ వగుమని శాపం బిచ్చిన నేనును మేలంబు సేసిన నింత యలుగనేల క్షమియింపుమనినం బ్రసన్నుండై ఖగముండు నా వచనం బమోఘంబు గావునఁ గొండొక కాలంబు డుండుభంబవై యుండి భార్గవ కులవర్ధనుండైన రురుం గనిన యప్పుడు శాపవిముక్తుండ వగుదు వనెనని సహస్రపాదుండు రురునకుఁ దన వృత్తాంతం బంతయుం జెప్పి వెండియు నిట్లనియె.
(నేను సహస్రపాదుడనే మునిని. ఖగముడనే నా సహపాఠిపై పరిహాసానికై గడ్డితో చేసిన ఒక పామును వేయగా అతడు భయపడి, నాపై కోపించి, శక్తిలేని పామువుకమ్మని శపించాడు. వేళాకోళానికి చేశాను, మన్నించమనగా ఆతడు ప్రసన్నుడై, "నా పలుకు వ్యర్థం కాదు కాబట్టి ఇలా కొంతకాలం ఉన్న తరువాత భృగువంశానికి చెందిన రురుడిని చూసినప్పుడు నీకు విముక్తి కలుగుతుంది", అని అన్నాడని పలికి ఇలా అన్నాడు. )

-:సహస్రపాదుని వృత్తాంతము:-

1_1_155 కందము ప్రవీణ్ - కృష్ణ

కందము

ఉరగమవై యుండి మునీ
శ్వరవేషము దాల్చి యున్న వడు వెంతయు న
చ్చెరు విది యెట్టులు నావుడు
రురునకు నిట్లనియె మునివరుం డనురక్తిన్("పామువైయుండి మునివేషం ధరించటం వింతగా ఉంది. ఇది ఎలా జరిగింది?", అనగా ఆ మునివరుడు.)

1_1_154 వచనము కృష్ణ - విజయ్

వ. అని రురుం డలిగి కృతాంతకరదండంబుబోని తన దండం బెత్తికొనుడుఁ దత్క్షణంబ డుండుభంబు మునియై యెదుర నిలిచినం జూచి రురుం డిట్లనియె.


(అని యమదండం వంటి తన కర్రతో ఆ పామును కొట్టబోగా డుండుభం మునిరూపం ధరించి రురుడి ఎదుట నిలబడింది. అది చూసి రురుడు ఇలా అన్నాడు.)

1_1_153 మత్తకోకిలము శశాంక - విజయ్

మత్తకోకిలము

ఏమి కారణమయ్య పాముల కింత యల్గితి వీవు తే
జోమయుండవు బ్రాహ్మణుండవు సువ్రతుండవు నావుడుం
బాము లెగ్గొనరించె మత్ప్రియభామ కేను రురుండ ను
ద్దామసత్త్వుఁడ నిన్ను నిప్పుడ దండతాడితుఁ జేసెదన్.("గొప్పవాడివైన నీకు పాములంటే ఇంత కోపం ఎందుకయ్యా?". అప్పుడు రురుడు, "నా భార్యకు పాములు అపకారం చేశాయి. నేను రురుడనే భార్గవుడిని. నిన్ను ఇప్పుడే ఈ దండంతో కొట్టిచంపుతాను", అని పలికాడు.)

1_1_152 చంపకమాల ప్రవీణ్ - కృష్ణ

చంపకమాల

తిరుగుచుఁ బుట్టలం బొదలఁ ద్రిమ్మరు పాముల రోసిరోసి ని
ష్ఠురతరదీర్ఘ దండమున డొల్లఁగ వ్రేయుచు వచ్చివచ్చి య
య్యిరవున డుండుభంబను నహిం గని వ్రేయఁగ దండ మెత్తుడున్
హరిహరియంచు డుండుభమహాహి భయంపడి పల్కు భార్గవున్(అడవిలో తిరుగుతూ పాములను వెదకి వెదకి కర్రతో అవి చచ్చిపడేలా కొడుతూ వచ్చి ఒక చోట డుండుభమనే విషంలేని పామును చూసి కొట్టటానికై కర్ర పైకెత్తగా అది భయపడి హరినామాన్ని జపిస్తూ రురుడితో ఇలా అన్నది.)

1_1_151 కందము శ్రీహరి - విజయ్

కందము

తన సతి కపకారము సే
సిన పాముల కలిగి బాధ సేయుదు నని చి
క్కనిదండము గొని పాములఁ
గనినప్పుడ యడువఁదొడఁగె గహనములోనన్.(తన భార్యకు కీడు చేసిన పాములపై కోపంతో అడవిలో పాములు కనబడిన వెంటనే వాటిని కర్రతో కొట్టటం ఆరంభించాడు.)

1_1_150 వచనము కృష్ణ - విజయ్

వచనము

అని దీనవదనుండై యాక్రోశించువానికి నాకాశంబున నుండి యొక్క దేవ
దూత యిట్లనియె నయ్యా! కాలవశంబయిన నెవ్వరికిం దీర్చఁ దరంబుగా
దొక్క యుపాయంబు గలదు చేయనోపుదేనిఁ జెప్పెద వినుము నీ యాయు
ష్యంబునం దర్థం బిక్కన్య కిమ్మనిన రురుం డట్ల చేయుదు నని తన
యాయుష్యంబునం దర్థం బక్కన్యక కిచ్చిన నక్కోమలి దొల్లింటికంటె
నధికశృంగార సమన్వితయై విషనిర్ముక్త యయ్యె నట్లు దేవదూత ధర్మరా
జానుమతంబునఁ దన చెప్పిన యుపాయంబునం బ్రమద్వరను బంచత్వంబు
వలనం బాపె రురుండును దాని వివాహంబై యిష్టోపభోగంబుల ననుభ
వించుచు నుండి.
(అలా విలపిస్తున్న రురుడికి ఆకాశంనుండి ఒక దేవదూత, "అయ్యా! మరణాన్ని తొలగించటం సాధ్యం కాదు. అయినా ఒక మార్గముంది. నీ ఆయుర్దాయంలో సగం ఈమెకు ఇవ్వు" అని పలికాడు. రురుడు అందుకు సమ్మతించగా, ఆ దేవదూత యముని అనుమతితో ప్రమద్వరను మృత్యువునుండి ఉద్ధరించాడు. ఆమె ముందటికంటే ఎక్కువ సౌందర్యంతో విషం నుండి విముక్తి పొందింది. రురుడు ప్రమద్వరను వివాహం చేసుకుని సుఖంగా ఉండి.)

1_1_149 చంపకమాల కృష్ణ - విజయ్

చంపకమాల

అపరిమితాజ్ఞఁ జేసియు మహాపురుషుల్ విషతత్త్వసంహితా
నిపుణులు మంత్రతంత్రములు నేర్చి విధించియు దీనికిన్ విష
వ్యపగతమైన జీవ మిది వచ్చు నుపాయము సేయరొక్కొనా
తపముఫలంబు నధ్యయనదానఫలంబులు నిత్తు వారికిన్.
(ప్రమద్వరకు ప్రాణాలు తిరిగివచ్చే ఉపాయం చేసిపెట్టరా? అలా చేసినవారికి నా తపఃఫలాన్నీ, అధ్యయనఫలాన్నీ, దానఫలాన్నీ ఇస్తాను)

1_1_148 చంపకమాల ప్రదీప్ - విజయ్

చంపకమాల

అలయక యేన దేవయజనాధ్యయనవ్రతపుణ్యకర్మముల్
సలుపుదునేని యేన గురుసద్ద్విజభక్తుఁడ నేని యేన య
త్యలఘుతపస్వినేని దివిజాధిపభూసురులార మన్మనో
నిలయకు నీప్రమద్వరకు నిర్విషమయ్యెడు నేఁడు మీదయన్.
(ఓ దేవతలారా! బ్రాహ్మణులారా! నేను అలసటలేక పూజలు, యజ్ఞాలు, వ్రతాలు, వేదపఠనం వంటి పుణ్యకార్యాలు చేసేవాడనైతే, గురుభక్తుడనైతే, గొప్పతపస్వినైతే మీ దయ వల్ల ప్రమద్వర విషవిముక్తురాలు అగుగాక!)

1_1_147 వచనము కృష్ణ - విజయ్

వచనము

దాని నెఱింగి కరుణాకలితహృదయులై గౌతమ కణ్వకుత్స కౌశిక శంఖ
మేఖల భరద్వాజ వాలఖిల్యోద్దాలక శ్వేతకేతు మైత్రేయ ప్రముఖులు ప్రమ
తియు రురుండును స్థూలకేశాశ్రమంబునకు వచ్చి విషవ్యపగతప్రాణ యై
పడియున్న యక్కన్యం జూచి దుఃఖితులై యుండ నచ్చోట నుండనోపక
రురుండు శోకవ్యాకులహృదయుండై యేకతంబ వనంబునకుం జని.
(ఈ విషయం తెలిసి గౌతముడు, కణ్వుడు, కుత్సుడు, కౌశికుడు (విశ్వామిత్రుడు), శంఖుడు, మేఖలుడు, భరద్వాజుడు, వాలఖిల్యులు, ఉద్దాలకుడు, శ్వేతకేతుడు, మైత్రేయుడు మొదలైన ప్రముఖులు, ప్రమతి, రురుడు స్థూలకేశుని ఆశ్రమానికి వచ్చి నేలపై పడి ఉన్న ప్రమద్వరను చూసి దుఃఖితులవగా రురుడు అక్కడ ఉండలేక శోకవ్యాకులమైన హృదయంతో ఒంటరిగా అడవికి వెళ్లి.)

1_1_146 తేటగీతి కృష్ణ - విజయ్

తేటగీతి

కన్నియలతోడ నాడుచు నున్నదానిఁ
బాదమర్దితమై యొక్క పన్నగంబు
గఱచెఁ గన్నియ లందఱు వెఱచి పఱచి
యఱచుచుండఁ బ్రమద్వర యవనిఁ ద్రెళ్ళె.(తోటి కన్యలతో ఆడుకుంటున్న ప్రమద్వరను వారు పాదాలతో తొక్కిన ఒక పాము కరచింది. ఇతరకన్యలందరూ భయపడి, పరుగెత్తి, ఏడుస్తూ కేకలు వేస్తూండగా ప్రమద్వర భూమిపై పడింది.)

1_1_145 వచనము కృష్ణ - విజయ్

వచనము

అట్టి రురుండను మునివరుండు విశ్వావసుండను గంధర్వరాజునకు మేనకకుం
బుట్టినదాని స్థూలకేశుండను మునివరు నాశ్రమంబునఁ బెరుఁగుచున్నదాని
రూపలావణ్యగుణంబులఁ బ్రమదాజనంబుల యందెల్ల నుత్కృష్ట యగుటం
జేసి ప్రమద్వర యన నొప్పుచున్న కన్యక నతిస్నేహంబున వివాహంబుగా
నిశ్చయించి యున్నంత.
(విశ్వావసుడనే గంధర్వరాజుకూ, మేనక అనే అప్సరసకూ పుట్టి స్థూలకేశుడనే ముని ఆశ్రమంలో పెరుగుతున్న ప్రమద్వర అనే కన్యను రురుడు పెళ్లాడటానికి నిశ్చయించి ఉండగా.)

-:ప్రమద్వర సర్పదష్టయై చచ్చి మరల బ్రతుకుట:-

1_1_144 కందము ప్రదీప్ - కృష్ణ

కందము

చ్యవనునకు సుకన్యకు ను
ద్భవ మయ్యె ఘనుండు ప్రమతి ప్రమతికి నమృతో
ద్భవ యగుఘృతాచికిని భా
ర్గవముఖ్యుఁడు రురుఁడు పుట్టెఁ గాంతియుతుండై.(చ్యవనుడికీ సుకన్యకీ ప్రమతి పుట్టాడు. ప్రమతికీ అమృతంతోపాటు పుట్టిన ఘృతాచికీ భృగువంశంలో ముఖ్యుడైన రురుడు జన్మించాడు.)

1_1_143 వచనము ప్రదీప్ - కృష్ణ

వచనము

అమ్మహామునివచనం బమోఘంబు గావున నీవు సర్వభక్షకుండ వయ్యును
శుచులయం దెల్ల నత్యంతశుచివై పాత్రులయం దెల్లఁ బరమపాత్రుండవై
పూజ్యులయం దెల్ల నగ్రపూజ్యుండవై వేదచోదితవిధానంబులయందు విప్ర
సహాయుడవై భువనంబుల నడపుమని విశ్వగురుండు వైశ్వానరుం బ్రార్థించి
నియోగించి భృగువచనంబు ప్రతిష్ఠాపించె నట్టి భృగునకుఁ బుత్త్రుండై పుట్టి
పరగిన.

(భృగుమహాముని వాక్యం వ్యర్థం కాదు కాబట్టి నీవు సర్వభక్షకుడివైనా పవిత్రులలో పవిత్రుడివై, పాత్రులలో పాత్రుడివై, పూజ్యులలో పూజ్యుడివై లోకవ్యవహారం నిర్వహించమని బ్రహ్మ అగ్నిని నియోగించి భృగువు వాక్యాన్ని ప్రతిష్ఠాపించాడు. అలాంటి భృగువుకు పుత్రుడైన.)

1_1_142 చంపకమాల ప్రదీప్ - కృష్ణ

చంపకమాల

ప్రకటితభూతసంతతికి భర్తవు నీవ చరాచర ప్రవృ
త్తికి మఱి హేతుభూతుఁడవు దేవముఖుండవు నీవ లోకపా
వకుఁ డవు నీవ యిట్టి యనవద్యగుణుండవు నీకు విశ్వభా
రకభువన ప్రవర్తనపరాఙ్ముఖభావముఁ బొందఁ బాడియే.(లోకాలను భరించేవాడివైన ఓ అగ్నీ! లోకవ్యవహారం పట్ల ఇలా విముఖత చూపటం న్యాయమా?)

1_1_141 వచనము కృష్ణ - విజయ్

వచనము

బ్రహ్మయు భృగుశాపనిమిత్తంబున నగ్నిభట్టారకు నుపసంహారంబును సకలలోకవ్యవహారవిచ్ఛేదంబును నెఱింగి యగ్నిదేవు రావించి యిట్లనియె.

(భృగుశాపం మూలంగా అగ్నిభట్టారకుని ఉపసంహారం, లోకవ్యవహారవిచ్ఛేదం తెలుసుకుని అగ్నిదేవుడిని పిలిపించి ఇలా అన్నాడు.)

1_1_140 సీసము + ఆటవెలది రాంబాబు - విజయ్

సీసము

త్రేతాగ్ను లెల్లను దేజరిల్లమిఁ జేసి
క్రతుకృత్యములు వినిర్గతము లయ్యె
నగ్నిహోత్రములందు నౌపాసనాది సా
యంప్రాతరాహుతు లంత నుడిగె
దేవతార్చనలందు దీపధూపాది స
ద్విధులు వర్తిల్లక విరతిఁ బొందెఁ
బితృకార్యములఁ బితృపిండయజ్ఞక్రియ
లడఁగె విఛ్ఛిన్నంబు లై ధరిత్రి

ఆటవెలది

నంత జనులు సంభ్రమాక్రాంతులై మహా
మునుల కడకుఁ జనిరి మునులు నమర
వరులకడకుఁ జనిరి వారును వారును
బ్రహ్మకడకుఁ జనిరి భయము నొంది.
(అగ్ని ప్రజ్వరిల్లకపోవడం చేత లోకాల్లో కార్యాలన్నీ ఆగిపోయాయి. ప్రజలు సంభ్రమంతో మునుల వద్దకు వెళ్లారు. మునులు దేవతల దగ్గరకు వెళ్లారు. మునులూ, దేవతలూ భయపడి బ్రహ్మ వద్దకు వెళ్లారు.)

1_1_139 వచనము హర్ష - విజయ్

వచనము

నీవు బ్రాహ్మణుండవు నీ వెద్ది సేసిన నీక చను లోకహితుండ నయిన నాకు
శాపం బిచ్చి లోకంబులకెల్లఁజెట్ట సేసితి వదెట్లనిన వేదోక్తంబు లయిన నిత్య
నైమిత్తిక బలివిధానంబులందు మహాద్విజులచేత నాయందు వేల్వంబడిన
హవ్యకవ్యంబులు నా ముఖంబునన దేవపితృగణంబు లుపయోగింతు రట్టి
యేను సర్వభక్షకుండనైనఁ యశుచినైనఁ గ్రియానివృత్తి యగుఁ గ్రియాని
వృత్తియైన లోకయాత్ర లేకుండు నని యగ్నిభట్టారకుండు నిఖిలలోక
వ్యాప్తంబైన తన తేజోమూర్తి నుపసంహరించిన.


(నీవు బ్రాహ్మణుడివి, నీవేది చేసినా నీకే తగును. లోకాలకు మేలుచేసే నాకు శాపమిచ్చి లోకాలన్నింటికీ కీడు చేశావు. హోమంలో అందించే వస్తువులు నా ద్వారానే పితృదేవతలు ఉపయోగిస్తారు. అలాంటి నేను అపవిత్రుడిని అయితే కర్మలకు లోపం కలుగుతుంది. అలా జరిగితే లోకయాత్ర సాగదు, అని లోకవ్యాప్తమైన తన తేజస్సును ఉపసంహరించాడు.)

Sunday, August 28, 2005

1_1_138 చంపకమాల ప్రవీణ్ - కృష్ణ

చంపకమాల

అడిచినఁ దిట్టినన్ మఱి మహాపరుషంబులు పల్కి యల్కతోఁ
బొడిచిన నుత్తమద్విజులు పూజ్యులు వారల కెగ్గు సేసినం
జెడు నిహముం బరంబు నిది సిద్ధము గావు టెఱింగి భక్తినె
ప్పుడు ధరణీసురోత్తములఁ బూజలఁ దన్పుదు నల్గ నోడుదున్.(కొట్టినా, తిట్టినా, కఠినవాక్యాలతో పోట్లాడినా ఉత్తమద్విజులు పూజ్యులు. వారికి హానిచేస్తే ఇహపరాలకు చెడు కలుగుతుంది. కాబట్టి నేను వారిని భక్తితో పూజిస్తాను. వారిపై కోపించటానికి భయపడతాను.)

1_1_137 వచనము కృష్ణ - విజయ్

వచనము

కావున నే నసత్యంబునకు వెఱచి యక్కోమలి భృగుపత్ని యని కల రూపుఁ జెప్పితి నఖిల జగత్కర్మసాక్షి నై యుండి యసత్యం బెట్లు పలుక నేర్తు నది నిమిత్తంబుగా నీవు నాకు శాపం బిచ్చిన నే నలిగి నీకుఁ బ్రతిశాపం బీనోపనివాఁడను గాను వినుము.


(కాబట్టి అబద్ధానికి భయపడి ఆమె భృగుపత్ని అని నిజం చెప్పాను. జగత్కర్మసాక్షినైయుండి అబద్ధమెలా చెప్పగలను? నీ శాపానికి ప్రతిశాపం ఇవ్వలేనివాడిని కాను.)

1_1_136 కందము ఆదిత్య - విజయ్

కందము

తనయెఱిఁగిన యర్థం బొరుఁ
డనఘా యిది యెట్లు సెప్పుమని యడిగినఁ జె
ప్పనివాఁడును సత్యము సె
ప్పనివాఁడును ఘోరనరకపంకమునఁ బడున్.(తనకు తెలిసిన విషయాన్ని ఎవరన్నా అడిగినప్పుడు చెప్పనివాడు, అబద్ధం చెప్పేవాడు ఘోరమైన నరకమనే బురదలో పడతారు.)

1_1_135 వచనము కృష్ణ - విజయ్

వచనము

నీ వతిక్రూరుండవు సర్వభక్షకుండవు గమ్మని శాపం బిచ్చిన నగ్నిదేవుండిట్లనియె.
("నీవు అతిక్రూరుడివి, సర్వభక్షకుడివి అవుతావు", అని శాపమిచ్చాడు. అప్పుడు అగ్నిదేవుడు ఇలా అన్నాడు.)

1_1_134 కందము లక్ష్మీచైతన్య - విజయ్

కందము

కుక్షిచ్యుతుఁడై సుతుఁ డా
రాక్షసు భస్మంబు సేసి రాజితశక్తిన్
రక్షించె నన్ను ననవుడు
నక్షణమ మునీంద్రుఁ డగ్ని కతిరోషమునన్.(కుమారుడు గర్భంలోనుండి జారి ఆ రాక్షసుడిని బూడిద చేసి నన్ను రక్షించాడు, అనగానే భృగువు వెంటనే కోపంతో అగ్నికి.)

1_1_133 కందము జ్యోతి - విజయ్

కందము

ఈయగ్ని దేవుఁ డసురకు
నోయన చెప్పుటయు విని మహోగ్రాకృతితో
నాయసుర నన్ను సూకర
మై యప్పుడ యెత్తికొని రయ౦బునఁ జనుచోన్.(పులోముడికి ఈ అగ్నిదేవుడు నా గురించి చెప్పగా, అతడు భయంకరమైన వరాహాకారంలో నన్ను ఎత్తుకుని వేగంగా వెళ్లే సమయంలో.)

1_1_132 వచనము ప్రవీణ్ - విజయ్

వచనము

పులోమయు నక్కొడుకు భృగుకులవర్ధను నెత్తికొని నిజాశ్రమంబునకు వచ్చె నంతకు ముందఱ నారక్కసునకు వెఱచి యక్కోమలి యేడ్చుచుంబోయినఁ దద్బాష్పధారాప్రవాహంబు మహనదియై తదాశ్రమసమీపంబునం బాఱిన దానికి వధూసర యను నామంబు లోకపితామహుండు సేసె నంతఁ గృతస్నానుండై భృగుండు సనుదెంచి బాలార్కుండునుంబోని బాలకు నెత్తికొనియున్న నిజపత్నిం జూచి యసుర సేసిన యపకారంబున కలిగి యయ్యసుర నిన్నె ట్లెఱింగె నెవ్వరు సెప్పిరనినఁ బులోమ యిట్లనియె.


(అప్పుడు పులోమ చ్యవనుడిని ఎత్తుకుని ఆశ్రమానికి తిరిగివచ్చింది. అంతకు ముందు ఆమె ఆ రాక్షసుడికి భయపడి ఏడుస్తున్నప్పుడు, ఆ కన్నీళ్ల ధార గొప్పనదై ఆశ్రమం దగ్గర ప్రవహించగా, ఆ నదికి బ్రహ్మ "వధూసర" అనే పేరు పెట్టాడు. తరువాత భృగుమహర్షి స్నానం చేసివచ్చి బాలసూర్యుని వంటి కుమారుడిని ఎత్తుకుని ఉన్న భార్యను చూసి, రాక్షసుడు చేసిన అపకారానికి కోపించి, "ఆ రాక్షసుడికి నువ్వెవరో ఎలా తెలుసుకున్నాడు? ఎవరు చెప్పారు?", అనగా పులోమ ఇలా అన్నది.)

1_1_131 కందము జగదీష్ - విజయ్

కందము

సముదితసూర్యసహస్రో
పమదుస్సహతేజు జగదుపప్లవసమయా
సమదీప్తి తీవ్రపావక
సముఁ జూచుచు నసుర భస్మసాత్కృతుఁ డయ్యెన్.(అగ్నితో సమానమైన, తీక్ష్ణమైన తేజస్సుగల ఆ మునికుమారుడిని చూస్తూ పులోముడు దగ్ధుడై భస్మమయ్యాడు.)

-:చ్యవనునివలనఁ బులోముఁ డనురాక్షసుండు చచ్చుట:-

1_1_130 వచనము ప్రవీణ్ - కృష్ణ

వచనము

అని విచారించి యప్పరమపతివ్రత భృగుపత్ని యని కలరూపుఁ జెప్పిన
నప్పులోముండు నిది నాకుఁ దొల్లి వరియింపంబడిన భార్య పదంపడి భృగుండు
పెండ్లియయ్యె నని వరాహరూపంబున నాసాధ్వి నతిసాధ్వసచిత్త నెత్తికొని
పర్వంబర్వం తద్గర్భంబున నున్న యర్భకుండు గరం బలిగి కుక్షిచ్యుతుండై
చ్యవనుండు నాఁ బరగె నమ్మునికుమారుని.
(అని ఆలోచించి, ఆ మహాపతివ్రత భృగుపత్ని అని నిజం చెప్పగా పులోముడు, 'ఈమె పూర్వం నాకు భార్యగా ఎన్నబడింది. తరువాత భృగుమహర్షితో పెళ్లిజరిగింది', అని, వరాహరూపం ధరించి ఆమెను ఎత్తుకుని చాలాదూరం పరుగెత్తగా ఆమె గర్భంలో ఉన్న శిశువు కోపంతో గర్భంనుండి జారి చ్యవనుడు అనే పేరు పొందాడు. ఆ కుమారుడిని.)

1_1_129 సీసము + ఆటవెలది ప్రవీణ్ - కృష్ణ

సీసము

భృగుఁడను విప్రుండు మగువఁ బులోమ యన్
        దాని గర్భిణిఁ దన ధర్మపత్ని
నగ్నిహోత్రమునకు నగ్నులు విహరింపు
        మని పంచి యభిషేచనార్థ మరుగ
నంత బులోముఁడన్ వింత రక్కసుఁ డగ్ని
        హోత్రగృహంబున కొయ్య వచ్చి
యత్తన్విఁ జూచి యున్మత్తుఁడై యెవ్వరి
        సతి యిది సెప్పుమా జాతవేద

ఆటవెలది

యనఁగ నగ్ని దేవుఁడనృతంబునకు విప్ర
శాపమునకు వెఱచి శాపభయము
దీర్చుకొనఁగఁ బోలుఁ దీర్ప రా దనృతాభి
భాషణమున నైన పాపభయము.


(భృగుడు అనే విప్రుడు, పులోమ అనే పేరుగల గర్భవతి అయిన తన భార్యను అగ్నిహోత్రానికి అగ్నులు ప్రజ్వలింపజేయమని చెప్పి, స్నానానికై వెళ్లగా పులోముడనే రాక్షసుడు ఆ అగ్నిహోత్రగృహానికి వచ్చి, ఆమెను మోహించి, 'ఓ అగ్నీ, ఈమె ఎవరి భార్య?', అని అడగ్గా అగ్నిదేవుడు అసత్యదోషానికీ, విప్రశాపానికీ భయపడి, 'శాపహాని తొలగించుకోవచ్చు, అసత్యమాడటం వల్ల కలిగే పాపాన్ని తొలగించలేము'.)

1_1_128 వచనము వంశీ - విజయ్

వచనము

అని యడిగిన వారికి సక్కథకుం డిట్లని చెప్పెఁ దొల్లి సర్పకులజననియైన
కద్రువశాపంబు కారణంబునంజేసి జనమేజయు సర్పయాగంబున సర్వభక్షకుం
డైన యగ్నియందు సర్పంబులకెల్ల నకాండ ప్రళయంబైన దాని భృగువంశ
జుండైన రురుండు గావించు సర్పఘాతంబు సహస్రపాదుం డుడిగించినట్లు
జరత్కారుసుతుండైన యాస్తీకుం డుడిగించె దీని సవిస్తరంబుగాఁ జెప్పెద
వినుండని భృగువంశ కీర్తనంబు నాస్తీకుచరితంబును జెప్పందొడంగె.

(అప్పుడు ఆ కథకుడు, 'పూర్వం సర్పకులానికి జనని అయిన కద్రువ ఇచ్చిన శాపం వల్ల అగ్నిలో అన్ని సర్పాలకూ ప్రళయం కలుగగా దానిని, భృగువంశసంజాతుడైన రురుడు చేసే సర్పఘాతాన్ని సహస్రపాదుడు మాన్పించినట్లు, జరత్కారు దంపతుల కుమారుడైన ఆస్తీకుడు మాన్పించాడు. ఇది వివరంగా చెపుతాను. వినండి', అని భృగువంశ కీర్తనం, ఆస్తీకుడి కథ చెప్పటం ఆరంభించాడు.)

-:భృగువంశ కీర్తనము - భృగు వగ్నికి శాపమొసంగుట:-

1_1_127 చంపకమాల రాంబాబు - విజయ్

చంపకమాల

అమితజగద్భయంకరవిషాగ్నియు నప్రతిహన్యమానవీ
ర్యముఁ గలయట్టి సర్పముల కాజనమేజయు చేయు సర్పయా
గమున నుదగ్రపావకశిఖాతతులం దొరుఁగంగఁ గారణం
బమలచరిత్ర యేమి చెపుమయ్య వినం గడువేడ్క యయ్యెడున్.(అమలచరిత్రా! భయంకరమైన విషం, పరాక్రమం గల సర్పాలు ఆ జనమేజయుడు చేసే యాగంలో అగ్నిజ్వాలల మధ్య పడటానికి కారణమేమిటి?)

1_1_126 వచనము విజయ్ - కృష్ణ

వచనము

అని యి ట్లయ్యుదంకుండు జనమేజయునకు సర్పయాగంబునందు బుద్ధి
పుట్టించె ననిన విని శౌనకాదిమహామును లక్కథకున కిట్లనిరి.
(ఇలా ఉదంకుడు జనమేజయుడికి సర్పయాగబుద్ధి పుట్టించాడని కథకుడు చెప్పగా విని శౌనకాది మహామునులు ఈ విధంగా పలికారు.)

1_1_125 ఉత్పలమాల కృష్ణ - విజయ్

ఉత్పలమాల

ప్రల్లదుఁడైన యొక్క కులపాంసను చేసినదానఁ దత్కులం
బెల్లను దూషితం బగుట యేమి యపూర్వము గావునన్ మహీ
వల్లభ తక్షకాధము నెపంబున సర్పము లెల్ల నగ్నిలోఁ
ద్రెళ్లఁగ సర్పయాగ మతిధీయుత చేయుము విప్రసమ్మతిన్(కులభ్రష్టుడు ఒక్కడు చేసిన దాని వల్ల కులాన్నంతా నిందించటం కొత్తేమీ కాదు. కాబట్టి అధముడైన తక్షకుడి నెపంతో సర్పాలన్నీ అగ్నిలో పడేలా విప్రసమ్మతితో సర్పయాగం చేయి.)

1_1_124 ఉత్పలమాల విజయ్ కుమార్ - విజయ్

ఉత్పలమాల

కాదన కిట్టిపాటియపకారముఁ దక్షకుఁ డేకవిప్ర సం
బోధనఁ జేసి చేసె నృపపుంగవ నీవు ననేకభూసురా
పాదిత సర్పయాగమున భస్మము సేయుము తక్షకాదికా
కోదరసంహతిన్ హుతవహోగ్ర సమగ్రశిఖాచయంబులన్.(తక్షకుడు ఈ అపకారాన్ని (శృంగి అనే) ఒక విప్రుడి ప్రేరణ చేత చేశాడు. నీవు కూడా సర్పయాగంలో, తక్షకుడు మొదలైన సర్పాలను భస్మం చేయి.)

1_1_123 చంపకమాల ప్రవీణ్ - విజయ్

చంపకమాల

అనవరతార్థదానయజనాభిరతున్ భరతాన్వయాభివ
ర్ధను సకలప్రజాహితవిధాను ధనంజయసన్నిభున్ భవ
జ్జనకుఁ బరీక్షతున్ భుజగజాల్ముఁడసహ్యవిషోగ్రధూమకే
తనహతిఁజేసి చేసె నతిదాంతుఁ గృతాంతనికేతనాతిథిన్.(నీ తండ్రి అయిన పరీక్షితుడిని కూడా తక్షకుడు తన విషంతో సంహరించాడు.)

1_1_122 వచనము విజయ్ - సందీప్

వచనము

అదియునుం గాక.(అదీ గాక.)

1_1_121 చంపకమాల ప్రవీణ్ - విజయ్

చంపకమాల

మితహితసత్యవాక్య జనమేజయ భూజనవంద్య యేను సు
స్థితి గురుదేవకార్యములు సేయఁగఁబూను టెఱింగి వంచనో
న్నతమతియై యకారణమ నా కపకారము సేసిఁ దక్షకుం
డతి కుటిలస్వభావుఁడు పరాత్మవిశేషవివేకశూన్యుఁడై.
(జనమేజయా! నేను గురుకార్యం చేయయత్నించటం తెలుసుకుని కుటిలస్వభావం గల తక్షకుడు అకారణంగా నాకు అపకారం చేశాడు.)

-:ఉదంకుండు జనమేజయునకు సర్పయాగబుద్ధి గలిగించుట:-

1_1_120 వచనము ప్రవీణ్ - విజయ్

వచనము

నీవలనం బరమసం ప్రీతిహృదయుండ నయితి నీవును గుర్వర్థంబునందు ఋణ విముక్తుండవయితివి నిజేచ్ఛనుండు మనినఁదదనుజ్ఞ వడసి యుదంకుండనేకకాలంబు దపంబు సేసె నట్టి యుదంకుండు తక్షకు చేసిన యపకారంబునకుం బ్రతీకారంబు సేయం జింతించి యెక్కనాఁడు జనమేజయమహీపాలు పాలికిం బోయి యిట్లనియె.
(గురుకార్యం చేయటం వల్ల నువ్వు ఋణవిముక్తుడివి అయ్యావు, ఇక నీ ఇష్టం వచ్చినట్లు ఉండవచ్చు, అనగా ఉదంకుడు పైలుడి అనుమతితో చాలాకాలం తపస్సు చేశాడు. తరువాత ఒకరోజు ఉదంకుడు తనకు తక్షకుడు చేసిన అపకారానికి ప్రతీకారం చేయనాలోచించి మహారాజైన జనమేజయుడి వద్దకు వెళ్లి ఇలా అన్నాడు.)

1_1_119 కందము కృష్ణ - విజయ్

కందము

కర మిష్టము సేసితి మా
కరిసూదన దీన నీకు నగు సత్ఫలముల్
గురుకార్యనిరతులగు స
త్పురుషుల కగుటరుదె యధికపుణ్యఫలంబుల్(కుండలాలు తెచ్చి నాకు ఇష్టమైన పని చేశావు. గురుకార్యాల్లో ఆసక్తిగల సజ్జనులకు పుణ్యఫలాలు కలగటం అరుదేమీ కాదు కదా?)

1_1_118 సీసము + ఆటవెలది వంశీ - విజయ్

సీసము

అప్పురుషుం డింద్రుఁ డయ్యుక్ష మైరావ
        తంబు గోమయ మమృతంబు నాగ
భువనంబు లోఁగన్న పొలఁతు లిద్దఱు ధాత
        యును విధాతయు వారియనువయించు
సితకృష్ణతంతురాజితతంత్రమది యహో
        రాత్రంబు ద్వాదశారములు గలుగు
చక్రంబు మాసాత్మసంవత్సరంబు కు
        మారు లయ్యార్వురు మహితఋతువు

ఆటవెలది

లత్తురంగ మగ్ని యప్పురుషుండు ప
ర్జన్యుఁడింద్రసఖుఁడు సన్మునీంద్ర
యాది నింద్రుఁ గాంచి యమృతాశి వగుట నీ
కభిమతార్థసిద్ధి యయ్యె నయ్య.
(సన్మునీంద్రా! ఆ పురుషుడు ఇంద్రుడు. ఆ ఎద్దు ఐరావతం. గోమయం అమృతం. ఆ ఇద్దరు స్త్రీలు ధాత, విధాతలు. వారు నేసే తెల్లని, నల్లని దారాల మగ్గం దినరాత్రాలకు రూపం. పన్నెండు ఆకులు గల ఆ చక్రం సంవత్సరానికి రూపం. దానిని తిప్పుతున్న ఆరుగురు యువకులు ఋతువులకు రూపాలు. ఆ గుర్రం అగ్ని. దానిని ఎక్కినవాడు ఇంద్రుడి మిత్రుడైన పర్జన్యుడు (మేఘుడని కూడా చెప్పవచ్చు). నీకు అమృతం లభించటం చేత వాంఛితార్థసిద్ధి కలిగింది. కుండలాలు లభించాయి.)

1_1_117 వచనము విజయ్ - సందీప్

వచనము

అనిన నుదంకుం డిట్లనియె నయ్యా మీయానతిచ్చినట్ల మసల వలవదు తక్షకుండను
దుష్టోరగంబు సేసిన విఘ్నంబున నింత మసల వలసె మిమ్ము
వీడ్కొని చనువాఁడ నెదుర నొక్కమహోక్షంబు నెక్కి చనుదెంచు వాని
నొక్కదివ్య పురుషుం గని వాని పన్నిన వృషభగోమయ భక్షణంబు సేసి
చని పౌష్యుమహాదేవికుండలంబులు ప్రతిగ్రహించి వచ్చుచోఁ దక్షకుచేత
నపహృతకుండలుండనై వాని పిఱుందన పాతాళలోకంబునకు బోయి నాగపతులనెల్ల
స్తుతియించి యందు సితాసితతంతుసంతానపటంబు ననువయించుచున్నవారి
నిద్దఱస్త్రీలను, ద్వాదశారచక్రంబుఁ బరివర్తించుచున్నవారి
నార్వురఁ గుమారుల నతిప్రమాణతురగారూఢుడైన యొక్కదివ్యపురుషుం
గని తత్ప్రసాదంబునఁ గుండలంబులు వడసి తదాదేశంబున నత్తురంగంబు
నెక్కి వచ్చితి నిది యంతయు నేమి నాకెఱింగింపుఁ డనిన గురుం
డి ట్లనియె.
(అయ్యా! తక్షకుడనే సర్పరాజు కలిగించిన విఘ్నం వల్ల ఇంత ఆలస్యం అయింది. మీ దగ్గర వీడ్కోలు తీసుకుని వెడుతుండగా ఒక పెద్ద ఎద్దునెక్కి వస్తున్న దివ్యపురుషుడు కనిపించాడు. అతడు తినమన్న గోమయం తిని రాణి వద్ద కుండలాలు తీసుకుని వస్తుండగా తక్షకుడు వాటిని అపహరించాడు. నేను అతడి వెనుకనే నాగలోకానికి వెళ్లి అక్కడి రాజులను స్తుతించాను. అక్కడ తెల్లని, నల్లని దారాలతో వస్త్రాన్ని నేస్తున్న ఇద్దరు స్త్రీలను, పన్నెండాకులు గల చక్రాన్ని తిప్పుతున్న ఆరుగురు యువకులను, ఎత్తైన గుర్రాన్ని ఎక్కిన ఒక దివ్యపురుషుడిని చూశాను. అతడి అనుగ్రహం చేత కర్ణాభరణాలు తిరిగి పొంది, అతడు ఆజ్ఞాపించిన విధంగా ఆ గుర్రాన్ని ఎక్కివచ్చాను. ఇదంతా ఏమిటి? దీని అంతరార్థం నాకు తెలపండి" అని అడగ్గా పైలుడు ఇలా అన్నాడు.)