Sunday, August 28, 2005

1_1_117 వచనము విజయ్ - సందీప్

వచనము

అనిన నుదంకుం డిట్లనియె నయ్యా మీయానతిచ్చినట్ల మసల వలవదు తక్షకుండను
దుష్టోరగంబు సేసిన విఘ్నంబున నింత మసల వలసె మిమ్ము
వీడ్కొని చనువాఁడ నెదుర నొక్కమహోక్షంబు నెక్కి చనుదెంచు వాని
నొక్కదివ్య పురుషుం గని వాని పన్నిన వృషభగోమయ భక్షణంబు సేసి
చని పౌష్యుమహాదేవికుండలంబులు ప్రతిగ్రహించి వచ్చుచోఁ దక్షకుచేత
నపహృతకుండలుండనై వాని పిఱుందన పాతాళలోకంబునకు బోయి నాగపతులనెల్ల
స్తుతియించి యందు సితాసితతంతుసంతానపటంబు ననువయించుచున్నవారి
నిద్దఱస్త్రీలను, ద్వాదశారచక్రంబుఁ బరివర్తించుచున్నవారి
నార్వురఁ గుమారుల నతిప్రమాణతురగారూఢుడైన యొక్కదివ్యపురుషుం
గని తత్ప్రసాదంబునఁ గుండలంబులు వడసి తదాదేశంబున నత్తురంగంబు
నెక్కి వచ్చితి నిది యంతయు నేమి నాకెఱింగింపుఁ డనిన గురుం
డి ట్లనియె.
















(అయ్యా! తక్షకుడనే సర్పరాజు కలిగించిన విఘ్నం వల్ల ఇంత ఆలస్యం అయింది. మీ దగ్గర వీడ్కోలు తీసుకుని వెడుతుండగా ఒక పెద్ద ఎద్దునెక్కి వస్తున్న దివ్యపురుషుడు కనిపించాడు. అతడు తినమన్న గోమయం తిని రాణి వద్ద కుండలాలు తీసుకుని వస్తుండగా తక్షకుడు వాటిని అపహరించాడు. నేను అతడి వెనుకనే నాగలోకానికి వెళ్లి అక్కడి రాజులను స్తుతించాను. అక్కడ తెల్లని, నల్లని దారాలతో వస్త్రాన్ని నేస్తున్న ఇద్దరు స్త్రీలను, పన్నెండాకులు గల చక్రాన్ని తిప్పుతున్న ఆరుగురు యువకులను, ఎత్తైన గుర్రాన్ని ఎక్కిన ఒక దివ్యపురుషుడిని చూశాను. అతడి అనుగ్రహం చేత కర్ణాభరణాలు తిరిగి పొంది, అతడు ఆజ్ఞాపించిన విధంగా ఆ గుర్రాన్ని ఎక్కివచ్చాను. ఇదంతా ఏమిటి? దీని అంతరార్థం నాకు తెలపండి" అని అడగ్గా పైలుడు ఇలా అన్నాడు.)

No comments: