Sunday, June 10, 2007

2_1_35 కందము వోలం - వసంత

కందము

సారమతిఁజేసి మానస
శారీర రుజావళులకు సతతంబుఁ బ్రతీ
కారములు సేయుచుండుదె
యారఁగ వృద్ధోపసేన నౌషధసేవన్.

(మనోవ్యాధులకు, శారీరకవ్యాధులకు చికిత్స చేసుకొంటున్నావు కదా?)

2_1_34 కందము వోలం - వసంత

కందము

అనిశము సేవింతురె ని
న్ననఘా యష్టాంగమైన యాయుర్వేదం
బున దక్షు లైన వైద్యులు
ఘనముగ ననురక్తులై జగద్ధితబుద్ధిన్.

(ఆయుర్వేదంలో సమర్థులైన వైద్యులు నీకు సేవలు చేస్తున్నారా?)

2_1_33 కందము వోలం - వసంత

కందము

క్షితినాథ శాస్త్రదృష్టి
ప్రతిభను దివ్యాంతరిక్ష భౌమోత్పాత
ప్రతికారులగుచు సన్మా
నితులయి వర్తింతురయ్య నీదైవజ్ఞుల్.

(నీ జ్యోతిషులు ఉత్పాతాలు కనిపెట్టి వాటికి విరుగుడుగా శాంతిక్రియలు జరుపుతున్నారు కదా!)

2_1_32 చంపకమాల వోలం - వసంత

చంపకమాల

కడుఁ జనువాఁడు నై పురుషకారియ దక్షుఁడు నైనమంత్రి పెం
పడరఁగ రాజపుత్త్రుల మహాధనవంతులఁ జేసి వారితో
నొడఁబడి పక్ష మేర్పడఁగ నుండఁడుగా , ధన మెట్టి వారికిం
గడుకొని చేయకుండునె జగన్నుత గర్వము దుర్విమోహమున్.

(నీ మంత్రి ఇతరులతో కలిసి నీకు వ్యతిరేకవర్గం ఏర్పడేలా చేయటం లేదు కదా? ధనం ఎటువంటివారికైనా దురాశనూ, గర్వాన్నీ కలిగిస్తుంది.)

2_1_31 కందము వోలం - వసంత

కందము

నానావిధ రణవిజయ మ
హా నిపుణు లవార్యవీర్యు లనఁ దగువారిన్
సేనాధ్యక్షులఁ జేసి తె
నీ నమ్మిన వారి మాననీయుల హితులన్.

(నీ సేనాధ్యక్షులు నువ్వు నమ్మినవారే కదా.)

Saturday, June 02, 2007

2_1_30 కందము కిరణ్ - వసంత

కందము

జనవర ! నీయజ్ఞములం
దనవరతనియుక్తుఁ డయినయాజ్ఞికుఁడు ప్రయో
గనిపుణుఁ డై యేమఱ కుం
డునె నిజకృత్యముల నెప్పును సమబుద్ధిన్.

(నీ యాజ్ఞికుడు సమర్థుడేనా?)

2_1_29 కందము కిరణ్ - వసంత

కందము

ధీరుఁడు ధర్మాధర్మవి
శారదుఁడు బహుశ్రుతుండు సమచిత్తుఁడు వా
ణీరమణీశ్రితవదనస
రోరుహుఁ డనఁ జనునె నీ పురోహితుఁ డధిపా.

(నీ పురోహితుడు ధర్మం తెలిసినవాడేనా?)

2_1_28 కందము కిరణ్ - వసంత

కందము

రాజునకు విజయమూలము
రాజితమంత్రంబు సుస్థిరంబుగ దానిన్
రాజాన్వయ! రక్షింతె ధ
రాజనులకుఁ గర్ణగోచరము గాకుండన్.

(రాజుకు రహస్యమే విజయమూలం. రహస్యాలను జాగ్రత్తగా కాపాడుతున్నావా?)

2_1_27 కందము కిరణ్ - వసంత

కందము

అనఘుల శాస్త్రవిధిజ్ఞుల
ననురక్తులఁ బితృపితామహక్రమమున వ
చ్చినవిప్రుల మంత్రులఁ గా
నొనరించితె కార్యసంప్రయోగము పొంటెన్.

(శాస్త్రం తెలిసిన విప్రులను మంత్రులుగా నియమించావా?)

2_1_26 సీసము + ఆటవెలది కిరణ్ - వసంత

సీసము

మీవంశమున నరదేవోత్తముల దైన
సద్ధర్మమార్గంబు సలుపు దయ్య
ధర్మవిదుండవై ధర్మార్థకామంబు
లొండొంటి బాధింపకుండ నుచిత
కాలవిభక్తముల్ గా లీల సేవింతె
ధర్మువునంద చిత్తంబు నిలిపి
యిమ్ముల నపరరాత్రమ్ములం దెప్పుడుఁ
జింతింతె నిజబుద్ధిఁ జేయఁ దగిన

ఆటవెలది

రాజకృత్యములఁ దిరంబుగా నిఖిలని
యోగవృత్తులందు యోగ్యులయిన
వారిఁ గరము గారవమ్మునఁ బంచితె
నీవు వారి దయిన నేర్పెఱింగి.

(ధర్మార్థకామాల మధ్య కాలాన్ని సరిగా విభజిస్తున్నావా? రాజకార్యాలకు యోగ్యులైన వారిని నియమిస్తున్నావా?)

-:నారదుఁడు ధర్మరాజును రాజనీతి విషయములం గొన్నిటి నడుగుట:-

2_1_25 వచనము కిరణ్ - వసంత

వచనము

పర్వత పారిజాత రైవత సుముఖు లనుమహామునులతో నిట్లు వచ్చిన నారదమహామునికిం బ్రత్యుద్గతుం డయి ధర్మరాజు దమ్ములుం దానును నమస్కరించి తోడ్కొని తెచ్చి యున్నతాసనంబున నునిచి యడుగులు గడిగి యర్ఘ్య పాద్యాదివిధులం బూజించిన వారలకుశలం బడిగి నారదుండు రాజనీతివిషయంబుల నయ్యుధిష్ఠిరు నిట్లని యడిగె.

(నారదుడిని ధర్మరాజు పూజించాడు. అప్పుడు నారదుడు రాజనీతివిషయంలో ధర్మరాజును ఇలా అడిగాడు.)

2_1_24 కందము కిరణ్ - వసంత

కందము

తన పిఱుఁద ధర్మసంబో
ధనవాంఛను వచ్చు దేవతాఖచరమహా
మునివరులఁదపమార్గం
బునఁ గ్రమ్మఱఁ బంచె బ్రహ్మపుత్త్రుఁడు నెమ్మిన్.

(నారదుడు తన వెంట వచ్చే భక్తులను తపస్సు చేయమని పంపాడు.)

2_1_23 ఉత్పలమాల కిరణ్ - వసంత

ఉత్పలమాల

నీరజమిత్రుఁ డేల ధరణీగతుఁ డయ్యెడు నొక్కొ యంచు వి
స్మేరమనస్కులై జనులు మెచ్చి నిజద్యుతి చూచుచుండఁగా
నారదుఁ డేఁగుదెంచె గగనంబున నుండి సురేంద్రమందిర
స్ఫారవిలాసహాసి యగుపార్థుగృహంబునకుం బ్రియంబునన్.

(నారదుడు అర్జునుడి ఇంటికి వచ్చాడు.)

-:నారదుఁడు పాండవుల యొద్దకు వచ్చుట:-

2_1_22 వచనము కిరణ్ - వసంత

వచనము

అమ్మహామునులనెల్ల నతిభక్తిం బూజించి లబ్ధాశీర్వచనుం డై ధర్మతనయుండు వారలవలన ధర్మకథలు వినుచుఁ దమ్ములుం దానును సుఖంబుండునంత నొక్కనాఁడు.

(ధర్మరాజు వారిని పూజించి, వారు చెప్పే ధర్మకథలు వింటూ తమ్ములతో సుఖంగా ఉండగా ఒకరోజు.)

2_1_21 సీసము + ఆటవెలది కిరణ్ - వసంత

సీసము

సుబల మార్కండేయ శునక మౌంజా
యన మాండవ్య శాండిల్య మందపాల
బక దాల్భ్యరైభ్యక భాలుకి జతు
కర్ణ గౌతమ కౌశిక కణ్వ కుత్స
సావర్ణి పర్ణాద సత్య గోపతి
గోపవేష మైత్రేయ పవిత్రపాణి
ఘటజాను కాత్రేయ కఠ కలాప
సుమిత్ర హారీత తిత్తిరి యాజ్ఞవల్క్య

ఆటవెలది

వాయుభక్ష భార్గవ వ్యాస జైమిని
శుక సుమంతు పైల సువ్రతాదు
లయినమునులు నేము నరిగితి మెంతయు
రమ్యమయిన ధర్మరాజుసభకు.

(మునులందరూ ధర్మరాజు సభకు వచ్చారు.)

2_1_20 వచనము కిరణ్ - వసంత

వచనము

మఱియును.

(ఇంకా.)

2_1_19 మత్తేభవిక్రీడితము కిరణ్ - వసంత

మత్తేభవిక్రీడితము

మదమాతంగ తురంగ కాంచన లసన్మాణిక్య గాణిక్య సం
పద లోలిం గొని వచ్చి యిచ్చి ముద మొప్పం గాంచి సేవించి ర
య్యుదయాస్తాచలాసేతుశీతనగమధ్యోర్వీపతుల్ సంతతా
భ్యుదయున్ ధర్మజుఁ దత్సభాస్థితు జగత్పూర్ణప్రతాపోదయున్.

(సేతువు నుండి హిమాలయాల వరకూ ఉన్న రాజులందరూ వచ్చి ధర్మరాజుకు కానుకలు ఇచ్చారు.)

2_1_18 వచనము కిరణ్ - వసంత

వచనము

తదవసరంబున.

(అప్పుడు)

2_1_17 ఉత్పలమాల కిరణ్ - వసంత

ఉత్పలమాల

మంచిగ భూరిభూసురసమాజము నెల్లను భక్తితోడఁ బూ
జించి, యభీష్టదానములు సేసి ధనార్థులఁ దన్పి, దిక్కులన్
నించె యశంబు, బంధులకు నెయ్యురకున్ హృదయప్రియంబు గా
వించె, విభూతి యేర్పడఁ బవిత్రుఁడు ధర్మసుతుండు నెమ్మితోన్.

(ధర్మరాజు ఎన్నో దానాలు చేశాడు.)

2_1_16 వచనము కిరణ్ - వసంత

వచనము

అనుజసహితుం డయి దైవజ్ఞదత్తశుభముహూర్తంబున ధౌమ్యాదిభూసురాశీర్వాదపుణ్యాహనాదంబు లెసంగ సభాప్రవేశంబు నేసి యంత.

(ధర్మరాజు విప్రులు నిర్ణయించిన ముహూర్తాన తన తమ్ములతో సభాప్రవేశం చేశాడు.)

2_1_15 ఉత్పలమాల కిరణ్ - వసంత

ఉత్పలమాల

వీరుఁడు ధర్మజుండు పదివేవురు విప్రుల కొప్పఁ బాయసా
హారము భక్తిఁ బెట్టి మఱి యందఱకుం జెఱు వేయునేసి వి
స్తారయశుండు ధేనువుల ధర్మవిధిన్ మణిముద్రికాద్యలం
కారదుకూలపుష్పఫలగంధయుతంబుగ నిచ్చి లీలతోన్.

(ధర్మరాజు విప్రులకు భోజనం పెట్టి గోదానం చేశాడు.)