Saturday, August 27, 2005

1_1_93 వచనము విజయ్ - సందీప్

అయ్యుదంకుండు గురుహితకార్యధురంధరుం డయి గురుపత్నీనియోగంబునం
బౌష్యుండనురాజుదేవికుండలంబులం బ్రతిగ్రహించి తేరంబూని వనంబులో
నొక్కరుండ చనువాఁ డెదుర నొక్క మహోక్షంబు నెక్కి చనుదెంచు వాని
నొక దివ్యపురుషుం గని వాని పన్నిన వృషభగోమయ భక్షణంబు సేసి
యమ్మహాత్ము ననుగ్రహంబు వడసి యతిత్వరితగతిం జని పౌష్యమహారాజుం
గాంచి దీవించి గృహీతసత్కారుండై యిట్లనియె.









(ఆ ఉదంకుడు, గురుపత్ని కోరిక మేరకు, పౌష్యుడనే రాజు భార్య కర్ణాభరణాలు తేవటానికై, అడవిలో ఒక్కడే వెడుతుండగా ఒక పెద్ద ఎద్దునెక్కి వస్తున్న దివ్యపురుషుడిని చూసి, అతడు ఇచ్చిన గోమయం తిని, అతడి అనుగ్రహం పొంది, త్వరగా వెళ్లి పౌష్యమహారాజు వద్దకు చేరి, అతని సత్కారాన్ని స్వీకరించి ఇలా అన్నాడు.) (మూలంలో ఉదంకుడు గోమయభక్షణం చేయటానికి మొదట అంగీకరించలేదు. 'మీ గురువు కూడా ఈ గోమయభక్షణం చేసినవాడే', అని దివ్యపురుషుడు చెప్పి ఒప్పిస్తాడు.)

No comments: