Wednesday, April 12, 2006

1_5_185 సీసము + ఆటవెలది విజయ్ - విక్రమాదిత్య

సీసము

వినవయ్య గౌతముం డనఁ బ్రసిద్ధుం డైన
        మునికి శరద్వంతుఁ డను మహాత్ముఁ
డురుతరతేజుఁ డై శరసమూహంబుతో
        నుదయించి వేదముల్ చదువ నొల్ల
కతిఘోరతపమున నుతభూసురోత్తముల్
        వేదముల్ చదువన ట్లాదరమున
సర్వాస్త్రవిదుఁడు ధనుర్వేద మొప్పఁగఁ
        బడసి మహానిష్ఠఁ గడఁగి తపము

ఆటవెలది

సేయుచున్న దివిజనాయకుఁ డతిభీతి
నెఱిఁగి వానితపముఁ జెఱుపఁ బనిచె
జలజనయనఁ దరుణి జలపద యనియెడు
దాని నదియు వచ్చె వానికడకు.

(గౌతముడనే మునికి శరద్వంతుడు పుట్టి, ధనుర్వేదం నేర్చుకొని, తపస్సు చేస్తుండగా ఇంద్రుడు ఆ తపస్సును భగ్నం చేయటానికి జలపద అనే ఆమెను పంపించాడు.)

No comments: