Sunday, April 16, 2006

1_6_4 వచనము వసు - వసంత

వచనము

అనిన నట్ల చేయుదు నని ధృతరాష్ట్రుండు గుమారుల విద్యాసందర్శన రంగంబు రమ్యంబుగాఁ జేయింపు మని విదురుం బంచిన నతండును దాని శాస్త్రవిహిత ప్రమాణోపేత వృత్తాయామంబును నపాకృత వృక్ష గుల్మ వల్మీకంబును నంగీకృత పూర్వోత్తరప్లవంబును సమీకృత నిమ్నోన్నత ప్రదేశంబును దూరీకృత కంటక పాషాణ శల్య శకలంబును విరజీకృత రజోధూసర స్థలంబును విరచిత బహువిధ ప్రేక్షాగారాంచిత మణిమయమంచ ప్రపంచంబును నానాధ్వజ నవపల్లవ రంభాస్తంభమాలాలంకృత ద్వారతోరణంబును బ్రతిదిశ నిర్వర్తిత శాంతిక బలివిధానంబునుంగాఁ జేయించినం బంచాంగశుద్ధదినశుభముహూర్తంబున ధృతరాష్ట్రుండు గాంధారీపురస్కృత దేవీశతపరివృతుం డై వివిధభూషణ భూషితానేక విలాసీనీనివహంబుతోఁ జనుదెంచి విలంబిత కదంబక స్థూలముక్తాఫలదామ రమణీయం బై యాబద్ధ మరకత వజ్ర వైడూర్య పద్మరాగ ప్రవాళ ప్రభాప్రకర వ్యతికర విరచితాపూర్వ సురచాపచారుగౌరవం బై యతిమనోహరం బైన శాతకుంభమయ ప్రేక్షాగారంబున నున్న.

(ధృతరాష్ట్రుడు అందుకు అంగీకరించి విదురుడికి చెప్పి తగిన ఏర్పాట్లు చేయించాడు. ఆ ప్రదర్శన చూడటానికి నిర్మించిన ప్రత్యేకమైన ఇంటికి ధృతరాష్ట్రుడు తన భార్యలతో వచ్చాడు.)

No comments: