Tuesday, September 22, 2009

2_1_62 కందము ప్రకాష్ - వసంత

కందము

శతమఖు సభ శుభ రత్నాం
చిత కాంచన రచిత మతి విచిత్రము లోక
త్రితయాఖిల లక్ష్మీ సం
శ్రిత మలవియె దానిఁ బొగడ శేషున కయినన్.

(ఇంద్రసభ ఎంతో వైభవంగా ఉంటుంది. దానిని పొగడటం ఆదిశేషుడికి కూడా సాధ్యం కాదు!)

-:ఇంద్రసభావర్ణనము:-

2_1_61 వచనము ప్రకాష్ - వసంత

వచనము

అనిన విని 'యవి యెట్టివి? వాని వినవలతు నానతిం' డని లోకపాల సభావిభవ శ్రవణ ప్రభూత కుతూహల చేతస్కుండై యడిగిన ధర్మరాజునకు నారదుం డిట్లనియె.

(దిక్పాలకుల సభలు ఎలా ఉంటాయో చెప్పమని ధర్మరాజు కుతూహలంతో నారదుడిని అడిగాడు.)

Saturday, September 19, 2009

2_1_60 కందము వోలం - వసంత

కందము

సురపతి యమ వరుణ ధనే
శ్వర కమలాసనుల దివ్యసభలెల్ల నరే
శ్వర! చూచితి నవి దీనికి
సరిగా వత్యంతవిభవ సౌందర్యములన్.

(ఇంద్ర, యమ, వరుణ, కుబేర, బ్రహ్మదేవుల సభలన్నీ చూశాను. ఐశ్వర్యంలో, సౌందర్యంలో అవి దీనికి సరితూగవు.)

2_1_59 కందము వోలం - వసంత

కందము

భూనాథ! యిది యపూర్వ మ
మానుషము విచిత్ర రత్నమయ మిట్టి సభన్
మానవలోకేశ్వరులం
దే నెన్నఁడుఁ జూచి వినియి నెఱుఁగ ధరిత్రిన్.

(మహారాజా! ఈ సభ అపూర్వం, మానవాతీతం, విచిత్రరత్నమయం. మానవలోకం లోని రాజుల దగ్గర ఇలాంటి సభను నేను ఎప్పుడూ చూసి, విని ఎరుగను.)

2_1_58 వచనం వోలం - వసంత

వచనం

అని కృతాంజలి యయి 'మునీంద్రా! యీత్రిలోకంబులయందును మీ చూడనివి లేవెందే నిట్టి యపూర్వంబైన సభ చూచి యెఱుంగుదురే?' యని మయ నిర్మితం బయిన సభ చూపినం జూచి విస్మితుండయి నారదుండు ధర్మరాజున కి ట్లనియె.

(అని, "మునీంద్రా! ఈ మూడులోకాల్లో మీరు చూడనివి లేవు. ఎక్కడైనా ఇలాంటి అపూర్వమైన సభను చూశారా?", అని మయుడు నిర్మించిన ఆ సభను చూపించగా నారదుడు ఆశ్చర్యపోయి ధర్మరాజుతో ఇలా అన్నాడు.)

-:ఇట్టి సభ నెచ్చటనైనఁ జూచితిరా యని ధర్మజుఁడు నారదు నడుగుట:-

2_1_57 తేటగీతి వోలం - వసంత

తేటగీతి

నాయథాశక్తిఁ జేసి యన్యాయపథముఁ
బరిహరించి మహాత్ముల చరితలందు
బుద్ధి నిలిపి మీ యుపదేశమున శుభంబు
లయిన వాని ననుష్ఠింతుఁ బ్రియముతోడ.

(నాకు చేతనైనంతవరకు అన్యాయమార్గం వదిలి, మహాత్ముల చరితలపై బుద్ధినిలిపి మీ ఉపదేశం వల్ల మంచి పనులు ఆచరిస్తాను.)