Wednesday, July 04, 2007

2_1_40 కందము వోలం - వసంత

కందము

అనఘా నీ ప్రస్తవమున
నని నీల్గిన వీరభటుల యనుపోష్యుల నె
ల్లను బ్రోతె భుజనాచ్ఛా
దనముల వారలకు నెమ్మి దఱుఁగక యుండన్.

(నీ ఉద్యోగుల కుటుంబాలకు లోటు లేకుండా చూసుకొంటున్నావు కదా!)

2_1_39 కందము వోలం - వసంత

కందము

కులపుత్త్రు లైన సద్భృ
త్యులకును సత్కార మర్థితోఁ జేయుదె వా
రలు నీ ప్రస్తవమున ని
మ్ములఁ గృతము దలంచి ప్రాణములు విడుతు రనిన్.

(భృత్యులను సత్కరిస్తే వారు నీకోసం ప్రాణమిస్తారు.)

2_1_38 కందము వోలం - వసంత

కందము

తమతమ కనియెడు తఱి జీ
తము గానక నవయు భటుల దౌర్గత్యవిషా
దము లేలిన వాని కవ
శ్యము నెగ్గొనరించు నతఁడు శక్రుం డైనన్.

(జీతాలు అందనివారి కష్టాలు ఎంతటివారికైనా కీడు చేస్తాయి.)

2_1_37 ఉత్పలమాల వోలం - వసంత

ఉత్పలమాల

ఉత్తమమధ్యమాధమ నియోగ్యత బుద్ధి నెఱింగి వారి న
య్యుత్తమమధ్యమాధమని యోగములన్ నియమించితే నరేం
ద్రోత్తమ భృత్యకోటికి ననూనముగాఁ దగు జీవితంబు లా
యత్తము సేసి యిత్తె దయ నయ్యయి కాలము దప్పకుండఁగన్.

(ఉద్యోగులకు సకాలంలో జీతాలు ఇస్తున్నావు కదా.)

2_1_36 కందము వోలం - వసంత

కందము

ఉపధాశుద్ధులఁ బాప
వ్యవగతబుద్ధుల వినీతివర్తుల సములన్
సుపరీక్ష నియోగించితె
నిపుణుల నర్థార్జనాది నృపకార్యములన్.

(పన్నులు వసూలు చేయటానికి సమర్థులనే నియమించావు కదా?)