Sunday, December 18, 2005

1_4_116 వచనము వసు - వసంత

వచనము

అంత దౌష్యంతి సంతానవిచ్ఛేదంబుగా వచ్చిన సత్యవతీనియుక్తుండై సకలధర్మమూర్తి కృష్ణద్వైపాయనుండు దేవరన్యాయంబున నంబికయందు ధృతరాష్ట్రుని నంబాలికయందుఁ బాండురాజును నంబికాపరిచారికయందు విదురునిం బుట్టించిన నందు ధృతరాష్ట్రునకు గాంధారికి వ్యాసవర ప్రసాదంబున దుర్యోధనుం డాదిగా నూర్వురు గొడుకులు పుట్టిరి పాండురాజునియోగంబునఁ గుంతీమాద్రులకు ధర్మానిలశక్రాశ్వినులప్రసాదంబున ధర్మజభీమార్జుననకులసహదేవు లనంగా నేవురుగొడుకులు పుట్టి రయ్యేవురకుం బాంచాలి ధర్మపత్ని యయ్యె దానియందు ధర్మరాజునకుఁ బ్రతివింధ్యుండును భీమసేనునకు శ్రుతసోముండును నర్జునునకు శ్రుతకీర్తియు నకులునకు శతానీకుండును సహదేవునకు శ్రుతసేనుండును ననఁ బంచోపపాండవులు పుట్టిరి మఱి ధర్మరాజునకు స్వయంవరలబ్ధ యైన దేవిక యనుదానికి యౌధేయుండు పుట్టె భీమసేనునకు జరంధరకు సర్వగుండు పుట్టె నర్జునునకు సుభద్రకు నభిమన్యుండు పుట్టె నకులునకుఁ జైద్యయయిన కరేణుమతికి నిరమిత్రుండు పుట్టె సహదేవునకు స్వయంవరలబ్ధయైన విజయకు సుహోత్రుండు పుట్టె మఱియు భీమసేనునకు హిడింబకు ఘటోత్కచుండు పుట్టె నిప్పాటంబాండవపుత్త్రులైన పదునొక్కండ్రయందును వంశకరుండైన యభిమన్యునకు విరాటపుత్త్రి యయిన యుత్తరకుం బరీక్షితుండు పుట్టె.

(అప్పుడు భరతవంశ విచ్ఛేదం అయ్యే పరిస్థితి రాగా, సత్యవతి చెప్పటం చేత, వ్యాసుడు దేవరన్యాయంతో అంబికకు ధృతరాష్ట్రుడినీ, అంబాలికకు పాండురాజునూ, అంబిక చెలికత్తెకు విదురుడినీ అనుగ్రహించాడు. వారిలో ధృతరాష్ట్రుడికీ, గాంధారికీ వ్యాసుడి వరం వలన దుర్యోధనుడు మొదలైన వందమంది కొడుకులు పుట్టారు. కుంతీదేవికి యముడి వలన ధర్మరాజు, వాయువు వలన భీముడు, ఇంద్రుడి వలన అర్జునుడు పుట్టారు. మాద్రికి అశ్వినీదేవతల దయవలన నకులసహదేవులు జన్మించారు. ఈ అయిదుమందికీ పాంచాలి భార్య అయింది. వారి వలన ఆమెకు పంచపాండవులు జన్మించారు. అర్జునుడికీ సుభద్రకూ అభిమన్యుడు పుట్టాడు. భీముడికీ హిడింబకూ ఘటోత్కచుడు జన్మించాడు. ఇలా పాండవులకు పుట్టినవారిలో వంశాన్ని నిలిపినవాడు అభిమన్యుడు. అతడికీ విరాటరాజపుత్రి అయిన ఉత్తరకూ పరీక్షితుడు పుట్టాడు.)

No comments: