Sunday, July 30, 2006

1_6_154 ఆటవెలది విజయ్ - విక్రమాదిత్య

ఆటవెలది

ఇట్టిదేని మనకు నిం దుండఁగా నేల
యరిగి ముందు నున్నయంద యుండి
యెఱిఁగి దీనితోన యిప్పురోచనుఁ గాల్చి
పోద మనిన ధర్మపుత్త్రుఁ డనియె.

(అలా అయితే ఇక్కడ ఉండటమెందుకు? ఈ ఇంటితో పురోచనుడిని కూడా దహించి పోదాము - అని భీముడు అనగా ధర్మరాజు ఇలా అన్నాడు.)

Saturday, July 29, 2006

1_6_153 వచనము విజయ్ - విక్రమాదిత్య

వచనము

కావున మన మిందు విశ్వసించి యుండవలవ దవశ్యం బగ్నిభయం బగు ననిన విని భీముం డి ట్లనియె.

(తప్పక ఇక్కడ అగ్నిభయం కలుగుతుంది - అనగా భీముడు ఇలా అన్నాడు.)

1_6_152 కందము విజయ్ - విక్రమాదిత్య

కందము

దీని తెఱఁ గెఱిఁగినట్ల మ
హా నిపుణుఁడు విదురుఁ డురువిషాగ్నులవలనన్
మానుగ నేమఱకుం డని
తాను బ్రబోధించె నేకతమ ననుఁ బ్రీతిన్.

(ఈ ఇంటి విషయం తెలిసే మేధావి అయిన విదురుడు విషం, నిప్పు విషయాలలో జాగ్రత్తగా ఉండమని నన్ను హెచ్చరించాడు.)

1_6_151 కందము విజయ్ - విక్రమాదిత్య

కందము

ఈ గృహ కుడ్యంబులు లా
క్షా గర్భము లాజ్య తైల గంధులు మఱి శ
స్త్రాగార సమీపము మా
యాగృహ మగు నిది యవశ్య మాగ్నేయం బై.

(ఈ ఇంటి గోడల్లో లక్క ఉన్నది. ఇవి నేతివాసన, నూనెవాసన కలిగి ఉన్నాయి. అంతేగాక ఇది ఆయుధాలుండే చోటికి దగ్గరగా ఉంది. తప్పకుండా ఇది నిప్పు చేత తగులబడే మోసపుటిల్లు.)

1_6_150 వచనము పవన్ - వసంత

వచనము

పాండుకుమారులు ననేకభూసురాశీర్వాదనాదాభినందితు లై ఫాల్గునమాసంబున శుక్లపక్షమున నష్టమియు రోహిణినాడు వారణావతంబు సొచ్చి సర్వాలంకారసుందరం బయిన రాజమందిరంబున నున్న కొన్ని దినంబులకుం బురోచనుండు దనచేసిన చతుశ్శాల సకలజననయనాభిరామం బైన దానిం జూపినం జూచి పాండుసుతులు సంతసిల్లి పురోచనశిల్పాచార్యులం బూజించి పుణ్యాహరవపురస్సరంబుగా గృహప్రవేశంబు సేసి రంతం బరాభిప్రాయమాయోపాయప్రయోగవిదుం డైన ధర్మతనయుండు దానికృత్రిమరమణీయత నుపలక్షించి యల్లన భీమున కి ట్లనియె.

(పురోచనుడు పాండవులకు తాను నిర్మించిన చతుశ్శాలను చూపించాడు. అది చూసి ధర్మరాజు భీముడితో ఇలా అన్నాడు.)

1_6_149 సీసము + తేటగీతి పవన్ - వసంత

సీసము

వారణావతమున వా రెల్లఁ బాండవా
        గమనంబు విని సంతసమునఁ బెరిఁగి
కరమొప్పఁ గరిరథతురగబలాఢ్యు లై
        యెదురు వచ్చిరి మహాముదముతోడఁ
గలయంగ గృహములఁ గలువడములు గడు
        విలసిల్లె నంబరతలము గప్పి
మలయజమృగమదావిలసలిలంబుల
        నిమ్ముగా నార్ద్రీకృతమ్ము లయిన

తేటగీతి

యంగళుల నొప్పెఁ గర్పూరరంగవల్లు
లంగనలు గయిసేసి యుత్తుంగహర్మ్య
తలము లెక్కిరి తత్పురీవిలసనంబుఁ
జూచు పాండుకుమారులఁ జూచువేడ్క.

(పాండవుల రాక గురించి విని వారణావతం లోని ప్రజలు ఆనందించారు.)

-:పాండవులు జననీసహితంబుగా వారణావతంబుఁ జేరుట:-

1_6_148 వచనము పవన్ - వసంత

వచనము

కావున మీర లేమఱక విషాగ్నులవలన నప్రమత్తుల రై యెఱుక గలిగి యుండునది యని బుద్ధిగఱపి మఱియు దుర్యోధనుచేసెడు దుష్క్రియ లిమ్ముగా నెఱింగి వానికిం బ్రతీకారంబు సెప్పి పుత్తెంచెద ననియె నని చెప్పిన విని విదురుబుద్ధికిఁ దమవలని నెయ్యంబునకు సంతసిల్లుచు నిట్లు బాండవులుఁ గతిపయ ప్రయాణంబుల వారణావతంబున కరుగునంత.

(విషంవల్ల, అగ్నివల్ల కలిగే ప్రమాదాల విషయంలో జాగ్రత్తగా ఉండండి. దుర్యోధనుడు చేసే చెడు పనులు తెలుసుకొని మీకు చెప్పి పంపిస్తాను - అని విదురుడు చెప్పాడు అని ధర్మరాజు కుంతితో అన్నాడు. వారు వారణావతానికి చేరుకున్న తరువాత.)

1_6_147 ఆటవెలది పవన్ - వసంత

ఆటవెలది

ఎల్లకార్యగతులు నెఱుఁగుదు రయినను
నెఱుఁగఁ జెప్పవలయు నెఱిఁగినంత
పనియులేక మిమ్ముఁ బనిచిన కురుపతి
హితుఁడపోలె మీఁద నెగ్గు సేయు.

(ధృతరాష్ట్రుడు మీకు మేలు చేసేవాడిలా ఉండి తరువాత కీడు చేస్తాడు.)

1_6_146 వచనము పవన్ - వసంత

వచనము

అనిన నగుచు ధర్మతనయుండు విదురువచనంబుల యభిప్రాయంబులు దల్లి కి ట్లని చెప్పె.

(ధర్మరాజు ఇలా అన్నాడు.)

Sunday, July 23, 2006

1_6_145 తేటగీతి పవన్ - వసంత

తేటగీతి

విదురుఁ డేతెంచి యొరులకు వినియు నెఱుఁగఁ
గానియ ట్లుండఁ బలికి నిన్ గఱపె బుద్ధి
నట్ల చేయుదు నంటి నీ వతని మతము
సెప్పనగునేని యెఱుఁగంగఁ జెప్పు మయ్య.

(విదురుడు నీకు సలహా చెప్పాడు. నువ్వు కూడా అలాగే చేస్తానని అతడితో అన్నావు. చెప్పదగినదైతే అతడి అభిప్రాయం నాకు చెప్పు.)

1_6_144 వచనము పవన్ - వసంత

వచనము

తన పిఱుందన వచ్చువారిం బ్రియపూర్వకంబున నూరార్చి పితృవచనంబు సేయకునికి ధర్మ విరుద్ధంబు గావున వారణావతంబునకుం బోయివచ్చెద మని యందఱం గ్రమ్మఱించి చనుచున్న ధర్మనందను పిఱుంద నొక్కింతనేల యరిగి విదురుం డొరులు వినియును నెఱుంగరాని వచనంబుల బహుప్రకారవచనరచనావిశారదుం డైన యుధిష్ఠిరున కెల్ల కార్యంబులు గఱపి కొడుకులం గౌఁగిలించుకొని కుంతీదేవికి మ్రొక్కి పాండురాజుం దలంచి బాష్పపూరితనయనుం డై క్రమ్మఱిచనియె నిట కుంతియు ధర్మరాజు డాయ వచ్చి యిట్లనియె.

(వారిని ఓదార్చి వెడుతున్న ధర్మరాజు దగ్గరకు విదురుడు వెళ్లి, ఇతరులు విన్నా వారికి అర్థం కాని మాటలతో మాటనేర్పరి అయిన ధర్మరాజుకు వారణావతంలో చేయవలసిన పనులు బోధించి వెనుదిరిగాడు. తరువాత కుంతీదేవి ధర్మరాజుతో ఇలా అన్నది.)

1_6_143 సీసము + ఆటవెలది పవన్ - వసంత

సీసము

ఇప్పాండుపుత్త్రుల నేలకో ధృతరాష్ట్రుఁ
        డేకత మనుపంగ నిచ్చగించె
నిది యధర్మం బని యెఱిఁగి గాంగేయాదు
        లేల వారింపరో యెఱుఁగరొక్కొ
పితృపితామహులచే భృతపూర్వమై క్రమా
        గత మైన రాజ్యంబుఁ గరము నెమ్మిఁ
బాండుసుతజ్యేష్ఠు భరతకులశ్రేష్ఠు
        ధర్మజుఁ బూన్పక ధర్ము వుడిపి

ఆటవెలది

యేల వృద్ధరాజు లెడసేసిరో పార్థుఁ
డరుగు నెడక మనము నరిగి యతని
యున్నచోన ప్రీతి నుండుద మిం దుండ
నేల యనుచుఁ బౌరు లెల్లఁ దెరలి.

(ధృతరాష్ట్రుడు పాండవులను హస్తిన నుండి పంపుతున్నప్పుడు భీష్ముడు మొదలైన పెద్దలు ఎందుకు అడ్డగించలేదో? ధర్మరాజుకు రాజ్యాధికారం ఎందుకు దూరం చేశారో? మనం కూడా ధర్మరాజు వెళ్లే చోటికే వెళ్లి ఉందాం - అని బయలుదేరారు.)

1_6_142 వచనము పవన్ - వసంత

వచనము

అని పంచినం బురోచనుం డతి త్వరితగతి నరిగి దుర్యోధను కఱపిన రూపున వారణావతంబున లాక్షాగృహంబు రచియించుచుండె నిట యుధిష్ఠిరభీమార్జునయములుం గ్రమంబునం దొల్లి షోడశపంచదశచతుర్దశత్రయోదశవర్షజాతు లయి శతశృంగంబుననుండి హస్తిపురంబునకు వచ్చి యందుఁ గౌరవులం గలసి యస్త్రవిద్యలం గఱచుచుం బదమూడేం డ్లుండి యపుడు ధృతరాష్ట్రు నియోగంబున వారణావతం బునకు జననీసహితంబుగాఁ బోవ సమకట్టి మహాజవసత్త్వసమేతంబు లయిన హయంబులం బూనిన రథంబు లెక్కి ధనుర్ధరు లయి హస్తిపురంబు వెలువడు నపు డప్పురంబునం గల బ్రాహ్మణక్షత్త్రియప్రముఖానేక జనంబులు శోకసంతప్తహృదయు లయి.

(పురోచనుడు అలాగే వారణావతానికి వెళ్లి లక్క ఇల్లు నిర్మించసాగాడు. పాండవులు వారణావతానికి వెళ్లే సమయంలో హస్తినాపురం లోని ప్రజలు దుఃఖంతో.)

-:వారణావతప్రస్థానము - విదురోపదేశము:-

1_6_141 కందము పవన్ - వసంత

కందము

ఈ కార్య సిద్ధి యగుడును
నీ కతమున నఖిల ధారుణీ రాజ్యము నా
కేకాధిష్ఠిత మగు నిది
నీకును నిత్యోపభోగనిలయమ కాదే.

(ఇది సఫలమైతే నీవల్ల నాకు రాజ్యాధికారం వస్తుంది. అలా జరిగితే నువ్వు శాశ్వతసుఖాలు అనుభవించవచ్చు.)

Saturday, July 22, 2006

1_6_140 వచనము పవన్ - వసంత

వచనము

నాకుం బరమవిశ్వాసివి నీ వొక్కరుండవ యిది యనన్యవిషయం బయిన కార్యంబు కావున నీవ దీనిం జేయవలయు వాయుజవంబు లయిన వేసడంబులం బూనిన యరదం బెక్కి నేఁడ చని వారణావతంబున లాక్షాసర్జకరసమిశ్రం బై ఘృతతైలార్ద్రం బయిన మృత్తికాపుంజంబున నొక్క చతుశ్శాల విశాలంబుగా నాయుధశాల సమీపంబున మనోహరంబుగా నవిరళసుధాధవళితంబుగా నిర్మించి యందుఁ బాండవుల నునిచి వార లేమఱి నమ్మి కొండొకకాలం బుండ నిన్నొరు లెఱుంగకుండ నిమ్మయిన యవసరంబునం దద్గృహద్వారంబునందు ఘోరానలంబు దరికొలిపి పగఱ పంచత్వం బెఱింగి రమ్ము.

(కంచరగాడిదలు పూనిన రథం ఎక్కి, వారణావతం వెళ్లి, అక్కడ లక్క, మద్దిబంక కలిపిన నేతితో, నూనెతో తడిసిన మట్టితో ఒక భవంతిని కట్టి, సున్నం కొట్టి తెల్లగా నిర్మించి, అందులో పాండవులను ఉంచి, కొంతకాలం తరువాత ఆ ఇంటికి నిప్పుపెట్టి, వాళ్ల చావును తెలుసుకొని రా.)

1_6_139 తరలము పవన్ - వసంత

తరలము

అలఘుతేజుల వారణావతమన్పురంబునఁ బాండవే
యులఁ బ్రియంబున నుండఁబంచె గుణోన్నతుండు కురుప్రభుం
డలయ కిప్పుడ నీవు మున్ చని యందు వారికి నుండఁగా
నిలయముల్ రచియింపు నీదగునేర్పుఁ జూతము చెచ్చెరన్.


(నువ్వు పాండవులకు వారణావతంలో ఇళ్లు నిర్మించు.)

1_6_138 కందము పవన్ - వసంత

కందము

తనవగచినకార్యము దొర
కొనుటకు ధృతరాష్ట్రపుత్త్రకుఁడు పొంగి పురో
చనుఁ బిలిపించి రహస్యం
బున వానికిఁ గరమునెయ్యమున ని ట్లనియెన్.

(దుర్యోధనుడు సంతోషించి, పురోచనుడిని పిలిచి ఇలా అన్నాడు.)

Friday, July 21, 2006

1_6_137 వచనము పవన్ - వసంత

వచనము

పశుపతి నివాసం బయిన యప్పుణ్యస్థానంబునం బాండుహితంబుగా నగణ్య గో హిరణ్యాదిమహాదానంబుల బ్రాహ్మణసంతర్పణంబులు సేసి యందుఁ గొండొకకాలం బుండి వచ్చునది యని పంచిన వల్లె యని పాండవులు గాంధారీ ధృతరాష్ట్రులకు మ్రొక్కి వీడ్కొని దుర్యోధనాదుల నందఱం బ్రియపూర్వకంబుగ సంభావించి భీష్మద్రోణవిదురకృపాదులకు మ్రొక్కి యనేక వృద్ధ బ్రాహ్మణులకు నమస్కారంబు సేసి వారల వలన దీర్ఘాయురారోగ్యస్వస్తివచనంబులతోఁ బునర్దర్శనం బయ్యెడ మని దీవనలు సేకొనుచు జననీసహితంబుగా వారణావతంబునకు గమనోన్ముఖు లయినంత.

(శివుడి నివాసస్థానమైన ఆ స్థలంలో కొద్దికాలం ఉండి తిరిగిరండి - అని ఆజ్ఞాపించాడు. పాండవులు అంగీకరించారు. తరువాత.)

1_6_136 కందము పవన్ - వసంత

కందము

మీరును గుంతియు సహపరి
వారమహామాత్య భృత్యవర్గులరై నా
నారాజ్యలీలతోఁ జని
సారమతిం జేయుఁ డందు సతతోత్సవముల్.

(మీరు అక్కడికి వెళ్లి పండుగలు చేసుకోండి.)

Thursday, July 20, 2006

1_6_135 కందము పవన్ - వసంత

కందము

విదితంబుగఁ బుణ్యామర
నదీ సమీపమున వారణావత నగరం
బది సర్వసుఖాస్పద మని
వదలక వర్ణింతు రెల్లవారును దానిన్.

(గంగానది దగ్గర ఉన్న వారణావతాన్ని అందరూ ప్రశంసిస్తారు.)

1_6_134 ఉత్పలమాల పవన్ - వసంత

ఉత్పలమాల

పాండుకుమారులం బిలువఁబంచి సుహృన్నివహంబు నొద్ద న
ప్పాండుఁ దలంచి నిర్గళితబాష్పకరాళకపోలయుగ్ముఁ డై
పాండుమహీశుకంటె నతిభక్తుల మిమ్మొకఁ డేను బంచెదం
బాండుయశోర్థులార యిది పథ్యమ కాఁగఁ దలంపుఁ డాత్మలోన్.

(పాండవులను పిలిచి - మీకు నేను ఒక ఆజ్ఞ ఇస్తాను.)

1_6_133 వచనము పవన్ - వసంత

వచనము

అని పంచిన వారును వారణావతంబు ననవరతసురభికుసుమఫలభారనమ్రశాఖావిశాలతరువనరేఖాలంకృతం బనియును వనజలకేళీకందుకమృగయాదివివిధవిహారహారిప్రదేశాభిశోభితం బనియును నవసుధా ధౌతసౌధసుధాకరనికరప్రభాపటలప్రధ్వంసితాసితపక్షదోషం బనియును నిరస్తదోషానుషంగమంగళ మహారత్నరాజివిరాజితవిపులపణివీథీవిహసితాలకావిలాసం బనియును మనోరమానేకసుఖానుభోగ భోగిమహాభాగజనసమృద్ధం బనియును బుణ్యనదీప్రవాహశోభితం బనియును వర్ణించి యప్పురంబునంద పాండునందనుల జాతకౌతూహలచిత్తులం జేసి యున్నఁ గొండొకకాలంబునకు ధృతరాష్ట్రుండు దుర్యోధనదుష్టవచనప్రబోధితుం డయి యెక్కనాఁడు.

(అని ఆజ్ఞాపించగా, ఆ మంత్రులు అలాగే చేశారు. తరువాత ధృతరాష్ట్రుడు.)

1_6_132 కందము పవన్ - వసంత

కందము

వలను గల మంత్రివరులం
బిలిచి పృథానందనులకుఁ బ్రియముగ మీ రి
మ్ముల వారణావతంబును
వెలయఁగఁ బొగడుండు వారు విని తగుల నెడన్.

(మంత్రులను పిలిచి - పాండవులు వినేలా మీరు వారణావతాన్ని పొగడండి.)

1_6_131 వచనము పవన్ - వసంత

వచనము

భవదనుజ్ఞాగౌరవంబున గాంగేయాదులు దీనికి నొడంబడుదురు వారు కౌరవులకెల్ల సము లై యుండియు నావారల యెట్లనిన నశ్వత్థామ నా కిష్టుం డగుట నన్నుఁ బాయకుండు పుత్త్రస్నేహంబున ద్రోణుండును భారద్వాజునిభాగినేయునిం బాయనేరమింజేసి కృపాచార్యుండును నాయొద్దన యుందురు మఱి భీష్ముండు బాయనేరమింజేసి కృపాచార్యుండును నాయొద్దన యుందురు మఱి భీష్ముండు మధ్యస్థుం డగుటఁ బాండవులం బరిగ్రహింపఁడు విదురుండు పాండవపక్షపాతి యయ్యును నొక్కరుండు నా కహితంబు సేయనోపండు గావున నిక్కార్యంబున దోషంబు లేదు వినిద్రకరణం బయిన నాహృదయశల్యంబు బాచి న న్నుద్ధరింపు మని ధృతరాష్ట్రు నెట్టకేలకు నొడంబఱిచి దుర్యోధనుం డప్పుడు.

(వాళ్లు దీనికి ఒప్పుకుంటారు. ఈ కార్యక్రమంలో ఏ లోపమూ లేదు - అని ఒప్పించి.)

Sunday, July 16, 2006

1_6_130 తరువోజ పవన్ - వసంత

తరువోజ

ఏ నెల్లప్రొద్దు నా యెడ లోనఁ దలఁతు నీయభిప్రాయంబ యిది దారుణంబు
గాన వాకునకుఁ జుల్కన తేరనోపఁ గడఁగి పాండవుల నేకత మెట్టు లనుప
గా నగు మఱి దీని గాంగేయవిదురకలశజాశ్వత్థామ గౌతముల్ బుద్ధి
గా నొడంబడుదురె కాదయ్య యనినఁ గౌరవజ్యేష్ఠుండు ఘనుఁ డిట్టు లనియె.

(నాకు కూడా ఈ అభిప్రాయమే ఉంది. కానీ, ఇందుకు పెద్దలు అంగీకరించటం సాధ్యం కాదు - అని ధృతరాష్ట్రుడు అనగా దుర్యోధనుడు ఇలా అన్నాడు.)

1_6_129 వచనము పవన్ - వసంత

వచనము

ఈరాజ్యంబు మొదలింటంగోలె భవదీయం బయినది ప్రకృతిజనులు వశ్యులు గాకున్నను గ్రమాగతంబయి మాకు నప్రయత్నలభ్యంబగుఁ దొల్లి పాండురాజు రా జై గుణంబులం బ్రజానురాగంబు వడయుటం జేసి యెల్ల వారును ధర్మరాజురాజ్యంబ వలతురు దాని నెఱింగియ కాదె యేను నిత్యదాన సమ్మానంబులం బ్రకృతిజనంబులకు సంతోషంబు సేయుచునుండుదు నిందుల దుష్టజనులపక్షపాతవచనంబు లుడుగునంతకు నుపాయంబునఁ గొంతినిఁ బాండవులను దదీయభృత్యామాత్యవర్గంబుతో వారణావతంబునకుం బుత్తము మనకు రాజ్యంబు సుప్రతిష్ఠితం బైన మఱి వార లిందులకు వత్తు రనిన దుర్యోధనునకు ధృతరాష్ట్రుం డిట్లనియె.

(ఇక్కడి చెడ్డవాళ్ల పక్షపాతపు మాటలు ఆగిపోయేవరకూ పాండవులను వారణావతం పంపుదాము. మన రాజ్యాధికారం స్థిరపడిన తరువాత వాళ్లు ఇక్కడికి వస్తారు - అని దుర్యోధనుడు అనగా ధృతరాష్ట్రుడు ఇలా అన్నాడు.)

1_6_128 సీసము + ఆటవెలది పవన్ - వసంత

సీసము

పైతృకం బగు లక్ష్మి పాండుభూపతి మున్ను
తాల్చుటఁజేసి తత్తనయుఁ డైన
ధర్మజుఁ డిప్పుడు దాల్చిన నాతని
తనయుండు మఱి దానిఁ దాల్చు మీఁద
నిప్పాటఁ బాండువంశేశుల వసుమతీ
రాజ్యార్హులగుదురు రాజ్యమునకుఁ
బరువడి మే మింతఁ బాసిన మాపుత్త్ర
పౌత్త్రవర్గంబునుఁ బాయు నింక

ఆటవెలది

నొరులఁ గొలిచి కుడువనోప మే మట్లుగా
కుండ మమ్ముఁ జేయనోపుదేని
పాండురాజు తొంటిభక్తియు నప్పాండు
తనయులందు దయయుఁ దలపకుండు.

(పాండవుల వంశం రాజ్యార్హం అయితే మా కొడుకులు, మనుమలు రాజ్యాధికారానికి దూరమవుతారు. అలా మేము జీవించలేము. పాండురాజు నీ మీద చూపిన భక్తిని, పాండవుల మీద నీకున్న దయను మనస్సులో నిలుపవద్దు.)

1_6_127 వచనము పవన్ - వసంత

వచనము

మఱియు వానికంటె గుణంబుల మిక్కిలి యయి జనంబులకు ననురక్తు లై పరగుచున్న పాండురాజు కుమారుల నెవ్విధంబునఁ బాపనేర్తు నని దుఃఖించిన ధృతరాష్ట్రునకు దుర్యోధనుం డి ట్లనియె.

(ఆ పాండురాజు కంటే అధికులైన పాండవులను ఎలా తొలగించగలను? - అని ధృతరాష్ట్రుడు బాధపడగా దుర్యోధనుడు ఇలా అన్నాడు.)

1_6_126 కందము పవన్ - వసంత

కందము

పరచక్రపతులచే భీ
కరుఁ డై ధనరాసు లదిమి కప్పము గొని చె
చ్చెరఁ దెచ్చియిచ్చి నన్నును
భరతకులశ్రేష్ఠుఁ డునిచె బహుయజ్ఞములన్.

(పాండురాజు శత్రువులను ఓడించి, కప్పాలు తెచ్చి, నా చేత చాలా యజ్ఞాలు చేయించాడు.)

Thursday, July 06, 2006

1_6_125 ఉత్పలమాల పవన్ - వసంత

ఉత్పలమాల

లోకనుతుండు పాండుఁ డమలుండు మహాగుణరత్నపూర్ణర
త్నాకరుఁ డత్యుదారమతి నంధుఁడ నైనను నన్ను రాజుగాఁ
జేకొని నాకు భక్తిఁ బనిసేయుచు సర్వజగజ్జిగీషుఁ డై
యీకురువంశరాజ్యభర మింతయుఁ దాల్చె బరాక్రమంబునన్.

(పాండురాజు గుడ్డివాడినైన నన్ను రాజుగా స్వీకరించి రాజ్యభారం వహించాడు.)

1_6_124 వచనము పవన్ - వసంత

వచనము

రాజయ్యెడువాఁడు తన రాజ్యభారంబు దాన చూచి యరయవలయు నేను షడంగసహితంబుగా వేదాధ్యయనంబు సేసియు నర్థశాస్త్రంబునందుఁ గృతనిశ్చయుండ నయి బలంబు గలిగియు నంగవైకల్యంబునం బరచక్రంబులకుం బ్రతివ్యూహంబులు రచియింప నేరమింజేసి రాజ్యంబునకుఁ దగకున్న.

(నేను వేదాలు చదివి నీతిశాస్త్రం నేర్చుకున్నా, అంధుడిని అవటం చేత యుద్ధాల్లో వ్యూహాలు కూర్చలేక, రాజ్యపాలనకు తగినవాడిని కాకపోవటం చేత.)

1_6_123 చంపకమాల పవన్ - వసంత

చంపకమాల

జనపతి యైనవానికిఁ బ్రచండమహాతుములాహవాంతరం
బున మృతిఁబొందియెండె మఱి పుత్త్రులపైఁ దనరాజ్యభార మె
ల్లను నియమించి యేఁగి గిరులం దప మొప్పఁగఁ జేసి యెండెఁ గా
కనిమిషలోకభోగసుఖ మందఁగఁ బోలునె శాశ్వతంబుగన్.

(రాజు యుద్ధంలో మరణించి కానీ, రాజ్యభారం కొడుకులకు అప్పగించి తపస్సు చేసి కానీ స్వర్గాన్ని పొందగలడే కానీ వేరే విధంగా పొందగలడా?)

1_6_122 వచనము పవన్ - వసంత

వచనము

దాననచేసి పౌర జానపద బ్రాహ్మణ ప్రధాన వరులు ధర్మజున కనురక్తు లయి నిన్నును భీష్ముని నాదరింపక ప్రజ్ఞాచక్షుండు రాజ్యరక్షణంబు సేయ సమర్థుండు గాఁడు భీష్ముండు సమర్థుం డయ్యును ముందఱ రాజ్యభార నివర్తనంబునందుఁ గృతప్రతిజ్ఞుం డయ్యెం గావునఁ బాండవజ్యేష్ఠుం డైన యుధిష్ఠిరునకు రాజ్యాభిషేకంబు సేయుద మతండు తరుణుండయ్యును గుణవృద్ధుండు ధర్మశీలుండు పరాక్రమవంతు లైన తమ్ములుగలవాడు రాజ్యప్రతిష్ఠితుం డయ్యెనేని వృద్ధులనమాత్యులబంధుమిత్రులను దొల్లింటికంటె మిక్కిలిగాఁ బూజార్హుల నెల్లం బూజించుఁ బితామహుండైన భీష్ముని సపుత్త్రకుండైన ధృతరాష్ట్రుని నతిభక్తి నభీష్టభోగానుభవపరులంగా సుఖంబున నునుచు దీనికి విదురుండును నొడంబడునని యెప్పుడుఁ దమలో విచారింతు రని వింటిఁ గర్ణశూలాయమానంబు లైన మూర్ఖప్రకృతుల పలుకులు విననోపఁ బాండవుల నిప్పురంబు వలనఁ బాయునట్లుగాఁ జేయవలయు నేమి సేయుదు ననినఁ గొడుకునకు ధృతరాష్ట్రుం డి ట్లనియె.

(ప్రజలు ధర్మరాజు రాజు అవుతాడని ప్రజలు అనుకొంటున్నారు. ఆ మాటలు నేను వినలేను. పాండవులు హస్తినాపురం విడిచివెళ్లేలా చేయండి - అన్నాడు. ధృతరాష్ట్రుడు ఇలా అన్నాడు.)

1_6_121 తేటగీతి పవన్ - వసంత

తేటగీతి

వీరు లని పాండుసుతులకు వెఱతు నేను
వెఱచుటకుఁ దోడుగా నిప్డు విభుఁడ వీవు
పాండవజ్యేష్ఠునకుఁ బ్రీతిఁ బరమయౌవ
రాజ్య మిచ్చితి కురువృద్ధరాజులొద్ద.

(పాండవులు వీరులని నేను భయపడుతున్నాను. అందుకు తగ్గట్లే నువ్వు ధర్మరాజును యువరాజును చేశావు.)

-:-:దుర్యోధనుఁడు తండ్రితోఁ దన మనోదుఃఖంబుఁ దెలుపుట:-:-