Sunday, December 25, 2005

1_4_127 కందము విజయ్ - విక్రమాదిత్య

కందము

ద్యుతి దఱిఁగి నిజనియోగ
చ్యుతిఁ బొందను మీకు నొండుచోటికి నరుగం
గత మేమి యనిన విని య
య్యతివకు సురనదికి నిట్టు లని రవ్వసువుల్.

(మీరు స్వర్గం నుండి పతనం చెందటానికి కారణం ఏమిటని వారిని అడిగింది.)

1_4_126 కందము విజయ్ - విక్రమాదిత్య

కందము

అనిమిషలోకవియోగం
బున దుఃఖితు లయి వసిష్ఠమునివరుశాపం
బున వచ్చువారి వసువుల
నెనమండ్రం గాంచి గంగ యెంతయుఁ బ్రీతిన్.

(వశిష్ఠుని శాపం వల్ల స్వర్గలోకం విడిచి బాధపడుతున్న ఎనిమిదిమంది వసువులను గంగ ఆప్యాయంగా చూసి.)

Wednesday, December 21, 2005

1_4_125 వచనము విజయ్ - విక్రమాదిత్య

వచనము

మర్త్యలోకంబున రాజర్షివరులలోనఁ బుణ్యచరిత్రుండు ప్రతీపుండు కావున వానికిఁ బుత్త్రుండనై జన్మించెద నొరులయందు జనింప నోపనని కమలభవుననుమతంబు వడసె గంగయు నమ్మహాభిషుని మహానుభావంబును రూపసౌందర్యంబులును దనయందుల యభిలాషయు నెఱింగి తానును మనోజబాణబాధిత యయి వానిన తలంచుచు మర్త్యలోకమునకు వచ్చునది యెదుర.

(భూలోకంలోని రాజర్షులలో గొప్పవాడైన ప్రతీపుడికి మాత్రమే పుత్రుడిగా జన్మిస్తాను అని కోరి బ్రహ్మదేవుడి సమ్మతి పొందాడు. గంగకూడా మహాభిషుడిని ఇష్టపడి అతడి గురించే ఆలోచిస్తూ భూలోకానికి వచ్చింది. అప్పుడు ఎదురుగా.)

1_4_124 ఆటవెలది విజయ్ - విక్రమాదిత్య

ఆటవెలది

దాని నెఱిఁగి కమలయోని వానికిఁ గర
మల్గి మర్త్యయోనియందుఁ బుట్టు
మనుచు శాప మిచ్చె నొనరంగ వాఁడును
గరముభీతిఁ గరయుగంబు మొగిచి.

(బ్రహ్మ కోపంతో, మానవస్త్రీకి పుట్టమని మహాభిషుడిని శపించాడు. మహాభిషుడు భయపడి, బ్రహ్మకు నమస్కరించి.)

1_4_123 తేటగీతి విజయ్ - విక్రమాదిత్య

తేటగీతి

ఊరుమూల మేర్పడఁగ నయ్యువిదవలువు
దొలఁగె ననిలంబుచేత విధూతమగుచు
నమరు లెల్లఁ బరాఙ్ముఖు లైరి
సాభిలాషుఁడై చూచె మహాభిషుండు.

(గాలివల్ల ఆమె చీర తొలగిపోగా దేవతలంతా ఆమెను చూడకుండా ముఖాలు పక్కకు తిప్పుకున్నారు. మహాభిషుడు మాత్రం ఆసక్తితో చూశాడు.)

1_4_122 వచనము విజయ్ - విక్రమాదిత్య

వచనము

మఱి పాండవధార్తరాష్ట్రసంభవంబును సవిస్తరంబుగా వినవలతుం జెప్పుమనిన వానికి వైశంపాయనుం డిట్లని చెప్పెఁ దొల్లి యిక్ష్వాకువంశంబున మహాభిషుం డనువాఁడు పుట్టి మహాధర్మశీలుం డైన యశ్వమేధసహస్రంబున రాజసూయశతంబునుం జేసి యింద్రాదిదేవతలం దనిపి దేవలోకంబునకుం జని యందు దేవర్షి గణంబులతోఁ బితామహుం గొల్చుచున్న యవసరంబున గంగానది దివ్యస్త్రీరూపధారిణి యయి బ్రహ్మసభకు వచ్చిన.

(ఇంకా పాండవుల, ధృతరాష్ట్రపుత్రుల పుట్టుక కూడా చెప్పమని అడిగాడు. వైశంపాయనుడు ఇలా చెప్పాడు - పూర్వం ఇక్ష్వాకువంశంలో మహాభిషుడు అనేవాడు పుట్టి చాలా యాగాలు చేసి, దేవతలకు తృప్తి కలిగించి, స్వర్గానికి వెళ్లి, మునిగణాలతో కలిసి బ్రహ్మను సేవిస్తున్న సమయంలో గంగానది దివ్యస్త్రీరూపం ధరించి అక్కడికి వచ్చింది.)

Sunday, December 18, 2005

-:గంగా వసువుల సమయము:-

1_4_121 కందము విజయ్ - విక్రమాదిత్య

కందము

నరవరుఁ డగు శంతనున క
మరనదికిని నెట్లు సంగమం బయ్యె మహా
పురుషుండు భీష్ముఁ డె ట్ల
య్యిరువురకును బుట్టె దీని నెఱిఁగింపు మొగిన్.

(శంతనుడికీ గంగకూ పొత్తు ఎలా కలిగింది? వారికి భీష్ముడు ఎలా పుట్టాడు?)

1_4_120 వచనము వసు - వసంత

వచనము

అనిన విని జనమేజయుండు వైశంపాయనున కిట్లని యె.

(అప్పుడు జనమేజయుడు వైశంపాయనుడితో ఇలా అన్నాడు.)

1_4_119 కందము వసు - వసంత

కందము

వీ రైలులుఁ బౌరవులును
భారతులును గౌరవులును బాండవులు ననన్‌
వీరులయి పరగి రిది నయ
పారగ భవదీయవంశపరిపాటి మహిన్‌.

(వీరు ఐలులనీ, పౌరవులనీ, భారతులనీ, కౌరవులనీ, పాండవులనీ ప్రసిద్ధికెక్కారు. ఇది నీ వంశక్రమం.)

1_4_118 వచనము వసు - వసంత

వచనము

మఱియు నీకును వపుష్టమకును శతానీకశంకుకర్ణులు పుట్టి రందు శతానీకునకు వైదేహి నశ్వమేధధత్తుండు పుట్టె.

(నీకూ వపుష్టమకూ శతానీకుడు, శంకుకర్ణుడు పుట్టగా, వారిలో శతానీకుడికీ విదేహరాజపుత్రికీ అశ్వమేధదత్తుడు పుట్టాడు.)

1_4_117 కందము వసు - వసంత

కందము

అతనికి ననంతపుణ్యా
న్విత యనఁదగు మాద్రవతికి నీ వఖిలజగ
న్నుత జనమేజయ పుట్టితి
ధృతిఁ బాండవవంశమునకుఁ దేజం బెసఁగన్‌.

(జనమేజయ మహారాజా! నీవు పరీక్షితుడికీ మాద్రవతికీ పుట్టావు.)

1_4_116 వచనము వసు - వసంత

వచనము

అంత దౌష్యంతి సంతానవిచ్ఛేదంబుగా వచ్చిన సత్యవతీనియుక్తుండై సకలధర్మమూర్తి కృష్ణద్వైపాయనుండు దేవరన్యాయంబున నంబికయందు ధృతరాష్ట్రుని నంబాలికయందుఁ బాండురాజును నంబికాపరిచారికయందు విదురునిం బుట్టించిన నందు ధృతరాష్ట్రునకు గాంధారికి వ్యాసవర ప్రసాదంబున దుర్యోధనుం డాదిగా నూర్వురు గొడుకులు పుట్టిరి పాండురాజునియోగంబునఁ గుంతీమాద్రులకు ధర్మానిలశక్రాశ్వినులప్రసాదంబున ధర్మజభీమార్జుననకులసహదేవు లనంగా నేవురుగొడుకులు పుట్టి రయ్యేవురకుం బాంచాలి ధర్మపత్ని యయ్యె దానియందు ధర్మరాజునకుఁ బ్రతివింధ్యుండును భీమసేనునకు శ్రుతసోముండును నర్జునునకు శ్రుతకీర్తియు నకులునకు శతానీకుండును సహదేవునకు శ్రుతసేనుండును ననఁ బంచోపపాండవులు పుట్టిరి మఱి ధర్మరాజునకు స్వయంవరలబ్ధ యైన దేవిక యనుదానికి యౌధేయుండు పుట్టె భీమసేనునకు జరంధరకు సర్వగుండు పుట్టె నర్జునునకు సుభద్రకు నభిమన్యుండు పుట్టె నకులునకుఁ జైద్యయయిన కరేణుమతికి నిరమిత్రుండు పుట్టె సహదేవునకు స్వయంవరలబ్ధయైన విజయకు సుహోత్రుండు పుట్టె మఱియు భీమసేనునకు హిడింబకు ఘటోత్కచుండు పుట్టె నిప్పాటంబాండవపుత్త్రులైన పదునొక్కండ్రయందును వంశకరుండైన యభిమన్యునకు విరాటపుత్త్రి యయిన యుత్తరకుం బరీక్షితుండు పుట్టె.

(అప్పుడు భరతవంశ విచ్ఛేదం అయ్యే పరిస్థితి రాగా, సత్యవతి చెప్పటం చేత, వ్యాసుడు దేవరన్యాయంతో అంబికకు ధృతరాష్ట్రుడినీ, అంబాలికకు పాండురాజునూ, అంబిక చెలికత్తెకు విదురుడినీ అనుగ్రహించాడు. వారిలో ధృతరాష్ట్రుడికీ, గాంధారికీ వ్యాసుడి వరం వలన దుర్యోధనుడు మొదలైన వందమంది కొడుకులు పుట్టారు. కుంతీదేవికి యముడి వలన ధర్మరాజు, వాయువు వలన భీముడు, ఇంద్రుడి వలన అర్జునుడు పుట్టారు. మాద్రికి అశ్వినీదేవతల దయవలన నకులసహదేవులు జన్మించారు. ఈ అయిదుమందికీ పాంచాలి భార్య అయింది. వారి వలన ఆమెకు పంచపాండవులు జన్మించారు. అర్జునుడికీ సుభద్రకూ అభిమన్యుడు పుట్టాడు. భీముడికీ హిడింబకూ ఘటోత్కచుడు జన్మించాడు. ఇలా పాండవులకు పుట్టినవారిలో వంశాన్ని నిలిపినవాడు అభిమన్యుడు. అతడికీ విరాటరాజపుత్రి అయిన ఉత్తరకూ పరీక్షితుడు పుట్టాడు.)

Thursday, December 15, 2005

1_4_115 చంపకమాల వసు - వసంత

చంపకమాల

అతిశయరూపయౌవనగుణాధికసుండర మైన యాసతీ
ద్వితయమునందు సంతతరతిన్‌ వివశుం డయి రాజకృత్యముల్‌
మతి నొకనాఁడుఁ జేయ కహినద్యుతితేజుఁడు రాజయక్ష్మబా
ధితుఁ డయి దేవలోకసుదతీప్రియుఁ డయ్యె విచిత్రవీర్యుఁడున్‌.

(విచిత్రవీర్యుడు భార్యావివశుడై రాజవిధులను పట్టించుకోకుండా క్షయరోగంతో చనిపోయాడు.)

1_4_114 వచనము వసు - వసంత

వచనము

వానిపేరం గురుక్షేత్రంబునాఁ బరగె నట్టి కురునకు దాశార్హియైన శుభాంగికిని విదూరథుండు పుట్టె వానికి మాగధి యైన యమృతకుం బరీక్షితుండు పుట్టె వానికి బహుదానసుత యయిన సుయశకు భీమసేనుండు పుట్టె వానికిం గైకేయి యయిన కుమారికిఁ బ్రదీపుఁడు (బర్యశ్రవసుండు) పుట్టెఁ వానికిఁ బ్రతీపుండు పుట్టెఁ బ్రతీపునకు శిబిపుత్రి యయిన సునందకు దేవాపి శంతను బాహ్లికు లనఁగా మువ్వురు పుట్టి రందు దేవాపి బాల్యంబునంద తపోవనంబున కరగిన శంతనుండు రాజయ్యె వానికి గంగాదేవికి దేవవ్రతుండైన భీష్ముండు పుట్టె మఱియు శంతనునకు యోజనగంధియైన సత్యవతికిం జిత్రాంగదవిచిత్రవీర్యులనంగా నిద్దఱు గొడుకులు పుట్టి రందుఁ జిత్రాంగదుండు బాల్యంబున గంధర్వనిహతుం డయిన వానికం గొండుకవాని విచిత్రవీర్యు రాజ్యాభిషిక్తుం జేసి భీష్ముండు కాశీరాజ దుహితల నంబికాంబాలిక లనువారి నిద్దఱ విచిత్రవీర్యునకు వివాహంబు సేసిన.

(అతడి పేరుమీద కురుక్షేత్రం ప్రసిద్ధికెక్కింది. అతడి వంశంలో శంతనుడు జన్మించాడు. శంతనుడికీ గంగాదేవికీ భీష్ముడు పుట్టాడు. అంతేకాక, శంతనుడికీ యోజనగంధి అయిన సత్యవతికీ చిత్రాంగదుడు, విచిత్రవీర్యుడు పుట్టారు. చిత్రాంగదుడు చిన్నతనంలోనే చనిపోవడం వల్ల భీష్ముడు విచిత్రవీర్యుడికి రాజ్యాభిషేకం చేసి కాశీరాజు కుమార్తెలైన అంబిక, అంబాలిక అనేవారిని అతడికి వివాహం చేశాడు.)

1_4_113 కందము వసు - వసంత

కందము

అనఘుడు పౌరవకులవ
ర్ధనుఁ డద్దిననాథతనయఁ దపతి వివాహం
బొనరఁగ నయ్యె నిరువుర
కును వంశకరుండు పుట్టెఁ గురుఁ డున్నతుఁ డై.

(సూర్యుడి కుమార్తె అయిన తపతిని వివాహమాడాడు. వారికి వంశకర్త అయిన కురుడు జన్మించాడు.)

Wednesday, December 14, 2005

1_4_112 కందము వసు - వసంత

కందము

బలయుతులు నూటయిరువది
నలువురు సుతు లుద్భవిల్లి నానాదేశం
బులకు బతు లైరి మఱి వా
రలలో సంవరణుఁ డఖిల రాజ్యోన్నతుఁడై.

(పుట్టిన కొడుకులలో సంవరణుడు శ్రేష్ఠుడై.)

1_4_111 వచనము వసు - వసంత

వచనము

మఱియు నతీతానాగతులైన నిజవంశంబున రాజుల కెల్ల వంశకర్తయయ్యె నట్టిభరతునకుఁ గైకేయియైన సునందకు భుమన్యుండు పుట్టె వానికి నిక్ష్వాకుకన్య యైన సువర్ణకు హస్తి పుట్టెనతని పేరం గౌరవ్యరాజధాని యైన నగరంబు హస్తిపురంబు నా బరగె నట్టి హస్తికిం ద్రిగర్తరాజ పుత్త్రి యైన యశోధరకు వికుంఠనుండు పుట్టె వానికి దాశార్హపుత్త్రియైన వసుదేవకు నజమీఢుండు పుట్టె నయ్యజమీఢునకు గైకేయియు గాంధారియు ఋక్షయు నను మువ్వురు స్త్రీలకు.

(అంతేకాక తన వంశానికి వంశకర్త అయ్యాడు. భరతుడికీ కేకయరాజపుత్రిక అయిన సునందకూ భుమన్యుడు పుట్టాడు. భుమన్యుడికీ దాశార్హుడి కూతురైన విజయకూ సుహోత్రుడు జన్మించాడు.సుహోత్రుడికీ ఇక్ష్వాకుడి కుమార్తె అయిన సువర్ణకూ హస్తి అనేవాడు పుట్టాడు. అతడి పేరుమీద కౌరవుల రాజధాని అయిన "హస్తిపురం" ప్రసిద్ధికెక్కింది. హస్తికీ త్రిగర్తరాజు పుత్రిక అయిన యశోధరకూ వికుంఠనుడు పుట్టాడు. అతడికీ దాశార్హుడి కూతురైన వసుదేవకూ అజమీఢుడు జన్మించాడు. అజమీఢుడికీ కైకేయి, గాంధారి, ఋక్ష అనే ముగ్గురు స్త్రీలకూ.)

-:భరత వంశక్రమము:-

Sunday, December 11, 2005

1_4_110 చంపకమాల వసు - వసంత

చంపకమాల

భరతుఁ డశేషభూభవనభారధురంధరుఁ డై వసుంధరం
బరగి యనేకయాగములఁ బాయక భాస్కరజహ్నుకన్యకా
సురుచిరతీరదేశముల సువ్రతుఁ డై యొనరించి భూరిభూ
సురులకు నిచ్చె దక్షిణలు శుద్ధసువర్ణగవాశ్వహస్తులన్.

(భరతుడు రాజ్యభారాన్ని వహించి, లోకంలో ప్రసిద్ధికెక్కి, గంగాయమునా నదీతీరాలలో ఎన్నో యజ్ఞాలు, దానాలు చేశాడు.)

1_4_109 వచనము వసు - వసంత

వచనము

అని మహానురాగంబునం గొడుకు నెత్తికొని హర్షపులక లెసఁగ నాలింగనంబు సేసి శకుంతలామహాదేవి నతిప్రణయగౌరవంబున సంభావించి యౌవరాజ్యంబునకు భరతు నభిషిక్తుం జేసి పెద్దకాలంబు రాజ్యసుఖంబు లనుభవించి తనరాజ్యభారం బంతయు భరతుం బూన్చి దుష్యంతుండు దపోవనంబున కరిగిన.

(అని దుష్యంతుడు శకుంతలను సన్మానించి, భరతుడిని యౌవరాజ్యపదవిలో అభిషేకించి, చాలాకాలం రాజ్యసుఖాలు అనుభవించి, రాజ్యభారాన్ని భరతుడికి అప్పగించి, తపోవనానికి వెళ్లిపోయాడు.)

1_4_108 తేటగీతి వసు - వసంత

తేటగీతి

అన్యు లెఱుఁగమిఁజేసి లోకాపవాద
భీతి నెఱిగియు నిత్తన్విఁ బ్రీతి దప్పి
యెఱుఁగ నంటిని నిందఱ కిప్పు డెఱుఁగఁ
జెప్పె నాకాశవాణి యచ్చెరువు గాఁగ.

(ఇతరులకు ఈ విషయం తెలియదు కాబట్టి లోకనిందకు భయపడి ఈమె ఎవరో నాకు తెలియదని అన్నాను. కానీ ఇప్పుడు అందరికీ తెలిసేలా ఆకాశవాణి ప్రకటించింది.)

1_4_107 తేటగీతి వసు - వసంత

తేటగీతి

ఏను నీయింతియును గాని యెఱుఁగ రన్యు
లర్థిఁ గణ్వమహామునియాశ్రమంబు
నందు గాంధర్వవిథి వివాహమునఁ గరము
నెమ్మిఁ జేసినదీనిఁ బాణిగ్రహణము.

(ఈమెను నేను కణ్వమహాముని ఆశ్రమంలో వివాహం చేసుకొన్న విషయం నాకూ ఈమెకూ తప్ప ఇంకెవరికీ తెలియదు.)

1_4_106 వచనము వసు - వసంత

వచనము

ఇట్లెల్లవారలకు నతిహర్షంబుగా శకుంతలపతిప్రతాత్వంబును సత్యంబును భరతోత్పత్తియుఁ బ్రశంసించు వేలుపులపలుకు లతివ్యక్తంబు లయి యాకాశంబువలన వీతెంచిన విని దుష్యంతుండు సభాసదులు విన నిట్లనియె.

(ఇలా ఆకాశవాణి చెప్పగా దుష్యంతుడు విని సభలోనివారితో ఇలా అన్నాడు.)

1_4_105 చంపకమాల వసు - వసంత

చంపకమాల

గొనకొని వీఁడు నీకును శకుంతలకుం బ్రియనందనుండు సే
కొని భరియింపు మీతని శకుంతల సత్యము వల్కె సాధ్వి స
ద్వినుత మహాపతివ్రత వివేకముతో నని దివ్యవాణి దా
వినిచె ధరాధినాథునకు విస్మయ మందఁగఁ దత్సభాసదుల్‌.

("శకుంతల చెప్పింది నిజం. ఇతడు నీ పుత్రుడు", అని ఆకాశవాణి ప్రకటించింది.)

-:దివ్యవాణి నాకర్ణించి దుష్యంతుఁడు శకుంతలను గ్రహించుట:-

1_4_104 వచనము వసు - వసంత

వచనము

ఇట్లు దద్దయు దుఃఖించి విగతాశ యై బోరనఁ దొరఁగుభాష్పజలంబులందంద యొత్తికొనుచు నింకదైవంబ కాని యొండుశరణంబు లేదని యప్పరమపతివ్రత తనయుం దోడ్కొని క్రమ్మఱిపోవ నున్నయవసరంబున.

(శకుంతల ఇలా ఆశలు వదులుకొని కొడుకును వెంటబెట్టుకొని తిరిగివెళ్లబోతున్న సమయంలో.)

1_4_103 మధ్యాక్కర వసు - వసంత

మధ్యాక్కర

తడయక పుట్టిననాడ తల్లిచేఁ దండ్రిచే విడువఁ
బడితి నిప్పుడు పతిచేతను విడువఁబడియెద నొక్కొ
నుడువులు వేయునింకేల యిప్పాటినోములు దొల్లి
కడగి నోఁచితిని గాకేమి యనుచును గందె డెందమున.

(పుట్టినవెంటనే తల్లిదండ్రులచేత విడువబడ్డాను. ఇప్పుడు భర్తచేతకూడా విడువబడతానేమో అని దుఃఖించింది.)

1_4_102 వచనము వసు - వసంత

వచనము

ఇట్టి లోకవిరుద్ధంబుల కే మోడుదు మయుక్తంబు లయిన పలుకులు పలుకక నీయాశ్రమంబునకుం బొ మ్మనిన శకుంతల యత్యంత సంతాపితాంతఃకరణయై.

(ఇలాంటివాటికి మేము అంగీకరించము. తగనిమాటలు మాట్లాడక నీ ఆశ్రమానికి తిరిగివెళ్లు అని దుష్యంతుడు అనగా శకుంతల బాధపడి.)

1_4_101 కందము వసు - వసంత

కందము

పొడువునఁ బ్రాయంబునఁ గడుఁ
గడిఁదిబలంబునను జూడఁగా నసదృశు నీ
కొడు కని యీతని నెంతయు
నెడ మడుగుగఁ జూపఁ దెత్తె యిందఱు నగగన్‌.

(అందరూ నవ్వేటట్లు "ఇతడు నీ కొడుకు" అని నాకు చూపటానికి తీసుకువచ్చావా?)

Sunday, December 04, 2005

1_4_100 కందము వసు - వసంత

కందము

ఏ నెట నీ వెట సుతుఁ డెట
యే నెన్నఁడు దొల్లి చూచి యెఱుఁగను నిన్నున్‌
మానిను లసత్యవచనలు
నా నిట్టు లసత్యభాషణం బుచితంబే.

(నేనెక్కడ? నువ్వెక్కడ? కుమారుడెక్కడ? నిన్ను ఎప్పుడూ చూసినట్లు గుర్తులేదు. "ఆడవాళ్లు అబద్ధాలు మాట్లాడుతారు" అన్నట్లు నువ్వు ఇలా అసత్యమాడటం తగదు.)

1_4_99 వచనము వసు - వసంత

వచనము

అనిన శకుంతలపలుకులు సేకొన నొల్లక దుష్యంతుం డిట్లనియె.

(శకుంతల మాటలకు దుష్యంతుడు అంగీకరించక ఇలా అన్నాడు.)

1_4_98 కందము వసు - వసంత

కందము

క్షత్త్రవరుఁ డైన విశ్వా
మిత్రునకుఁ బవిత్ర యైన మేనకకున్‌ స
త్పుత్త్రినయి బొంకు పలుకఁగ
ధాత్త్రీతలనాథ యంత ధర్మేతరనే.

(విశ్వామిత్రుడికీ, మేనకకూ కుమార్తెనైన నేను అబద్ధమాడటానికి అంత ధర్మంలేనిదాన్ని కాను.)

1_4_97 కందము వసు - వసంత

కందము

కావున సత్యము మిక్కిలి
గా విమలప్రతిభఁ దలఁచి కణ్వాశ్రమసం
భావితసమయస్థితి దయఁ
గావింపుము గొడుకుఁ జూడు కరుణాదృష్టిన్‌.

(కాబట్టి కణ్వమహర్షి ఆశ్రమంలో చేసిన ప్రతిజ్ఞను నేరవేర్చు. నీ కొడుకును దయతో చూడు.)

1_4_96 తేటగీతి వసు - వసంత

తేటగీతి

సర్వతీర్థాభిహమనంబు సర్వవేద
సమధిగమము సత్యంబుతో సరియుఁ గావు
ఎఱుఁగు మెల్ల ధర్మంబుల కెందుఁ బెద్ద
యండ్రు సత్యంబు ధర్మజ్ఞులైన మునులు.

(తీర్థాలను సేవించటం, వేదాధ్యయనం చేయటం - ఇవి సత్యానికి సాటిరావు. ధర్మం బాగా తెలిసిన ఋషులు ఎల్లప్పుడూ అన్ని ధర్మాల కంటే సత్యమే గొప్పదని అంటారు.)

1_4_95 కందము వసు - వసంత

కందము

వెలయంగ నశ్వమేధం
బులు వేయును నొక్కసత్యమును నిరుగడలం
దుల నిడి తూఁపగ సత్యము
వలనన ములు సూపు గౌరవంబున పేర్మిన్‌.

(ఒక త్రాసులో వేయి అశ్వమేధాల ఫలాన్ని ఒక వైపు, ఒక్క సత్యవాక్యాన్ని మరొకవైపు ఉంచితే త్రాసు సత్యం వైపే మొగ్గు చూపుతుంది.)

1_4_94 చంపకమాల వసు - వసంత

చంపకమాల

నుతజనపూరితంబు లగు నూతులు నూఱిటికంటె సూనృత
వ్రత యొకబావి మేలు మఱి బావులు నూఱిటికంటె నొక్కస
త్ర్కతు వది మేలు తత్ర్కతుశతకంబునకంటె సుతుండు మేలు త
త్సతశతకంబుకంటె నొకసూనృత వాక్యము మేలు సూడఁగన్.

(నూరు చేదుడుబావుల కంటే ఒక దిగుడుబావి మేలు. నూరు దిగుడుబావుల కంటే ఒక యజ్ఞం మేలు. అటువంటి నూరు యజ్ఞాల కంటే ఒక పుత్రుడు మేలు. అటువంటి నూరుమంది పుత్రుల కంటే ఒక సత్యవాక్యం మంచిది.)

1_4_93 కందము వసు - వసంత

కందము

భూరిగుణు నిట్టికులవి
స్తార కుదారకు నుదారధర్మప్రియ ని
ష్కారణమ తప్పజూడఁగ
సారమతీ చనునె నాఁటి సత్యము గలుగన్.

(మన వివాహం నాటి నీ వరం సత్యమై నిలిచి ఉండగా, నీ పుత్రుడిని కాదనటం తగదు.)

1_4_92 కందము వసు - వసంత

కందము

అనఘుఁడు వంశకరుం డై
పెనుపున నీసుతుఁడు వాజపేయంబులు నూ
ఱొనరించు నని సరస్వతి
వినిచె మునులు వినఁగ నాకు వినువీథి దెసన్‌.

(నీ కుమారుడు వంశకర్త అయి నూరు వాజపేయయాగాలు చేస్తాడని మునులందరూ వినేలా ఆకాశవాణి నాతో చెప్పింది.)

1_4_91 మత్తేభము వసు - వసంత

మత్తేభము

విపరీత ప్రతిభాష లేమిటికి నిర్వీనాథ యీపుత్త్రగా
త్రపరిష్వంగసుఖంబు సేకొనుము ముక్తాహారకర్పూరసాం
ద్రపరాగ ప్రసరంబుఁ జందనముఁ జంద్రజ్యోత్స్నయుం బుత్త్రహా
త్రపరిష్వంగము నట్లు జీవులకు హృద్యంబే కడున్‌శీతమే.

(ఓ రాజా! విపరీతమైన ఈ మారుమాటలు ఎందుకు? ఈ పుత్రుడిని కౌగిలించుకో. ముత్యాలహారాలు, పచ్చకర్పూరపు పొడి, మంచి గంధం, వెన్నెల - ఇవన్నీ పుత్రుడి కౌగిలి కలిగించే ఆహ్లాదాన్ని కలిగించలేవు.)

Saturday, December 03, 2005

1_4_90 కందము వసు - వసంత

కందము

నీ పుణ్యతనువువలనన
యీపుత్త్రకుఁ డుద్భవిల్లి యెంతయు నొప్పున్‌
దీపంబువలన నొండొక
దీపము ప్రభవించినట్లు తేజం బెసఁగన్‌.

(ఒక దీపంనుండి మరొక దీపం పుట్టి వెలిగినట్లు నీ శరీరం నుండి ఈ పుత్రుడు జన్మించి ప్రకాశిస్తున్నాడు.)

1_4_89 వచనము విజయ్ - విక్రమాదిత్య

వచనము

పున్నామ్నో నరకా త్త్రాయత ఇతి పుత్త్ర యను వేదవచనంబు గలదు గావునఁ ఋణ్యాచారుం డయిన పుత్త్రుం డుభయపక్షంబులవారి నుద్ధరించుఁ గావున.

("పుత్" అనే నరకం నుండి తల్లిదండ్రులను రక్షిస్తాడు కాబట్టి పుత్త్రుడు అనే పేరు ఏర్పడింది అని వేదవచనం ఉంది. కాబట్టి ఉత్తముడైన పుత్రుడు తల్లిదండ్రుల ఉభయవంశాలవారిని ఉద్ధరిస్తాడు. కాబట్టి.)

1_4_88 కందము విజయ్ - విక్రమాదిత్య

కందము

తాన తననీడ నీళ్లుల
లో నేర్పడఁ జూచునట్లు లోకస్తుత త
త్సూను జనకుండు సూచి మ
హానందముఁ బొందు నతిశయప్రీతిమెయిన్.

(ఓ రాజా! నీళ్లలో తన నీడను తాను చూసినట్లు తండ్రి కొడుకును చూసి మహదానందాన్ని పొందుతాడు.)

1_4_87 కందము విజయ్ - విక్రమాదిత్య

కందము

విను గార్హపత్య మను న
య్యనలము విహరింపఁబడి తదాహవనీయం
బున వెలుఁగునట్ల వెలుఁగును
జనకుఁడు దాఁ బుత్త్రుఁ డై నిజద్యుతితోడన్.

(గార్హపత్యం అనే అగ్ని ప్రజ్వలించిన తర్వాత ఆహవనీయం అనే అగ్నిలో ప్రకాశించినట్లు తండ్రి తానే పుత్రుడై ప్రకాశిస్తాడు.)

Friday, December 02, 2005

1_4_86 వచనము విజయ్ - విక్రమాదిత్య

వచనము

మఱియు భార్య పురుషునం దర్ధం బగుటం జేసి పురుషునకు మున్న పరేతయైన పతివ్రత పరలోకంబునం దనపురుషుం గూడఁ దదాగమనంబు ప్రతీక్షించుచుండుఁ బురుషుండు మున్న పరేతుం డైనఁ బదంపడి తానును బరేతయై తనపురుషుం గూడ నరుగు నట్టిభార్య నవమానించుట ధర్మవిరోధంబు మఱియునుం పురుషుండు భార్యయందుఁ బ్రవేశించి గర్భంబునఁ బుత్త్రుండై తాన యుద్భవిల్లు గావున నఙ్గాదఙ్గా త్సమ్భవసి యను నిది యాదిగాఁ గల వేదవచనంబులయందును జనకుండును బుత్త్రుండును ననుభేదంబు లేదు.

(భార్యను అవమానించటం ధర్మవిరోధం. భర్త భార్యగర్భంలో ప్రవేశించి పుత్రుడై జన్మిస్తాడు కాబట్టి "అంగాత్ అంగాత్ సంభవసి" అనే వేదవచనాల ప్రకారం తండ్రికొడుకులకు భేదం లేదు.)