Friday, June 30, 2006

1_6_120 వచనము పవన్ - వసంత

వచనము

కావున సర్వప్రకారంబుల నపకారకారణు లయిన వారిం బరుల నయిన బాంధవుల నయిన నుపేక్షింపక యాత్మరక్షాపరుండ వయి దూరంబుసేసి దూషించునది యనినఁ గణికుమతంబు విని దుర్యోధనుండు చింతాపరుం డై యొక్కనాఁడు ధృతరాష్ట్రున కేకాంతంబున ని ట్లనియె.

(అపకారం చేసినవాళ్లు బంధువులైనా ఆత్మరక్షణ కోసం వారిని చంపాలి - అని కణికుడు చెప్పాడు. ఇది విని దుర్యోధనుడు చింతించి ఒకరోజు ధృతరాష్ట్రుడితో ఇలా అన్నాడు.)

1_6_119 చంపకమాల విజయ్ - విక్రమాదిత్య

చంపకమాల

తడయక సామభేదముల దానములన్ దయతోడ నమ్మఁగా
నొడివియు సత్యమిచ్చియుఁ జనున్ జననాథ కృతాపకారులం
గడఁగి వధింపఁగాఁ గనుట కావ్యుమతం బిది గాన యెట్టులుం
గడుకొని శత్రులం జెఱుపఁగాంచుట కార్యము రాజనీతిమైన్.

(శత్రువులను ఎలాగైనా చంపాలి.)

1_6_118 కందము విజయ్ - విక్రమాదిత్య

కందము

మొనసి యపకారిఁ గడ నిడి
కొనియుండెడు కుమతి దీర్ఘకుజశాఖాగ్రం
బున నుండి నిద్రవోయెడు
మనుజునకు సమాన మగుఁ బ్రమత్తత్వమునన్.

(అపకారం చేసినవారిని దగ్గర ఉంచుకొన్నవాడు ఎత్తైన చెట్టుకొమ్మ చివరన నిద్రపోయేవాడితో సమానం.)

1_6_117 కందము విజయ్ - విక్రమాదిత్య

కందము

బాలుఁ డని తలఁచి రిపుతో
నేలిదమునఁ గలిసియునికి యిది కార్యమె యు
త్కీలానలకణ మించుక
చాలదె కాల్పంగ నుగ్రశైలాటవులన్.

(శత్రువులు చిన్నవారే కదా అని వారితో కలిసి ఉండకూడదు. భయంకరమైన పర్వతారణ్యాలను కాల్చటానికి చిన్న నిప్పురవ్వ చాలదా?)

1_6_116 కందము విజయ్ - విక్రమాదిత్య

కందము

తన కపకారము మునుఁ జే
సిన జనుఁ డల్పుఁ డని నమ్మి చేకొని యుండం
జన దొకయించుక ముల్లయి
నను బాదతలమున నున్న నడవఁగ నగునే.

(అపకారం చిన్నదైనా అది చేసినవారిని ఆదరించకూడదు. ముల్లు చిన్నదే అయినా అది పాదంలో ఉంటే నడవటం సాధ్యమవుతుందా?)

Wednesday, June 28, 2006

1_6_115 కందము విజయ్ - విక్రమాదిత్య

కందము

తఱియగునంతకు రిపుఁ దన
యఱకటఁ బెట్టికొనియుండునది దఱియగుడుం
జెఱచునది ఱాతిమీదను
వఱలఁగ మృద్ఘటము నెత్తి వైచిన భంగిన్.

(సమయం వచ్చేవరకూ శత్రువుని మోసి, సమయం రాగానే మట్టికుండను రాతిమీద ఎత్తి కొట్టినట్లు అతడిని నాశనం చేయాలి.)

1_6_114 కందము విజయ్ - విక్రమాదిత్య

కందము

కడునలకయుఁ గూర్మియు నే
ర్పడ నెఱిఁగించునది వాని ఫలకాలమునన్
బిడుగును గాడ్పును జనులకు
బడుటయు వీచుటయు నెఱుకపడియెడుభంగిన్.

(పిడుగు పడటం, గాలి వీచటం - ఇవి జరిగినప్పుడే ప్రజలకు తెలిసినట్లు - కోపం గానీ, స్నేహం గానీ వాటి అనుభవ కాలానికే ఇతరులకు తెలియాలి.)

1_6_113 కందము విజయ్ - విక్రమాదిత్య

కందము

తన కిమ్మగు నంతకు దు
ర్జనుఁ డిష్టుఁడపోలె నుండి సర్పమపోలెం
దన కిమ్మగుడును గఱచును
ఘనదారుణకర్మగరళఘనదంష్ట్రములన్.

(దుర్మార్గుడు అనుకూలమయ్యేంత వరకూ మిత్రుడిలా నటించి అనుకూలత ఏర్పడగానే క్రూరత్వం ప్రదర్శిస్తాడు.)

1_6_112 కందము విజయ్ - విక్రమాదిత్య

కందము

పలుమఱు శపథంబులు నం
జలియును నభివాదనమును సామప్రియభా
షలు మిథ్యావినయంబులుఁ
గలయవి దుష్టస్వభావకాపురుషులకున్.

(నీచులు కపటపు వినయాలు ప్రదర్శిస్తారు.)

1_6_111 ఉత్పలమాల విజయ్ - విక్రమాదిత్య

ఉత్పలమాల

ఇమ్ముగ నాత్మరక్ష విధియించువిధంబున మంత్రరక్షయ
త్నమ్మునఁ జేయఁగావలయుఁ దత్పరిరక్షణశక్తి నెల్ల కా
ర్యమ్ములు సిద్ధిఁ బొందుఁ బరమార్థము మంత్రవిభేద మైనఁ గా
ర్యమ్ములు నిర్వహింపఁగ బృహస్పతికైనను నేరఁబోలునే.

(తనను తాను రక్షించుకొన్నట్లే తన రహస్యాలోచనలు కూడా రక్షించుకోవాలి. అవి వెల్లడి అయితే పనులు సాధించుకోవటం బృహస్పతి వల్ల కూడా కాదు.)

Thursday, June 22, 2006

1_6_110 తేటగీతి నచకి - వసంత

తేటగీతి

వీరు నమ్మంగఁ దగుదురు వీరు నమ్మఁ
దగరు నాకు నా వలవదు తత్త్వబుద్ధి
నెవ్వరిని విశ్వసింపక యెల్లప్రొద్దు
నాత్మరక్షాపరుం డగునది విభుండు.

(రాజైనవాడు - నాకు వీరు నమ్మదగిన వారు, వీరు నమ్మగూడని వారు - అని అనగూడదు. ఎవరినీ నమ్మకుండా తన రక్షణ తానే ప్రధానంగా చూసుకోవాలి.)

1_6_109 కందము నచకి - వసంత

కందము

నానావిహార శైలో
ద్యాన సభా తీర్థ దేవతాగృహ మృగయా
స్థానముల కరుగునెడ మును
మానుగ శోధింపవలయు మానవపతికిన్.

(రాజు వెళ్లే ప్రదేశాలను ముందుగా పరిశీలించి, ప్రమాదం కలిగించే వ్యక్తులు, ఆయుధాలు ఉంటే తొలగించాలి.)

1_6_108 కందము నచకి - వసంత

కందము

అలయక పరాత్మ కృత్యం
బులఁ బతి యెఱుఁగునది దూత ముఖమునఁ బరభూ
ముల వృత్తాంతము లెఱుఁగఁగఁ
బలుమఱుఁ బుచ్చునది వివిధ పాషాండ తతిన్.

(రాజు విసుగులేకుండా తన పనులను గురించి, శత్రువుల పనులను గురించి దూతల ద్వారా తెలుసుకోవాలి.)

1_6_107 కందము నచకి - వసంత

కందము

బలహీను లైనచో శ
త్రులఁ జెఱుచుట నీతి యధిక దోర్వీర్య సుహృ
ద్బలు లై నవారిఁ జెఱుపఁగ
నలవియె యక్లేశ సాధ్యు లగుదురె మీఁదన్.

(శత్రువులు బలహీనంగా ఉన్నప్పుడే వారిని చంపాలి.)

1_6_106 కందము నచకి - వసంత

కందము

అమలినమతి నాత్మచ్ఛి
ద్రము లన్యు లెఱుఁగకుండఁ దా నన్య చ్ఛి
ద్రము లిమ్ముగ నెఱుఁగుచు దే
శముఁ గాలము నెఱిఁగి మిత్రసంపన్నుం డై.

(తన లోపాలు ఇతరులకు తెలియనివ్వకుండా, ఇతరుల లోపాలను తాను తెలుసుకుంటూ రాజధర్మం నిర్వర్తించాలి.)

Tuesday, June 20, 2006

1_6_105 కందము నచకి - వసంత

కందము

జనపాలుఁడు మృదుకర్మం
బున నైనను గ్రూరకర్మమున నైనను నే
ర్పున నుద్ధరించునది ద
న్ననపాయతఁ బొంది చేయునది ధర్మంబుల్.

(మెత్తని పని చేతగానీ, భయంకరమైన పని చేతగానీ రాజు మొదట తనను తాను రక్షించుకోవాలి. తనకు ప్రమాదం లేకుండా చూసుకొని రాజధర్మం నడపాలి.)

1_6_104 కందము నచకి - వసంత

కందము

ధీరమతియుతులతోడ
విచారము సేయునది మును విచారితపూర్వ
ప్రారబ్ధ మైన కార్యము
పారముఁ బొందును విఘాతపదదూరం బై.

(ఏ పనైనా బుద్ధిమంతులతో ముందుగా విచారించి చెయ్యాలి. ముందుగా విచారించి చక్కగా ప్రారంభించిన పని సఫలమౌతుంది.)

1_6_103 కందము నచకి - వసంత

కందము

గుఱుకొని కార్యాకార్యము
లెఱుఁగక దుశ్చరితుఁ డై యహితుఁ డగు నేనిన్
మఱవక గురు నైనను జను
లెఱుఁగఁగ శాసించునది మహీశుఁడు బుద్ధిన్.

(తప్పుచేస్తే, తండ్రినైనా (గురువునైనా), ప్రజలకు తెలిసేలా శిక్షించాలి.)

1_6_102 తరువోజ నచకి - వసంత

తరువోజ

ధరణీశుఁ డుద్యతదండుఁ డై యుచిత దండవిధానంబుఁ దప్పక ధర్మ
చరితులఁగా మహీజనుల రక్షించి సద్వృత్తుఁ డగునది సర్వవర్ణములు
వరుసన తమతమ వర్ణధర్మముల వర్తిల్లుదురు గడవక దండభీతి
నరిమిత్రవర్జితుఁ డై సమబుద్ధి యగు మహీవల్లభు ననుశాసనమున.

(ప్రభువు దండనీతిని అవలంబించి, మంచి ప్రవర్తన కలిగి, స్వపరభేదం లేకుండా సమబుద్ధితో ఉండాలి.)

1_6_101 సీసము + ఆటవెలది నచకి - వసంత

సీసము

ఆయుధవిద్యలయందు జితశ్రము
        లనియును రణశూరు లనియు సంత
తోత్సాహు లనియు నత్యుద్ధతు లనియును
        భయమందుచుండుదుఁ బాండవులకు
దానిపై నిప్పుడు ధర్మజు యువరాజుఁ
        జేసె రా జే నేమి సేయువాఁడ
నృపనీతి యెయ్యది నిరతంబుగా మీర
        నా కెఱిఁగింపుఁడు నయముతోడ

ఆటవెలది

ననిన వినియుఁ గణికుఁ డనువాఁడు సౌబలు
నాప్తమంత్రి నీతులందుఁ గరము
కుశలుఁ డైనవాఁడు కురుకులవల్లభు
నిష్టమునకుఁ దగఁగ నిట్టు లనియె.

(పాండవుల పరాక్రమానికి భయపడుతుంటాను. దానికితోడు ధర్మరాజు యువరాజు అయ్యాడు. ఏమి చెయ్యాలో తోచటం లేదు. నాకు రాజనీతి ఉపదేశించండి - అన్నాడు. అప్పుడు శకునికి ప్రియమంత్రి అయిన కణికుడు ఇలా అన్నాడు.)

Monday, June 19, 2006

-:కణికనీతి:-

1_6_100 వచనము నచకి - వసంత

వచనము

దీని మానవులయందుఁ బ్రయోగింపకుండునది యల్పతేజులయందుఁ బ్రయుక్తం బయి యిది జగంబులఁ గాల్చు నిన్ను బాధించు నట్టి మానవులు గలిగిరేని ప్రయోగించునది వారి నశ్రమంబున సాధించు నని దాని మహిమ చెప్పి నీవు నీ బంధుసమక్షంబున నాకు గురుదక్షిణ యి మ్మిది యెయ్యది యనిన నాయుద్ధంబుసేయునపుడు నాతో నెన్నడుఁ బ్రతియుద్ధంబు సేయకుండు మిదియ నాకు గురుదక్షిణ యనిన నర్జునుండు వల్లె యని యాచార్యునకు నమస్కరించి దాని కొడంబడియె నంత దుర్యోధనుండు యుధిష్ఠిరుయౌవరాజ్యాభిషేకంబునకు భీమార్జునయములపరాక్రమంబునకు మనంబున సహింపనోపక కర్ణశకునిదుశ్శాసనులతో మంతనం బుండి యి ట్లనియె.

(అని ఆ అస్త్రమహిమ చెప్పి - నీ బంధువులందరి ముందు నాకు - నాతో ఎదురుయుద్ధం చెయ్యను అని - గురుదక్షిణ ఇవ్వు - అన్నాడు. అర్జునుడు అందుకు అంగీకరించాడు. పాండవుల పరాక్రమం చూసి ఓర్వలేక దుర్యోధనుడు కర్ణశకునిదుశ్శాసనులతో ఇలా అన్నాడు.)

1_6_99 ఉత్పలమాల నచకి - వసంత

ఉత్పలమాల

దీని నగస్తి నాఁ బరగు దివ్యమునీంద్రుఁడు దొల్లి ప్రీతితో
భూనుత యగ్నివేశుఁ డను భూరిమునీంద్రున కిచ్చె వారలున్
మానుగ నాకు నిచ్చిరి క్రమంబున నేనును నీకు నిచ్చితిన్
దీనికి నీవ యర్హుఁడవు తేజమునం గడుఁ బెద్ద గావునన్.

(ఈ అస్త్రానికి నువ్వే తగినవాడివి.)

1_6_98 వచనము నచకి - వసంత

వచనము

ఇట్లు పాండుకుమారు లపారగుణంబుల నెల్లవారికి నారాధ్యు లయి పరఁగుచున్న నందు ధనుర్విద్య నర్జునుదృఢముష్టిలాఘవ లక్ష్యవేధిత్వ దూరాపాత జితశ్రమత్వంబులకు నసిగదాశక్తితోమరాది ప్రహరణప్రవీణతకుం బరమహీపాల పరాజయోత్పాదన పరాక్రమంబునకుఁ దనవలని భక్తిస్నేహంబులకు మెచ్చి భారద్వాజుండు వానికి బ్రహ్మశిరం బను దివ్యబాణంబు సప్రయోగనివర్తనంబుగా నిచ్చి యి ట్లనియె.

(ద్రోణుడు అర్జునుడికి బ్రహ్మశిరం అనే అస్త్రాన్ని ప్రసాదించి.)

1_6_97 కందము నచకి - వసంత

కందము

యము లమితశౌర్యు లరినృప
యము లమలచరిత్రనిరతు లనఁగా నత్యు
త్తమభక్తి నన్నలకు విన
యము మెఱయుచు నుండి రధికు లై బహుకళలన్.

(నకులసహదేవులు కూడా మంచి పేరు పొందారు.)

1_6_96 చంపకమాల నచకి - వసంత

చంపకమాల

అనుపమ కార్ముకాది వివిధాయుధ విద్యలయందుఁ గోవిదుం
డనఁగ నజయ్యుఁ డై పరఁగు నర్జునుఁ బోలఁగ నన్యు లెందు లే
రను జనఘోష ముచ్చరిత మయ్యె మరుచ్చలితోచ్చవీచి ని
స్వన ముఖరాబ్ధి వేష్టిత విశాల మహీవలయాంతరంబునన్.

(ధనుర్విద్య మొదలైన ఆయుధవిద్యలలో అర్జునుడికి సాటిలేదన్న పేరు కూడా వ్యాపించింది.)

Sunday, June 18, 2006

1_6_95 కందము నచకి - వసంత

కందము

బద్ధపరంపర నొప్పె మ
దోద్ధతగజరథతురంగయుద్ధముల గదా
యుద్ధములఁ జూడ నెందుఁ బ్ర
సిద్ధుఁడు మధ్యముఁడ యను విశిష్టస్తవముల్.

(గజరథాశ్వయుద్ధాలలో, గదాయుద్ధంలో భీముడే గొప్పవాడన్న పొగడ్తలు వ్యాపించాయి.)

1_6_94 వచనము నచకి - వసంత

వచనము

మఱియును.

(ఇంకా.)

1_6_93 చంపకమాల నచకి - వసంత

చంపకమాల

నలువురు దమ్ములున్ బలిమి నాలుగుదిక్కులు నోర్చి సర్వభూ
తలమున రాజనందనులదర్ప మడంచుచు భూరివస్తురా
సులు గొనివచ్చి యీఁగొని విశుద్ధయశోనిధి యొప్పె ధర్మజుం
డలఘుఁడు యౌవరాజ్యయుతుఁ డయ్యును బెంపున సార్వభౌముఁ డై.

(తన నలుగురు తమ్ములు, నాలుగు దిక్కులు జయించి ఇతర రాకుమారుల నుండి కప్పం తెచ్చి ఇవ్వగా, ధర్మరాజు యువరాజే అయినా చక్రవర్తిలా వెలిగాడు.)

1_6_92 వచనము నచకి - వసంత

వచనము

ఇట్లు ద్రుపదుండు ద్రోణుచేత విముక్తుం డయ్యుఁ గోపపాశబద్ధుం డయి యప్పరిభవంబునకుం బ్రతీకారంబు సేయ సమకట్టి బ్రాహ్మణోపాస్తి సేయుచుండె నంత నిట ధృతరాష్ట్రుండు యుధిష్ఠిరురాజ్యభారధురంధరుంగా నెఱింగి భీష్మవిదురులతో విచారించి యౌవరాజ్యాభిషిక్తుం జేసిన.

(ఇలా ద్రోణుడు విడిచిపెట్టినా, అతడు చేసిన అవమానానికి తిరిగి అవమానం చేయాలని ద్రుపదుడు ఆలోచించసాగాడు. అక్కడ హస్తినాపురంలో ధృతరాష్ట్రుడు ధర్మరాజుకు యౌవరాజ్యాభిషేకం చేశాడు.)

1_6_91 ఆటవెలది నచకి - వసంత

ఆటవెలది

ఇంక నైన మమ్ము నెఱుఁగంగ నగునొక్కొ
యనుచు నుల్లసంబు లాడి ద్రుపదు
విడిచిపుచ్చె గురుఁడు విప్రుల యలుకయుఁ
దృణ హుతాశనంబు దీర్ఘమగునె.

(ఇక ముందైనా మమ్మల్ని గుర్తుంచుకోగలరా? - అని ఎగతాళి చేసి ద్రోణుడు ద్రుపదుడిని విడిచిపెట్టాడు.)

Friday, June 16, 2006

1_6_90 కందము నచకి - వసంత

కందము

వీ రెవ్వరయ్య ద్రుపద మ
హారాజులె యిట్లు కృపణు లయి పట్టువడన్
వీరికి వలసెనె యహహ మ
హారాజ్యమదాంధకార మది వాసెనొకో.

(వీరెవ్వరయ్యా? ద్రుపదమహారాజులే? ఇలా దిక్కులేక పట్టుబడవలసిన పరిస్థితి ఏర్పడిందే? ఆహా! రాజ్యమదం చేత కలిగిన కన్నుగాననితనం తొలగిపోయిందా?)

1_6_89 వచనము నచకి - వసంత

వచనము

ద్రోణుండును నర్జును చేసిన పరాక్రమంబునకుఁ బరమ హృష్ట హృదయుం డై ద్రుపదుం జూచి నగుచు ని ట్లనియె.

(ద్రోణుడు అర్జునుడి పరాక్రమానికి ఆనందించి, నవ్వుతూ ద్రుపదుడితో ఇలా అన్నాడు.)

1_6_88 కందము నచకి - వసంత

కందము

ప్రక్షీణదర్పు ద్రుపదు ర
థాక్షముతోఁ గట్టి తెచ్చి యర్జునుఁడు క్రియా
దక్షుం డయి గురునకు గురు
దక్షిణగా నిచ్చి చేసెఁ దత్సమ్మదమున్.

(అర్జునుడు ద్రుపదుడిని రథచక్రానికి కట్టి ద్రోణుడికి గురుదక్షిణగా తీసుకువచ్చాడు.)

1_6_87 వచనము నచకి - వసంత

వచనము

అట్టి మహాద్వంద్వయుద్ధంబున విజిగీషుం డయి పాంచాలుండు పాండవమధ్యముధనుర్మధ్యంబు భగ్నంబుగా నొక్కబాణంబున నేసి యార్చిన నలిగి వాసవసుతుండుద్యతాసిహస్తుం డయి శైలస్థలంబు మీఁదికి లంఘించు కొదమసింగంబునుంబోలె ద్రుపదురథంబుమీఁదికి లంఘించి వానిం బట్టికొనినఁ దత్సైన్యంబు హాహాకారంబు లెసంగ మహార్ణవంబునుంబోలె మ్రోయుచుండె నంత.

(అర్జునుడు కత్తి చేతపట్టి ద్రుపదుడి రథం మీదికి ఎగిరి దూకి అతడిని పట్టుకొన్నాడు.)

-:అర్జునుఁడు ద్రుపదుం బట్టి కట్టితెచ్చుట:-

1_6_86 కందము నచకి - వసంత

కందము

పరమాస్త్రైకవిశారదుల్ బలయుతుల్ పాంచాలకౌంతేయు లొం
డొరులన్ మార్కొని యేయునప్పుడు దదీయోగ్రాజిరంగంబు దు
స్తర నీరంధ్ర నిశాత సాయక తమస్సంఛన్న మైనం బర
స్పరయుద్ధంబులు దక్కి యోధులు నిశాభ్రాంతాత్ము లై రచ్చటన్.

(వారిద్దరూ యుద్ధం చేశారు.)

Thursday, June 15, 2006

1_6_85 కందము నచకి - వసంత

కందము

శరమోక్షణవేగనిరం
తరమండలితోరుచాపదండుఁ డకాండో
ద్ధురదండధరుఁడపోలెను
హరినందనుఁ దాఁకె ద్రుపదుఁ డత్యుద్ధతుఁ డై.

(ద్రుపదుడు అర్జునుడిని ఎదుర్కొన్నాడు.)

1_6_84 వచనము నచకి - వసంత

వచనము

అంత.

(తరువాత.)

1_6_83 కందము నచకి - వసంత

కందము

వివిధాస్త్రకోవిదుఁడు వా
సవి వానిరథంబుఁ బార్ష్ణిసారథుల మహిం
గువలు వడ నేసె నుగ్రా
హవమునకును వాఁడు విముఖుఁడై చెడి పఱవన్.

(సత్యజితుడు భయపడి పారిపోయేలా అర్జునుడు అస్త్రాలు ప్రయోగించాడు.)

1_6_82 కందము నచకి - వసంత

కందము

కడఁగి ద్రుపదానుజుఁడు నె
వ్వడిఁ గవ్వడి నేసె నూఱు వాడిఁశరములం
గడు నలిగి వాని నన్నియు
నడుమన తునియంగ నేసె నరుఁ డస్త్రములన్.

(వారిద్దరూ యుద్ధం చేశారు.)

1_6_81 కందము నచకి - వసంత

కందము

ఆతనిఁ జూచి సహింపక
యాతతకార్ముకుఁడు ద్రుపదుననుజుఁడు శౌర్యో
పేతుఁడు సత్యజితుం డను
నాతఁడు ధీరుఁ డయి తాఁకె నతిరభసమునన్.

(అర్జునుడిని చూసి సహించలేక ద్రుపదుడి తమ్ముడైన సత్యజితుడు అతడిని ఎదుర్కొన్నాడు.)

Wednesday, June 14, 2006

1_6_80 స్రగ్ధర నచకి - వసంత

స్రగ్ధర

అంతం గౌంతేయుఁ డత్యాయతభుజుఁడు నరుం డల్గి పాంచాలు దంతి
ధ్వాంతంబున్ వానివాహోత్తమతుహినతతిం దద్భటోదారతారా
సంతానంబున్ శరాంశూచ్చయవిభవమునన్ శాంతిఁ బొందించి యుద్య
ద్ధ్వాంతారాతిప్రభుం డై తనరుచు వెలిఁగెన్ దద్రణవ్యోమవీధిన్.

(తరువాత అర్జునుడు ద్రుపదుడి సైన్యంతో యుద్ధం చేశాడు.)

1_6_79 చంపకమాల విజయ్ - విక్రమాదిత్య

చంపకమాల

అనిలజుఁ డుగ్రుఁ డై ద్రుపదుహస్తిఘటావళి నశ్వసంహతిన్
ఘనరథకోటి భగ్నములుగా సమరంబునఁ జేసి పేదదు
ర్మనుజులఁ జంప నేల యని మానుగ గోపుఁడు గోగణంబులన్
గొనకొని రొప్పునట్టు లధికుం డెగిచెం బృథుదండహస్తుఁ డై.

(భీముడు ద్రుపదుడి గజాశ్వరథసమూహాలను భగ్నం చేశాడు.)

1_6_78 ఉత్పలమాల విజయ్ - విక్రమాదిత్య

ఉత్పలమాల

దారుణమౌ వృకోదరు గదాకులిశాహతి నన్యవాహినీ
వారణసంచయం బభినవ క్షతజారుణధార లొప్ప సం
చారితధాతునిర్ఝరవిశాలశిలోచ్చయ సంచయాభమై
వీరరణంబునం బడియె విక్షతహస్తిపవృక్షపంక్తితోన్.

(భీముడి పరాక్రమానికి ఆ ఏనుగుల గుంపు నేలవాలింది.)

1_6_77 కందము విజయ్ - విక్రమాదిత్య

కందము

కరిఘటలఁ దాఁకి భీముఁడు
కరటికటీ కుంభ దంత కర ముఖముల జ
ర్జరితములఁ జేసె నిష్ఠుర
తరవజ్రనిపాతపటుగదాఘాతములన్.

(భీముడు ద్రుపదుడి గజసేనను ఎదుర్కొన్నాడు.)

-:భీమార్జునులు ద్రుపదుని సేనను దునుమాడుట:-

1_6_76 వచనము విజయ్ - విక్రమాదిత్య

వచనము

ఇట్లు పాంచాలుబాణవృష్టికి నిలుపోపక కురుకుమారులు కుమారశరనిహత సురారికుమారులుంబోలె వెఱచఱిచి పాండవులయొద్దకుం బఱతెంచినం జూచి యర్జునుం డాచార్యధర్మజులకు నమస్కరించి మీరలిందయుండుం డేనీక్షణంబ యప్పాంచాలుం బట్టి తెచ్చెదనని విజృంభించి సంరంభంబున భీమసేనుండు దనకు సేనాగ్రచరుండుగా మాద్రేయులు రథచక్రరక్షకులుగా ద్రుపదరాజవాహినీసముద్రంబు దఱియం జొచ్చిన.

(ద్రుపదుడి ముందు నిలువలేక కౌరవులు పాండవుల దగ్గరకు పరుగెత్తారు. అప్పుడు అర్జునుడు - మీరు ఇక్కడే ఉండండి. ద్రుపదుడిని నేను పట్టి తెస్తాను - అని, భీముడు తన సైన్యానికి ముందు కదలగా, నకులసహదేవులు తన చక్రరక్షకులు కాగా, ద్రుపదుడి సైన్యాన్ని సమీపించాడు.)

Tuesday, June 13, 2006

1_6_75 కందము విజయ్ - విక్రమాదిత్య

కందము

నానావిధ మార్గణముల
నానా మార్గముల నేసినం గురువీరుల్
వానిం జూచి భయంపడి
నానా తనుఁగా మనంబునన్ వగచి రనిన్.

(కౌరవులు ద్రుపదుడిని చూసి భయపడిపోయారు.)

1_6_74 కందము విజయ్ - విక్రమాదిత్య

కందము

వారల శరములు నడుమన
వారించుచు నధిక లాఘవంబున వారిన్
ఘోర శర విద్ధ మర్ములఁ
గా రణమున సోమకుండు ఘనుఁ డై యేసెన్.

(ద్రుపదుడు అతిసులభంగా కౌరవులను ఎదుర్కొన్నాడు.)

1_6_73 కందము విజయ్ - విక్రమాదిత్య

కందము

ధృతరాష్ట్ర కుమారకు లవ
హితు లై పాంచాలుమీఁద నేసిరి సాంద్రా
తతబాణప్రకరతిరో
హిత మై రవికిరణజాల మేర్పడకుండెన్.

(కౌరవులు కూడా ద్రుపదుడితో యుద్ధం చేశారు.)

1_6_72 కందము విజయ్ - విక్రమాదిత్య

కందము

కలయ నసిముసల దండం
బులు కొని కాంపిల్యనగరమున జనులెల్లన్
నలిరేఁగి యార్చి కౌరవ
బలసుభటులఁ బొడిచి రాజి బడలు వడంగన్.

(కాంపిల్యనగరంలోని ప్రజలంతా కత్తులు, రోకళ్లు, కర్రలు చేతపట్టి కౌరవులతో యుద్ధం చేశారు.)

1_6_71 కందము విజయ్ - విక్రమాదిత్య

కందము

శరనికరసహస్రంబులఁ
బరువడి నందఱను గప్పెఁ బ్రావృడ్ధారా
ధర మురుధారాజలముల
సరసిజములఁ గప్పునట్లు సంరంభమునన్.

(ద్రుపదుడు వారి మీద బాణాలు ప్రయోగించాడు.)

Monday, June 12, 2006

1_6_70 వచనము పవన్ - వసంత

వచనము

అనుచుం బాంచాలుపురం బాసన్నంబు గాఁ జనుదెంచునంతకు ముందఱ చని దుర్యోధన యుయుత్సు దుశ్శాసనవికర్ణజలసంధాదు లైన ధార్తరాష్ట్రు లనేక నృపకుమారసహితు లై పాంచాలుపురం బవరోధించినఁ బాంచాలపతి యలిగి యపారచతురంగబలసమేతుం డై కౌరవులం దాఁకి.

(నగరాన్ని ముట్టడించిన కౌరవులను ద్రుపదుడు ఎదుర్కొన్నాడు.)

1_6_69 కందము పవన్ - వసంత

కందము

అతగులచే ద్రుపదుఁ డనవ
హితుఁ డై పట్టువడ నంతహీనుఁడె శౌర్యో
న్నతుఁ డధికధనుర్విద్యా
న్వితుఁడు భవత్సఖుఁ డనంగ వినరొకొ వానిన్.

(బలహీనులకు పట్టుబడటానికి ద్రుపదుడు అంత హీనుడా?)

Thursday, June 01, 2006

1_6_68 కందము పవన్ - వసంత

కందము

వడిగొని కౌరవు లొండొరుఁ
గడవఁగ మును చనిరి వారి గర్వము సూడం
గడిమిని ద్రుపదాధిపుతోఁ
బొడువఁగఁ దమ కలవియగునె భుజవీర్యమునన్.

(కౌరవులు ముందుగా వెళ్లారు కానీ – వాళ్ల గర్వం చూస్తే – ద్రుపదరాజుతో యుద్ధం చేయటం వాళ్లకు సాధ్యమేనా?)

1_6_67 వచనము పవన్ - వచనము

వచనము

పాండవులును రథంబు లెక్కి ద్రోణుం బరివేష్టించి పిఱుంద నరిగి రంత నర్జునుం డాచార్యున కి ట్లనియె.

(పాండవులు కూడా రథాలెక్కి, ద్రోణుడిని మధ్యలో ఉంచి, కౌరవుల వెనుకనే వెళ్లారు. అప్పుడు అర్జునుడు ద్రోణుడితో ఇలా అన్నాడు.)

1_6_66 ఉత్సాహము పవన్ - వసంత

ఉత్సాహము

ఏల దీని నెడయుఁ జేయ నీ క్షణంబ యేఁగి పాం
చాలుఁ బట్టి తెత్త మధిక శౌర్య లీల మెఱయఁగాఁ
బోలు ననుచుఁ బెరిఁగి రాజపుత్త్రు లెల్ల నరిగి పాం
చాలుపురము ముట్టికొని రసంఖ్య బలసమేతు లై.

(వెళ్లి ద్రుపదుడి నగరాన్ని ముట్టడించారు.)