Monday, February 20, 2006

1_4_227 వచనము వసు - విజయ్

వచనము

మఱి యదియునుంగాక యుతథ్యుం డను మునివరుపత్ని మమత యనుదాని గర్భిణి నభ్యాగతుం డయి బృహస్పతి దేవరన్యాయంబున నభిలషించినఁ దదీయగర్భస్థుం డయిన పుత్త్రుం డెఱింగి యిది ధర్మవిరుద్ధం బని యాక్రోశించిన వానికి నలిగి బృహస్పతి సర్వభూతేప్సితం బైన యిక్కార్యంబునందు నాకుఁ బ్రతికూలుండ వయితివి కావున దీర్ఘతమంబును బొందుమని శాపం బిచ్చిన వాఁడును దీర్ఘతముండు నాఁ బుట్టి సకలవేదవేదాంగవిదుండయి జాత్యంధుం డయ్యును తనవిద్యాబలంబునఁ బెద్దకాలంబునకుఁ బ్రద్వేషిణి యను నొక్క బ్రాహ్మణి వివాహంబయి గౌతమాదులయిన కొడుకులం బెక్కండ్రం బడసిన నది లబ్ధపుత్త్రయై తన్ను మెచ్చకున్న నిట్లేల నన్ను మెచ్చవని దీర్ఘతముండు ప్రద్వేషిణి నడిగిన నది యిట్లనియె.

(అంతేకాక, ఉతథ్యుడనే ముని భార్య అయిన మమత గర్భంతో ఉన్నా బృహస్పతి దేవరన్యాయం అనుసరించి ఆమెను కోరగా, ఆమె గర్భంలోని బాలుడు అది ధర్మవ్యతిరేకం అని పెద్దగా అరిచాడు. బృహస్పతి కోపంతో - జీవులందరూ కోరే ఈ పనిలో నన్ను వ్యతిరేకించినందుకు చీకటిని అనుభవించు - అని శపించి అతడిని గుడ్డివాడిని చేశాడు. ఆ బాలుడు దీర్ఘతముడనే పేరున పుట్టి పుట్టుగుడ్డి అయినా విద్యాభ్యాసం చేసి ప్రద్వేషిణి అనే ఆమెను వివాహమాడి గౌతముడు మొదలైన కొడుకులను పొందాడు. పుత్రవతి అయినా ఆమె తనను మెచ్చకపోవటం చూసి ఎందుకు అని దీర్ఘతముడు ఆమెను అడిగాడు. ప్రద్వేషిణి ఇలా అన్నది.)

No comments: