Monday, February 20, 2006

1_4_231 వచనము వసు - విజయ్

వచనము

అని శాపం బిచ్చిన దీర్ఘతమునకు నలిగి ప్రద్వేషిణి యిమ్ముదుకని నెటయేనియుం గొనిపొండని తనకొడుకులం బంచిన వారును నయ్యౌతథ్యునతివృద్ధు జాత్యంధు నింధనంబులతో బంధించి మోహాంధులయి గంగలో విడిచిన నమ్మునియును బ్రవాహవేగంబునఁ బెక్కుదేశంబులు గడచి చనియెనంత నొక్కనాఁడు బలియను రాజు గంగాభిషేకార్థంబు వచ్చినవాఁ డయ్యింధన బంధనంబున నుండియు నుదాత్తానుదాత్త స్వరితప్రచయస్వరభేదంబు లేర్పడ సలక్షణంబుగా వేదంబులం జదువుచుఁ దరంగ ఘట్టనంబునం దనయున్న దరిం జేరవచ్చినవానిఁ దీరంబుఁ జేర్చి యింధనబంధనంబులు విడిచి మహర్షి మామతేయుంగా నెఱిఁగి తన్నెఱింగించుకొని నమస్కారంబు సేసి యిట్లనియె.

(ఇలా శాపమిచ్చిన భర్తను ఎక్కడికైనా తీసుకువెళ్లమని ప్రద్వేషిణి తన కొడుకులను ఆజ్ఞాపించింది. వాళ్లు అతడిని కట్టెలతో కలిపి కట్టి గంగలో విడిచిపెట్టారు. ఆ ముని గంగాప్రవాహంతో అనేక దేశాలు దాటివెళ్లాడు. ఒకరోజు గంగాస్నానం కోసం వచ్చిన బలి అనే రాజు అతడిని రక్షించి, అతడు మహర్షి అయిన దీర్ఘతముడని తెలుసుకొని నమస్కరించి ఇలా అన్నాడు.)

No comments: