Tuesday, February 14, 2006

1_4_151 సీసము + ఆటవెలది విజయ్ - విక్రమాదిత్య

సీసము

వరుణుఁ డాదిగఁ గల వసువులు దోడ్తోడఁ
        బుట్టుచునున్న నప్పొలఁతి వారి
నల్లన పుట్టినయప్పుడ కొనిపోయి
        నిర్దయ యై గంగ నీరిలోన
వైచిన నెఱిఁగి యవ్వసుమతీనాథుండు
        తనయుల ని ట్లేల దయయు లేక
గంగలో వైచెదు కడునధర్మం బేల
        చేసెదు నానోడుఁ జెలువ దన్నుఁ

ఆటవెలది

బాసిపోవు ననియుఁ బలుకక యెప్పటి
యట్ల నుండు నంతఁ బుట్టెఁ
దనయుఁ డష్టముండు దల్లిదండ్రుల కతి
ప్రీతియును ముదంబుఁ బెరుఁగుచుండ.

(వరుణుడు మొదలైన వసువులు పుట్టగానే గంగ వారిని తీసుకువెళ్లి గంగానదినీటిలో పడవేసేది. ఎందుకలా చేస్తున్నావు అని అడగటానికి శంతనుడు వెనుకాడేవాడు. తనను వదిలి వెళ్లిపోతుందేమోనన్న భయంతో ఎప్పటిలాగానే ఉండేవాడు. అటువంటి సమయంలో వారికి ఎనిమిదవ కొడుకు పుట్టాడు.)

No comments: