Sunday, February 19, 2006

1_4_162 వచనము విజయ్ - విక్రమాదిత్య

వచనము

నీవు ధర్మమూర్తివి మాచేసిన యజ్ఞానంబు సహించి మర్త్యంబునం బెద్దకాలం బుండకుండ మా కనుగ్రహింపవలయునని ప్రార్థించిన నమ్ముని ప్రసన్నుం డయి మీకోరినయట్ల యగు నష్టముం డయిన యీ ప్రభాసుండు పెద్దయు నపరాధంబుఁ జేసెం గావున వీఁడు మర్త్యలోకంబునం బెద్దకాలంబుండు ననపత్యుఁడు నగు ననియె నని గంగాదేవి తనస్వరూపంబుఁ జూపి వసూత్పత్తియు స్వర్గగమననిమిత్తంబును గాంగేయజన్మస్థితియునుం జెప్పి దేవవ్రతుం డయిన యిక్కుమారుండు పెరుఁగునంతకు నాయొద్దన యుండునని శంతను నొడంబఱచి కొడుకుం దోడ్కొని యరిగిన విస్మయం బంది శంతనుండు దానితోడి యిష్టోపభోగంబులం బెద్దకాలంబు సనిన నల్పకాలంబు కా వగచుచు హస్తిపురంబునకు వచ్చి.

(మహర్షీ! మేము చేసిన పనికి ఓర్చుకొని భూలోకంలో ఎక్కువకాలం ఉండకుండా అనుగ్రహించు - అని వేడుకోగా వసిష్ఠుడు - అలాగే. కానీ ఎనిమిదవవాడైన ప్రభాసుడు పెద్ద నేరం చేశాడు కాబట్టి వీడు భూలోకంలో ఎక్కువ కాలం జీవిస్తాడు. అతడికి సంతానం కూడా ఉండదు - అని అన్నాడని గంగాదేవి శంతనుడికి చెప్పి తన నిజస్వరూపం చూపి, భీష్ముడు పుట్టుక గురించి చెప్పి, ఎనిమిదవ పుత్రునికి దేవవ్రతుడని పేరుపెట్టింది. అతడు పెద్దవాడయ్యేంతవరకూ తన దగ్గరే ఉంటాడని చెప్పి, శంతనుడిని ఒప్పించి, కొడుకును తనతో తీసుకువెళ్లింది. శంతనుడు హస్తినాపురానికి తిరిగివచ్చి.)

No comments: