Sunday, February 19, 2006

1_4_184 వచనము పవన్ - వసంత

వచనము

బహుపుత్త్రార్థంబు యత్నంబు సేయవలయు వివాహం బయ్యెద ననిన విని గాంగేయుండు వృద్ధామాత్యపురోహితసుహృజ్జనంబులతో విచారించి యోజనగంధి రాజుచిత్తంబునం గలుగుట యెఱింగి యనేకరాజన్యసమన్వితుండయి దాశరాజుకడకుం జని మా రాజునకు సత్యవతిని దేవింగానిచ్చునది యని యడిగిన నాతండును దేవవ్రతుం బూజించి నీవు ధర్మశీలుండ వర్థానర్థవిదుండవు సకలకార్యసమర్థుండవు గుర్వర్థంబు కన్యార్థి వై వచ్చితివి కావునం గృతార్థుండ నైతి నెవ్వనియేని వీర్యంబున నిక్కన్య యుద్భవిల్లె నట్టి యుపరిచరుం డను రాజర్షి యీ సత్యవతినొరుల కీ వలవదు శంతనునక యిచ్చునది యనుటంజేసి తొల్లి యసితుం డయిన దేవలుండు కన్యార్థి యయి వచ్చి ప్రత్యాఖ్యాతుం డయ్యె నిట్టి సంబంధ మెవ్వరికిఁ బడయనగు.

(ఇంకొందరు పుత్రుల కోసం ప్రయత్నం చేయాలి. వివాహం చేసుకుంటాను - అని శంతనుడు అనగా, గాంగేయుడు హితులతో ఆలోచించి, రాజు మనసులో యోజనగంధి ఉన్నదని తెలుసుకొని, సామంతరాజులతో దాశరాజు దగ్గరకు వెళ్లి - మా రాజుకు సత్యవతిని రాణిగా ఇవ్వండి - అని అడిగాడు. దాశరాజు దేవవ్రతుడితో - ఈమె తండ్రి అయిన ఉపరిచరుడు ఈమెను శంతనుడికే ఇమ్మని అన్నాడు. పూర్వం అసితవంశానికి చెందిన దేవలుడు ఈమెను కోరినా నేను తిరస్కరించాను.)

No comments: