Wednesday, March 15, 2006

1_5_12 వచనము నచకి - వసంత

వచనము

అనిన వారిపలుకులు విని గాంధారి ధృతరాష్ట్రునకుఁ బితృవచనదత్తఁగాఁ దన్ను నిశ్చయించి నాకుఁ బతి యిమ్మహీపతియ కాని యొరుల నొల్ల నని యప్పరమపతివ్రత పరపురుషదర్శనంబు పరిహరించి పతి కనుగుణంబుగా నేత్రపట్టంబునఁ దన నేత్రంబులు గట్టికొని యుండె నంత నక్కన్యం దోడ్కొని దాని సహోదరుండయిన శకుని మహావిభూతితో హస్తిపురంబునకు వచ్చిన ధృతరాష్ట్రుండును బరమోత్సవంబున గాంధారిని వివాహం బై దానితోఁ బుట్టిన కన్యకల సత్యవ్రతయు సత్యసేనయు సుదేష్ణయు సంహితయుఁ దేజశ్శ్రవయు సుశ్రవయు నికృతియు శుభయు శంభువయు దశార్ణయు నను పదుండ్ర నొక్కలగ్నంబున వివాహం బయి మఱియును.

(ఆ మాటలు విన్న గాంధారి, తండ్రి తనను ధృతరాష్ట్రునికి ఇచ్చినట్లు గ్రహించింది. ఆమె పరపురుషులను చూడటానికి ఇష్టపడక, భర్తకు కళ్లు లేవు కనుక తాను కూడా కళ్లకు అడ్డంగా గుడ్డ కట్టుకొన్నది. తరువాత ఆమె సోదరుడు శకుని ఆమెను వెంటబెట్టుకొని హస్తినాపురానికి వచ్చాడు. ధృతరాష్ట్రుడు గాంధారినే కాక ఆమె చెల్లెళ్లు పదిమందిని కూడా పెళ్లిచేసుకొన్నాడు.)

No comments: