Friday, March 31, 2006

1_5_80 వచనము నచకి - వసంత

వచనము

అట్టి వ్యుషితాశ్వుండు కాక్షీవతి యైన భద్ర యను తన భార్య యందు ననవరత కామాసక్తిం జేసి యక్ష్మరుజాక్రాంతుం డయి యస్తమించిన నది పుత్త్రాలాభదుఃఖిత యయి పతివియోగంబు సహింప నోపక.

(అటువంటి వ్యుషితాశ్వుడు తన భార్యమీద మితిమీరిన కామంతో వ్యవహరించి క్షయరోగం వచ్చి మరణించాడు. కొడుకులు లేకపోవటంతో అతడి భార్య భద్ర దుఃఖించి, భర్త చనిపోవటాన్ని సహించలేక.)

1_5_79 కందము విజయ్ - విక్రమాదిత్య

కందము

ఆతని యజ్ఞంబునఁ బురు
హూత పురస్సర మరుద్గుణోత్తము లధిక
ప్రీతిఁ జనుదెంచి హవ్యము
లాతత హస్తములఁ గొందు రగ్ని ముఖమునన్.

(అతడి యజ్ఞంలో దేవతలే వచ్చి ఆహుతులు అందుకునేవారు.)

1_5_78 చంపకమాల విజయ్ - విక్రమాదిత్య

చంపకమాల

అతుల బల ప్రతాప మహిమాధికుఁ డై వ్యుషితాశ్వుఁ డన్మహీ
పతి నయధర్మతత్పరుఁడు పౌరవవంశజుఁ డశ్వమేధముల్
శత మొనరించుచుండి భుజశక్తి జయించె మహీశులం బ్రవ
ర్ధితయశుఁ డై ప్రతీచ్యుల నుదీచ్యులఁ బ్రాచ్యుల దాక్షిణాత్యులన్.

(పౌరవుడైన వ్యుషితాశ్వుడనే మహారాజు ఎన్నో యాగాలు చేసి, నాలుగు దిక్కులలోని రాజులనూ జయించాడు.)

-:వ్యుషితాశ్వుం డను రాజు వృత్తాంతము:-

1_5_77 వచనము విజయ్ - విక్రమాదిత్య

వచనము

భవత్ప్రసాదంబున మా యందుఁ బుత్త్రోత్పత్తి యగు నె ట్లనిన దీని కనుగుణం బయినది యొక్క పుణ్యకథఁ దొల్లి పౌరాణికులవలన నా వినిన దానిం జెప్పెదఁ జిత్తగించి విను మని పాండురాజునకుఁ గుంతి యి ట్లనియె.

(నీ దయవల్ల మాకు పుత్రులు కలుగుతారు. ఎలాగంటే, దీనికి తగిన ఒక పుణ్యకథను నేను విన్నాను. అది చెపుతాను వినండి.)

1_5_76 కందము విజయ్ - విక్రమాదిత్య

కందము

భరతకులశ్రేష్ఠుఁడ వయి
పరఁగిన నీ కేము ధర్మపత్నుల మయి యిం
కొరుల మనుష్యుల నంతః
కరణంబులఁ దలఁపఁ బొందఁగా నోపుదుమే.

(నీకు భార్యలమై, పరపురుషుల గురించి ఆలోచించటానికి ఒప్పుకోగలమా?)

Thursday, March 30, 2006

1_5_75 వచనము విజయ్ - విక్రమాదిత్య

వచనము

ఔరస క్షేత్త్రజ దత్తక కృత్రిమ గూఢోత్పన్నాపవిద్ధు లను నార్వురు పుత్త్రులు బంధువులు దాయాదులు నగుదురు కానీన సహోఢక్రీతపౌనర్భవ స్వయందత్త జ్ఞాతులను నార్వురు పుత్త్రులు బంధువు లగుదురు గాని దాయాదులు గా రట్టి పుత్త్రులలో నౌరసున కించుకయ తక్కువగాని తక్కటి పుత్త్రులకంటె క్షేత్రజుం డుత్కృష్టుం డందును దేవరన్యాయజాతుం డుత్తముం డండ్రు గావున నస్మన్నియోగంబునంజేసి ధర్మమార్గంబున క్షేత్రజులం బడసిన నేనును బుత్త్రవంతుల పుణ్యలోకంబులు వడయనేర్తు నె ట్లనినఁ దొల్లి గేకయరా జైన శారదండాయని పుత్త్రోత్పాదనంబునం దశక్తుం డయి తనధర్మపత్ని నీచెలియలి శ్రుతసేనం బుత్త్రార్థంబు నియోగించిన నది బ్రాహ్మణవచనంబునం బుణ్యస్నాత యై పుంసవనహోమంబు సేయించి ఋత్విజులవలన దుర్జయాదు లయిన కొడుకుల మువ్వురం బడసెఁ బుత్త్రలాభంబున ననంతపుణ్యఫలం బగుట నది ధర్మ్యం బయిన యాచారం బనిన విని కుంతి యి ట్లనియె.

(దేవరన్యాయం చేత క్షేత్రజులను పొందటం ధర్మమే - అని పాండురాజు చెప్పగా కుంతి ఇలా అన్నది.)

1_5_74 కందము విజయ్ - విక్రమాదిత్య

కందము

అనపత్యుఁడ నై జీవిం
చిన మృతిఁ బొందినను నిర్విశేషంబ యిహం
బును బరమును నఫలమ గా
వున సంతతివడయు ధర్మువున ధర్మసతీ.

(ధర్మపద్ధతిలో సంతానాన్ని పొందు.)

1_5_73 ఉత్పలమాల విజయ్ - విక్రమాదిత్య

ఉత్పలమాల

దానములం దపంబుల స దక్షిణ యజ్ఞములన్ విహీన సం
తానుల కూర్ధ్వలోక సుపథంబు లవశ్యము గావు లబ్ధ సం
తానుల యెందుఁ బుణ్యు లిది తథ్యము గావున నొండు దక్కి సం
తానము నాకు నయ్యెడువిధం బొనరింపుము ధర్మసంస్థితిన్.

(ధర్మమార్గంలో నాకు సంతానం కలిగేలా చెయ్యి.)

1_5_72 వచనము విజయ్ - విక్రమాదిత్య

వచనము

అని దుఃఖించి మృగశాపంబు దలంచి తనవలన సంతానం బయ్యెడి విధంబు లేమి యెఱింగి యొక్కనాఁ డేకాంతంబ గొంతి కి ట్లనియె.

(అని, జింకల శాపాన్ని తలచుకొని, తనవల్ల సంతానం కలిగే మార్గం లేదని గుర్తించి, కుంతితో ఇలా అన్నాడు.)

1_5_71 తేటగీతి విజయ్ - విక్రమాదిత్య

తేటగీతి

దేహ నాశంబుతోడన తీఱు నెల్ల
ఋణములును మఱి పితరులఋణము దేహ
నాశ మయినను దీఱదు నాకు నదియ
తక్కియున్నది యే నెట్లు దానిఁ బాతు.

(దాన్ని ఎలా తీర్చుకోగలను?)

Wednesday, March 29, 2006

1_5_70 వచనము పవన్ - వసంత

వచనము

అపుత్త్రస్య గతిర్నాస్తి యను వేదన వచనంబుం గలదు గావున నేనపుత్త్రకుండ నేమి సేయుదు ననిన మునులును గరుణించి యోగదృష్టి ననాగతం బెఱింగి నీ వపుత్త్రకుండవు గావు దైవాధిష్ఠితం బై న సంతానంబు నీకు ధర్మానిలశక్రాశ్వినులవరంబున నగు నక్షయలోకంబులుం బడయుదువు గావున సంతానార్థంబు యత్నంబుఁ సేయు మనిన విని పాండురా జాత్మగతంబునఁ బురుషుండు పుట్టుచుండి దేవఋషి పితృమనుష్యులఋణంబులు నాలుగింటితోడం బుట్టి యథాకాలవిధుల వానివలన విముక్తుండు గావలయు నట్లుగాని వానికిఁ బుణ్యలోకంబులు లేవు యజ్ఞంబులం జేసి దేవతలఋణంబును దపస్స్వాధ్యాయబ్రహ్మచర్యవ్రతంబులంజేసి ఋషుల ఋణంబును శ్రాద్ధపుత్త్రలాభంబులం జేసి పితరుల ఋణంబును నానృశంస్యంబునం జేసి మనుష్యుల ఋణంబునుం బాపవలయు నందుఁ బితరుల ఋణంబు దక్కఁ దక్కిన మూఁడు ఋణంబుల వలన విముక్తుండ నయితి.

(మునులు అతడితో - నీకు దేవతల వరాలవల్ల సంతానం కలుగుతుంది. కాబట్టి సంతానం కోసం ప్రయత్నించు - అని చెప్పారు. పాండురాజు ఇలా ఆలోచించాడు - దేవ, ఋషి, పితృ, మనుష్య ఋణాలలో పితరుల ఋణం తప్ప మిగతా మూడూ తీర్చుకొన్నాను.)

1_5_69 కందము పవన్ - వసంత

కందము

అనిన విని నరుల కక్కడఁ
జనఁబోలమి యెఱిఁగి పాండుజనపాలకుఁ డి
ట్లనియెను స్వర్గద్వారం
బనపత్యులు గాననోపరటె మును లయ్యున్.

(మానవులు అక్కడికి వెళ్లలేరని పాండురాజు తెలుసుకొని - సంతానం లేని వాళ్లు స్వర్గద్వారాన్ని చూడలేరట కదా - అన్నాడు.)

1_5_68 కందము పవన్ - వసంత

కందము

వీర లతి లలిత మృదులా
కారలు గిరివిషమ గహనగహ్వరముల రా
నేరరు గావున నిట చను
దేరక మీ రుండు డివియు దేవపథంబుల్.

(మునులు వారిని చూసి ఇలా అన్నారు - మీరు ఆగండి. ఇవి దేవమార్గాలు.)

1_5_67 వచనము పవన్ - వసంత

వచనము

అది కారణంబుగా నేమును బ్రహ్మలోకంబునకుం బోయెద మనిన నమ్మునుల పిఱుంద భార్యాద్వయసహితుండై సమవిషమప్రదేశంబులం జనుచున్న య ప్పాండురాజుం జూచి ఋషు లి ట్లనిరి.

(పాండురాజు కూడా తన భార్యలతో పాటు మునులను అనుసరించి మిట్టపల్లాలతో ఉన్న ఆ దారిలో బయలుదేరాడు.)

1_5_66 కందము పవన్ - వసంత

కందము

అమవస గావున నేఁ డ
క్కమలజుఁ గొలువఁగ మహర్షిగణములు పితృసం
ఘములును బోదురు బ్రహ్మాం
డమునం గలవార లం దొడంగూడంగన్.

(ఈ రోజు అమావాస్య. అందువల్ల బ్రహ్మదేవుడిని సేవించటానికి అందరూ బ్రహ్మలోకానికి పోతారు.)

Tuesday, March 28, 2006

1_5_65 వచనము పవన్ - వసంత

వచనము

ఇట్లు శతశృంగంబున నుత్తర భాగంబునందుఁ దపంబు సేయుచు బ్రహ్మఋషి సమానుం డై దివ్యవిమానంబు లెక్కి వచ్చుచుం బోవుచున్న దేవగణంబుల చేత సంకీర్ణం బైన స్వర్గమార్గంబున నుత్తరాభిముఖు లై యూర్ధ్వలోకంబున కనాయాసంబున నరిగెడు మునిసహస్రంబుం జూచి మీర లెందులకుఁ బోయెద రని యడిగిన నప్పాండురాజునకు వార లి ట్లనిరి.

(ఉత్తరదిక్కుగా స్వర్గానికి పోతున్న మునులను పాండురాజు చూసి - మీరు ఎక్కడికి పోతున్నారు - అని అడిగాడు. వారు ఇలా అన్నారు.)

1_5_64 మత్తేభము పవన్ - వసంత

మత్తేభము

యతి సంఘంబుల సంగతిన్ దురితకర్మాపేతుఁ డై యేఁగి సం
తతససిద్ధామరయక్ష సేవితసముద్యచ్ఛృంగ మై యున్న యా
శతశృంగం బను పర్వతంబున శుభాచారుండు నిత్యవ్రతో
ద్యతుఁ డై ఘోరతపంబు సేసె మునిబృందం బద్భుతం బందఁగన్.

(శతశృంగమనే పర్వతం చేరి అక్కడి మునులందరూ ఆశ్చర్యపడేలా తపస్సు చేశాడు.)

-:పాండురాజు శతశృంగంబునఁ దపోవృత్తి నుండుట:-

1_5_63 వచనము పవన్ - వసంత

వచనము

మఱియుం గల వస్తువు లెల్లను ధృతరాష్ట్రున కిచ్చి పుచ్చి మమత్వాహంకారవిముక్తుండై ధర్మపత్ను లయ్యిరువురుఁ దనయట్ల తపస్విను లై తోడరా నుత్తరాభిముఖుం డై యరిగి నాగశైలంబును జైత్రరథంబును బారిషేణంబును హిమవంతంబునుం గడచి సురసిద్ధసేవితం బయిన గంధమాదనంబునం గొండొక కాలం బుండి యింద్రద్యుమ్నం బను కొలనును హంసకూటంబును నతిక్రమించి.

(తన దగ్గర మిగిలిన వస్తువులన్నీ ధృతరాష్ట్రుడికి పంపి, తన భార్యలు వెంటరాగా, ఉత్తరదిశలో బయలుదేరాడు.)

1_5_62 పృథ్వి పవన్ - వసంత

పృథ్వి

అమూల్య మణి భూషణంబులు గజాశ్వ బృందంబులున్
సమృద్ధ ధన ధాన్యరాసులుఁ బ్రశస్తగోవర్గముం
గ్రమంబునను భూసురేశుల కగణ్యపుణ్యార్థి యై
యమర్త్యనిభుఁ డిచ్చెఁ బాండువిభుఁ డత్యుదారస్థితిన్.

(అప్పుడు పాండురాజు ఎన్నో దానాలు చేశాడు.)

1_5_61 వచనము పవన్ - వసంత

వచనము

అని నిశ్చయించి గొంతిని మాద్రినిం జూచి మీర లిందుండి నవయక హస్తిపురంబునకుం జని నాతపోవృత్తి నునికి రాజునకు సత్యవతీదేవికి భీష్మునకు విదురునకుం గౌసల్యలకు వృద్ధపురోహితబ్రాహ్మణులకుం జెప్పి యం దుండుం డనిన వారలు బాష్పపూరితనయన లయి యిట్టి యుగ్రతపంబు విడిచి మమ్ము విడువనియట్టి యాశ్రమంబున నుండి తపంబు సేయు నది యేము నిన్ను విడిచి పోవనోపము మమ్మువిడిచితేని యిప్పుడ ప్రాణంబులు విడుతు మనిన వారల నిశ్చయం బెఱింగి యట్లేని నాయెద్దన యుండుం డేను వానప్రస్థాశ్రమంబున వల్కలంబులు గట్టి రేపును మాపును మధ్యాహ్నంబునప్పుడును స్నానంబు సేసి వేల్చుచుం గందమూల ఫలాశనుండ నై పితృదేవతల వాక్సలిలవన్యఫలంబులం దనుపుచుఁ గ్రమంబున దేహమోక్షణంబు సేయుదు నని యప్పుడు.

(అని నిశ్చయించి, కుంతిని, మాద్రిని చూసి - మీరు హస్తినాపురానికి వెళ్లి నా తపస్సు గురించి పెద్దలకు తెలియజేసి అక్కడే ఉండండి - అని చెప్పాడు. వారు - ఇలాంటి భయంకరమైన తపస్సు మాని, మాతో పాటు ఆశ్రమంలో ఉండి తపస్సు చేయండి. మిమ్మల్ని విడిచి జీవించలేము - అన్నారు. పాండురాజు కూడా అందుకు అంగీకరించాడు.)

Monday, March 27, 2006

1_5_60 సీసము + ఆటవెలది పవన్ - వసంత

సీసము

ఇంద్రియార్థంబులం దింద్రియవ్యాపార
        ముడిగించి క్రియ లెల్ల విడిచి పుణ్య
పాపబంధంబుల నోపి బంధింపంగఁ
        బడక మనోవృత్తి నొడిచి నాకు
నిది ప్రియం బప్రియం బిది నింద ఇది మహా
        స్తుతి యిది యనక సంతత నితాంత
సంతోషయుతుఁడ నై వంతయు భయమును
        శీతాతపంబులు వాతగతియు

ఆటవెలది

నెఱుఁగ కివ్విధమున మఱచి శరీరంబు
మరణజీవితముల కురువిషాద
తోషవృత్తు లుడిగి భీషణాటవి నుండి
చేసెదను దపంబు భాసురముగ.

(అన్నీ త్యజించి అడవిలోనే ఉండి తపస్సు చేస్తాను.)

1_5_59 వచనము పవన్ - వసంత

వచనము

కామవ్యామోహితుం డయి కొండుకనాఁడు మదీయజనకుండు పరలోకగతుం డైనఁ దత్క్షేత్రంబున ధర్మమయుం డయిన కృష్ణద్వైపాయనమునివలన నుద్భవిల్లి ధర్మప్రవృత్తుండ నై యున్న నా కిట్టి దుర్వ్యసనంబు కర్మవశంబున సంభవించె నింక మునివృత్తియ యుచితంబు గావున సర్వసంగంబులు విడిచి సర్వభూతంబులయందు సమచిత్తుండ నై హింస దలంపక నిత్యంబు నొక్కొక్కవనస్పతియందు నొక్కొక్కవన్యఫలంబు భిక్ష గొని యసంభవం బయిననాఁ డుపవాసంబు సేసి వృక్షమూలంబున నుండి పాంసు పరిచ్ఛన్నదేహుండ నయి.

(నాకు ఇక మునివృత్తే తగినది.)

1_5_58 కందము పవన్ - వసంత

కందము

ఎట్టి విశిష్టకులంబునఁ
బుట్టియు సదసద్వివేకములు గల్గియు మున్
గట్టిన కర్మఫలంబులు
నెట్టన భోగింపకుండ నేర్తురె మనుజుల్.

(మానవులు కర్మఫలం అనుభవింపక తప్పదు.)

1_5_57 వచనము పవన్ - వసంత

వచనము

తొల్లి యగస్త్య మహామునీంద్రుండు మృగ మాంసంబున నిత్యశ్రాద్ధంబు సేయుచుండి రాజులకు మృగవధ దోషంబు లేకుండ నిర్మించె దీని నీకు నిందింపఁదగునే యనుచున్న నమ్మృగంబులు బాణఘాతక్షతవేదన సహింపనోపక సర్వప్రాణులకు సాధారణం బయి యిష్టం బగు సుఖావసరంబున నున్న మమ్ము ననపరాధుల వధించితి గావున నీవునుం బ్రియాసంగమం బయిన యప్పుడ పంచత్వం బొందెడు మని నీ ప్రియయు నిన్ను ననుగమించు నని పాండురాజునకు శాపం బిచ్చి గతప్రాణము లై పడియున్న మృగంబులం జూచి శోకించి పాండురాజు పరమనిర్వేదనపరుం డయి.

(పూర్వం అగస్త్యుడు రాజులకు మృగవధదోషం లేకుండా చేశాడు. కాబట్టి నువ్వు నన్ను నిందించటం తగదు - అని అంటూ ఉండగా ఆ మృగాలు బాణం వల్ల కలిగిన బాధ ఓర్చుకోలేక - సంభోగసమయంలో ఉండగా మమ్మల్ని చంపావు. నువ్వు కూడా అలాగే మరణిస్తావు. నీ భార్యకూడా మరణిస్తుంది - అని శాపమిచ్చి చనిపోయాయి. పాండురాజు నిరాశ చెంది.)

1_5_56 తేటగీతి పవన్ - వసంత

తేటగీతి

పగఱఁ గని సైఁతురేనియు మృగకులంబు
గని సహింపరు రాజులు మొనసి వాని
గ్రచ్చఱగఁ జంపుదురు నమ్మి కిచ్చి చంపఁ
జనదు మాయాబలంబునఁ జనదు చంప.

(రాజులు శత్రువులను చూసి అయినా సహిస్తారేమో కానీ మృగాలను చూసి సహించరు. వెంటనే వాటిని చంపుతారు. అయినా నమ్మించి కానీ, మోసంచేసి కానీ చంపకూడదు.)

Sunday, March 26, 2006

1_5_55 వచనము పవన్ - వసంత

వచనము

అని తన్ను నిందించి పలికిన నామృగంబు పలుకుల కలిగి పాండురా జి ట్లనియె.

(అని నిందించిన ఆ జింకతో పాండురాజు ఇలా అన్నాడు.)

1_5_54 చంపకమాల పవన్ - వసంత

చంపకమాల

ఇనసమతేజు లై ధరణి నెన్నడు ధర్మపథంబు దప్పఁ ద్రొ
క్కని భరతాదిరాజుల జగన్నుతవంశమునందుఁ బుట్టి నీ
కనఘచరిత్ర యిట్లు దగునయ్య యధర్మువు సేయ నీ యెఱుం
గని నృపధర్మువుల్ గలవె కౌరవపుంగవ గౌరవస్థితిన్.

(కౌరవశ్రేష్ఠుడివైన నువ్వు ఇలా చేయటం ఉచితమేనా?)

1_5_53 తేటగీతి పవన్ - వసంత

తేటగీతి

పఱవనోపక యున్న మైమఱచి పెంటిఁ
బెనఁగియున్నను బ్రసవింప మెనసియున్నఁ
దెవులు గొనియున్న మృగములఁ దివిరి యేయ
రెఱచి యాహారముగ మను నెఱుకు లయిన.

(కానీ, పరుగెత్తలేనివి, పెంటితో కూడి ఉన్నవి, ఈనుతున్నవి, వ్యాధితో ఉన్నవి అయిన జంతువులను మాంసమే ఆహారంగా జీవించే బోయవారు కూడా కొట్టరు.)

1_5_52 వచనము పవన్ - వసంత

వచనము

మృగముల మై యున్న మమ్ము వధియించిన దీన నీకు పాతకంబు లేదు వేటలాడుటయు మృగంబులఁ జంపుటయు రాజులకు ధర్మంబ యయినను.

(జింకలమై ఉన్న మమ్మల్ని వేటలో చంపటం వల్ల నీకు పాపం రాదు.)

1_5_51 తరలము పవన్ - వసంత

తరలము

హరిపరాక్రమ యేను గిందముఁ డన్మునిన్ మృగముల్ నిరం
తరము నిట్లు రమింపఁగాఁ గని తద్రతం బెడఁ గోరి సుం
దర మృగాకృతి నేను భార్యయు దారుణాటవిఁ గామ భో
గరతి నుండితి మిష్టచారి మృగవ్రజంబుల పొత్తునన్.

(నేను కిందముడు అనే మునిని. ఈ అడవిలో జంతువులు సంభోగించటం చూసి అలా ఉండాలని నేను, నా భార్య మృగరూపాలు ధరించాము.)

Saturday, March 25, 2006

1_5_50 వచనము పవన్ - వసంత

వచనము

ఇ ట్లేసి యబ్బాణంబులు పుచ్చికొనియున్న యప్పాండురాజుం జూచి యమ్మృగమిధునంబునం దల్పావశిష్టజీవం బై పడియున్న మృగంబు మనుష్య వచనంబుల ని ట్లనియె.

(ఆ జంటలో కొన ఊపిరితో ఉన్న మగజింక పాండురాజుతో ఇలా అన్నది.)

1_5_49 కందము పవన్ - వసంత

కందము

మనసిజ రాగంబునఁ బెనఁ
గిన యిఱ్ఱిని లేడిఁ జూచి కృతహస్తుఁడు పె
ల్చన యే నమ్ముల నారెం
టిని ద్రెళ్ళఁగ నేసెఁ గడుఁ గఠినహృదయుం డై.

(కలిసి ఉన్న జింకల జంటను చూసి అవి చనిపోయేలా వాటిమీద బాణాలు వేశాడు.)

1_5_48 వచనము పవన్ - వసంత

వచనము

మఱియుఁ దనకు ధృతరాష్ట్రుం డిష్టాన్నపాన మాల్యానులేపన భూషణాదులు నిత్యంబునుం బుత్తెంచుచుండ నిట్లు వనవాసవ్యాసంగంబున నుండి యెక్కనాఁడు పెక్కుమృగంబుల నెగిచి యొక్కటి నేనియు నేయంగానక కినిసి యొక్కయెడ.

(తమకు కావలసినవన్నీ ప్రతిరోజూ ధృతరాష్ట్రుడు పంపుతూ ఉండగా, అడవిలో వేటాడుతూ, చాలా మృగాలను తరిమి, ఒక్కదాన్ని కూడా కొట్టటం సాధ్యం కాక.)

1_5_47 ఉత్పలమాల పవన్ - వసంత

ఉత్పలమాల

వాసవ సన్నిభుండు హిమవన్నగ దక్షిణ పార్శ్వభూములన్
శ్రీసతిఁ బోని కుంతియును జెల్వగు మాద్రియుఁ దోడ రాఁగ బా
ణాసన బాణ భాసిత మహాభుజుఁ డై విహరించుచుండె ని
చ్ఛాసదృశంబుగా గజవశా ద్వయ మధ్య గజేంద్ర లీలతోన్.

(బాణాలను చేపట్టి, కుంతి, మాద్రి తన వెంటరాగా హిమాలయాలకు దక్షిణాన ఉండే భూములలో విహరిస్తూ.)

1_5_46 వచనము పవన్ - వసంత

వచనము

మఱియు ననేకవినోదంబులను ననవరతకామానురూపవిషయసుఖానుభవంబులనుం బ్రొద్దు పుచ్చుచు నాతండు మృగయావ్యసనంబునం దగిలి.

(పాండురాజు సుఖంగా కాలాన్ని గడుపుతూ ఒక రోజు వేటమీద ఆసక్తితో.)

-:వేటకుఁ బోయిన పాండురాజునకు శాపంబు గలుగుట:-

Friday, March 24, 2006

1_5_45 కందము పవన్ - వసంత

కందము

నానాద్రవ్య నిరంతర
దానముల ననూనయజ్ఞదక్షిణలను ధా
త్రీనాథుఁడు బ్రాహ్మణులను
శ్రీనిలయులఁ జేయుచుండె శిష్టప్రియుఁ డై.

(పాండురాజు దానాలు, యజ్ఞాలు చేస్తూ ఉండేవాడు.)

1_5_44 కందము పవన్ - వసంత

కందము

మండిత గుణ సంపద నధి
కుం డగుచున్ బూరు భరత కురు పతులకుఁ దు
ల్యుం డయి వంశకరుం డగుఁ
బాండుమహీశుఁ డని బుధసభలు దనుఁ బొగడన్.

(పాండురాజు గొప్పవాడై, పూరు, భరత, కురు చక్రవర్తులతో సమానుడై వంశాన్ని నిలుపుతాడు - అని పండితులు తనను పొగడగా.)

1_5_43 వచనము పవన్ - వసంత

వచనము

మఱియు నప్పాండురాజు వినయవిధేయత్వంబున ధృతరాష్ట్రునకు నభిమతకార్యకరణంబున బాంధవులకు ననుకూలత్వంబున సుహృజ్జనులకుఁ బరిశ్రమజ్ఞానంబున విద్వాంసులకుఁ గారుణ్యదానంబున ననాథులకు నభయంకరత్వంబున మహీప్రజలకు సంతోషంబు సేయుచు.

(పాండురాజు ప్రజలందరికీ సంతోషాన్ని కలిగిస్తూ.)

1_5_42 చంపకమాల పవన్ - వసంత

చంపకమాల

వినుత యశుండు పాండు నృప వీరుఁడు దిగ్విజయంబు సేసి పెం
పునఁ గొనివచ్చి యిచ్చిన యపూర్వ మహా ధనరాశి పేర్మి వా
రని విభవంబుతోడ ధృతరాష్ట్రుఁడు సేసె శతాశ్వమేధముల్
దని సన భూసురేశులకు దక్షిణ లిచ్చి యథోచితంబుగన్.

(పాండురాజు తెచ్చిన ధనంతో ధృతరాష్ట్రుడు వంద అశ్వమేధయాగాలు చేశాడు.)

1_5_41 వచనము పవన్ - వసంత

వచనము

ఇట్లు పాండురాజు దిగ్విజయంబు సేసి తదుపార్జితంబు బైన యపరిమితధనంబులఁ దెచ్చి ధృతరాష్ట్రుననుమతంబున భీష్మునకు సత్యవతికిం దమతల్లు లైన కౌసల్యలకు విదురునకు సుహృజ్జనులకు బ్రాహ్మణులకు నిచ్చి వారివలన ననేకాశీఃప్రశంసలు వడసి సుఖం బున్నంత.

(ఇలా పాండురాజు దిగ్విజయం చేసి తెచ్చిన సంపదను ధృతరాష్ట్రుడి అనుమతితో పెద్దలకు ఇచ్చి సుఖంగా ఉండగా.)

Thursday, March 23, 2006

1_5_40 కందము పవన్ - వసంత

కందము

శరనిధి పరివృత విశ్వం
భరఁ గల భూపతులు పాండుపతికృతమునఁ గిం
కరు లై ప్రతిసమకల్పిత
కరు లై రది మొదలుగాఁగఁ గౌరవ్యులకున్.

(అప్పటి నుండి వారు కురువంశరాజులకు ప్రతి సంవత్సరం కప్పం చెల్లించేవారు.)

1_5_39 చంపకమాల విజయ్ - విక్రమాదిత్య

చంపకమాల

లలిత హయ ద్విపంబుల విలాసినులన్ మణిరౌప్య కాంచనా
వలుల నజావిగోమహిష వర్గములన్ బహుభూషణంబులన్
బలువిడిఁ గప్పముల్ ధరణిపాలురచేఁ గొని నూఱువేల్ గజం
బులఁ బెఱికించి తెచ్చెఁ గురుముఖ్యుఁ డకుప్యధనమ్ము లిమ్ముగన్.

(పాండురాజు వారి దగ్గర కప్పాలు గ్రహించాడు.)

1_5_38 మహాస్రగ్ధర విజయ్ - విక్రమాదిత్య

మహాస్రగ్ధర

అతిరౌద్రాకారకీలాయతదవదహనోగ్రాగ్ర సేనానిపీడా
హతు లై నానావిధోపాయనములు గొని సౌహార్దవాంఛన్ జయశ్రీ
శ్రితబాహుం గానఁగా వచ్చిరి సకలజగత్సేవ్యమానున్ మహేంద్ర
ప్రతిముం గౌరవ్యవంశప్రభు నఖిలమహీపాలు రాంబాలికేయున్.

(రాజులందరూ కానుకలు తీసుకొని పాండురాజును చూడటానికి వచ్చారు.)

1_5_37 కందము విజయ్ - విక్రమాదిత్య

కందము

అతులప్రతాపలీలా
యుతుఁ డై ప్రాగ్దక్షిణాపరోత్తరదిగ్భూ
పతుల నిజశాసన వశీ
కృతులం గావించెఁ దనదుకీర్తి వెలుంగన్.

(నాలుగు దిక్కుల రాజులనూ తన ఆజ్ఞకు లొంగేటట్లు చేశాడు.)

1_5_36 మత్తేభము విజయ్ - విక్రమాదిత్య

మత్తేభము

ధ్వజినీ పాత భరంబునం దలరఁగా ధాత్రీధరాహీంద్ర మూ
ర్ధజరత్నప్రకరంబు లున్నతగజేంద్రస్యందనప్రోల్లస
ద్ధ్వజ వాతాహుతిఁ దూలఁగా జలదబృందం బీక్రియన్ సర్వది
గ్విజయార్థం బరిగెం గురుప్రభుఁడు దోర్వీర్యప్రకాశార్థి యై.

(పాండురాజు దిగ్విజయం కోసం బయలుదేరాడు.)

Wednesday, March 22, 2006

1_5_35 వచనము విజయ్ - విక్రమాదిత్య

వచనము

మఱియు భీష్మానుమతంబున మద్రరాజతనయ మాద్రి యనుదాని మహోత్సవంబున వివాహం బై పాండురాజు భరతకులరత్నాలంకారుం డై పరాక్రమంబున నెవ్వరిని మెచ్చక యపారచతురంగబలసమన్వితుం డై.

(భీష్ముడి అనుమతితో పాండురాజు మద్రరాజు కూతురైన మాద్రిని కూడా పెళ్లిచేసుకొని పరాక్రమంలో ఎవరినీ లెక్కచేయకుండా.)

1_5_34 సీసము + ఆటవెలది విజయ్ - విక్రమాదిత్య

సీసము

యదుకులవిమలపయఃపయోనిధిసుధా
        కరరేఖఁ గమనీయకాంతినిలయ
ననవరతాన్నదానాభితర్పితముని
        విప్రజనాశీఃపవిత్రమూర్తి
వినయాభిమాన వివేక సౌజన్యాది
        సదమల గుణరత్న జన్మభూమిఁ
బరమపతివ్రతాభరణాభిశోభితఁ
        దామరసేక్షణఁ దాల్మియందుఁ

ఆటవెలది

బృథివిఁ బోనిదానిఁ బృథయను కన్యక
నధికవీరుఁ డై స్వయంవరమునఁ
బడసి పరనరేంద్రపరిభావిపాండు భూ
వరుఁడు పేర్మితో వివాహ మయ్యె.

(కుంతిని పాండురాజు పెళ్లిచేసుకొన్నాడు.)

-:పాండురాజు వివాహ మై దిగ్విజయము సేయుట:-

1_5_33 వచనము విజయ్ - విక్రమాదిత్య

వచనము

ఇట్లు వసునివహంబుతో వచ్చుటంజేసి వసుషేణుం డను నామంబునం బరగి కర్ణుండు రాధేయుం డై సూతగృహంబునం బెరుఁగుచుండె నంత నిట.

(వసుషేణుడు అనే పేరుతో కర్ణుడు రాధ కొడుకుగా సూతుడి ఇంట్లో పెరుగుతూండేవాడు. ఇక్కడ.)

1_5_32 కందము విజయ్ - విక్రమాదిత్య

కందము

తన భార్యకు రాధకు ని
చ్చిన నదియును గరము సంతసిల్లి కుమారుం
గని చన్నులు సేఁపి ముదం
బునఁ బెనిచెను సుహృదు లెట్టిపుణ్యమొ యనఁగన్.

(తన భార్యకు ఇవ్వగా ఆమె ఆ బిడ్డను పెంచింది.)

1_5_31 ఆటవెలది విజయ్ - విక్రమాదిత్య

ఆటవెలది

ఘనభుజుండు రాధ యను దాని పతి యొక్క
సూతుఁ డరుగుదెంచి చూచి రత్న
పుంజభరిత మయిన మంజసలో నున్న
కొడుకు దానితోన కొనుచు వచ్చి.

(రాధ అనే ఆమెకు భర్త అయిన ఒక సూతుడు అక్కడికి వచ్చి ఆ బిడ్డను తీసుకువెళ్లి.)

Tuesday, March 21, 2006

1_5_30 వచనము నచకి - వసంత

వచనము

వందురి వగచుచున్న దాని పుణ్యంబున నాదిత్యప్రేరితం బయి యనర్ఘరత్నవసుభరితం బయిన యొక్కమంజస నదీప్రవాహవేగంబునం దనయొద్దకు వచ్చిన దానిలోఁ జెచ్చెరఁ దనకొడుకుం బెట్టి కుంతి నిజగృహంబునకు వచ్చె నంత.

(అని బాధపడి, నదీప్రవాహంలో వచ్చిన ఒక పెట్టెలో తన కొడుకును పెట్టి ఇంటికి వెళ్లింది.)

1_5_29 వసంతతిలకము నచకి - వసంత

వసంతతిలకము

ఈ బాలు నెత్తుకొని యింటికిఁ జన్న నన్నున్
నా బంధులందఱు మనంబున నేమనా రె
ట్లీ బాలసూర్యునిభు నిట్టుల డించి పోవం
గా బుద్ధిపుట్టు నని కన్య మనంబులోనన్.

(ఈ బిడ్డతో ఇంటికి వెడితే నా బంధువులంతా నన్ను ఏమైనా అంటారు. అలాగని ఇతడిని ఎలా వదిలివెళ్లటం?)

1_5_28 తరువోజ నచకి - వసంత

తరువోజ

ఏల యమ్ముని నాకు నిచ్చె నిమ్మంత్ర మిమ్మంత్రశక్తి యే నెఱుఁగంగ వేఁడి
యేల పుత్త్రకుఁ గోరి యెంతయుభక్తి నినుఁ దలంచితి బ్రీతి నినుఁడును నాకు
నేల సద్యోగర్భమిచ్చెఁ గుమారుఁ డేల యప్పుడ యుదయించె నిం కెట్టు
లీ లోక పరివాద మే నుడిగింతు నింతకు నింతయు నెఱుఁగరె జనులు.

(ఇలా ఎందుకు జరిగింది? ఇక లోకాపవాదాన్ని ఎలా తప్పించుకొంటాను? జరిగినదంతా ప్రజలు తెలుసుకొని ఉండరా?)

1_5_27 వచనము నచకి - వసంత

వచనము

అంత నాదిత్యుం డాకాశంబున కరిగినఁ గొడుకుం జూచి కుంతి దద్దయు విస్మయం బంది యెద్దియుం జేయునది నేరక.

(తరువాత సూర్యుడు ఆకాశానికి వెళ్లిపోగా కుంతి తన కొడుకును చూసి ఏమి చేయాలో తెలియక.)

1_5_26 చంపకమాల నచకి - వసంత

చంపకమాల

సలలిత మైన పుట్టుఁగవచంబు నిసర్గజ మైన కుండలం
బుల యుగళంబు నొప్పఁగ సుపుత్త్రుఁడు కర్ణుఁడు పుట్టె సూర్యమం
డలమొకొ భూతలంబున బెడంగయి దీప్తి సహస్రకంబుతో
వెలుఁగెడు నా నిజద్యుతి సవిస్తరలీల వెలుంగుచుండఁగన్.

(కర్ణుడు సహజకవచకుండలాలతో ఆమెకు జన్మించాడు.)

-:కర్ణుఁడు జనియించి సూతగృహంబు సేరుట:-

Monday, March 20, 2006

1_5_25 వచనము నచకి - వసంత

వచనము

అనిన విని సూర్యుండు దానికిఁ గరుణించి నీకు సద్యోగర్భంబునఁ బుత్త్రుఁ డుద్భవిల్లు నీ కన్యాత్వంబును దూషితంబుగా దని వరం బిచ్చినఁ దత్క్షణంబ యక్కన్యకకు నంశుమంతునంశంబునఁ గానీనుం డై.

(అప్పుడు సూర్యుడు దయతలచి - నీకు ఇప్పటికి ఇప్పుడు కలిగే గర్భం వల్ల పుత్రుడు జన్మిస్తాడు. నీ కన్యాత్వం కూడా చెడదు - అని వరం ఇవ్వగా.)

1_5_24 ఆటవెలది నచకి - వసంత

ఆటవెలది

ఏను మంత్రశక్తి యెఱుఁగక కోరితిఁ
గన్య కిదియు కోరఁగాదు నాక
నాకు గర్భ మయిన నా తలిదండ్రులుఁ
జుట్టములును నన్నుఁ జూచి నగరె.

(మంత్రశక్తి తెలియక నేను పెళ్లికాని స్త్రీ కోరరానిది కోరాను. నాకు గర్భం వస్తే అందరూ నవ్వరా?)

1_5_23 వచనము నచకి - వసంత

వచనము

సూర్యుండును నీకు దుర్వాసుం డిచ్చిన వరంబును మంత్రంబుశక్తియు నెఱుంగుదు మదీయదర్శనంబు వృథ గాదు నీ యభిమతంబు సేయుదు ననిన గొంతి యి ట్లనియె.

(అప్పుడు సూర్యుడు - నీ వరం గురించి నాకు తెలుసు. కానీ, నా దర్శనం వృథా కాదు - అనగా కుంతి ఇలా అన్నది.)

1_5_22 ఆటవెలది నచకి - వసంత

ఆటవెలది

ఎఱుకలేమిఁ జేసి యింతు లెప్పుడు నప
రాధయుతలు సాపరాధ లయిన
వారిఁ గరుణ నెల్లవారును రక్షింతు
రనుచు సూర్యునకు లతాంగి మొక్కె.

(స్త్రీలు తెలివి లేక ఎప్పుడూ తప్పలు చేస్తారు. అందరూ వారిని దయతో మన్నిస్తారు - అని సూర్యుడికి నమస్కరించింది.)

1_5_21 వచనము నచకి - వసంత

వచనము

అ క్కన్యకయు నట్టితేజోరూపంబు సూచి విస్మయంబునను భయంబునను గడు సంభ్రమించి నడునడ నడుంగుచున్నదాని నోడకుండు మని సూర్యుండు ప్రసన్నుం డై నీకోరినవరం బీ వచ్చితి ననిన గొంతియు లజ్జావనతవదన యై యొక్కబ్రహ్మవిదుండు నాకుం గరుణించి యిమ్మంత్రం బుపదేశించిన దానిశక్తి నెఱుంగ వేఁడి యజ్ఞానంబున నిన్నుం ద్ర్రిలోకైకదీపకుం ద్రిపురుషమూర్తిఁ ద్రివేదమయు రావించిన యీయపరాధంబు నాకు సహింపవలయు.

(ఆమె భయపడగా, సూర్యుడు ప్రసన్నుడై - నువ్వు కోరిన వరం ఇవ్వటానికి వచ్చాను - అని అన్నాడు. కుంతి ఇలా అన్నది - ఈ మంత్రశక్తి తెలుసుకోవాలనే కోరికతో నిన్ను రప్పించాను. నా తప్పును క్షమించు.)

Sunday, March 19, 2006

1_5_20 కందము నచకి - వసంత

కందము

అని కేలు మొగిచి నిలిచిన
వనజాయతనేత్ర కడకు వచ్చెను గగనం
బున నుండి కమలమిత్త్రుఁడు
తన తీవ్రకరత్వ ముడిగి తరుణ ద్యుతితోన్.

(అప్పుడు సూర్యుడు ఆకాశం నుండి దిగి ఆమె దగ్గరకు వచ్చాడు.)

1_5_19 కందము నచకి - వసంత

కందము

అ మ్మంత్రముఁ దనదగు హృద
యమ్మున నక్కన్య నిలిపి యాదిత్యున క
ర్ఘ్య మ్మెత్తి నాకు నిమ్ము ప్రి
యమ్మున నీ యట్టి పుత్త్రు నంబుజమిత్త్రా.

(కుంతి ఆ మంత్రాన్ని జపించి, తనకు పుత్రుడిని ప్రసాదించమని సూర్యుడిని కోరింది.)

1_5_18 వచనము నచకి - వసంత

వచనము

కుంతియు న మ్మునివరు కోరిన యాహారంబు వెట్టిన సంతుష్టుం డై యమ్మునివరుం డి ట్లనియె నీమంత్రంబున నీ వే వేల్పుల నారాధించి తవ్వేల్పులు నీకోరినయట్టి పుత్త్రకుల నిత్తు రని యాపద్ధర్మంబుగా నొక్కదివ్య మంత్రంబుఁ బ్రసాదించి చనిన నమ్మంత్ర శక్తి యెఱుంగ వేఁడి కుంతి యొక్కనాఁ డే కాంతంబ గంగకుం జని యవగాహనంబు సేసి.

(కుంతి ఆ ముని కోరిన ఆహారం పెట్టగా దుర్వాసుడు సంతోషించి, ఆమె కోరిన దేవతలు ఆమెకు పుత్రులను ప్రసాదించేలా ఒక మంత్రాన్ని ఉపదేశించాడు. తరువాత ఆమె ఆ మంత్రశక్తిని తెలుసుకోవాలని ఒకరోజు గంగాతీరానికి వెళ్లి.)

1_5_17 సీసము + తేటగీతి నచకి - వసంత

సీసము

యాదవకులవిభుఁ డగు శూరుఁ డను నాతఁ
        డాత్మతనూజలయందుఁ బెద్ద
దాని నంబుజముఖి ధవళాక్షి వసుదేవు
        చెలియలిఁ బృథ యను చెలువఁ బ్రీతిఁ
దనమేనయత్తనందనుఁ డపుత్త్రకుఁ డైన
        యా కుంతిభోజున కర్థితోడఁ
గూఁతుఁగా నిచ్చినఁ గోమలి యాతని
        యింటఁ దానుండి యనేక విప్ర

తేటగీతి

వరుల కతిథిజనులకు నవారితముగఁ
దండ్రి పనుపున నిష్టాన్నదాన మొనరఁ
జేయుచున్న దుర్వాసుఁ డన్ సిద్ధమౌని
వచ్చె నతిథి యై భోజనవాంఛఁ జేసి.

(యాదవరాజైన శూరుడు అనేవాడు తన పెద్దకుమార్తె పృథను పిల్లలు లేని తన మేనత్త కొడుకు కుంతిభోజుడికి కుమార్తెగా ఇచ్చాడు. ఆమె కుంతిభోజుడి ఇంట్లో ఉండగా దుర్వాసుడు ఒకరోజు అతిథిగా వచ్చాడు.)

-:కుంతి చరిత్రము:-

1_5_16 వచనము నచకి - వసంత

వచనము

ఇ క్కుమారున కెందు వివాహంబు సేయుద మని విదురుతో విచారించుచుండె నంతఁ దొల్లి.

(అతడికి వివాహం చేయాలని విదురుడితో కలిసి ఆలోచించసాగాడు. పూర్వం.)

Wednesday, March 15, 2006

1_5_15 సీసము + ఆటవెలది నచకి - వసంత

సీసము

వేదంబులందుఁ బ్రవీణుఁ డై మఱి సర్వ
        శాస్త్రంబులందుఁ గౌశలము మెఱసి
యసికుంత కార్ముకాద్యాయుధ విద్యల
        యందు జితశ్రముఁ డై తురంగ
సింధురా రోహణశిక్షల దక్షుఁ డై
        నీతిప్రయోగముల్ నెఱయ నేర్చి
యతి మనోహర నవ యౌవనారూఢుఁ డై
        కఱలేని హిమరశ్మికాంతి దాల్చి

ఆటవెలది

పెరుఁగుచున్న కొడుకుఁ బృథువక్షు నాయత
బాహు దీర్ఘదేహుఁ బాండుఁ జూచి
వీనివలనఁ గులము వెలుఁగు నంచును నెడ
జాహ్నవీసుతుండు సంతసిల్లి.

(విద్యలను నేర్చుకొని, యౌవనంలో ప్రవేశించిన పాండురాజును చూసి భీష్ముడు సంతోషించి.)

1_5_14 వచనము నచకి - వసంత

వచనము

అంత.

(తరువాత.)

1_5_13 కందము నచకి - వసంత

కందము

కులమును రూపము శీలముఁ
గల కన్యలఁ దెచ్చి తెచ్చి గాంగేయుం డీ
నలఘుఁడు ధృతరాష్ట్రుఁడు కుల
తిలకుండు పరిగ్రహించె దేవీశతమున్.

(వీరినే కాక భీష్ముడు తెచ్చి ఇచ్చిన వందమంది కన్యలను కూడా ధృతరాష్ట్రుడు వివాహం చేసుకొన్నాడు.)

1_5_12 వచనము నచకి - వసంత

వచనము

అనిన వారిపలుకులు విని గాంధారి ధృతరాష్ట్రునకుఁ బితృవచనదత్తఁగాఁ దన్ను నిశ్చయించి నాకుఁ బతి యిమ్మహీపతియ కాని యొరుల నొల్ల నని యప్పరమపతివ్రత పరపురుషదర్శనంబు పరిహరించి పతి కనుగుణంబుగా నేత్రపట్టంబునఁ దన నేత్రంబులు గట్టికొని యుండె నంత నక్కన్యం దోడ్కొని దాని సహోదరుండయిన శకుని మహావిభూతితో హస్తిపురంబునకు వచ్చిన ధృతరాష్ట్రుండును బరమోత్సవంబున గాంధారిని వివాహం బై దానితోఁ బుట్టిన కన్యకల సత్యవ్రతయు సత్యసేనయు సుదేష్ణయు సంహితయుఁ దేజశ్శ్రవయు సుశ్రవయు నికృతియు శుభయు శంభువయు దశార్ణయు నను పదుండ్ర నొక్కలగ్నంబున వివాహం బయి మఱియును.

(ఆ మాటలు విన్న గాంధారి, తండ్రి తనను ధృతరాష్ట్రునికి ఇచ్చినట్లు గ్రహించింది. ఆమె పరపురుషులను చూడటానికి ఇష్టపడక, భర్తకు కళ్లు లేవు కనుక తాను కూడా కళ్లకు అడ్డంగా గుడ్డ కట్టుకొన్నది. తరువాత ఆమె సోదరుడు శకుని ఆమెను వెంటబెట్టుకొని హస్తినాపురానికి వచ్చాడు. ధృతరాష్ట్రుడు గాంధారినే కాక ఆమె చెల్లెళ్లు పదిమందిని కూడా పెళ్లిచేసుకొన్నాడు.)

-:ధృతరాష్ట్రుడు గాంధారిని వివాహంబు సేసికొనుట:-

1_5_11 తేటగీతి నచకి - వసంత

తేటగీతి

అంగములలోన మే లుత్తమాంగ మందు
నుత్తమంబులు గన్నుల యుర్విజనుల
కట్టి కన్నులు లే వను నదియకాక
యుత్తముఁడు గాఁడె సద్గుణయుక్తి నతఁడు.

(మానవుల అవయవాలన్నిటిలో శిరస్సు ప్రధానం. అందులో కన్నులే ప్రధానమైనవి. అటువంటి కన్నులే ధృతరాష్ట్రుడికి లేవు. కానీ అతడు ఉత్తముడే కదా!)

Saturday, March 11, 2006

1_5_10 వచనము నచకి - వసంత

వచనము

కావున ధృతరాష్ట్రునకు గాంధారిని వివాహంబు సేయుదము గాంధారపతి మన తోడి సంబంధమునకుం దగు నని నిశ్చయించి సుబలు పాలికిఁ దగు ముదుసళ్ళం బంచిన సుబలుండును సుముఖుం డై కురుకులవిస్తారకుం డయిన ధృతరాష్ట్రుండ యిక్కన్యకకు నర్హుండు గావున నా రాజునకు గాంధారి నిచ్చితి ననిన వాని బంధుజనంబు లెల్లఁ దమలో ని ట్లనిరి.

(ఈ సంబంధం యోగ్యమైనది - అని సుబలుని దగ్గరకు పెద్దలను పంపగా అతడు కూడా అందుకు అంగీకరించాడు. సుబలుని బంధువులు ఇలా అనుకున్నారు.)

1_5_9 కందము నచకి - వసంత

కందము

ఈ కులము వివర్ధింపఁగ
నా కభిమత మేను వింటి నలినేక్షణ దా
నేక శత సుతులఁ బడయఁగ
నా కన్యక వరము వడసె నటె హరుచేతన్.

(వంశవృద్ధి నా అభిమతం. వందమంది కొడుకులు, ఒక కూతురు కలిగేలా ఆ గాంధారి శివుడి వరం పొందిందట కదా!)

1_5_8 కందము నచకి - వసంత

కందము

ఈ వంశము విచ్ఛేదము
గావచ్చినఁ గులము నిలుపఁగా సత్యవతీ
దేవి వచనమున సంతతి
గావించెను వ్యాసుఁ డను జగత్కర్త దయన్.

(కురువంశం నశిస్తూ ఉండగా సత్యవతీదేవి మాట ప్రకారం వ్యాసుడు కులం నిలపటానికి సంతానాన్ని కలిగించాడు.)

1_5_7 వచనము నచకి - వసంత

వచనము

ఇట్లు రాజ్యంబు సేయుచు నారూఢ యౌవనుం డైన యా ధృతరాష్ట్రునకు వివాహంబు సేయ సమకట్టి భీష్ముండు గాంధారపతి యయిన సుబలుకూఁతు గాంధారి యనుదాని నతిశయ రూపలావణ్య శీలాభిజాత్య సమన్వితఁగా బ్రాహ్మణులవలన విని విదురున కి ట్లనియె.

(ధృతరాష్ట్రుడికి వివాహం చేయటానికి భీష్ముడు పూనుకొని, గాంధారరాజు సుబలుని కుమార్తె గాంధారి యోగ్యురాలని విని, విదురునితో ఇలా అన్నాడు.)

1_5_6 ఉత్పలమాల నచకి - వసంత

ఉత్పలమాల

ఆయము గర్వమున్ విడిచి యన్యపతుల్ పనిసేయ నిట్లు గాం
గేయభుజాబలంబున నికృత్తవిరోధిసమాజుఁ డై కుమా
రాయితశక్తిశాలి ధృతరాష్ట్రుఁడు రాజ్యము సేయుచుండె న
త్యాయతకీర్తితోఁ దనకు హస్తిపురం బది రాజధానిగన్.

(ఇతర రాజులు తమ ఆదాయాన్నీ, గర్వాన్నీ విడిచి తనను కొలుస్తూ ఉండగా, భీష్ముడి భుజబలంతో ధృతరాష్ట్రుడు శత్రువులను ఓడిస్తూ, హస్తినాపురం రాజధానిగా రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉండేవాడు.)

Sunday, March 05, 2006

1_5_5 వచనము నచకి - వసంత

వచనము

ఇట్లు బ్రహ్మోత్తరంబుగాఁ బ్రజాభివృద్ధియు, సస్యసమృద్ధియు నగుచుండ నాంబికేయు ధృతరాష్ట్రు రాజ్యాభిషిక్తుం జేసి భీష్ముండు దనకు విల్లును విదురు బుద్ధియును సహాయంబులుగా రాజ్యంబు రక్షించుచున్నంత.

(భీష్ముడు ధృతరాష్ట్రుడిని రాజ్యాభిషిక్తుడిని చేసి, తన విల్లు, విదురుడి బుద్ధి సహాయకాలుగా రాజ్యాన్ని రక్షిస్తూ ఉండగా.)

1_5_4 మత్తేభము నచకి - వసంత

మత్తేభము

అమలాచార పవిత్రభూసురవరేణ్యాగారపుణ్య ప్రదే
శములం దధ్యయనారవంబు విధివత్స్వాహాస్వధాస్వస్తిశ
బ్దములున్ మంగళతూర్యఘోషములు నుద్యత్కౌతుకాశీర్నినా
దములన్ రమ్యతరంబు లయ్యె ధరణిం దద్రాజ్యసంవృద్ధితోన్.

(భీష్ముడి పాలనలో వేదనాదాలు, మంగళవాద్యధ్వనులు, ఆశీర్వచనాలు వినిపిస్తూ ఉండేవి.)