Thursday, November 10, 2005

1_4_2 వచనము విజయ్ - విక్రమాదిత్య

వచనము

అక్కథకుండు శౌనకాదిమహామునులకుం జెప్పె నట్లు యయాతికిఁ బుత్త్రుండయిన పూరుండు సకలమహీరాజ్యంబు సేయుచు వంశకర్త యయిన వానికిఁ గౌసల్య యనుదానికి జనమేజయుండు పుట్టి రాజై యశ్వమేధత్రయంబుఁ జేసి ప్రఖ్యాతినొందె నాజనమేజయునకు ననంత యను దానికిఁ బ్రాచిన్వంతుఁడు పుట్టి పరాక్రమంబున నుదయాచలపర్యంతంబు ప్రాగ్దిగ్విజయంబు సేసి ప్రాచిన్వంతుఁడునాఁ బరగె నట్టి ప్రాచిన్వంతునకు నశ్మకి యనుదానికి సంయాతి పుట్టె వానికి వరాంగి యనుదానికి నహంయాతి పుట్టె వానికిం గృతవీర్యపుత్త్రియైన భానుమతికి సార్వభౌముండు పుట్టె వానికిఁ గేకయరాజపుత్త్రియైన సునందకు జయత్సేనుండు పుట్టె వానికి వైదర్భి యైన సుశ్రవసకు నవాచీనుండు పుట్టె నయ్యవాచీనునకు విదర్భరాజపుత్త్రి యైన మర్యాదకు నరిహుండు పుట్టె వానికి నాంగి యనుదానికి మహాభౌముండు పుట్టె నామహాభౌమునకుం బ్రసేనజిత్పుత్త్రి యైన సుపుష్టకు నయుతానీకుండు పుట్టె వానికిం బృథుశ్రవసునిపుత్త్రి యైన కామకు నక్రోధనుండు పుట్టె వానికిం గాళింగి యైన కరంభ యనుదానికి దేవాతిథి పుట్టె వానికి వైదేహి యయిన మర్యాదకు ఋచీకుండు పుట్టె వానికి నాంగి యైన సుదేవ యను దానికి ఋక్షుండు పుట్టె ఋక్షునకుఁ దక్షకపుత్త్రి యయిన జ్వాల యనుదానికి మతినారుండు పుట్టి.

(పైన చెప్పిన విధంగా పూరువంశాభివృధ్ది జరిగి, ఆ వంశంలో మతినారుడు జన్మించాడు.)

No comments: