Friday, November 18, 2005

1_4_61 వచనము వోలం - వసంత

వచనము

అనిన విని శకుంతల కెంతయు సంతోషంబుగా దాని కోరిన వరంబిచ్చి గాంధర్వ వివాహంబున నభిమతసుఖంబు లనుభవించి యక్కోమలి వీడ్కొని నిన్నుఁ దోడ్కొని రా నస్మత్ప్రధాన వర్గంబుఁ గణ్వ మహాముని పాలికింబుత్తెంచెదనని యూఱడ నొడివి దుష్యంతుండు నిజపురంబునకుం జనియె. నిట శకుంతలయుఁ దన చేసిన దాని మునివరుం డెఱింగి యలిగెడునోయని వెఱచుచుండె నంత నమ్మహాముని వనంబున నుండి కందమూల ఫలంబులు గొని చనుదెంచి లలిత శృంగారభావంబున లజ్జావనత వదనయు నతి భీతచిత్తియునై యున్న కూఁతుం జూచి తనదివ్యజ్ఞానంబున నంత వృత్తాంతంబు నెఱింగి క్షత్త్రియులకు గాంధర్వ వివాహంబు విధిచోదితంబ యని సంతసిల్లి శకుంతల కిట్లనియె.

( దుష్యంతుడు అందుకు అంగీకరించి ఆమెను గాంధర్వవివాహం చేసుకున్నాడు. తరువాత, "నిన్ను తీసుకురావటానికి మంత్రులను కణ్వమహాముని దగ్గరకు పంపుతాను", అని ఆమెను ఒప్పించి తన నగరానికి వెళ్లిపోయాడు. తాను చేసిన పనికి కణ్వమహర్షి ఆగ్రహిస్తాడేమో అని శకుంతల భయపడసాగింది. కణ్వుడు దివ్యదృష్టితో జరిగిన విషయం తెలుసుకొని క్షత్త్రియులకు గాంధర్వవివాహం శాస్త్రసమ్మతమే అని సంతోషించి శకుంతలతో ఇలా అన్నాడు. )

No comments: