Sunday, November 06, 2005

1_3_221 వచనము విజయ్ - విక్రమాదిత్య

వచనము

మఱియు గర్భయోనియందు ఋతుపుష్పరససంయుక్తం బగుచు రేతంబు గాడ్పుచేతం బ్రేరితం బయి కలసిన నందుఁ బంచతన్మాత్రలు పొడవయి క్రమంబున నవయవంబు లేర్పడి లబ్ధజీవు లయి యుద్భవిల్లి శ్రోత్రంబుల శబ్దంబును నేత్రంబుల రూపంబును ఘ్రాణంబున గంధంబును జిహ్వను రసంబును ద్వక్కున స్పర్శంబును మనంబున సర్వంబును నెఱుంగుచుఁ బూర్వకర్మనియోగంబున దుష్కృతంబును సుకృతంబును జేయుచు దుష్కృతబాహుళ్యంబునఁ బుణ్యంబు గీడ్పఱిచి బుద్ధివిరహితు లై తిర్యగ్యోనులందుఁ బుట్టుదురు సుకృతబాహుళ్యంబునఁ బాపంబు గీడ్పఱిచి బుద్ధియుక్తులై మనుష్యయోనులందుఁ బుట్టి యుక్తాచారులును దత్త్వవిదులునునయి దేవత్త్వంబునం బొంది విశుద్ధజ్ఞాను లయి ముక్తు లగుదురు మఱి యుక్తచారు లెవ్వ రనిన గురుశుశ్రూష సేయుచు నిత్యాధ్యయనాగ్నికార్యంబులయందప్రమత్తు లయి శమదమ శౌచంబులు దాల్చి యవిప్లుతబ్రహ్మచర్యులయిన బ్రహ్మచారులును బాపంబునకుఁ బరోపతాపంబునకు వెఱచి ధర్మ్యం బైన విత్తంబున నతిథులం బూజించుచు యజ్ఞంబులు సేయుచుఁ బరుల యీనిధనంబులు పరిగ్రహింపక నిత్యానుష్ఠానపరు లయిన గృహస్థులును నియతాహారు లై సర్వసంగంబులు విడిచి జితేంద్రియు లైన వానప్రస్థులును వనంబుల నుండి గ్రామ్యవస్తువుల నుపయోగింపక గ్రామంబుల నుండి శరీరధారణార్థంబు నియతస్వల్పభోజన లయి నగరప్రవేశంబు పరిహరించి కామక్రోధాదులం బొరయక శౌచాచారక్రియారతు లయి సర్వద్వంద్వంబులు నొడిచి సర్వసంగవివర్జితు లయి యేకచరు లయి యనేకనికేతను లయిన యతులును నను వీరలు దమతమపుణ్యాచారంబులం జేసి క్రిందం బదితరంబులవారిని మీఁదం బదితరంబుల వారిని దమ్మును నుద్ధరింతురు.

(పైన చెప్పిన విధంగా జీవాలు జన్మిస్తాయి. మంచి పనులు చేసే బ్రహ్మచారులు, గృహస్థులు, వానప్రస్థులు, సన్న్యాసులు - వీరు యుక్తాచారులు.)

No comments: