Thursday, November 30, 2006

1_8_21 సీసము + ఆటవెలది పవన్ - వసంత

సీసము

పలుకులఁ జెయ్వులఁ బాండవులకుఁ బ్రీతి
        గలయట్ల యుండుదుఁగాని నాదు
హృదయంబు విదురున కెన్నండు నెఱిఁగింప
        నేను మీతలఁచిన యివ్విధంబ
తలఁచుచు నుండుదు దైవసంపద గల
        వారలఁ బాండవవరుల నేమి
సేయఁగ నగు నెద్దిచెప్పుం డిష్టం బింక
        ననిన విచిత్రవీర్యాత్మజునకు

ఆటవెలది

దుష్టచేష్టితుండు దుర్యోధనుం డిట్టు
లనియెఁ జిత్తగింపు మవనినాథ
పాండురాజసుతులఁ బాంచాలపతియెద్ద
నుండకుండఁ జేయు టుచిత మిపుడు.

(పాండవుల మీద ప్రీతి ఉన్నట్లు ఉంటాను కానీ విదురుడికి నా మనస్సు ఎప్పుడూ తెలియనీయలేదు. మీ అభిప్రాయమే నా అభిప్రాయం. దైవసంపద ఉన్న పాండవులను ఏమి చేయగలము? మీకు ఏది ఇష్టమో చెప్పండి - అనగా దుర్యోధనుడు ఇలా అన్నాడు - పాండవులను ద్రుపదుడి దగ్గర ఉండకుండా చేయటం ఇప్పుడు ఉచితం.)

No comments: