Thursday, February 23, 2006

1_5_3 సీసము + ఆటవెలది నచకి - వసంత

సీసము

అమరాపగాసుతు ననుశాసనంబునఁ
        గౌరవరాజ్యంబు గడు వెలుంగెఁ
గురుభూము లుత్తరకురువులకంటెను
        నధికలక్ష్మీయుక్తి నతిశయిల్లె
ధర్మాభిసంరక్షితం బైన భూప్రజ
        కెంతయు నభివృద్ధి యెసఁగుచుండె
వలసినయప్పుడు వానలు గురియుట
        సస్యసమృద్ధి ప్రశస్త మయ్యెఁ

ఆటవెలది

బాలు సేఁపెఁ బుష్పఫలభరితంబు లై
తరువనంబు లొప్పె ధర్మకర్మ
నిరతిఁ జేసి కరము నెమ్మితో నన్యోన్య
హితముఁ జేయుచుండి రెల్ల జనులు.

(భీష్ముడి పాలనలో కౌరవరాజ్యం గొప్పగా వెలిగింది. ఉత్తరకురుదేశాల కంటే అధికసంపదతో కురుదేశం విలసిల్లింది.)

1_5_2 వచనము నచకి - వసంత

వచనము

అక్కథకుండు శౌనకాదిమహామునులకుం జెప్పె నట్లు ధృతరాష్ట్ర పాండు విదురులు భీష్మాభిరక్షితు లై పెరుఁగుచు నుపనయనానంతరంబున నధ్యయనం బొనరించి రాజవిద్యలయందు జితశ్రము లై యున్నంత.

(ఉగ్రశ్రవసుడు శౌనకాదిమునులతో ఇలా చెప్పాడు: ఆ విధంగా ధృతరాష్ట్రుడు, పాండురాజు, విదురుడు భీష్ముడి పోషణలో పెరుగుతూ ఉండగా.)

-:ధృతరాష్ట్ర పాండుకుమారులు పెరుఁగుట:-

1_5_1 కందము నచకి - వసంత

కందము

శ్రీనాథమూర్తి విబుధని
ధాన మహాదాన తర్పితద్విజవర వేం
గీనాథ పార్థనిభ యభి
మాన మహార్ణవ మహేంద్రమహిమాతిశయా.

(వేంగీనాథా!)

Wednesday, February 22, 2006

ఆదిపర్వము - పంచమాశ్వాసము

1_4_276 గద్యము విజయ్ - విక్రమాదిత్య

గద్యము

ఇది సకల సుకవిజన వినుత నన్నయభట్ట ప్రణీతం బైన శ్రీమహాభారతంబునం దాదిపర్వంబునం గౌరవ వంశకీర్తనంబును గంగా శంతను సమాగమంబును వసూత్పత్తియు స్వర్గగమనంబును దదంశసంఘాతంబున గాంగేయు జన్మంబును దద్రాజ్య నివర్తనంబును బ్రహ్మచర్యవ్రత ప్రతిజ్ఞాపరిపాలనంబును సత్యవతీవివాహంబును జిత్రాంగద విచిత్రవీర్యుల జన్మంబును జిత్రాంగద మరణానంతరంబున భీష్ముండు విచిత్రవీర్యు రాజ్యంబున నిలుపుటయు విచిత్రవీర్యుని వివాహంబును వాని పరోక్షంబునఁ గృష్ణద్వైపాయనువలన ధృతరాష్ట్రపాండురాజుల జన్మంబును మాండవ్యుశాపంబున విదురు జన్మంబును నన్నది చతుర్థాశ్వాసము.

(ఇది నన్నయభట్టు రచించిన శ్రీమహాభారతంలో పదునెనిమిది పర్వాల్లో మొదటిదైన ఆదిపర్వంలో కౌరవవంశవర్ణన, గంగాశంతనుల కలయిక, వసువు పుట్టుక, అతడు రాజ్యాన్ని త్యజించటం, బ్రహ్మచర్యవ్రతప్రతిజ్ఞను పాటించటం, చిత్రాంగదుడు చనిపోయిన తరువాత భీష్ముడు విచిత్రవీర్యుడిని రాజ్యపాలకుడిగా నిలపటం, విచిత్రవీర్యుడి వివాహం, అతడి తరువాత వ్యాసుడివల్ల ధృతరాష్ట్రపాండురాజుల పుట్టుక, మాండవ్యుడి శాపం, విదురుడి పుట్టుక అనే కథార్థాలు కలది నాల్గవ ఆశ్వాసం.)

1_4_275 ద్రుతవిలంబితము విజయ్ - విక్రమాదిత్య

ద్రుతవిలంబితము

త్రిభువనాంకుశ దీప్తినిధీ సమ
స్తభువనాశ్రయ ధర్మధురంధరా
శుభయశః పరిశోభిత పూర్వది
క్ప్రభువిలాస కృపారసబంధురా.

(గొప్పవాడా!)

1_4_274 కందము విజయ్ - విక్రమాదిత్య

కందము

సత్యాశ్రయకులశేఖర
నిత్యోదయ రాజరాజనృప సుకవిజన
స్తుత్య మహాగుణ విమలా
దిత్యాగ్రతనూజ విమలధీరమణీయా.

(సత్యాశ్రయుడి వంశంలో గొప్పవాడా! విమలాదిత్యుడి పెద్దకుమారుడా!)

-:ఆశ్వాసాంతము:-

1_4_273 కందము విజయ్ - విక్రమాదిత్య

కందము

అని మాండవ్యాఖ్యానము
జనమేజయునకు నుదారచరితునకుఁ బ్రియం
బునఁ జెప్పెను వైశంపా
యనుఁ డవితథపుణ్యవచనుఁ డని కడుభక్తిన్.

(ఇలా వైశంపాయనుడు మాండవ్యుడి కథను జనమేజయుడికి చెప్పాడు.)

1_4_272 వచనము విజయ్ - విక్రమాదిత్య

వచనము

అనిన విని మాండవ్యుం డలిగి జన్మంబు మొదలుగాఁబదునాలుగు వత్సరంబులు దాఁటునంతకుఁబురుషుండు బాలుండు వాఁడెద్ది సేసినఁ బాపంబుం బెద్ద పొరయండు వానికి నొరు లెగ్గుసేసినఁ బాతకు లగుదు రిది నాచేసిన మర్యాద నీవిట్టి ధర్మంబు దలంపక బాల్యంబున నల్పదోషంబుఁజేసిన నాకు బ్రాహ్మణోచితంబుగాని క్రూరదండంబు గావించినవాఁడవు మర్త్యలోకంబున శూద్రయోనిం బుట్టుమని శాపం బిచ్చుటంజేసి వాఁడు విదురుం డై పుట్టె.

(బాల్యంలో చేసిన దోషానికి కఠినమైన శిక్షను విధించావు. కాబట్టి నువ్వు మానవలోకంలో జన్మించు - అని శపించటం చేత యముడు విదురుడిగా పుట్టాడు.)

1_4_271 కందము విజయ్ - విక్రమాదిత్య

కందము

సొలయక తూనిఁగలం గొ
ఱ్ఱులఁ బెట్టితి నీవు నీచిఱుతకాలము త
త్ఫల మిప్పు డనుభవించితి
తొలఁగునె హింసాపరులకు దుఃఖప్రాప్తుల్.

(నువ్వు నీ చిన్నతనంలో తూనీగలను ఎగరనివ్వకుండా పట్టి మేకులకు గుచ్చి ఉంచావు. హింస చేసినవారికి కష్టాలు పొందక తప్పుతుందా?)

1_4_270 వచనము విజయ్ - విక్రమాదిత్య

వచనము

అనిన మాండవ్యునకు ధర్మరా జి ట్లనియె.

(మాండవ్యుడితో యముడు ఇలా అన్నాడు.)

1_4_269 కందము విజయ్ - విక్రమాదిత్య

కందము

దండధర యిట్టి దారుణ
దండమునకు నేమిదుష్కృతముఁ జేసితి ను
గ్రుండ వయి తగనిదండము
దండింపఁగ బ్రాహ్మణుండఁ దగునే నన్నున్.

(యమరాజా! ఇటువంటి శిక్ష నాకు విధించటానికి నేనేమి తప్పు చేశాను?)

1_4_268 వచనము విజయ్ - విక్రమాదిత్య

వచనము

అని యమ్మహామునులతో మాండవ్యుండు పలికిన పలుకు లన్నగర రక్షకులు విని వచ్చి రాజున కెఱింగించిన రాజునుం బఱతెంచి శూలప్రోతుం డయి యున్న మాండవ్యునకు నమస్కరించి నాచేసిన యజ్ఞానంబు సహించి నాకుం బ్రసాదింపవలయునని శూలంబువలన నమ్మునింబాచుచోనది పుచ్చరాకున్న దానిమొదలు మెత్తన తునిమించినఁ దత్కంఠపార్శ్వంబునందు శూలశేషం బంతర్గతం బై యుండె దానం జేసి యాముని యాణిమాండవ్యుండునాఁ బరఁగుచు నమ్మహాముని ఘోరతపంబు సేసి యెల్లలోకంబులు గమించి యొక్కనాఁడు యమునిపురంబునకుం జని ధర్మరాజున కిట్లనియె.

(ఈ మాటలు విన్న భటులు రాజుకు తెలుపగా అతడు వెంటనే బయలుదేరివచ్చి, మాండవ్యుడికి మొక్కి, క్షమించమని కోరాడు. శూలంనుండి మునిని విడిపించబోగా అది వీలుకాకపోవటంతో దాని మొదలును నరికించాడు. శూలభాగం ఒకటి అతడి శరీరంలోనే ఉండిపోయింది. దానివల్ల ఆ మునికి ఆణిమాండవ్యుడు అనే పేరు కలిగింది. మాండవ్యుడు తర్వాత గొప్పతపస్సు చేసి లోకాలను దాటి ఒకరోజు యముడి నగరానికి వెళ్లి యముడితో ఇలా అన్నాడు.)

1_4_267 తేటగీతి విజయ్ - విక్రమాదిత్య

తేటగీతి

ఎఱిఁగి యెఱిఁగి నన్నడుగంగ నేల దీని
సుఖము దుఃఖంబుఁ బ్రాప్తించుచోట నరుఁడు
దగిలి తనకర్మవంశమునఁ దనరుఁ దాన
కర్తగా కన్యులకు నేమి కారణంబు.

(మనిషి తన సుఖదుఃఖాలకు తానే కారకుడు. నా బాధకు ఇతరులు ఎందుకు కారణమవుతారు?)

1_4_266 వచనము విజయ్ - విక్రమాదిత్య

వచనము

ఇట్లు శరీరదుఃఖంబు దలంపక తపంబుసేయుచున్న యమ్ముని తపంబు పేర్మికి మెచ్చి మహామునులు పక్షులయి రాత్రివచ్చి మునీంద్రా యిట్టి మహాతపస్వి వైన నీ కిట్టి దుఃఖంబు గావించిన వా రెవ్వరని యడిగిన వారికి నమ్మాండవ్యుం డి ట్లనియె.

(అతని తపస్సుకు గొప్పఋషులు మెచ్చి మాండవ్యుడి దగ్గరకు వచ్చారు. నీకు ఇటువంటి బాధ కలిగించిన వారెవరు అని అడిగారు. మాండవ్యుడు ఇలా అన్నాడు.)

1_4_265 కందము విజయ్ - విక్రమాదిత్య

కందము

మునివరుఁ డట్లుండియుఁ దన
మనమున నతిశాంతుఁ డయి సమత్వమునఁ దప
మ్మొనరించె ననశనుం డ
య్యును బహుకాలంబు ప్రాణయుక్తుం డగుచున్.

(అలా శూలంమీద ఉన్నా కూడా అతడు చాలాకాలం తపస్సు చేశాడు.)

1_4_264 వచనము విజయ్ - విక్రమాదిత్య

వచనము

మాండవ్యుఁ నామ్రుచ్చులతోన కట్టికొని వచ్చి రాజునకుంజూపి ధనంబొప్పించిన రాజు నామ్రుచ్చులం జంపించి తపోవేషంబుననున్న మ్రుచ్చని యమ్మాండవ్యునిఁ బురంబువెలుపల శూలప్రోతుం జేయించిన.

(భటులు మాండవ్యుడిని ఆ దొంగలతో కలిపి తెచ్చి రాజుకు అప్పగించారు. అతడు ఆ దొంగలను చంపించి, మాండవ్యుడిని ఊరిబయట ఇనుప శూలంలో దిగవేసి కట్టివేయించాడు.)

1_4_263 ఆటవెలది విజయ్ - విక్రమాదిత్య

ఆటవెలది

తాన చోరులకును దాపికాఁడై వేష
ధారి మిన్నకేని తపముసేయు
చున్నయట్టు వలుకకున్నవాఁ డని యెగ్గు
లాడి యారెకులు నయంబు లేక.

(ఆ దొంగలకు దళారి మాండవ్యుడే అని నిందలు పలికి.)

1_4_262 వచనము విజయ్ - విక్రమాదిత్య

వచనము

అని యడిగిన వానికి వైశంపాయనుం డిట్లని చెప్పె మాండవ్యుం డను బ్రహ్మర్షి దొల్లి మహీవలయంబునం గల తీర్థంబు లెల్ల నేకచారి యయి సేవించి యొక్క నగరంబున నెడ గలుగు నడవిలో నాశ్రమంబు గావించి తద్ద్వారవృక్షమూలంబున నూర్ధ్వబాహుం డయి మౌనవ్రతంబునం దపంబు సేయుచున్న నన్నగరంబు రాజు నర్థంబు మ్రుచ్చిలికొని మ్రుచ్చు లారెకులచేత ననుధావ్యమాను లై మాండవ్యుసమీపంబునం బాఱి యయ్యాశ్రమంబులో డాఁగిన వారి వెనుదగిలి వచ్చిన యారెకు లమ్మునిం గని రాజధనాపహారు లయిన చోరులు నీయొద్దన పారి రెటవోయి రెఱుంగుదేని చెప్పుమనిన నమ్ముని మౌనవ్రతుండు గావునఁ బలుకకున్నం గినిసి యయ్యాశ్రమంబులోఁ జొచ్చి వెదకి ధనంబుతోడ నామ్రుచ్చులం బట్టికొని.

(అందుకు వైశంపాయనుడు ఈ విధంగా సమాధానం చెప్పాడు - పూర్వం మాండవ్యుడు తన ఆశ్రమద్వారం దగ్గర ఉన్న చెట్టు దగ్గర చేతులు పైకెత్తి మౌనవ్రతంతో తపస్సు చేస్తుండగా, రాజధనం దొంగిలించిన కొందరు దొంగలు అతడి ఆశ్రమంలో దాక్కొన్నారు. వారిని వెంటాడుతూ వచ్చిన తలారులు మాండవ్యుడిని దొంగలను గురించి అడిగారు. అతడు మాట్లాడకపోవటంతో, వారు ఆశ్రమంలో వెతికి దొంగలను పట్టుకొని.)

1_4_261 ఆటవెలది విజయ్ - విక్రమాదిత్య

ఆటవెలది

సకలజీవరాశి సుకృత దుష్కృత ఫల
మెఱిఁగి నడపుచున్న యట్టి ధర్ముఁ
డొంద శూద్రయోనియందు మాండవ్యుచే
శప్తుఁడై యదేల సంభవించె.

(మాండవ్యుడి శాపం వల్ల యముడు ఎందుకు అలా జన్మించవలసి వచ్చింది?)

1_4_260 వచనము విజయ్ - విక్రమాదిత్య

వచనము

అనిన విని జనమేజయుండు వైశంపాయనున కిట్లనియె.

(ఇది విని జనమేజయుడు వైశంపాయనుడితో ఇలా అన్నాడు.)

-:మాండవ్యోపాఖ్యానము:-

1_4_259 ఆటవెలది విజయ్ - విక్రమాదిత్య

ఆటవెలది

చండకోపుఁ డయిన మాండవ్యమునివరు
శాపమున జముండు సంభవిల్లె
విదురుఁ డనఁగ ధర్మవిదుఁడు పారాశర్యు
వీర్యమునను భువి నవార్యబలుఁడు.

(మాండవ్యమహర్షి శాపం వల్ల యముడు ఇలా విదురుడిగా జన్మించాడు.)

1_4_258 వచనము విజయ్ - విక్రమాదిత్య

వచనము

ఇట్లు క్రమంబునం బుట్టిన ధృతరాష్ట్ర పాండుకుమారులకు బ్రాహ్మణసమేతుం డై భీష్ముండు జాతకకర్మాదిక్రియ లొనరించినంత నాంబికేయు జాత్యంధుం జూచి దుఃఖిత యయి సత్యవతి వెండియుఁ బారాశర్యుం దలంచుడు నాక్షణంబ యమ్మునివరుండు వచ్చి పని యేమి యని యన్న నీయంబికకుఁ బ్రథమపుత్త్రుం డంధుం డయ్యె నింక నొక్క కొడుకు రూపవంతుం బడయు మనిన నియతాత్మ యగునేని సుపుత్త్రుండు పుట్టుననవుడు సత్యవతి తొల్లింటియట్ల కోడలి నియోగించిన నక్కోమలి యమ్మునివరు వికృతవేషరూపగంధంబుల కోపక రోసి తనదాసి ననేక భూషణాలంకృతం జేసి తనశయనతలంబున నుండం బంచిన వ్యాసభట్టారకుండు వచ్చి దాని చేసిన యిష్టోపభోగంబులం దుష్టుండై దానికిం బుత్త్రదానంబు సేసిన.

(ఇలా వీరిద్దరూ పుట్టగా భీష్ముడు వారికి జాతకర్మ మొదలైన సంస్కారాలను జరిపించాడు. అంబిక కొడుకు పుట్టుగుడ్డి అని సత్యవతి తెలుసుకొని వ్యాసుడిని మళ్లీ తలచుకోగా అతడు వెంటనే వచ్చాడు. అంబికకు ఇంకొక పుత్రుడిని అనుగ్రహించమని సత్యవతి అతడిని కోరింది. వ్యాసుడి వికారమైన వేషాన్ని అంబిక అసహ్యించుకొని తను వెళ్లకుండా తన దాసిని పంపింది. వ్యాసుడు ఆమెకు పుత్రసంతానాన్ని ప్రసాదించాడు.)

1_4_257 కందము విజయ్ - విక్రమాదిత్య

కందము

అంబాలికకును గుణర
త్నాంబుధి పాండుర విరాజితాంగుఁడు ప్రభవిం
చెం బాండురాజు గురువం
శంబు ప్రతిష్ఠింప ధర్మసర్వజ్ఞుం డై.

(తెల్లనిరంగుగల పాండురాజు అంబాలికకు జన్మించాడు.)

1_4_256 కందము విజయ్ - విక్రమాదిత్య

కందము

బలవ న్మదనాగాయుత
బలయుతుఁడు సుతుండు పుట్టెఁ బ్రజ్ఞాచక్షుం
డలఘుఁడు ధృతరాష్ట్రుం డా
లలనకు నంబికకుఁ గురుకులప్రవరుం డై.

(గుడ్డివాడైన ధృతరాష్ట్రుడు అంబికకు జన్మించాడు.)

1_4_255 వచనము విజయ్ - విక్రమాదిత్య

వచనము

కృష్ణద్వైపాయనుండును దానికింబుత్త్రదానంబు సేసి యాయంబికయందు బలపరాక్రమవంతుం డయిన కొడుకు పుట్టు వాఁడు మాతృదోషంబున నంధుం డగు ననిన విని విషణ్ణచిత్త యయి సత్యవతి వెండియుం గృష్ణద్వైపాయనుం బ్రార్థించి యింక నంబాలికయం దొక్కకొడుకుం బడయుమని నియోగించిన నెప్పటియట్ల యమ్మునివరుండు నంబాలిక కడకుం జనిన నదియుం దనవేషంబునకు వెఱచి వెల్లనైయున్న నక్కోమలికిం బుత్త్రదానంబు సేసి యీయంబాలికయందు మహాబలపరాక్రమగుణవంతుండు వంశకరుండు నగుపుత్త్రుండు పుట్టు వాఁడును మాతృదోషంబునఁ బాండుదేహుం డగునని చెప్పి యరిగిన.

(వ్యాసుడు ఆమెకు దేహబలం, పరాక్రమం ఉన్న పుత్రుడు జన్మిస్తాడనీ, కానీ తల్లి కళ్లుమూసుకోవటం వల్ల గుడ్డివాడవుతాడనీ చెప్పాడు. సత్యవతి విచారం చెంది, అంబాలికకు కూడా ఒక పుత్రుడిని అనుగ్రహించమని వ్యాసుడిని ఆజ్ఞాపించింది. ఆమె కూడా వ్యాసుడి వేషాన్ని చూసి తెల్లబోగా ఆమెకు గొప్పదేహబలం, పౌరుషం ఉన్న పుత్రుడు, వంశాన్ని నిలిపేవాడై జన్మిస్తాడు కానీ అతడికి పాండువర్ణం కలుగుతుందని చెప్పి వెళ్లిపోయాడు.)

1_4_254 మధ్యాక్కర విజయ్ - విక్రమాదిత్య

మధ్యాక్కర

అవసరజ్ఞుం డయి వ్యాసుఁ డేతెంచె నంత నత్తపసి
కవిలగడ్డంబును గవిలజడలును గవిలకన్నులును
దవినయన్నువ నల్ల నైన దీర్ఘపుందనువును జూచి
యువిద గన్నుంగవ మొగిచి తెఱవక యుండె భయమున.

(వచ్చిన వ్యాసుడి రూపం చూసి భయంతో కళ్లుమూసుకొని ఉండిపోయింది.)

1_4_253 కందము విజయ్ - విక్రమాదిత్య

కందము

తివిరి సుతజన్మ మెన్నం
డవునొకొ దేవరుఁని వలన ననుచును నవప
ల్లవకోమలాంగి యంబిక
ధవళేక్షణ విమలశయనతలమున నున్నన్.

(వ్యాసుడి వల్ల తనకు ఎటువంటి కొడుకు జన్మిస్తాడో అని అంబిక ఆలోచిస్తూ ఉండగా.)

-:ధృతరాష్ట్ర పాండురాజ విదురుల జననము:-

1_4_252 వచనము విజయ్ - విక్రమాదిత్య

వచనము

అని సత్యవతి కృష్ణద్వైపాయను నియోగించి ఋతుమతియు శుచిస్నాతయు నై యున్న యంబికకడకుం జని క్షేత్రజుం డైనవాఁడు సుపుత్త్రుండు గావున ధర్మ్యం బైన విధానంబున నీవు రాజ్యధురంధరుం డయిన కొడుకుం బడసి భరతవంశంబు నిలుపు మెల్లధర్మంబులకంటెఁ గులంబు నిలుపుటయు మిక్కిలి ధర్మంబు నేఁటిరాత్రి నీకడకు దేవరుండు వచ్చుం దదాగమనంబుఁ బ్రతీక్షించి యుండునది యని కోడలి నొడంబఱిచి యనేకసహస్రమహీసురులను దేవతలను ఋషులను నిష్టభోజనంబులం దనిపియున్న నారాత్రియందు.

(అని సత్యవతి వ్యాసుడిని ఆజ్ఞాపించి, అంబిక దగ్గరకు వెళ్లి ఆమెను అంగీకరింపజేసింది. ఆ రాత్రి.)

1_4_251 కందము విజయ్ - విక్రమాదిత్య

కందము

దయ నీచే నుత్పాదితు
లయినసుతులు ద మ్మెఱుంగునంతకు భీష్ముం
డయ నయశాలి సమర్థుం
డయి చేకొని రాజ్యభార మారయుచుండున్.

(నీ వల్ల పుట్టిన కొడుకులు తమంతట తాము రాజ్యం చేసేంతవరకూ భీష్ముడు రాజ్యపాలన సాగిస్తాడు.)

Tuesday, February 21, 2006

1_4_250 చంపకమాల విజయ్ - విక్రమాదిత్య

చంపకమాల

అవని యరాజకం బయిన యప్పుడ భూప్రజయందు సర్వధ
ర్మువులుఁ దొలంగు దేవమునిముఖ్యులు వాయుదు రోలి వృష్టిలే
దవు మఱి యర్ఘువుల్ దఱుఁగు నందురు గావునుఁ గాలయాపనం
బవితథవాక్య చేయక నయంబున రాజ్యము నిల్పు మిత్తఱిన్.

(రాజు లేకపోతే ధర్మం నిలవదు. దేవమునిముఖ్యులు రాజ్యాన్ని విడిచి వెళ్లిపోతారు. వానలు పడవు. వస్తువుల విలువలు పడిపోతాయి. కాబట్టి ఆలస్యం చేయకుండా రాజ్యాన్ని నిలుపు.)

1_4_249 కందము విజయ్ - విక్రమాదిత్య

కందము

ప్రకటముగ వంశవిస్తా
రకు లగు పుత్త్రకులఁ జెచ్చెరం బడయుదు రరా
జక మయిన ధారుణీప్రజ
కొక నిమిషం బయినఁ బ్రకృతి నుండఁగ లావే.

(రాజులేని రాజ్యంలోని ప్రజలకు శాంతి ఉండదు.)

1_4_248 వచనము విజయ్ - విక్రమాదిత్య

వచనము

ఇక్కాశరాజ దుహితలయందు ధర్మస్థితిం బుత్త్రోత్పత్తిఁ గావించెద వీరలు నా చెప్పిన వ్రతం బొకసంవత్సరంబు సేసి శుద్ధాత్మ లగుదురేని సత్పుత్త్రులు పుట్టుదురనిన సత్యవతి యిట్లనియె.

(ఈ కాశీరాజపుత్రికలకు పుత్రులను పుట్టిస్తాను. నేను చెప్పిన వ్రతాన్ని ఒక సంవత్సరకాలం ఆచరిస్తే ఉత్తములైన కొడుకులు జన్మిస్తారు - అనగా సత్యవతి ఇలా అన్నది.)

1_4_247 కందము విజయ్ - విక్రమాదిత్య

కందము

అని సత్యవతి నియోగిం
చిన వేదవ్యాసుఁ డట్ల చేయుదు నిది యెం
దును గల ధర్మువ యెప్పుడు
వినఁబడు నానాపురాణ వివిధశ్రుతులన్.

(అని సత్యవతి ఆజ్ఞాపించగా వ్యాసుడు అందుకు అంగీకరించి ఇలా అన్నాడు.)

1_4_246 కందము విజయ్ - విక్రమాదిత్య

కందము

నీ కారణమున వంశ మ
నాకుల మై నిలుచుటయుఁ దదాప్తులుఁ బ్రజలున్
శోకభయంబులు విడుతురు
నాకును భీష్మునకుఁ గడు మనఃప్రియ మెసఁగున్.

(నీ కారణంగా భరతవంశం నిలవటం వల్ల నాకూ, భీష్ముడికీ ఎంతో సంతోషం కలుగుతుంది.)

1_4_245 కందము విజయ్ - విక్రమాదిత్య

కందము

ధృతి నీయనుజుం డై వి
శ్రుతుఁ డైన విచిత్రవీర్యు సుక్షేత్రములన్
సుతులం బడయుము కుల మవి
రతసంతతి నెగడ దేవరన్యాయమునన్.

(వంశం నిలవటం కోసం, దేవరన్యాయం అనుసరించి నీ తమ్ముడైన విచిత్రవీర్యుడి భార్యల ద్వారా కుమారులను పొందు.)

1_4_244 కందము విజయ్ - విక్రమాదిత్య

కందము

ఈయన్వయవిచ్ఛేదము
నీ యెఱుఁగని యదియె సన్మునిస్తుత జగముల్
నీయంద నిలిచినవి గా
వే యిక్కాలత్రయప్రవృత్తులతోడన్.

(ఈ వంశం ఆగిపోయే పరిస్థితి వచ్చిందన్న విషయం నీకు తెలియనిది కాదు కదా!)

1_4_243 చంపకమాల విజయ్ - విక్రమాదిత్య

చంపకమాల

అనుపమరాజ్యసంపదకు నర్హుఁడు వంశము విస్తరింపనో
పినసుచరిత్రుఁ డీసుతుఁడు భీష్ముఁడు దొల్లియుఁ దండ్రికిం బ్రియం
బనఘుఁడు సేయుచుండి నిఖిలావనిరాజ్యనివర్తనంబునుం
దనరఁగ బ్రహ్మచర్యమును దాల్చె జగద్విదితప్రతిజ్ఞుఁడై.

(ఈ భీష్ముడు తన తండ్రి కోసం రాజ్యాన్ని త్యజించి, బ్రహ్మచర్యవ్రతం స్వీకరించాడు.)

1_4_242 కందము విజయ్ - విక్రమాదిత్య

కందము

జనకునకును స్వామిత్వము
తనయోద్దేశమునఁ గలిమి తథ్యమ యది య
జ్జననికిఁ గలుగున కావునఁ
జనుఁ బనిఁ బంపంగ నిన్ను జననుత నాకున్.

(కొడుకులను ఆజ్ఞాపించే అధికారం తల్లికి ఉంటుంది.)

1_4_241 వచనము విజయ్ - విక్రమాదిత్య

వచనము

సత్యవతియును బెద్దకాలంబునకు వచ్చిన యాప్రథమపుత్త్రు నతిహర్షంబునం గౌఁగిలించుకొని యవిరళపయోధారల నానందబాష్పధారలం జేసి యభిషేకించుచున్న నమ్మునివరుండును దల్లి బాష్పజలంబులు దుడిచి యభివాదనంబు సేసి పురోహితపురస్సరభూసురవరులతో విధిపూర్వకంబుగా భీష్ముండు సేసిన యర్ఘ్యాదిపూజలు సేకొని సుఖాసీనుం డై యున్న నమ్మహామునిఁ గుశలం బడిగి సత్యవతి యి ట్లనియె.

(సత్యవతి సంతోషించి, చాలాకాలం తరువాత వచ్చిన అతడి క్షేమం అడిగి ఇలా అన్నది.)

Monday, February 20, 2006

1_4_240 ఉత్పలమాల వసు - విజయ్

ఉత్పలమాల

నీలగిరీంద్ర శృంగమున నిర్మల మైన సువర్ణవల్లరీ
జాలమువోని పింగళవిశాలజటాచయ మొప్పఁగా వచ
శ్శ్రీలలితుండు వచ్చి నిలిచెన్ హరినీలవినీల విగ్రహా
రాళరుచుల్ వెలుంగఁగ బరాశరసూసుఁడు తల్లిముందటన్.

(మృదువైన మాటలనే సంపద కలిగిన వ్యాసుడు వచ్చి తల్లిముందు నిలిచాడు.)

1_4_239 వచనము వసు - విజయ్

వచనము

అనిన భీష్ముపలుకులకు సంతోషించి సత్యవతి దొల్లి దనకన్యయైయున్నకాలంబునఁ బరాశరుండు దన్నుఁ గామించుటయు నమ్మునివరంబునఁ దనకన్యాత్వంబు దూషితంబు గాకునికియుఁ దత్ప్రసాదంబునం జేసి యమునాద్వీపంబునఁ గృష్ణద్వైపాయనుండు గానీనుం డయి సద్యోగర్భంబునఁ బుట్టి పనిగలయప్పుడ తన్నుఁ దలంచునది యని చెప్పి తపోవనంబునకుం జనుటయును భీష్మునకుం జెప్పి నిజతపోదహన దగ్ధపాపేంధనుండయిన కృష్ణద్వైపాయనుం డఖిలధర్మమూర్తి నిత్యసత్యవచనుండు నా నియోగంబున నీ యనుమతంబున భవద్భ్రాతృక్షేత్రంబులయందు సంతానంబు వడయు ననిన నమ్మహర్షి కీర్తనంబు విని భీష్ముండు కరకమలంబులు మొగిచి వ్యాసభట్టారకుఁ డున్న దిక్కునకు మ్రొక్కి తొల్లి జగంబు లుత్పాదించిన యాదిమబ్రహ్మకుం గల సామర్థ్యంబు గల వేదవ్యాసుం డిక్కురువంశంబుఁ బ్రతిష్ఠించునది యెల్లవారికి నభిమతంబ యనిన సత్యవతి కురువంశోద్వహనార్థంబు పారాశర్యుం దలంచుడు నాక్షణంబ.

(అన్న భీష్ముడి మాటలకు సత్యవతి సంతోషించి వ్యాసుడి గురించి అతడికి చెప్పింది. వ్యాసుడు కురువంశం నిలపటం తనకు సమ్మతమేనని భీష్ముడు అనగా సత్యవతి వ్యాసుడిని మనసులో తలచుకోగానే.)

1_4_238 కందము వసు - విజయ్

కందము

కావున నియతాత్ము జగ
త్పావను ధర్మస్వరూపు బ్రాహ్మణుఁ బడయం
గావలయు వాఁడు సంతతిఁ
గావించు విచిత్రవీర్యకక్షేత్రములన్.

(కాబట్టి ధర్మమూర్తి అయిన బ్రాహ్మణుడు కావాలి. అతడు విచిత్రవీర్యుడి భార్యలకు సంతానం కలిగిస్తాడు.)

1_4_237 వచనము వసు - విజయ్

వచనము

అనిన నబ్బలి సంతానార్థి గావున వెండియు నమ్మునిం బ్రార్థించి తత్ప్రసాదంబు వడసి సుదేష్ణ నియోగించిన దీర్ఘతముండును దాని యంగంబులెల్ల నంటి చూచి వంశకరుండును మహాసత్త్వుండును నయ్యెడు కొడుకు నీకుం బుట్టునని యనుగ్రహించిన దానికి నంగరాజను రాజర్షి పుట్టె నివ్విధంబున నుత్తమక్షత్త్రియక్షేత్రంబులందు ధర్మమార్గంబున బ్రాహ్మణులవలనం బుట్టి వంశకరులయిన క్షత్త్రియులనేకులు గలరు.

(బలి ఆ మునిని సంతానం కోసం మళ్లీ వేడుకొన్నాడు. సుదేష్ణకు కొడుకు జన్మిస్తాడని దీర్ఘతముడు అనుగ్రహించగా ఆమెకు అంగరాజు అనే రాజర్షి పుట్టాడు. ఇలా పుట్టిన వంశోద్ధారకులైన క్షత్రియులు చాలామంది ఉన్నారు.)

1_4_236 కందము వసు - విజయ్

కందము

వీరలు నీకులపుత్త్రులు
గారు భవద్దేవి దాదిగాదిలిసుతకున్
భూరిభుజ యుద్భవించిన
వారు మహాధర్మపరు లవారితసత్త్వుల్.

(మహారాజా! వీరు నీ వంశంలో పుట్టినవారు కాదు. నీ రాణి పంపిన దాదికూతురికి పుట్టినవారు.)

1_4_235 వచనము విజయ్ - విక్రమాదిత్య

వచనము

ఆ దీర్ఘతముండును దానివలనఁ గాక్షీవదాదుల నేకాదశపుత్త్రులం బుట్టించిన బలియును సంతసిల్లి వీరలు నాపుత్త్రకులే యనిన నమ్ముని వానికిట్లనియె.

(వారిద్దరికీ కాక్షీవదుడు మొదలైన పదకొండుమంది కొడుకులు జన్మించారు. బలి సంతోషించి, "వీరందరూ నా కొడుకులేనా? - అని అడిగాడు. ఆ ముని ఇలా అన్నాడు.)

1_4_234 ఆటవెలది వసు - విజయ్

ఆటవెలది

పుట్టుఁ జీకు వృద్ధుఁ బూతిగంధానను
వేదజడునిఁ బొంద వెలఁది రోసి
తన్నపోనిదానిఁ దన్విఁ గోమలిఁ దన
దాదికూఁతుఁ బంచెఁ దపసికడకు.

(పుట్టుగుడ్డి, ముసలివాడు అయిన అతడిని ఆ రాణిని ఏవగించుకొని, తనను పోలి ఉన్న తన దాది కూతురిని ఆ ముని దగ్గరకు పంపింది.)

1_4_233 వచనము వసు - విజయ్

వచనము

ఏ నపుత్త్రకుండ నై యెవ్విధంబునను సంతానంబు వడయనేరకున్న వాఁడ నాకు సంతానదానంబు దయసేయు మని యతనిం బూజించి తనపురంబునకుం దోడ్కొని చని ఋతుమతియైయున్న తనదేవి సుదేష్ణ యనుదాని సమర్పించిన నదియును.

(నాకు పుత్రులు లేరు. దయచేసి నాకు సంతానదానం చేయండి - అని అతడిని తన నగరానికి తీసుకువెళ్లి తన రాణి అయిన సుదేష్ణను అతడికి అర్పించాడు.)

1_4_232 కందము వసు - విజయ్

కందము

ఎందుండి వచ్చి తిందుల
కెందుల కేఁగుదు మహామునీశ్వర విద్వ
ద్వందిత నాపుణ్యంబునఁ
జెందితి నిన్నిష్టఫలముఁ జెందిన పాటన్.

(మునీశ్వరా! ఎక్కడినుండి వచ్చావు? ఎక్కడికి పోతున్నావు? నా కోరిక ఫలించి నిన్ను చూడగలిగాను.)

1_4_231 వచనము వసు - విజయ్

వచనము

అని శాపం బిచ్చిన దీర్ఘతమునకు నలిగి ప్రద్వేషిణి యిమ్ముదుకని నెటయేనియుం గొనిపొండని తనకొడుకులం బంచిన వారును నయ్యౌతథ్యునతివృద్ధు జాత్యంధు నింధనంబులతో బంధించి మోహాంధులయి గంగలో విడిచిన నమ్మునియును బ్రవాహవేగంబునఁ బెక్కుదేశంబులు గడచి చనియెనంత నొక్కనాఁడు బలియను రాజు గంగాభిషేకార్థంబు వచ్చినవాఁ డయ్యింధన బంధనంబున నుండియు నుదాత్తానుదాత్త స్వరితప్రచయస్వరభేదంబు లేర్పడ సలక్షణంబుగా వేదంబులం జదువుచుఁ దరంగ ఘట్టనంబునం దనయున్న దరిం జేరవచ్చినవానిఁ దీరంబుఁ జేర్చి యింధనబంధనంబులు విడిచి మహర్షి మామతేయుంగా నెఱిఁగి తన్నెఱింగించుకొని నమస్కారంబు సేసి యిట్లనియె.

(ఇలా శాపమిచ్చిన భర్తను ఎక్కడికైనా తీసుకువెళ్లమని ప్రద్వేషిణి తన కొడుకులను ఆజ్ఞాపించింది. వాళ్లు అతడిని కట్టెలతో కలిపి కట్టి గంగలో విడిచిపెట్టారు. ఆ ముని గంగాప్రవాహంతో అనేక దేశాలు దాటివెళ్లాడు. ఒకరోజు గంగాస్నానం కోసం వచ్చిన బలి అనే రాజు అతడిని రక్షించి, అతడు మహర్షి అయిన దీర్ఘతముడని తెలుసుకొని నమస్కరించి ఇలా అన్నాడు.)

1_4_230 కందము విజయ్ - విక్రమాదిత్య

కందము

పతిహీన లయిన భామిను
లతిధనవతు లయ్యుఁ గులజ లయ్యును ననలం
కృత లయ్యెడు మాంగల్యర
హిత లయ్యెడుఁ గృపణవృత్తి నిదియు మొదలుగన్.

(భర్తలను కోల్పోయిన భార్యలు ఎంతటి ధనవతులైనా దయనీయంగా, అలంకారాలు లేనివారుగా, మాంగల్యం లేనివారుగా అవుతారు గాక!)

1_4_229 ఆటవెలది విజయ్ - విక్రమాదిత్య

ఆటవెలది

ఎంతకాల మయిన నిప్పాట భరియింప
నోప నింక నరుగు మొండుకడకు
ననిన నిర్దయాత్మ లని దీర్ఘతముఁ డల్గి
సతులఁ కెల్ల నపుడు శాప మిచ్చె.

(ఎంతకాలమైనా ఇలాగే భరించవలసివస్తే నా వల్ల కాదు. ఇక నువ్వు మరొక చోటికి వెళ్లు - అన్నది. స్త్రీలు దయలేనివారని, దీర్ఘతముడు కోపంతో భార్యలందరికీ అప్పుడు శాపం పెట్టాడు.)

1_4_228 తేటగీతి వసు - విజయ్

తేటగీతి

పతియు భరియించుఁ గావున భర్తయయ్యె
భామ భరియింపఁబడుఁగాన భార్య యయ్యెఁ
బరఁగ నవి మనయందు వీడ్వడియె నిన్ను
నేన యెల్లకాలము భరియింతుఁ గాన.

(భార్యను భరిస్తాడు కాబట్టి మగడిని భర్త అనీ, భర్తచేత భరించదగినది కాబట్టి ఇల్లాలిని భార్య అనీ అంటారు. మన విషయంలో ఈ సంబంధం తారుమారైంది.)

1_4_227 వచనము వసు - విజయ్

వచనము

మఱి యదియునుంగాక యుతథ్యుం డను మునివరుపత్ని మమత యనుదాని గర్భిణి నభ్యాగతుం డయి బృహస్పతి దేవరన్యాయంబున నభిలషించినఁ దదీయగర్భస్థుం డయిన పుత్త్రుం డెఱింగి యిది ధర్మవిరుద్ధం బని యాక్రోశించిన వానికి నలిగి బృహస్పతి సర్వభూతేప్సితం బైన యిక్కార్యంబునందు నాకుఁ బ్రతికూలుండ వయితివి కావున దీర్ఘతమంబును బొందుమని శాపం బిచ్చిన వాఁడును దీర్ఘతముండు నాఁ బుట్టి సకలవేదవేదాంగవిదుండయి జాత్యంధుం డయ్యును తనవిద్యాబలంబునఁ బెద్దకాలంబునకుఁ బ్రద్వేషిణి యను నొక్క బ్రాహ్మణి వివాహంబయి గౌతమాదులయిన కొడుకులం బెక్కండ్రం బడసిన నది లబ్ధపుత్త్రయై తన్ను మెచ్చకున్న నిట్లేల నన్ను మెచ్చవని దీర్ఘతముండు ప్రద్వేషిణి నడిగిన నది యిట్లనియె.

(అంతేకాక, ఉతథ్యుడనే ముని భార్య అయిన మమత గర్భంతో ఉన్నా బృహస్పతి దేవరన్యాయం అనుసరించి ఆమెను కోరగా, ఆమె గర్భంలోని బాలుడు అది ధర్మవ్యతిరేకం అని పెద్దగా అరిచాడు. బృహస్పతి కోపంతో - జీవులందరూ కోరే ఈ పనిలో నన్ను వ్యతిరేకించినందుకు చీకటిని అనుభవించు - అని శపించి అతడిని గుడ్డివాడిని చేశాడు. ఆ బాలుడు దీర్ఘతముడనే పేరున పుట్టి పుట్టుగుడ్డి అయినా విద్యాభ్యాసం చేసి ప్రద్వేషిణి అనే ఆమెను వివాహమాడి గౌతముడు మొదలైన కొడుకులను పొందాడు. పుత్రవతి అయినా ఆమె తనను మెచ్చకపోవటం చూసి ఎందుకు అని దీర్ఘతముడు ఆమెను అడిగాడు. ప్రద్వేషిణి ఇలా అన్నది.)

-:దీర్ఘతముని వృత్తాంతము:-

1_4_226 చంపకమాల వసు - విజయ్

చంపకమాల

పితృవధజాతకోపపరిపీడితుఁడై జమదగ్నిసూనుఁడు
ద్ధతబలు హైహయున్ సమరదర్పితుఁ జంపి యశేషధారుణీ
పతుల వధించె గర్భగతబాలురు నాదిగ నట్టిచోటఁ ద
త్సతులకుఁ దొల్లి ధర్మవిధి సంతతి నిల్పరె భూసురోత్తముల్.

(తన తండ్రి వధ జరగటం వల్ల పరశురాముడు కోపంతో హైహయుడిని చంపి, రాజపత్నుల గర్భాలలో ఉన్నవారితో సహా రాజులందరినీ సంహరించాడు. అటువంటి సందర్భంలో బ్రాహ్మణులు ఆ రాజపత్నులకు సంతానం కలిగించి వంశాలను నిలిపారు.)

1_4_225 వచనము వసు - విజయ్

కందము

పృథివ్యాది మహాభూతంబులు గంధాదిగుణంబుల నెట్లు విడువ వట్ల యేనును గురుకార్యంబున మీశుల్కార్థంబుగా సర్వజనసమక్షంబున నాచేసిన సమయస్థితి విడువ నది యట్లుండె మీయానతిచ్చినట్లు నాయెఱుఁగని ధర్మువులు లేవు శంతనుసంతానంబు శాశ్వతం బగునట్లుగా క్షత్త్రధర్మంబు సెప్పెద నాచెప్పినదాని ధర్మార్థవిదు లయి లోకయాత్రానిపుణు లయిన పురోహితప్రముఖ నిఖిలబ్రాహ్మణవరులతో విచారించి చేయునది యని భీష్ముఁ డందఱు విన ని ట్లనియె.

(నేను నా ప్రతిజ్ఞను విడువను. అది అలా ఉండనివ్వండి. వంశం నిలిచేందుకు ఒక క్షత్రియధర్మం చెపుతాను. నిపుణులతో ఆలోచించి అది చేయవలసింది - అని అందరూ వినేలా ఇలా అన్నాడు.)

1_4_224 కందము విజయ్ - విక్రమాదిత్య

కందము

హిమకరుఁడు శైత్యమును న
ర్యముఁడు మహాతేజమును హుతాశనుఁ డుష్ణ
త్వము విడిచిరేని గుర్వ
ర్థము నాచేకొనిన సద్వ్రతంబు విడుతునే.

(చంద్రుడు చల్లదనాన్నీ, సూర్యుడు ప్రకాశాన్నీ, అగ్ని వేడినీ వదిలినా నేను మాత్రం తండ్రి కోసం చేపట్టిన వ్రతాన్ని విడుస్తానా?)

1_4_223 కందము వసు - విజయ్

కందము

విని భీష్ముఁ డనియె మీ కి
ట్లని యానతి యీయఁదగునె యమ్మెయి నాప
ల్కిన పల్కును మఱి నా తా
ల్చిన వ్రతమును జెఱుప నంత చిఱుతనె చెపుఁడా.

(భీష్ముడు ఇలా అన్నాడు - ఇలా నన్ను ఆజ్ఞాపించటం ఉచితమేనా? నా ప్రతిజ్ఞనూ, బ్రహ్మచర్యవ్రతాన్నీ వమ్ము చేయటానికి నేనంత అవివేకినా చెప్పండి?)

1_4_222 కందము వసు - విజయ్

కందము

నిరతంబు బ్రహ్మమొదలుగ
వరుసన యెడతెగక యిట్లు వచ్చిన వంశం
బురుభుజ నీ వుండఁగ నీ
తరమున విచ్ఛిన్న మగుట ధర్మువె యనినన్.

(బ్రహ్మదేవుడు మొదలుగా ఆగిపోకుండా వచ్చిన ఈ వంశం నువ్వుండగానే విచ్ఛిన్నం కావడం ధర్మమా? - అని సత్యవతి అనగా.)

1_4_221 కందము వసు - విజయ్

కందము

ఇక్కురువంశంబున నీ
వొక్కరుఁడవ యున్నవాఁడ వుర్వీరాజ్యం
బెక్కటి సేకొని తేజము
దిక్కుల వెలిఁగింపు సంతతియుఁ బడయు మొగిన్.

(నువ్వే రాజ్యాన్ని చేపట్టి సంతానాన్ని కూడా పొందు.)

1_4_220 చంపకమాల వసు - విజయ్

చంపకమాల

జననుత సర్వధర్మములు సర్వజగత్పరివర్తనక్రమం
బును మఱి సర్వవంశములుఁ బుట్టిన మార్గము నీవ నిక్కువం
బనఘ యెఱుంగు దున్నతగుణాఢ్యుఁడవున్ భరతాన్వయావలం
బనుఁడవు నీవ నిన్నొకఁడు పంచెదఁ జేయుము మత్ప్రియంబుగన్.

(భరతవంశానికి ఆధారంగా నువ్వే నిలిచి ఉన్నావు. నీకు ఒక ఆజ్ఞ ఇస్తాను. నా సంతోషం కోసం అది నువ్వు నెరవేర్చాలి.)

1_4_219 కందము వసు - విజయ్

కందము

శంతను సంతానంబును
సంతతకీర్తియును బిండసత్కృతియును న
త్యంత మహీభారమును బ
రంతప నీయంద చిరతరం బై నిలిచెన్.

(శంతనుడి సంతానమని చెప్పదగినవాడివి ఇక నువ్వు మాత్రమే.)

1_4_218 వచనము వసు - విజయ్

వచనము

మఱియు నత్యంతశోకార్ణవంబున మునింగిన తల్లిని మఱదండ్రను నాశ్వాసించి యరాజకం బయిన రాజ్యం బకలంకంబుగాఁ బ్రతిపాలించుచున్న కొడుకు నఖిల ధర్మవిదు గాంగేయుం జూచి సత్యవతి యిట్లనియె.

(తరువాత భీష్ముడు తల్లినీ, మరదళ్లనూ ఓదార్చి రాజ్యపాలన సాగిస్తుండగా సత్యవతి అతడితో ఇలా అన్నది.)

-:సత్యవతి భీష్ముని వివాహమాడు మని కోరుట:-

1_4_217 సీసము + ఆటవెలది విజయ్ - విక్రమాదిత్య

సీసము

అమలసుధారమ్య హర్మ్యతలంబుల
        నవకుసుమామోద నందనములఁ
గృతకాద్రి కందర క్రీడాగృహాంగణ
        వివిధరత్నోపలవేదికలను
గలహంస కలనాదకమనీయ కమలినీ
        దీర్ఘికాసైకతతీరములను
రమియించుచును గామరాగాధికాసక్తిఁ
        జేసి శోషించి విచిత్రవీర్యుఁ

ఆటవెలది

డమరపురికిఁ జనిన నతనికిఁ బరలోక
విధుల శాస్త్రదృష్టి వెలయఁ జేసె
నాపగాతనూజుఁ డఖిలబాంధవులయు
బ్రాహ్మణులయుఁదోడ భానునిభుఁడు.

(విచిత్రవీర్యుడు విషయాసక్తితో చిక్కిశల్యమై మరణించాడు. భీష్ముడు అతడి పరలోకవిధులను నిర్వహించాడు.)

1_4_216 వచనము వసు - విజయ్

వచనము

ఇట్లు సకలవ్యాపారరహితుం డై కాశీరాజదుజితల నయ్యిరువుర నతిప్రణయ గౌరవంబునం దగిలి.

(ఇలా అన్ని పనులూ మానుకొని కాశీరాజపుత్రికలతో కూడి.)

1_4_215 ఉత్పలమాల వసు - విజయ్

ఉత్పలమాల

లాలిత రూపయౌవన విలాస విభాసిను లైన యంబికాం
బాలికలన్ వివాహ మయి భారతవంశకరుండు గామ లీ
లాలలితానుభోగరసలాలసుఁ డై నిజరాజ్యభార చిం
తాలసుఁ డయ్యెఁ గామికి నయంబున నొండు దలంపఁబోలునే.

(విచిత్రవీర్యుడు విషయాభిలాషతో రాజ్యనిర్వహణలో ఆసక్తి కోల్పోయాడు. కాముకుడికి మరొక విషయాన్ని గురించి ఆలోచించే వీలెక్కడ కలుగుతుంది?)

1_4_214 వచనము వసు - విజయ్

వచనము

అనిన విని భీష్ముండు ధర్మవిదు లయిన బ్రాహ్మణుల యనుమతంబున దాని సాల్వరాజున కిచ్చిపుచ్చి మహోత్సవంబున నయ్యురువురు కన్యకల విచిత్రవీర్యునకు వివాహంబు సేసిన.

(భీష్ముడు ఇది విని అంబను సాల్వరాజు దగ్గరకు పంపి, మిగిలిన ఇద్దరు కన్యలనూ విచిత్రవీర్యుడికి ఇచ్చి పెళ్లి చేశాడు.)

-:విచిత్రవీర్యుని వివాహము, మరణము:-

1_4_213 ఆటవెలది వసు - విజయ్

ఆటవెలది

పరఁగ నన్ను సాల్వపతి వరియించినఁ
దండ్రిచేతఁ బూర్వదత్త నైతి
నమ్మహీశునకు నయంబున నెయ్యది
ధర్ము వెఱిఁగి దానిఁ దలఁపు మిపుడు.

(సాల్వరాజు నన్ను వరించటం చేత నా తండ్రి ఇంతకు ముందే అతడికి మాట ఇచ్చాడు. ఇప్పుడు ధర్మాన్ని నిర్ణయించు.)

1_4_212 వచనము వసు - విజయ్

వచనము

ఇట్లు సకలరాజలోకంబు నెల్ల నశ్రమంబున నోడించి సాల్వరాజు మందల విడిచి పరాక్రమలబ్ధ లయిన కాశీరాజదుహితల నంబాంబికాం బాలికలం దోడ్కొనివచ్చి భీష్ముండు విచిత్రవీర్యునకు వివాహంబు సేయనున్న నందుఁ బెద్దయది యైన యంబ యిట్లనియె.

(ఇలా అంబను, అంబికను, అంబాలికను తీసుకువచ్చి భీష్ముడు విచిత్రవీర్యుడికి ఇచ్చి వివాహం చేయబోగా ఆ ముగ్గురిలో పెద్దదైన అంబ ఇలా అన్నది.)

1_4_211 కందము వసు - విజయ్

కందము

రథమును రథ్యంబులు సా
రథియును వృథ యైన భగ్నరథుఁ డై భాగీ
రథి కొడుకుచేత విమనో
రథుఁడై సాల్వుండు నిజపురంబున కరిగెన్.

(సాల్వుడు చేసేది లేక తన నగరానికి తిరిగివెళ్లిపోయాడు.)

1_4_210 కందము వసు - విజయ్

కందము

ఘనభుజుఁ డన్నియు నడుమన
తునియఁగ వడి నేసి వానితురగచయస్యం
దన సూతుల నొక్కొక య
మ్మునఁ ద్రెళ్ళఁగ నేసె భరతముఖ్యుఁడు పోరన్.

(భీష్ముడు ఆ బాణాలను తన బాణాలతో మధ్యలోనే ధ్వంసం చేసి సాల్వుడి గుర్రాలనూ, రథాలనూ, సారథినీ నేలకూల్చాడు.)

1_4_209 కందము విజయ్ - విక్రమాదిత్య

కందము

ధృతిమెయి శతసంఖ్యయు దశ
శతసంఖ్యయు శతసహస్రసంఖ్యయును శతా
యుత సంఖ్యయుఁగా దేవ
వ్రతుమీఁదను సాల్వుఁ డేసె వాఁడిశరంబుల్.

(సాల్వుడు భీష్ముడిమీద బాణాలు ప్రయోగించాడు.)

1_4_208 వచనము విజయ్ - విక్రమాదిత్య

వచనము

అంత.

(తరువాత.)

1_4_207 చంపకమాల విజయ్ - విక్రమాదిత్య

చంపకమాల

అనిలజవంబునం బఱచు నమ్మదనాగ మెదిర్చి క్రమ్మఱిం
చిన పరికాఁడ పోలెఁ గురుసింహవరూథము నిట్లు గ్రమ్మఱిం
చునె యితఁడంచునుం దగిలి చూపఱు సాల్వమహీశు విక్రమం
బొనరఁగ నల్గడం బొగడుచుండిరి విస్మయసక్తచిత్తు లై.

(భీష్ముడి సైన్యాన్ని ఇతడు మళ్లించాడే అని చూసేవాళ్లు సాల్వుడిని పొగిడారు.)

1_4_206 వచనము విజయ్ - విక్రమాదిత్య

వచనము

భీష్ముండును దనరథంబు నివర్తింపించి సంవర్తసమయ సమవర్తియుంబోలె నతిరౌద్రాకారుండయి నిలిచిన.

(భీష్ముడు కూడా తన రథాన్ని వెనక్కి తిప్పి నిలిచాడు.)

1_4_205 ఉత్పలమాల విజయ్ - విక్రమాదిత్య

ఉత్పలమాల

ఈవసుధాధినాథుల జయించిన యట్టిద కాదు చక్కనై
పోవక నిల్వు నా కెదిరిపోర మదీయధనుర్విముక్త నా
నావిధ మార్గణోగ్ర గహనంబున దిగ్భ్రమఁబొంద కెమ్మెయిం
బోవఁగఁ బోలు నీకనుచుఁ బూరుకులోత్తముఁ దాఁకె వీఁకతోన్.

(ఈ రాజులను గెలవటం గెలవటమే కాదు. అలా వెళ్లిపోకుండా నన్ను ఎదిరించి యుద్ధం చెయ్యి - అని గర్వంతో భీష్ముడిమీద బాణాలు వేశాడు.)

-:సాల్వుఁడు భీష్మునితో యుద్ధంబు సేయుట:-

1_4_204 వచనము విజయ్ - విక్రమాదిత్య

వచనము

ఇట్లు నిఖిలక్షత్త్రియక్షయార్థం బలిగిన పరశురాముండునుంబోలెఁ గడు నలిగి పరశురామశిష్యుం డా క్షత్త్రవర్గంబునెల్లఁ దన శరధారావర్షంబున ముంచి యోడించి యేకవీరుం డయి వచ్చువాని పిఱుంద సమరసన్నద్ధుం డయి సాల్వుండు సనుదెంచి.

(పరశురాముడి శిష్యుడైన భీష్ముడు ఇలా వారిని ఓడించి తిరిగివస్తుండగా సాల్వుడు అతడి వెన్నంటి యుద్ధానికి వచ్చి.)

1_4_203 కందము విజయ్ - విక్రమాదిత్య

కందము

నెఱి నుఱక వైరి వీరుల
నెఱఁకుల దూఱంగ నేయు నృపపుంగవు నం
పఱ కోర్వక పిఱు సని రని
వెఱచి విషణ్ణు లయి సకలవిషయాధిపతుల్.

(ఆ రాజులందరూ భయపడి వెనుదిరిగారు.)

1_4_202 కందము విజయ్ - విక్రమాదిత్య

కందము

వారల నందఱ రౌద్రా
కారుం డై కసిమసంగి గాంగేయుఁడు దు
ర్వార పటుబాణనిహతిని
వీరాహవరంగమునకు విముఖులఁ జేసెన్.

(భీష్ముడు విజృంభించి వారందరినీ యుద్ధభూమి నుండి వెళ్లగొట్టాడు.)

1_4_201 మత్తేభము విజయ్ - విక్రమాదిత్య

మత్తేభము

నరనాగాశ్వవరూథయూధములతో నానావనీనాథు లు
ద్ధురు లై యొక్కట నొండొరుం జఱచి యుత్తుంగానిలోద్ధూతసా
గరసంక్షోభసమంబుగాఁ గలఁగి వీఁకన్ వీరులై తాఁకి యే
సిరి దేవవ్రతుపై నభోవలయ మచ్ఛిద్రంబుగా నమ్ములన్.

(అక్కడ ఉన్న రాజులందరూ దేవవ్రతుడిపై బాణాలు గుప్పించారు.)

Sunday, February 19, 2006

1_4_200 వచనము పవన్ - వసంత

వచనము

బ్రాహ్మంబు మొదలుగాఁ గల యెనిమిదివివాహముల యందు క్షత్త్రియులకుగాంధర్వరాక్షసంబు లుత్తమంబులు స్వయంవరంబున జయించి వివాహంబగుట యంతకంటె నత్యుత్తమంబు గావున నిమ్మూఁగిన రాజలోకంబు నెల్లనోడించి యిక్కన్యలం దోడ్కొని నాచనుట యిది ధర్మంబయని కాశీరాజునకుం జెప్పి వీడ్కొని భీష్ముండు వచ్చునప్పుడు.

(స్వయంవరంలో రాజులను ఓడించి ఈ కన్యలను తీసుకొనిపోవటం న్యాయమే - అని కాశీరాజుకు చెప్పి వీడ్కోలు పలికి భీష్ముడు తిరిగి వస్తూ ఉండగా.)

1_4_199 కందము పవన్ - వసంత

కందము

నాయనుజునకు వివాహము
సేయఁగఁ గన్యాత్రయంబుఁ జేకొని బలిమిం
బోయెద నడ్డం బగు వా
రాయతభుజశక్తి నడ్డమగుఁ డాజిమొనన్.

(ఈ ముగ్గురు కన్యలనూ నా తమ్ముడికిచ్చి వివాహం చేయటానికి తీసుకొనిపోతున్నాను. అడ్డురావాలనుకొన్నవారు రండి.)

1_4_198 వచనము పవన్ - వసంత

వచనము

అట్టి విచిత్రవీర్యు నారూఢయౌవనుం జూచి భీష్ముండు వివాహయత్నపరుం డయి తన చారులవలనం గాశీరాజు కూఁతుల స్వయంవరోత్సవంబు విని ధనుర్ధరుం డయి రథం బెక్కి యొక్కరుండును వారణాసీపురంబునకుం జనియందు స్వయంవరంబునకు మూఁగిన రాజలోకం బెల్ల వెఱచి వెఱఁగుపడిచూచుచుండ నక్కన్యకలఁ దన రథం బెక్కించికొని యెల్లవారలు విననిట్లనియె.

(యౌవనం పొందిన విచిత్రవీర్యుడికి వివాహం చేయటం కోసం, కాశీరాజు కుమార్తెల స్వయంవరం జరుగుతున్న వారణాసికి భీష్ముడు ఒక్కడే వెళ్లి, అక్కడి వారంతా నిశ్చేష్టులై చూస్తూండగా, ఆ కన్యలను తన రథంపై ఎక్కించుకొని అందరూ వినేలా ఇలా అన్నాడు.)

-:భీష్ముఁడు కాశీరాజుకూఁతుల స్వయంవరమున కరుగుట:-

1_4_197 కందము పవన్ - వసంత

కందము

వసునిభుఁడు పైతృకం బగు
వసుధా రాజ్యంబు భీష్మువచనమున గత
వ్యసనుఁడయి తాల్చెఁ దేజం
బెసగంగ విచిత్రవీర్యుఁ డిద్ధయశుం డై.

(వసురాజువంటివాడైన విచిత్రవీర్యుడు రాజ్యపాలనం చేపట్టాడు.)

1_4_196 వచనము పవన్ - వసంత

వచనము

ఇట్లు చిత్రాంగదుండు గంధర్వనిహతుం డయినఁ దత్పరోక్షంబున భీష్ముండు విచిత్రవీర్యుం గౌరవరాజ్యంబున కభిషిక్తుం జేసిన.

(చిత్రాంగదుడు ఇలా మరణించగా భీష్ముడు విచిత్రవీర్యుడిని కౌరవరాజ్యానికి రాజుగా అభిషేకించాడు.)

1_4_195 కందము పవన్ - వసంత

కందము

వదలక మాయాయుద్ధా
తిదుక్షుఁ డయి వంచనోన్నతిన్ గంధర్వుం
డుదితరవితేజుఁ జిత్రాం
గదుఁ జంపె విచిత్ర పత్త్రకార్ముకహస్తున్.

(మాయాయుద్ధంలో నేర్పరి అయిన గంధర్వుడు ఆ యుద్ధంలో చిత్రాంగదుడిని సంహరించాడు.)

1_4_194 కందము పవన్ - వసంత

కందము

నరగంధర్వాధిపు ల
య్యిరువురు చిత్రాంగదులు సహింపక యని నొం
డొరుఁ దాఁకి వీఁకఁ బొడిచిరి
హిరణ్వతీ తీరమున నహీనబలాఢ్యుల్.

(నరులకూ, గంధర్వులకూ రాజులైన ఇద్దరు చిత్రాంగదులూ హిరణ్వతీనదీతీరంలో యుద్ధంచేశారు.)

1_4_193 వచనము పవన్ - వసంత

వచనము

శంతనుండును బరమానురాగంబున సత్యవతిని వివాహం బై యతిమానుషం బయిన యాభీష్ముసత్యవ్రతంబునకు సంతసిల్లి యాతనికి స్వచ్ఛందమరణంబుగా వరం బిచ్చి సత్యవతియందుఁ జిత్రాంగద విచిత్రవీర్యులన నిద్దరు గొడుకులం బడసి వారలు సంప్రాప్తయౌవనులు గాకుండఁ బరలోకగతుండైనఁ దండ్రికి భీష్ముండు పరలోకక్రియలు నిర్వర్తించి చిత్రాంగదు రాజ్యాభిషిక్తుం జేసిన నాతండును నతివ్యాలోలుం డై గర్వంబున నెవ్వరి నుఱక సుర దనుజ మనుజ గంధర్వాదులు నాక్షేపించుచున్న వాని కలిగి చిత్రాంగదుండను గంధర్వపతి యుద్ధార్థియయి వచ్చినం గురుక్షేత్రంబునందు.

(శంతనుడు సత్యవతిని వివాహమాడి భీష్ముడి సత్యనిష్ఠకు మెచ్చి అతడికి ఇష్టం వచ్చినప్పుడు మరణించే వరం ప్రసాదించాడు. తరువాత సత్యవతివల్ల చిత్రాంగద విచిత్రవీర్యులనే కుమారులను పొంది, వారు యువకులు కాకుండానే శంతనుడు మరణించాడు. భీష్ముడు తండ్రికి అపరక్రియలు చేసి చిత్రాంగదుడికి రాజ్యాభిషేకం చేశాడు. చిత్రాంగదుడు చంచలుడై అహంకారంతో ప్రవర్తిస్తుండగా చిత్రాంగదుడనే గంధర్వరాజు అతడిని ద్వంద్వయుద్ధానికి ఆహ్వానించాడు. అప్పుడు కురుక్షేత్రంలో.)

-:చిత్రాంగద విచిత్రవీర్యుల వృత్తాంతము:-

1_4_192 మత్తేభము పవన్ - వసంత

మత్తేభము

ఇనతేజుం డతిభక్తిఁ గాంచనరథం బెక్కించి యక్కన్యఁ దో
డ్కొని తెచ్చెం దనతల్లి సత్యవతినిన్ క్షోణీజనుల్ దన్ను బో
రనఁ గీర్తింపఁగ శంతనుం డతిమనోరాగంబునం బొంద శాం
తననవుం డాతతకీర్తి హస్తిపురికిం దత్కౌతుకారంభుఁ డై.

(భీష్ముడు సత్యవతిని తనవెంట హస్తినాపురానికి తీసుకొనివచ్చాడు.)

1_4_191 వచనము పవన్ - వసంత

వచనము

అని యిట్లు సత్యవతిని దనతండ్రికి వివాహంబు సేయుపొంటె నిజరాజ్యవరిత్యాగంబును బ్రహ్మచర్యవ్రతపరిగ్రహణంబును జేసిన దేవవ్రతుసత్యవ్రతంబునకు గురుకార్యధురంధరత్వంబునకు మెచ్చి దేవర్షి గణంబులు నాతని పయిం బుష్పవృష్టిఁ గురిసి భీష్ముం డని పొగడిరి. దాశరాజును గరంబు సంతసిల్లి శంతనునకు సత్యవతి నిచ్చె నంత.

(అందరూ దేవవ్రతుడిని మెచ్చుకొని అతడిని "భీష్ముడు" అని ప్రశంసించారు. దాశరాజు కూడా సంతోషించి సత్యవతిని శంతనుడి కోసం ఇచ్చాడు.)

1_4_190 కందము పవన్ - వసంత

కందము

ధృతిఁ బూని బ్రహ్మచర్య
వ్రత మున్నతిఁ దాల్చితిని ధ్రువంబుగ ననప
త్యత యైనను లోకము లా
యతిఁ బెక్కులు గలవు నాకు ననుభావ్యము లై.

(అప్పుడు దేవవ్రతుడు - స్థిరమైన బుద్ధితో బ్రహ్మచర్యవ్రతాన్ని నిశ్చింతగా స్వీకరిస్తున్నాను - అన్నాడు.)

1_4_189 కందము పవన్ - వసంత

కందము

నీ వఖిల ధర్మవిదుఁడవు
గావున నీ కిట్ల చేయఁగా దొరకొనియెన్
భావిభవత్సుతు లిట్టిరె
నీ విహితస్థితియు సలుపనేర్తురె యనినన్.

(సమస్తధర్మాలు తెలిసిన నీకు ఇలా చేయటం చెల్లింది. కానీ ముందుముందు నీ కొడుకులు ఇలా చేయగలరా? నీ నియమాన్ని వారు పాటించగలరా?)

1_4_188 వచనము పవన్ - వసంత

వచనము

అని సభాసదులకెల్ల రోమహర్షణంబుగా సత్యవ్రతుండయిన దేవవ్రతుండు పలికిన వెండియు దాశరాజిట్లనియె.

(అని సభలోని ధర్మజ్ఞులకు గగుర్పాటు కలిగేలా దేవవ్రతుడు మాట్లాడగా దాశరాజు ఇంకా ఇలా అన్నాడు.)

1_4_187 చంపకమాల పవన్ - వసంత

చంపకమాల

వినుఁడు ప్రసిద్ధులైన పృథివీపతు లిందఱు నే గురుప్రయో
జనమునఁ జేసితిన్ సమయసంస్థితి యీలలితాంగి కుద్భవిం
చిన తనయుండ రాజ్యమును జేయఁగ నర్హుఁడు వాఁడ మాకు నె
ల్లను బతి వాఁడ కౌరవకులస్థితికారుఁ డుదారసంపదన్.

(ఇక్కడ సమావేశమైన ప్రభువులంతా వినండి. నేను నా తండ్రికోసం ఒక స్థిరప్రతిజ్ఞ చేస్తున్నాను. ఈమెకు పుట్టిన కొడుకే ప్రభువు అవుతాడు, కౌరవవంశాన్ని నిలుపుతాడు.)

1_4_186 వచనము పవన్ - వసంత

వసంత

ఆ దోషం బెట్లు పరిహృతం బగు నట్లుగా నీచి త్తంబునం దలంచి వివాహంబు సేయుమనిన గాంగేయుం డి ట్లనియె.

(ఈ దోషాన్ని తొలగించటం ఎలాగో నీ మనసులో నిర్ణయించుకొని వివాహం చెయ్యి - అనగా గాంగేయుడు ఇలా అన్నాడు.)

1_4_185 కందము పవన్ - వసంత

కందము

విను మైనను సాపత్న్యం
బనుదోషము కలదు దీన నదియును నీచే
తన సంపాద్యము నీ వలి
గిన నడ్డమె పురహరాజకేశవు లయినన్.

(అయినా, శంతనుడికి సత్యవతిని ఇవ్వటం వల్ల ఆమె బిడ్డలకు సవతిసంతానం అనే దోషం ఏర్పడుతుంది. అది కూడా నీవల్లే కలుగుతుంది.)

1_4_184 వచనము పవన్ - వసంత

వచనము

బహుపుత్త్రార్థంబు యత్నంబు సేయవలయు వివాహం బయ్యెద ననిన విని గాంగేయుండు వృద్ధామాత్యపురోహితసుహృజ్జనంబులతో విచారించి యోజనగంధి రాజుచిత్తంబునం గలుగుట యెఱింగి యనేకరాజన్యసమన్వితుండయి దాశరాజుకడకుం జని మా రాజునకు సత్యవతిని దేవింగానిచ్చునది యని యడిగిన నాతండును దేవవ్రతుం బూజించి నీవు ధర్మశీలుండ వర్థానర్థవిదుండవు సకలకార్యసమర్థుండవు గుర్వర్థంబు కన్యార్థి వై వచ్చితివి కావునం గృతార్థుండ నైతి నెవ్వనియేని వీర్యంబున నిక్కన్య యుద్భవిల్లె నట్టి యుపరిచరుం డను రాజర్షి యీ సత్యవతినొరుల కీ వలవదు శంతనునక యిచ్చునది యనుటంజేసి తొల్లి యసితుం డయిన దేవలుండు కన్యార్థి యయి వచ్చి ప్రత్యాఖ్యాతుం డయ్యె నిట్టి సంబంధ మెవ్వరికిఁ బడయనగు.

(ఇంకొందరు పుత్రుల కోసం ప్రయత్నం చేయాలి. వివాహం చేసుకుంటాను - అని శంతనుడు అనగా, గాంగేయుడు హితులతో ఆలోచించి, రాజు మనసులో యోజనగంధి ఉన్నదని తెలుసుకొని, సామంతరాజులతో దాశరాజు దగ్గరకు వెళ్లి - మా రాజుకు సత్యవతిని రాణిగా ఇవ్వండి - అని అడిగాడు. దాశరాజు దేవవ్రతుడితో - ఈమె తండ్రి అయిన ఉపరిచరుడు ఈమెను శంతనుడికే ఇమ్మని అన్నాడు. పూర్వం అసితవంశానికి చెందిన దేవలుడు ఈమెను కోరినా నేను తిరస్కరించాను.)

1_4_183 కందము పవన్ - వసంత

కందము

నీవస్త్ర శస్త్ర విద్యా
కోవిదుఁడవు రణములందుఁ గ్రూరుఁడ వరివి
ద్రావణ సాహసికుండవు
గావున నీయునికి నమ్మఁగా నేర నెదన్.

(నువ్వు అస్త్రశస్త్రవిద్యలలో పాండిత్యం ఉన్నవాడివి, యుద్ధాలలో దయాదాక్షిణ్యాలులేని కరకువాడివి, శత్రువులను సంహరించటంలో వెనుకముందులాలోచించని సాహసికుడివి. కాబట్టి నువ్వు దీర్ఘకాలం జీవిస్తావని మనసులో నమ్మలేకపోతున్నాను.)

1_4_182 కందము పవన్ - వసంత

కందము

జనవినుత యగ్నిహోత్రం
బును సంతానమును వేదములు నెడతెగఁగాఁ
జన దుత్తమవంశజులకు
ననిరి మహాధర్మనిపుణులైన మునీంద్రుల్.

(గాంగేయా! అగ్నిహోత్రాన్నీ, సంతానాన్నీ, వేదాలనూ విచ్ఛిన్నం చేసుకోరాదు.)

1_4_181 కందము పవన్ - వసంత

కందము

వినవయ్య యేకపుత్త్రుఁడు
ననపత్యుఁడు నొక్కరూప యని ధర్మువులన్
విని నీకుఁ దోడు పుత్త్రుల
ననఘా పడయంగ నిష్టమయినది నాకున్.

(ఒకే కొడుకు కలవాడు, సంతానం లేనివాడు - వీరిద్దరూ సమానులని ధర్మశాస్త్రాలలో విని, నీకు తోడుగా మరికొందరు కొడుకులను పొందాలని నాకు కోరిక కలిగింది.)

1_4_180 వచనము పవన్ - వసంత

వచనము

అనిన విని పెద్దయుం బ్రొద్దు చింతించి శంతనుండు గొడుకున కిట్లనియె.

(అది విని శంతనుడు చాలాసేపు ఆలోచించి కొడుకుతో ఇలా అన్నాడు.)

1_4_179 చంపకమాల పవన్ - వసంత

చంపకమాల

భవదభిరక్షితక్షితికి బాధ యొనర్పఁగ నోపునట్టి శా
త్రవనివహంబు లేదు వసుధాప్రజకెల్ల ననంతసంతతో
త్సవముల రాజులెల్ల ననిశంబు విధేయుల నీకు నిట్లు మా
నవవృషభేంద్ర యేలొకొ మనఃపరితాపముఁ బొంది యుండఁగన్.

(మహారాజా! నువ్వు రక్షిస్తున్న ఈ రాజ్యానికి శత్రువుల భయం లేదు. ప్రజలు హాయిగా ఉన్నారు. రాజులందరూ నీకు లొంగి ఉన్నారు. నీ మనోవేదనకు కారణం ఏమిటి?)

1_4_178 వచనము పవన్ - వసంత

వచనము

నా కొండెద్దియు నిష్టంబు లేదనిన విని యద్దాశరాజుచేతం బ్రతిహత మనోరథుం డయి క్రమ్మఱి నిజపురంబునకు వచ్చి శంతనుండు చింతాక్రాంతుండయి సత్యవతిన తలంచుచు నివృత్తకార్యాంతరుం డయియున్న నొక్కనాఁడు గాంగేయుండు తండ్రిపాలికి వచ్చి యి ట్లనియె.

(నాకు ఇంకేమీ ఇష్టం లేదు - అని దాశరాజు అనగా శంతనుడు రాజధానికి తిరిగివచ్చి సత్యవతినే తలుస్తూ రాజకార్యాలకు దూరంగా ఉండగా గాంగేయుడు తండ్రి వద్దకు వెళ్లి ఇలా అన్నాడు.)

-:గాంగేయుఁడు బ్రహ్మచర్యవ్రతంబుఁ బూని భీష్ముం డగుట:-

1_4_177 మధ్యాక్కర పవన్ - వసంత

మధ్యాక్కర

భూపాల నీకు నిక్కోమలివలనఁ బుట్టిన సుతుఁడు
నీ పరోక్షంబున రాజు గావలె నెమ్మి ని ట్లీఁగ
నోపుదే యనిన శంతనుఁడు గాంగేయు యువరాజుఁ దలఁచి
యీపల్కు దక్కఁగ నొండు వేఁడుమ యిచ్చెద ననిన.

(రాజా! నీకు ఈమె వల్ల పుట్టిన కొడుకు నీ తరువాత రాజు అయేలా మాట ఇవ్వగలవా? - అని దాశరాజు అడిగాడు. శంతనుడు యువరాజైన గాంగేయుడిని తలచుకొని అది తప్ప ఇంకేమైనా కోరుకొమ్మన్నాడు.)

1_4_176 వచనము పవన్ - వసంత

వచనము

అయినను నాడెందంబునం గలదానిం జెప్పెద నిక్కన్యక నీకు ధర్మపత్నిగాఁ జేయునట్టి యిష్టంబు గలదేని నావేఁడిన దాని నిమ్మనిన శంతనుండు దాని నీనగునేని యిచ్చెదఁ గానినాఁ డీనేర నది యేమి సెప్పు మనిన దాశరాజిట్లనియె.

(అయితే, ఈమెను వివాహం చేసుకోవాలనే కోరిక నీకుంటే నేను కోరిన దానిని ఇవ్వండి - అని అడిగాడు. ఇవ్వదగినదైతే ఇస్తాను, లేకపోతే ఇవ్వలేను, అదేమిటో చెప్పు - అని శంతనుడు అన్నాడు.)

1_4_175 తేటగీతి పవన్ - వసంత

తేటగీతి

పుట్టినప్పుడ కన్యకఁ బోలు నట్టి
వరున కిచ్చుట యిది లోకవర్తనంబు
వసుమతీనాథ నీయట్టివరున కిచ్చి
ధన్యులము గామె యిక్కన్యఁ దద్దపేర్మి.

(రాజా! ఈ కన్యను నీవంటి ఉత్తముడైన వరుడికిస్తే కృతార్థులమవుతాము.)

1_4_174 వచనము పవన్ - వసంత

వచనము

ఏను దాశరాజుకూఁతురఁ దండ్రినియోగంబున నిక్కార్యంబు ధర్మార్థంబు సేయుచుందు ననిన దాని యభినవరూపసౌందర్యంబులు దొల్లియు విని యెఱింగినవాఁడై యక్కోమలిం గామించి దాశరాజుకడకుం జని తనయభిప్రాయం బెఱింగించిన నతండును సంతసిల్లి శంతను నత్యంతభక్తిం బూజించి యిట్లనియె.

(నేను దాశరాజు కుమార్తెను. తండ్రి ఆజ్ఞ ప్రకారం ఈ పని చేస్తున్నాను - అని చెప్పగా శంతనుడు దాశరాజు దగ్గరకు వెళ్లి అతడి కూతురిని పెళ్లాడుతానని కోరాడు. దాశరాజు సంతోషించి శంతనుడితో ఇలా అన్నాడు.)

1_4_173 ఉత్పలమాల పవన్ - వసంత

ఉత్పలమాల

ఎందులదాన వేకతమ యియ్యమునానది నోడ నడ్పుచున్
సుందరి నీకు నున్కి యిది చూడఁగఁ దా నుచితంబె నావుడున్
మందమనోజ్ఞహాసముఖమండల మెత్తి మృగాక్షి చూచి సం
క్రందనసన్నిభున్‌ నృపతిఁ గన్యక యి ట్లని పల్కెఁ బ్రీతితోన్.

(ఎవరు నువ్వు? ఒంటరిగా ఈ యమునా నదిలో నువ్వు పడవ నడపటం ఉచితమేనా? - అని అడిగాడు. ఆమె ఇలా అన్నది.)

1_4_172 ఉత్పలమాల పవన్ - వసంత

ఉత్పలమాల

దానిశరీరసౌరభము దానివిలోలవిలోకనంబులున్
దానిమనోహరాకృతియు దానిశుచిస్మితవక్తృకాంతియున్
దానివిలాసముం గడుముదంబునఁ జూచి మనోజబాణసం
తానహతాత్ముఁడై నృపతి దానికి నిట్లనియెం బ్రియంబునన్.

(శంతనుడు ఆమెను సంతోషంతో చూసి ఇలా అన్నాడు.)

1_4_171 కందము పవన్ - వసంత

కందము

కనకావదాతకోమల
తనులతఁ దనుమధ్యఁ గమలదళనేత్రను యో
జనగంధి నవనినాథుఁడు
గనియెను సురకన్యవోని కన్నియ నంతన్.

(అప్పుడు దేవకన్యవంటి ఒక కన్యను చూశాడు.)

-:శంతనుఁడు సత్యవతిని భార్యగాఁగోరి ప్రతిహత మనోరథుఁ డగుట:-

1_4_170 వచనము పవన్ - వసంత

వచనము

తనపురంబునకు వచ్చి సకలరాజన్యప్రధానసమక్షంబున గాంగేయునకు యౌవరాజ్యాభిషేకంబు సేసి కొడుకుతోడి వినోదంబులం దగిలి నాలుగువత్సరంబు లనన్యవ్యాపారుం డై యుండి యొక్కనాఁడు యమునాతీరంబున వేఁటలాడుచుఁ గ్రుమ్మరువాఁ డపూర్వసురభిగంధం బాఘ్రాణించి దానివచ్చిన వల నారయుచు నరిగి యమునాతీరంబున.

(శంతనుడు తన రాజధానికి వచ్చి సకలరాజప్రధానుల ఎదుట గాంగేయుడికి యౌవరాజ్యపట్టాభిషేకం చేశాడు. తరువాత ఒకనాడు శంతనుడు యమునాతీరంలో వేటాడుతూ ఒక అపూర్వమైన సుగంధాన్ని గమనించి అది వస్తూన్న దిక్కువైపు వెళ్లాడు.)

1_4_169 సీసము + ఆటవెలది విజయ్ - విక్రమాదిత్య

సీసము

సాంగంబు లగుచుండ సకలవేదంబులు
        సదివె వసిష్ఠుతో సకలధర్మ
శాస్త్రాదిబహువిధశాస్త్రముల్ శుక్రబృ
        హస్పతుల్ నేర్చినయట్ల నేర్చెఁ
బరమాస్త్రవిద్య నప్పరశురాముం డెంత
        దక్షుఁ డంతియ కడుదక్షుఁ డయ్యె
నాత్మవిజ్ఞానంబునందు సనత్కుమా
        రాదుల యట్టిఁడ యనఘమూర్తి

ఆటవెలది

నొప్పు గొనుము వీని నుర్వీశ యని సుతు
నిచ్చి గంగ సనిన నెఱిఁగి తనయు
నెమ్మిఁ దోడుకొనుచు నిధి గన్న పేదయ
పోలె సంతసిల్లి భూవిభుండు.

(ఇతడు వసిష్ఠుడి వద్ద వేదాలు చదివాడు. శుక్రుడు, బృహస్పతి నేర్చినట్లు వివిధశాస్త్రాలు నేర్చాడు. విలువిద్యలో పరశురాముడంతటి సమర్థుడు. ఆత్మజ్ఞానంలో సనత్కుమారుడంతటివాడు. నీ కుమారుడైన ఇతడిని స్వీకరించు - అని శంతనుడికి ఆ బాలుడిని అప్పగించి వెళ్లిపోయింది.)

1_4_168 వచనము విజయ్ - విక్రమాదిత్య

వచనము

మఱియును.

(ఇంకా.)

1_4_167 తేటగీతి విజయ్ - విక్రమాదిత్య

తేటగీతి

దివ్యభూషణాలంకృతదేహుఁ డైన
కొడుకు వలపలిచేయూఁది కోమలాంగి
దివ్యనది ప్రీతితోఁ జనుదెంచి పతికిఁ
జూపి భూనాథ వీఁడు నీసూనుఁ డనియె.

(గంగాదేవి ఆ బాలుడిని శంతనుడికి చూపి - ప్రభూ! ఇతడు నీ కుమారుడు - అని చెప్పింది.)

1_4_166 వచనము విజయ్ - విక్రమాదిత్య

వచనము

కని పుట్టిననాఁడ చూచిన వాఁడు గావున నప్పు డెఱుంగ నేరక విస్మయాకులితచిత్తుం డయి యుండెఁ గుమారుండు నాతనిం జూచి తండ్రిగా నెఱుంగ నేరకయు నిసర్గస్నేహమోహితుం డై యుండె నంత.

(అతడు తన పుత్రుడని తెలియక శంతనుడు, శంతనుడు తన తండ్రి అని తెలియక ఆ బాలుడు ఒకరినొకరు చూసుకొన్నారు. అప్పుడు.)

1_4_165 తరలము విజయ్ - విక్రమాదిత్య

తరలము

కనియె ముందట నమ్మహీపతి గాంగసైకతభూములం
బనుగొనన్ ధను వభ్యసించుచు బాణసంహతి సేతుగా
ఘనముగా నమరాపగౌఘముఁ గట్టియున్నకుమారు న
త్యనఘు నాత్మసమాను నాత్మజు నాపగేయు మహాయశున్.

(దగ్గరలో గంగానది ఒడ్డున ఇసుక తిన్నెలపై ధనుర్విద్య అభ్యసిస్తూ తన బాణాలతో గంగాప్రవాహానికి అడ్డుకట్ట కడుతున్న ఒక బాలుడిని చూశాడు.)

1_4_164 వచనము విజయ్ - విక్రమాదిత్య

వచనము

ఇట్లు లోకం బెల్లఁ దనధర్మమార్గంబ పొగడుచుండ సుఖం బుండి యాతండొక్కనాఁడు మృగయావ్యాజంబున గంగాసమీపంబునం జనువాఁడు దన్నుం బాసి తనుత్వంబుఁ దాల్చినట్లు గడునల్పప్రవాహం బై యున్నదానిం గంగానదిం జూచి యిది యేమినిమిత్తంబో యనుచుం గొండొకనేల యరిగి.

(శంతనుడు ఒకరోజు వేటకు వెళ్లి గంగానది ఒకచోట చాలా సన్నగా ప్రవహించటం చూసి కారణమేమిటా అనుకుంటూ ముందుకు సాగాడు.)

1_4_163 మత్తేభము విజయ్ - విక్రమాదిత్య

మత్తేభము

తన కాజ్ఞావశవర్తులై మహి సమస్తక్షత్త్రవంశేశు లె
ల్లను భక్తిం బని సేయుచుండఁగ విశాలం బైన సత్కీర్తి ది
గ్వనితా మౌక్తిక దామలీల వెలుఁగన్ వారాశిపర్యంత భూ
జనరక్షాపరుఁ డయ్యు శంతనుఁడు రాజద్రాజధర్మస్థితిన్.

(తన కీర్తి, దిక్కులనే వనితలకు పెట్టిన ముత్యాలదండేమో అన్నట్లు పాలన సాగించాడు.)

1_4_162 వచనము విజయ్ - విక్రమాదిత్య

వచనము

నీవు ధర్మమూర్తివి మాచేసిన యజ్ఞానంబు సహించి మర్త్యంబునం బెద్దకాలం బుండకుండ మా కనుగ్రహింపవలయునని ప్రార్థించిన నమ్ముని ప్రసన్నుం డయి మీకోరినయట్ల యగు నష్టముం డయిన యీ ప్రభాసుండు పెద్దయు నపరాధంబుఁ జేసెం గావున వీఁడు మర్త్యలోకంబునం బెద్దకాలంబుండు ననపత్యుఁడు నగు ననియె నని గంగాదేవి తనస్వరూపంబుఁ జూపి వసూత్పత్తియు స్వర్గగమననిమిత్తంబును గాంగేయజన్మస్థితియునుం జెప్పి దేవవ్రతుం డయిన యిక్కుమారుండు పెరుఁగునంతకు నాయొద్దన యుండునని శంతను నొడంబఱచి కొడుకుం దోడ్కొని యరిగిన విస్మయం బంది శంతనుండు దానితోడి యిష్టోపభోగంబులం బెద్దకాలంబు సనిన నల్పకాలంబు కా వగచుచు హస్తిపురంబునకు వచ్చి.

(మహర్షీ! మేము చేసిన పనికి ఓర్చుకొని భూలోకంలో ఎక్కువకాలం ఉండకుండా అనుగ్రహించు - అని వేడుకోగా వసిష్ఠుడు - అలాగే. కానీ ఎనిమిదవవాడైన ప్రభాసుడు పెద్ద నేరం చేశాడు కాబట్టి వీడు భూలోకంలో ఎక్కువ కాలం జీవిస్తాడు. అతడికి సంతానం కూడా ఉండదు - అని అన్నాడని గంగాదేవి శంతనుడికి చెప్పి తన నిజస్వరూపం చూపి, భీష్ముడు పుట్టుక గురించి చెప్పి, ఎనిమిదవ పుత్రునికి దేవవ్రతుడని పేరుపెట్టింది. అతడు పెద్దవాడయ్యేంతవరకూ తన దగ్గరే ఉంటాడని చెప్పి, శంతనుడిని ఒప్పించి, కొడుకును తనతో తీసుకువెళ్లింది. శంతనుడు హస్తినాపురానికి తిరిగివచ్చి.)

-:గంగ దేవవ్రతునిం దెచ్చి శంతనున కిచ్చుట:-

1_4_161 ఆటవెలది విజయ్ - విక్రమాదిత్య

ఆటవెలది

మనుజయోనిఁ బుట్టుఁ డని వారి కప్పుడు
కోప మడర మునియు శాప మిచ్చె
భయము నొంది వివశు లయి వచ్చి వారును
వినయ మొనర నిట్టు లనిరి మునికి.

(వసువులను మానవులుగా జన్మించమని కోపంతో శపించాడు. వారు భయపడి వసిష్ఠుడితో ఇలా అన్నారు.)

1_4_160 వచనము విజయ్ - విక్రమాదిత్య

వచనము

మర్త్యలోకంబున నుశీనరపతికూఁతురు జితవతి యనుకోమలి నా ప్రియసఖి యే నెప్పుడు దానికిఁ బ్రియంబు గోరుచుండుదు నిమ్మొదవు నమ్ముదిత కిచ్చిపుత్త మనినఁ బ్రణయిని వచనంబుల కనుగుణంబుగాఁ బ్రభాసుండు నిజభ్రాతృచోదితుం డయి వసిష్ఠహోమధేనువుం బట్టికొని పోయిన నమ్మునియు దనహోమధేనువుం గానక వనం బెల్లఁ గలయరోసి తనయోగదృష్టిం జూచి వసువులు గొనిపోక యెఱింగి.

(భూలోకంలో ఉశీనరదేశాధిపతి కూతురు జితవతి నా ప్రాణస్నేహితురాలు. ఈ ఆవును ఆమెకు ఇచ్చి పంపుదామనగా ప్రభాసుడు తన సోదరులు ప్రేరేపించటంతో వసిష్ఠుడి హోమధేనువును పట్టుకొనివెళ్లాడు. వసిష్ఠుడు యోగదృష్టితో జరిగినది గ్రహించి.)

1_4_159 ఆటవెలది విజయ్ - విక్రమాదిత్య

ఆటవెలది

దీనిపాలు ద్రావి మానవుల్ పదియువే
లేండ్లు జరయు రుజయు నెఱుఁగ కమర
భావమున సుఖంబు జీవింతు రటె దీని
నేలఁ గనినవాఁడ యెందుఁ బెద్ద.

(ఈ నందిని పాలు తాగితే మనుషులు అమరత్వంతో బ్రతుకుతారట! దీనికి యజమాని అయినవాడే గొప్పవాడు.)

1_4_158 వచనము విజయ్ - విక్రమాదిత్య

వచనము

మఱియు దక్షప్రజాపతి పుత్త్రి యయిన సురభికిం గశ్యపునకుం బుట్టిన నందిని దనకు హోమధేను వయి కోరిన వస్తువులు గురియుచుండఁ దపంబు సేయుచున్న వసిష్ఠునాశ్రమంబునకు వసువులెనమండ్రును భార్యాసహితులై క్రీడార్థంబు వచ్చి వసిష్ఠు హోమధేనువుం జూచి దానిశీలంబునకు విస్మయంబందుచున్నచో నం దష్టమవసుభార్య పతి కి ట్లనియె.

(కాగా, దక్షప్రజాపతి కూతురైన సురభికీ, కశ్యపుడికీ పుట్టిన నందిని అనే కామధేనువు సహాయంతో నిశ్చింతగా తపస్సు చేస్తున్న వసిష్ఠుడి ఆశ్రమానికి ఒకసారి ఎనిమిదిమంది వసువులూ తమ భార్యలతో వచ్చి, వసిష్ఠుడి హోమధేనువును చూసి, ఆశ్చర్యపడుతూ ఉండగా ఎనిమిదవ వసువు భార్య తన భర్తతో ఇలా అన్నది.)

Wednesday, February 15, 2006

1_4_157 చంపకమాల విజయ్ - విక్రమాదిత్య

చంపకమాల

అతులతపంబులన్ వరుణుఁ డన్మునిచే బహుపుణ్యకర్మసు
స్థితిఁ బ్రభవింపఁగాఁ బడిన దివ్యమునీంద్రుఁ డశేషలోకపూ
జితుఁడు వసిష్ఠుఁ డాశ్రమముఁ జేసి తపం బొనరించె బ్రహ్మస
మ్మితుఁ డురురత్నరాజితసుమేరుమహీధరకందరంబునన్.

(వరుణుడు అనే మునికి పుట్టిన వసిష్ఠమహర్షి మేరుపర్వతపు గుహలో తపస్సు చేశాడు.)

1_4_156 వచనము విజయ్ - విక్రమాదిత్య

వచనము

మఱి వసువులు పుట్టుచు స్వర్గంబునకుం జనుటయు నీయష్టమవసువు మర్త్యంబునం బెద్దకాలం బునికియు నేమి కారణం బని యడిగిన వానికి గంగ యిట్లనియె.

(ఎనిమిదవ వసువు భూలోకంలో జీవించటానికీ మిగిలినవారు స్వర్గానికి వెళ్లటానికీ కారణమేమిటని అడగగా గంగ ఇలా అన్నది.)

Tuesday, February 14, 2006

1_4_155 కందము విజయ్ - విక్రమాదిత్య

కందము

వసువు లనువా రపేత
వ్యసనులు దేవతలు లోకవంద్యులు వారిన్
వసుమతి బుట్టఁగ శాపము
వసిష్ఠముని యేల యిచ్చె వారిజనేత్రా.

(వసువులు దోషరహితులు. భూలోకంలో పుట్టమని వసిష్ఠముని వారిని ఎందుకు శపించాడు.)

1_4_154 వచనము విజయ్ - విక్రమాదిత్య

వచనము

దాని నప్రియంబులు వలికి వారించిన నదియుం దొల్లి చేసిన సమయంబు దలంచి నీతోడిసంగతి నాకు నింతియ యేను బుణ్యజలప్రవాహపవిత్రద్రిభువనపావని యనం బరగిన గంగఁ జు మ్మీవసువులు వసిష్ఠుశాపంబున వసుమతిం బుట్టుచుండి యే మొండుచోట జన్మింపనోపము నీయంద వుట్టెదము మర్త్యంబునం బెద్దకాలం బుండకుండ మమ్ము ముక్తులం జేయుమని నన్నుం బ్రార్థించిన దేవహితార్థంబు మనుష్యస్త్రీరూపంబు దాల్చి నీ వలన వసువులం బుట్టించితి దీన నీకుం బుణ్యలోకంబు లక్షయంబు లగు మఱియు నియ్యష్టమపుత్త్రుండు వసువులం దొక్కొక్కళ్ల చతుర్ధాంశంబులు దాల్చి సకలధర్మమూర్తి యయి పుట్టినవాఁడు లోకహితార్థంబుగా మర్త్యంబునం బెద్దకాలం బుండు ననిన గంగకు శంతనుం డి ట్లనియె.

(ఇలా మాట్లాడి గంగను శంతనుడు అడ్డగించగా ఆమె అతడికి తమ నియమం గుర్తుచేసి, "నీతో పొత్తు ఇంతటితో సరి", అని ఎనిమిది వసువుల వృత్తాంతం చెప్పింది. శంతనుడు ఇలా అన్నాడు.)

1_4_153 కందము విజయ్ - విక్రమాదిత్య

కందము

పడయంగరానికొడుకులఁ
గడుఁ బలువురఁ బడసి పుత్త్రఘాతిని వై తీ
కొడుకు నుదయార్కతేజుని
విడువఁగ నే నోప ననుచు వేడుకతోడన్.

(చాలామంది పుత్రులను చంపావు. ఇతడిని వదలటం నావల్ల కాదు.)

-:గంగ శంతనునకు వసువులవృత్తాంతమును దెలుపుట:-

1_4_152 వచనము విజయ్ - విక్రమాదిత్య

వచనము

అక్కొడుకుం జూచి పుత్త్రమోహంబునఁ జంపనీనోపక శంతనుండు గంగ కిట్లనియె.

(ఆ కొడుకును చూసి, మమకారంతో, అతడిని చంపనీయలేక, శంతనుడు గంగతో ఇలా అన్నాడు.)

1_4_151 సీసము + ఆటవెలది విజయ్ - విక్రమాదిత్య

సీసము

వరుణుఁ డాదిగఁ గల వసువులు దోడ్తోడఁ
        బుట్టుచునున్న నప్పొలఁతి వారి
నల్లన పుట్టినయప్పుడ కొనిపోయి
        నిర్దయ యై గంగ నీరిలోన
వైచిన నెఱిఁగి యవ్వసుమతీనాథుండు
        తనయుల ని ట్లేల దయయు లేక
గంగలో వైచెదు కడునధర్మం బేల
        చేసెదు నానోడుఁ జెలువ దన్నుఁ

ఆటవెలది

బాసిపోవు ననియుఁ బలుకక యెప్పటి
యట్ల నుండు నంతఁ బుట్టెఁ
దనయుఁ డష్టముండు దల్లిదండ్రుల కతి
ప్రీతియును ముదంబుఁ బెరుఁగుచుండ.

(వరుణుడు మొదలైన వసువులు పుట్టగానే గంగ వారిని తీసుకువెళ్లి గంగానదినీటిలో పడవేసేది. ఎందుకలా చేస్తున్నావు అని అడగటానికి శంతనుడు వెనుకాడేవాడు. తనను వదిలి వెళ్లిపోతుందేమోనన్న భయంతో ఎప్పటిలాగానే ఉండేవాడు. అటువంటి సమయంలో వారికి ఎనిమిదవ కొడుకు పుట్టాడు.)

Monday, February 13, 2006

1_4_150 వచనము విజయ్ - విక్రమాదిత్య

వచనము

అది యెట్లంటేని యే నెద్ది సేసినను దానికి నొడంబడి వారింపకుండను నన్ను నప్రియంబులు పలుకక యుండను వలయు నట్లైన నీకు భార్య నై యభిమతసుఖంబు లొనరింతు నటు గాక నీవెప్పుడేని నన్ను నప్రియంబులు వలుకు దప్పుడు నిన్నుఁ బాసిపోదు ననిన శంతనుండు నొడంబడి దానిం బరిగ్రహించె గంగయు మనుష్యస్త్రీరూపధారిణి యై వాని కిష్టోపభోగంబులు సలుపుచుండె నంత.

(నేను ఏది చేసినా నువ్వు దానికి అంగీకరించి, అడ్డు చెప్పకుండా, నన్ను పరుషమైన మాటలతో నొప్పించకుండా ఉండాలి. నాకు నచ్చని మాటలు మాట్లాడితే నిన్ను విడిచిపోతాను - అనగా శంతనుడు అందుకు అంగీకరించి ఆమెను వివాహమాడాడు. తరువాత.)

1_4_149 కందము విజయ్ - విక్రమాదిత్య

కందము

భూనాథ నీకు భార్యం
గా నన్నుఁ బరిగ్రహింపఁ గడుకొని యిష్టం
బేని సమయంబు సేయుము
మానుగ నా కిష్టమయిన మార్గముఁ బ్రీతిన్.

("ఓ రాజా! నన్ను భార్యగా స్వీకరించాలంటే నాకు నచ్చేలా నువ్వు ఒక కట్టడి చేయాలి")

1_4_148 వచనము విజయ్ - విక్రమాదిత్య

వచనము

శంతనుండు దానిం జూచి నీ వెందులదాన విట్లేల యేకతంబ యున్నదానవని యడుగ నోడి మిన్నక యున్న నాతండు తనయందు దృఢానురాగుండగుట యెఱింగి యది యి ట్లనియె.

(శంతనుడు ఆమెను చూసి, "నీవెక్కడి దానవు? ఇలా ఒంటరిగా ఎందుకున్నావు?", అని అడగటానికి జంకగా ఆమె అతడి అనురాగం గ్రహించి ఇలా అన్నది.)

1_4_147 కందము విజయ్ - విక్రమాదిత్య

కందము

ఇరువురు నొండొరువులఁ గడు
సురుచిరముగఁ జూచువాఁడి చూడ్కులు దనకున్
శరములుగాఁ గొని యేసేను
మరుఁ డయ్యిరువుర మనోభిమానచ్యుతిగన్.

(మన్మథుడు వారిచూపులనే తన బాణాలుగా ఎన్నుకొని ఆ యిరువురిపై సంధించాడు.)

1_4_146 వచనము విజయ్ - విక్రమాదిత్య

వచనము

అదియు నమ్మహీపతి రూపయౌవనసౌందర్యవిలాసంబుల కోటువడి మహానురాగంబున వానిని చూచుచున్నంత.

(ఆమె కూడా అతడినే చూస్తూ ఉండగా.)

1_4_145 చంపకమాల విజయ్ - విక్రమాదిత్య

చంపకమాల

కని వనకన్యయో దనుజకన్యకయో భుజగేంద్రకన్యయో
యనిమిషకన్యయో యిది వియచ్చరకన్యకయో యపూర్వ మీ
వనమున కిట్టు లేకతమ వచ్చునె మానవకన్య యంచు న
య్యనఘుఁడు దానిఁ జిత్తమున నాదట వోవక చూచెఁ బ్రీతితోన్.

(శంతనుడు - ఈమె మానవకన్య అయితే అడవిలో ఇలా ఒంటరిగా వస్తుందా - అనుకుంటూ ఆమెను ఆసక్తితో చూశాడు.)

1_4_144 కందము విజయ్ - విక్రమాదిత్య

కందము

తరళాయతలోచన న
త్యురుకుచఁ దేజోభిరామ నుత్తమదివ్యాం
బరమాల్య మణిమయాలం
కరణోజ్జ్వలవేష నొక్కకన్యకఁ గనియెన్.

(ప్రకాశిస్తున్న రూపం గల ఒక కన్యను చూశాడు.)

1_4_143 వచనము విజయ్ - విక్రమాదిత్య

వచనము

మఱి యక్కోమలికులగోత్రనామంబు లడుగక దాని యిష్టంబు సలుపు మని కొడుకుం బంచి ప్రతీపుఁడు తపోవనంబునకుం జనియె నిట శంతనుండు రాజ్యంబు సేయుచు నొక్కనాఁడు మహాధనుర్ధరుం డై మృగయావినోదంబులఁ దగిలి యొక్కరుండును వనమ్ములోఁ గ్రుమ్మరువాఁ డనిలాలోలకల్లోలమాలాస్ఫాలనసముచ్చలజ్జలకణాసారశిశిరశిశిరం బగుచున్న గంగాపులినతలంబున.

(ఇలా శంతనుడికి చెప్పి ప్రతీపుడు తపోవనానికి వెళ్లాడు. శంతనుడు రాజ్యం చేస్తూ ఒకరోజు వేట కోసం అడవికి వెళ్లి గంగానదీతీరాన.)

-:గంగా శంతనుల సమయము:-

1_4_142 మధ్యాక్కర విజయ్ - విక్రమాదిత్య

మధ్యాక్కర

తనుమధ్య దా నొక్కకన్య సురనదీతటమున నన్నుఁ
గనిన నక్కన్యకఁ జూచి నీ విట్టికమనీయరూప
వొనర నాసుతునకు భార్య వగు మన్న నొడఁబడి యియ్య
కొనియెఁ గావున దానిఁ దగ వివాహ మగుము నెయ్యమునను.

(గంగాదేవితో జరిగిన వృత్తాంతం చెప్పి ఆమెను పెళ్లి చేసుకోమన్నాడు.)

1_4_141 వచనము విజయ్ - విక్రమాదిత్య

వచనము


ఇ ట్లుదయించి పెరిఁగి సంప్రాప్తయౌవనుం డైన కొడుకుం జూచి ప్రతీపుండు తనకు నక్షయపుణ్యలోకంబులు గలిగె నని సంతసించి సకలరాజ్యభారధౌరేయుఁగా నభిషిక్తుం జేసి కొడుకున కిట్లనియె.

(శంతనుడు పెరిగి యువకుడైన తర్వాత ప్రతీపుడు అతడికి రాజ్యభారం అప్పగించి.)

Sunday, February 12, 2006

1_4_140 ఆటవెలది విజయ్ - విక్రమాదిత్య

ఆటవెలది

అధికపుణ్యమూర్తు లైన యయ్యిరువుర
కమరనిభుఁడు కౌరవాన్వయంబు
వెలుఁగుచుండఁ బుట్టె వీరాగ్రగణ్యుండు
సంతతార్థదాయి శంతనుండు.

(వారికి కౌరవవంశంలో గొప్పవాడైన శంతనుడు జన్మించాడు.)

1_4_139 వచనము విజయ్ - విక్రమాదిత్య

వచనము

మఱి యదియునుం గాక స్త్రీభాగం బయిన డాపలికుఱు వెక్కక పురుషభాగంబై పుత్త్రారోహణయోగ్యం బైన నావలపలికుఱు వెక్కితి గావున నాపుత్త్రునకు భార్య వగు మనిన నదియు నట్ల చేయుదు నని యదృశ్య యయ్యె నంతం బ్రతీపుఁడును బుత్త్రార్థి యై సకలతీర్థంబులయందు సునందాదేవియుం దాను వేదవిహితవ్రతంబులు సలుపుచుఁ బెద్దకాలంబు దపంబు సేసిన.

(అంతేకాక స్త్రీలు కూర్చునే ఎడమవైపు కాక, పుత్రులు కూర్చునే కుడివైపు కూర్చున్నావు కాబట్టి నా కొడుకును వివాహమాడు - అనగా ఆమె అలాగే చేస్తానని మాయమైంది. ప్రతీపుడు తన భార్య అయిన సునందాదేవితో కూడి పుత్రుడికోసం చాలాకాలం తపస్సు చేయగా.)

1_4_138 చంపకమాల విజయ్ - విక్రమాదిత్య

చంపకమాల

అనినఁ బ్రతీపుఁ డి ట్లనియె నంబురుహానన యగ్నిసాక్షికం
బునఁ బరిణీత యైనసతిఁ బొల్పుగ నొక్కతఁ గాని యన్యలన్
మనముననేనియుం దలఁప మానిని యిట్టిజితాత్ము నన్ను ని
ట్లని పలుకంగ నీ కగునె యన్యుల బల్కినయట్ల బేల వై.

(అప్పుడు ప్రతీపుడు ఇలా అన్నాడు - నా భార్యను తప్ప ఇతర వనితలను మనసులో కూడా స్మరించను. నన్నిలా అడగటం నీకు న్యాయమా?)

1_4_137 ఆటవెలది విజయ్ - విక్రమాదిత్య

ఆటవెలది

ఏను జహ్నుకన్య నింద్రసమాన నీ
సద్గుణావళులకు సంతసిల్లి
భానుతేజ నీకు భార్యగా వచ్చితి
నిష్టమునఁ బరిగ్రహింపు నన్ను.

(నేను జహ్నుమహర్షి కూతురిని. నీకు భార్యనవుదామని వచ్చాను.)

1_4_136 వచనము విజయ్ - విక్రమాదిత్య

వచనము

ప్రతీపుండును దానిం జూచి యచ్చెరువంది నీ వెందులదాన వి ట్లేల నాకుఱువెక్కి తనిన నది యి ట్లనియె.

(ప్రతీపుడు ఆశ్చర్యపడి నువ్వెవరు అని ఆమెను అడిగాడు. గంగ ఇలా అన్నది.)

1_4_135 ఉత్పలమాల విజయ్ - విక్రమాదిత్య

ఉత్పలమాల

గంగ నిజాంగదీప్తు లెసఁగం జనుదెంచి లతాంగిసంగతో
త్తుంగపయోధరద్వితయ తోయరుహానన చారునేత్ర ది
వ్యాంగన యై ప్రతీపవసుధాధిపుశాలవిశాలదక్షిణో
త్సంగమునందు మన్మథవశంబున నుండెఁ గరంబు లీలతోన్.

(దివ్యవనితారూపం ధరించి వచ్చి విలాసంగా అతడి కుడితొడపైన కూర్చున్నది.)

1_4_134 వచనము విజయ్ - విక్రమాదిత్య

వచనము

ఇట్లు యమనియమవ్రతపరాయణుం డై యున్నవానికిం బ్రత్యక్షం బై యొక్కనాఁడు.

(ప్రతీపుడికి ఒకరోజు గంగ ప్రత్యక్షమై.)

1_4_133 కందము విజయ్ - విక్రమాదిత్య

కందము

వీరుఁడు ప్రతీపుఁ డఖిల
క్ష్మారాజ్యసుఖములఁ దనిసి మానుగ గంగా
తీరమునఁ దపము సేయుచు
భారతకులుఁ డుండె ధర్మపరుఁడై నిష్ఠన్.

(భరతకులంలో గొప్పవాడైన ప్రతీపుడు రాజ్యభోగాలన్నీ అనుభవించి గంగాతీరంలో తపస్సు చేస్తూ ఉండేవాడు.)

1_4_132 వచనము విజయ్ - విక్రమాదిత్య

వచనము

అని యిట్లు గంగావసువు లొండొరులు సమయంబు సేసికొని చని రంతనిక్కడ.

(అని వారు కట్టడి చేసుకొని వెళ్లారు.)

-:తన పుత్త్రునకు భార్యవగుమని ప్రతీపుఁడు గంగ కుపదేశించుట:-

1_4_131 కందము విజయ్ - విక్రమాదిత్య

కందము

మాయం దొక్కొక్కళ్లతు
రీయాంశముఁ దాల్చి శుభచరిత్రుం డై దీ
ర్ఘాయుష్యుం డష్టమవసు
వాయతభుజుఁ డుండు నీకు నాత్మోద్భవుఁ డై.

(మాలో ఒక్కొక్కరి నాల్గవ అంశం ధరించి, అష్టమవసువైన ప్రభాసుడు నీ కొడుకై భూలోకంలో ఉంటాడు - అని వారన్నారు.)

Wednesday, February 08, 2006

1_4_130 వచనము విజయ్ - విక్రమాదిత్య

వచనము

వసువులకు మనఃప్రియంబుగాఁ బలికిన విని వారును గంగయనుగ్రహంబు వడసి నీవు మాకు నుపకారంబు సేయనోపుదేని నేము నీకుఁ గ్రమక్రమంబునం బుట్టునప్పుడు మమ్ము నీళ్ల వైచుచు మర్త్యలోకంబున నుండకుండునట్లుగాఁ జేయునది మాకు వసిష్ఠమహాముని యనుజ్ఞయు నిట్టిద యనిన గంగయు నట్ల చేయుదు మఱి మీ రెల్ల స్వర్గతు లైన నాకొక్కకొడుకు దీర్ఘాయుష్మంతుం డై యుండెడువిధం బె ట్లనిన దానికి వసువు లి ట్లనిరి.

(వారు సంతోషించి, "మేము పుట్టగానే నీటిలో పడవేసి భూలోకంలో ఉండకుండా చేయండి. మాకు వశిష్ఠుడు ఇచ్చిన అనుమతి కూడా ఇదే", అని కోరారు. ఆమె ఇలా అన్నది, "అలాగే చేస్తాను. అయితే నాకు దీర్ఘాయువు కలిగిన ఒక్క కొడుకైనా కావాలి. అది ఎలా వీలవుతుంది?")

1_4_129 కందము విజయ్ - విక్రమాదిత్య

కందము

నాకభిమతంబు నిట్టిద
మీకును నుపకార మగు సమీహితబుద్ధిం
జేకొని చేసెద మీర ల
శోక స్థితి నుండుఁ డనుచు సురనది కరుణన్.

(అలాగే జరుగుతుంది అని గంగ అంగీకరించింది.)

1_4_128 వచనము విజయ్ - విక్రమాదిత్య

వచనము

ఏము వసిష్ఠమునివరుశాపంబునంజేసి మర్త్యలోకంబునం దెయ్యేనియు నొక్క పుణ్యవతి యైన స్త్రీయందు జన్మింపం బోయెద మని దుఃఖించి తమశాప ప్రకారంబు గంగాదేవికి నెఱింగించి యే మొండుచోట జన్మింపనోపము నీయంద పుట్టెదము మఱి మహాభిషుండు ప్రతీపునకు శంతనుం డై పుట్టెడుఁ గావున వానికి నీకును సమాగమం బగు మాజన్మంబునకు నిమిత్తం బాతండ యగు ననిన విని గంగ సంతసిల్లి యిట్లనియె.

(వారు వశిష్ఠుని శాపం గురించి గంగకు చెప్పి, "మేము నీకు పుత్రులమై జన్మిస్తాము. మహాభిషుడు ప్రతీపుడికి శంతనుడై జన్మిస్తాడు కాబట్టి మా జన్మకు అతడే కారకుడవుతాడు", అనగా ఆమె సంతోషించి.)