Monday, November 27, 2006

1_7_235 వచనము ప్రకాష్ - వసంత

వచనము

మీ రాజు మనోరథంబు సఫలం బయ్యె వగవ నేల యనిన ధర్మరాజుపలుకు విని పురోహితుండు వోయి ద్రుపదున కెఱింగించిన ద్రుపదుండు ధృష్టద్యుమ్నుం జూచి చాతుర్వర్ణ్యోచితంబు లయిన రథంబులు గొనిపోయి వారలం దోడ్కొని ర మ్మని పంచిన వాఁడును నాక్షణంబ పాండవుల పాలికి వచ్చి యీరథంబు లెక్కి మారాజునొద్దకు రం డనినఁ బాండవులు రాజయోగ్యంబు లయి రత్నాంచితంబు లయిన కాంచనరథంబు లెక్కి కుంతీదేవిని ద్రౌపదిని నొక్కరథం బెక్కించి తోడ్కొని ధృష్టద్యుమ్నుతో ద్రుపదరాజ నివేశంబున కరుగుదెంచునంత ద్రుపదుండును వారల కనేకవిధంబు లైన వస్తువు లతిప్రీతిం బుత్తెంచినఁ బరార్థ్యంబులైన యొండువస్తువులఁ బరిగ్రహింపక సాంగ్రామికంబు లైన యసిచర్మకార్ముకబాణతూణీరరథవరూథవాజివారణ నివహంబులఁ బరిగ్రహించి తనయొద్దకు వచ్చువారి.

(మీ రాజు కోరికక సఫలమైంది - అని చెప్పగా ఆ పురోహితుడు ఈ విషయాన్ని ద్రుపదుడికి తెలిపాడు. ద్రుపదుడు వారిని తీసుకురమ్మని ధృష్టద్యుమ్నుడిని పంపగా అతడు వారిని రథాలలో తోడ్కొని వచ్చాడు. ద్రుపదుడు వారికి రకరకాల వస్తువులు పంపగా వారు వాటిలో యుద్ధానికి సంబంధించినవి మాత్రమే స్వీకరించారు.)

No comments: