Sunday, November 19, 2006

1_7_223 సీసము + ఆటవెలది ప్రకాష్ - వసంత

సీసము

అ య్యిద్దఱును గృష్ణ న ట్లొప్పఁ దోడ్కొని
        చని యొక్క ముదుసలి సాని కపుడు
మ్రొక్కి యక్కన్యను మ్రొక్కించి మఱియొక్క
        గౌరవర్ణుఁడు పంపఁ గడఁకతోడ
నలువురు భూసురనాథగృహంబుల
        కరిగి భైక్షము దెచ్చి యంతగూడు
నొగిన యయ్యవ్వకు నొప్పించియున్న న
        య్యవ్వ యు ద్రౌపది నర్థిఁ బిలిచి

ఆటవెలది

బలివిధానములకు బ్రాహ్మణాతిథులకు
నన్నకాంక్షు లైన యధ్వగులకు
నగ్ర మిందుఁ బుచ్చి యయ్యగ్రశేషంబుఁ
జెలువ రెండు పాళ్ళు సేయు మొనర.

(ఆ ఇద్దరూ (భీమార్జునులు) ద్రౌపదిని తమవెంట తీసుకొని ఒక ముసలి అవ్వ దగ్గరకు వెళ్లారు. ఒక తెల్లనివాడు ఆజ్ఞాపించగా మిగిలిన నలుగురు వెళ్లి బ్రాహ్మణగృహాలనుండి భిక్ష తీసుకువచ్చి ఆ అవ్వకు అప్పగించారు. ఆమె ద్రౌపదితో - ఇందులో అగ్రభాగం అతిథులకు ఉంచి, మిగిలినది రెండుభాగాలు చెయ్యి - అని చెప్పింది.)

No comments: