Saturday, August 27, 2005

1_1_67 వచనము సందీప్ - విజయ్

వచనము

ఇట్టి మహాభారతంబు ననేకవిధ పదార్థ ప్రపంచ సంచితంబు నుపపర్వ మహా
పర్వోపశోభితంబు నుపద్వీపమహాద్వీప సంభృతం బయిన భువనం బజుండు
నిర్మించినట్లు కృష్ణద్వైపాయనుండు నిఖిలలోకహితార్థంబు దత్తావధానుండై
సంవత్సరత్రయంబు నిర్మించి దాని దేవలోకంబునందు వక్కాణింప నారదుం
బనిచెఁ బితృలోకంబున వక్కాణింప నసితుండైన దేవలుం బనిచె గరుడ
గంధర్వ యక్షరాక్షస లోకంబులందు వక్కాణింప శుకుం బనిచె నాగలోకంబు
నందు వక్కాణింప సుమంతుం బనిచె. మనుష్యలోకంబున జనమేజయునకు
వక్కాణింప వైశంపాయనునిం బనిచె నేనా వైశంపాయనమహామునివలన
విని వచ్చితిఁ దొల్లి కృతత్రేతావసాన సమయంబుల దేవాసుర రామరావణ
యుద్ధంబులునుం బోలె ద్వాపరాంతంబునం బాండవధార్తరాష్ట్రులకు మహా
ఘోరయుద్ధం బయ్యె నందు.

















(ఉపద్వీపమహాద్వీపాలు గల భువనాన్ని బ్రహ్మ నిర్మించినట్లు ఉపపర్వమహాపర్వాలు గల మహాభారతాన్ని వ్యాసుడు మూడు సంవత్సరాలలో నిర్మించి, దాన్ని, దేవలోకంలో చెప్పడానికి నారదుని, పితృలోకంలో చెప్పడానికి నల్లనివాడైన దేవలుని, గరుడగంధర్వయక్షరాక్షసలోకాల్లో చెప్పడానికి శుకుని, నాగలోకంలో చెప్పడానికి సుమంతుని, మనుష్యలోకంలో జనమేజయునికి చెప్పడానికి వైశంపాయనుని పంపాడు.

నేను ఆ వైశంపాయనుని వద్ద మహాభారతకథ విని వచ్చాను.

కృతయుగాంతంలో దేవదానవులకు, త్రేతాయుగాంతంలో రామరావణులకు యుద్ధాలు జరిగినట్లు ద్వాపరయుగాంతంలో పాండవులకూ కౌరవులకూ మహాయుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో.)

No comments: