Thursday, November 30, 2006

1_8_41 కందము కిరణ్ - వసంత

కందము

నీకఱపుల నిక్కురుకుల
మాకులతం బొందు టేమి యాశ్చర్యము సౌ
మ్యాకృతులు గానివారల
వాకులు శిక్షలు నుపద్రవంబుల కావే.

(నీ ఉపదేశాలవల్ల కురుకులం కలతపొందటం ఆశ్చర్యం కాదు. సౌమ్యంగా లేనివారి మాటలు కీడునే కలిగిస్తాయి కదా.)

1_8_40 కందము కిరణ్ - వసంత

కందము

ఉడుగక యే మహితముఁ బలి
కెడు వారము నీవు హితవు క్రియ గొనఁగా బ
ల్కెడు వాఁడవు మాకంటెను
గడు హితుఁడవు నీవ కావె కౌరవ్యులకున్.

(మేము చెడు చెప్పేవాళ్లమా? నీవు హితం చెప్పేవాడివా? కౌరవులకు మాకంటే నీవే హితుడవా?)

1_8_39 వచనము కిరణ్ - వసంత

వచనము

మంత్రులు దమ తమ బుద్ధి దోషంబుల నెట్లునుం బలుకుదురు వారల సాధుత్వంబును నసాధుత్వంబును నెఱుంగవలయు నెట్లనినఁ దొల్లి నితంతు వను మగధరాజు వికలేంద్రియవర్గుం డయి శ్వాసమాత్రంబ తక్కి రాజ్యతంత్రంబునం దసమర్థుం డై యున్న నాతనిమంత్రి యేకప్రధానుం డయి రాజ్యతంత్రం బెల్లఁ దనవశంబ యగుటం జేసి వాని నవమానించి తదీయరాజ్యవిభవం బెల్లఁ జేకొనియె వాఁడును విక్రమహీనుం డయి రాజ్యంబు గోల్పడియెం గావున మంత్రులు హితులపోలె నుండి యహితం బాచరింతురు మీయిద్దఱపలుకులు మాకుం జూడ నహితంబు లనిన నలిగి వానికి ద్రోణుం డి ట్లనియె.

(మంత్రులు మనస్సులో కల్మషం ఉంచుకొని ఏదో విధంగా మాట్లాడుతారు. మేలుకోరేవారిలా ఉండి కీడు చేస్తారు. మీ ఇద్దరి మాటలు మాకు కీడు చేసేటటువంటివి - అనగా ద్రోణుడు కోపంతో ఇలా అన్నాడు.)

1_8_38 తేటగీతి కిరణ్ - వసంత

తేటగీతి

ముదుసళులు దమ కిమ్ముగాఁ జదివికొండ్రు
గాక పతులకు హిత మగు కర్జ మేల
యొలసి చెప్పుదు రహితులఁ గలపి కొనుట
ధర్ము వని రిది నయ విరుద్ధంబు గాదె.

(ముసలివారు తమకు అనుకూలంగా చెపుతారు కానీ రాజులకు మేలు కలిగేలా చెప్పరు. శత్రువులైన పాండవులను చేర్చుకోవటం ధర్మం అన్నారు. ఇది న్యాయవిరుద్ధం కాదా?)

1_8_37 వచనము కిరణ్ - వసంత

వచనము

వారితో విగ్రహించుట కార్యంబు గాదు కావునఁ బాండవద్రుపదధృష్టద్యుమ్నకుంతీద్రౌపదులకుఁ బ్రియపూర్వకంబున నుచితభూషణాంబరావళులు వేఱు వేఱ యిచ్చిపుచ్చి పాండవుల నిందులకుఁ దోడ్కొనివచ్చువారుగా దుశ్శాసనవికర్ణప్రభృతులసమకట్టి పంపు మనిన ద్రోణుపలుకు లవకర్ణించి కర్ణుం డి ట్లనియె.

(వారితో యుద్ధం తగని పని. వారికి కానుకలు పంపి పిలుచుకొని రావటానికి దుశ్శాసనుడు, వికర్ణుడు మొదలైనవారిని పంపు - అనగా కర్ణుడు ద్రోణుడి మాటలు పెడచెవిని పెట్టి ఇలా అన్నాడు.)

1_8_36 చంపకమాల కిరణ్ - వసంత

చంపకమాల

తనరుచు దైవయుక్తి మెయి ధర్మువు సత్యముఁ దప్పకున్న య
య్యనఘుల పైతృకం బయిన యంశము మిన్నక వజ్రపాణి కై
ననుగొనఁబోలునయ్య కురునందన పాండుతనూజు లున్న వా
రని విని వారికిం దగు ప్రియం బొనరింపక యున్కి ధర్మువే.

(పాండవుల తండ్రి భాగాన్ని తీసుకోవటం ఇంద్రుడికి కూడా సాధ్యం కాదు. వారు జీవించే ఉన్నారని విని కూడా వాళ్లకు సంతోషం కలిగించపోవటం ధర్మమా?)

1_8_35 మత్తేభము కిరణ్ - వసంత

మత్తేభము

విలసద్ధర్మవిశుద్ధవృత్తులు వయోవృద్ధుల్ కుశాగ్రీయబు
ద్ధులు మధ్యస్థులు కార్యనిర్ణయసమర్థుల్ మానమాత్సర్యదూ
రులు నాఁ జాలినవారిపల్కులకు వైరుద్ధ్యంబు గావించు న
జ్ఞులు భూనాథున కాప్తులున్ సఖులు నై శోషింతు రత్యంతమున్.

(మంచివారి మాటలు కాదనే అవివేకులు రాజుకు స్నేహితులై అతడిని చెడగొడతారు.)

1_8_34 చంపకమాల కిరణ్ - వసంత

చంపకమాల

బహుగుణ ముత్తమోత్తమము పథ్యము ధర్మ్యము సాధుసమ్మతం
బహిత బలప్రమాధివిపులార్థయుతం బగుటన్ భవత్పితా
మహువచనంబుఁ జేకొనుము మానుగ వారలతోడ నీవు ని
గ్రహ మొనరింప నేమిటికిఁ గౌరవసౌబలకర్ణశిక్షలన్.

(నీ తాత భీష్ముడి మాట స్వీకరించు. కౌరవులు, శకుని, కర్ణుడు చెప్పే మాటలు విని పాండవులతో యుద్ధం చేయటం ఎందుకు?)

1_8_33 వచనము కిరణ్ - వసంత

వచనము

కీర్తియు నపకీర్తియు జనులకు స్వర్గ నరక నిమిత్తంబులు గావున నపకీర్తి పరిహరించి కీర్తింబ్రతిష్టించి పైతృకంబగు రాజ్యంబు పాండవుల కిచ్చి వారితోడ బద్ధప్రణయుండ వయి కీర్తి నిలుపు మనిన భీష్ముపలుకులకు సంతసిల్లి ద్రోణుండు దుర్యోధనున కి ట్లనియె.

(పాండవులతో స్నేహంగా ఉండి, కీర్తిని నిలుపు - అని భీష్ముడు అనగా ద్రోణుడు సంతోషించి, దుర్యోధనుడితో ఇలా అన్నాడు.)

1_8_32 కందము కిరణ్ - వసంత

కందము

ఇలఁ గీర్తి యెంత కాలము
గలిగి ప్రవర్తిల్లె నంతకాలంబును ని
త్యుల కారె కీర్తి గల పు
ణ్యులు కీర్తివిహీనుఁ డెందునుం బూజ్యుండే.

(కీర్తి ఉన్నంతకాలం పుణ్యాత్ములు జీవించి ఉంటారు. కీర్తిలేనివాడు ఎక్కడైనా పూజార్హుడవుతాడా?)

1_8_31 ఆటవెలది కిరణ్ - వసంత

ఆటవెలది

కీర్తి లేని వానికిని జీవనంబు ని
రర్థకంబ చూవె యవనిమీఁద
నిత్య మయిన ధనము నిర్మల కీర్తియ
యట్టి కీర్తి వడయు టశ్రమంబె.

(కీర్తిలేనివాడి బ్రతుకు వ్యర్థమే. భూమిమీద శాశ్వతధనమైన కీర్తిని పొందటం సులభమా?)

1_8_30 వచనము పవన్ - వసంత

వచనము

అ ప్పాండవులతోడి విగ్రహంబుసేఁత కెన్నండును నొడంబడనేరఁ బితృపైతామహం బయిన రాజ్యంబునకు నీయట్ల వారు నర్హులు గావున వారికి నర్ధరాజ్యం బిచ్చిన నీకును నీ బాంధవులకును లోకంబులకును బ్రియం బగు నట్లు గానినాఁ డపకీర్తి యగుఁ గీర్తి నిలుపుటయ కాదె రాజులకు జన్మఫలంబు.

(పాండవులతో యుద్ధానికి నేను సమ్మతించను. మీలాగా వారు కూడా సగం రాజ్యానికి అర్హులు. అలా ఇవ్వకపోతే అపకీర్తి కలుగుతుంది. రాజులకు కీర్తి నిలపటమే జన్మఫలం.)

-:భీష్మద్రోణులు దుర్యోధనునకు బుద్ధి సెప్పుట:-

1_8_29 మత్తకోకిల పవన్ - వసంత

మత్తకోకిల

ధీరు లౌ ధృతరాష్ట్రపాండు లతి ప్రశస్త గుణుల్ ప్రసి
ద్ధోరుకీర్తులు నాకు నిద్దఱు నొక్కరూప తలంపఁగా
వీరు వారను నట్టిబుద్ధివిభేద మెన్నడు లేదు గాం
ధారిపుత్త్రశతంబునందుఁ బృథాతనూజులయందునున్.

(ధృతరాష్ట్రపాండురాజులు ఇద్దరూ నాకొక్కటే. గాంధారి కొడుకులు, కుంతి కొడుకులు అనే భేదభావం నాకెన్నడూ లేదు.)

1_8_28 వచనము పవన్ - వసంత

వచనము

కావునఁ జతురంగ బల సాధనసన్నద్ధుల మయి యుద్ధంబునం బాంచాలు భంజించి పాండవుల నొండుగడ నుండనీక తోడ్కొనితెత్త మనినఁ గర్ణుపలుకు లాకర్ణించి ధృతరాష్ట్రుం డిది యకార్యం బగు నయినను మతిమంతులతో విచారించి చేయుద మని భీష్మద్రోణవిదురశల్యకృపాశ్వత్థామసోమదత్తాదులం బిలువంబంచి యంతయు నెఱింగించిన భీష్ముండు దుర్యోధనుం జూచి యి ట్లనియె.

(కాబట్టి ద్రుపదుడిని యుద్ధంలో ఓడించి, పాండవులను వెంటతీసుకువద్దాము - అని కర్ణుడు అనగా ధృతరాష్ట్రుడు - ఇది చేయదగని పని. అయినా బుద్ధిమంతులతో ఆలోచించి చేద్దాము - అని పెద్దలను పిలిపించి చెప్పాడు. అప్పుడు భీష్ముడు దుర్యోధనుడితో.)

1_8_27 చంపకమాల పవన్ - వసంత

చంపకమాల

ఘన మగు విక్రమంబునన కాదె జగత్త్రితయంబుఁ బాకశా
సనుఁడు జయించె భూతలము సర్వము మున్ భరతుండు విక్రమం
బునన జయించె విక్రమము భూరి యశఃప్రియు లైన రాజనం
దనులకు సర్వసాధనము ధర్మువు శత్రు నిబర్హణంబులన్.

(దేవేంద్రుడు ముల్లోకాలను, భరతుడు భూమండలాన్ని పరాక్రమం చేతనే జయించారు. గొప్పకీర్తిని కోరుకొనే వారికి పరాక్రమమే సర్వసాధనం, శత్రువధలలో ధర్మం.)

1_8_26 వచనము పవన్ - వసంత

వచనము

మఱి భీమసేనుండు దొల్లి మీ చేసిన యుపాంశువధల నేమి యయ్యె నింకను నట్ల కావున నీ యుపాయప్రయోగంబు లన్నియు నుడిగి యిప్పుడ పాండవులయందు విక్రమంబు ప్రయోగించుట కార్యంబు.

(అంతేకాక, ఇంతకు ముందు మీరు భీముడిపై చేసిన రహస్యహత్యాయత్నాల వల్ల ఏమి జరిగింది? ఇకముందు కూడా అంతే. అందువల్ల ఈ ఉపాయాలు మాని పాండవులమీద పరాక్రమం ప్రదర్శించటమే కర్తవ్యం.)

1_8_25 సీసము + ఆటవెలది పవన్ - వసంత

సీసము

ఆర్యవృత్తుండు రాజాన్వయసమ్మతుఁ
        డభిమతసంబంధుఁ డయినవాఁడు
గుణవంతు లగుచున్న కొడుకులు గలవాఁడు
        పాంచాలుఁ డేల యప్పాండుసుతుల
వినయసంపన్నుల విడుచువాఁ డగు మఱి
        పాండునందను లేక పత్నియంద
కరమనురక్తులు గావునఁ దమలోన
        నేల భేదిల్లుదు రెన్నఁ డయ్యు

ఆటవెలది

నొక్కసతికిఁ బతులు పెక్కండ్రు రగు టిది
సతులకోర్కిగాన యతివ కృష్ణ
సుందరాంగి వారియం దేల యపరక్త
యగు మనోముదంబుఁ దగులుఁ గాక.

(ద్రుపదుడు పాండవులను ఎందుకు విడుస్తాడు? పాండవుల మధ్య వైరం ఎందుకు ఏర్పడుతుంది? ఎప్పుడైనా స్త్రీలు పలువురు భర్తలను కోరుకొంటారు. ద్రౌపది పాండవులను ఎందుకు తిరస్కరిస్తుంది?)

1_8_24 వచనము పవన్ - వసంత

వచనము

ఈ యుపాయంబులలో నెయ్యది యుచితంబును నపగత దోషంబును నదీర్ఘ సూత్రంబును నగు నట్టి దానిం జెచ్చెర ననుష్ఠించు నది యనినఁ గర్ణుం డి ట్లనియె.

(వీటిలో తగిన ఉపాయాన్ని ఆచరించవలసింది - అనగా కర్ణుడు ఇలా అన్నాడు.)

1_8_23 ఆటవెలది పవన్ - వసంత

ఆటవెలది

గాడ్పుచూలి పిఱుఁదుఁ గావంగ నర్జును
నోర్వ నమరు లైన నోప రాజి
నతఁడు నిహతుఁ డగుడు నశ్రమంబున
బార్థు నొక్కరుండ కర్ణుఁ డోర్వ నోపు.

(భీముడు సహాయంగా వెనుక నిలిస్తే అర్జునుడిని జయించటం దేవతలకు కూడా సాధ్యం కాదు. భీముడిని చంపితే అర్జునుడిని కర్ణుడు సులభంగా జయించగలడు.)

1_8_22 వచనము పవన్ - వసంత

వచనము

అది యెట్లనినం బుత్త్ర మిత్త్ర బాంధవ బలసంపన్నుం డైన ద్రుపదునొద్దఁ బాండవు లుండువా రైన వారలం గృష్ణబలదేవులు యదువృష్ణి భోజాంధకవర్గములతో వచ్చి కూడిన నెవ్వరు సాధింపనోపరు గావున నెడసేయక ద్రుపదుండు పాండవుల విడుచునట్లుగా భేదింత మొండె వలనుగలవారలం బంచి కౌంతేయమాద్రేయులను దమలో విరక్తు లగునట్లుగాఁ జేయింత మొండె నతిలలితపప్రమదాజనంబులఁ బ్రత్యేకంబ యేవురకుం బ్రయోగించి ద్రౌపదివలన విరక్తిఁ బుట్టింత మొండె నేవురకు నొక్కతియ యా లగుట కష్టం బని ద్రోవదిఁ బాండవులవలన విగతస్నేహఁ గావింత మొండె నుపాంశుప్రయోగంబుల భీము వధియించి తక్కినవారల బలహీనులం జేయుదము.

(ద్రుపదుడి దగ్గర పాండవులు ఉండి వారితో శ్రీకృష్ణబలరాములు చేరితే వాళ్లను జయించటం సాధ్యం కాదు. అందువల్ల వారిలో చీలిక కలిగిద్దాము. కుంతి కొడుకులకు, మాద్రి కొడుకులకు మధ్య విరక్తి కలిగేలా చేద్దాము, లేకపోతే ఐదుగురు స్త్రీలను పంపి వారికి ద్రౌపది పట్ల ఏవగింపు పుట్టిద్దాము, లేకపోతే ఐదుగురికి భార్య కావటం కష్టం అని ద్రౌపదికి వారిమీద ప్రేమపోయేలా చేద్దాము, లేకపోతే చాటుగా భీముడిని చంపి మిగిలినవారిని బలహీనం చేద్దాము.)

1_8_21 సీసము + ఆటవెలది పవన్ - వసంత

సీసము

పలుకులఁ జెయ్వులఁ బాండవులకుఁ బ్రీతి
        గలయట్ల యుండుదుఁగాని నాదు
హృదయంబు విదురున కెన్నండు నెఱిఁగింప
        నేను మీతలఁచిన యివ్విధంబ
తలఁచుచు నుండుదు దైవసంపద గల
        వారలఁ బాండవవరుల నేమి
సేయఁగ నగు నెద్దిచెప్పుం డిష్టం బింక
        ననిన విచిత్రవీర్యాత్మజునకు

ఆటవెలది

దుష్టచేష్టితుండు దుర్యోధనుం డిట్టు
లనియెఁ జిత్తగింపు మవనినాథ
పాండురాజసుతులఁ బాంచాలపతియెద్ద
నుండకుండఁ జేయు టుచిత మిపుడు.

(పాండవుల మీద ప్రీతి ఉన్నట్లు ఉంటాను కానీ విదురుడికి నా మనస్సు ఎప్పుడూ తెలియనీయలేదు. మీ అభిప్రాయమే నా అభిప్రాయం. దైవసంపద ఉన్న పాండవులను ఏమి చేయగలము? మీకు ఏది ఇష్టమో చెప్పండి - అనగా దుర్యోధనుడు ఇలా అన్నాడు - పాండవులను ద్రుపదుడి దగ్గర ఉండకుండా చేయటం ఇప్పుడు ఉచితం.)

1_8_20 వచనము పవన్ - వసంత

వచనము

అనిన వారలకు ధృతరాష్ట్రుం డి ట్లనియె.

(వారితో ధృతరాష్ట్రుడు ఇలా అన్నాడు.)

1_8_19 కందము పవన్ - వసంత

కందము

విదురుఁడు పాండవ హితుఁ డని
మొదలన యెఱిఁగియును నతి విమోహంబున న
వ్విదురు వచనంబ నిలుపుదు
హృదయంబున నతఁడు పెద్దయిష్టుఁడు మీకున్.

(విదురుడు పాండవుల మేలు కోరేవాడని తెలిసినా అతడి మాటే మనస్సులో నిలుపుకొంటావు. అతడు మీకు బాగా ఇష్టమైనవాడు.)

1_8_18 కందము పవన్ - వసంత

కందము

రేయును బగలును విదురుఁడు
నీయొద్దన యునికిఁజేసి నేరము పలుకన్
మాయిష్టం బెఱిఁగింపఁగ
ధీయుత యెడఁ గంటి మిన్ని దివసంబులకున్.

(రాత్రీపగలూ విదురుడు నీ దగ్గరే ఉండటం వల్ల మా మనస్సులోని మాట చెప్పలేకపోయాము. ఇన్ని రోజులకు అవకాశం ఏర్పడింది.)

1_8_17 వచనము పవన్ - వసంత

వచనము

అని విదురునకు మనఃప్రియంబుగాఁ బలికి యంతఃపురంబునకుం జని యంతస్తాపం బేర్పడకుండ నుండునంతఁ గర్ణ దుర్యోధనులు ధృతరాష్ట్రు పాలికిం జని యి ట్లనిరి.

(అని తన దుఃఖం బయటపడకుండా ఉండగా కర్ణదుర్యోధనులు ధృతరాష్ట్రుడి దగ్గరకు వెళ్లి ఇలా అన్నారు.)

1_8_16 కందము పవన్ - వసంత

కందము

కొడుకుల యభ్యుదయము విని
కడు సంతస మయ్యె నిపుడు కౌరవకుల మే
ర్పడ వెలిఁగె నెల్లరాజుల
నొడిచిన భుజవీర్యమున మహోత్సాహమునన్.

(పాండవుల గురించి విని సంతోషం కలిగింది. కౌరవవంశం ప్రకాశించింది.)

1_8_15 ఆటవెలది పవన్ - వసంత

ఆటవెలది

యజ్ఞసేనుకూఁతు నభిజాత నాతని
యజ్ఞవేది నుదిత యయినదాని
ననఘ విధి వివాహ మయి పాండునందనుల్
మిగుల మిత్ర బల సమృద్ధు లయిరి.

(ద్రౌపదిని వివాహమాడటం వల్ల పాండవులు మిత్రబలం పొందారు.)

1_8_14 వచనము పవన్ - వసంత

వచనము

అని దుర్యోధనుండు పాండవ పాంచాల విభేదనోపాయంబుఁ జింతించుచుండె నంత విదురుండు పాండవాభ్యుదయంబును బాంచాలీస్వయంవరంబును దుర్యోధనాదులు భగ్నదర్పులగుటయు విని సంతసిల్లి పాండవులు ద్రుపదరాజపుత్త్రిం బెండ్లి యై ద్రుపదుపురంబున సుఖంబున్న వారని ధృతరాష్ట్రునకుం జెప్పిన నతం డి ట్లనియె.

(ఇలా పాండవులను ద్రుపదుడి నుండి వేరు చేసే ఉపాయాన్ని ఆలోచిస్తూ ఉన్నాడు. అంతలో విదురుడు పాండవుల విషయం విని సంతోషించి, ధృతరాష్ట్రుడికి చెప్పగా అతడు ఇలా అన్నాడు.)

1_8_13 ఉత్పలమాల పవన్ - వసంత

ఉత్పలమాల

యాదవవృష్ణిభోజవరులందఱుఁ బాండవపక్షపాతు ల
చ్చేదివిభుండు వారలన చేకొనువాఁడగు వీరలెల్ల నా
త్మోదయవృద్ధి పొంటెను దదున్నతిఁ గోరుదు రట్లు గావునన్
భేదము సేయఁగావలయుఁ బెల్చన యందఱుఁ గూడకుండఁగన్.

(యాదవ వృష్ణి భోజులు, చేదిరాజైన శిశుపాలుడు వాళ్ల పక్షం వహించేవారే. వీళ్లంతా ఒకటి కాకుండా భేదం కల్పించాలి.)

1_8_12 వచనము పవన్ - వసంత

వచనము

అక్కట పురోచనుం డొక్కరుండ లక్కయింట దగ్ధుం డయ్యెం గా కేమి దైవానుకూల్యంబు లేక మానుషం బెంతయయ్యు నేమి సేయుఁ బాండవు లేమి దైవసంపన్నులైరో యని వగచి యీ యవసరంబున ద్రుపదు భేదించి పాండవుల నుత్సాదింప వలయు నె ట్లనిన.

(దుర్యోధనుడు చింతించి - ఈ సమయంలో ద్రుపదుడిని వేరుచేసి, పాండవులను పెకలించాలి, ఎలాగంటే.)

1_8_11 చంపకమాల పవన్ - వసంత

చంపకమాల

అనిమొన నట్లు దాఁకిన మహారథులన్ ధృతరాష్ట్రరాజనం
దనుల బలాఢ్యులన్ దళితదర్పులఁ జేసినవారు ధర్మనం
దనయము లుగ్రవీరు లని తద్విధమంతయు నేర్పడంగఁ జె
ప్పిన విని కౌరవప్రభుఁడుఁ బెల్కుఱి తద్దయు దుఃఖితాత్ముఁ డై.

(యుద్ధప్రారంభంలో ఎదుర్కొన్నవాళ్లు ధర్మజనకులసహదేవుని చెప్పగా విని దుర్యోధనుడు వెలవెలబోయాడు.)

1_8_10 సీసము + ఆటవెలది పవన్ - వసంత

సీసము

కర్ణశల్యులు మొదల్ గాఁ గల భూపతు
        లత్యంత బలవంతు లస్త్రవేదు
లుద్ధతుల్ మోపెట్టనోపని చాప మ
        శ్రమమున మోపెట్టి చదలఁ దిరుగు
నయ్యంత్ర మేసి మీయందఱముందరఁ
        గృష్ణఁ దోడ్కొని యొక్క కృష్ణ వర్ణుఁ
డెక్కటి రణములో నేపునఁ గానీను
        నోడించి జయలీల నున్న యాతఁ

ఆటవెలది

డర్జునుండు మఱిమహాబాహుబలమున
శల్యుఁ ద్రెళ్ల వైచి శత్రువరుల
నెల్లఁ దల్లడిల్ల నెగచిన యాతండు
భీమసేనుఁ డమితభీమబలుఁడు.

(మత్స్యయంత్రాన్ని కొట్టి కర్ణుడిని ఓడించిన నల్లటివాడు అర్జునుడు, శల్యుడిని ఓడించినవాడు భీముడు.)

1_8_9 వచనము పవన్ - వసంత

వచనము

ఇట్లు పాండవులు ద్రుపదుపురంబున నఖిలరాజ్యవిభవసమన్వితు లయి యొక్క సంవత్సరం బుండునంత నంతయు నెఱింగి దుర్యోధనగూఢచారు లరిగి కర్ణదుశ్శాసనసౌబలసోమదత్తపరివృతుం డయి యున్న దుర్యోధనునకు మ్రొక్కి యి ట్లనిరి.

(ఇలా పాండవులు ద్రుపదుడి నగరంలో ఒక సంవత్సరం ఉండగా, ఈ విషయాన్ని దుర్యోధనుడి వేగులవాళ్లు తెలుసుకొని హస్తినాపురానికి వెళ్లి దుర్యోధనుడితో ఇలా అన్నారు.)

1_8_8 చంపకమాల పవన్ - వసంత

చంపకమాల

విలసిత రాజ్యలీలఁ బరవీర భయంకరు లై గుణంబులన్
వెలయుచుఁ బాండవుల్ విదితవిక్రము లుండుటఁ జేసి దేవతా
దులవలనన్ భయంబు ద్రుపదుం డెఱుఁగండ తదీయదేశముల్
దలరక యొప్పె రోగ భయ తస్కర డామర వర్జితంబు లై.

(పాండవులు ఉండటం వల్ల ద్రుపదుడికి దేవతలవల్ల కూడా భయం లేకుండా ఉంది. అతని దేశాలు బాధలు లేకుండా సుఖంగా ఉన్నాయి.)

1_8_7 వచనము పవన్ - వసంత

వచనము

అట వాసుదేవుండు ద్రౌపదిని బాండవులేవురు వివాహం బగుట విని సంతసిల్లి వారేవురకు వజ్ర వైడూర్య మరకత మౌక్తిక విభూషణంబులును నానాదేశవిచిత్రవస్త్రంబులును ననేకకరితురగరథరత్న శిబికావిలాసినీనివహంబులుం బుత్తెంచిన.

(ఈ వివాహం గురించి శ్రీకృష్ణుడు విని, వారికి చాలా కానుకలు పంపించాడు.)

1_8_6 కందము పవన్ - వసంత

కందము

ఇందీవరలోచన నీ
యం దే నభినందితాత్మ నైనట్టులు నీ
నందనులయందుఁ బౌత్రుల
యందును నభినంద్య వగుమ యని దీవించెన్.

(నేను నిన్ను పొంది సంతోషించినట్లే నీవు కూడా కొడుకులను, మనుమలను పొంది సంతోషించు - అని దీవించింది.)

Wednesday, November 29, 2006

1_8_5 ఉత్పలమాల పవన్ - వసంత

ఉత్పలమాల

పూని పరాక్రమం బెసఁగ భూతలనాథుల నోర్చి వీరు లై
యీ నవ ఖండ మండితమహీతల మేలుచు నీపతుల్ పయో
జానన రాజసూయమఖ మాదిగ నధ్వరపంక్తి సేయుచో
మానుగఁ బత్ని వీ వగుము మానితధర్మవిధానయుక్తితోన్.

(నీ భర్తలు రాజసూయయాగం చేసేటప్పుడు వారి ధర్మపత్నిగా ఉండు.)

1_8_4 సీసము + ఆటవెలది పవన్ - వసంత

సీసము

కోడలి యుత్తమ గుణముల కెంతయు
        సంతుష్టచిత్త యై కుంతిదేవి
లలితాంగి హరియందు లక్ష్మిని మఱి చంద్రు
        నందు రోహిణి నింద్రునందు శచిని
నవ్వసిష్ఠమునీంద్రునం దరుంధతిఁ బోలి
        సుందరి నీపతులందుఁ బ్రీతిఁ
బతిభక్తి యొప్ప నపత్యంబుఁ బడయుము
        గురు వృద్ధబాంధవాతుర విశిష్ట

ఆటవెలది

జనుల నతిథిజనుల సతతంబుఁ బూజింపు
మన్నదానమున ధరామరేంద్ర
వరులఁ దనుపు మఖిలవసుమతీప్రజ కెల్లఁ
గరుణ గలుగుమమ్మ కమలనేత్ర.

(కుంతీదేవి సంతోషించి ద్రౌపదికి హితవు చెప్పి సంతానాన్ని పొందమని దీవించింది.)

1_8_3 కందము పవన్ - వసంత

కందము

చతురుదధివలయ నిఖిల
క్షితి తలసామ్రాజ్యలక్ష్మికిని మూలం బై
సతి యాజ్ఞసేని పతులకు
నతిముద మొనరించెఁ దుల్యమగు శుశ్రూషన్.

(ద్రౌపది వారందరికీ సమానంగా సేవచేసి వారిని సంతోషపెట్టింది.)

1_8_2 వచనము పవన్ - వసంత

వచనము

అ క్కథకుండు శౌనకాది మహామునులకుం జెప్పె నట్లు పాండవు లేవురకుం బాంచాలిం బరమోత్సవంబున వివాహంబు సేయించి ద్రుపదుం డయ్యేవురకు వేఱువేఱ యనర్ఘ్య మణి ఖచితంబు లైన యాభరణంబులను నపరిమితంబు లైన యర్థ రాసులను సౌవర్ణంబు లయిన శయ్యాసన పరికరంబులను నూఱేసి భద్రగజంబులను నూఱేసి కాంచనరథంబులను వేయేసికాంభోజహయంబులను పదివేవురేసి వరవస్త్రాభరణభూషితు లగు దాసదాసీజనంబులను నూఱేసివేలు పాఁడిమొదవులను నగ్నిసాక్షికంబుగా నరణం బిచ్చిన.

(ఉగ్రశ్రవసుడు శౌనకాది మునులకు ఇలా చెప్పాడు - అలా ద్రౌపదికి పాండవులతో వివాహం చేసి వారికి ఎన్నో కానుకలు అరణంగా ఇచ్చాడు.)

1_8_1 కందము పవన్ - వసంత

కందము


శ్రీవిభవనిత్యనిలయ ద
యా వర్ధిత ధారుణీ సురాన్వయ వేంగీ
భూవల్లభ నిఖిల జగ
త్పావన శుభచరిత భావ భవ నిభ సుభగా.

(రాజరాజనరేంద్రా!)

ఆదిపర్వము - అష్టమాశ్వాసము

1_7_291 గద్యము విజయ్ - విక్రమాదిత్య

గద్యము

ఇది సకలసుకవిజనవినుత నన్నయభట్ట ప్రణీతం బైన శ్రీమహాభారతంబునం దాదిపర్వంబున ధృష్టద్యుమ్న ద్రౌపదీ సంభవ కథనంబును గృష్ణద్వైపాయన సందర్శనంబును గంగాతీరంబున నంగారపర్ణు నర్జునుండు జయించుటయుఁ దాపత్య వసిష్ఠౌర్వోపాఖ్యానంబును ద్రౌపదీస్వయంవరంబును బంచేంద్రోపాఖ్యానంబును ద్రౌపదీ వివాహంబును నన్నది సప్తమాశ్వాసము.

(ఇది నన్నయభట్టు రచించిన మహాభారతంలోని ఆదిపర్వంలో - ధృష్టద్యుమ్న ద్రౌపదుల జననవృత్తాంతం, వ్యాసుడిని దర్శించటం, గంగాతీరంలో అర్జునుడు అంగారపర్ణుడిని జయించటం, తపతీ సంవరణ వసిష్ఠ ఔర్వుల కథ, ద్రౌపదీ స్వయంవరం, పంచేంద్రోపాఖ్యానం, ద్రౌపదీ వివాహం - అనే అంశాలు కల ఏడవ ఆశ్వాసం.)

1_7_290 స్వాగతము విజయ్ - విక్రమాదిత్య

స్వాగతము

రాజరాజ గుణరాజిత రాజ
త్తేజ రాజకులదీప విశిష్టాం
భోజమిత్ర నృపపూజిత పాదాం
భోజ భూవినుత పుణ్యవరేణ్యా.

(రాజరాజనరేంద్రా!)

1_7_289 కందము విజయ్ - విక్రమాదిత్య

కందము

విద్యావిలాస పార్థివ
విద్యాధర నిఖిలరాజవిద్యానిధి శీ
తద్యుతి విశదయశః ప్రస
రద్యోతిత సర్వలోక రాజమహేంద్రా.

(రాజరాజనరేంద్రా!)

-:ఆశ్వాసాంతము:-

1_7_288 వచనము విజయ్ - విక్రమాదిత్య

వచనము

అని వైశంపాయనుండు జనమేజయునకుం జెప్పెనని.

(అని వైశంపాయనుడు జనమేజయుడికి చెప్పాడని.)

1_7_287 తేటగీతి విజయ్ - విక్రమాదిత్య

తేటగీతి

జనుల ఆశీరవంబును జదలఁ దివురు
దేవ దుందుభినాదంబు దివ్యగంధ
మందగంధవహామోదమానకుసుమ
వృష్టియును మహాముదముతో విస్తరిల్లె.

(ప్రజల ఆశీర్వాదాలు వినపడుతుండగా, మెల్లని గాలితో, పూలవాన కురిసింది.)

1_7_286 వచనము విజయ్ - విక్రమాదిత్య

వచనము

ఇట్లు వేల్చి ముందఱ ధర్మపుత్రునకు ద్రుపదరాజుపుత్త్రిం బాణిగ్రహణంబు సేయించి తొల్లి యేవురకు వివాహంబు సేయునప్పుడు కన్యాత్వంబు దూషితంబు గాకుండ నీశ్వరువరంబునం గౌమారంబు వడసిన యక్కన్యకం గ్రమంబున భీమార్జున నకుల సహదేవులకుం బాణిగ్రహణంబు సేయించిన.

(అలా ఆహుతి చేసి పాండవులకు ద్రౌపదినిచ్చి వివాహం చేయించాడు.)

1_7_285 కందము విజయ్ - విక్రమాదిత్య

కందము

వితత ప్రదక్షిణా వ
ర్తిత దీప్త శిఖానలమున ధృతి వేల్చెఁ బురో
హితుఁ డగు ధౌమ్యుఁడు బుధ స
మ్మతుఁడు వివాహ ప్రయుక్త మంత్రాహుతులన్.

(ధౌమ్యుడు వివాహసమయంలో చేయవలసిన ఆహుతులను అగ్నిహోత్రంలో దహనమయ్యేట్లు వేశాడు.)

1_7_284 సీసము + ఆటవెలది విజయ్ - విక్రమాదిత్య

సీసము

అనఘులు కృతమంగళాభిషేకులు ధృత
        సముచిత వేష ప్రశస్త రత్న
భూషణుల్ కౌరవపుంగవు లేవురు
        నేతెంచి రంతఁ బూర్ణేందువదన
యధికవిదగ్ధ పుణ్యాంగనా విరచిత
        లలిత ప్రసాధనాలంకృతాంగి
కమలాక్షి కమనీయకాంతాసహస్రంబు
        తోఁ జనుదెంచె నాద్రుపదతనయ

ఆటవెలది

భూరి భూసురేంద్ర పుణ్యాహరవమును
మంగళ ప్రగీత మధుర రవము
వివిధ తూర్యవేణు వీణారవంబును
విస్తరిల్లె దిశల విభవయుక్తి.

(పాండవులు, ద్రౌపది అక్కడికి వచ్చారు.)

1_7_283 వచనము విజయ్ - విక్రమాదిత్య

వచనము

అని నిశ్చయించి పంచినం బాంచాలపతియును గరం బనురాగంబునఁ బురం బష్టశోభనంబు సేయించి సమారబ్ధవివాహమహోత్సవుం డయ్యె నంత నిరంతర క్రముకకదళీస్తంభ శుంభత్సంభృత నవామ్రాశ్వత్థ పల్లవ మాలాలంకృత ద్వారతోరణంబులను జందనోదక సంసిక్త ప్రాంగణ రంగవల్లీ కృత కర్పూరమౌక్తికప్రకరంబులను గౌతుకోత్సవమంగళశృంగార వారాంగనా ప్రవర్త్యమాన స్వనియోగకృత్యంబులును నుత్సవ సందర్శనాగతానేకరాజన్య సుహృద్బాంధవబ్రాహ్మణ సంకులంబుననుం జేసి యొప్పుచున్న ద్రుపదరాజమందిరంబునం బూర్వోత్తర దిగ్భాగంబున విచిత్రనేత్ర వితత వితాన ముక్త మౌక్తిక కుసుమ మాలాలంబనాభిరామంబును సమీచీన చీనాంశుక విరచితస్తంభ వేష్టనంబును బ్రత్యగ్ర పల్లవ శాల్యక్షతాంచిత కాంచనపూర్ణ కలశోపశోభితంబును లాజాజ్య సంపూర్ణ సౌవర్ణ పాత్ర నవసౌరభ బహువిధ పుష్ప సమిత్కుశాశ్మశమ్యాభిరమ్యంబును నవగోమయ శ్యామ మరకత మణి ప్రభాపటల విలిప్త హిరణ్మయ వేదీమధ్య సమిద్ధాగ్ని కుండమండితంబును సర్వాలంకార సుందరంబు నయిన వివాహమంటపంబునకుం జని నిజపురోహితుం డయిన ధౌమ్యుం డాదిగా ననేకవిద్వన్మహీసుర నివహంబుతోఁ గరం బొప్పి.

(అని వ్యాసుడు ఆజ్ఞాపించగా ద్రుపదుడు వివాహమహోత్సవాన్ని ప్రారంభించాడు. ద్రుపదుడు వివాహమంటపానికి వెళ్లగా తన పురోహితుడైన ధౌమ్యుడితో.)

1_7_282 ఆటవెలది విజయ్ - విక్రమాదిత్య

ఆటవెలది

నేఁడు పుణ్యదినము నెమ్మితో రోహిణీ
యుక్తుఁ డయి శశాంకుఁ డున్నవాఁడు
మంత్రవంతముగఁ గ్రమంబున నేవురుఁ
బెండ్లియగుఁడు కృష్ణఁ బ్రీతితోడ.

(ఈ రోజు పుణ్యదినం. చంద్రుడు రోహిణీనక్షత్రాన్ని కూడి ఉన్నాడు. మీరు ఐదుగురూ ద్రౌపదిని వివాహమాడండి.)

-:ద్రౌపదీ వివాహ మహోత్సవము:-

1_7_281 వచనము విజయ్ - విక్రమాదిత్య

వచనము

తొల్లింటి మహాత్ములయందును నిట్టి చరితంబులు గలవుం గావున బాండవుల కేవురకు ద్రౌపదిం గ్రమంబునఁ బాణిగ్రహణంబు సేయింపు మిది మన చేసినయది గాదు దైవాధిష్ఠితం బని ద్రుపదు నొడంబఱచి కుంతియుఁ బాండవులు నున్న చోటికి ద్రుపద సహితుం డయి కృష్ణద్వైపాయనుండు వచ్చి యుధిష్ఠిరున కి ట్లనియె.

(పూర్వం మహాత్ములలో కూడా అటువంటి చరిత్రలు ఉన్నాయి. అందువల్ల ఈ వివాహం జరిపించు. ఇది దైవనిర్ణయం - అని ద్రుపదుడిని ఒప్పించి వ్యాసుడు అతడితో పాండవుల దగ్గరికి వెళ్లి ధర్మరాజుతో ఇలా అన్నాడు.)

1_7_280 కందము విజయ్ - విక్రమాదిత్య

కందము

కాంతి విశేష విలాసా
నంత శ్రీఁ దనరు నజితయం దనఘులు నై
తంతువు లేవురుఁ బడసిరి
సంతానము వేఱువేఱ సత్కుల మెసఁగన్.

(వారు వంశవృద్ధి జరిగేలా సంతానాన్ని పొందారు.)

1_7_279 వచనము విజయ్ - విక్రమాదిత్య

వచనము

మఱియు సకల లావణ్యమూర్తి యై వారల కేవురకుఁ బత్నిగాఁ దపంబు సేసిన యక్కన్యక పూర్వదేహంబును జూచి విస్మితుం డయి హర్షించి యున్న ద్రుపదునకు వెండియుం గృష్ణద్వైపాయనుం డి ట్లనియెఁ దొల్లి నితంతుం డను రాజర్షికొడుకు లనంతబలపరాక్రములు సాల్వేయ శూరసేన శ్రుతసేన బిందుసారాతిసారులను వా రేవురుం బరస్పరస్నేహవినయంబుల నతిప్రసిద్ధు లయి పెరుఁగుచు నౌశీనరపతి కన్యక నజిత యను దాని స్వయం వరంబునఁ బడసి వివాహం బయి.

(అంతేకాక ద్రౌపది పూర్వరూపాన్ని చూసి ఆశ్చర్యపడి ఉన్న ద్రుపదుడితో వ్యాసుడు ఇలా అన్నాడు - పూర్వం నితంతుడు అనే రాజర్షి కుమారులు ఐదుమంది ఔశీనరపతి పుత్రిక అజిత అనే ఆమెను వివాహమాడారు.)

1_7_278 ఉత్పలమాల విజయ్ - విక్రమాదిత్య

ఉత్పలమాల

చారు మణి ప్రభా పటల జాల విచిత్ర కిరీట మాలికా
భారములన్ సముద్యదినపావక వర్ణములన్ సువర్ణకే
యూర విభూషణావళుల నొప్పుచునున్న తదీయదేహముల్
ధీరుఁడు సూచెఁ దాళసమదీర్ఘతఁ బొల్చినవాని నేనిటిన్.

(వారి ఐదుదేహాలను ద్రుపదుడు చూశాడు.)

1_7_277 వచనము విజయ్ - విక్రమాదిత్య

వచనము

వారలు ధర్మానిల శక్రాశ్వినులు దమకు నాధారకర్తలుగా ధర్మజ భీమార్జున నకుల సహదేవు లనంగాఁ బుట్టిరి కమలభవప్రముఖ నిఖిలసురగణ ప్రార్థితుం డయి నారాయణు సితాసిత కేశ ద్వయంబు బలదేవ వాసుదేవులై దేవహితార్థం బుద్భవించిన నందు వాసుదేవుండు వారలకుఁ గార్యసహాయుం డయ్యె నయ్యింద్రుల కేవురకును నేకపత్నిగాఁ దపంబుసేసి శ్రీమూర్తి యయిన యాజ్ఞసేనియజ్ఞవేదిం బుట్టె నమ్మవేని వీరల పూర్వదేహంబులఁ జూడు మని కృష్ణద్వైపాయనుండు ద్రుపదునకు దివ్యదృష్టి యిచ్చి చూపిన.

(వారు పాండవులుగా జన్మించారు. దేవతల ప్రార్థించగా విష్ణుమూర్తి తెల్లని, నల్లని వెండ్రుకల జంట బలరామకృష్ణులుగా అవతరించారు. వారిలో కృష్ణుడు పాండవులకు సహాయం చేసేవాడయ్యాడు. వారికి భార్యగా ద్రౌపది జన్మించింది. నమ్మకం లేకపోతే వారి పూర్వదేహాలు చూడు - అని ద్రుపదుడికి దివ్యదృష్టిని ఇచ్చి చూపాడు.)

1_7_276 సీసము + ఆటవెలది విజయ్ - విక్రమాదిత్య

సీసము

హరువచనమున నా గిరిరాజవివరంబు
        గరములఁ బట్టి చెచ్చెర దినేశ
చండమయూఖముల్ రెండు విధంబు లై
        యుండంగఁ దెర్చి యాఖండలుండు
దనయట్టివారల ఘనశరీరుల నందు
        నలువుర నన్యుల వెలయఁ జూచి
యే నిట్టు లేలొకో యేనుప్రకారంబు
        లయితి నిం దనుచు విస్మయముఁ బొంది

ఆటవెలది

యున్నఁ జూచి హరుఁడు గ్రన్న నయ్యింద్రుల
నేవురను మహానుభావ మెసఁగ
మనుజయోనిఁ బుట్టుఁ డని పంచె గీర్వాణ
హితము సేయుపొంటె మతిఁ తలంచి.

(ఇంద్రుడు అలాగే ప్రయత్నించి ఆ రంధ్రాన్ని తెరిచి అందులో తనలాంటి శరీరం కలవారు మరో నలుగురు ఉండటం చూసి ఆశ్చర్యపోగా శివుడు ఆ ఐదుగురు ఇంద్రులను - మానవులుగా జన్మించండి - అని ఆజ్ఞాపించాడు.)

Tuesday, November 28, 2006

1_7_275 కందము విజయ్ - విక్రమాదిత్య

కందము

గర్వించి పలికి తగు నీ
గర్వము భుజవీర్యమును బ్రకాశంబుగ నీ
పర్వతవివరము దెర్చి వి
గుర్వింపుము చూత మనిన గోత్రభిదుండున్.

(గర్వంతో మాట్లాడావు, ఈ పర్వతరంధ్రం తెరిచి విరువు చూద్దాము - అని శివుడు అనగా ఇంద్రుడు.)

1_7_274 వచనము విజయ్ - విక్రమాదిత్య

వచనము

అనిన రుద్రుం డలిగి రౌద్రాకారంబున వానిం జూచి మదీయ క్రీడారసభంగంబుఁ జేసిన యిద్దుర్మదుం బట్టి తెమ్మని య క్కన్యకం బంచిన నప్పుడు దానికరస్పర్శనంబున విచేష్టితుం డయి మహీతలంబుపయిం బడిన యయ్యింద్రునకు రుద్రుం డి ట్లనియె.

(అనగా శివుడు కోపంతో - నా ఆటను ఆటంకపరచిన ఆ పొగరుబోతును పట్టి తెమ్మని ఆ కన్యకను పంపగా, ఆమె చేతి స్పర్శతో చేష్టలు లేక నేలమీద పడిన ఇంద్రుడితో శివుడు ఇలా అన్నాడు.)

1_7_273 మత్తేభము విజయ్ - విక్రమాదిత్య

మత్తేభము

అమితస్థావరజంగమం బయిన బ్రహ్మాండంబు దా నింతయున్
మమతాగోచర మీత్రిలోకములు నస్మద్బాహువజ్రానుపా
ల్యము లే నింద్రుఁడ నిట్టి న న్నుఱక లీలన్ జూదమాడంగ ను
త్తమసింహాసన మెక్క నీకుఁ జనునే దర్పించి నాముందటన్.

(దేవేంద్రుడినైన నన్ను లెక్కపెట్టకుండా ఇలా జూదమాడటం నీకు ఉచితమేనా?)

1_7_272 వచనము విజయ్ - విక్రమాదిత్య

వచనము

ఇ ట్లక్కన్యక పిఱుంద నరుగువాఁడు ముందఱ హిమవదచలకందరారచితరత్న వేదికాతలంబున సింహాసనా సీనుం డయి తరుణరూపంబున నొక్కతరుణితో జూదం బాడుచున్న యాదిదేవుం గని తరుణుండ కా వగచి సురపతి కరం బలిగి యి ట్లనియె.

(ఇలా వెడుతూ ఎదురుగా హిమాలయ పర్వతపు గుహలో యువకుడి రూపంలో ఒక యువతితో జూదమాడుతున్న శివుడిని చూసి, అతడిని సాధారణ యువకుడిగా భావించి, కోపంతో ఇలా అన్నాడు.)

1_7_271 ఆటవెలది విజయ్ - విక్రమాదిత్య

ఆటవెలది

నాదు రోదనంబు నన్ను నెఱుంగఁ గ
వలతయేని యమరవల్లభుండ
నా పిఱుంద రమ్ము నావుడు నప్పు డ
వ్వనిత పజ్జ నరిగె వాసవుండు.

(దేవేంద్రా! నా దుఃఖాన్ని గురించి తెలుసుకోవాలనుకుంటే నా వెంట రావలిసింది - అని చెప్పగా ఇంద్రుడు ఆమెను అనుసరించి వెళ్లాడు.)

1_7_270 వచనము నచకి - వసంత

వచనము

అనిన నమరపతి పురోగము లయిన యమరు లెల్ల నమరాగపగాసమీపంబునకుం జనునప్పుడు తత్సలిల మధ్యంబున నొక్క కన్యక యేడ్చుచున్న దాని కన్నీళ్లు కనకకమలంబు లయినం జూచి వేల్పులుం దానును విస్మయం బంది యింద్రుఁ డక్కన్యకయొద్దకుం జని యేడ్చెద వెందుల దాన వని యడిగిన నది యింద్రున కి ట్లనియె.

(అని అనగా దేవతలు వెనుదిరిగి గంగానది దగ్గరకు వెళ్లారు. ఆ నీటిమధ్యలో ఒక కన్య ఏడుస్తూ ఉండగా, ఆమె కన్నీళ్లు బంగారుతామరలు కావటం చూసి దేవతలు ఆశ్చర్యపడ్డారు. ఆ కన్య దగ్గరికి వెళ్లి - ఎందుకు ఏడుస్తున్నావు - అని అడగగా ఆమె ఇంద్రుడితో ఇలా అన్నది.)

1_7_269 కందము నచకి - వసంత

కందము

ఆ వైవస్వతు వీర్యము
మీ వీర్యముఁ దాల్చి సూర్యమితతేజులు దా
రేవు రుదయింతు రాతని
కావించు విధానమునకుఁ గారణ మగుచున్.

(మీ అంశలతో ఐదుగురు యముడు చేసే పనికి సాధనంగా జన్మిస్తారు.)

1_7_268 కందము నచకి - వసంత

కందము

ఎంతకుఁ గృతకార్యుం డగు
నంతకుఁ డీ రంతకును భయం బందక ని
శ్చింతమున నుండుఁ దాతం
డంతము నొందించుఁ దొంటియట్టుల నరులన్.

(యముడి యాగం పూర్తి అయ్యేంతవరకూ నిశ్చింతగా ఉండండి. తరువాత అతడు మునుపటిలా మానవులను అంతమొందిస్తాడు.)

1_7_267 వచనము నచకి - వసంత

వచనము

అట వైవస్వతుండును నైమిశారణ్యంబున సత్త్రయాగ దీక్షితుం డయి ప్రాణిహింస సేయకుండుటం జేసి మానవు లప్రాప్తమరణు లయి వర్తించుచున్న దాని సహింపనోపక యింద్రాదిదేవత లందఱు బ్రహ్మపాలికిం జని భట్టారకా మర్త్యు లమర్త్యు లయి వర్తిల్లువా రయిన వారికిని మాకును విశేషం బెద్ది యని దుఃఖించిన నయ్యమరుల కమరజ్యేష్ఠుం డి ట్లనియె.

(అక్కడ యముడు నైమిశారణ్యంలో సత్రయాగదీక్ష వహించి ప్రాణిహింస మానటం వల్ల మానవులు మరణం లేకుండా జీవించసాగారు. ఇది సహించలేక ఇంద్రుడు దేవతలతో బ్రహ్మ దగ్గరకు వెళ్లి బాధపడగా బ్రహ్మ ఇలా అన్నాడు.)

-:ద్రుపదునకు వ్యాసుండు పంచేంద్రోపాఖ్యానంబు సెప్పుట:-

1_7_266 కందము నచకి - వసంత

కందము

దక్షాధ్వరమథనునకుఁ బ్ర
దక్షిణపూర్వముగ మ్రొక్కి తడయక చని ప
ద్మేక్షణ సహస్రచక్షుఁ బ్ర
తీక్షించుచు నుండె సురనదీతీరమునన్.

(ఆమె శివుడికి నమస్కరించి గంగాతీరానికి వెళ్లి ఇంద్రుడి రాకకోసం ఎదురుచూస్తూ ఉండింది.)

1_7_265 వచనము నచకి - వసంత

వచనము

అనిన నది యట్లేని నయ్యేవురు పతులయందును బ్రత్యేకసంగమంబునను నాకుఁ గౌమారంబు బతిశుశ్రూషాసిద్ధియుఁ గామభోగేచ్ఛయు సౌభాగ్యంబునుం బ్రసాదింప వలయు ననిన రుద్రుండు దానికోరిన వరంబు లెల్ల నిచ్చి గంగాతీరంబున నున్న యింద్రు నాయొద్దకుం దోడ్కొని రమ్మని పంచిన వల్లె యని.

(అని శివుడు ఆమె కోరిన వరాలు ఇచ్చి గంగాతీరంలో ఉన్న ఇంద్రుడిని నా దగ్గరకు తీసుకురమ్మని పంపాడు.)

1_7_264 కందము నచకి - వసంత

కందము

నా వచనంబున నీ క
య్యేవురు పతులందు ధర్ము వెడపక యుండుం
గావున నిట్టి వరం బిం
దీవర దళనేత్ర యిచ్చితిని దయతోడన్.

(నా మాటవల్ల ఇది ధర్మమే అవుతుంది.)

1_7_263 వచనము నచకి - వసంత

వచనము

అనిన దానికి రుద్రుం డి ట్లనియె.

(అందుకు శివుడు ఇలా అన్నాడు.)

1_7_262 ఆటవెలది నచకి - వసంత

ఆటవెలది

సతికి నొక్కరుండ పతిగాక యెందును
బతులు పలువు రవుట కతలఁ గలదె
లోకనాథ యిట్టి లోకవిరుద్ధంపు
వరము వడయ నమరవరద యొల్ల.

(స్త్రీకి భర్త ఒక్కడే కానీ పలువురు అవటం కథలలో ఎక్కడైనా ఉందా? ఇటువంటి లోకవిరుద్ధమైన వరం నాకు ఇష్టం లేదు.)

1_7_261 వచనము నచకి - వసంత

వచనము

అదియును గొండొకకాలంబు జలానిలాహార యై కొండొకకాలంబు నిరాహార యై కొండొకకాలం బేకపాదంబున నిల్చి కొండొకకాలంబు పంచాగ్నిమధ్యంబున నుండి యత్యుగ్రతపంబు సేసిన నీశ్వరుండు ప్రసన్నుం డయి వరంబు వేఁడు మనిన నక్కన్యక నాకుం బతిదానంబుఁ బ్రసాదింపు మని యర్థిత్వంబున నేనుమాఱులు వేఁడినం గరుణించి యీశ్వరుండు నీకు దేహాంతరంబున నేవురుపతు లగుదు రనిన నది యిట్లనియె.

(ఆమె తపస్సుకు శివుడు ప్రసన్నుడై వరం అనుగ్రహించగా ఆమె - నాకు పతిదానం ప్రసాదించవలసింది - అని ఐదుసార్లు అడిగింది. శివుడు కరుణించి - నీకు జన్మాంతరంలో ఐదుగురు భర్తలవుతారు - అనగా ఆమె ఇలా అన్నది. )

1_7_260 తేటగీతి నచకి - వసంత

తేటగీతి

దానికడకుఁ బ్రత్యేకంబ ధర్మవాయు
వాసవాశ్వినుల్ ప్రీతు లై వచ్చి దాని
నాత్మ దేహాంశుజులకు దేహాంతరమునఁ
బత్నిగాఁ గోరి రధిక సౌభాగ్యయుక్తి.

(ఆమె దగ్గరకు యముడు, వాయువు, ఇంద్రుడు, అశ్వినీదేవతలు వచ్చి, జన్మాంతరంలో తమ అంశలతో పుట్టేవారికి ఆమె భార్య కావాలని కోరారు.)

1_7_259 వచనము నచకి - వసంత

వచనము

దానిదయిన పతిభక్తి గుణంబునకు మెచ్చి మౌద్గల్యుండు ప్రసన్నుం డయి నీ కెద్ది యిష్టంబు వేఁడు మిచ్చెద ననిన నది యి ట్లనియె మునీంద్రా నాకుం గామోపభోగేచ్ఛ పెద్ద గలదు నీవునుం దపశ్శక్తిఁ గామరూపధరుండ వయి ఈ బీభత్సంబగు రూపం బుడిగి మనోహరం బయిన రూపంబునం బంచధా విభక్తుండ వయి నన్ను రమియించి కామభోగంబులం దనుపు మనిన నమ్ముని దాని కిష్టంబైనవిధంబున నేను దేహంబులు దాల్చి మర్త్య దేవ లోకంబులయందు బ్రహ్మర్షి దేవర్షి పూజితుం డై సూర్యరథం బెక్కి చని యాకాశగంగాజలంబుల నాప్లుతదేహుం డయి శీతాంశునంశుజాలంబుల వసియించి మేరుకైలాసంబులయందుఁ గ్రీడించుచు ననేకస్థానంబుల ననేకసహస్రవర్షంబులు నాలాయని యైన యింద్రసేన నుపభోగించి తృప్తుం డై మౌద్గల్యుండు దాని విడిచి ఘోరతపంబు సేసి బ్రహ్మమయుం డై బ్రహ్మలోకంబునకుఁ జనిన నది కామభోగంబులం దనియక కాలవశంబున శరీరంబు విడిచి కాశిరా జను రాజర్షికిం బుట్టి పెరుగుచుం గన్యాత్వమునఁ బెద్దకాలం బుండి తన దౌర్భాగ్యంబునకు నిర్వేదించి పతిం గోరి పశుపతి నుద్దేశించి యుగ్రతపంబు సేయుచున్నంత.

(ఆమె పతిభక్తికి మెచ్చి వరం కోరుకొమ్మనగా ఆమె అతడిని ఐదు సుందరమైన దేహాలు ధరించమని కోరింది. వారు అనేక సంవత్సరాలు క్రీడించిన తరువాత మౌద్గల్యుడు తపస్సు చేసి బ్రహ్మత్వం పొందాడు. కానీ ఆమె తృప్తిచెందక కాశిరాజు అనే రాజర్షికి కుమార్తెగా జన్మించి, భర్త కోసం శివుడిని గూర్చి తపస్సు చేస్తూండగా.)

1_7_258 తేటగీతి నచకి - వసంత

తేటగీతి

కుడుచునెడ వాని పెనువ్రేలు కూటిలోనఁ
దునిసి పడియున్న వ్రేల్ పుచ్చి తోయజాక్షి
యేవగింపక యుచ్ఛిష్ట మిష్టలీలఁ
దగిలి కుడుచుచున్నంత నత్తరుణిఁ జూచి.

(అతని బొటనవేలు ఆ అన్నంలో తెగి పడి ఉండటం చూసి, ఆ వేలిని తీసివేసి, అసహ్యపడక ఆ ఎంగిలి అన్నాన్ని తినసాగింది. అప్పుడామెను చూసి.)

1_7_257 వచనము నచకి - వసంత

వచనము

ఇది దొల్లి నాలాయని యైన యింద్రసేన యనంబరఁగిన పరమ పతివ్రత మౌద్గల్యుం డను మహామునికి భార్య యయి కర్మవశంబున నమ్మునిం గుష్ఠవ్యాధి బాధిత త్వ గస్థిభూత కష్ట శరీరు వయోవృద్ధు వలిపలితధరు దుర్గంధవదను దుఃఖజీవు నతికోపను విశీర్యమాణనఖత్వచుం బరమభక్తి నారాధించి తదుచ్ఛిష్టంబు కుడుచుచున్న నొక్కనాఁడు.

(ఈమె పూర్వం నాలాయని అనే పతివ్రత. మౌద్గల్యుడు అనే మునికి భార్య అయింది. అతడి ముసలివాడు, కుష్ఠరోగి, చర్మపు ముడుతలు, నెరసిన వెండ్రుకలు కలవాడు. మిక్కిలి కోపిష్ఠి. అటువంటి భర్తను ఆమె పూజిస్తూ ఒకనాడు అతను తిని విడిచిన ఎంగిలి అన్నం తింటూ ఉండగా.)

1_7_256 సీసము + ఆటవెలది నచకి - వసంత

సీసము

ధర్మతత్త్వజ్ఞుఁ డీ ధర్మతనూజుండు
        ధర్మమార్గం బేల తప్పఁబలుకు
దేవతామూర్తి యిద్దేవి మాధవి యేల
        తా నెఱుంగక యనృతంబు వలుకు
వీరలపలుకులు వేల్పుల మతమును
        నొక్కండ కావున నొండు దక్కి
యీ యేవురకుఁ గూఁతు నిచ్చి వివాహంబుఁ
        గావింపు మఱి దీని కల తెఱంగు

ఆటవెలది

వినఁగ నిష్టమేని విను మని ద్రుపదు చే
యూఁది యింటిలోని కొనర నరిగి
తాను నతఁడు నేకతమ యుండి వాని కం
తయును జెప్పఁదొడఁగె ధర్మవిదుఁడు.

(వీళ్లమాటలు, దేవతల అభిప్రాయం ఒక్కటే. వేరే ఆలోచన మాని ఈ ఐదుగురికీ మీ కుమార్తెనిచ్చి వివాహం చెయ్యి. యథార్థం వినాలనుకుంటే విను - అని వ్యాసుడు ద్రుపదుడికి ఏకాంతంగా ఇలా చెప్పసాగాడు.)

1_7_255 వచనము నచకి - వసంత

వచనము

ధర్మసూక్ష్మత నిర్ణయింప మన కశక్యంబు త్రిలోకవంద్యుండు త్రికాలప్రవర్తనవిజ్ఞాననిధి యీ కృష్ణద్వైపాయనుండు విచారించి యెద్ది యాన తిచ్చె నదియ యిప్పుడు కర్తవ్యం బనిన విని యమ్మునివరుండు ద్రుపదున కి ట్లనియె.

(ధర్మసూక్ష్మత నిర్ణయించటం మనకు అసాధ్యం. వ్యాసుడు ఆలోచించి ఏది ఆజ్ఞాపిస్తే అదే ఇప్పుడు కర్తవ్యం - అనగా వ్యాసుడు ద్రుపదుడితో ఇలా అన్నాడు.)

1_7_254 ఆటవెలది నచకి - వసంత

ఆటవెలది

గురులలోనఁ బరమగురువు దల్లియ యట్టి
తల్లి వచనమును విధాతృకృతము
నన్యధాకరింప నలవియే యనిన నం
దొఱకు నిట్టు లనియె ద్రుపదవిభుఁడు.

(గురువులలో తల్లి ఉత్తమగురువు. అటువంటి తల్లిమాటను మార్చటం సాధ్యమా? - అని ధర్మరాజు అనగా ద్రుపదుడు ఇలా అన్నాడు.)

1_7_253 వచనము నచకి - వసంత

వచనము

మఱియుం దొల్లి గౌతమి యయిన జటిల యను ఋషికూఁతురు తపఃప్రభావంబున నేడ్వురు ఋషులకు నొక్కతియ భార్య యయ్యె ననియును దాక్షాయణి యను మునికన్యక యేకనామంబునఁ బ్రచేతసు లనం బరఁగిన పదుండ్రకు నొక్కతియ భార్యయయ్యె ననియును గథల వినంబడు మఱి యట్లుం గాక.

(అంతేకాక గౌతముని వంశంలో పుట్టిన జటిల అనే ఋషికూతురు ఏడుగురు ఋషులకు భార్య అయిందనీ, దాక్షాయణి అనే మునికన్యక పదిమందికి భార్య అయిందనీ కథలలో వినబడుతూ ఉన్నది. అంతే కాక.)

1_7_252 చంపకమాల నచకి - వసంత

చంపకమాల

నగియును బొంకునందు వచనంబు నధర్మువునందుఁ జిత్తముం
దగులదు నాకు నెన్నఁడును ధర్ము వవశ్యము నట్ల కావునన్
వగవక మాకు నేవురకు వారిజలోచనఁ గృష్ణ నీఁ దగుం
దగ దను నీ విచారములు దక్కి వివాహ మొనర్పు మొప్పుఁగన్.

(నవ్వులాటకైనా నా మాట అసత్యంలో, నా మనస్సు అధర్మంలో తగులుకోవు. అందువల్ల, బాధపడకుండా, ద్రౌపదిని మాకు ఇచ్చి వివాహం జరిపించు.)

1_7_251 వచనము నచకి - వసంత

వచనము

అనిన నా ద్రుపదునకుఁ గృష్ణద్వైపాయను సమక్షంబున ధర్మజుం డి ట్లనియె.

(అనగా ద్రుపదుడితో ధర్మరాజు ఇలా అన్నాడు.)

1_7_250 కందము నచకి - వసంత

కందము

విమలమతి యన్యులకు విష
యమె ధర్మాధర్మనిర్ణయము సేయఁగ ది
వ్యమునీంద్ర దీని సువిచా
రము సేయుము ధర్మసంకరము గాకుండగన్.

(ధర్మాధర్మనిర్ణయం చేయటం ఇతరులెవ్వరికీ సాధ్యం కాదు. ధర్మసంకరం కాకుండా మీరే దీనిని ఆలోచించండి.)

1_7_249 కందము నచకి - వసంత

కందము

మీ రెఱుఁగనట్టి లోకా
చారము గలదయ్య తొల్లి చన్న మహాత్ముల్
ధీరమతు లిట్లు సేసిన
వా రెవ్వరుఁ గలరె యాప్తవచనాసుమతిన్.

(మీకు తెలియని లోకాచారం లేదు? ఇంతకు ముందు పెద్దల అనుమతితో ఇలా చేసినవారు ఉన్నారా?)

1_7_248 కందము నచకి - వసంత

కందము

తనపలుకు లోక మెల్లను
గొనియాఁడఁగ దగిన లోకగురుఁ డీ యమనం
దనుఁ డే మేవురమును నీ
తనుమధ్య వివాహ మయ్యెదము నని పలికెన్.

("పాండవులము ఐదుగురమూ ద్రౌపదిని వివాహం చేసుకొంటాము అని ధర్మరాజు అన్నాడు.")

1_7_247 వచనము నచకి - వసంత

వచనము

ఇట్లు వచ్చిన కృష్ణద్వైపాయనునకుఁ గుంతీదేవియుఁ బాండవులును బాంచాలుండు నతిభక్తి మ్రొక్కి యమ్మహామునిం గాంచనమణిమయోచ్చాసనంబున నునిచి యర్ఘ్యపాద్యాదివిధులం బూజించి యున్న వారల కుశలం బడిగి హిత మధుర సత్య సంభాషణామృత రసప్రవాహ సందోహంబున నందఱం బరమానంద హృదయులం జేసియున్న యమ్మునీంద్రునకు ముకుళితకరకమలుం డయి ద్రుపదుం డి ట్లనియె.

(వారు అతడిని పూజించగా, వ్యాసుడు వారి కుశలమడిగాడు. అప్పుడు ద్రుపదుడు ఇలా అన్నాడు.)

1_7_246 ఉత్పలమాల నచకి - వసంత

ఉత్పలమాల

ఈహితకార్యసిద్ధి యిది యెట్లొకొ తా సమకూరు నంచు సం
దేహముఁ బొంది సోమక యుధిష్ఠిరు లున్నఁ దదీయ ధర్మసం
దేహ నివృత్తి పొంటెఁ జనుదెంచెఁ బరాశరసూనుఁ డాత్మతే
జోహృతసూర్యతేజుఁ డగుచున్ దిశలెల్ల వెలుంగుచుండఁగన్.

(ఆ సమయంలో వ్యాసుడు అక్కడికి వచ్చాడు.)

-:వ్యాసమహాముని ద్రుపదునియొద్దకు వచ్చుట:-

Monday, November 27, 2006

1_7_245 వచనము నచకి - వసంత

వచనము

నీవు లౌకికవైదికధర్మస్వరూపవిదుండవు ధర్మాత్మజుండవు నీ పలుకులు ధర్మవిరుద్ధంబులు నా నోడుదు మయినను లోకంబున నిది యశ్రుతపూర్వంబు దీని నింక నీవును నేనును గుంతీదేవియును ధృష్టద్యుమ్నుండును విచారించి యెల్లి నిశ్చయింత మని.

(నీవు ధర్మస్వరూపం తెలిసినవాడివి. నీ మాటలు ధర్మవిరుద్ధాలు అనటానికి వెనుకాడుతాము. అయినా ఇది లోకంలో ముందెన్నడూ విననిది. దీని గురించి అందరమూ ఆలోచించి రేపు నిర్ణయిద్దాము - అని.)

1_7_244 కందము నచకి - వసంత

కందము

ఒక్క పురుషునకు భార్యలు
పెక్కం డ్రగు టెందుఁ గలదు పెక్కండ్రకు నా
లొక్కత యగు టే యుగముల
నెక్కథలను వినియు నెఱుఁగ మెవ్వరివలనన్.

(ఒక్క పురుషుడికి పలువురు భార్యలుండటం ఉన్నదే. కానీ, పలువురు భర్తలకు ఒకే భార్య ఉండటం విని ఎరుగము.)

1_7_243 వచనము నచకి - వసంత

వచనము

ఏన కా దిక్కన్యక నే మేవురము వివాహం బయ్యెద మస్మన్మాతృ నియోగం బిట్టిద యది మాకు నలంఘనీయం బనిన విని విస్మితుం డై ద్రుపదుం డి ట్లనియె.

(నేనే కాదు. ఈమెను మేము ఐదుగురమూ వివాహం చేసుకొంటాము. ఇది మా తల్లి ఆజ్ఞ. అది మాకు దాటరానిది - అనగా విని ద్రుపదుడు ఆశ్చర్యపడి ఇలా అన్నాడు.)

1_7_242 తేటగీతి నచకి - వసంత

తేటగీతి

అట్ల యగునేని యిక్కన్య నభిమతముగ
వసుమతీనాథ నీవ వివాహ మగుము
ధర్మమార్గ మెవ్వరికిని దప్ప నగునె
యనిన నాతని కనియె ధర్మాత్మజుండు.

(అలా అయితే ముందు నీవే వివాహం చేసుకో. ధర్మమార్గం తప్పరాదు కదా - అని ద్రుపదుడు అనగా ధర్మరాజు ఇలా అన్నాడు.)

1_7_241 వచనము నచకి - వసంత

వచనము

స్వయంవర లబ్ధ యయిన యి క్కన్యక నర్జునుండు ధర్మవిధిం బాణిగ్రహణంబు సేయువాఁ డనిన ద్రుపదునకు ధర్మతనయుం డి ట్లనియె నది యె ట్లేను వివాహం బైనఁ బదంపడి భీమసేనుండు వివాహం బయిన మఱి యర్జునుండు వివాహం బగుఁగాక ముందరర్జునునకుఁ బాణిగ్రహణంబు సేయ నె ట్లగు ననిన ద్రుపదుండు ధర్మతనయున కి ట్లనియె.

(స్వయంవరంలో లభించిన ఈ కన్యను అర్జునుడు వివాహం చేసుకుంటాడు - అని ద్రుపదుడు అనగా ధర్మరాజు ఇలా అన్నాడు - అది ఎలా వీలవుతుంది? నేను పెళ్లాడిన తరువాత భీముడు పెళ్లాడుతాడు. తరువాత అర్జునుడు. ముందుగానే అర్జునుడు పెళ్లాడటం ఎలా జరుగుతుంది? - అనగా ద్రుపదుడు ధర్మరాజుతో ఇలా అన్నాడు.)

1_7_240 కందము ప్రకాష్ - వసంత

కందము

సుత్త్రామ పుత్త్రుఁ డభిజన
పాత్రుండు విచిత్ర వీర్యుపౌత్త్రుఁడు శుభ చా
రిత్రుం డీ విజయుఁడు మ
త్పుత్రికి వరుఁ డయ్యె నెట్టి పుణ్యోదయమో.

(అర్జునుడు నా కుమార్తెకు భర్త అవటం ఎటువంటి భాగ్యం?)

1_7_239 వచనము ప్రకాష్ - వసంత

వచనము

వీరు కుంతీమహాదేవు లని తన్నునుం దమ్ములనుం దల్లిని నెఱింగించిన ద్రుపదుం డతిహర్షరసావేశ పరవశుం డయి పెద్దయుంబ్రొద్దునకుఁ దెలిసి యానందజలభరితనయనుం డగుచు నా పుణ్యంబున లాక్షాగృహదాహంబువలన విముక్తుల రయితి రని సంతసిల్లి తద్వృత్తాంతం బంతయు ధర్మతనయునివలన విని ధృతరాష్ట్ర దుర్యోధనుల నిందించి సామప్రియభాషణంబుల నభీష్టసత్కారంబులను వారిం బూజించి యొక్కనాఁడు పుత్త్రమిత్రామాత్యబాంధవబ్రాహ్మణపరివృతుం డయి ద్రుపదుండు సుఖాసీను లయి యున్న పాండవుల కి ట్లనియె.

(ద్రుపదుడు వారు లాక్షాగృహదహనం నుంచి తప్పించుకున్నందుకు సంతోషించి ధృతరాష్ట్ర దుర్యోధనులను నిందించి పాండవులను పూజించాడు. తరువాత ఒకరోజు పాండవులతో ఇలా అన్నాడు.)

1_7_238 కందము ప్రకాష్ - వసంత

కందము

క్షత్త్రియులము పాండుప్రియ
పుత్త్రుల మే నగ్రజుండ భూనుతులు మరు
త్పుత్త్రార్జునయము లమల చ
రిత్రులు నలువురును వీ రరిందము లెందున్.

(మేము పాండురాజు పుత్రులము.)

1_7_237 వచనము ప్రకాష్ - వసంత

వచనము

మఱియుం దనయొద్దకు వచ్చి యశంకితు లయి క్షత్త్రియోచితంబు లైన మహార్హాసనంబుల నున్నవారల రాజపుత్త్రులంగా నెఱింగియు సంశయాపనోదనపరుండై ధర్మతనయునకు ద్రుపదుం డి ట్లనియె నయ్యా క్షత్త్రియులరో బ్రాహ్మణులరో మాయావు లయి క్రుమ్మరుచున్న మంత్రసిద్ధులరో కాక కృష్ణాపరిగ్రహణార్థంబు దివంబుననుండి వచ్చిన దివ్యులరో యెఱుంగము మాకు సందేహం బయి యున్నయది మీ కలరూ పెఱింగి కాని యిక్కన్య వివాహంబు సేయనేర మనిన ద్రుపదునకు ధర్మతనయుం డి ట్లనియె.

(అయినా సందేహం తీర్చుకోవటానికి ద్రుపదుడు ధర్మరాజుతో ఇలా అన్నాడు - అయ్యా! మీరు క్షత్రియులా? బ్రాహ్మణులా? మాయావులైన మంత్రసిద్ధులా లేక ద్రౌపదిని వరించటానికి వచ్చిన దేవతలా? మాకు సందేహంగా ఉన్నది. మీ నిజరూపం తెలుసుకొని కానీ ఈమె వివాహం చేయలేము - అని ద్రుపదుడు పలుకగా ధర్మరాజు ఇలా అన్నాడు.)

1_7_236 సీసము + ఆటవెలది ప్రకాష్ - వసంత

సీసము

అజినోత్తరీయుల నతి సంభృత బ్రహ్మ
తేజుల సముదితాదిత్యసముల
నాజానులంబి మహాబాహుపరిఘుల
నత్యున్నతాంసుల నతివిశాల
వక్షుల నవిరళవ్యాయామ దృఢ కఠి
నాంగుల వృషభాక్షు లయిన వారిఁ
బాండుకుమారుల భరతవంశేశులఁ
జూచి సుతభ్రాతృ సుహృదమాత్య

ఆటవెలది

బంధుజనులతోడఁ బరమవిద్వన్మహీ
సురగణంబుతోడ సోమకుండు
గరము సంతసిల్లె ఘనుల నత్యుత్తమ
క్షత్త్రవంశవరులఁ గా నెఱింగి.

(వారిని ద్రుపదుడు చూసి క్షత్రియులుగా గుర్తించాడు.)

1_7_235 వచనము ప్రకాష్ - వసంత

వచనము

మీ రాజు మనోరథంబు సఫలం బయ్యె వగవ నేల యనిన ధర్మరాజుపలుకు విని పురోహితుండు వోయి ద్రుపదున కెఱింగించిన ద్రుపదుండు ధృష్టద్యుమ్నుం జూచి చాతుర్వర్ణ్యోచితంబు లయిన రథంబులు గొనిపోయి వారలం దోడ్కొని ర మ్మని పంచిన వాఁడును నాక్షణంబ పాండవుల పాలికి వచ్చి యీరథంబు లెక్కి మారాజునొద్దకు రం డనినఁ బాండవులు రాజయోగ్యంబు లయి రత్నాంచితంబు లయిన కాంచనరథంబు లెక్కి కుంతీదేవిని ద్రౌపదిని నొక్కరథం బెక్కించి తోడ్కొని ధృష్టద్యుమ్నుతో ద్రుపదరాజ నివేశంబున కరుగుదెంచునంత ద్రుపదుండును వారల కనేకవిధంబు లైన వస్తువు లతిప్రీతిం బుత్తెంచినఁ బరార్థ్యంబులైన యొండువస్తువులఁ బరిగ్రహింపక సాంగ్రామికంబు లైన యసిచర్మకార్ముకబాణతూణీరరథవరూథవాజివారణ నివహంబులఁ బరిగ్రహించి తనయొద్దకు వచ్చువారి.

(మీ రాజు కోరికక సఫలమైంది - అని చెప్పగా ఆ పురోహితుడు ఈ విషయాన్ని ద్రుపదుడికి తెలిపాడు. ద్రుపదుడు వారిని తీసుకురమ్మని ధృష్టద్యుమ్నుడిని పంపగా అతడు వారిని రథాలలో తోడ్కొని వచ్చాడు. ద్రుపదుడు వారికి రకరకాల వస్తువులు పంపగా వారు వాటిలో యుద్ధానికి సంబంధించినవి మాత్రమే స్వీకరించారు.)

-:పాండవులు ద్రుపదమహారాజు గృహంబునకుఁ బోవుట:-

1_7_234 కందము ప్రకాష్ - వసంత

కందము

బలహీనుఁ డైన వానికి
నలవియె మోపెట్టి తివియ నక్కార్ముకముం
గులహీనున కకృతాస్త్రున
కలవియె యా లక్ష్య మేయ నశ్రమలీలన్.

(బలహీనులకి ఆ లక్ష్యాన్ని కొట్టటం సాధ్యమా?)

1_7_233 తేటగీతి ప్రకాష్ - వసంత

తేటగీతి

అతని నియమించి నట్ల యయ్యంత్ర మేసి
యీతఁ డిక్కన్యఁ బడసె నుర్వీశు లొద్ద
నేల మమ్ముఁ దా నెఱిఁగెడు నెఱిఁగి యేమి
సేయువాఁ డింక మీపతి సెప్పుమయ్య.

(ద్రుపదుడు చెప్పినట్లే ఇతడు ఆ యంత్రాన్ని కొట్టి ఆ కన్యను పొందాడు. ఇక మీ రాజు మమ్మల్ని తెలుసుకోవటం ఎందుకు? తెలుసుకొని ఏమి చేస్తాడు?)

1_7_232 కందము ప్రకాష్ - వసంత

కందము

ఇవ్వైహాయసలక్ష్యం
బివ్విల్లు మోపెట్టి నెట్టనేసిన వీరుం
డివ్వనితకు వరుఁ డగు నని
నెవ్వగ మీరాజు చులక నియమము సేసెన్.

(మత్స్యయంత్రం కొట్టిన వీరుడు ఈ వనితకు భర్త అవుతాడు - అని మీ మహారాజు సులువైన నియమం చేశాడు.)

1_7_231 వచనము ప్రకాష్ - వసంత

వచనము

అనిన విని నగుచు ధర్మతనయుండు ద్రుపద పురోహితున కి ట్లనియె.

(ఇది విని ధర్మరాజు నవ్వుతూ ద్రుపదుడి పురోహితుడితో ఇలా అన్నాడు.)

Monday, November 20, 2006

1_7_230 ఉత్పలమాల ప్రకాష్ - వసంత

ఉత్పలమాల

మీ కులగోత్ర నామములు మిమ్మును నెమ్మి నెఱుంగవేఁడి చిం
తాకులుఁ డైనవాఁడు ద్రుపదాధిపుఁ డాతనికిం బ్రియంబుగా
నా కెఱిఁగింపుఁ డింతయు ఘనంబుగ నద్భుతయంత్ర మత్స్యమున్
వీకున నట్టు లేసిన సువిక్రము నాతఁడు గోరుఁ జూడఁగన్.

(ద్రుపదమహారాజుకు సంతోషం కలిగేలా మీ గురించి నాకు తెలియజేయండి. మత్స్యయంత్రాన్ని పడగొట్టిన వీరుడిని అతడు చూడగోరుతున్నాడు.)

1_7_229 వచనము ప్రకాష్ - వసంత

వచనము

వెండియు వారల నిమ్ముగా నెఱుంగవేఁడి తనపురోహితుం బుత్తెంచినం బురోహితుండును బ్రాహ్మణసమూహంబుతోడ వచ్చి పాండవులం గని ధర్మరాజు నియోగంబున భీమసేనుచేత నర్ఘ్యాదివిధుల నర్చితుం డయి యిట్లనియె.

(ఇంకా వారి విషయం తెలుసుకొని రమ్మని తన పురోహితుడిని పంపగా, అతడు పాండవులను చూసి, వారి అర్ఘ్యాది పూజలు అందుకొని ఇలా అన్నాడు.)

1_7_228 సీసము + ఆటవెలది ప్రకాష్ - వసంత

సీసము

అంత నయ్యేవురు నయ్యయికథ లొప్పఁ
        జెప్పుచు మఱి రథసింధురాశ్వ
విషయంబులును సమవిషమ మహావ్యూహ
        నిర్భేదనోపాయనిపుణవిధులు
నాయుధవిద్యారహస్యప్రయుక్తులుఁ
        బలికిరి పలికినబాసఁ జూడ
నత్యుత్తమక్షత్త్రియాన్వయు లగుదురు
        చరితఁ జూడఁగ విప్రజాతు లగుదు

ఆటవెలది

రెఱుఁగరాదు వారి నీ రెండు జాతుల
వారకాని కారు వైశ్య శూద్ర
హీనజాతు లనిన నెంతయు సంతస
మందెఁ బృషతపుత్త్రుఁ డాత్మలోన.

(అప్పుడు వాళ్లు యుద్ధాల గురించి, ఆయుధాల గురించి మాట్లాడుకొన్నారు. ఆ మాటల ప్రకారం క్షత్రియులు, ప్రవర్తన ప్రకారం విప్రులు అనిపిస్తున్నది - అని చెప్పగా ద్రుపదుడు ఆనందించాడు. )

1_7_227 కందము ప్రకాష్ - వసంత

కందము

కడవసములుఁ గోలలుఁ గ
ప్పడములు వీరలధనంబు పరికింపఁగ నె
క్కడి దేశికు లని వగవక
మడవక తను మధ్య నిండుమనమున నుండెన్.

(జింకచర్మాలు, దండాలు, చినిగిన గుడ్డలు - వీళ్ల ధనాలు. ఆలోచిస్తే వీళ్లేం భర్తలు అని అసహ్యపడక ద్రౌపది నిండుమనసుతో ఉంది.)

1_7_226 ఆటవెలది ప్రకాష్ - వసంత

ఆటవెలది

కఱకు దర్భపూరి పఱపులు భిక్షాన్న
మశన మట్టివారి నతిముదమున
నాదరించెఁ బ్రీతి నాదిగర్భేశ్వరి
యయ్యు నేవగింపదయ్యెఁ గృష్ణ.

(దర్భగడ్డి పరుపులు, భిక్షాన్నం - వీటిని ఆగర్భశ్రీమంతురాలైనా ద్రౌపది సంతోషంతో ఆదరించింది కానీ ఏవగించుకోలేదు.)

Sunday, November 19, 2006

1_7_225 వచనము ప్రకాష్ - వసంత

వచనము

మఱియు రెండగుపా లన్నలువురకుం బెట్టి తద్భుక్తశేషం బేనును నీవు నుపయోగింత మని పంచినఁ గృష్ణయు నయ్యవ్వ పంచినరూపున నందఱకుం గుడువం బెట్టి తానును గుడిచి దర్భపూరులు విద్రిచి యందఱకు వేఱువేఱ శయనమ్ము లిమ్ముగా రచియించి వానిపయి వారల కృష్ణాజినంబులు పఱచి సుఖశయను లై యున్న వారిపాదంబులకు నుపధానభూత యై శయనించి.

(రెండవభాగం ఈ నలుగురికీ పెట్టి, మిగిలినది నేను, నువ్వు ఉపయోగిద్దాము - అని ఆజ్ఞాపించగా ద్రౌపది అలాగే చేసి, వారు సుఖంగా పడుకొన్న తరువాత వారి పాదాలకు దిండులా తాను పడుకొన్నది.)

1_7_224 కందము ప్రకాష్ - వసంత

కందము

వెడఁదయురంబును నన్నువ
కడుపును దృఢకఠినతనువుఁ గల యాతని కిం
దడర నొకపాలు పెట్టుము
వడి నాగాయుతబలంబువాఁ డతఁ డబలా.

(కఠినదేహం కలిగిన ఇతడికి ఒక భాగం పెట్టు. ఇతడు పదివేల ఏనుగుల బలం కలవాడు.)

1_7_223 సీసము + ఆటవెలది ప్రకాష్ - వసంత

సీసము

అ య్యిద్దఱును గృష్ణ న ట్లొప్పఁ దోడ్కొని
        చని యొక్క ముదుసలి సాని కపుడు
మ్రొక్కి యక్కన్యను మ్రొక్కించి మఱియొక్క
        గౌరవర్ణుఁడు పంపఁ గడఁకతోడ
నలువురు భూసురనాథగృహంబుల
        కరిగి భైక్షము దెచ్చి యంతగూడు
నొగిన యయ్యవ్వకు నొప్పించియున్న న
        య్యవ్వ యు ద్రౌపది నర్థిఁ బిలిచి

ఆటవెలది

బలివిధానములకు బ్రాహ్మణాతిథులకు
నన్నకాంక్షు లైన యధ్వగులకు
నగ్ర మిందుఁ బుచ్చి యయ్యగ్రశేషంబుఁ
జెలువ రెండు పాళ్ళు సేయు మొనర.

(ఆ ఇద్దరూ (భీమార్జునులు) ద్రౌపదిని తమవెంట తీసుకొని ఒక ముసలి అవ్వ దగ్గరకు వెళ్లారు. ఒక తెల్లనివాడు ఆజ్ఞాపించగా మిగిలిన నలుగురు వెళ్లి బ్రాహ్మణగృహాలనుండి భిక్ష తీసుకువచ్చి ఆ అవ్వకు అప్పగించారు. ఆమె ద్రౌపదితో - ఇందులో అగ్రభాగం అతిథులకు ఉంచి, మిగిలినది రెండుభాగాలు చెయ్యి - అని చెప్పింది.)

1_7_222 వచనము ప్రకాష్ - వసంత

వచనము

సకలరాజసమక్షంబున నిట్టి యతిమానుషం బయిన యద్భుతకర్మం బర్జునునక కా కన్యులకుఁ జేయ శక్యంబె యని యెఱింగింతిమి మీపరాక్రమంబు మిమ్ము నెఱింగించె నధర్మనిరతు లగు ధృతరాష్ట్రదుర్యోధనులు సేసిన లాక్షాగారదాహప్రయోగంబువలన విముక్తుల రయితి రింక మీకు లగ్గగు నని చెప్పి బలదేవసహితం డయి వానుదేవుం డరిగిన నిట ద్రుపదుండు దన కూఁతునకు వరుం డైన వాఁ డెవ్వఁడో యేవంశంబునవాఁడో వానిచరితం బెట్టిదో యెఱింగి రమ్మని ధృష్టద్యుమ్నుం బనిచిన నతండు భీమార్జునద్రౌపదుల పిఱుందన వచ్చి తన్నొఱు లెఱుంగకుండ నక్కుంభకారగృహంబున నుండి యంత వృత్తాంతంబు నెఱింగిపోయి ద్రుపదున కి ట్లనియె.

(అందరు రాజులముందు మానవులకు అసాధ్యమైన పని చేయటం అర్జునుడికి కాక ఇతరులకు సాధ్యమా? మీ పరాక్రమమే మిమ్మల్ని తెలియపరచింది. ఇక మీకు మేలు జరుగుతుంది - అని చెప్పి బలరాముడితో కూడి కృష్ణుడు వెళ్లిపోయాడు. ఇక్కడ ద్రుపదుడు తన కుమార్తెకు భర్త అయినవాడు ఎలాంటివాడో తెలుసుకొని రమ్మని ధృష్టద్యుమ్నుడిని పంపాడు. అతడు ఈ వృత్తాంతమంతా తెలుసుకొని వెళ్లి ద్రుపదుడితో ఇలా చెప్పాడు.)

1_7_221 ఉత్పలమాల ప్రకాష్ - వసంత

ఉత్పలమాల

అంబుజమిత్రుఁ డంబుదచయాంతరితుం డగుడం దదీయ తే
జంబు జగజ్జనంబులకు శక్యమె కప్పఁగ మీరు గూఢభా
వంబున నున్న మీదగు నవారితతేజము భూజనప్రసి
ద్ధంబగుఁ గాక దానిఁ బిహితంబుగ నెవ్వరుఁ జేయనేర్తురే.

(మేఘాలు సూర్యుడి తేజస్సును కప్పగలవా? అలాగే మారువేషంలో ఉన్నా మీ తేజస్సు కనపడకుండా ఎవరు చేయగలరు?)

1_7_220 వచనము ప్రకాష్ - వసంత

వచనము

అనిన నగుచు వాసుదేవుం డిట్లనియె.

(అప్పుడు కృష్ణుడు నవ్వుతూ ఇలా అన్నాడు.)

1_7_219 కందము ప్రకాష్ - వసంత

కందము

ఒవ్వమిఁ గౌరవులకుఁ గడు
దవ్వయి మఱి విప్రవేషధారుల మయి మ
మ్మెవ్వరు నెఱుంగకుండఁగ
నివ్విధమున నున్న నెట్టు నెఱిఁగితి రీరల్.

(విప్రవేషధారులమై ఉన్న మమ్మల్ని ఎలా గుర్తించారు?)

1_7_218 వచనము ప్రకాష్ - వసంత

వచనము

కని త మ్మెఱింగించి యతిస్నేహంబున నయ్యుధిష్ఠిరునకుం గుంతీదేవికి మ్రొక్కి భీమార్జుననకులసహదేవులం గౌఁగిలించుకొని పరమసమ్మదరసపూరితహృదయు లై యున్న వారల కుశలం బడిగి ధర్మరా జి ట్లనియె.

(ధర్మరాజు వారిని కుశలమడిగి ఇలా అన్నాడు.)

1_7_217 శార్దూలము ప్రకాష్ - వసంత

శార్దూలము

రాజత్కీర్తులు వచ్చి కాంచి రనఘుల్ రాముండు గృష్ణుండు న
య్యాజామీఢు నజాతశత్రు నృపలోకారాధ్యు నుద్యద్గుణ
భ్రాజిష్ణుం దమ మేనయత్త కొడుకున్ బాలార్కతుల్యోజ్జ్వల
త్తేజున్ భ్రాతృచతుష్కమధ్యగతుఁ గౌంతేయాగ్రజున్ ధర్మజున్.

(బలరామకృష్ణులు వచ్చి ధర్మరాజును చూశారు.)

-:శ్రీకృష్ణ బలరాములు ధర్మరాజాదులఁ జూడవచ్చుట:-

1_7_216 వచనము ప్రకాష్ - వసంత

వచనము

అని పలుకుచున్న యవసరంబున.

(అని అంటున్న సమయంలో.)

Thursday, November 16, 2006

1_7_215 కందము ప్రకాష్ - వసంత

కందము

గురువచనస్థితి మనకే
గురకును నిది పత్నిగాఁ దగుం గావున ని
త్తరుణిని బరిగ్రహింతము
తిరముగ గురువచన మొండుదెఱఁ గేల యగున్.

(పెద్దలమాట వ్యర్థం కాదు కదా, ఈమె మన ఐదుగురికీ భార్య కాదగినది. కనుక ఈమెను నిశ్చింతగా వివాహం చేసుకుందాము.)

1_7_214 వచనము ప్రకాష్ - వసంత

వచనము

ఇట్లు పాంచాలియందు బద్ధానురాగు లయియున్న తమ యేవుర యభిప్రాయం బెఱింగి వేద వ్యాస వచనంబులుం దలంచి ధర్మతనయుండు దమ్ముల కిట్లనియె.

(వ్యాసుడి మాటలు తలచుకొని ధర్మరాజు ఇలా అన్నాడు.)

1_7_213 ఉత్పలమాల ప్రకాష్ - వసంత

ఉత్పలమాల

ఆ లలితాంగియందు హృదయంబులు దృష్టులు నిల్పి పాండుభూ
పాల తనూజపంచకము పంచశరాహతిఁ బొందె నొక్కతన్
బాలికఁ దొల్లి యేవురకు భామినిఁగా సృజియించి యున్న య
య్యాలరి బ్రహ్మ చెయ్ది పరమార్థముగా కది యేల యొండగున్.

(ఒకే కన్యను ఐదుగురికి భార్యగా భావించి సృష్టించిన తుంటరి బ్రహ్మ చేసిన పని సత్యం కాకుండా ఎలా ఉంటుంది?)

1_7_212 వచనము ప్రకాష్ - వసంత

వచనము

పెద్దవాఁ డుండ గొండుక వానికి వివాహం బగుట ధర్మవిరుద్ధంబు గావున దీని నగ్రమహిషిఁగాఁ బరిగ్రహింవుము మా నలువుర యనుమతంబును నిట్టిద యనుచున్న యవసరంబున విధిప్రేరణవశంబున.

(పెద్దవాడు ఉండగా చిన్నవాడికి పెళ్లి కావటం ధర్మవిరుద్ధం, కాబట్టి ఈమెను పెద్దభార్యగా గ్రహించు. మా నలుగురి సమ్మతమిదే - అని అంటున్న సమయంలో విధిప్రేరణతో.)

1_7_211 సీసము + ఆటవెలది ప్రకాష్ - వసంత

సీసము

ఈ తన్విఁ దోడ్కొని నీ తమ్ములిరువురు
        ప్రీతి నేతెంచి యీ భిక్ష యొప్పఁ
గొను మని నాకుఁ జెప్పినను నేవురు నుప
        యోగింపుఁ డంటి నాయుక్తి దొల్లి
యనృత మెన్నండుఁ గా దనఘ మీ రెప్పుడు
        మద్వచనాతిక్రమంబు సేయ
రిది లోకమున లేని యది యేమి సేయంగ
        నగు నని చింతాకులాత్మ యైనఁ

తేటగీతి

దల్లి నూరార్చి వాసవతనయుఁ జూచి
పార్థ నీచేతఁ బడయంగఁ బడిన దీని
నగ్నిసన్నిధిఁ బాణిగ్రహంబు నీవ
చేయు మన ధర్మజునకును జిష్ణుఁ డనియె.

(నా మాట ఇంతవరకు అసత్యం కాలేదు. ధర్మరాజా! మీరు నా మాట దాటరు. కానీ, ఇది లోకవిరుద్ధం, ఏమి చేద్దాము? - అని బాధపడుతున్న తల్లిని ఓదార్చి, అర్జునుడిని చూసి, "ఈమెను నువ్వే వివాహమాడు", అనగా అర్జునుడు ఇలా అన్నాడు.)

Monday, November 13, 2006

1_7_210 వచనము ప్రకాష్ - వసంత

వచనము

అట్టి యవసరంబునఁ దల్లియొద్దకు ధర్మరాజును గవలవారు మున్న వచ్చియున్నఁ దదనంతరంబ భీమార్జునులు ద్రౌపదీసహితు లయి చనుదెంచి మ్రొక్కి మే మొక్క భిక్ష దెచ్చితి మని తల్లికి నివేదించిన నెఱుంగక యప్పటి యట్ల కా వగచి కుంతీదేవి సంతసిల్లి దాని మీ రేవురు నుపయోగింపుఁ డని కొడుకుల నియోగించి భువన త్రయ రాజ్య లక్ష్మియం బోలె నున్న యక్కన్నియం జూచి లజ్జించి యధర్మభీత యయి ధర్మతనయున కి ట్లనియె.

(మేమొక భిక్ష తెచ్చాము - అని తల్లితో అన్నారు. ఆమె ఆ భిక్ష గురించి తెలియక - దానిని మీరు అయిదుగురు ఉపయోగించండి - అని కొడుకులను ఆజ్ఞాపించింది. తరువాత ఆ కన్యను చూసి, సిగ్గుపడి, అధర్మానికి భయపడి, ధర్మరాజుతో ఇలా పలికింది.)

-:అర్జునుండు ద్రౌపదిం దెచ్చి తల్లికి నివేదించుట:-

1_7_209 సీసము + ఆటవెలది ప్రకాష్ - వసంత

సీసము

ఉత్సవ సందర్శనోత్సుకు లై పోయి
        కడుఁ బెద్ద ప్రొ ద్దయ్యెఁ గొడుకు లేల
మసలిరొ కౌరవుల్ విసువక వైరంబు
        గావించు పాపస్వభావు లెఱిఁగి
క్రందునఁ జంపిరో యందుల కేవురు
        లీలతో నొక్కట నేల యరిగి
రవ్యయుం డయిన వేదవ్యాసు వచనంబు
        నిక్కంబుగాకుండు నొక్కొ వేల్పు

ఆటవెలది

లార భూసురేశులార మీ శరణంబ
కాని యొండుగతియుఁ గాన నాకు
శరణ మగుఁడు సుతులఁ గరుణతో రక్షింపుఁ
డనుచు గుంతి వగచి వనరుచుండె.

(స్వయంవరానికి వెళ్లిన కొడుకులు ఇంకా తిరిగిరాలేదు. కౌరవులు వారిని గుర్తించి చంపారేమో? వ్యాసుడి మాట నిజం కాకుండా ఉంటుందా? - అని కుంతి విచారిస్తూ ఉండింది.)

1_7_208 వచనము ప్రకాష్ - వసంత

వచనము

వలవ దుడుంగుఁ డని వారించిన నట్లు కృష్ణుచేత నివారితులయి రాజపుత్త్రులు దమతమదేశంబులకుం జని రంత భీమార్జునులు బ్రాహ్మణపరివృతు లయి ద్రుపదరాజపుత్త్రిఁ దోడ్కొని వచ్చునంత.

(వద్దు. వారెవరో తెలుసుకొనే ప్రయత్నం మానండి - అని కృష్ణుడు వారిని ఆపగా వారు తమ తమ దేశాలకు వెళ్లిపోయారు. భీమార్జునులు ద్రౌపదిని తమతో తీసుకొని ఇంటికి తిరిగివచ్చేటప్పుడు.)

1_7_207 చంపకమాల ప్రకాష్ - వసంత

చంపకమాల

పరులకు దుష్కరంబయిన భాసుర కార్యము సేసి తత్స్వయం
వరమునఁ బత్నిఁగాఁ బడసె వారిరుహాయత నేత్రఁ గృష్ణ నీ
ధరణిసురాన్వయోత్తముఁడు ధర్మవిధిం జెపుఁడయ్య యింక నె
వ్వరికిని జన్నె వీని ననవద్యపరాక్రము నాక్రమింపఁగన్.

(ఇతరులకు సాధ్యం కాని గొప్పపని చేసి ఇతడు ద్రౌపదిని భార్యగా పొందాడు. ఇతడిని జయించటం ఎవరికి సాధ్యమో చెప్పండి.)

1_7_206 వచనము ప్రకాష్ - వసంత

వచనము

వీ రెవ్వరో యెం దుండుదురో యెఱుంగవలయు నని దుర్యోధనాదు లయిన రాజపుత్త్రు లెల్ల విస్మితు లయి యున్న వారలం జూచి కృష్ణుం డి ట్లనియె.

(వీరెవరో, ఎక్కడ ఉంటారో తెలుసుకోవాలి - అని ఆ రాజకుమారులు ఆశ్చర్యపోగా కృష్ణుడు ఇలా అన్నాడు.)

1_7_205 ఆటవెలది ప్రకాష్ - వసంత

ఆటవెలది

పరశురాముఁ డొండె హరుఁ డొండె నరుఁ డొండె
గాక యొరులు గలరె కర్ణు నోర్వ
బలిమి భీముఁ డొండె బలదేవుఁ డొండెఁ గా
కొరులు నరులు శల్యు నోర్వఁ గలరె.

(పరశురాముడో, శివుడో, అర్జునుడో కాక ఇతరులు కర్ణుడిని ఓడించగలరా? భీముడో, బలరాముడో కాక ఇతరులు శల్యుడిని ఓడించగలరా?)

1_7_204 ఆటవెలది ప్రకాష్ - వసంత

ఆటవెలది

సెల్లుఁ డట్లు నేల ద్రెళ్ళి చెచ్చెర లేచి
యొడలు దుడిచికొనుచు నొయ్యఁ జనియె
వానిఁ జూచి నగుచు మానుగా విప్రులు
భూరిసత్త్వు భీముఁ బొగిడి రంత.

(శల్యుడు ఆ విధంగా నేలపై పడి, లేచి తిన్నగా వెళ్లిపోయాడు. ఇది చూసి విప్రులు భీముడిని పొగిడారు.)

1_7_203 వచనము ప్రకాష్ - వసెత

వచనము

అనిన విని కర్ణుండు బ్రహ్మతేజం బజేయం బని విజయుతోడియుద్ధం బొల్లక క్రమ్మఱియె మఱి శల్య భీమసేనులు పెనంగి మల్లయుద్ధంబు సేయునెడ భీముండు భీమబలంబునం బట్టుకొని శల్యుం ద్రెళ్ళవైచిన.

(బ్రహ్మతేజస్సును జయించటం సాధ్యం కాదని కర్ణుడు వెనుదిరిగి వెళ్లాడు. శల్యభీమసేనుల యుద్ధంలో భీముడు శల్యుడిని పట్టుకొని పడవేశాడు.)

1_7_202 మధ్యాక్కర ప్రకాష్ - వసంత

మధ్యాక్కర

ఏను నీ చెప్పిన వారలోపల నెవ్వఁడఁ గాను
గాని నే సర్వశస్త్రాస్త్రవిద్యలఁ గడుఁ బ్రసిద్ధుండ
భూనుత బ్రహ్మతేజోధికుఁడ నిన్నుఁ బోరిలో నోర్వఁ
గా నున్న వీరుండ నొండు దక్కి లోఁగక చక్కనిలుము.

(నేను నువ్వు చెప్పినవాళ్లలో ఎవ్వడినీ కాదు. నిన్ను ఓడించటానికి సిద్ధంగా ఉన్న వీరుడిని. మాటలు కట్టిపెట్టి గట్టిగా నిలబడు.)

1_7_201 కందము ప్రకాష్ - వసంత

కందము

నీ వప్రాకృతబలుఁడవు
నీ విక్రమమునకు విల్లునేర్పునకు మహీ
దేవకులోత్తమ మెచ్చితి
నావుడుఁ బార్థుండు గర్ణునకు ని ట్లనియెన్.

(నీ పరాక్రమానికి, విలువిద్యకి మెచ్చాను - అనగా అర్జునుడు ఇలా అన్నాడు.)

Sunday, November 12, 2006

1_7_200 కందము ప్రకాష్ - వసంత

కందము

నాయెదురఁ జక్కనై యని
సేయఁగ భార్గవునకును శచీవరునకుఁ గౌం
తేయుఁ డగు విజయునకుఁ గా
కాయతభుజశక్తి నొరుల కలవియె ధరణిన్.

(నాతో యుద్ధం చేయటం పరశురాముడికి, దేవేంద్రుడికి, అర్జునుడికి తప్ప ఇతరులకు సాధ్యమౌతుందా?)

1_7_199 కందము ప్రకాష్ - వసంత

కందము

వీరుఁడగు నరుని యేయు న
పార శరావలుల నడుమ వారింపంగా
నేరక యే టుడిగి మహా
శూరుఁడు రాధేయుఁ డింద్రజున కి ట్లనియెన్.

(అర్జునుడి బాణాలను అడ్డుకోలేక కర్ణుడు బాణప్రయోగం మాని ఇలా అన్నాడు.)

1_7_198 శార్దూలము ప్రకాష్ - వసంత

శార్దూలము

కర్ణుండున్ విజయుండు నొండొరులఁ జుల్కం దాఁకి చాపంబు లా
కర్ణాంతం బగుచుండగా దిగిచి యుగ్రక్రోధు లై యేసి రా
పూర్ణంబయ్యెఁ దదీయ బాణతతి నంభోభృత్పథం బెల్ల నా
స్తీర్ణం బయ్యె ధరిత్రి యెల్ల నవిసెన్ దిక్చక్ర మెల్లన్ వడిన్.

(కర్ణార్జునులు ఒకరితో ఒకరు యుద్ధం చేశారు.)

1_7_197 కందము ప్రకాష్ - వసంత

కందము

కురుపతి సూడఁగఁ గర్ణుఁడు
నరుఁ దాఁకెను శల్యుఁ డనిల నందనుఁ దాఁకెన్
సరభసమున విస్మయ మం
దిరి ధరణీదేవ మనుజదేవప్రవరుల్.

(దుర్యోధనుడు చూస్తూండగా కర్ణుడు అర్జునుడిని, శల్యుడు భీముడిని ఎదుర్కొన్నారు.)

1_7_196 వచనము ప్రకాష్ - వసంత

వచనము

అంత.

(అప్పుడు.)

1_7_195 సీసము + ఆటవెలది ప్రకాష్ - వసంత

సీసము

తాలాభ మగు విల్లు దాల్చి విరోధుల
        నెగచుచునున్నవాఁ డింద్రతనయుఁ
డాతని కెలన మహావృక్షహస్తుఁ డై
        యున్నవీరుండు వృకోదరుండు
యంత్రంబు నరుఁ డేసి నప్పుడు పోయిన
        యగ్గౌరవర్ణుండు యమతనూజుఁ
డాతనితోడన యరిగిన యిరువురుఁ
        గవల వా రర్కప్రకాశ తేజు

ఆటవెలది

లనిన లక్కయింట నగ్నిదాహంబున
నెట్లు బ్రదికి రొక్కొ యిమ్మహాత్ము
లెట్టి పుణ్యదినమొ యేవురఁ జూచితి
మనుచు సంతసిల్లె హలధరుండు

(వారే పాండవులు - అని కృష్ణుడు చెప్పగా - లక్కయింటిలో మంటనుండి వీరు ఎలా బయటపడ్డారో. ఇది ఎంత సుదినం - అని బలరాముడు సంతోషించాడు.)

1_7_194 వచనము ప్రకాష్ - వసంత

వచనము

అని తానును భీమసేనుండును గడఁగి రిపు బలంబుపయి నపరిమిత శరంబు లేసె భీమసేనుండు నొక్కవృక్షంబు వెఱికికొని దండ హస్తుం డయిన దండధరుండునుంబోలె నర్జునునకు సహాయుం డయి నిలిచె నంత న య్యిద్దర మహా సంరంభంబుఁ జూచి విస్మితుఁ డై కృష్ణుండు బలదేవున కి ట్లినియె.

(అని భీమసేనుడితో కలిసి వారితో యుద్ధం చేశాడు. ఇది చూసి కృష్ణుడు బలరాముడితో ఇలా అన్నాడు.)

-:అర్జునుండు కర్ణునితో యుద్ధంబు సేసి జయించుట:-

1_7_193 కందము ప్రకాష్ - వసంత

కందము

కడఁగి మదీయాస్త్రము లని
యెడు పటుమంత్రముల నిప్పు డీ నృపురిపుల
న్కడిఁది విషాహుల దర్పం
బుడిగించెదఁ దొలఁగి చూచుచుండుఁడు మీరల్.

(ఇప్పుడు ఈ అస్త్రాలతో ద్రుపదుడి శత్రువులను అణచివేస్తాను.)

1_7_192 వచనము ప్రకాష్ - వసంత

వచనము

ఏమిదోషంబు సేసియు బ్రాహ్మణుండు వధ్యుండు గాఁడు మన రాజ్యంబును నర్థంబును బ్రాహ్మణార్థంబ కావున న వ్విప్రుతోడి దేమి యని ద్రుపదుపయి నెత్తుదెంచిన ద్రుపదుండును కడుభీతుం డై బ్రాహ్మణుల మఱువు సొచ్చె నిట్లు శరణాగతుం డయిన ద్రుపదు నోడకుండు మని బ్రాహ్మణులు దమ తమ దండాజినంబు లెత్తికొని ప్రతిబలంబులపయి వీచుచున్నంత వారలం జూచి నగుచు నర్జునుం డి ట్లనియె.

(అని ద్రుపదుడి పైకి దండెత్తి రాగా అతడు బ్రాహ్మణుల చాటున చేరాడు. వారు తమ జింకచర్మాలను శత్రుసేనల మీద వీచుతుండగా అర్జునుడు నవ్వుతూ ఇలా అన్నాడు.)

1_7_191 కందము ప్రకాష్ - వసంత

కందము

తన విద్య పేర్మి నృపనం
దనఁ బడసెను విప్రుఁ డితని తప్పే కడుదు
ర్జనుఁ డీ ద్రుపదుఁడు నృపతుల
ననయంబున మెచ్చఁ డయ్యె నతిగర్వితుఁడై.

(ఇతడు తన విద్యాబలంతో ద్రౌపదిని పొందాడు. ఇతడి తప్పు ఏముంది? రాజులను లెక్కచేయని ద్రుపదుడు దుర్మార్గుడు.)