అనిన నుగ్రశ్రవసుం డట్లేని మీకు నభిమతంబైన పుణ్యకథఁ జెప్పెద
దత్తావధానులరై వినుం డని శౌనకాదిమహామునుల కిట్లని చెప్పం దొడంగె.
కృష్ణద్వైపాయనుండను బ్రహ్మర్షి తొల్లి వేదంబు లేకీభూతంబులై యేర్పడ
కున్న ఋగ్యజుస్సామాథర్వణంబులుగా విభాగించి తనశిష్యులయిన పైల
వైళంపాయనసుమంతుజైమినులం బంచి క్రమంబునఁ జతుర్వేదసూత్రం
బులఁ జేయించి వేదవ్యాసుండై నిజతపోమహత్త్వంబునంజేసి బ్రహ్మచేత
ననుజ్ఞాతుండై యష్టాదశపురాణంబులును నీతిధర్మశాస్త్రార్థతత్త్వంబులును
జతుర్వేదవేదాంతాభిప్రాయంబులును జతుర్వర్గవర్గానుబంధబంధురకథేతి
హాసంబులును జతుర్యుగ మహర్షి రాజవంశచరితంబులును జతుర్వర్ణాశ్రమ
ధర్మక్రమంబులును జతుర్ముఖప్రముఖనిఖిలసురమునిగణపూజితుండైన
శ్రీకృష్ణుని మాహాత్మ్యంబును బాండవాదిభారతవీరులమహాగుణంబును దన
విమలజ్ఞానమయంబైన వాగ్దర్పణంబునం దేర్పడి వెలుంగుచుండ.

(మీకు ఇష్టమైన పుణ్యకథను చెపుతానని ఉగ్రశ్రవసుడు మునులతో ఇలా చెప్పనారంభించాడు - కృష్ణద్వైపాయనుడనే బ్రహ్మర్షి కలసి ఉన్న వేదాలను ఋగ్వేద, యజుర్వేద, సామవేద, అథర్వణవేదాలుగా విభజించాడు, పైలుడు, వైశంపాయనుడు, సుమంతుడు, జైమిని అనే తన శిష్యులచేత వరుసగా ఆ వేదాలకు సూత్రాలను రచింపజేశాడు. ఈ కారణం వలన వేదవ్యాసునిగా ప్రసిద్ధి పొందాడు. బ్రహ్మ ఆజ్ఞచేత అష్టాదశపురాణాలను, ఎన్నో గొప్పవిషయాలు నిర్మలమైన జ్ఞానంతో నిండిన తన వాక్కనే అద్దంలో ప్రకాశిస్తుండగా - (భారతాన్ని రచించాడని తర్వాతి పద్యంతో అన్వయం))
No comments:
Post a Comment