వచనము
మఱియు మహారణ్యంబునందు గిమ్మీరవధయును గృష్ణపాంచాలాగమనంబును
సౌభకాఖ్యానంబును యుధిష్ఠిరభీమసేనసంవాదంబును గురూపదేశంబున నర్జునుండు
దివ్యాస్త్రంబులు వడయఁ దపశ్ఛరణంబు సేయుటయు నీశ్వరుతోడి
యుద్ధంబును లోకపాలసందర్శనంబును దివ్యాస్త్రలాభంబును స్వర్గగమనంబును
నిట బృహదశ్వుండను మహామునిం గాంచుటయు యుధిష్ఠిరాదుల పరిదేవనంబును
నలోపాఖ్యానంబును దమయంతీపతివ్రతాస్తుతియు యుధిష్ఠిరాదులకు
నర్జునకుశలవార్త రోమశుండు సెప్పుటయును ధర్మజు తీర్థాభిగమనంబును
జటాసురవధయును బాంచాలీనియుక్తుండై భీముండు సౌగంధికపుష్పాహరణార్థంబు
గంధమాదనంబునందలి కొలనికిఁ జని యందు మణిమంతుఁడు
మొదలుగాఁగల యక్షరాక్షసులం జంపుటయు నాజగరంబు నగస్త్యోపాఖ్యానంబును
వాతాపిభక్షణంబు నపత్యార్థం బగస్త్యమహాముని లోపాముద్ర నభిగమించుటయు
శ్యేనకపోతంబులైన యింద్రాగ్నులు శిబిమాంసంబు గొనుటయు
ఋష్యశృంగు చరితంబును బరశురామ చరితంబును గార్తవీర్యవధయును
మాంధాతృజన్మంబును సౌకన్యాఖ్యానంబును భార్గవుండయిన చ్యవనుండు
శర్యాతి యజ్ఞంబును నాశ్వినుల సోమపీథులం జేసి వారిచేత జవ్వనంబు వడయుటయు
జంతూపాఖ్యానంబును యజ్ఞపుత్త్రుండైన సోమకుండు బహుపుత్త్రార్థంబు
యజ్ఞంబుసేసి పుత్త్రశతంబును బడయుటయు వంద్యష్టావక్రుల
వివాదంబును సముద్రంబును జయించి తిత్తిరియను మహర్షి తన
తండ్రిం బడయుటయు దివ్యాస్త్రంబులు వడసి యర్జునుండు హిరణ్యపురనివాసులయిన
పౌలోమకాలకేయనివాతకవచాదులం జంపుటయు గంధమాదనంబున
కందఱుం గూడవచ్చుటయు మార్కండేయబహువిధోపాఖ్యానంబును
గృష్ణసందర్శనంబును సత్యాద్రౌపదీసంవాదంబును ఘోషయాత్రయుఁ జిత్రసేనాది
గంధర్వులఁ బెక్కండ్ర జయించి దుర్యోధనుని విడిపించుటయు
దుర్యోధనుని ప్రాయోపవేశంబును వ్రీహిద్రోణకాఖ్యానంబును సరస్వతీగీతయు
ధుంధుమారుచరితంబును జయద్రధఁ డాశ్రమాంతరంబున ద్రౌపది
నపహరించుటయు భీముండు వానిం బరిభవించుటయు నుద్దాలకోపాఖ్యానంబును
వైన్యోపాఖ్యానంబును శ్రీరామాయణకథయును సావిత్ర్యుపాఖ్యానంబును
బాండవులు క్రమ్మఱి ద్వైతవనంబునకు వచ్చుటయుఁ గర్ణుకవచకుండలంబు
లింద్రుండు గొనుటయు నారణేయోపాఖ్యానంబును యముండు ధర్మజు
ననుశాసించుటయు యమువలన వరంబులు వడసి పాండవులు పశ్చిమదిక్కునకుం
జనుటయు ననువృత్తాంతంబుల నొప్పి పదుమూఁడువేలు నాఱునూట
యఱువదినాలుగు శ్లోకంబులు గలిగి.
(పైన చెప్పిన వృత్తాంతాలన్నిటితో కలిపి 13664 శ్లోకాలు కలిగి.)
Friday, August 26, 2005
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment