Sunday, December 25, 2005

1_4_127 కందము విజయ్ - విక్రమాదిత్య

కందము

ద్యుతి దఱిఁగి నిజనియోగ
చ్యుతిఁ బొందను మీకు నొండుచోటికి నరుగం
గత మేమి యనిన విని య
య్యతివకు సురనదికి నిట్టు లని రవ్వసువుల్.

(మీరు స్వర్గం నుండి పతనం చెందటానికి కారణం ఏమిటని వారిని అడిగింది.)

1_4_126 కందము విజయ్ - విక్రమాదిత్య

కందము

అనిమిషలోకవియోగం
బున దుఃఖితు లయి వసిష్ఠమునివరుశాపం
బున వచ్చువారి వసువుల
నెనమండ్రం గాంచి గంగ యెంతయుఁ బ్రీతిన్.

(వశిష్ఠుని శాపం వల్ల స్వర్గలోకం విడిచి బాధపడుతున్న ఎనిమిదిమంది వసువులను గంగ ఆప్యాయంగా చూసి.)

Wednesday, December 21, 2005

1_4_125 వచనము విజయ్ - విక్రమాదిత్య

వచనము

మర్త్యలోకంబున రాజర్షివరులలోనఁ బుణ్యచరిత్రుండు ప్రతీపుండు కావున వానికిఁ బుత్త్రుండనై జన్మించెద నొరులయందు జనింప నోపనని కమలభవుననుమతంబు వడసె గంగయు నమ్మహాభిషుని మహానుభావంబును రూపసౌందర్యంబులును దనయందుల యభిలాషయు నెఱింగి తానును మనోజబాణబాధిత యయి వానిన తలంచుచు మర్త్యలోకమునకు వచ్చునది యెదుర.

(భూలోకంలోని రాజర్షులలో గొప్పవాడైన ప్రతీపుడికి మాత్రమే పుత్రుడిగా జన్మిస్తాను అని కోరి బ్రహ్మదేవుడి సమ్మతి పొందాడు. గంగకూడా మహాభిషుడిని ఇష్టపడి అతడి గురించే ఆలోచిస్తూ భూలోకానికి వచ్చింది. అప్పుడు ఎదురుగా.)

1_4_124 ఆటవెలది విజయ్ - విక్రమాదిత్య

ఆటవెలది

దాని నెఱిఁగి కమలయోని వానికిఁ గర
మల్గి మర్త్యయోనియందుఁ బుట్టు
మనుచు శాప మిచ్చె నొనరంగ వాఁడును
గరముభీతిఁ గరయుగంబు మొగిచి.

(బ్రహ్మ కోపంతో, మానవస్త్రీకి పుట్టమని మహాభిషుడిని శపించాడు. మహాభిషుడు భయపడి, బ్రహ్మకు నమస్కరించి.)

1_4_123 తేటగీతి విజయ్ - విక్రమాదిత్య

తేటగీతి

ఊరుమూల మేర్పడఁగ నయ్యువిదవలువు
దొలఁగె ననిలంబుచేత విధూతమగుచు
నమరు లెల్లఁ బరాఙ్ముఖు లైరి
సాభిలాషుఁడై చూచె మహాభిషుండు.

(గాలివల్ల ఆమె చీర తొలగిపోగా దేవతలంతా ఆమెను చూడకుండా ముఖాలు పక్కకు తిప్పుకున్నారు. మహాభిషుడు మాత్రం ఆసక్తితో చూశాడు.)

1_4_122 వచనము విజయ్ - విక్రమాదిత్య

వచనము

మఱి పాండవధార్తరాష్ట్రసంభవంబును సవిస్తరంబుగా వినవలతుం జెప్పుమనిన వానికి వైశంపాయనుం డిట్లని చెప్పెఁ దొల్లి యిక్ష్వాకువంశంబున మహాభిషుం డనువాఁడు పుట్టి మహాధర్మశీలుం డైన యశ్వమేధసహస్రంబున రాజసూయశతంబునుం జేసి యింద్రాదిదేవతలం దనిపి దేవలోకంబునకుం జని యందు దేవర్షి గణంబులతోఁ బితామహుం గొల్చుచున్న యవసరంబున గంగానది దివ్యస్త్రీరూపధారిణి యయి బ్రహ్మసభకు వచ్చిన.

(ఇంకా పాండవుల, ధృతరాష్ట్రపుత్రుల పుట్టుక కూడా చెప్పమని అడిగాడు. వైశంపాయనుడు ఇలా చెప్పాడు - పూర్వం ఇక్ష్వాకువంశంలో మహాభిషుడు అనేవాడు పుట్టి చాలా యాగాలు చేసి, దేవతలకు తృప్తి కలిగించి, స్వర్గానికి వెళ్లి, మునిగణాలతో కలిసి బ్రహ్మను సేవిస్తున్న సమయంలో గంగానది దివ్యస్త్రీరూపం ధరించి అక్కడికి వచ్చింది.)

Sunday, December 18, 2005

-:గంగా వసువుల సమయము:-

1_4_121 కందము విజయ్ - విక్రమాదిత్య

కందము

నరవరుఁ డగు శంతనున క
మరనదికిని నెట్లు సంగమం బయ్యె మహా
పురుషుండు భీష్ముఁ డె ట్ల
య్యిరువురకును బుట్టె దీని నెఱిఁగింపు మొగిన్.

(శంతనుడికీ గంగకూ పొత్తు ఎలా కలిగింది? వారికి భీష్ముడు ఎలా పుట్టాడు?)

1_4_120 వచనము వసు - వసంత

వచనము

అనిన విని జనమేజయుండు వైశంపాయనున కిట్లని యె.

(అప్పుడు జనమేజయుడు వైశంపాయనుడితో ఇలా అన్నాడు.)

1_4_119 కందము వసు - వసంత

కందము

వీ రైలులుఁ బౌరవులును
భారతులును గౌరవులును బాండవులు ననన్‌
వీరులయి పరగి రిది నయ
పారగ భవదీయవంశపరిపాటి మహిన్‌.

(వీరు ఐలులనీ, పౌరవులనీ, భారతులనీ, కౌరవులనీ, పాండవులనీ ప్రసిద్ధికెక్కారు. ఇది నీ వంశక్రమం.)

1_4_118 వచనము వసు - వసంత

వచనము

మఱియు నీకును వపుష్టమకును శతానీకశంకుకర్ణులు పుట్టి రందు శతానీకునకు వైదేహి నశ్వమేధధత్తుండు పుట్టె.

(నీకూ వపుష్టమకూ శతానీకుడు, శంకుకర్ణుడు పుట్టగా, వారిలో శతానీకుడికీ విదేహరాజపుత్రికీ అశ్వమేధదత్తుడు పుట్టాడు.)

1_4_117 కందము వసు - వసంత

కందము

అతనికి ననంతపుణ్యా
న్విత యనఁదగు మాద్రవతికి నీ వఖిలజగ
న్నుత జనమేజయ పుట్టితి
ధృతిఁ బాండవవంశమునకుఁ దేజం బెసఁగన్‌.

(జనమేజయ మహారాజా! నీవు పరీక్షితుడికీ మాద్రవతికీ పుట్టావు.)

1_4_116 వచనము వసు - వసంత

వచనము

అంత దౌష్యంతి సంతానవిచ్ఛేదంబుగా వచ్చిన సత్యవతీనియుక్తుండై సకలధర్మమూర్తి కృష్ణద్వైపాయనుండు దేవరన్యాయంబున నంబికయందు ధృతరాష్ట్రుని నంబాలికయందుఁ బాండురాజును నంబికాపరిచారికయందు విదురునిం బుట్టించిన నందు ధృతరాష్ట్రునకు గాంధారికి వ్యాసవర ప్రసాదంబున దుర్యోధనుం డాదిగా నూర్వురు గొడుకులు పుట్టిరి పాండురాజునియోగంబునఁ గుంతీమాద్రులకు ధర్మానిలశక్రాశ్వినులప్రసాదంబున ధర్మజభీమార్జుననకులసహదేవు లనంగా నేవురుగొడుకులు పుట్టి రయ్యేవురకుం బాంచాలి ధర్మపత్ని యయ్యె దానియందు ధర్మరాజునకుఁ బ్రతివింధ్యుండును భీమసేనునకు శ్రుతసోముండును నర్జునునకు శ్రుతకీర్తియు నకులునకు శతానీకుండును సహదేవునకు శ్రుతసేనుండును ననఁ బంచోపపాండవులు పుట్టిరి మఱి ధర్మరాజునకు స్వయంవరలబ్ధ యైన దేవిక యనుదానికి యౌధేయుండు పుట్టె భీమసేనునకు జరంధరకు సర్వగుండు పుట్టె నర్జునునకు సుభద్రకు నభిమన్యుండు పుట్టె నకులునకుఁ జైద్యయయిన కరేణుమతికి నిరమిత్రుండు పుట్టె సహదేవునకు స్వయంవరలబ్ధయైన విజయకు సుహోత్రుండు పుట్టె మఱియు భీమసేనునకు హిడింబకు ఘటోత్కచుండు పుట్టె నిప్పాటంబాండవపుత్త్రులైన పదునొక్కండ్రయందును వంశకరుండైన యభిమన్యునకు విరాటపుత్త్రి యయిన యుత్తరకుం బరీక్షితుండు పుట్టె.

(అప్పుడు భరతవంశ విచ్ఛేదం అయ్యే పరిస్థితి రాగా, సత్యవతి చెప్పటం చేత, వ్యాసుడు దేవరన్యాయంతో అంబికకు ధృతరాష్ట్రుడినీ, అంబాలికకు పాండురాజునూ, అంబిక చెలికత్తెకు విదురుడినీ అనుగ్రహించాడు. వారిలో ధృతరాష్ట్రుడికీ, గాంధారికీ వ్యాసుడి వరం వలన దుర్యోధనుడు మొదలైన వందమంది కొడుకులు పుట్టారు. కుంతీదేవికి యముడి వలన ధర్మరాజు, వాయువు వలన భీముడు, ఇంద్రుడి వలన అర్జునుడు పుట్టారు. మాద్రికి అశ్వినీదేవతల దయవలన నకులసహదేవులు జన్మించారు. ఈ అయిదుమందికీ పాంచాలి భార్య అయింది. వారి వలన ఆమెకు పంచపాండవులు జన్మించారు. అర్జునుడికీ సుభద్రకూ అభిమన్యుడు పుట్టాడు. భీముడికీ హిడింబకూ ఘటోత్కచుడు జన్మించాడు. ఇలా పాండవులకు పుట్టినవారిలో వంశాన్ని నిలిపినవాడు అభిమన్యుడు. అతడికీ విరాటరాజపుత్రి అయిన ఉత్తరకూ పరీక్షితుడు పుట్టాడు.)

Thursday, December 15, 2005

1_4_115 చంపకమాల వసు - వసంత

చంపకమాల

అతిశయరూపయౌవనగుణాధికసుండర మైన యాసతీ
ద్వితయమునందు సంతతరతిన్‌ వివశుం డయి రాజకృత్యముల్‌
మతి నొకనాఁడుఁ జేయ కహినద్యుతితేజుఁడు రాజయక్ష్మబా
ధితుఁ డయి దేవలోకసుదతీప్రియుఁ డయ్యె విచిత్రవీర్యుఁడున్‌.

(విచిత్రవీర్యుడు భార్యావివశుడై రాజవిధులను పట్టించుకోకుండా క్షయరోగంతో చనిపోయాడు.)

1_4_114 వచనము వసు - వసంత

వచనము

వానిపేరం గురుక్షేత్రంబునాఁ బరగె నట్టి కురునకు దాశార్హియైన శుభాంగికిని విదూరథుండు పుట్టె వానికి మాగధి యైన యమృతకుం బరీక్షితుండు పుట్టె వానికి బహుదానసుత యయిన సుయశకు భీమసేనుండు పుట్టె వానికిం గైకేయి యయిన కుమారికిఁ బ్రదీపుఁడు (బర్యశ్రవసుండు) పుట్టెఁ వానికిఁ బ్రతీపుండు పుట్టెఁ బ్రతీపునకు శిబిపుత్రి యయిన సునందకు దేవాపి శంతను బాహ్లికు లనఁగా మువ్వురు పుట్టి రందు దేవాపి బాల్యంబునంద తపోవనంబున కరగిన శంతనుండు రాజయ్యె వానికి గంగాదేవికి దేవవ్రతుండైన భీష్ముండు పుట్టె మఱియు శంతనునకు యోజనగంధియైన సత్యవతికిం జిత్రాంగదవిచిత్రవీర్యులనంగా నిద్దఱు గొడుకులు పుట్టి రందుఁ జిత్రాంగదుండు బాల్యంబున గంధర్వనిహతుం డయిన వానికం గొండుకవాని విచిత్రవీర్యు రాజ్యాభిషిక్తుం జేసి భీష్ముండు కాశీరాజ దుహితల నంబికాంబాలిక లనువారి నిద్దఱ విచిత్రవీర్యునకు వివాహంబు సేసిన.

(అతడి పేరుమీద కురుక్షేత్రం ప్రసిద్ధికెక్కింది. అతడి వంశంలో శంతనుడు జన్మించాడు. శంతనుడికీ గంగాదేవికీ భీష్ముడు పుట్టాడు. అంతేకాక, శంతనుడికీ యోజనగంధి అయిన సత్యవతికీ చిత్రాంగదుడు, విచిత్రవీర్యుడు పుట్టారు. చిత్రాంగదుడు చిన్నతనంలోనే చనిపోవడం వల్ల భీష్ముడు విచిత్రవీర్యుడికి రాజ్యాభిషేకం చేసి కాశీరాజు కుమార్తెలైన అంబిక, అంబాలిక అనేవారిని అతడికి వివాహం చేశాడు.)

1_4_113 కందము వసు - వసంత

కందము

అనఘుడు పౌరవకులవ
ర్ధనుఁ డద్దిననాథతనయఁ దపతి వివాహం
బొనరఁగ నయ్యె నిరువుర
కును వంశకరుండు పుట్టెఁ గురుఁ డున్నతుఁ డై.

(సూర్యుడి కుమార్తె అయిన తపతిని వివాహమాడాడు. వారికి వంశకర్త అయిన కురుడు జన్మించాడు.)

Wednesday, December 14, 2005

1_4_112 కందము వసు - వసంత

కందము

బలయుతులు నూటయిరువది
నలువురు సుతు లుద్భవిల్లి నానాదేశం
బులకు బతు లైరి మఱి వా
రలలో సంవరణుఁ డఖిల రాజ్యోన్నతుఁడై.

(పుట్టిన కొడుకులలో సంవరణుడు శ్రేష్ఠుడై.)

1_4_111 వచనము వసు - వసంత

వచనము

మఱియు నతీతానాగతులైన నిజవంశంబున రాజుల కెల్ల వంశకర్తయయ్యె నట్టిభరతునకుఁ గైకేయియైన సునందకు భుమన్యుండు పుట్టె వానికి నిక్ష్వాకుకన్య యైన సువర్ణకు హస్తి పుట్టెనతని పేరం గౌరవ్యరాజధాని యైన నగరంబు హస్తిపురంబు నా బరగె నట్టి హస్తికిం ద్రిగర్తరాజ పుత్త్రి యైన యశోధరకు వికుంఠనుండు పుట్టె వానికి దాశార్హపుత్త్రియైన వసుదేవకు నజమీఢుండు పుట్టె నయ్యజమీఢునకు గైకేయియు గాంధారియు ఋక్షయు నను మువ్వురు స్త్రీలకు.

(అంతేకాక తన వంశానికి వంశకర్త అయ్యాడు. భరతుడికీ కేకయరాజపుత్రిక అయిన సునందకూ భుమన్యుడు పుట్టాడు. భుమన్యుడికీ దాశార్హుడి కూతురైన విజయకూ సుహోత్రుడు జన్మించాడు.సుహోత్రుడికీ ఇక్ష్వాకుడి కుమార్తె అయిన సువర్ణకూ హస్తి అనేవాడు పుట్టాడు. అతడి పేరుమీద కౌరవుల రాజధాని అయిన "హస్తిపురం" ప్రసిద్ధికెక్కింది. హస్తికీ త్రిగర్తరాజు పుత్రిక అయిన యశోధరకూ వికుంఠనుడు పుట్టాడు. అతడికీ దాశార్హుడి కూతురైన వసుదేవకూ అజమీఢుడు జన్మించాడు. అజమీఢుడికీ కైకేయి, గాంధారి, ఋక్ష అనే ముగ్గురు స్త్రీలకూ.)

-:భరత వంశక్రమము:-

Sunday, December 11, 2005

1_4_110 చంపకమాల వసు - వసంత

చంపకమాల

భరతుఁ డశేషభూభవనభారధురంధరుఁ డై వసుంధరం
బరగి యనేకయాగములఁ బాయక భాస్కరజహ్నుకన్యకా
సురుచిరతీరదేశముల సువ్రతుఁ డై యొనరించి భూరిభూ
సురులకు నిచ్చె దక్షిణలు శుద్ధసువర్ణగవాశ్వహస్తులన్.

(భరతుడు రాజ్యభారాన్ని వహించి, లోకంలో ప్రసిద్ధికెక్కి, గంగాయమునా నదీతీరాలలో ఎన్నో యజ్ఞాలు, దానాలు చేశాడు.)

1_4_109 వచనము వసు - వసంత

వచనము

అని మహానురాగంబునం గొడుకు నెత్తికొని హర్షపులక లెసఁగ నాలింగనంబు సేసి శకుంతలామహాదేవి నతిప్రణయగౌరవంబున సంభావించి యౌవరాజ్యంబునకు భరతు నభిషిక్తుం జేసి పెద్దకాలంబు రాజ్యసుఖంబు లనుభవించి తనరాజ్యభారం బంతయు భరతుం బూన్చి దుష్యంతుండు దపోవనంబున కరిగిన.

(అని దుష్యంతుడు శకుంతలను సన్మానించి, భరతుడిని యౌవరాజ్యపదవిలో అభిషేకించి, చాలాకాలం రాజ్యసుఖాలు అనుభవించి, రాజ్యభారాన్ని భరతుడికి అప్పగించి, తపోవనానికి వెళ్లిపోయాడు.)

1_4_108 తేటగీతి వసు - వసంత

తేటగీతి

అన్యు లెఱుఁగమిఁజేసి లోకాపవాద
భీతి నెఱిగియు నిత్తన్విఁ బ్రీతి దప్పి
యెఱుఁగ నంటిని నిందఱ కిప్పు డెఱుఁగఁ
జెప్పె నాకాశవాణి యచ్చెరువు గాఁగ.

(ఇతరులకు ఈ విషయం తెలియదు కాబట్టి లోకనిందకు భయపడి ఈమె ఎవరో నాకు తెలియదని అన్నాను. కానీ ఇప్పుడు అందరికీ తెలిసేలా ఆకాశవాణి ప్రకటించింది.)

1_4_107 తేటగీతి వసు - వసంత

తేటగీతి

ఏను నీయింతియును గాని యెఱుఁగ రన్యు
లర్థిఁ గణ్వమహామునియాశ్రమంబు
నందు గాంధర్వవిథి వివాహమునఁ గరము
నెమ్మిఁ జేసినదీనిఁ బాణిగ్రహణము.

(ఈమెను నేను కణ్వమహాముని ఆశ్రమంలో వివాహం చేసుకొన్న విషయం నాకూ ఈమెకూ తప్ప ఇంకెవరికీ తెలియదు.)

1_4_106 వచనము వసు - వసంత

వచనము

ఇట్లెల్లవారలకు నతిహర్షంబుగా శకుంతలపతిప్రతాత్వంబును సత్యంబును భరతోత్పత్తియుఁ బ్రశంసించు వేలుపులపలుకు లతివ్యక్తంబు లయి యాకాశంబువలన వీతెంచిన విని దుష్యంతుండు సభాసదులు విన నిట్లనియె.

(ఇలా ఆకాశవాణి చెప్పగా దుష్యంతుడు విని సభలోనివారితో ఇలా అన్నాడు.)

1_4_105 చంపకమాల వసు - వసంత

చంపకమాల

గొనకొని వీఁడు నీకును శకుంతలకుం బ్రియనందనుండు సే
కొని భరియింపు మీతని శకుంతల సత్యము వల్కె సాధ్వి స
ద్వినుత మహాపతివ్రత వివేకముతో నని దివ్యవాణి దా
వినిచె ధరాధినాథునకు విస్మయ మందఁగఁ దత్సభాసదుల్‌.

("శకుంతల చెప్పింది నిజం. ఇతడు నీ పుత్రుడు", అని ఆకాశవాణి ప్రకటించింది.)

-:దివ్యవాణి నాకర్ణించి దుష్యంతుఁడు శకుంతలను గ్రహించుట:-

1_4_104 వచనము వసు - వసంత

వచనము

ఇట్లు దద్దయు దుఃఖించి విగతాశ యై బోరనఁ దొరఁగుభాష్పజలంబులందంద యొత్తికొనుచు నింకదైవంబ కాని యొండుశరణంబు లేదని యప్పరమపతివ్రత తనయుం దోడ్కొని క్రమ్మఱిపోవ నున్నయవసరంబున.

(శకుంతల ఇలా ఆశలు వదులుకొని కొడుకును వెంటబెట్టుకొని తిరిగివెళ్లబోతున్న సమయంలో.)

1_4_103 మధ్యాక్కర వసు - వసంత

మధ్యాక్కర

తడయక పుట్టిననాడ తల్లిచేఁ దండ్రిచే విడువఁ
బడితి నిప్పుడు పతిచేతను విడువఁబడియెద నొక్కొ
నుడువులు వేయునింకేల యిప్పాటినోములు దొల్లి
కడగి నోఁచితిని గాకేమి యనుచును గందె డెందమున.

(పుట్టినవెంటనే తల్లిదండ్రులచేత విడువబడ్డాను. ఇప్పుడు భర్తచేతకూడా విడువబడతానేమో అని దుఃఖించింది.)

1_4_102 వచనము వసు - వసంత

వచనము

ఇట్టి లోకవిరుద్ధంబుల కే మోడుదు మయుక్తంబు లయిన పలుకులు పలుకక నీయాశ్రమంబునకుం బొ మ్మనిన శకుంతల యత్యంత సంతాపితాంతఃకరణయై.

(ఇలాంటివాటికి మేము అంగీకరించము. తగనిమాటలు మాట్లాడక నీ ఆశ్రమానికి తిరిగివెళ్లు అని దుష్యంతుడు అనగా శకుంతల బాధపడి.)

1_4_101 కందము వసు - వసంత

కందము

పొడువునఁ బ్రాయంబునఁ గడుఁ
గడిఁదిబలంబునను జూడఁగా నసదృశు నీ
కొడు కని యీతని నెంతయు
నెడ మడుగుగఁ జూపఁ దెత్తె యిందఱు నగగన్‌.

(అందరూ నవ్వేటట్లు "ఇతడు నీ కొడుకు" అని నాకు చూపటానికి తీసుకువచ్చావా?)

Sunday, December 04, 2005

1_4_100 కందము వసు - వసంత

కందము

ఏ నెట నీ వెట సుతుఁ డెట
యే నెన్నఁడు దొల్లి చూచి యెఱుఁగను నిన్నున్‌
మానిను లసత్యవచనలు
నా నిట్టు లసత్యభాషణం బుచితంబే.

(నేనెక్కడ? నువ్వెక్కడ? కుమారుడెక్కడ? నిన్ను ఎప్పుడూ చూసినట్లు గుర్తులేదు. "ఆడవాళ్లు అబద్ధాలు మాట్లాడుతారు" అన్నట్లు నువ్వు ఇలా అసత్యమాడటం తగదు.)

1_4_99 వచనము వసు - వసంత

వచనము

అనిన శకుంతలపలుకులు సేకొన నొల్లక దుష్యంతుం డిట్లనియె.

(శకుంతల మాటలకు దుష్యంతుడు అంగీకరించక ఇలా అన్నాడు.)

1_4_98 కందము వసు - వసంత

కందము

క్షత్త్రవరుఁ డైన విశ్వా
మిత్రునకుఁ బవిత్ర యైన మేనకకున్‌ స
త్పుత్త్రినయి బొంకు పలుకఁగ
ధాత్త్రీతలనాథ యంత ధర్మేతరనే.

(విశ్వామిత్రుడికీ, మేనకకూ కుమార్తెనైన నేను అబద్ధమాడటానికి అంత ధర్మంలేనిదాన్ని కాను.)

1_4_97 కందము వసు - వసంత

కందము

కావున సత్యము మిక్కిలి
గా విమలప్రతిభఁ దలఁచి కణ్వాశ్రమసం
భావితసమయస్థితి దయఁ
గావింపుము గొడుకుఁ జూడు కరుణాదృష్టిన్‌.

(కాబట్టి కణ్వమహర్షి ఆశ్రమంలో చేసిన ప్రతిజ్ఞను నేరవేర్చు. నీ కొడుకును దయతో చూడు.)

1_4_96 తేటగీతి వసు - వసంత

తేటగీతి

సర్వతీర్థాభిహమనంబు సర్వవేద
సమధిగమము సత్యంబుతో సరియుఁ గావు
ఎఱుఁగు మెల్ల ధర్మంబుల కెందుఁ బెద్ద
యండ్రు సత్యంబు ధర్మజ్ఞులైన మునులు.

(తీర్థాలను సేవించటం, వేదాధ్యయనం చేయటం - ఇవి సత్యానికి సాటిరావు. ధర్మం బాగా తెలిసిన ఋషులు ఎల్లప్పుడూ అన్ని ధర్మాల కంటే సత్యమే గొప్పదని అంటారు.)

1_4_95 కందము వసు - వసంత

కందము

వెలయంగ నశ్వమేధం
బులు వేయును నొక్కసత్యమును నిరుగడలం
దుల నిడి తూఁపగ సత్యము
వలనన ములు సూపు గౌరవంబున పేర్మిన్‌.

(ఒక త్రాసులో వేయి అశ్వమేధాల ఫలాన్ని ఒక వైపు, ఒక్క సత్యవాక్యాన్ని మరొకవైపు ఉంచితే త్రాసు సత్యం వైపే మొగ్గు చూపుతుంది.)

1_4_94 చంపకమాల వసు - వసంత

చంపకమాల

నుతజనపూరితంబు లగు నూతులు నూఱిటికంటె సూనృత
వ్రత యొకబావి మేలు మఱి బావులు నూఱిటికంటె నొక్కస
త్ర్కతు వది మేలు తత్ర్కతుశతకంబునకంటె సుతుండు మేలు త
త్సతశతకంబుకంటె నొకసూనృత వాక్యము మేలు సూడఁగన్.

(నూరు చేదుడుబావుల కంటే ఒక దిగుడుబావి మేలు. నూరు దిగుడుబావుల కంటే ఒక యజ్ఞం మేలు. అటువంటి నూరు యజ్ఞాల కంటే ఒక పుత్రుడు మేలు. అటువంటి నూరుమంది పుత్రుల కంటే ఒక సత్యవాక్యం మంచిది.)

1_4_93 కందము వసు - వసంత

కందము

భూరిగుణు నిట్టికులవి
స్తార కుదారకు నుదారధర్మప్రియ ని
ష్కారణమ తప్పజూడఁగ
సారమతీ చనునె నాఁటి సత్యము గలుగన్.

(మన వివాహం నాటి నీ వరం సత్యమై నిలిచి ఉండగా, నీ పుత్రుడిని కాదనటం తగదు.)

1_4_92 కందము వసు - వసంత

కందము

అనఘుఁడు వంశకరుం డై
పెనుపున నీసుతుఁడు వాజపేయంబులు నూ
ఱొనరించు నని సరస్వతి
వినిచె మునులు వినఁగ నాకు వినువీథి దెసన్‌.

(నీ కుమారుడు వంశకర్త అయి నూరు వాజపేయయాగాలు చేస్తాడని మునులందరూ వినేలా ఆకాశవాణి నాతో చెప్పింది.)

1_4_91 మత్తేభము వసు - వసంత

మత్తేభము

విపరీత ప్రతిభాష లేమిటికి నిర్వీనాథ యీపుత్త్రగా
త్రపరిష్వంగసుఖంబు సేకొనుము ముక్తాహారకర్పూరసాం
ద్రపరాగ ప్రసరంబుఁ జందనముఁ జంద్రజ్యోత్స్నయుం బుత్త్రహా
త్రపరిష్వంగము నట్లు జీవులకు హృద్యంబే కడున్‌శీతమే.

(ఓ రాజా! విపరీతమైన ఈ మారుమాటలు ఎందుకు? ఈ పుత్రుడిని కౌగిలించుకో. ముత్యాలహారాలు, పచ్చకర్పూరపు పొడి, మంచి గంధం, వెన్నెల - ఇవన్నీ పుత్రుడి కౌగిలి కలిగించే ఆహ్లాదాన్ని కలిగించలేవు.)

Saturday, December 03, 2005

1_4_90 కందము వసు - వసంత

కందము

నీ పుణ్యతనువువలనన
యీపుత్త్రకుఁ డుద్భవిల్లి యెంతయు నొప్పున్‌
దీపంబువలన నొండొక
దీపము ప్రభవించినట్లు తేజం బెసఁగన్‌.

(ఒక దీపంనుండి మరొక దీపం పుట్టి వెలిగినట్లు నీ శరీరం నుండి ఈ పుత్రుడు జన్మించి ప్రకాశిస్తున్నాడు.)

1_4_89 వచనము విజయ్ - విక్రమాదిత్య

వచనము

పున్నామ్నో నరకా త్త్రాయత ఇతి పుత్త్ర యను వేదవచనంబు గలదు గావునఁ ఋణ్యాచారుం డయిన పుత్త్రుం డుభయపక్షంబులవారి నుద్ధరించుఁ గావున.

("పుత్" అనే నరకం నుండి తల్లిదండ్రులను రక్షిస్తాడు కాబట్టి పుత్త్రుడు అనే పేరు ఏర్పడింది అని వేదవచనం ఉంది. కాబట్టి ఉత్తముడైన పుత్రుడు తల్లిదండ్రుల ఉభయవంశాలవారిని ఉద్ధరిస్తాడు. కాబట్టి.)

1_4_88 కందము విజయ్ - విక్రమాదిత్య

కందము

తాన తననీడ నీళ్లుల
లో నేర్పడఁ జూచునట్లు లోకస్తుత త
త్సూను జనకుండు సూచి మ
హానందముఁ బొందు నతిశయప్రీతిమెయిన్.

(ఓ రాజా! నీళ్లలో తన నీడను తాను చూసినట్లు తండ్రి కొడుకును చూసి మహదానందాన్ని పొందుతాడు.)

1_4_87 కందము విజయ్ - విక్రమాదిత్య

కందము

విను గార్హపత్య మను న
య్యనలము విహరింపఁబడి తదాహవనీయం
బున వెలుఁగునట్ల వెలుఁగును
జనకుఁడు దాఁ బుత్త్రుఁ డై నిజద్యుతితోడన్.

(గార్హపత్యం అనే అగ్ని ప్రజ్వలించిన తర్వాత ఆహవనీయం అనే అగ్నిలో ప్రకాశించినట్లు తండ్రి తానే పుత్రుడై ప్రకాశిస్తాడు.)

Friday, December 02, 2005

1_4_86 వచనము విజయ్ - విక్రమాదిత్య

వచనము

మఱియు భార్య పురుషునం దర్ధం బగుటం జేసి పురుషునకు మున్న పరేతయైన పతివ్రత పరలోకంబునం దనపురుషుం గూడఁ దదాగమనంబు ప్రతీక్షించుచుండుఁ బురుషుండు మున్న పరేతుం డైనఁ బదంపడి తానును బరేతయై తనపురుషుం గూడ నరుగు నట్టిభార్య నవమానించుట ధర్మవిరోధంబు మఱియునుం పురుషుండు భార్యయందుఁ బ్రవేశించి గర్భంబునఁ బుత్త్రుండై తాన యుద్భవిల్లు గావున నఙ్గాదఙ్గా త్సమ్భవసి యను నిది యాదిగాఁ గల వేదవచనంబులయందును జనకుండును బుత్త్రుండును ననుభేదంబు లేదు.

(భార్యను అవమానించటం ధర్మవిరోధం. భర్త భార్యగర్భంలో ప్రవేశించి పుత్రుడై జన్మిస్తాడు కాబట్టి "అంగాత్ అంగాత్ సంభవసి" అనే వేదవచనాల ప్రకారం తండ్రికొడుకులకు భేదం లేదు.)

Thursday, November 24, 2005

1_4_85 సీసము + ఆటవెలది విజయ్ - విక్రమాదిత్య

సీసము

ధర్మార్థకామసాధన కుపకరణంబు
        గృహనీతివిద్యకు గృహము విమల
చారిత్రశిక్ష కాచార్యకం బన్వయ
        స్థితికి మూలంబు సద్గతికి నూఁత
గౌరవంబున కేకకారణం బున్నత
        స్థిరగుణమణుల కాకరము హృదయ
సంతోషమునకు సంజనకంబు భార్యయ
        చూవె భర్తకు నొండ్లు గావు ప్రియము

ఆటవెలది

లెట్టి ఘట్టములను నెట్టి యాపదలను
నెట్టితీరములను ముట్టఁబడిన
వంతలెల్లఁ బాయు నింతులఁ బ్రజలను
నొనరఁ జూడఁగనిన జనుల కెందు.

(ఆదర్శగుణాలకు నెలవైన భార్యకంటే భర్తకు సంతోషం కలిగించేది వేరొకటి లేదు. ఆలుబిడ్డలను ఆప్యాయంగా చూసుకునేవారికి ఎలాంటి దుఃఖాలైనా తొలగిపోతాయి.)

1_4_84 వచనము విజయ్ - విక్రమాదిత్య

వచనము

మఱియును.

(అంతే కాక.)

1_4_83 కందము విజయ్ - విక్రమాదిత్య

కందము

సంతతగృహమేధి ఫలం
బంతయుఁ బడయంగ నోపు ననుగుణభార్యా
వంతుం డగువాఁడు క్రియా
వంతుఁడు దాంతుండుఁ బుత్త్రవంతుండు నగున్.

(అనుకూలవతి అయిన భార్యగలవాడు గార్హస్థ్యధర్మాన్ని ఆచరించే గృహస్థుడు పొందే ఫలాన్నంతా అందుకోగలుగుతాడు.)

1_4_82 కందము విజయ్ - విక్రమాదిత్య

కందము

సతియును గుణవతియుఁ బ్రజా
వతియు ననువ్రతయు నైన వనిత నవజ్ఞా
న్వితదృష్టిఁ జూచు నతి దు
ర్మతి కిహముం బరముఁ గలదె మతిఁ బరికింపన్.

(గుణవతి అయిన భార్యను తిరస్కారభావంతో చూసే భర్తకు ఇహపరాలు ఉంటాయా?)

1_4_81 కందము విజయ్ - విక్రమాదిత్య

కందము

నా యెఱిఁగినట్ల యిన్నియు
నీ యిచ్చిన వరము ధారుణీవర యెఱుఁగున్
నాయందుఁ దొంటియట్టుల
చేయు మనుగ్రహ మవజ్ఞ సేయం దగునే.

(నీ వరం గురించి నాకెలా తెలుసో అలాగే ఆ మహాపదార్థాలకు కూడా తెలుసు. కాబట్టి ఇంతకు ముందులాగానే నన్ను అనుగ్రహించు. నన్ను అవమానించటం ఉచితమేనా?)

Wednesday, November 23, 2005

1_4_80 చంపకమాల వోలం - వసంత

చంపకమాల

విమలయశోనిధీ పురుషవృత్త మెఱుంగుచునుండుఁ జూవె వే
దములును బంచభూతములు ధర్మువు సంధ్యలు నంతరాత్మయున్
యముఁడును జంద్రసూర్యులు నహంబును రాత్రియు నన్మహాపదా
ర్థము లివి యుండఁగా నరుఁడు దక్కొననేర్చునే తన్ను మ్రుచ్చిలన్.

( పంచభూతాలు మొదలైన కొన్ని మహాపదార్థాలు మనుషుల ప్రవర్తనను ఎప్పుడూ గమనిస్తూనే ఉంటాయి. అవి ఉండగా మనిషి తనను తాను వంచించుకోగలడా? )

1_4_79 ఆటవెలది వోలం - వసంత

ఆటవెలది

ఏల యెఱుక లేని యితరుల యట్ల నీ
వెఱుఁగ ననుచుఁ బలికె దెఱిఁగియెఱిఁగి
యేన కాని దీని నెఱుఁగ రిందొరు లని
తప్పఁ బలుక నగునె ధార్మికులకు.

( అన్నీ తెలిసికూడా తెలియదు అని తెలివిలేనివాడిలా ఎందుకు మాట్లాడుతున్నావు? ఇది నాకు తప్ప ఇక్కడ ఇంకెవరికీ తెలియదు అని ధర్మాత్ములు అబద్ధమాడవచ్చా? )

-:కుపిత యైన శకుంతల దుష్యంతునకు ధర్మప్రబోధ మొనరించుట:-

1_4_78 వచనము వోలం - వసంత

వచనము

అనిన విని వెల్ల నై వెచ్చనూర్చి నిశ్చేష్టితయై కెందమ్మి రేకులవలనందొరంగు జలకణంబుల పోలెఁ గోపారుణితనయనంబుల బాష్పకణంబులు దొరఁగం దలవాంచి యారాజుం గటాక్షించుచు హృదయసంతాపంబు దనకుఁ దాన యుపశమించుకొని పెద్దయుం బ్రొద్దు చింతించి శకుంతల యా రాజున కిట్లనియె.

( అది విని శకుంతల తెల్లబోయి, చేష్టలుడిగి, కోపంతో ఎర్రబారిన కళ్లనుండి కన్నీరు వస్తుండగా, తలవంచుకొని, తన వేదన అణచుకొని, చాలాసేపు ఆలోచించి ఇలా అన్నది. )

1_4_77 కందము వోలం - వసంత

కందము

ఏ నెఱుఁగ నిన్ను నెక్కడి
దానవు మిన్నకయ యనుచితంబులు పలుకం
గానేల యరుగు మంబురు
హానన యెందుండి వచ్చి తందులకు వడిన్.

( నువ్వెవరో నాకు తెలియదు. తగని మాటలు మాట్లాడటం ఎందుకు? ఎక్కడినుండి వచ్చావో అక్కడికే తిరిగివెళ్లు. )

Tuesday, November 22, 2005

1_4_76 వచనము వోలం - వసంత

వచనము

అనిన విని దుష్యంతుండు దాని నంతయు నెఱింగియు నెఱుంగనివాఁడ పోలె నిట్లనియె.

(ఈ మాటలు విని దుష్యంతుడు విషయం తెలిసినా తెలియనివాడిలా ఇలా అన్నాడు.)

-:దుష్యంతుఁడు శకుంతలను నిరాకరించుట:-

1_4_75 కందము వోలం - వసంత

కందము

బాలార్కతేజుఁ డగు నీ
బాలుఁడు నీకొడుకు వీని బౌరవకుల ర
త్నాలంకారు నుదార గు
ణాలయు యువరాజుఁ జేయు మభిషేకముతోన్.

(బాలసూర్యుడిలా ఉన్న ఈ భరతుడు నీ కొడుకు. పౌరవవంశానికి అలంకారమైన ఇతడిని యువరాజుగా అభిషేకించు.)

1_4_74 కందము వోలం - వసంత

కందము

జననాథ వేఁట నెపమున
గొనకొని కణ్వాశ్రమమునకున్ వచ్చి ముదం
బున నందు నాకు నీయి
చ్చినవరము దలంప వలయుఁ జిత్తములోనన్.

(వేట అనే నెపంతో కావాలని కణ్వాశ్రమానికి వచ్చి నాకు ఇచ్చిన వరాన్ని జ్ఞాపకం చేసుకో. )

Monday, November 21, 2005

1_4_73 వచనము వోలం - వసంత

వచనము

అయినను వచ్చి మిన్నక పోవంగాదు కావున నా పూర్వవృత్తాంతం బెల్ల నెఱింగించి యే నిక్కుమారుం జూపుదు నని మనంబున నిశ్చయించి శకుంతల యా రాజున కిట్లనియె.

(అయినా ఇంతదూరం వచ్చినందుకు, జరిగిన విషయం జ్ఞాపకం చేసి భరతుడిని చూపాలని నిశ్చయించుకొని శకుంతల దుష్యంతుడితో ఇలా అన్నది.)

1_4_72 కందము వోలం - వసంత

కందము

మఱచినఁ దలఁపింపఁగ నగు
నెఱుఁగనినాఁ డెల్లపాట నెఱిఁగింప నగున్
మఱి యెఱిఁగి యెఱుఁగ నొల్లని
కఱటిం దెలుపంగఁ గమలగర్భునివశమే.

(మరచిపోయినవారికి జ్ఞాపకం చేయవచ్చు. తెలియనివారికి తెలియజెప్పవచ్చు. తెలిసికూడా తెలియనట్లు నటించేవారికి తెలియజేయటం బ్రహ్మతరం కూడా కాదు.)

1_4_71 వచనము వోలం - వసంత

వచనము

అని తలంచి చింతాక్రాంత యై శకుంతల వెండియు నాత్మగంబున.

(అని బాధపడి, శకుంతల ఇలా అనుకున్నది.)

Sunday, November 20, 2005

1_4_70 చంపకమాల వోలం - వసంత

చంపకమాల

తలఁపఁగ నాఁడు వల్కినవిధం బెడఁ దప్పఁగ వీడె నొక్కొ చూ
డ్కులు విరసంబులై కరము క్రూరము లైన నిమిత్త మేమియో
కలయఁగఁ బల్కరించి రుపకారులు నై రని నమ్మియుండఁగా
వలవదు బుద్ధిమంతులు నవప్రియు లైన ధరాధినాథులన్.

(పెళ్లినాటి మాటలను మనసు మారి వదిలిపెట్టాడా? అతడి చూపులు కఠినంగా ఉన్నాయి. కారణమేమిటో? కొత్తవారు కలుపుగోలుతనంతో పలకరించి, ఉపకారులుగా వ్యవహరించినంత మాత్రాన బుద్ధిమంతులు వారిని నమ్మకూడదు.)

1_4_69 కందము వోలం - వసంత

కందము

ఎఱుఁగ డొకొ నన్ను నెఱిఁగియు
నెఱుఁగని యట్లుండు నొక్కొ యెడ దవ్వగుడున్
మఱచెనొకొ ముగ్ధు లధిపులు
మఱువరె బహుకార్యభారమగ్నులు కారే.

(ఇతడు నన్ను గుర్తించలేదా? లేక గుర్తించికూడా నటిస్తున్నాడా? చాలాకాలం కావటం చేత మరచాడేమో.)

1_4_68 కందము వోలం - వసంత

కందము

గురునాశ్రమంబునను ము
న్నరుదుగఁ బతివలనఁ గనిన యనురాగము నా
దరణము ననుగ్రహంబును
గరుణయు సంభ్రమము నపుడు గానక యెడలోన్.

(పూర్వం ఆశ్రమంలో దుష్యంతుడు తనపై చూపిన ఆదరం ఇప్పుడు కనపడకపోవటం చూసి మనసులో.)

1_4_67 వచనము వోలం - వసంత

వచనము

కావున నీ విక్కుమారునిం దోడ్కొని నీ పతి పాలికి నరుగు మని మహా తపోధను లైన తనశిష్యులం గొందఱఁ దోడువంచిన శకుంతలయు దౌష్యంతుం దోడ్కొని దుష్యంతు పాలికి వచ్చి సకల సామంత మంత్రి పురోహిత ప్రధాన పౌరజన పరివృతుండై యున్న యారాజుం గనుంగొని.

(కాబట్టి నువ్వు నీ కుమారుడితో నీ భర్త దగ్గరకు వెళ్లు అని చెప్పి పంపాడు. శకుంతల భరతుడిని తీసుకొని దుష్యంతుడి దగ్గరకు వెళ్లి నిండుసభలో ఉన్న ఆ రాజును చూసి.)

-:కణ్వమహాముని శకుంతలను దుష్యంతుపాలికిం బంపుట:-

1_4_66 ఆటవెలది వోలం - వసంత

ఆటవెలది

ఎట్టిసాధ్వులకును బుట్టినయిండ్లను
బెద్దకాల మునికి తద్ద తగదు
పతులకడన యునికి సతులకు
ధర్మువు సతుల కేడుగడయుఁ బతుల చూవె.

(పతివ్రతలకు కూడా పుట్టినిళ్లలో ఎక్కువకాలం ఉండటం ఉచితం కాదు.)

Saturday, November 19, 2005

1_4_65 వచనము వోలం - వసంత

వచనము

ఇట్లు వనంబులోని సర్వసత్త్వంబులను దన మహాసత్త్వంబునం జేసి దమియించుచున్న యాతనిం జూచి యాశ్చర్యం బంది యందులమునులెల్ల నాతనికి సర్వదమనుం డను నామంబుఁ జేసిరి కణ్వమహామునియు నక్కుమారు నుదార తేజోరూప విక్రమగుణంబులకు సంతసిల్లి వీఁ డఖిలభువన యౌవరాజ్యంబునకు సమర్థుండగు సమయం బరుగుదెంచె నని విచారించి యొక్కనాఁడు కూఁతున కిట్లనియె.

(ఇలా అడవిలోని జంతువులన్నింటినీ తన బలంతో అణచివేస్తున్న భరతుడిని చూసి మునులు అతడికి "సర్వదమనుడు" అనే పేరు పెట్టారు. కణ్వుడు కూడా భరతుడు యువరాజుగా ఉండదగిన సమయం వచ్చిందని భావించి శకుంతలతో ఇలా అన్నాడు.)

Friday, November 18, 2005

1_4_64 మత్తేభము వోలం - వసంత

మత్తేభము

అమితోగ్రాటవిలోనఁ గ్రుమ్మరు వరాహ వ్యాళ శార్దూలఖ
డ్గమదేభాదులఁ బట్టి తెచ్చి ఘనుఁ డై కణ్వాశ్రమోపాంత భూ
జములం దోలిన కట్టుచుం బలిమిమై శాకుంతలుం డొప్పె వ
న్యమదేభంబుల నెక్కుచుం దగిలి నానాశైశవక్రీడలన్.

(అడవిలోని మృగాలను పట్టితెచ్చి ఆశ్రమంలోని చెట్లకు కట్టివేస్తూ, మదించిన ఏనుగులపైన స్వారీచేస్తూ తన బాల్యక్రీడలను ప్రదర్శించేవాడు.)

1_4_63 వచనము వోలం - వసంత

వచనము

నీ ధర్మ చరితంబునకు మెచ్చితి నీ కోరినవరం బిచ్చెద వేఁడు మనిన శకుంతలయు నా చిత్తం బెప్పుడు ధర్మువునంద తగిలియుండను నా కుద్భవిల్లెడు పుత్త్రుండు దీర్ఘాయురారోగ్యైశ్వర్య బల సమన్వితుండును వంశకర్తయుఁ గాను వలయు ననిన నమ్మహాముని కరుణించి దాని కోరినవరం బిచ్చి యథాకాల విధుల గర్భ సంస్కార రక్షణంబులు సేయించి యున్నంత వర్షత్రయంబు సంపూర్ణం బైన శకుంతలకు భరతుం డుదయించి కణ్వనిర్వర్తితజాత కర్మాది క్రియాకలాపు డయు పెరుఁగుచుఁ గరతలాలంకృత చక్రుండును జక్రవర్తి లక్షణలక్షితుండును సింహసంహననుండును దీర్ఘబాహుండును ననంత జవసత్త్వ సంపన్నుండును నై పరగుచు.

(నీ ధర్మప్రవర్తనకు మెచ్చాను. నువ్వు కోరిన వరం ఇస్తాను అని కణ్వమహర్షి అనగా శకుంతల, "నా మనస్సు ఎప్పుడూ ధర్మంపైనే లగ్నమై ఉండాలి. నా కుమారుడు వంశకర్తగా ప్రసిద్ధికెక్కాలి", అని కోరింది. కణ్వుడు అలాగే అనుగ్రహించగా కొంతకాలానికి భరతుడు చక్రవర్తి లక్షణాలతో జన్మించి ఆశ్రమంలో పెరగసాగాడు.)

1_4_62 తేటగీతి వోలం - వసంత

తేటగీతి

తల్లి నీకులగోత్ర సౌందర్యములకుఁ
దగినపతిఁ గంటి దానికిఁ దగఁగ గర్భ
మయ్యె నీదుగర్భమున వాఁ డఖిలభువన
వనమహనీయుఁ డగు చక్రవర్తి సుమ్ము.

(తల్లీ, నీకు తగిన భర్తను పొందావు. అందుకు తగినట్లు గర్భం కూడా ధరించావు. నీ పుత్రుడు భూమినంతా పరిపాలించగల చక్రవర్తి అవుతాడు.)

-:భరతుని జననము:-

1_4_61 వచనము వోలం - వసంత

వచనము

అనిన విని శకుంతల కెంతయు సంతోషంబుగా దాని కోరిన వరంబిచ్చి గాంధర్వ వివాహంబున నభిమతసుఖంబు లనుభవించి యక్కోమలి వీడ్కొని నిన్నుఁ దోడ్కొని రా నస్మత్ప్రధాన వర్గంబుఁ గణ్వ మహాముని పాలికింబుత్తెంచెదనని యూఱడ నొడివి దుష్యంతుండు నిజపురంబునకుం జనియె. నిట శకుంతలయుఁ దన చేసిన దాని మునివరుం డెఱింగి యలిగెడునోయని వెఱచుచుండె నంత నమ్మహాముని వనంబున నుండి కందమూల ఫలంబులు గొని చనుదెంచి లలిత శృంగారభావంబున లజ్జావనత వదనయు నతి భీతచిత్తియునై యున్న కూఁతుం జూచి తనదివ్యజ్ఞానంబున నంత వృత్తాంతంబు నెఱింగి క్షత్త్రియులకు గాంధర్వ వివాహంబు విధిచోదితంబ యని సంతసిల్లి శకుంతల కిట్లనియె.

( దుష్యంతుడు అందుకు అంగీకరించి ఆమెను గాంధర్వవివాహం చేసుకున్నాడు. తరువాత, "నిన్ను తీసుకురావటానికి మంత్రులను కణ్వమహాముని దగ్గరకు పంపుతాను", అని ఆమెను ఒప్పించి తన నగరానికి వెళ్లిపోయాడు. తాను చేసిన పనికి కణ్వమహర్షి ఆగ్రహిస్తాడేమో అని శకుంతల భయపడసాగింది. కణ్వుడు దివ్యదృష్టితో జరిగిన విషయం తెలుసుకొని క్షత్త్రియులకు గాంధర్వవివాహం శాస్త్రసమ్మతమే అని సంతోషించి శకుంతలతో ఇలా అన్నాడు. )

1_4_60 చంపకమాల వోలం - వసంత

చంపకమాల

నరనుత నీ ప్రసాదమున నా కుదయించిన నందనున్ మహీ
గురుతర యౌవరాజ్యమునకున్ దయతో నభిషిక్తుఁ జేయఁగా
వరము ప్రసన్నబుద్ధి ననవద్యముగా దయసేయు నెమ్మితో
నిరుపమకీర్తి యట్లయిన నీకును నాకును సంగమం బగున్.

(నీ అనుగ్రహం వల్ల పుట్టిన నా పుత్రుడే నీ రాజ్యానికి యువరాజు అయ్యే వరం ప్రసాదిస్తే మన వివాహం జరుగుతుంది.)

1_4_59 వచనము వోలం - వసంత

వచనము

అని దుష్యంతుడు గాంధర్వవివాహస్వరూపంబు సెప్పి శకుంతల నొడంబఱిచిన నది యిట్లనియె.

(అని చెప్పి శకుంతలను ఒప్పించాడు. అప్పుడు ఆమె దుష్యంతుడితో ఇలా అన్నది.)

1_4_58 తేటగీతి వోలం - వసంత

తేటగీతి

తనకు మఱి తాన చుట్టంబు తాన తనకు
గతియుఁ దన్నిచ్చుచోఁ దాన కర్త యనఁగ
వనజనేత్ర గాంధర్వవివాహ మతి ర
హస్యమును నమంత్రకమును నగుచు నొప్పు.

(తనకు తానే చుట్టం కావటం, తనకు తానే దిక్కు కావటం, తనను తానే ఇచ్చుకుంటున్నప్పుడు తానే కర్త కావటం అనే లక్షణాలు గల గాంధర్వవివాహం ఎంతో రహస్యంగా, మంత్రతంత్రాలు లేకుండా జరుగుతుంది.)

1_4_57 వచనము వోలం - వసంత

వచనము

అనిన దానికి దుష్యంతుం డి ట్లనియె.

(అప్పుడు దుష్యంతుడు ఇలా అన్నాడు.)

1_4_56 కందము వోలం - వసంత

కందము

కరుణానిరతులు ధర్మ
స్వరూపులింతకు మదీయజనకులు సనుదెం
తురు వారు వచ్చి నీకి
చ్చిరేని పాణిగ్రహణము సేయుము నన్నున్.

(కణ్వమహర్షులు వచ్చి కన్యాదానం చేస్తే మన వివాహం జరుగుతుంది.)

1_4_55 సీసము + ఆటవెలది వోలం - వసంత

సీసము

బ్రాహ్మంబు దైవంబుఁ బరఁగ నార్షంబుఁ బ్రా
        జాపత్యమును రాక్షసంబు నాసు
రంబు గాంధర్వంబు రమణఁ బైశాచంబు
        నను నెనిమిది వివాహములయందుఁ
గడుఁ బ్రశస్తములు సత్క్షత్త్ర వంశ్యులకు గాం
        ధర్వ రాక్షసములు ధర్మయుక్తి
నీకును నాకును నెమ్మిఁ బరస్పర
        ప్రేమంబు గాముండు పెంపఁ దొడఁగెఁ

ఆటవెలది

గాన యెడయుఁ జేయఁగా నేల గాంధర్వ
విధి వివాహమగుట వినవె యుక్త
మనిన లజ్జఁ జేసి యవనత వదనయై
యాలతాంగి యిట్టు లనియెఁ బతికి.

(పైన చెప్పిన ఎనిమిది రకాల వివాహాలలో క్షత్రియులకు గాంధర్వ, రాక్షసవివాహాలు తగినవి. మనమిద్దరం గాంధర్వవివాహం చేసుకోవటం సమంజసం అని దుష్యంతుడు అనగా శకుంతల సిగ్గుతో తలవంచుకొని ఇలా అన్నది.)

1_4_54 ఉత్పలమాల వోలం - వసంత

ఉత్పలమాల

ఈ మునిపల్లె నుండు టిది యేల కరం బనురాగ మొప్పఁగా
భామిని నాకు భార్య వయి భాసురలీల నశేషరాజ్య ల
క్ష్మీ మహనీయ సౌఖ్యముల మేలుగ నందు మనిందితేందుపా
దామలతుంగ హర్మ్యముల హారిహిరణ్మయకుట్టిమంబులన్.

(నువ్వు ఈ మునిపల్లెలో ఉండటం ఎందుకు? నా భార్యవై రాజ్యసుఖాలు అనుభవించు.)

1_4_53 కందము వోలం - వసంత

కందము

ఈ వల్కలాజినములకు
నీ వన్యఫలాశనముల కీవిటపకుటీ
రావాసములకు నుచితమె
నీ విలసిత రూపకాంతి నిర్మలగుణముల్.

(ఈ నారచీరలు, అడవిపండ్లు, పర్ణశాల నీకు తగినవి కావు.)

Thursday, November 17, 2005

1_4_52 వచనము వోలం - వసంత

వచనము

అనుచు మదనాతురుం డయి దుష్యంతుండు దనయం దక్కోమలియనురాగం బుపలక్షించి యిట్లనియె.

(అని అనుకుంటూ, శకుంతల కూడా తనను ఇష్టపడుతున్న విషయం గమనించి ఇలా అన్నాడు.)

1_4_51 చంపకమాల వోలం - వసంత

చంపకమాల

ఇది మునినాథకన్య యని యెంతయు నిస్పృహవృత్తి నున్న నా
హృదయము రాజపుత్త్రి నని యిక్కమలాక్షి నిజాభిజాత్యసం
పద నెఱిఁగించినన్ మదనబాణపరంపర కిప్పు డుండ నా
స్పద మయి సంచలించె నళిపాతవికంపితపంకజాకృతిన్.

( శకుంతల మునికన్యయేమో అని నిరాశతో ఉన్న నా మనసు ఆమె రాజపుత్రి అని తెలిసిన తరువాత తుమ్మెదలు వాలటం చేత కంపించిన పద్మంలా చలించింది. )

-:దుష్యంతుండు శకుంతలను వివాహంబు సేసికొనఁ గోరుట:-

1_4_50 వచనము వంశీ - సూరి

వచనము

అనం బరఁగిన శాస్త్రార్థంబున నేము దీనికి భయత్రాతల మగుటంజేసి గురుల మిదియును మాచే నభివర్ధిత యగుటంజేసి హృదయానందని యైన కూఁతురని కణ్వమహామును లమ్మునికిఁ జెప్పినవిధం బంతయు శకుంతల సెప్పిన విని దుష్యంతుం డాత్మగతంబున.

(ఆ విధంగా మేము శకుంతలకు గురువులము, ఆమె మాకు కూతురు అని కణ్వమహాముని ఆ మునికి చెప్పిన విషయం శకుంతల దుష్యంతుడికి చెప్పింది.దుష్యంతుడు ఇలా ఆలోచించాడు.)

Wednesday, November 16, 2005

1_4_49 మధురాక్కర విజయ్ - విక్రమాదిత్య

మధురాక్కర

తనర జనకుండు నన్నప్రదాతయును భయత్రాత
యును ననఁగ నింతులకు మువ్వు రొగిన గురువులు వీర
లనఘ యుపనేత మఱియు నిరంతరాధ్యాపకుండు
ననఁగఁ బురుషున కియ్యేవు రనయంబును గురువులు.

(తండ్రి, అన్నం పెట్టి పోషించిన వాడు, భయం నుండి రక్షించినవాడు - వీరు ముగ్గురూ స్త్రీలకు తండ్రులు, గురువులు. పురుషులకు ఈ ముగ్గురే కాక ఉపనయనం చేసిన వాడు, చదువు చెప్పిన గురువు కూడా తండ్రులు, గురువులు అవుతారు.)

1_4_48 వచనము విజయ్ - విక్రమాదిత్య

వచనము

అంత నేము శిష్యగణంబులతోడ సమిత్కుసుమ ఫలాహరణార్థం బక్కడకుం జని యమ్మాలినీ పులినతలంబున శకుంతరక్షిత యై యున్న కూఁతు నత్యంతకాంతిమతి నవనీతలంబున కవతరించిన తరుణ శశిరేఖయుంబోని దాని నెత్తుకొని వచ్చి శకుంతరక్షిత యగుటఁ జేసి శకుంతల యను నామం బిడి కరంబు గారవంబునం బెనిచితిమి.

(మేము (కణ్వుడు) ఆ సమయంలో అక్కడికి వెళ్లి ఈ అమ్మాయిని చూసి ఎత్తుకొని వచ్చాము. శకుంతాలు రక్షించాయి కాబట్టి ఈమెకు శకుంతల అనే పేరు పెట్టి పెంచాము.)

1_4_47 ఆటవెలది విజయ్ - విక్రమాదిత్య

ఆటవెలది

చెలఁగి లేవ నేడ్చు చిఱుతుకదానిఁ గ్ర
వ్యాదఘోరమృగము లశనబుద్ధిఁ
బట్టకుండఁ జెట్టుపలఁ గప్పి రక్షించు
కొని శకుంతతతులు గూడియుండె.

(ఆ శిశువు పైకిలేవటానికి చేతకాక ఏడుస్తూ ఉంటే ఆ అరుపు విని రాక్షసులూ, క్రూరమృగాలూ పట్టుకుపోకుండా పక్షులు గుమిగూడి రక్షించాయి.)

1_4_46 వచనము విజయ్ - విక్రమాదిత్య

వచనము

మేనకయు విశ్వామిత్రు నిష్టంబునకుం దగిన కామోపభోగంబులం బెద్దకాలంబు రమియించిన నయ్యిద్దఱకు నిక్కన్యక పుట్టిన దీని మాలిని యను నొక్కయేటి పులినతలంబునం బెట్టి మేనక దేవలోకంబునకుం జనియె విశ్వామిత్రుండును దపోవనంబునకుం జనియె నంత నమ్ముని ప్రభావంబున.

(అలా వారికి శకుంతల పుట్టగా, మేనక ఆ బిడ్డను మాలినీనదీతీరాన ఉంచి స్వర్గానికి వెళ్లిపోయింది. విశ్వామిత్రుడు కూడా తపోవనానికి వెళ్లిపోయాడు.)

1_4_45 కందము విజయ్ - విక్రమాదిత్య

కందము

అందుఁ దనదృష్టి నాటుడుఁ
గందర్ప నిశాత సాయకంబులు పెలుచన్
డెందముఁ గాఁడిన ధృతి సెడి
కంది మునీంద్రుండు దానిఁ గవయం దివిరెన్.

(విశ్వామిత్రుడు ఆమె సౌందర్యం చూసి నిగ్రహం కోల్పోయాడు.)

1_4_44 చంపకమాల హర్ష - వసంత

చంపకమాల

అలసత యొప్పఁగాఁ దరుణి యమ్మునివల్లభుమ్రోల నున్న స
మ్మిళితసుగంధబంధురసమీరవశంబునఁ దూలి బాల పై
వలు వెడలన్ బయల్పడియె వల్దకుచంబులుఁ గక్షయుగ్మమున్
లలితకృశోదరంబుఁ దరళత్రివళీయుత రోమరాజియున్.

(మేనక అలసటతో ఆ ముని ముందు ఉండగా.)

1_4_43 కందము హర్ష - వసంత

కందము

అంబుజలోచన గని విన
యంబున నమ్మునికి మ్రొక్కి యనురాగముతో
డం బుష్పాపచయ వ్యా
జంబున విహరించుచుండె సఖులుం దానున్.

(మేనక అతడికి నమస్కరించి, పూలుకోసే నెపంతో విహరించసాగింది.)

1_4_42 చంపకమాల హర్ష - వసంత

చంపకమాల

అనిమిషకాంతయున్ నవలతాంతవిభూషణలీల నల్లన
ల్లన వనకేళిలాలస విలాసగతిం జనుదెంచి ముందటం
గనియె మహామునిప్రవరుఁ గౌశికుఁ గౌశిక చిత్తభీతి సం
జనన మహాతపశ్చరణ సంయతచిత్తు నిరస్తచిత్తజున్.

(మేనక వచ్చి నిరస్తచిత్తజుడైన విశ్వామిత్రుడిని చూసింది.)

1_4_41 వచనము హర్ష - వసంత

వచనము

అంత.

(తరువాత.)

1_4_40 కందము హర్ష - వసంత

కందము

చల్లని దక్షిణ మారుత
మల్లన వీతెంచెఁ దగిలి యా లలనాధ
మ్మిల్ల కుసుమాంగనరాగస
ముల్లసనసుగంధి యగుచు మునివరుమీఁదన్.

(చల్లని దక్షిణమారుతం ఆమె కొప్పులోని పూలవాసనలచేత, ఆమె మైపూతల సుగంధాలచేత పరిమళిస్తూ విశ్వామిత్రుడిపైన వీచింది.)

1_4_39 వచనము హర్ష - వసంత

వచనము

అయినను నానేర్చు విధంబున నమ్మునివరుచిత్తంబు మెత్తన చిత్తజాయత్తంబగునట్లుగాఁ జేసెద నని వాసవు వీడ్కొని మేనక తనకు మందమలయానిలంబు దోడుగాఁ జనుదెంచి హిమవత్పర్వతప్రదేశంబునం దపంబు సేయుచున్న విశ్వామిత్రు తపోవనంబు సొత్తెంచిన.

(అయినా నాకు వీలైనంత ప్రయత్నం చేస్తాను అని బయలుదేరి హిమాలయాలలో ఉన్న విశ్వామిత్రుడి తపోవనంలో ప్రవేశించింది.)

1_4_38 ఉత్పలమాల హర్ష - వసంత

ఉత్పలమాల

అమ్ముని యల్గి చూచుడును నా క్షణమాత్రన గోత్రధారుణీ
ధ్రమ్ములు వ్రయ్యు నయ్యిసుము దక్కఁగ నంబుధు లింకు మూఁడు లో
కమ్ములు దిర్దిరం దిరుగు గాడ్పు చలింపఁగ నోడు నుగ్రతం
బమ్మిన యట్టి కోపపరుపాలికి భామలు వోవ నోడరే.

(ఉగ్రస్వభావుడైన ఆ ముని దగ్గరకు పోవడానికి స్త్రీలు భయపడరా?)

Tuesday, November 15, 2005

1_4_37 చంపకమాల హర్ష - వసంత

చంపకమాల

వనజభవప్రభావుఁ డగువాని వసిష్ఠు నపత్యశోక మ
న్వననిధిలోన ముంచిన యవారితసత్త్వుఁడు నిన్నుఁ దొట్టి యీ
యనిమిషు లెల్ల వానికి భయంపడుచుండుదు రట్టి యుగ్రకో
పనుకడ కిప్పు డేఁగు మని పాడియె యిప్పని నన్నుఁ బంపఁగన్.

(వసిష్ఠుడికి కూడా పుత్రశోకం కలిగించిన అనివార్యతేజస్వి విశ్వామిత్రుడు. నీతో సహా దేవతలందరికీ అతడంటే భయం. అలాంటి కోపస్వభావుడి దగ్గరకు నన్ను వెళ్లమనటం న్యాయమేనా?)

1_4_36 సీసము + ఆటవెలది హర్ష - వసంత

సీసము

అనఘుఁడు రాజర్షి యై తపశ్శక్తిమై
        బ్రహ్మర్షిభావంబుఁ బడసి యున్న
సన్మునీశ్వరుఁడు విశ్వామిత్రుఁ డతిఘోర
        తపము సేయుచునున్నఁ దత్తపమున
కెంతయు వెఱచి దేవేశ్వరుఁ డప్సరో
        గణములలో నగ్రగణ్య యైన
దాని మేనక యను ధవలాక్షిఁ బిలిచి వి
        శ్వామిత్రు పాలికిఁ జని తదీయ

ఆటవెలది

ఘోరతపము చెఱిచి కోమలి నాదైన
దేవరాజ్యమహిమఁ దివిరి నీవు
గావు మనిన నదియుఁ గడు భయంపడి యమ
రేశ్వరునకు మ్రొక్కి యిట్టు లనియె.

(విశ్వామిత్రుడు చేస్తున్న తపస్సుకు ఇంద్రుడు భయపడి, ఆ తపస్సు భగ్నం చేయమని మేనకకు చెప్పగా ఆమె భయపడి ఇలా అన్నది.)

1_4_35 వచనము హర్ష - వసంత

వచనము

నాజన్మప్రకారంబు మాయయ్య యమ్మునికిం జెప్పినవిధంబు చెప్పెదఁ జిత్తగించి విను మని యాదుష్యంతునకు శకుంతల యిట్లనియె.

(ఆ విషయం చెపుతాను వినండి.)

1_4_34 కందము హర్ష - వసంత

కందము

ఇక్కమలాక్షి శకుంతల
యెక్కడియది దీనిజన్మ మెవ్విధ మని త
మ్మొక్క మునినాథుఁ డడిగిన
నిక్కాశ్యపు లర్థిఁ జెప్పి రేను వినంగన్.

(ఒకసారి ఒక ముని కణ్వులవారిని నా పుట్టుక గురించి అడగగా, ఆయన సమాధానం చెప్పటం నేను విన్నాను.)

1_4_33 వచనము హర్ష - వసంత

వచనము

అని యడిగిన నారాజునకు శకుంతల యిట్లనియె.

(అని అడిగిన దుష్యంతుడితో శకుంతల ఇలా అన్నది.)

1_4_32 తేటగీతి హర్ష - వసంత

తేటగీతి

ఉత్తమాశ్రమనిష్ఠితుఁ డూర్ధ్వరేతుఁ
డైన కణ్వమహాముని యనఘచరితుఁ
డట్టిముని కెట్లు గూతుర వైతి దీని
నాకు నెఱుఁగంగఁ జెప్పుము నలిననేత్ర.

("సన్న్యాసాశ్రమాన్ని నిష్ఠతో పాటించే కణ్వమహామునికి నువ్వు కూతురివి ఎలా అయ్యావు?")

1_4_31 వచనము హర్ష - వసంత

వచనము

ఇట్లు దుష్యంతుం డా శకుంతలజన్మం బెఱుంగ వేఁడి వెండియు దాని కి ట్లనియె.

(శకుంతల పుట్టుక గురించి తెలుసుకోవాలని ఆమెతో దుష్యంతుడు ఇలా అన్నాడు.)

Monday, November 14, 2005

1_4_30 చంపకమాల హర్ష - వసంత

చంపకమాల

ఇది మునికన్య యేని మఱి యేలొకొ యీలలితాంగియందు నా
హృదయము దద్దయుం దవిలె నిప్పలు కింకను నమ్మనేరన
య్యెద విజితేంద్రియుం డనఁగ నిమ్మునిఁ బాయక విందు నంచుఁ దా
నిది కలరూ పెఱుంగ నవనీపతి యుత్సుకుఁ డయ్యె నాత్మలోన్.

("శకుంతల మునికన్య అయితే ఈమెపై నా మనస్సు ఎందుకు లగ్నమైంది? ఈమె మాటలు నమ్మలేకుండా ఉన్నాను. కణ్వమహాముని జితేంద్రియుడు కదా? ఈమె మాటల్లోని యథార్థం తెలుసుకోవాలి", అని దుష్యంతుడు భావించాడు.)

1_4_29 కందము హర్ష - వసంత

కందము

జగతీవల్లభ యే న
త్యగణిత ధర్మస్వరూపుఁ డని జనముల దన్
బొగడఁగ జగదారాధ్యుం
డగు కణ్వమహామునీంద్రునాత్మజ ననినన్.

(నేను కణ్వమహర్షి కూతురిని అన్నది.)

-:శకుంతల దుష్యంతునకుఁ దన జన్మక్రమం బెఱింగించుట:-

1_4_28 వచనము హర్ష - వసంత

వచనము

వారు వచ్చునంతకు నొక్కముహూర్తం బుండునది యనిన విని యక్కోమలి వినయంబునకు మృదుమధురవచనంబులకు సంతసిల్లి దానిం గన్యకగా నెఱింగి మనోజరాజ్యలక్ష్మియుంబోని దాని సర్వలక్షణలక్షితంబు లయిన సర్వావయవంబులుం జూచి సంచలితహృదయుండై నీ వెవ్వరి కూతుర విట్టి రూపలావణ్యవిలాసవిభ్రమగుణసుందరి విందుల కేల వచ్చి తని యడిగిననది యిట్లనియె.

("వారు వచ్చేవరకు వేచి ఉండండి", అన్నది. ఆమె వినయానికి సంతోషించి, మనోజరాజ్యలక్ష్మిలా ఉన్న ఆమెతో, "నువ్వు ఎవరి కుమార్తెవు? ఈ ఆశ్రమంలో ఎందుకున్నావు?", అని అడగగా ఆమె ఇలా అన్నది.)

1_4_27 ఉత్పలమాల హర్ష - వసంత

ఉత్పలమాల

క్రచ్చఱ వేఁట వచ్చి యిట కణ్వమహామునిఁ జూచి పోవఁగా
వచ్చితి మెందుఁ బోయిరొకొ వా రనినన్ విని యాలతాంగి వా
రిచ్చట నుండి యీక్షణమ యేఁగిరి కానకుఁ బండ్లు దేర మీ
వచ్చు టెఱింగిరేని జనవల్లభ వారును వత్తు రింతకున్.

(కణ్వమహాముని దర్శనం కోసం వచ్చాను అనగా శకుంతల ఇలా అన్నది, "వారు అడవిలోకి వెళ్లారు, మీరాక గురించి తెలిస్తే ఇప్పుడే తిరిగివస్తారు")

1_4_26 వచనము హర్ష - వసంత

వచనము

అదియును ననంతవిలాసంబున జయంతుండ పోని దుష్యంతు నెఱింగి యతిసంభ్రమంబున నాసనార్ఘ్యపాద్యాదివిధులం బూజించి కుశలం బడిగి యున్న నక్కన్యకం జూచి దుష్యంతుం డిట్లనియె.

(శకుంతల అతడికి అతిథి సపర్యలు చేయగా, దుష్యంతుడు ఇలా అన్నాడు.)

1_4_25 చంపకమాల హర్ష - వసంత

చంపకమాల

వలయు నమాత్యులం దగినవారల నుండఁగఁ బంచి ధారుణీ
తలవిభుఁ డొక్కరుండ చని తన్విఁ బయోజదళాయతాక్షి సం
కుల మిళితాళినీల పరికుంచితకోమలకుంతలన్ శకుం
తల యను కన్యకం గనియెఁ దన్మునివల్లభు మందిరంబునన్.

(వారిని అక్కడే ఉండమని చెప్పి, ఒంటరిగా వెళ్లి, ఆ ఆశ్రమంలో ఉన్న శకుంతల అనే కన్యను చూశాడు.)

1_4_24 వచనము హర్ష - వసంత

వచనము

ఇక్కాశ్యపుం డైన కణ్వమహామునీంద్రునకు నమస్కరించి వచ్చెద నావచ్చునంతకు నందఱు నిచ్చోటన యుండు నది యని.

(కణ్వమహర్షికి నమస్కరించి వస్తానని తన పరివారంతో చెప్పి.)

Sunday, November 13, 2005

1_4_23 సీసము + తేటగీతి హర్ష - వసంత

సీసము

శ్రవణసుఖంబుగా సామగానంబులు
        చదివెడు శుకముల చదువు దగిలి
కదలక వినుచుండు కరులయు గరికర
        శీతలచ్ఛాయఁ దచ్ఛీకరాంబు
కణముల చల్లనిగా డ్పాసపడి దానిఁ
        జెంది సుఖం బున్న సింహములయు
భూసురప్రవరులు భూతబలుల్ తెచ్చి
        పెట్టు నీవారాన్న పిండతతులు

తేటగీతి

గడఁగి భక్షింప నొక్కటఁ గలసియాడు
చున్న యెలుకలుఁ బిల్లుల యొండు సహజ
వైరివర్గంబులయు సహవాస మపుడు
సూచి మునిశక్తి కెంతయుఁ జోద్య మంది.

(అక్కడి చిలుకలు పాడే సామవేదాన్ని కదలకుండా వింటున్నఏనుగులు, ఏనుగు తొండాల నీడలో హాయిగా ఉన్న సింహాలు, ఎలుకలతో కలిసి ఆహారాన్ని తింటున్న పిల్లులు - ఇలా వైరిస్వభావం గల జంతువులు స్నేహంతో ఉండడం చూసి, ఆ మునిమహిమకు ఆశ్చర్యపడి.)

1_4_22 వచనము హర్ష - వసంత

వచనము

ఇట్లు హృదయసుఖావహం బగుచున్న యవ్వనంబులో నరిగి యరిగి యనవరతమహాద్విజపఠ్యమానవేదధ్వనులను నవిచ్ఛిన్నహూయమానాగ్నిహోత్రస్వాహాశబ్దంబులనుననేక మునిగణప్రణీత వచనవిషయ విభాగవినిర్ణయ న్యాయనిపుణ విద్వత్సభాసంభాషణఘోషంబులను బ్రతిపక్షదుర్విభేదప్రమాణ విచార్యమాణవేదార్థమీమాంసకగోష్ఠీవివాదనాదంబులనుం జేసి మ్రోయుచు యజ్ఞ ప్రయోగప్రవీణు లయిన యాజ్ఞికులకును విహితానుష్ఠానాసక్తులయిన యనుష్ఠాతలకును నధికతపోనిరతు లయిన మహాతపోధనులకును నివాసంబయిన పుణ్యనదీతీరంబునఁ దద్దయు రమ్యం బయి గంగాతీరంబున నరనారాయణస్థానంబునుంబోలె జగత్పావనం బైన కణ్వమహాముని యాశ్రమంబు గని యందు.

(అలా దుష్యంతుడు ఆ వనంలో ఇంకా ముందుకు వెళ్లి వేదపఠనాలు, అగ్నిహోత్రస్వాహాశబ్దాలు, విద్వత్సభాసంభాషణలు, చర్చలు జరుగుతున్న ఆ కణ్వమహాముని ఆశ్రమాన్ని చూసి.)

1_4_21 కవిరాజవిరాజితము హర్ష - వసంత

కవిరాజవిరాజితము

చని చని ముందట నాజ్య హవిర్ధృత సౌరభ ధూమలతాతతులం
బెనఁగిన మ్రాఁకుల కొమ్మలమీఁద నపేతలతాంతము లైనను బా
యని మధుపప్రకరంబులఁ జూచి జనాధిపుఁ డంత నెఱింగెఁ దపో
వన మిది యల్లదె దివ్యమునీంద్రునివాసము దానగు నంచు నెదన్.

(అలా చాలాదూరం వెళ్లి, యజ్ఞంలో హవిస్సుగా వాడిన నేతివాసనగల పొగలు చూరిన తీగలు అల్లుకున్న చెట్లకొమ్మలమీద పూలు లేకపోయినా విడిచిపెట్టకుండా ఉన్న తుమ్మెదలను చూసి ఆ ప్రాంతం ఒక తపోవనమని దుష్యంతుడు తెలుసుకున్నాడు.)

1_4_20 మానిని హర్ష - వసంత

మానిని

ఏచి తనర్చి తలిర్చిన క్రోవుల నిమ్మగు ఠావుల జొంపములం
బూచిన మంచి యశోకములన్ సురపొన్నలఁ బొన్నల గేదఁగులం
గాచి బెడంగుగఁ బండిన యాసహకారములం గదళీతతులం
జూచుచు వీనుల కింపెసఁగన్ వినుచున్ శుకకోకిల సుస్వరముల్.

(అక్కడి రకరకాల చెట్లని చూస్తూ, పక్షుల పలుకులు వింటూ.)

1_4_19 కందము హర్ష - వసంత

కందము

కాఱడవిఁ బఱచు మృగముల
నూఱడకం దిగిచి డస్సి యున్నతని శ్రమం
బాఱఁగ నెడఁ బరితాపము
దీఱఁగఁ బై వీచె నన్నదీపవనంబుల్.

(ఆ నదిమీదనుండి వచ్చే చల్లనిగాలులు దుష్యంతుడి అలసట తీరేలా అతడిపై వీచాయి.)

1_4_18 వచనము హర్ష - వసంత

వచనము

మఱియును.

(ఇంకా.)

Friday, November 11, 2005

1_4_17 చంపకమాల హర్ష - వసంత

చంపకమాల

అతిరుచిరాగతుం డయిన యాతనికిన్ హృదయప్రమోద మా
తతముగ నవ్వనంబున లతాలలనల్ మృదులానిలాపవ
ర్జితకుసుమాక్షతావళులు సేనలు వెట్టిన యట్టి రైరి సం
పతదళినీనినాదమృదుభాషల దీవన లొప్ప నిచ్చుచున్.

(ఆ వనంలోని లతలనే స్త్రీలు, తుమ్మెదల ఝంకారాలనే మాటలతో ఆశీర్వదిస్తూ, గాలిచేత రాలిన పూలనే అక్షతలని తలంబ్రాలుగా చల్లారు.)

1_4_16 వచనము హర్ష - వసంత

వచనము

అని దాని రమణీయభావంబుఁ బొగడుచుఁ జనుదెంచి యవ్వనంబు సొచ్చునప్పుడు.

(అలా ఆ వనసౌందర్యాన్ని మెచ్చుకుంటూ అందులోకి వెళ్లే సమయంలో.)

Thursday, November 10, 2005

1_4_15 కందము హర్ష - వసంత

కందము

అమరపతి ఖాండవమునకు
రమణను వైశ్రవణు చైత్రరథమునకు సమా
నముగా దీనిని భూభా
గమునను రచియించె నొక్కొ కమలజుఁడు దయన్.

(అందంలో ఇంద్రుడి ఖాండవవనానికీ, కుబేరుడి చైత్రరథవనానికీ సమానంగా ఉండేలా బ్రహ్మ ఈ వనాన్ని నిర్మించాడేమో.)

-:కణ్వాశ్రమ వర్ణన:-

1_4_14 వచనము హర్ష - వసంత

వచనము

ఇట్లు పెక్కుమృగంబుల నెగిచి చంపుచు మఱియుఁ జంపెడు వేడుక నతిదూరంబున కరిగిన నాతనిరథవేగంబు ననుగమింప నోపక యధికక్షుత్పిపాసాపరవశు లయి పదాతు లయ్యయిప్రదేశంబుల విశ్రమించి రంత దుష్యంతుండు కతిపయామాత్య పురోహితసహితుం డై కొండొకనేల యరిగి ముందట నొక్క పుణ్యనదీతీరంబున వివిధసురభి కుసుమఫల భారవినమ్ర తరులతా గుల్మపరిశోభితం బయిన యొక్కవనంబు గని.

(దుష్యంతుడు ఇలా వేటాడుతూ చాలాదూరం వెళ్లి, నదీతీరాన ఒక అందమైన వనాన్ని చూశాడు.)

1_4_13 కందము హర్ష - వసంత

కందము

ఓసరిలి పఱచు మృగముల
నేసియు డాసిన మృగముల నెగచి భుజాసిన్
వ్రేసియుఁ జంపెను మృగయా
వ్యాసక్తి నపారఘోరవన్యమృగాళిన్.

(ఎన్నో మృగాలను సంహరించాడు.)

1_4_12 కందము హర్ష - వసంత

కందము

సరభస పరిచలిత మహా
శరభ ద్విపరిపు వరాహ శార్దూల మద
ద్విరదాది ప్రకర భయం
కరవనమధ్యమున నృపతి గడుఁ గడిమి మెయిన్.

(సింహాలూ, పులులూ, ఏనుగులూ మొదలైన జంతువులు ఉన్న ఆ అరణ్యమధ్యంలో దుష్యంతుడు పరాక్రమంతో.)

1_4_11 కందము హర్ష - వసంత

కందము

కలయఁగ నార్పుల బొబ్బల
యులివున నవ్విపిన మను మహోదధిఁ బెలుచం
గలఁచెను దుష్యంత మహా
బల మందరనగము సత్త్వభయజననం బై.

(ఆ అరణ్యమనే సముద్రాన్ని దుష్యంతుడి సేన అనే మందరపర్వతం జంతువులు భయపడేలా కలతపెట్టింది.)

1_4_10 వచనము హర్ష - వసంత

వచనము

అమ్మహీపతి యొక్కనాఁడు మృగయావినోదార్థి యయి యాదిత్యహయంబులకంటె వడిగలహయంబులు పూనిన రథం బెక్కి యాజానేయతురంగారూఢులైన యాశ్వికులు పరివేష్టించి రాఁగ ననంతకుంతశక్తిచాపకృపాణపాణు లయిన వీరభటసహస్రంబులతోఁ జని వనంబులోని మృగంబులం జుట్టుముట్టి.

(దుష్యంతుడు ఒకరోజు వేటాడటానికి తన భటులతో అడవికి వెళ్లాడు.)

1_4_9 కందము హర్ష - వసంత

కందము

అతని రాజ్యంబున ను
ర్వీతలము ప్రజాసమృద్ధి వెలసి రుజాశో
కాతంక క్షయశంకా
పేతం బై ధర్మచరితఁ బెరుఁగుచు నుండెన్.

(అతడి పాలనలో ప్రజలు సుఖంగా ఉండేవారు.)

1_4_8 శార్దూలము విజయ్ - విక్రమాదిత్య

శార్దూలము

ఆ దుష్యంతుఁ డనంతసత్త్వుఁడు సమస్తాశాంతమాతంగ మ
ర్యాదాలంకృత మైన భూవలయ మాత్మాయుత్తమై యుండఁగా
నాదిత్యాంశు సమీర దుర్గమ మహోగ్రారణ్య దేశాళితో
నాదిక్షత్త్ర చరిత్ర నేలె నజితుండై బాహువీర్యంబునన్.

(దుష్యంతుడు రాజై భూమిని పరిపాలించాడు.)

-:దుష్యంతుఁడు వేఁట కరుగుట:-

1_4_7 కందము విజయ్ - విక్రమాదిత్య

కందము

ఉర్వీరుహ నివహముతోఁ
బర్వతములు వెఱికి యొండు పర్వతములపైఁ
బర్వఁగ వైచుచు యౌవన
గర్వంబున నొప్పె నుర్విఁ గడు నధికుండై.

(పర్వతాలను పెకలించి వేరే పర్వతాలపై పడవేస్తూ ఉండేవాడు.)

1_4_6 కందము విజయ్ - విక్రమాదిత్య

కందము

బాలహరిణములఁ బట్టెడు
లీలను విషమాటవీ చలిత కేసరి శా
ర్దూలేభ శరభములఁ దన
బాలత్వమునంద యెగిచి పట్టుచు మఱియున్.

(దుష్యంతుడు చిన్నతనంలోనే అడవిలోని మృగాలను వెంటాడి పట్టుకునేవాడు.)

1_4_5 వచనము విజయ్ - విక్రమాదిత్య

వచనము

ఆ త్రసునకుఁ గాళింది యనుదానికి నిలినుండు పుట్టె వానికి రథంతరి యనుదానికి దుష్యంతుడు పుట్టెఁ బుట్టి యనన్యసాధారణశక్తియుక్తుండై.

(త్రసుడికీ, అతడి భార్య కాళిందికీ ఇలినుడు జన్మించాడు. ఇలినుడికీ, రథంతరికీ అనన్యసాధారణశక్తియుక్తుడైన దుష్యంతుడు పుట్టాడు.)

1_4_4 కందము విజయ్ - విక్రమాదిత్య

కందము

అతనికి సరస్వతీనది
మతి ననురక్త యయి వాని మానుగఁ దనకుం
బతిఁ జేసికొనియె ధర్మ
స్థితిః నయ్యిరువురకుఁ ద్రసుఁడు ధీరుఁడు పుట్టెన్.

(అందువల్ల ఆ నదికి మతినారుడి మీద అనురాగం కలిగి అతడిని వివాహమాడింది. వారికి త్రసుడు అనే కుమారుడు పుట్టాడు.)

1_4_3 కందము విజయ్ - విక్రమాదిత్య

కందము

ఇమ్ముగ సరస్వతీ తీ
రమ్మునఁ బండ్రెండు వత్సరమ్ములు విధిమా
ర్గమ్మున సద్గుణసముదా
యమ్మెసగఁగఁ జేసె సత్త్రయాగము నిష్ఠన్.

(మతినారుడు సరస్వతీనది తీరాన పన్నెండు సంవత్సరాలు సత్త్రయాగం చేశాడు.)

1_4_2 వచనము విజయ్ - విక్రమాదిత్య

వచనము

అక్కథకుండు శౌనకాదిమహామునులకుం జెప్పె నట్లు యయాతికిఁ బుత్త్రుండయిన పూరుండు సకలమహీరాజ్యంబు సేయుచు వంశకర్త యయిన వానికిఁ గౌసల్య యనుదానికి జనమేజయుండు పుట్టి రాజై యశ్వమేధత్రయంబుఁ జేసి ప్రఖ్యాతినొందె నాజనమేజయునకు ననంత యను దానికిఁ బ్రాచిన్వంతుఁడు పుట్టి పరాక్రమంబున నుదయాచలపర్యంతంబు ప్రాగ్దిగ్విజయంబు సేసి ప్రాచిన్వంతుఁడునాఁ బరగె నట్టి ప్రాచిన్వంతునకు నశ్మకి యనుదానికి సంయాతి పుట్టె వానికి వరాంగి యనుదానికి నహంయాతి పుట్టె వానికిం గృతవీర్యపుత్త్రియైన భానుమతికి సార్వభౌముండు పుట్టె వానికిఁ గేకయరాజపుత్త్రియైన సునందకు జయత్సేనుండు పుట్టె వానికి వైదర్భి యైన సుశ్రవసకు నవాచీనుండు పుట్టె నయ్యవాచీనునకు విదర్భరాజపుత్త్రి యైన మర్యాదకు నరిహుండు పుట్టె వానికి నాంగి యనుదానికి మహాభౌముండు పుట్టె నామహాభౌమునకుం బ్రసేనజిత్పుత్త్రి యైన సుపుష్టకు నయుతానీకుండు పుట్టె వానికిం బృథుశ్రవసునిపుత్త్రి యైన కామకు నక్రోధనుండు పుట్టె వానికిం గాళింగి యైన కరంభ యనుదానికి దేవాతిథి పుట్టె వానికి వైదేహి యయిన మర్యాదకు ఋచీకుండు పుట్టె వానికి నాంగి యైన సుదేవ యను దానికి ఋక్షుండు పుట్టె ఋక్షునకుఁ దక్షకపుత్త్రి యయిన జ్వాల యనుదానికి మతినారుండు పుట్టి.

(పైన చెప్పిన విధంగా పూరువంశాభివృధ్ది జరిగి, ఆ వంశంలో మతినారుడు జన్మించాడు.)

-:పూరువంశక్రమము:-

1_4_1 కందము విజయ్ - విక్రమాదిత్య

కందము

శ్రీలలనాస్తనఘటిత వి
శాలోరస్స్థల వివేకచతురానన వా
ణీలీలాస్పద విలస
చ్చాళుక్యాన్వయపయోధిసంపూర్ణశశీ.

(రాజరాజనరేంద్రా!)

Sunday, November 06, 2005

1_3_229 గద్యము విజయ్ - విక్రమాదిత్య

గద్యము

ఇది సకలసుకవిజనవినుత నన్నయభట్ట ప్రణీతం బయిన శ్రీ మహాభారతంబునం దాదిపర్వంబున శ్రీ మహాభారత కథాప్రారంభంబును వ్యాసుజన్మంబును దేవ దైత్య దానవ ముని యక్ష పక్షి గంధర్వాది నానావిధభూతసంభవంబును దదంశావతారంబును రాజవంశోత్పత్తియు యయాతి చరితంబును నన్నది తృతీయాశ్వాసము.

(ఇది నన్నయకవి రచించిన మహాభారతంలోని ఆదిపర్వంలో - మహాభారతకథారంభం, వ్యాసుడి పుట్టుక, దేవదానవులు మొదలైన జీవాల పుట్టుక, వారి అంశాల జన్మం, రాజవంశాల పుట్టుక, యయాతి చరిత్ర అనే విషయాలు ఉన్న తృతీయాశ్వాసం.)

1_3_228 మత్తకోకిలము విజయ్ - విక్రమాదిత్య

మత్తకోకిలము

దండితాహితవీర సూరినిధాన దానవినోద కో
దండపార్థ పరాక్రమప్రియధామ దిక్పరిపూరితా
ఖండపాండుయశోనిధీ పరగండభైరవ వైరివే
దండగండవిదారిఘోరతరాసిభాసిభుజార్గళా.

(పరగండ భైరవా! (రాజరాజనరేంద్రుడి బిరుదు.))

1_3_227 కందము విజయ్ - విక్రమాదిత్య

కందము

వీరశ్రీవనితాశ్రిత
భూరిస్థిరబాహుదండ బుధనుతసుగుణా
ధార కలియుగపవిత్ర పు
రారాతిపదాబ్జపూజనాసక్తమతీ.

(రాజరాజా!)

-:ఆశ్వాసాంతము:-

1_3_226 కందము విజయ్ - విక్రమాదిత్య

కందము

ఆ యతులపుణ్యునకు నన
సూయునకుఁ బరీక్షిదగ్రసుతునకు వైశం
పాయనుఁ డనంత పుణ్య ఫ
లాయత్తముగాఁగఁ జెప్పె నని కడుఁబ్రీతిన్.

(ఇలా వైశంపాయనుడు జనమేజయుడికి చెప్పాడని ఉగ్రశ్రవసుడు శౌనకాది మునులకు తెలిపాడు.)

1_3_225 వచనము విజయ్ - విక్రమాదిత్య

వచనము

మీకుం బుణ్యలోకంబులు గలవని యయాతి సెప్పిన విని యన్నలువురు సంతోషించి యేము నీదౌహిత్రులము సుమ్మని తమ్మెఱింగించి వానికిఁ
బుణ్యలోకంబు లిచ్చి నట్లయ్యయాతి సత్సంగతిం జేసి తానును దౌహిత్రులు నూర్ధ్వలోకంబునకుం జనియె నని.

(ఉన్నాయి అని యయాతి చెప్పగా, వారు సంతోషించి, మేము నీ కూతురి పుత్రులము అని తెలిపి, అతనికి పుణ్యలోకాలు ప్రసాదించారు.)

1_3_224 తేటగీతి విజయ్ - విక్రమాదిత్య

తేటగీతి

సకలధర్మవిదుండవు సర్వలోక
వర్తనము లెఱింగిన పుణ్యకర్త వీవు
నెయ్య మొనరంగ నెఱిఁగింపు మయ్య మాకు
వెలయఁ బుణ్యలోకంబులు గలవె యనిన.

(నువ్వు ధర్మం తెలిసిన పుణ్యమూర్తివి, మాకు పుణ్యలోకాలు ఉన్నాయేమో చెప్పమని అడిగారు.)

1_3_223 వచనము విజయ్ - విక్రమాదిత్య

వచనము

అని యయాతి యష్టకాదు లడిగిన వాని నెల్ల సంక్షేపరూపంబునం జెప్పుటయు వారల లిట్లనిరి.

(అని సమాధానం ఇవ్వగా, వారు ఇలా అన్నారు.)

1_3_222 కందము విజయ్ - విక్రమాదిత్య

కందము

మానాగ్నిహోత్రమును మఱి
మానాధ్యయనమును మానమౌనంబు నవి
జ్ఞానమున మానయజ్ఞము
నా నయథార్థంబు లివియు నాలుగు నుర్విన్.

(గర్వంతో కూడుకున్న అగ్నిహోత్రం, అధ్యయనం, మౌనం, యజ్ఞం అయోగ్యమైనవి.)

1_3_221 వచనము విజయ్ - విక్రమాదిత్య

వచనము

మఱియు గర్భయోనియందు ఋతుపుష్పరససంయుక్తం బగుచు రేతంబు గాడ్పుచేతం బ్రేరితం బయి కలసిన నందుఁ బంచతన్మాత్రలు పొడవయి క్రమంబున నవయవంబు లేర్పడి లబ్ధజీవు లయి యుద్భవిల్లి శ్రోత్రంబుల శబ్దంబును నేత్రంబుల రూపంబును ఘ్రాణంబున గంధంబును జిహ్వను రసంబును ద్వక్కున స్పర్శంబును మనంబున సర్వంబును నెఱుంగుచుఁ బూర్వకర్మనియోగంబున దుష్కృతంబును సుకృతంబును జేయుచు దుష్కృతబాహుళ్యంబునఁ బుణ్యంబు గీడ్పఱిచి బుద్ధివిరహితు లై తిర్యగ్యోనులందుఁ బుట్టుదురు సుకృతబాహుళ్యంబునఁ బాపంబు గీడ్పఱిచి బుద్ధియుక్తులై మనుష్యయోనులందుఁ బుట్టి యుక్తాచారులును దత్త్వవిదులునునయి దేవత్త్వంబునం బొంది విశుద్ధజ్ఞాను లయి ముక్తు లగుదురు మఱి యుక్తచారు లెవ్వ రనిన గురుశుశ్రూష సేయుచు నిత్యాధ్యయనాగ్నికార్యంబులయందప్రమత్తు లయి శమదమ శౌచంబులు దాల్చి యవిప్లుతబ్రహ్మచర్యులయిన బ్రహ్మచారులును బాపంబునకుఁ బరోపతాపంబునకు వెఱచి ధర్మ్యం బైన విత్తంబున నతిథులం బూజించుచు యజ్ఞంబులు సేయుచుఁ బరుల యీనిధనంబులు పరిగ్రహింపక నిత్యానుష్ఠానపరు లయిన గృహస్థులును నియతాహారు లై సర్వసంగంబులు విడిచి జితేంద్రియు లైన వానప్రస్థులును వనంబుల నుండి గ్రామ్యవస్తువుల నుపయోగింపక గ్రామంబుల నుండి శరీరధారణార్థంబు నియతస్వల్పభోజన లయి నగరప్రవేశంబు పరిహరించి కామక్రోధాదులం బొరయక శౌచాచారక్రియారతు లయి సర్వద్వంద్వంబులు నొడిచి సర్వసంగవివర్జితు లయి యేకచరు లయి యనేకనికేతను లయిన యతులును నను వీరలు దమతమపుణ్యాచారంబులం జేసి క్రిందం బదితరంబులవారిని మీఁదం బదితరంబుల వారిని దమ్మును నుద్ధరింతురు.

(పైన చెప్పిన విధంగా జీవాలు జన్మిస్తాయి. మంచి పనులు చేసే బ్రహ్మచారులు, గృహస్థులు, వానప్రస్థులు, సన్న్యాసులు - వీరు యుక్తాచారులు.)

1_3_220 ఆటవెలది విజయ్ - విక్రమాదిత్య

ఆటవెలది

వేదవిహితవిధుల నాదరించుట యూర్ధ్వ
గతికిఁ దెరువు విధులఁ గడచి యెందు
నాఁగ బడినవాని లోఁగక చేయుట
యధమగతికి మార్గ మనిరి మునులు.

(వేదాలను అనుసరించడం ఉన్నతగతికి మార్గం. వాటిని అతిక్రమించడం నీచగతికి మార్గం.)

1_3_219 ఆటవెలది విజయ్ - విక్రమాదిత్య

ఆటవెలది

సర్వభూతదయకు సత్యవాక్యమునకు
నుత్తమంబు ధర్ము వొం డెఱుంగ
నొరుల నొప్పి కోడ కుపతాప మొనరించు
నదియ కడు నధర్మ మనిరి బుధులు.

(దయ కలిగి ఉండటం, సత్యం పలకటం - వీటిని మించిన ధర్మం నాకు తెలియదు. ఇతరులకు బాధ కలిగించటం అధర్మమని పెద్దలు చెప్పారు.)

1_3_218 వచనము విజయ్ - విక్రమాదిత్య

వచనము

ఇట్లు కుపితశతమఖవచనప్రపీడితుండ నయి తదాదేశంబున సద్భువనంబునకు వచ్చితి ననిన నాతండు దమకు మాతామహుం డగుటయు నతని మహత్త్వంబును సార్వలౌకికత్వంబును సర్వజ్ఞానసంపత్తియు నెఱింగి యష్టకాదులు సకలధర్మాధర్మంబులు సుగతిదుర్గతిస్వరూపంబులు జీవుల గర్భోత్పత్తిప్రకారంబులు వర్ణాశ్రమధర్మంబులు నడిగిన వారల కయ్యయాతి యిట్లనియె.

(ఇలా అన్న యయాతిని వారు ధర్మాధర్మాలు మొదలైన విషయాల గురించి అడిగారు.)

1_3_217 చంపకమాల విజయ్ - విక్రమాదిత్య

చంపకమాల

అమరవిభుండు దాని విని యల్గి మదంబున నుత్తమావమా
నము దగునయ్య చేయ నని నన్ను నధోభువనప్రపాతసం
భ్రమవివశాత్ముఁ జేసె నది పాడియ యెందును నల్ప మయ్యు ద
ర్పము బహుకాలసంచితతపఃఫలహాని యొనర్పకుండునే.

(ఇంద్రుడు నా గర్వానికి కోపగించి ఇలా చేశాడు. స్వల్పమైన గర్వం కూడా ఎంతో హాని చేస్తుంది.)

1_3_216 కందము విజయ్ - విక్రమాదిత్య

కందము

సురపతి నాతపమున క
చ్చెరువడి నీతపముపేర్మిఁ జెప్పుమ యనినన్
సురసిద్ధమునీంద్రతప
శ్చరణలు నాతపముతోడ సరిగా వంటిన్.

(ఇంద్రుడు నా తపస్సు గురించి అడగగా, అది గొప్పమునుల తపస్సు కంటే గొప్పదని అన్నాను.)

1_3_215 కందము విజయ్ - విక్రమాదిత్య

కందము

అమితతపోవిభవంబునఁ
గమలజులోకంబు మొదలుగాఁగల సురలో
కములందుఁ బుణ్యఫలములఁ
గ్రమమున భోగించి యింద్రుకడ కేఁ జనినన్.

(నేను తపస్సుచేసి బ్రహ్మలోకం మొదలైన దేవలోకాలలో పుణ్యఫలాలు అనుభవించి ఇంద్రుడి దగ్గరకు వెళ్లాను.)

1_3_214 కందము విజయ్ - విక్రమాదిత్య

కందము

అనవద్యధర్మచరితం
బున నున్నతుఁ డైన నహుషుపుత్త్రుఁడఁ బూరుం
డను మధ్యమలోకేశ్వరు
జనకుండ యయాతి యనఁగఁ జనియెడువాఁడన్.

(నేను నహుషుడి కుమారుడిని, పూరుడి తండ్రిని, యయాతిని.)

1_3_213 వచనము విజయ్ - విక్రమాదిత్య

వచనము

అంత నయ్యయాతి దౌహిత్రులైన యష్టకుండును బ్రతర్దనుండును వసుమంతుడును నౌశీనరుం డయిన శిబియు ననువారలు సద్భువననివాసులు దమయొద్దకుం జనుదెంచిన యయాతి నధికతేజోమయు ననంత పుణ్యమూర్తిం గని నిసర్గస్నేహంబున నభ్యాగతపూజల సంతుష్టుం జేసి నీవెవ్వండవెందుండి యేమికారణంబున నిందులకు వచ్చి తని యడిగిన వారలకు నయ్యయాతి యిట్లనియె.

(కొందరు నక్షత్రలోకవాసులు యయాతి దగ్గరకు వచ్చి నీవెవరివి, ఇక్కడికి ఎందుకు వచ్చావు అని అడిగారు. యయాతి ఇలా అన్నాడు.)

1_3_212 తేటగీతి విజయ్ - విక్రమాదిత్య

తేటగీతి

అంతరిక్షంబువలన దిగంతరములు
వెలుఁగఁ జనుదెంచు నాతని విమలదీప్తి
సూచి సద్గణములు గడుఁ జోద్య మంది
రురుతరద్యుతి యిది యేమి యొక్కొ యనుచు.

(అలా నక్షత్రమండలంలో ప్రకాశించే యయాతి కాంతిని చూసి నక్షత్రాలన్నీ ఆశ్చర్యం పొందాయి.)

1_3_211 వచనము విజయ్ - విక్రమాదిత్య

వచనము

అని తపోభిమానంబున మహర్షులతపంబు లవమానించి పలికిన నయ్యయాతి గర్వంబునకు సహింపక యింద్రుం డలిగి నీకు దేవలోకసుఖానుభవంబులందుఁ బుణ్యసమాప్తి యయ్యె నీగర్వంబు నిన్నింత సేసె నింక నధోలోకంబునకరుగుమనిన వాఁడును మనుష్యలోకంబునకుం బోవనోప నంతరిక్షంబున సద్భువనంబున సత్సంగతి నుండునట్లుగా నాకుఁబ్రసాదింపు మని యింద్రుననుమతంబు వడసి.

(అని గొప్ప మునుల తపస్సును తక్కువ చేసి మాట్లాడాడు. యయాతి గర్వాన్ని ఇంద్రుడు సహించక కోపగించి అతడిని అధోలోకాలకు వెళ్లమన్నాడు. అప్పుడు యయాతి, "నేను మానవలోకానికి వెళ్లలేను, ఆకాశంలో నక్షత్రాలతోపాటు ఉండేలా అనుగ్రహించ"మని ఇంద్రుడిని అనుమతి పొందాడు.)

-:ఇంద్రుండు యయాతిని స్వర్గలోకభ్రష్టునిఁ జేయుట:-

1_3_210 కందము విజయ్ - విక్రమాదిత్య

కందము

సురదైత్యయక్షరాక్షస
నరఖేచరసిద్ధమునిగణప్రవరుల భా
సురతపముల నాఁదగు దు
ష్కరఘోరతపంబు సరియుఁగా వమరేంద్రా.

(దేవతలు, రాక్షసులు, మునులు మొదలైనవారు చేసే తపస్సులు తీవ్రమైన నా తపస్సుకు సాటిరావు.)

1_3_209 వచనము విజయ్ - విక్రమాదిత్య

వచనము

అనిన నయ్యింద్రున కయ్యయాతి యిట్లనియె.

(యయాతి ఇంద్రుడితో ఇలా అన్నాడు.)

1_3_208 కందము విజయ్ - విక్రమాదిత్య

కందము

ఏమితపం బొనరించితి
భూమీశ్వర పుణ్యలోకభోగంబులఁ దే
జోమహిమ ననుభవించితి
సామాన్యమె శతసహస్రసంవత్సరముల్.

(ఓ మహారాజా! నువ్వు ఏమి తపస్సు చేశావు? నీ తపస్సు మహత్త్వం చేత స్వర్గసౌఖ్యాలను అనుభవించావు. ఇది అసామాన్యం.)

1_3_207 వచనము విజయ్ - విక్రమాదిత్య

వచనము

అని పూరుం గఱపితి నమ్మహాపురుషుం డొరులకుఁ గఱపునట్టి సర్వగుణసంపన్నుండనిన విని యింద్రుండు వెండియు నయ్యయాతి కిట్లనియె.

(అని పూరుడికి బోధించాను అని యయాతి చెప్పాడు. ఇంద్రుడు ఇలా అన్నాడు.)

1_3_206 సీసము + తేటగీతి విజయ్ - విక్రమాదిత్య

సీసము

వదనబాణాసన వ్యక్తముక్తము లైన
        పలుకుల న్కడువాఁడిబాణతతులఁ
బరమర్మలక్ష్యముల్ పాయక భేదించు
        చుండెడి దుర్జనయోధవరుల
కడనుండ కున్నది కరుణ యార్జవ మక్ష
        జయము సత్యంబును శమము శౌచ
మనునివి యెద నిల్పునది శత్రు షడ్వర్గ
        జయ మందునది శుద్ధశాంతబుద్ధి

తేటగీతి

మదముఁ గామముఁ గ్రోధంబు మత్సరంబు
లోభమును మోహమును ననులోనిసహజ
వైరివర్గంబు నొడిచిన వాఁడ యొడుచు
నశ్రమంబున వెలుపలియహితతతుల.

(ముఖమనే విల్లు నుండి విడిచిన మాటలనే బాణాలతో ఇతరుల మర్మాలనే గురులను ఛేదించే దుష్టుల దగ్గర నివసించకూడదు. మంచి గుణాలను మనసులో నిలపాలి. అరిషడ్వర్గాన్ని జయించాలి. అంతశ్శత్రువులైన వాటిని జయించినప్పుడే బహిశ్శత్రువులనూ శ్రమలేకుండా జయించటం సాధ్యం.)

1_3_205 కందము విజయ్ - విక్రమాదిత్య

కందము

మనమునకుఁ బ్రియంబును హిత
మును బథ్యముఁ దథ్యమును నమోఘము మధురం
బును బరిమితమును నగుపలు
కొనరఁగఁ బలుకునది ధర్మయుతముగ సభలన్.

(సభలలో, ధర్మంతో కూడిన మంచిమాటలు మాట్లాడాలి.)

1_3_204 కందము విజయ్ - విక్రమాదిత్య

కందము

ఇచ్చునది పాత్రునకు ధన
మచ్చుగ నొరు వేఁడ కుండునది యభిముఖు లై
వచ్చిన యాశార్థుల వృథ
పుచ్చక చేయునది సర్వభూతప్రీతిన్.

(పాత్రులకు ధనం ఇవ్వాలి. ఇంకొకరిని అడగకుండా ఉండాలి. యాచకులను నిరాశ పరచకూడదు.)

1_3_203 కందము విజయ్ - విక్రమాదిత్య

కందము

ఎఱుక గలవారి చరితలు
గఱచుచు సజ్జనులగోష్ఠిఁ గదలక ధర్మం
బెఱుఁగుచు నెఱిఁగినదానిని
మఱవ కనుష్ఠించునది సమంజసబుద్ధిన్.

(జ్ఞానుల చరిత్రలు అభ్యసిస్తూ, సజ్జనుల గోష్ఠిలో ధర్మం తెలుసుకుంటూ, తెలిసినదాన్ని మరచిపోకుండా న్యాయబుద్ధితో ఆచరించాలి.)

-:యయాతి పూరునకు బోధించిన నీతులు:-

1_3_202 ఆటవెలది విజయ్ - విక్రమాదిత్య

ఆటవెలది

కొడుకుజవ్వనంబుఁ గొని నీవు నిజరాజ్య
భూరిభరము వానిఁ బూన్చునప్పు
డతని కెద్ది గఱపి తని యడిగిన హరి
కయ్యయాతి యిట్టు లనుచుఁ బలికె.

(పూరుడికి భూభారం అప్పగించేటప్పుడు అతడికి ఏమి బోధించావు అని అడిగిన ఇంద్రుడికి యయాతి ఇలా సమాధానం చెప్పాడు.)

1_3_201 వచనము విజయ్ - విక్రమాదిత్య

వచనము

నా జరాభారంబుఁ దాల్చిన పుత్త్రుండు రాజ్యంబున కర్హుండును వంశకర్తయునగు శుక్రవచనంబును నిట్టిద యని యయాతి ప్రభృతజనంబుల నొడంబఱిచి పూరు నఖిలభూభారధురంధరుం జేసి యదుప్రభృతులఁ బ్రత్యంతభూములకు రాజులం జేసి తాను వేదవేదాంగపారగు లయిన బ్రాహ్మణులతోడం దపోవనంబునకుం జని యందుఁ గందమూలఫలాశనుండై వన్యంబులయిన ఫలంబుల హవ్యకవ్యంబుల నగ్నిభట్టారకుం బితృదేవతలం దనుపుచు వానప్రస్థవిధానంబుఁ దప్పక శిలోంఛవృత్తి నతిథిభుక్తశేషం బుపయోగించుచు నియతాత్ముండై జితారిషడ్వర్గుండును నయి సహస్రవర్షంబులు దపంబు సలిపి సర్వసంగవిముక్తుండై సర్వద్వంద్వంబులును విడిచి ముప్పదియేండ్లు నిరాహారుండయి యొక్కయేఁడు వాయుభక్షకుం డయి పంచాగ్నిమధ్యంబున నిల్చి యొక్కయేఁడు నీటిలో నేకపాదంబున నిలిచి మహాఘోరతపంబు సేసి దివ్యవిమానంబున దేవలోకంబునం జని యందు దేవర్షిగణపూజితుం డై బ్రహ్మలోకంబునకుం జని యందు బ్రహ్మర్షిగణపూజితుం డై యనేకకల్పంబు లుండి క్రమ్మఱ నింద్రలోకంబునకు వచ్చిన నింద్రుండు వానిం బూజించి యిట్లనియె.

(ఇలా ప్రజలను ఒప్పించి యయాతి తపోవనానికి వెళ్లి తపస్సు చేసి దివ్యవిమానంలో స్వర్గానికి వెళ్లాడు. ఇంద్రుడు అతడిని పూజించి ఇలా అన్నాడు.)

1_3_200 కందము విజయ్ - విక్రమాదిత్య

కందము

పూరుఁడు గొండుక యయ్యును
భూరిగుణజ్యేష్ఠుఁడును సుపుత్త్రుఁడు నవనీ
భార సహిష్ణుఁడు నాతఁడ
కోరినకార్యంబు దీర్చి కుశలుం డగుటన్.

(నేను కోరిన పని చేసిన పూరుడు వయసులో చిన్నవాడైనా, మంచి గుణాలు కలిగి ఉండటంలో పెద్దవాడు. రాజ్యభారం వహించగలడు.)

1_3_199 కందము విజయ్ - విక్రమాదిత్య

కందము

తనయుండు దల్లిదండ్రులు
పనిచినపని సేయఁడేని పలు కెడలోఁ జే
కొనఁడేని వాఁడు తనయుం
డనఁబడునే పితృధనమున కర్హుం డగునే.

(అలాంటివాడు కొడుకు అవుతాడా? పితృధనానికి అర్హుడవుతాడా?)

1_3_198 కందము విజయ్ - విక్రమాదిత్య

కందము

యదుఁ డగ్రతనూజుఁడు నా
హృదయసముద్భవుఁడు దా నయిన మద్వచనం
బిది యేటిది యని కడుదు
ర్మదుఁ డై చేయక కృతావమానుం డయ్యెన్.

(యదువు నా మాట లెక్కచెయ్యక నన్ను అవమానించాడు.)

1_3_197 వచనము విజయ్ - విక్రమాదిత్య

వచనము

అనిన వారల కయ్యయాతి యి ట్లనియె.

(యయాతి వారితో ఇలా అన్నాడు.)

1_3_196 మత్తేభము విజయ్ - విక్రమాదిత్య

మత్తేభము

అవిచారం బని పల్క నోడెదము ధర్మాభిజ్ఞ నీ యగ్రసం
భవుఁ డత్యున్నతశక్తియుక్తుఁడు మహీభారప్రగల్భుండు భా
ర్గవదౌహిత్రుఁడు పాత్రుఁ డీ యదుఁడు లోకఖ్యాతుఁ డుండంగ నీ
భువనేశత్వభరంబుఁ బూన్పఁ దగునే పూరున్ జఘన్యాత్మజున్.

(మహారాజా! పెద్దవాడైన యదువు ఉండగా అందరికంటే చిన్నవాడైన పూరుడికి రాజ్యభారం ఇవ్వటం సమంజసమేనా?)

1_3_195 వచనము విజయ్ - విక్రమాదిత్య

వచనము

అని యొడంబడకున్న నలిగి యయాతి యదువంశంబునవారు రాజ్యంబున కయోగ్యులుగాఁ దుర్వసువంశంబునవారు ధర్మాధర్మవివేకశూన్యు లై సంకీర్ణవర్ణ కిరాతులకు రాజులుగా ద్రుహ్వ్యువంశంబునవా రుడుపప్లవసంతార్యం బైన దేశంబునకు రాజులుగా జరాదూషకుండగుట ననువంశంబునవారు ముదియు నంతకు నుండక జవ్వనంబునన పంచత్వంబున కరుగవారునుంగా శాపం బిచ్చి యానలువురకుం గొండుకవాని శర్మిష్ఠాపుత్త్రుఁ బూరుం బిలిచి యడిగిన వాఁడు దండ్రికోరియనయట్ల చేసిన నవయౌవనుండై యయాతి యభిమతసుఖంబులు సహస్రవర్షంబు లనుభవించి తృప్తుండై పూరుజవ్వనంబు వానిక యిచ్చి తన జరాభారంబుఁ దాన తాల్చి నిజాజ్ఞావిధేయచతురంతమహీతలబ్రహ్మక్షత్త్రాది వర్ణముఖ్యులనెల్ల రావించి మంత్రిపురోహిత సామంత పౌరజన సమక్షంబున సకలక్షోణీచక్రసామ్రాజ్యంబునకుఁ బూరు నభిషిక్తుంజేసిన సర్వప్రకృతిజనంబు లారాజున కి ట్లనిరి.

(అని పలికి ముసలితనం గ్రహించడానికి ఒప్పుకోలేదు. యయాతి కోపగించి యదువు వంశం వారు రాజ్యానికి అయోగ్యులని శపించి మిగిలిన ముగ్గురికి కూడా శాపాలు ఇచ్చాడు. పూరుడు మాత్రం తన యౌవనం తండ్రికి ఇచ్చి ముసలితనం పొందాడు. యౌవనం పొందిన యయాతి చాలాకాలం సుఖాలు అనుభవించి, తృప్తిపొంది, యౌవనాన్ని పూరుడికి తిరిగి ఇచ్చి అతడికే రాజ్యాభిషేకం చేశాడు. అప్పుడు ప్రజలు రాజుతో ఇలా అన్నారు.)

1_3_194 కందము విజయ్ - విక్రమాదిత్య

కందము

నరలుగల కాము నైనను
దరుణులు రోయుదురు డాయ ధనపతి యయ్యుం
బురుషుఁడు దుర్వారజరా
పరిభూతి నభీష్టభోగబాహ్యుఁడ కాఁడే.

(తల నెరిస్తే మన్మథుడినైనా స్త్రీలు అసహ్యించుకుంటారు. ఎంతటి ధనవంతుడైనా ముసలితనం వల్ల కలిగే రోత చేత భోగాలు పొందలేడు.)

1_3_193 ఆటవెలది విజయ్ - విక్రమాదిత్య

ఆటవెలది

తగిలి జరయు రుజయు దైవవశంబున
నయ్యెనేని వాని ననుభవింత్రు
గాక యెఱిఁగి యెఱిఁగి యారెంటిఁ జే
కొందురయ్య యెట్టికుమతు లైన.

(ముసలితనాన్నీ, రోగాన్నీ ఎవరైనా కలిగితే అనుభవిస్తారు గానీ, ఎంతటి బుద్ధిహీనులైనా తెలిసి తెలిసి వాటిని ఇంకొకరి నుండి స్వీకరిస్తారా?)

1_3_192 వచనము విజయ్ - విక్రమాదిత్య

వచనము

ఇట్లు జరాక్రాంతుం డైన యయాతి గొడుకుల నెల్ల రావించి నాకు విషయసుఖతృప్తి లేకున్న యది కావున మీయందొక్కరుండు నాముదిమి గొని తన జవ్వనంబు నాకిచ్చునది యనిన విని యదు తుర్వసు ద్రుహ్వ్యనులు దండ్రి కిట్లనిరి.

(యయాతి తన కుమారులను పిలిచి, "మీలో ఒకరు నా ముసలితనాన్ని గ్రహించి మీ యౌవనాన్ని నాకు ఇవ్వండి", అని అడిగాడు. అప్పుడు యదువు, తుర్వసుడు, ద్రుహ్వి, అనువు అనే కుమారులు ఇలా అన్నారు.)

-:యయాతి యదుప్రముఖులకు శాపం బిచ్చుట:-

1_3_191 కందము విజయ్ - విక్రమాదిత్య

కందము

తల వడఁకఁ దొడఁగె నింద్రియ
ముల గర్వ మడంగె నంగములు వదలె వళీ
పలితంబు లయ్యె వగరును
దలయేరును నుక్కిసయును దరికొనుదెంచెన్.

(తల వణకటం మొదలైన ముసలితనపు లక్షణాలు యయాతికి కలిగాయి.)

1_3_190 వచనము విజయ్ - విక్రమాదిత్య

వచనము

ఏ నిద్దేవయానియందు విషయోపభోగతృప్తుండఁ గాను జరాభారంబుఁ దాల్ప నోప నని ప్రార్థించిన విని వానికి శుక్రుండు గరుణించి యట్లేని నీ ముదిమి నీకొడుకులయం దొక్కరునిపయిం బెట్టి వాని జవ్వనంబు నీవు గొని రాజ్యసుఖంబు లనుభవింపుము నీవు విషయోపభోగ తృప్తుండ వైన మఱి నీ ముదిమి నీవ తాల్చి వానిజవ్వనంబు వానికి నిచ్చునది నీముదిమిఁ దాల్చిన పుత్త్రుండ రాజ్యంబున కర్హుండును వంశకర్తయు నగు ననిన నయ్యయాతి శుక్రు వీడ్కొని దేవయానీసహితుం డై తన పురంబునకు వచ్చి శుక్రుశాపంబున జరాభారంబుఁ దాల్చిన వానికి.

(నేను ముసలితనాన్ని వహించలేను అని ప్రార్థించగా శుక్రుడు, "నీ కుమారులలో ఒకరికి నీ ముసలితనమిచ్చి వారి యౌవనం నువ్వు గ్రహించు. నువ్వు తృప్తిపొందిన తరువాత యౌవనం తిరిగి ఇచ్చి ఆ కుమారుడికే నీ రాజ్యం ఇవ్వు. అతడే నీ వంశాన్ని కొనసాగిస్తాడు", అన్నాడు. శుక్రుడి శాపం ప్రకారం యయాతి ముసలితనం పొందాడు.)

1_3_189 కందము విజయ్ - విక్రమాదిత్య

కందము

దానికి భీతుఁడ నై య
మ్మానవతీప్రార్థనం గ్రమం బొనరఁగ సం
తానము వడసితి నెదలో
దీనికి నలుగంగఁ దగునె దివ్యమునీంద్రా.

(అందుకు భయపడి శర్మిష్ఠ కోరిక ప్రకారం సంతానం పొందాను. అందుకు కోపగించటం ఉచితమేనా?)

1_3_188 కందము విజయ్ - విక్రమాదిత్య

కందము

ఋతుమతి యై పుత్త్రార్థము
పతిఁ గోరిన భార్యయందుఁ బ్రతికూలుం డై
ఋతువిఫలత్వము సేసిన
యతనికి మఱి భ్రూణహత్య యగు నండ్రు బుధుల్.

(యయాతి శుక్రుడితో ఇలా అన్నాడు, "భార్య ఋతుకాలాన్ని వ్యర్థం చేసినవాడికి భ్రూణహత్య చేసిన పాపం కలుగుతుందని పెద్దలు చెప్పారు")

1_3_187 వచనము విజయ్ - విక్రమాదిత్య

వచనము

అయ్యయాతియు దానిం బట్టువఱచుచుఁ దోడన చని శుక్రుం గని నమస్కరించి యున్న నద్దేవయాని గద్గదవచన యై యధర్మంబున ధర్మంబు గీడ్పఱిచి యిమ్మహీశుం డాసురంబున నాసురియం దనురక్తుండై పుత్త్రత్రయంబు వడసి నా కవమానంబు సేసె ననిన శుక్రుండు యయాతి కలిగి నీవు యౌవనగర్వంబున రాగాంధుడ వై నా కూఁతున కప్రియంబు సేసితివి కావున జరాభారపీడితుండవు గమ్మని శాపం బిచ్చిన నయ్యయాతి శుక్రున కి ట్లనియె.

(యయాతి కూడా ఆమె వెంటే వెళ్లాడు. జరిగిన విషయం దేవయాని చెప్పగా శుక్రుడు కోపగించుకొని, యౌవనగర్వం గల యయాతికి ముసలితనం ప్రాప్తించాలని శపించాడు.)

-:శుక్రుఁడు యయాతికి శాపం బిచ్చుట:-

1_3_186 చంపకమాల విజయ్ - విక్రమాదిత్య

చంపకమాల

పతివిహితానురాగమున భార్గవపుత్త్రి యయాతిచేత వం
చిత యయి వాఁడు దానవికిఁ జేసిన నెయ్య మెఱింగి కోపదుః
ఖిత యయి తండ్రిపాలి కతిఖేదమునం జని దీర్ఘ నేత్రని
ర్గతజలధారలం గడిగెఁ గాంత తదీయ పదాబ్జయుగ్మమున్.

(యయాతి తనను వంచించాడనే శోకంతో తండ్రి దగ్గరకు వెళ్లింది.)

1_3_185 వచనము విజయ్ - విక్రమాదిత్య

వచనము

ఇట్లు ద న్నెఱుంగకుండ యయాతి శర్మిష్ఠవలన లబ్ధసంతానుం డగుట యప్పు డెఱింగి.

(జరిగిన విషయం దేవయాని అప్పుడు తెలుసుకొని.)

1_3_184 కందము విజయ్ - విక్రమాదిత్య

కందము

తరుణప్రదేశినులు మా
సరముగ వారలు యయాతి శర్మిష్ఠలఁ జూ
పిరి తండ్రియుఁ దల్లియు నని
కర మనురాగిల్లెఁ గన్యకానివహంబున్.

(వారు శర్మిష్ఠను, యయాతిని చూపించారు.)

1_3_183 వచనము విజయ్ - విక్రమాదిత్య

వచనము

ఇట్లరుగుదెంచి యధికతేజస్వులయి యయాతిప్రతిబింబంబులుబోని యబ్బాలకులం జూచి యిక్కుమారు లెక్కడివారెవ్వరి కొడుకులని యయాతినడిగి యలబ్ధప్రతివచనయై మీ తల్లిదండ్రులెవ్వరని యక్కుమారుల నడిగిన.

(చూడటానికి యయాతిలాగానే ఉన్న వారిని దేవయాని చూసి వారెవరని యయాతిని అడిగింది. అతడు సమాధానం చెప్పకపోవటంతో మీ తల్లిదండ్రులెవరని వారినే అడిగింది.)

1_3_182 సీసము + ఆటవెలది విజయ్ - విక్రమాదిత్య

సీసము

కరువలిచేఁ దూలు కపిల జటాలియ
        కరమొప్పు శిఖలుగాఁ గనకరత్న
మయజాలభూషణామల దేహదీప్తుల
        తేజంబుగాఁ బ్రవిదీప్యమాన
యాగశతంబుల నర్చితం బైన మూఁ
        డగ్నులు ప్రత్యక్ష మైన యట్లు
దనమ్రోల శర్మిష్ఠతనయులు గ్రీడించు
        చుండంగ నున్న యయ్యుర్విఱేని

ఆటవెలది

కడకు నేఁగుదెంచెఁ గన్యలు దనుజాధి
రాజసుతయుఁ దోడ రాఁగ నొప్పి
దేవి దేవయాని దేవేంద్రుదేవియ
పోలె నెంతయును విభూతి మెఱసి.

(ఒకరోజు యయాతి దగ్గర శర్మిష్ఠ కుమారులు ఆడుకుంటున్నప్పుడు దేవయాని అక్కడికి వచ్చింది.)

1_3_181 వచనము విజయ్ - విక్రమాదిత్య

వచనము

అది యె ట్లని యడిగిన శర్మిష్ఠ లజ్జావనతవదన యయి యి ట్లను నెందేనినుండి యొక్కమహాముని నిఖిలవేదవేదాంగపారగుండు వచ్చి ఋతుమతినై యున్న నన్నుం జూచి నాకుఁ బుత్రోత్పత్తిఁ బ్రసాదించె ననిన విని దేవయాని నిజనివాసంబునకుం జనియె శర్మిష్ఠయు నయ్యయాతి వలనఁ గ్రమంబున ద్రుహ్వ్యనుపూరు లనంగా మువ్వురు గొడుకులం బడసియున్నంత నొక్కనాఁడు.

(ఇది ఎలా జరిగింది అని అడగగా ఋతుమతి అయి ఉన్న తనను ఒక మహాముని అనుగ్రహించాడు అని శర్మిష్ఠ అన్నది. శర్మిష్ఠకు యయాతి వలన ద్రుహ్వుడు, అనువు, పూరుడు అనే కుమారులు కలిగారు.)

1_3_180 తేటగీతి విజయ్ - విక్రమాదిత్య

తేటగీతి

బాల వయ్యు నత్యుత్తమశీలవినయ
గౌరవాన్విత వై నిర్వికారవృత్తి
నున్న నీ కున్నయునికిన సన్నుతాంగి
సుతుఁడి పుట్టుట యిది గడుఁ జోద్య మయ్యె.

(ఉత్తమమైన శీలం గల నీకు కొడుకు పుట్టటం ఆశ్చర్యంగా ఉంది.)

1_3_179 వచనము విజయ్ - విక్రమాదిత్య

వచనము

ఈ యేనింటియందు నసత్యదోషంబు లేదని మునివచనప్రమాణంబు గలదు నీవు వివాహసమయంబున నొడంబడితివి కావున నసత్యదోషంబునం బొందవనిన నయ్యయాతి యొడంబడి శర్మిష్ఠకు నభిమతం బొనరించె నదియుఁ దత్సమాగమంబున గర్భిణియై కొడుకుం గనిన విస్మయపడి దేవయాని దానికడకు వచ్చి యిట్లనియె.

(వివాహవిషయంలో అబద్ధమాడితే నువ్వు పాపం పొందవు అని శర్మిష్ఠ అనగా యయాతి అంగీకరించాడు. శర్మిష్ఠ కొంతకాలానికి గర్భవతై కొడుకును కన్నది. ఇది చూసి దేవయాని ఆశ్చర్యపడి శర్మిష్ఠ దగ్గరకు వచ్చి ఇలా అన్నది.)

Saturday, November 05, 2005

1_3_178 కందము విజయ్ - విక్రమాదిత్య

కందము

చను బొంకఁగఁ బ్రాణాత్యయ
మున సర్వధనాపహరణమున వధగావ
చ్చిన విప్రార్థమున వధూ
జనసంగమమున వివాహసమయములందున్.

(కొన్ని విషయాలలో అబద్ధమాడవచ్చు.)

1_3_177 వచనము విజయ్ - విక్రమాదిత్య

వచనము

ఏ నమ్మహామునివచనంబున కప్పు డొడంబడితి నెట్లు బొంక నేర్తు ననిన శర్మిష్ఠ యి ట్లనియె.

(అలాంటప్పుడు ఎలా మాట తప్పగలను అని అనగా శర్మిష్ఠ ఇలా అన్నది.)

1_3_176 కందము విజయ్ - విక్రమాదిత్య

కందము

లలితాంగి శయన మొక్కడు
వెలిగా రుచిరాన్నపానవివిధాభరణా
దుల శర్మిష్ఠకు నిష్టము
సొలయక చేయు మని నన్ను శుక్రుఁడు పంచెన్.

(ఈ ఒక్కవిషయంలో నిన్ను విడిచిపెట్టమని శుక్రుడు నన్ను ఆజ్ఞాపించాడు.)

1_3_175 వచనము విజయ్ - విక్రమాదిత్య

వచనము

అద్దేవయానిం బరిగ్రహించినప్పుడ తద్ధనం బగుట నేనును భవత్పరిగ్రహంబ కావున నన్నుం గరుణించి నాకు ఋతుకాలోచితంబుఁ బ్రసాదింపవలయు ననిన నయ్యయాతి యి ట్లనియె.

(కాబట్టి ఋతుకాలోచితాన్ని ప్రసాదించమని అడగగా యయాతి ఇలా అన్నాడు.)

1_3_174 ఉత్పలమాల విజయ్ - విక్రమాదిత్య

ఉత్పలమాల

నీలగళోపమాన కమనీయగుణోన్నతిఁ జెప్పఁ జాలు న
న్నేలిన దేవయానికి నరేశ్వర భర్తవు గాన నాకునుం
బోలఁగ భర్త వీవ యిది భూనుత ధర్మపథంబు నిక్కువం
బాలును దాసియున్ సుతుఁడు నన్నవి వాయని ధర్మముల్ మహిన్.

(రాజా! నా యజమానికి భర్తవయిన నువ్వే నాకు కూడా భర్తవు.)

1_3_173 వచనము విజయ్ - విక్రమాదిత్య

వచనము

అని విచారించుచున్న యవసరంబున దాని పుణ్యస్వరూపంబు సన్నిహితంబైన యట్లొక్కనాఁడు యయాతి యశోకవనికాలోకనతత్పరుం డైవచ్చువాఁడేకతంబ యున్న శర్మిష్ఠం గనిన నదియును సంభ్రమవినయావనతయై తన వలన నమ్మహీపతి ప్రసన్నచిత్తుం డగుట యెఱింగి కరకమలంబులు మొగిచి యిట్లనియె.

(అని ఆలోచిస్తున్న సమయంలోనే యయాతి అక్కడికి వచ్చాడు. శర్మిష్ఠ అతడితో ఇలా అన్నది.)

-:యయాతి శర్మిష్ఠకుఁ బుత్రదానంబు సేయుట:-

1_3_172 తరువోజ విజయ్ - విక్రమాదిత్య

తరువోజ

ఈ రాజునంద నా హృదయంబు దవిలి యెప్పుడు నుండు నన్నీతఁడు గరము
కారుణ్యమునఁ బ్రీతిగలయట్లు సూచుఁ గమలాక్షి భార్గవకన్య దా నెట్లు
గోరి యీతనిఁ దనకును బతిఁ జేసికొనియె నటుల యేను గోరి లోకైక
భారధురంధరుఁ బరహితు ధర్మపరు నహుషాత్మజు బతిఁ జేసికొందు.

(నా మనసు ఎప్పుడూ యయాతిమీద ఆసక్తి కలిగి ఉంటున్నది. యయాతి కూడా నా మీద ప్రేమ ఉన్నట్లు చూస్తాడు. దేవయాని చేసుకున్నట్లే నేను కూడా యయాతిని వివాహం చేసుకుంటాను.)

1_3_171 కందము విజయ్ - విక్రమాదిత్య

కందము

పతిఁ బడసి సుతులఁ బడయఁగ
నతివలు గోరుదురు గోరినట్టుల తనకుం
బతిఁ బడసి సుతులఁ బడసెను
సతు లీభార్గవికి భాగ్యసంపద నెనయే.

(స్త్రీలు భర్తను పెళ్లిచేసుకొని కుమారులను పొందాలనుకుంటారు. ఈ విషయంలో దేవయాని అదృష్టానికి సాటిలేదు.)

1_3_170 చంపకమాల విజయ్ - విక్రమాదిత్య

చంపకమాల

అసదృశయౌవనం బిది యనన్యధనం బగు నొక్కొ నాకు ని
క్కుసుమ సముద్గమంబును నగోచర దుర్గమ దుర్గవల్లరీ
కుసుమ సముద్గమం బగు నొకో పతిలాభము లేమిఁ జేసి యొ
ప్పెసఁగఁగ దేవయాని పతి నేమి తపం బొనరించి కాంచెనో.

(భర్త లేకపోవటం వల్ల నా యౌవనం వృథా అయిపోతుందేమో? దేవయాని ఏ తపస్సు చేసి భర్తను పొందిందో?)

1_3_169 వచనము విజయ్ - విక్రమాదిత్య

వచనము

కావున నాకు నీజన్మంబునఁ బతి యయాతియ యితండును భవద్వచనంబున నన్ను వివాహం బగుదుననియె నిందు ధర్మవిరోధంబు లేకుండునట్లుగాఁ బ్రసాదింప వలయు ననిన శుక్రుండు గరుణించి యయాతికి నీకును నయిన యీ వివాహంబునం దపక్రమదోషంబు లేకుండెడుమని వరంబిచ్చి యయ్యిరువురకుం బరమోత్సవంబున వివాహంబు సేసి శర్మిష్ఠం జూపి యిది వృషపర్వుని కూఁతురు దీనికిం బ్రియంబున నన్నపానభూషణాచ్ఛాదనమాల్యాను లేపనాదుల సంతోషంబు సేయునది శయనవిషయంబునఁ బరిహరించునది యని పంచి కూఁతు నల్లునిం బూజించిన నయ్యయాతియు శుక్రుని వీడ్కొని దేవయానిని శర్మిష్ఠను గన్యకాసహస్రంబును దోడ్కొని నిజపురంబునకుం జని యంతఃపురరమ్యహర్మ్యతలంబున దేవయాని నునిచి తదనుమతంబున నశోకవనికాసమీపంబున నొక్కగృహంబు నందుఁ గన్యకాసహస్రంబుతో శర్మిష్ఠ నునిచి దేవయానియందు సుఖోపభోగపరుం డై యున్నఁ గొండొకకాలంబునకు దేవయానికి యదుతుర్వసులను కొడుకులు పుట్టి రంత శర్మిష్ఠ సంప్రాప్తయౌవనయు ఋతుమతియునై యాత్మగతంబున.

(మా వివాహం ధర్మవిరుద్ధం కాకుండా అనుగ్రహించాలి అనగా శుక్రుడు ఆ ప్రకారంగా వరమిచ్చి వారి పెళ్లి జరిపించి, యయాతికి శర్మిష్ఠను చూపించి, "ఈమెకు అన్నపానాదివిషయాల్లో సంతోషం కలిగించు, శయనవిషయంలో వదిలిపెట్టు", అని ఆజ్ఞాపించాడు. యయాతి దేవయానిని ఒక అందమైన మేడలో ఉంచి, శర్మిష్ఠ మొదలైనవారిని ఇంకొక ఇంట్లో ఉంచాడు. కొంతకాలానికి దేవయానికి యదువు, తుర్వసుడు అనే కొడుకులు పుట్టారు. కొంతకాలానికి శర్మిష్ఠ యౌవనవతై.)

1_3_168 ఆటవెలది విజయ్ - విక్రమాదిత్య

ఆటవెలది

ఇన్నరేంద్రుచేత మున్న గృహీత మై
యున్న నాకరంబు గ్రన్న నింక
నొరున కర్హ మగునె పరిణయ విషయ మై
ధరఁ బరిగ్రహింపఁ బరమమూర్తి.

(ఈ రాజు ఇంతకు ముందే గ్రహించిన నా చేతిని వివాహంలో ఇంకొకరు చేకొనటం ఉచితమేనా?)

1_3_167 వచనము విజయ్ - విక్రమాదిత్య

వచనము

మఱియు దేవయానియు శర్మిష్ఠయుం గన్యకాసహస్రంబును నత్యంతభక్తితోఁ గ్రమంబున నమస్కరించి రంత దేవయాని శుక్రున కిట్లనియె.

(దేవయాని శుక్రుడితో ఇలా అన్నది.)

1_3_166 వచనము విజయ్ - విక్రమాదిత్య

వచనము

అతిసంభ్రమమున నవనీ
పతి విహితోత్థానుఁడై తపశ్శక్తిఁ బ్రజా
పతినిభుఁ డగు భార్గవునకు
నతిభక్తిం బ్రణమితోత్తమాంగుం డయ్యెన్.

(యయాతి శుక్రుడికి నమస్కరించాడు.)

1_3_165 కందము విజయ్ - విక్రమాదిత్య

కందము

తన దివ్యతేజమున న
వ్వనమెల్ల వెలుంగుచుండ వచ్చెను భృగునం
దనుఁడు నిజనందనకుఁ బ్రియ
మొనరింపఁగ దలఁచి దానియొద్దకుఁ బ్రీతిన్.

(తన కూతురు కోరుకున్నది చేయటానికి శుక్రుడు అక్కడికి వచ్చాడు.)

1_3_164 వచనము విజయ్ - విక్రమాదిత్య

వచనము

అమ్మహాముని వచ్చి యిది ధర్మవిరుద్ధంబుగా దని చెప్పెనేని నిన్ను వివాహం బగుదు నని యయాతి యొడంబడిన దేవయాని యప్పుడ శుక్రు రావించిన.

(మహాముని అయన శుక్రుడు వచ్చి ఈ వివాహం ధర్మవిరుద్ధం కాదని అంటే పెళ్లాడుతానని యయాతి అంగీకరించగా దేవయాని శుక్రుడిని అక్కడికి రప్పించింది.)

1_3_163 కందము విజయ్ - విక్రమాదిత్య

కందము

వెలయఁగ ధర్మాధర్మం
బులు నడపుచు నిఖిలలోకపూజ్యుం డైని
ర్మలుఁ డగు శుక్రుఁడు పంచిన
నలఘుభుజా నను వివాహ మగుదే యనినన్.

(అది దేవయాని విని, "పూజనీయుడైన నా తండ్రి శుక్రుడు ఆజ్ఞాపిస్తే నన్ను వివాహం చేసుకుంటావా", అని అడిగింది.)

1_3_162 వచనము విజయ్ - విక్రమాదిత్య

వచనము

క్షత్త్రియకన్యకల బ్రాహ్మణులు వివాహం బగుదురు గాక యధర్మోత్తరంబుగా క్షత్త్రియులు బ్రాహ్మణకన్యకల వివాహం బగుదురే నీపలుకులు ధర్మవిరుద్ధంబులు మఱియు సర్వవర్ణాశ్రమధర్మంబులు సంకరంబులు గాకుండ రక్షించుచున్న యేన యిట్టి యధర్మంబున కొడంబడితి నేని జగత్ప్రవృత్తి విపరీతం బగు ననిన నయ్యయాతికి దేవయాని యిట్లనియె.

(అని దేవయాని పలుకగా యయాతి ఇలా అన్నాడు, "వర్ణాశ్రమధర్మాలను కాపాడుతున్న రాజునైన నేను ఈ వివాహానికి ఒప్పుకోవడం అధర్మం అవుతుంది")

1_3_161 ఉత్పలమాల విజయ్ - విక్రమాదిత్య

ఉత్పలమాల

నన్ను వివాహమై నహుషనందన యీలలితాంగిఁ దొట్టి యీ
కన్నియ లందఱున్ దివిజకన్యలతో నెనయైన వారు నీ
కున్నతిఁ బ్రీతి సేయఁగ నృపోత్తమ వాసవుఁ బోలి లీలతో
నిన్నరలోకభోగము లనేకము లందుము నీవు నావుడున్.

(ఓ యయాతి మహారాజా! నన్ను వివాహమాడి ఈ శర్మిష్ఠ మొదలైనవారి సేవలు అందుకో.)

1_3_160 ఉత్పలమాల విజయ్ - విక్రమాదిత్య

ఉత్పలమాల

నిగ్రహ మేది నన్నుఁ దరణిప్రభ కూపము వెల్వరించు నాఁ
డుగ్రమయూఖసాక్ష్యముగ నున్నతదక్షిణపాణిఁ జేసి భూ
పాగ్రణి నాదు దక్షిణకరాగ్రము వట్టితి కాన మున్న పా
ణిగ్రహణంబు సేసి తది నీయెడ విస్మృతిఁ బొందఁ బాడియే.

(ఓ రాజా! నువ్వు నన్ను బావిలోనుండి కాపాడిన రోజే పాణిగ్రహణం జరిగి మన వివాహమైంది. ఈ విషయం నువ్వు మరచిపోవటం న్యాయమా?)

1_3_159 తేటగీతి విజయ్ - విక్రమాదిత్య

తేటగీతి

నన్ను మున్న యెఱుంగు దిన్నాతి నాకు
దాసి వృషపర్వుఁ డను మహాదానవేంద్రు
కన్య నాయొద్ద నెప్పుడుఁ గదలకుండు
ననఘ మఱి దీని శర్మిష్ఠ యండ్రు జనులు.

(ఈమె రాక్షసరాజైన వృషపర్వుడి కూతురు. నా దాసి. ఈమెను శర్మిష్ఠ అంటారు.)

1_3_158 వచనము విజయ్ - విక్రమాదిత్య

వచనము

అయ్యయాతియుఁ దత్ప్రదేశంబున సుఖోపవిష్టుం డై దేవయానిం దొల్లి యెఱింగినవాఁడై యతిశయరూపలావణ్యగుణసుందరి యయిన శర్మిష్ఠ నెఱుంగ వేఁడి మీరెవ్వరివారలు మీ కులగోత్రనామంబు లెఱుంగవలతుం జెప్పుం డనిన నారాజునకు దేవయాని యిట్లనియె.

(యయాతికి దేవయాని ఎవరో తెలుసు కాబట్టి శర్మిష్ఠ మొదలైనవారెవరని అడిగాడు. దేవయాని ఇలా అన్నది.)

-:యయాతిమహారాజు దేవయానిని వివాహం బగుట:-

1_3_157 కందము విజయ్ - విక్రమాదిత్య

కందము

తరళనయనాబ్జదళములు
నెరయఁగఁ బై మున్న చల్లి నృపసుతుఁ బూజిం
చిరి నవకుసుమమయూలం
కరణవిశేషముల నచటికాంతలు ప్రీతిన్.

(దేవయాని మొదలైన స్త్రీలు అతడిని ప్రీతితో పూజించారు.)

1_3_156 సీసము + తేటగీతి విజయ్ - విక్రమాదిత్య

సీసము

అంగనాజనుల యుత్తుంగసంగతకుచ
        కుంకుమచందనపంకములయు
వారివ ధమ్మిల్లభారావకలిత ది
        వ్యామోద నవపుష్పదామములయు
వారివ ముఖ సకర్పూర తాంబూలాది
        వాసిత సురభినిశ్వాసములయు
వారివ పరిధానచారుధూపములయు
        విలసితసౌరభావలులు దాల్చి

తేటగీతి

యనిలుఁ డను దూత వోయి తోడ్కొనుచు వచ్చె
దేవయాని పాలికి మృగతృష్ణఁ జేసి
కాననంబునఁ గ్రుమ్మరువాని వీరు
నతిపరిశ్రాంతుఁ డైన యయాతి నంత.

(యయాతి అక్కడికి వచ్చాడు.)

1_3_155 వచనము విజయ్ - విక్రమాదిత్య

వచనము

ఇట్లరిగి యవ్వనంబునఁ గన్యకలుం దానును బుష్పాపచయంబు సేయుచు విమలజలప్రవాహవిలసితం బైన యొక్కసెలయేటికెలన నవవికచకుసుమసుకుమారకోరకనికరభరితసహకారకురవకవకుళాశోక తమాలసాలచ్ఛాయాశీతలసికతాతలంబున నిష్టవినోదంబులనున్న యవసరంబున.

(అక్కడ ఒక అందమైన ప్రదేశంలో వారు వినోదిస్తుండగా.)

1_3_154 కందము విజయ్ - విక్రమాదిత్య

కందము

వనకేళీ కౌతుకమునఁ
జనియెను శర్మిష్ఠఁ దొట్టి సఖులెల్ల ముదం
బునఁ గొలిచిరాఁగ విభవము
దన కమరఁగ దేవయాని తద్వనమునకున్.

(దేవయాని శర్మిష్ఠ మొదలైన చెలులతో పూర్వపు అడవికే వెళ్లింది.)

1_3_153 వచనము విజయ్ - విక్రమాదిత్య

వచనము

ఈ దేవయాని కెద్ది యిష్టంబు దానిన యిత్తు నడుగు మనిన దేవయాని సంతసిల్లి యట్లేని శర్మిష్ఠ గన్యకాసహస్రంబుతో నాకు దాసి గావలయు నిదియ నాకిష్టంబు దీనిన యిచ్చునది యనిన వృషపర్వుం డప్పు డక్కూఁతు రావించి కన్యకాసహస్రంబుతో దేవయానికి దాసిగా నిచ్చి శుక్రునకు మనఃప్రియంబు సేసిన శర్మిష్ఠయు నగ్గురువచనంబునఁ గన్యకాసహస్రంబుతో నిత్యంబును దేవయానిం గొలుచుచుండె నంత నొక్కనాఁడు.

(దేవయానికి ఏది ఇష్టమో అదే ఇస్తాను అని వృషపర్వుడు అనగా దేవయాని సంతోషించి శర్మిష్ఠ వేయిమంది కన్యలతో తనకు దాసి కావాలని కోరింది. వృషపర్వుడు తక్షణమే అలా చేసి శుక్రుడికి సంతోషం కలిగించాడు. శర్మిష్ఠ కూడా తండ్రి వాక్యం అనుసరించి అప్పటినుండి దేవయానిని సేవించసాగింది. ఒకరోజున.)

-:శర్మిష్ఠ దాసి యై దేవయానిం గొలుచుట:-

1_3_152 కందము విజయ్ - విక్రమాదిత్య

కందము

వారణ ఘోటక భాండా
గారంబులు మొదలుగాఁగఁ గల ధనములతో
సూరినుత యిందఱము నీ
వారకములు గాఁగ మమ్ము వగవుము బుద్ధిన్.

(ఈ రాక్షసులందరినీ మీ సంపదగా భావించండి.)

1_3_151 ఉత్పలమాల విజయ్ - విక్రమాదిత్య

ఉత్పలమాల

దేవతలన్ జయించుచు నతిస్థిరసంపదలం ద్వదీయవి
ద్యావిభవంబు పెంపునన దానవు లుద్ధతు లైరి కానినాఁ
డీవనరాశిలోఁ జొరరె యింతకు నంతకకోపు లైన య
ద్దేవపతాకినీపతుల దివ్యనిశాతమహాయుధాహతిన్.

(మీ విద్య లేకపోతే రాక్షసులు దేవతల ఆయుధాలవల్ల చనిపోయి ఈ సముద్రంలో పడిపోయి ఉండేవారు.)

1_3_150 వచనము ప్రవీణ్ - విక్రమాదిత్య

వచనము

ఈ వృషపర్వుపురం బేను జొరనొల్ల నెటయేనియుం బోదు ననిన శుక్రుండు నాకు నీవ గతివి నీతోడ నేనును వత్తు ననుచుఁ గూఁతుం బట్టువఱుచుచున్నంత నంతయుఁ జారులవలన నెఱింగి వృషపర్వుండు శుక్రునొద్దకు వచ్చి నమస్కరించి యిట్లనియె.

(ఈ వృషపర్వుడి పురంలో నేను ప్రవేశించను. మరెక్కడికైనా వెళ్తాను అని దేవయాని అనగా, శుక్రుడు, "నాకు నువ్వే దిక్కు. నేను కూడా వస్తాను", అని కూతురిని ఓదారుస్తుండగా ఈ విషయం వృషపర్వుడు వేగుల ద్వారా తెలుసుకొని అక్కడికి వచ్చి శుక్రుడితో ఇలా అన్నాడు.)

1_3_149 కందము ప్రవీణ్ - విక్రమాదిత్య

కందము

కడు ననురక్తియు నేర్పును
గడఁకయు గలవారి నుఱక కడవఁగ నెగ్గుల్
నొడివెడు వివేకశూన్యుల
కడ నుండెడు నంతకంటెఁ గష్టము గలదే.

(మంచివారిని లెక్కచెయ్యక నిందించే వివేకశూన్యుల దగ్గర ఉండటం కంటే కష్టమైన పని ఉందా?)

1_3_148 వచనము ప్రవీణ్ - విక్రమాదిత్య

వచనము

కావున బుద్ధిగలవారికిఁ గ్రోధంబు గొనియాడం దగదు శర్మిష్ఠ రాచకూఁతురు గొండుక యది దానితోడి దేమి రమ్మనిన దేవయాని యిట్లనియె.

(కాబట్టి బుద్ధిమంతులకు కోపం తగదు. శర్మిష్ఠ రాజకుమారి, చిన్నది. దానితో ఏమిటి? ఇంటికి పద అని శుక్రుడు అనగా దేవయాని ఇలా అన్నది.)

1_3_147 కందము ప్రవీణ్ - విక్రమాదిత్య

కందము

అలిగిన నలుగక యెగ్గులు
పలికిన మఱి విననియట్ల ప్రతివచనంబుల్
పలుకక బన్నము వడి యెడఁ
దలఁపక యున్నతఁడె చూవె ధర్మజ్ఞుఁ డిలన్.

(ఇతరులు కోపిస్తే కోపగించకుండా, ఇతరులు నిందిస్తే ఆ నిందలు విననట్లు మారుపలకకుండా, అవమానం పొందికూడా మనసులో దానిగురించి ఆలోచించకుండా ఉన్నవాడే ధర్మం తెలిసినవాడు.)

1_3_146 కందము ప్రవీణ్ - విక్రమాదిత్య

కందము

అనుపమనియమాన్వితు లై
యనూనదక్షిణలఁ గ్రతుసహస్రంబులు సే
సిన వారి కంటె నక్రో
ధనుఁడ గరం బధికుఁ డండ్రు తత్త్వవిధిజ్ఞుల్.

(ఎన్నో యజ్ఞాలు చేసినవారికంటే కోపంలేనివారే గొప్పవారని తత్వం తెలిసినవారు చెప్తారు.)

1_3_145 వచనము విజయ్ - విక్రమాదిత్య

వచనము

ఇట్లు దేవయాని నుద్ధరించి నిజపురంబున కరిగె నిట దేవయానియు శర్మిష్ఠ సేసిన యెగ్గువలన విముక్త యయి తన్ను రోయుచు వచ్చుదాని ఘూర్ణికయను పరిచారికం గని యేను వృషపర్వుపురంబు సొర నొల్ల శర్మిష్ఠచేత నాపడిన యవమానంబు మదీయజనకున కెఱింగింపు మని పంచిన నదియును నతిత్వరితగతిం జని తద్వృత్తాంతం బంతయు శుక్రునకుం జెప్పిన శుక్రుండును నాక్షణంబ వచ్చి కోపఘూర్ణితబాష్పపూరితనయనయై యున్న దేవయానిం గని యిట్లనియె.

(ఇలా దేవయానిని కాపాడి యయాతి వెళ్లిపోయాడు. దేవయాని తిరిగివస్తూ ఘూర్ణిక అనే పరిచారికను చూసి, "వృషపర్వుడి పురంలోకి నేను రాను. శర్మిష్ఠ చేసిన అవమానం నా తండ్రికి తెలియజెప్పు", అని చెప్పి పంపగా ఆమె ద్వారా శుక్రుడు విషయం తెలుసుకొని ఆ క్షణమే దేవయాని దగ్గరకు వెళ్లి ఇలా అన్నాడు.)

1_3_144 చంపకమాల ప్రవీణ్ - విక్రమాదిత్య

చంపకమాల

జలధివిలోలవీచివిలసత్కలకాంచిసమంచితావనీ
తలవహనక్షమం బయిన దక్షిణహస్తమునం దదున్నమ
ద్గళదురుఘర్మవారికణకమ్రకరాబ్జము వట్టి నూతిలో
వెలువడఁ గోమలిం దిగిచె విశ్రుత కీర్తి యయాతిప్రీతితోన్.

(దేవయాని యయాతి కుడిచేయి పట్టుకొని బావిలోనుండి బయటికి వచ్చింది.)

1_3_143 వచనము ప్రవీణ్ - విక్రమాదిత్య

వచనము

దేవయాని యనుదానఁ బ్రమాదవశంబున నిన్నూతం బడి వెలువడనేరకున్న దానను నన్నుద్ధరించి రక్షింపు మనిన నవ్విప్రకన్యక యందుఁ దద్దయు దయాళుండై .

(నా పేరు దేవయాని, ప్రమాదవశాత్తూ ఈ నూతిలో పడ్డాను, నన్ను రక్షించండి అన్నది. యయాతి దయతో.)

1_3_142 తరలము ప్రవీణ్ - విక్రమాదిత్య

తరలము

అమరసన్నిభ యేను ఘోరసురాసురాహవభూమి న
య్యమరవీరుల చేత మర్దితులైన దానవులన్ గత
భ్రములఁగాఁ దనవిద్య పెంపునఁ బ్రాప్తజీవులఁ జేసి య
త్యమితశక్తిమెయిన్ వెలుంగిన యట్టి భార్గవుకూఁతురన్.

(నేను రాక్షసగురువైన శుక్రుడి కూతురిని.)

1_3_141 వచనము ప్రవీణ్ - విక్రమాదిత్య

వచనము

కని నీవెవ్వరిదాన విట్లేల యేకతంబ యివ్విపినాంతరకూపంబున నున్న దానవనిన విని దేవయాని యెప్పుడుం దమ విహరించుచున్న యవ్వనంబునకు మృగయావినోదార్థంబు యయాతి వచ్చుటంజేసి తొల్లియుఁ జూచినది గావున నాతని నెఱింగి యిట్లనియె.

(నువ్వెవరివి? ఇలా ఒంటరిగా ఈ అడవిలోని బావిలో ఎందుకున్నావు అని అడిగాడు. వేట కోసం ఎప్పుడూ ఆ అడవికి వచ్చే యయాతిని దేవయాని గుర్తుపట్టి ఇలా అన్నది.)

1_3_140 సీసము + ఆటవెలది విజయ్ - విక్రమాదిత్య

సీసము

చనుదెంచి యమ్మహాజనపతి జల మపే
        క్షించి యచ్చో విశ్రమించి చూచి
తత్కూపమున విలసత్కూలఘనవల్లి
        యన్నిష్టసఖి నూఁది యున్నదాని
గురుకుచయుగముపైఁ బరువడిఁ దొరఁగెడు
        కన్నీరు పూరించుచున్నదానిఁ
దనసమీపమునకు జనులయాగమనంబు
        పన్నుగాఁ గోరుచు నున్నదాని

ఆటవెలది

వరుణదేవుతోడఁ గరమల్గి జలనివా
సంబు విడిచి భూస్థలంబు వలని
కరుగుదేరనున్న వరుణేంద్రుదేవియ
పోని దాని దేవయాని గనియె.

(ఆ బావిలోనుండి బయటపడటానికి సహాయం అర్థిస్తున్న దేవయానిని చూశాడు.)

1_3_139 ఉత్పలమాల ప్రవీణ్ - విక్రమాదిత్య

ఉత్పలమాల

ఆనహుషాత్మజుం డగు యయాతి యధిజ్యధనుస్సహాయుఁ డై
యానతశాత్రవుండు మృగయారసలోలనిబద్ధబుద్ధిఁ ద
త్కానన మెల్లఁ గ్రుమ్మరి నికామధృతశ్రముఁ డేఁగుదెంచె నం
దానలినాక్షి యున్న విపినాంతరకూపతటంబునొద్దకున్.

(నహుషుడి కుమారుడైన యయాతి, ఆ అడవిలో వేటాడుతూ, దేవయాని ఉన్న బావి దగ్గరకు వచ్చాడు.)

-:యయాతి నూతం బడిన దేవయాని నుద్ధరించుట:-

1_3_138 వచనము ప్రవీణ్ - విక్రమాదిత్య

వచనము

నా కట్టినపుట్టంబు నీకుం గట్టం గాదు గాకేమి యని గర్వంబున నెగ్గులాడి దేవయాని నొక్కనూతం ద్రోచి శర్మిష్ఠ కన్యకాసహస్రవపరివృత యయి క్రమ్మఱి వచ్చి నిజనివాసంబున నుండె నంత.

(అని శర్మిష్ఠ గర్వంతో మాట్లాడి, దేవయానిని ఒక నూతిలోకి తోసి, మిగిలిన వారితో తన ఇంటికి వెళ్లిపోయింది.)

1_3_137 కందము ప్రవీణ్ - విక్రమాదిత్య

కందము

మాయయ్యకుఁ బాయక పని
సేయుచు దీవించి ప్రియము సెప్పుచునుండున్
మీయయ్య వెండి మహిమలు
నాయొద్దన పలుక నీకు నానయు లేదే.

(ఎప్పుడూ నా తండ్రి దగ్గర పనిచేసే నీ తండ్రి మహిమలు చెప్పటానికి నీకు సిగ్గుగా లేదా?)

1_3_136 వచనము ప్రవీణ్ - విక్రమాదిత్య

వచనము

అనిన శర్మిష్ఠ యిట్లనియె.

(శర్మిష్ఠ ఇలా అన్నది.)

1_3_135 కందము ప్రవీణ్ - విక్రమాదిత్య

కందము

లోకోత్తర చరితుం డగు
నాకావ్యుతనూజ నీకు నారాధితను నేఁ
బ్రాకటభూసురకన్యక
నీకట్టినమైల గట్ట నేర్తునె చెపుమా.

(గొప్పవాడైన శుక్రుడి కుమార్తెను, నీకు పూజనీయురాలిని అయిన నేను నువ్వు కట్టుకొన్న మైల కట్టుకోగలనా?)

1_3_134 వచనము విజయ్ - విక్రమాదిత్య

వచనము

ఇట వృషపర్వుకూఁతురు శర్మిష్ఠ యను కన్యక యొక్కనాఁడు కన్యకాసహస్రపరివృత యయి దేవయాని సహితంబు వనంబునకుం జని యొక్క సరోవరతీరంబునఁ దమతమ పరిధానంబులు పెట్టి జలక్రీడ లాడుచున్న నవి సురకరువలిచేతంబ్రేరితంబులయి కలిసిన నొండొరులం గడవఁ గొలను వెలువడు సంభ్రమంబున నక్కన్యక లన్యోన్య పరిధానంబులు వీడ్వడం గొని కట్టునెడ దేవయానిపుట్టంబు శర్మిష్ఠ గట్టిన మఱి దాని పరిధానంబు దేవయాని పుచ్చుకొనక రోసి శర్మిష్ఠం జూచి యిట్లనియె.

(ఇక్కడ వృషపర్వుడి కూతురైన శర్మిష్ఠ ఒకరోజు దేవయాని మొదలైన కన్యకలతో కలిసి అడవికి వెళ్లి ఒక కొలనులో జలక్రీడలు ఆడుతుండగా గట్టు మీద ఉన్న వారి బట్టలు గాలికి కలిసిపోయాయి. శర్మిష్ఠ బయటికి వచ్చి తెలియక దేవయాని బట్టలు కట్టుకుంది. ఆమె బట్టలు దేవయాని తీసుకోక శర్మిష్ఠతో ఇలా అన్నది.)

1_3_133 కందము ప్రవీణ్ - విక్రమాదిత్య

కందము

దేవగురునందనుం డమ
రావాసంబునకు నరిగి యమరులకును సం
జీవని యుపదేశించి సు
ధీవినుతుఁ డొనర్చుచుండె దేవహితంబుల్.

(కచుడు స్వర్గానికి తిరిగివచ్చి, దేవతలకు సంజీవని ఉపదేశించి, వారికి మేలు చేశాడు.)

1_3_132 వచనము ప్రవీణ్ - విక్రమాదిత్య

వచనము

అనిన నా కచునకు దేవయాని కరం బలిగి నీవు నామనోరథంబు విఫలంబుగాఁ
జేసిన వాఁడవు నీకు సంజీవని పని సేయకుండెడు మని శాపం బిచ్చినఁ
గచుం డేను ధర్మఁపథంబు దప్పనివాఁడను నీవచనంబున నాకు సంజీవని పని
సేయదయ్యె నేనియు నాచేత నుపదేశంబు గొన్నవారికిఁ బనిసేయుఁ గాక
మఱి నీవు ధర్మవిరోధంబు దలంచితివి గావున నిన్ను బ్రాహ్మణుండు
వివాహంబు గాకుండెడ మని దేవయానికి బ్రతిశాపం బిచ్చి తత్క్షణంబ.

(కచుడి మాటలకు దేవయాని అలిగి, అతడికి సంజీవని పనిచేయకూడదని శాపమిచ్చింది. "నీ శాపం వల్ల సంజీవని నాకు పనిచేయకపోయినా, నా దగ్గర ఉపదేశం పొందినవారికి పనిచేస్తుంది", అని కచుడు పలికి, ధర్మవిరుద్ధంగా ఆలోచించిన ఆమెకు బ్రాహ్మణుడితో వివాహం జరగకూడదని ప్రతిశాపం ఇచ్చాడు.)

1_3_131 కందము ప్రవీణ్ - విక్రమాదిత్య

కందము

గురులకు శిష్యులు పుత్త్రులు
పరమార్థము లోకధర్మపథ మిది దీనిం
బరికింపక యీపలుకులు
తరుణీ గురుపుత్త్రి నీకుఁ దగునే పలుకన్.

(గురువులకు శిష్యులు పుత్రులతో సమానం, ఈ విషయం గమనించకుండా గురుపుత్రివైన నువ్వు ఇలా మాట్లాడడం తగదు.)

1_3_130 కందము ప్రవీణ్ - విక్రమాదిత్య

కందము

ఆ కచుఁ డత్యంతవిషా
దాకులుఁ డై లోకనింద్య మగు నర్థము నీ
వాకునకుఁ దెచ్చు టుచితమె
నాకు సహొదరివి నీవు నాచిత్తమునన్.

(అది విని కచుడు బాధతో ఇలా అన్నాడు, "నువ్వు ఇలా మాట్లాడటం ఉచితమేనా? నాకు నువ్వు సహోదరివి.")

Friday, November 04, 2005

1_3_129 ఉత్పలమాల ప్రవీణ్ - విక్రమాదిత్య

ఉత్పలమాల

నీవును బ్రహ్మచారివి వినీతుఁడ వేనును గన్యకన్ మహీ
దేవకులావతంస రవితేజ వివాహము నీకు నాకు మున్
భావజశక్తి నైనయది పన్నుగ నన్నుఁ బరిగ్రహింపు సం
జీవనితోడ శుక్రుదయఁ జేయుము నాకుఁ బ్రియంబు నావుడున్.

(మానసికంగా మన ఇద్దరికీ ముందే పెళ్లి అయిపోయింది. సంజీవనితో పాటు శుక్రుడి దయతో నన్ను స్వీకరించి, వివాహం చేసుకొని నాకు ఆనందం కలిగించు.)

1_3_128 వచనము ప్రవీణ్ - విక్రమాదిత్య

వచనము

ఇట్లతిప్రయత్నంబునఁ గచుండు శుక్రువలన సంజీవని వడసి పెద్దకాలంబుండి యొక్కనాడు శుక్రుచేత ననుజ్ఞాతుండయి దేవలోకంబునకుం బోవుచుండి దేవయాని కతిప్రియపూర్వకంబునం జెప్పిన నదియును దద్వియోగదుఃఖిత యై కచున కిట్లనియె.

(ఇలా కచుడు సంజీవని విద్య నేర్చుకొని, శుక్రుడి అనుమతితో తిరిగి స్వర్గానికి వెళ్లడానికి సిద్ధమై దేవయానికి ఆ వార్త చెప్పగా ఆమె దుఃఖంతో ఇలా అన్నది.)

1_3_127 తేటగీతి ప్రవీణ్ - విక్రమాదిత్య

తేటగీతి

విగతజీవుఁడై పడియున్న వేదమూర్తి
యతనిచేత సంజీవితుఁడై వెలుంగె
దనుజమంత్రి యుచ్చారణదక్షుచేత
నభిహితం బగు శబ్దంబు నట్లపోలె.

(శుక్రుడు కచుడి వల్ల ప్రాణాన్ని తిరిగిపొంది, ఉచ్చారణదక్షుడు పలికిన పదంలా ప్రకాశించాడు.)

1_3_126 వచనము ప్రవీణ్ - విక్రమాదిత్య

వచనము

అంత.

(తరువాత.)

Thursday, November 03, 2005

1_3_125 కందము ప్రవీణ్ - విక్రమాదిత్య

కందము

ఉదరభిదాముఖమున న
భ్యుదయముతో నిర్గమించె బుధనుతుఁడు కచుం
డుదయాద్రిదరీముఖమున
నుదితుం డగు పూర్ణహిమమయూఖుఁడపోలెన్.

(కచుడు శుక్రుడి కడుపునుండి బయటకు వచ్చాడు.)

1_3_124 వచనము ప్రవీణ్ - విక్రమాదిత్య

వచనము

అనిన నా యుదరంబు భేదిల్లినం గాని యిమ్ముని కుమారుండు వెలువడ నేరం డుదరభేదనంబున మూర్ఛితుండ నయిన నన్ను సంజీవితుం జేయవలయు నని శుక్రుండు కచునకు సంజీవని నుపదేశించిన.

(నా కడుపు భేదిస్తే కానీ కచుడు బయటికి రాలేడు. అలా వచ్చి నన్ను మళ్లీ బ్రతికించాలి, అని శుక్రుడు కచుడికి సంజీవని విద్యను ఉపదేశించాడు.)

1_3_123 కందము ప్రవీణ్ - విక్రమాదిత్య

కందము

తనువును జీవము సత్త్వం
బును బడసితి నీ ప్రసాదమున నీ యుదరం
బనఘా వెలువడు మార్గం
బొనరింపుము నాకు భూసురోత్తమ దయతోన్.

(భూసురోత్తమా! నీవల్ల నా ప్రాణాన్ని తిరిగిపొందాను. నేను నీ కడుపులోనుండి బయటికివచ్చేలా అనుగ్రహించు.)

1_3_122 వచనము ప్రవీణ్ - విక్రమాదిత్య

వచనము

అని శుక్రుండు సురాపానంబు మహాపాతకంబుగా శపియించి తన యుదరంబున నున్న కచునప్పుడ సంజీవితుం జేసిన నంద యుండి కచుండు శుక్రున కిట్లనియె.

(ఇలా శుక్రుడు మద్యపానం మహాపాపమయ్యేలా శపించి, కచుడిని బ్రతికించగా అతడు కడుపులోనుండే ఇలా అన్నాడు.)

1_3_121 కందము ప్రవీణ్ - విక్రమాదిత్య

కందము

భూసురు లాదిగఁ గలజను
లీసుర సేవించిరేని యిది మొదలుగఁ బా
పాసక్తిఁ బతితు లగుదురు
చేసితి మర్యాద దీనిఁ జేకొనుఁడు జనుల్.

(ఈ రోజు నుండి, మద్యపానం చేసిన ప్రజలు దుర్గతి పొందుతారు. నేనీ కట్టడి చేశాను, ప్రజలు గ్రహించండి.)

1_3_120 ఆటవెలది ప్రవీణ్ - విక్రమాదిత్య

ఆటవెలది

మొదలి పెక్కు జన్మములఁ బుణ్యకర్మముల్
పరఁగఁ బెక్కు సేసి పడయఁబడిన
యట్టి యెఱుక జనుల కాక్షణ మాత్రన
చెఱుచు మద్యసేవ సేయ నగునె.

(ఎంతో కష్టపడి పొందిన జ్ఞానాన్ని క్షణంలో పోగొట్టే మద్యపానం చేయవచ్చా?)

1_3_119 వచనము విజయ్ - విక్రమాదిత్య

వచనము

వానిం జూచి కాని కుడువనొల్ల నని దేవయాని యేడ్చుచున్నఁ బెద్దయుంబ్రొద్దునకుఁ బ్రసన్నుం డై శుక్రుండు దనయోగదృష్టిం జూచి లోకాలోకపర్యంతభువనాంతరంబునఁ గచుం గానక సురాసమ్మిశ్రభస్మమయుండై తన యుదరంబున నున్న యక్కచుం గని సుర సేసిన దోషంబును నసురులు సేసిన యపకారంబును నెఱింగి.

(కచుడిని చూసి కానీ తిననని ఏడుస్తున్న దేవయానిని చూసి శుక్రుడు అనుగ్రహించి, యోగదృష్టితో, మద్యంలో కలిపిన బూడిదరూపంలో కచుడు తన కడుపులో ఉండడం చూసి, మద్యపానం వల్ల కలిగే హానినీ, రాక్షసులు చేసిన అపకారాన్నీ తెలుసుకొని.)

1_3_118 మత్తేభము విజయ్ - విక్రమాదిత్య

మత్తేభము

మతిలోకోత్తరుఁ డైన యంగిరసుమన్మం డాశ్రితుం డాబృహ
స్పతికింబుత్త్రుఁడు మీకు శిష్యుడు సురూప బ్రహ్మచర్యాశ్రమ
వ్రత సంపన్నుఁ డకారణంబ దనుజవ్యాపాదితుం డైన న
చ్యుతధర్మజ్ఞ మహాత్మ యక్కచున కే శోకింప కెట్లుండుదున్.

(గొప్పవాడైన కచుడిని రాక్షసులు కారణం లేకుండా చంపితే దుఃఖించకుండా ఎలా ఉండగలను?)

1_3_117 వచనము విజయ్ - విక్రమాదిత్య

వచనము

అనిన దేవయాని యిట్లనియె.

(అది విని దేవయాని ఇలా అన్నది.)

1_3_116 కందము విజయ్ - విక్రమాదిత్య

కందము

వగవక సంజీవని పెం
పగణిత గర్వమున నసురు లా కచుతోడం
బగఁ గొని చంపెద రాతఁడు
సుగతికిఁ జనుఁగాక యేల శోకింపంగన్.

(సంజీవని గొప్పతనం తెలియక రాక్షసులు ఆ కచుడిని చంపుతారు. అతడు ఉత్తమగతికి వెళ్లుగాక. దీనికి దుఃఖించటం ఎందుకు?)

1_3_115 వచనము విజయ్ - విక్రమాదిత్య

వచనము

శుక్రుండును సురాపానమోహితుండయి యున్నఁ దొల్లింటియట్ల దేవయాని గచుం గానక దుఃఖిత యై నేఁడును గచుండు రాక మసలె నసురుల చేత నిహతుం డయ్యెఁ గావలయు నని శోకించిన దానిం జూచి శుక్రుం డిట్లనియె.

(కచుడు రాకపోవటం చూసి, మళ్లీ అతడిని రాక్షసులు చంపి ఉంటారని దుఃఖిస్తున్న దేవయానితో శుక్రుడు ఇలా అన్నాడు.)

1_3_114 కందము విజయ్ - విక్రమాదిత్య

కందము

అడవికిఁ బువ్వులు దేరఁగ
వడి నరిగినకచునిఁ జంపి వారక దనుజుల్
పొడవు సెడఁ గాల్చి సురతోఁ
దడయక యబ్బూది శుక్రుఁ ద్రావించి రొగిన్.

(పువ్వులకోసం అడవికి వెళ్లిన కచుడిని రాక్షసులు చంపి, అంతటితో ఆగక, అతడిని కాల్చి, ఆ బూడిదను మద్యంలో కలిపి ఆ మద్యాన్ని శుక్రుడి చేత తాగించారు.)

1_3_113 వచనము విజయ్ - విక్రమాదిత్య

వచనము

అనిన విని శుక్రుండు దనదివ్యదృష్టి నసురవ్యాపాదితుండైన కచుం గని వానిం దోడ్కొని తేర మృతసంజీవనిం బంచిన నదియును బ్రసాదం బని యతి త్వరితగతిం జని విగతజీవుం డయిన కచు నప్పుడ సంజీవితుం జేసి తోడ్కొని వచ్చినం జూచి శుక్రుండును దేవయానియు సంతసిల్లి యున్నంతఁ గొన్నిదినంబులకు వెండియు నొక్కనాఁడు.

(శుక్రుడు తన దివ్యదృష్టితో రాక్షసుల వల్ల కచుడు చనిపోయిన విషయం తెలుసుకొని అతడిని మృతసంజీవని విద్యతో తిరిగి జీవింపజేశాడు. తరువాత కొన్ని రోజులకు.)

-:కచుండు దానవహతుం డై మృతసంజీవనిచే బ్రదుకుట:-

1_3_112 ఉత్పలమాల విజయ్ - విక్రమాదిత్య

ఉత్పలమాల

వాఁడిమయూఖముల్ గలుగువాఁ డపరాంబుధిఁ గ్రుంకె ధేనువుల్
నేఁ డిట వచ్చె నేకతమ నిష్ఠమెయిన్ భవదగ్నిహోత్రముల్
పోఁడిగ వేల్వఁగాఁ బడియెఁ బ్రొద్దును బోయెఁ గచుండు నేనియున్
రాఁడు వనంబులోన మృగరాక్షసపన్నగ బాధ నొందెనో.

(సూర్యాస్తమయమైనా కచుడింకా తిరిగిరాలేదు. అడవిలో ప్రమాదమేదైనా జరిగిందేమో.)

1_3_111 వచనము విజయ్ - విక్రమాదిత్య

వచనము

ఇట్లు గురుశుశ్రూషాకౌశలంబునఁ గచుండు శుక్రునకుం బ్రియశిష్యుం డై యున్న నెఱింగి దానవులు సహింపనోపక బృహస్పతితోడి యలుక నక్కచు నొక్కనాఁడు హోమధేనువులం గాచుచు వనంబున నేకతంబయున్న వాని వధియించి విశాల సాలస్కంధంబున బంధించి చని రంత నాదిత్యుం డస్తగిరిశిఖరగతుం డగుడు మగుడి హోమధేనువు లింటికి వచ్చిన వానితోడన కచుండు రాకున్న దేవయాని తనమనంబున మలమల మఱుంగుచుం బోయి తండ్రికిట్లనియె.

(ఇది రాక్షసులు సహించలేక, హోమధేనులను కాస్తున్న కచుడిని చంపి ఒక చెట్టుకు కట్టి వెళ్లిపోయారు. సాయంత్రమైనా కచుడు రాకపోవటంతో దేవయాని కలవరపడి శుక్రుడి దగ్గరకు వెళ్లి ఇలా అన్నది.)

1_3_110 సీసము + ఆటవెలది వసు - విజయ్

సీసము

పని యేమి పంచినఁ బదపడి చేసెద
        ననక తన్‌ బంచిన యాక్షణంబ
చేయుచు నిజగురుచిత్తవృత్తికిఁ గడు
        ననుకూలుఁడై వినయంబుతోడ
మనమునఁ జెయ్వుల మాటలభక్తినే
        కాకారుఁడై మఱి యంతకంటె
దేవయానికి సువిధేయుఁడై ప్రియహిత
        భాషణములఁ బుష్పఫలవిశేష

ఆటవెలది

దానములను సంతతప్రీతిఁ జేయుచు
నివ్విధమునఁ బెక్కులేండ్లు నిష్ఠ
గురుని గురుతనూజఁ గొలిచి యయ్యిరువుర
నెమ్మి వడసెఁ దనదు నేర్పు పేర్మి.

(శుక్రుడు ఏ పని చెప్పినా తరువాత చేస్తాననకుండా వెంటనే చేస్తూ, దేవయానికి కూడా విధేయుడై ఎంతో నేర్పుతో కచుడు వారి ప్రేమను పొందాడు.)

1_3_109 వచనము వసు - విజయ్

వచనము

అనిన నమ్మునికుమారుని సుకుమారత్వంబును వినయప్రియవచనమృదుమధురత్వంబును ననవరతనియమవ్రతప్రకాశితప్రశాంతత్వంబునుం జూచి శుక్రుం డతిస్నేహంబున వీనిం బూజించిన బృహస్పతిం బూజించిన యట్ల యని యభ్యాగతపూజల వాని సంతుష్టుంగాఁ జేసి శిష్యుంగాఁ జేకొని యున్నంత నక్కచుండు.

(అని పలికిన కచుడి సుకుమారత్వాన్ని, వినయాన్ని, ప్రశాంతతను శుక్రుడు చూసి, ఇతడిని పూజిస్తే బృహస్పతిని పూజించినట్లే అని భావించి శిష్యుడిగా స్వీకరించాడు.)

1_3_108 కందము వసు - విజయ్

కందము

ఏను గచుం డనువాఁడ మ
హానియమసమన్వితుఁడ బృహస్పతిసుతుఁడన్‌
మానుగ వచ్చితి నీకును
భానునిభా శిష్యవృత్తిఁ బని సేయంగన్‌.

(ఓ మహర్షీ! నేను కచుడిని. బృహస్పతి పుత్రుడిని. మీ దగ్గర శిష్యరికం చేయడానికి వచ్చాను.)

1_3_107 వచనము విజయ్ - విక్రమాదిత్య

వచనము

దుహితృస్నేహంబునం జేసి యద్దేవయాని పలుకులు శుక్రుం డతిక్రమింపండు గావున నీనేర్చువిధంబున దానిచిత్తంబు వడసి శుక్రు నారాధించిన నీ కిష్టసిద్ధి యగు నని దేవతలు ప్రార్థించి పంచినం గచుండును దేవహితార్థంబు వృషపర్వుపురంబునకుం జని యచ్చట వేదాధ్యయనశీలుం డయి సకలదైత్యదానవగణోపాధ్యాయుం డయి యున్న శుక్రుం గని నమస్కరించి యిట్లనియె.

(దేవయాని కోరికను శుక్రుడు జవదాటడు కాబట్టి ఆమె మనసు లోబరచుకొని శుక్రుడికి శుశ్రూషచేస్తే కార్యసిద్ధి అవుతుంది అని దేవతలు ప్రార్థించారు. కచుడు వారి హితం కోసం వృషపర్వుడి పురానికి వెళ్లి శుక్రుడిని చూసి నమస్కరించి ఇలా అన్నాడు.)

1_3_106 కందము విజయ్ - విక్రమాదిత్య

కందము

బాలుండవు నియమవ్రత
శీలుండవు నిన్నుఁ బ్రీతిఁ జేకొని తద్వి
ద్యాలలనాదానముఁ గరు
ణాలయుఁడై చేయు నమ్మహాముని నీకున్.

(బాలుడివైన నీకు శుక్రుడు ఆ విద్యను దానం చేస్తాడు.)

Wednesday, November 02, 2005

1_3_105 కందము వసు - విజయ్

కందము

కావున మృతసంజీవనిఁ
దేవలయును శుక్రువలన ధృతిఁ బడసి తప
శ్శ్రీవిభవ దానిబలమునఁ
గావంగావలయు సురనికాయబలంబున్‌.

(కాబట్టి శుక్రుడి దగ్గర మృతసంజీవనివిద్య నేర్చుకొని దేవగణాలను కాపాడాలి.)

1_3_104 కందము వసు - విజయ్

కందము

మనపక్షంబునవా ర
ద్దనుజులచే నిహితులయ్యుఁ దగ మృతసంజీ
వని లేమిఁజేసి యమసా
దనమున కరుగుదురు వీర్యదర్పితు లయ్యున్‌.

(మనపక్షంలో చనిపోయినవారు మృతసంజీవని లేకపోవటం వల్ల యమలోకానికి పోతున్నారు.)

1_3_103 కందము విజయ్ - విక్రమాదిత్య

కందము

పోరను మృతసంజీవని
కారణమున నిహతు లయ్యుఁ గా రసురవరుల్
వారల నోర్వఁగ మన కతి
భారము దుర్వారవీర్యబలయుతు లగుటన్.

(మృతసంజీవనికారణాన చావు లేకుండా ఉన్న రాక్షసులను జయించటం అసాధ్యంగా ఉంది.)

1_3_102 వచనము విజయ్ - విక్రమాదిత్య

వచనము

దాని నెఱింగి దేవతలెల్ల నతి భీతులై యసురుల నోర్వనోపక శుక్రువలన మృతసంజీవని వడసి తేనోపునట్టి మహాసత్త్వుం డెవ్వం డగునో యని విచారించి బృహస్పతిపుత్త్రుం డయిన కచుని కడకుం జని యిట్లనిరి.

(ఇది తెలిసి దేవతలు భయపడి, శుక్రుడి దగ్గర మృతసంజీవని నేర్చుకొని రాగల సమర్థుడెవరా అని ఆలోచించి బృహస్పతి పుత్రుడైన కచుడి వద్దకు వెళ్లి ఇలా అన్నారు.)

1_3_101 కందము వసు - విజయ్

కందము

దేవాసురరణమున గత
జీవితు లగు నసురవరులఁ జెచ్చెర మృతసం
జీవని యను విద్యఁ బున
ర్జీవులఁగాఁ బ్రతిదినంబుఁ జేయుచు నుండెన్‌.

(దేవాసురరణంలో మరణించిన రాక్షసులను మృతసంజీవని విద్యతో పునర్జీవింపజేసేవాడు.)

1_3_100 కందము వసు - విజయ్

కందము

మనుజాధిప వృషపర్వుం
డను దానవపతికి శుక్రుఁ డాచార్యుం డై
యనిమిషవిరోధులకుఁ బ్రియ
మొనరించుచు వివిధ విధినయోపాయములన్‌.

(ఓ రాజా! శుక్రుడు వృషపర్వుడనే రాక్షసరాజుకు ఆచార్యుడిగా ఉండేవాడు.)

1_3_99 వచనము వసు - విజయ్

వచనము

మఱియు నస్మద్వంశకరుం డయిన యయాతిచరితంబు విన వలతుం జెప్పు మని యడిగిన వానికి వైశంపాయనుం డిట్లనియె.

("అంతేకాక మా వంశానికి చెందిన యయాతి చరితం వినాలని ఉంది", అని అడగగా వైశంపాయనుడు ఇలా అన్నాడు.)

1_3_98 తేటగీతి విజయ్ - విక్రమాదిత్య

తేటగీతి

విపులతేజంబునను దపోవీర్యమునను
జగదనుగ్రహనిగ్రహశక్తియుక్తుఁ
డయినయట్టి యయాతికి నలిగి యేమి
కారణంబున శాపంబు కావ్యుఁ డిచ్చె.

("యయాతిని శుక్రుడు ఎందుకు శపించాడు?")

1_3_97 తేటగీతి విజయ్ - విక్రమాదిత్య

తేటగీతి

వర్ణధర్మముల్ గాచుచు వసుధ యెల్ల
ననఘచరితుఁ డై యేలిన యయ్యయాతి
భూసురోత్తమ భార్గవపుత్త్రి యైన
దేవయానిని దానెట్లు దేవిఁ జేసె.

("యయాతి మహారాజు శుక్రుడి కుమార్తె అయిన దేవయానిని ఎలా పెళ్లాడాడు?")

-:యయాతి మహారాజు చరిత్రము:-

1_3_96 వచనము వసు - విజయ్

వచనము

అనిన విని జనమేజయుండు వైశంపాయనున కిట్లనియె.

(అది విని జనమేజయుడు వైశంపాయనుడితో ఇలా అన్నాడు.)

1_3_95 సీసము + ఆటవెలది వసు - విజయ్

సీసము

విషయోపభోగాభిలషణ మింకను నాకు
        వదలక పెరుఁగుచున్నదియుఁ గాన
నందనులార మీ యందొక్కరుండు నా
        దగు జరాభారంబు దగిలి తాల్చి
తనజవ్వనంబు నాకొనరంగ నెవ్వఁడీ
        నోపు నాతండ సద్వీపసకల
ధారుణీసామ్రాజ్యభారయోగ్యుం డగు
        నని యడిగిన నగ్రతనయుఁ డయిన

ఆటవెలది

యదువుఁ దొట్టి సుతులు ముదిమికి నోపక
తలలు వాంచి యున్న వెలయఁ దండ్రి
పనుపుఁ జేసి ముదిమి గొని జవ్వనం బిచ్చెఁ
బూరుఁడను సుతుండు భూరికీర్తి.

(మీలో ఎవరైతే యౌవనాన్ని నాకు ఇచ్చి నా ముసలితనం తీసుకుంటారో వారికే నా రాజ్యం ఇస్తాను అన్నాడు. మిగిలినవారు మౌనం వహించగా పూరుడు అందుకు ఒప్పుకున్నాడు.)

Tuesday, November 01, 2005

1_3_94 వచనము వసు - విజయ్

వచనము

అట్టి నహుషునకుఁ బ్రియంవద యనుదానికి యతి యయాతి సంయా త్యాయా త్యయతి ధ్రువు లనంగా నార్వురు పుట్టి రందు యయాతి రాజై యనేక యాగంబులు సేసి శుక్రపుత్త్రియయిన దేవయానియందు యదు తుర్వసులును వృషపర్వపుత్త్రియయిన శర్మిష్ఠయందు ద్రుహ్వ్యనుపూరులు ననంగా నేవురు కొడుకులం బడసి రాజ్యంబు సేయుచు శుక్రశాపంబున జరాభార పీడితుండై కొడుకుల నందఱం బిలిచి యిట్లనియె.

(నహుషుడి ఆరుగురు పుత్రులలో ఒకడైన యయాతి రాజై, శుక్రుడి కుమార్తె అయిన దేవయానిని పెళ్లాడి, యదువు, తుర్వసుడు అనే పుత్రులను, వృషపర్వుడి కుమార్తె అయిన శర్మిష్ఠను పెళ్లాడి ద్రుహ్వి, అనువు, పూరుడు అనే పుత్రులను పొందాడు. రాజ్యం చేస్తున్న యయాతి శుక్రుడి శాపం వల్ల ముసలివాడయ్యాడు. అప్పుడతడు తన కుమారులను పిలిచి ఇలా అన్నాడు.

1_3_93 మత్తేభము వసు - విజయ్

మత్తేభము

చతురంభోధిపరీతభూవలయమున్ సద్వీపసారణ్యస
క్షితిభృత్కం బగుదాని భూరిభుజశక్తిం జేసి పాలించుచుం
గ్రతువుల్ నూ ఱొనరించి కీర్తి వెలయంగా దిక్కులన్ నిర్జితా
హితుఁడై యానహుషుండు దాఁబడసె దేవేంద్రత్వముం బేర్మితోన్.

(భూమిని పాలిస్తూ, నూరు యజ్ఞాలు చేసి దేవేంద్రపదవిని పొందాడు.)

1_3_92 వచనము విజయ్ - విక్రమాదిత్య

వచనము

పురూరవుండును రాజ్యగర్వంబున నమ్మునులకు దర్శనం బీనొల్లక పరిహసించిన నలిగి వారలు వాని నున్మత్తుంగా శపియించిన వాఁడు గంధర్వలోకంబున నూర్వశీ సహితుండై యుండె నట్టి పురూరవునకు నూర్వశికి నాయువు ధీమంతుండు నమావసువు దృఢాయువు వనాయువు శతాయువు నను నార్వురు గొడుకులు పుట్టి రం దాయువునకు స్వర్భానవి యను దానికి నహుష వృద్ధశర్మ రజి గయానేనసు లనంగా నేవురు పుట్టిరి వారి యందు నహుషుండు రాజ్యాభిషిక్తుం డై.

(పురూరవుడు వారికి దర్శనమివ్వక వారిని పరిహసించాడు. వారు కోపంతో పురూరవుడు వెర్రివాడిగా మారాలని శపించారు. తరువాత ఊర్వశీపురూరవులకు ఆరుగురు కుమారులు జన్మించారు. వారిలో ఆయువు అనే అతడికి నహుషుడు మొదలుగా అయిదుమంది పుట్టారు. నహుషుడు ప్రభువై.)

1_3_91 కందము వసు - విజయ్

కందము

విని దాని నుడుపఁగా బ్ర
హ్మనియుక్తుం డై సనత్కుమారుఁడు మహికిం
జనుదెంచె బ్రహ్మలోకం
బుననుండి యనేక దివ్యమునిసంఘముతోన్.

(ఈ విషయం తెలిసి సనత్కుమారుడు బ్రహ్మనియామకం చేత చాలామంది మునులతో భూలోకానికి వచ్చాడు.)

1_3_90 కందము వసు - విజయ్

కందము

ఇమ్మహిఁ ద్రయోదశద్వీ
పమ్ములు దనశౌర్యశక్తిఁ బాలించి మదాం
ధ్యమ్మున విప్రోత్తమవి
త్తమ్ములు దా నపహరించె ధనలోభమునన్.

(పురూరవుడు భూమిని పాలిస్తూ లోభంతో విప్రుల ధనాన్ని అపహరించాడు.)

1_3_89 వచనము వసు - విజయ్

వచనము

అది యెట్లనినం దొల్లి దాక్షాయణి యైన యదితికిఁ గశ్యపునకుం బుట్టిన వివస్వంతునకు వైవస్వతుం డను మనువును యముండును శనైశ్చరుండును యమునయుఁ దపతియు ననం బుట్టి రందు వైవస్వతుం డను మనువువలన బ్రహ్మక్షత్రియ వైశ్యశూద్రాదులైన మానవులు పుట్టిరి మఱియు వానికి వేన ప్రముఖులైన రాజు లేఁబండ్రు పుట్టి వంశకరులై తమలోన యుద్ధంబు సేసి మడిసిరి మఱియు నమ్మనుపుత్త్రియైన యిల యనుదానికి సోమపుత్త్రుండైన బుధునకుఁ బురూరవుఁడు పుట్టి చక్రవర్తియై.

(కశ్యపుడి కుమారుడైన వివస్వంతుడికి వైవస్వతమనువు పుట్టాడు. అతడి కుమారులు యాభైమంది తమలో తాము పోరాడి మరణించగా, అతడి కూతురైన ఇలకూ, చంద్రుడి పుత్రుడైన బుధుడికీ పురూరవుడు జన్మించాడు.)

Monday, October 31, 2005

1_3_88 చంపకమాల విజయ్ - విక్రమాదిత్య

చంపకమాల

నిరుపమధర్మమార్గపరినిష్ఠితు లై మహి యెల్లఁ గాచుచుం
బరఁగిన తొంటి పూరు కురు పాండు మహీశుల పేర్మిఁ జేసి భూ
భరవహనక్షమం బగుచుఁ బౌరవ కౌరవ పాండవాన్వయం
బురుగుణసంపదం బెరిఁగి యొప్పె సమస్త జగత్ప్రసిద్ధమై.

(పూరు, కురు, పాండురాజుల గొప్పతనం వల్ల పౌరవ, కౌరవ, పాండవ వంశాలు ప్రసిద్ధమయ్యాయి.)

-:కౌరవ వంశ వివరణము:-

1_3_87 వచనము వసు - విజయ్

వచనము

అని యడిగిన జనమేజయునకు వైశంపాయనుం డిట్లనియె.

(వైశంపాయనుడు ఇలా అన్నాడు.)

1_3_86 సీసము + ఆటవెలది వసు - విజయ్

సీసము

అభ్యస్తవేదవేదాంగులు విధిదత్త
        దక్షిణాప్రీణితధరణిదేవు
లనవరతాశ్వమేధావభృథస్నాన
        పూతమూర్తులు కృతపుణ్యు లహిత
వర్గజయుల్ ప్రాప్తవర్గచతుష్టయుల్
        సత్త్వాదిసద్గుణజన్మనిలయు
లా భరతాది మహామహీపాలకు
        లిద్ధయశోర్థు లెందేనిఁ బుట్టి

ఆటవెలది

రట్టి కౌరవాన్వయంబుఁ బాండవనృప
రత్నములకు వారిరాశియైన
దాని వినఁగ వలతుఁ దద్దయుఁ బ్రీతితో
విప్రముఖ్య నాకు విస్తరింపు.

("భరతుడివంటి గొప్పవారు పుట్టిన కౌరవవంశం పాండవులు అనే రత్నాలకు సముద్రం వంటిది. అలాంటి కౌరవవంశం గురించి వివరంగా చెప్పండి, వినాలని ఉంది")

1_3_85 వచనము వసు - విజయ్

వచనము

అనిన విని జనమేజయుండు వైశంపాయనున కిట్లనియె.

(జనమేజయుడు వైశంపాయనుడితో ఇలా అన్నాడు.)

1_3_84 సీసము + ఆటవెలది విజయ్ - విక్రమాదిత్య

సీసము

యమునంశమునఁ బుట్టె నధిపతి ధర్మజుం
        డనిలాంశమునఁ బుట్టె ననిలజుండు
శక్రాంశమున ధనంజయుఁ డుదయించె నా
        శ్వినుల యంశముల నూర్జితులు నకుల
సహదేవు లనవద్యచరితులు పుట్టిరి
        శ్రీమూర్తి యై యాజ్ఞసేని పుట్టె
నగ్నియంశమున జితారి ధృష్టద్యుమ్నుఁ
        డనఁ బుట్టె ద్రుపదరాజాన్వయమున

ఆటవెలది

ననఘ యిది సురాసురాంశావతారకీ
ర్తనము దీని వినినఁ దవిలి భక్తిఁ
జదివినను సమస్త జనులకు నఖిలదే
వాసురాదు లిత్తు రభిమతములు.

(యముడి అంశతో ధర్మజుడు, వాయుదేవుడి అంశతో భీముడు, ఇంద్రుడి అంశతో అర్జునుడు, అశ్వినుల అంశతో నకులసహదేవులు పుట్టారు. లక్ష్మి అంశతో ద్రౌపది, అగ్ని అంశతో ధృష్టద్యుమ్నుడు ద్రుపదుడికి జన్మించారు. ఓ రాజా! ఇది దేవాసురుల అంశలతో పుట్టినవారి కీర్తనం, ఇది విన్నవారికి మంచి కలుగుతుంది.)

Sunday, October 30, 2005

1_3_83 కందము విజయ్ - విక్రమాదిత్య

కందము

ప్రియ మొనరఁగ సిద్ధియు బు
ద్ధియు నను దేవతలు వసుమతిని గుంతియు మా
ద్రియు నై పుట్టిరి పాండు
ప్రియపత్నులు నిఖిలజగదభీష్టచరిత్రల్.

(సిద్ధి, బుద్ధి అనే దేవతలు కుంతిగా, మాద్రిగా పుట్టి పాండురాజుకు భార్యలయ్యారు.)

1_3_82 కందము వసు - విజయ్

కందము

మాండవ్యుం డను మునివరు
చండతరక్రోధజనితశాపంబున ధ
ర్ముం డఖిలధర్మతత్త్వ వి
దుం డగు విదురుఁ డనఁ బేర్మితో నుదయించెన్.

(మాండవ్యముని శాపం వల్ల యముడు విదురుడిగా జన్మించాడు.)

1_3_81 కందము వసు - విజయ్

కందము

మరుతులయంశంబునఁ బు
ట్టిరి మువ్వురు వివిధరణపటిష్ఠబలులు సు
స్థిరయశులు ద్రుపదసాత్యకి
విరాటభూపతులు భువనవిశ్రుతచరితుల్.

(మరుత్తుల అంశలతో ద్రుపదుడు, సాత్యకి, విరాటుడు జన్మించారు.)

1_3_80 వచనము వసు - విజయ్

వచనము

మఱియు నేకాదశరుద్రులయంశంబునఁ గృపుఁడు పుట్టె సూర్యునంశంబునఁ గర్ణుండు పుట్టె ద్వాపరాంశంబున శకుని పుట్టె నరిష్టాపుత్త్రుండయిన హంసుడను గంధర్వ విభుండు ధృతరాష్ట్రుండయి పుట్టె మతియను వేల్పు గాంధారియై పుట్టె నయ్యిద్దఱకుం గలియశంబున దుర్యోధనుండు పుట్టెఁ బౌలస్త్యభ్రాతృవర్గంబు దుశ్శాసనాది దుర్యోధనానుజశతంబై పుట్టె హిరణ్యకశిపుండు శిశుపాలుండై పుట్టె సంహ్లాదుండు శల్యుండై పుట్టె ననుహ్లాదుండు ధృష్టకేతుండై పుట్టె శిబి యనువాఁడు ద్రుమసేనుండై పుట్టె బాష్కళుండు భగదత్తుఁడై పుట్టె విప్రచిత్తి యను దానవుండు జరాసంధుండై పుట్టె నయశ్శిరుండును నశ్వశీర్షుండుసు నయశ్శంకుండును గగనమూర్ధుండును వేగవంతుండును ననువా రేవురు దానవులు గేకయరాజు లయి పుట్టిరి కేతుమంతుం డమితౌజుండై పుట్టె స్వర్భానుండుగ్రసేనుండై పుట్టె జంభుండు విశోకుండై పుట్టె నశ్వపతి కృతవర్మయై పుట్టె వృషపర్వుండు దీర్ఘప్రజ్ఞుండై పుట్టె నజరుండు మల్లుండై పుట్టె నశ్వగ్రీవుండు రోచమానుండై పుట్టె సూక్ష్ముండు బృహద్రథుండై పుట్టెఁ దుహుండుఁ డనువాఁడు సేనాబిందుండై పుట్టె నేకచక్రుండు ప్రతివింధ్యుండై పుట్టె విరూపాక్షుండు చిత్రవర్మయై పుట్టె హరుండును నహరుఁడును సుబాహుబాహ్లికులై పుట్టిరి చంద్రవ్ర్రక్తుండు ముంజకేశుండై పుట్టె నికుంభుండు దేవాపియై పుట్టె శరభుండు సోమదత్తుండై పుట్టెఁ జంద్రుండు చంద్రవర్మయై పుట్టె నర్కుండు ఋషికుండై పుట్టె మయూరుండు విశ్వుండై పుట్టె సుపర్ణుండు క్రోధకీర్తియై పుట్టె రాహువు క్రోధుండై పుట్టెఁ జంద్రహంత శునకుండై పుట్టె నశ్వుండనువాఁ డశోకుండై పుట్టె భద్రహస్తుండు నందుండై పుట్టె దీర్ఘజిహ్వుండు గాశిరాజై పుట్టెఁ జంద్రవినాశనుండు జానకియై పుట్టె బలీనండు పౌండ్రమత్స్యుండై పుట్టె వృత్రుండు మణిమంతుండై పుట్టె గాలాపుత్త్రులెనమండ్రు క్రమంబున జయత్సేనాపరాజిత నిషాదాధిపతి శ్రేణిమన్మహౌజోభీరు సముద్రసేన బృహత్తులై పుట్టిరి క్రోధవశగణంబు వలన మద్రక కర్ణవేష్ట సిద్దార్థ కీటక సువీర సుబాహు మహావీర బాహ్లిక క్రథ విచిత్రసురథశ్రీమన్నీల చీరవాసో భూమిపాల దంతవక్త్ర రుక్మి జనమేజయాషాఢ వాయువేగ భూరితేజ ఏకలవ్య సుమిత్ర వాటధాన గోముఖ కారూషక క్షేమధూర్తి శ్రుతాయు రుద్వహ బృహత్సేన క్షేమాగ్రతీర్థ కుహర మతిమదీశ్వరాదులనేకులు పుట్టిరి కాలనేమి కంసుండై పుట్టె స్త్రీపుంసరూపధరుం డైన గుహ్యకుండు శిఖండియై పుట్టె మరుద్గణాంశంబునఁ బాండురాజు పుట్టె.

(పైన చెప్పిన విధంగా చాలామంది జన్మించారు.)

1_3_79 కందము విజయ్ - విక్రమాదిత్య

కందము

అలఘుఁడు కామక్రోధా
దుల యేకత్వమునఁ బుట్టె ద్రోణునకు మహా
బలుఁ డశ్వత్థామ రిపు
ప్రళయాంతకుఁ డస్త్రశస్త్రపరిణతుఁ డగుచున్.

(ద్రోణుడికి మహాబలుడైన అశ్వత్థామ పుట్టాడు.)

1_3_78 కందము విజయ్ - విక్రమాదిత్య

కందము

అనఘుఁడు సురగురునంశం
బునను భరద్వాజుకలశమునఁ బుట్టె శరా
సనవిద్యాచార్యుఁడు భూ
వినుతుఁడు ద్రోణుండు నిఖిలవేదవిదుం డై.

(బృహస్పతి అంశతో ద్రోణుడు పుట్టాడు.)

1_3_77 కందము విజయ్ - విక్రమాదిత్య

కందము

ముదమునఁ బ్రభాసుఁ డను నెని
మిది యగు వసునంశమునను మేదిని భీష్ముం
డుదయించె సర్వవిద్యా
విదుఁ డపజిత పరశురామ వీర్యుఁడు బలిమిన్.

(ప్రభాసుడనే ఎనిమిదో వసువు అంశతో భీష్ముడు జన్మించాడు.)

1_3_76 వచనము విజయ్ - విక్రమాదిత్య

వచనము

మఱియు లక్ష్మియంశంబున రుక్మిణి యుదయించె సనత్కుమారు నంశంబునఁ బ్రద్యుమ్నుండు పుట్టె నప్సరసల యంశంబులఁ గృష్ణునిషోడశసహస్రాంతఃపురవనితలు పుట్టి రయ్యయి వేల్పుల యంశంబులు యదువృష్ణి భోజాంధక వంశంబుల వీరు లనేకులు పుట్టిరి మఱియు.

(లక్ష్మి రుక్మిణిగా, సనత్కుమారుడు ప్రద్యుమ్నుడిగా, ఇతరుల అంశలతో శ్రీకృష్ణుడి పదహారువేలమంది స్త్రీలు, యాదవవీరులు జన్మించారు.)

1_3_75 కందము విజయ్ - విక్రమాదిత్య

కందము

శ్రీవెలుఁగ రోహిణికి వసు
దేవున కుదయించె విష్ణుదేవాంశమునన్
భూవంద్యుఁ డనంతుఁడు బల
దేవుండు ప్రలంబ ముఖ్యదితిజాంతకుఁ డై.

(ఆదిశేషుడు బలదేవుడనే పేరుతో రోహిణీవసుదేవులకు జన్మించాడు.)

1_3_74 కందము విజయ్ - విక్రమాదిత్య

కందము

యాదవవంశంబున జగ
దాదిజుఁ డగు విష్ణుదేవునంశంబున ను
త్పాదిల్లెఁ గృష్ణుఁ డపగత
ఖేదుఁడు వసుదేవ దేవకీదేవులకున్.

(విష్ణువు అంశతో శ్రీకృష్ణుడు యాదవవంశంలో దేవకీవసుదేవులకు జన్మించాడు.)

1_3_73 వచనము విజయ్ - విక్రమాదిత్య

వచనము

మఱియు మర్త్యలోకంబునందు దేవదైత్యదానవుల యంశావతారంబుల వివరించెద వినుము.

(దేవదైత్యదానవుల అంశలతో పుట్టినవారి గురించి వివరిస్తాను వినండి.)

-:దేవదానవాద్యంశములచే భూమియందుఁ బుట్టిన వారి క్రమము:-

1_3_72 చంపకమాల విజయ్ - విక్రమాదిత్య

చంపకమాల

దివిజ మునీంద్ర దానవదితి ప్రభవాదిసమస్తభూతసం
భవముఁ గృతావధాను లయి భక్తిమెయిన్ వినుచున్న పుణ్యమా
నవులకు నిక్కువం బగు మనఃప్రియ నిత్యసుఖంబులుం జిరా
యువు బహుపుత్త్రలాభవిభవోన్నతియున్ దురితప్రశాంతియున్.

(దేవదానవులు, మునులు మొదలైనవారి పుట్టుకను గురించి విన్నవారికి మంచి జరుగుతుంది.)

1_3_71 వచనము విజయ్ - విక్రమాదిత్య

వచనము

మఱియు బ్రహ్మకు ధాతయు విధాతయు ననంగా నిద్దఱు మనుసహాయులై పుట్టిరి వారితోడను లక్ష్మి పుట్టె లక్ష్మికి మానసపుత్త్రు లనేకులు పుట్టిరి వరుణునకు జ్యేష్ఠకు బలుండును సురయను కూఁతురునుం బుట్టిరి సురయం దధర్ముండు పుట్టె నా యధర్మునకు నిరృతికి భయ మహాభయ మృత్యువు లనఁగా మువ్వురు పుట్టిరి మఱియుఁ దామ్రకుఁ గాకియు శ్యేనియు భాసియు ధృతరాష్ట్రియు శుకియు నన నేవురుకన్యలు పుట్టిరి యందుఁ గాకి యనుదానికి నులూకంబులు పుట్టె శ్యేని యను దానికి శ్యేనంబులు పుట్టె భాసి యనుదానికి భాసగృధ్రాదులు పుట్టె ధృతరాష్ట్రి యనుదానికి హంసచక్రవాకంబులు పుట్టె శుకియను దానికి శుకంబులు పుట్టె మఱియుం గ్రోధునకు మృగియు మృగమందయు హరియు భద్రమనసయు మాతంగియు శార్దూలియు శ్వేతయు సురభియు సురసయు ననఁ దొమ్మండ్రు పుట్టి రందు మృగి యనుదానికి మృగంబులు పుట్టె మృగమంద యనుదానికి ఋక్ష చమర సృమరాదులు పుట్టె హరి యనుదానికి వానరగణంబులు పుట్టె భద్రమనస యనుదానికి నైరావణంబు పుట్టె నైరావణంబునకు దేవనాగంబులు పుట్టె మాతంగి యనుదానికి గజంబులు పుట్టె శార్దూలి యనుదానికి సింహవ్యాఘ్రంబులు పుట్టె శ్వేత యనుదానికి దిగ్గజంబులు పుట్టె సురభి యనుదానికి రోహిణియు గంధర్వియు ననలయు ననం బుట్టి రందు రోహిణికిఁ బశుగణంబులు పుట్టె గంధర్వి యనుదానికి హయంబులు పుట్టె ననలకు గిరి వృక్షలతా గుల్మంబులు పుట్టె సురసకు సర్పంబులు పుట్టె నిది సకలభూతసంభవప్రకారంబు.

(ఇంకొందరికి జంతువులు, కొండలు, చెట్లు మొదలైనవి పుట్టాయి. సకలజీవాలూ ఇలా పుట్టాయి.)

1_3_70 సీసము + ఆటవెలది వోలం - శ్రీహర్ష

సీసము

విగతాఘుఁ డైన యాభృగునకుఁ బుత్త్రుఁ డై
        చ్యవనుండు పుట్టె భార్గవవరుండు
జనవంద్యుఁ డతనికి మనుకన్యకకుఁ బుట్టె
        నూరుల నౌర్వుండు భూరికీర్తి
యతనికి నూర్వురు సుతులు ఋచీకాదు
        లుదయించి రఖిల భూవిదిత తేజు
లందు ఋచీకున కొందంగ జమదగ్ని
        యను ముని పుట్టె నాతనికిఁ బుట్టి

ఆటవెలది

రలఘుమతులు సుతులు నలువురు వారిలోఁ
బరశురాముఁ డాదిపురుషమూర్తి
దండితాహితుండు గొండుక యయ్యును
దద్ద గుణములందుఁ బెద్ద యయ్యె.

(భృగువు వంశంలో జమదగ్ని, అతడికి పరశురాముడు జన్మించారు.)

1_3_69 వచనము వోలం - శ్రీహర్ష

వచనము

మఱియు స్థాణునకు మానసపుత్త్రులైన మృగవ్యాధ శర్వ నిరృత్యజైక పాద హిర్బుధ్న్య పినాకి దహనేశ్వర కపాలి స్థాణు భవు లనంగా నేకాదశ రుద్రులు పుట్టిరి మఱి బ్రహ్మదక్షిణ స్తనంబున ధర్ముండను మనువు పుట్టె వానికి శమ కామ హర్షు లనంగా మువ్వురు పుట్టిరి యా మువ్వురకుఁ గ్రమంబునఁ బ్రాప్తి రతి నందు లనంగా మువ్వురు భార్య లైరి సవితృనకు బడబా రూపధారిణి యైన త్వాష్ట్రికి నశ్వినులు పుట్టిరి బ్రహ్మహృదయంబున భృగుండు పుట్టె వానికిఁ గవి పుట్టె వానికి శుక్రుండు పుట్టి యసురుల కాచార్యుండయ్యె వానికిఁ జండామర్క త్వష్టృ ధరాత్త్రు లనంగా నలువురు గొడుకులు పుట్టిరి వా రసురులకు యాజకు లైరి మఱియును.

(బ్రహ్మ శరీరభాగాలనుండి పుట్టినవారిలో హృదయంనుండి పుట్టిన భృగుడికి కవి, ఆ కవికి శుక్రుడు జన్మించారు. శుక్రుడు రాక్షసులకు గురువు అయ్యాడు.)